భరతమాత ముద్దుబిడ్డ

0
11

[త్వరలో సంచిక ప్రచురించనున్న ‘సైనిక కథలు’ సంకలనం కోసం శ్రీ జి. వి. శ్రీనివాస్ పంపిన కథ. కొత్తగా రాసి పంపిన కథలు ముందు సంచికలో ప్రచురితమవుతాయి. ప్రతిపాదిత సంకలనంలో, ఇప్పటికే ప్రచురితమైన కథలతో బాటు, సంపాదకుల ఎంచుకున్న ప్రమాణాల ప్రకారం కొత్తగా రాసి పంపిన కథల్లోంచి కొన్ని స్వీకరించబడతాయి.]

[dropcap]“నే [/dropcap]చెప్పేది జాగ్రత్తగా వినండి. అందరూ భోజనం చేశారా?”

ఎదురుగా వరుసల్లో నిలబడ్డ ప్లటూన్లు చూస్తూ అడిగారు మేజర్ సోమనాథ్ శర్మ.

“యస్ సార్!” ముక్త కంఠంతో బదులువచ్చింది.

“అందరూ వేపన్స్ సిద్ధం చేసుకున్నారా?”

“యస్ సార్”

“గుర్తు పెట్టుకోండి. మనం వెళ్తున్నది ఈ సుందర ప్రదేశాన్ని తిలకించడానికి కాదు. ఈ పూట తిన్న ఆహారమే ఆఖరి ఆహారం కావొచ్చు. ఇప్పుడు వింటున్న మాటలే మనందరి చివరి మాటలు కావొచ్చు. మనం తిరిగిరావొచ్చు, రాకపోవవచ్చు”

మేజర్ మాటలకు ఒక్కసారిగా అక్కడ భయంకర నిశ్శబ్ధం అలముకుంది.

“కానీ, ఒక్కటి మాత్రం నిజం. మరణం మనలో ఒకర్ని అయినా చేరుకోవాలి అంటే మన శత్రువులు కనీసం పదిమంది నేలకొరగాలి. మనలో శక్తి ఉంది. యుక్తి ఉంది. పోరాడగల తెగువ ఉంది. ఇంకేముంది మనలో??”

“మనలో ధర్మం ఉంది” మేజర్ మాటలకు ఒక్కసారిగా సింహనాదంలా బదులిచ్చారు సైనికులు.

“సెహబాష్! పదండి ముందుకు. శత్రువులను వెనకడుగు వేయించడానికి” ఇరవై నాలుగు సంవత్సరాల యువ కిశోరాం గర్జించింది.

భారత సైన్యంను డివిజన్లుగా, డివిజన్లు బ్రిగేడ్‌లుగా, బ్రిగేడ్‌లు బెటాలియన్లగా, బెటాలియన్లు కంపెనీలుగా, ప్రతీ కంపెనీని ప్లటూన్లుగా వర్గీకరించి సైన్యాన్ని నడిపిస్తారు.

ప్రతీ కంపెనీలో 120 మంది సైనికులు ఉంటారు. వారిలో 32 సైనికులును ఒక ప్లటూన్‌గా నడిపిస్తారు. నాల్గవ బెటాలియన్‌కు చెందిన కుమావ్ రెజిమెంట్ చెందిన కంపెనీకి నాయకుడు మేజర్ సోమనాథ్ శర్మ.

నవంబర్ నెల చలి వణికించేస్తోంది. మధ్యాహ్నం మూడు అవుతున్నా శ్వేతపూల వర్షంలా సన్నగా మంచు కురుస్తోంది. రాతిగుట్టలు, పచ్చనిలోయలు, పేరు తెలియని పక్షుల అరుపులతో ప్రకృతిమాత ముద్దులతనయ అందాల భరిణలా ఉందా ప్రాంతం. కానీ కళ్లకు కన్పించేవి కళ్ళముందే ఆగిపోతున్నాయి. కానీ మెదడు మాత్రం చురుగ్గా బుద్ధి నేత్రంతో కనబడని వాటిని అన్వేషిస్తోంది.

చేతిలో తుపాకులు, వీపున బ్యాగులతో ఎక్కడ ఏ చిన్న అలికిడి విన్ననూ ఒళ్ళంతా కళ్ళు, చెవులు చేసుకొని అడుగులు వేస్తున్నారు అందరూ.

బడ్గామ్ ప్రాంతాన్ని రెండు రోజులనుంచి వరుసుగా గాలిస్తూనే ఉన్నారు.

“మేజర్! ఈ సుందర ప్రాంతానికి ఎందుకీ దురవస్థ వచ్చింది?” పక్కనే నడుస్తూ అడిగిన సైనికుడి వైపు గుండె భారంతో చూశారు మేజర్ సోమనాథ్ శర్మ.

“నిజమే ఒక్కప్పుడు ప్రశాంతతకు, విజ్ఞానానికి, తపస్సులకు ఆలవాలం అయిన ఈ ప్రాంతం ఇప్పుడు రగులుతున్న రావణ కాష్టంలా అవడానికి కారణాలు అనేకం. తిలా పాపం తలా పిడికెడు”

మేజర్ మాటలను ఉత్సాహంతో వింటూనే తమ డేగ చూపులను నలుదిక్కులా పంపుతున్నారు సైనికులు.

“కాశ్మీర్ మొదటనుంచి హిందూ రాజుల పాలనలో ఉండేది. పండితులకు, జ్ఞాన సంపన్నలకు కేంద్రబిందువు అయ్యింది కాశ్మీర్. కనిష్కని కాలంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన బౌద్ధ మతం ఇక్కడ నుంచే యాత్రికుల ద్వారా చైనాలో కాలు పెట్టింది”

“మరి మేజర్! హిందూ రాజ్యం అంటున్నారు. మరి ముస్లిములు అధికంగా ఉన్నారు”

“కాలం తెచ్చిన మార్పులు అనేకం. ఉత్పల, లోహార రాజవంశాల పాలన చివరలో ముస్లిం ప్రజలు స్థావరాలు ఏర్పరుచుకోవడం మొదలయ్యింది”

కుతూహలంగా వింటున్న సైనికులను చూస్తూ కొనసాగించారు.

“క్రీ. శ.1339 లో షామీర్ మొట్టమొదటి కాశ్మీర్ మొట్ట మొదటి పాలకుడయ్యాడు. ఆ తరువాత 1586 నుండి 1751 వరకు మొఘలులు, 1747 నుండి 1819 వరకు ఆఫ్ఘన్ దూరానీల పాలనలో సుమారుగా ఐదు శతాబ్ధాలు ముస్లిం రాజుల ఏలుబడిలో ఉంది కాశ్మీర్”

“అదేంటి పంజాబ్ గొడుగు కింద ఉండేది అని విన్నామే” ఆసక్తిగా ప్రశ్నించాడు మరొక సైనికుడు.

“నిజమే! 1819 లో రంజిత్ సింగ్ చిన్న చిన్న పర్వత ప్రాంతాలు అన్నింటినీ ఒక్కొక్కటిగా జయించి, విశాల జమ్ము కాశ్మీర్ రాజ్యాన్ని ఏర్పాటుచేశాడు. కానీ 1846 లో ఆంగ్లో సిక్కు యుద్ధంలో సిక్కులు పరాజయం పొందారు. అప్పుడు కుదిరిన లాహోర్ ఒప్పందం ప్రకారం సట్లజ్ – బియాజ్ మధ్యఉన్న విలువైన భూములు వదులుకుంటూ పన్నెండు లక్షల రూపాయల పరిహారం కట్టవలసి వచ్చింది. కానీ అంత సొమ్ము సిక్కులు చెల్లించలేకపోవడం వలన పంజాబ్ రాజ్యభాగమైన జమ్ముకాశ్మీర్ ను డోగ్రా రాజైన గులాబ్ సింగ్ కు ఏడు లక్షల యాభైవేల రూపాయలకు బ్రిటిష్ వారు అమ్మేశారు. గులాబ్ సింగ్ స్వంతత్ర ప్రతిపత్తి గల జమ్ము కాశ్మీరు కు మొదటి రాజు అయ్యాడు”

ఏదో అలికిడి వినబడి, ఒక్కసారిగా నిశ్శబ్ధమయ్యారు. చుట్టూ వెయ్యి కళ్ళతో గాలించారు. ఏమీ కనబడలేదు. మరలా ప్రశాంతత చోటు చేసుకుంది. తిరిగి ప్రయాణం కొనసాగించారు.

“ఇప్పుడు ఎందుకీ గలాటా? నిన్న మొన్ననే మనకు కూడా స్వాంతత్రం వచ్చింది. అంతలోనే ఈ యుద్ధం ఏమిటో?” నిటూర్చాడు మేజర్ మాటలు వింటూ వెనక నడుస్తున్న సైనికుడు.

“మన దేశం స్వాతంత్ర్యం పొందే సమయానికి హరిసింగ్ కాశ్మీర్ మహారాజుగా పాలన చేస్తున్నారు. రాజరికపు సంస్థానాలకు ఒక అవకాశం ఇవ్వబడింది. అఖండ భారతదేశం రెండుగా విడిపోయి స్వాతంత్ర్యం పొందింది. కనుక ఇటు భారతదేశంలో గాని అటు పాకిస్థాన్ లో కలిసే స్వేచ్ఛ ఆ సంస్థానాధిపతులకే ఇవ్వబడింది”

“కానీ కాశ్మీర్ మనలో కలవలేదు కదా”

“అవును. కాశ్మీరును ఎటూ కలపకుండా ఉంచాలని కాశ్మీర్ రాజు హరిసింగ్ అభిమతం. కానీ, అంతలోనే పూంఛ్ ప్రాంతంలో మహరాజ్ పాలన విధానాలను వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. పాకిస్థాన్లో చేరడానికి అనుకూల వర్గాల తిరుగుబాటు ప్రారంభం అయ్యింది. మహరాజ్ సైన్యం ఆ గ్రామాలను తగలబెట్టి, తిరుగుబాటును అణచడానికి ప్రయత్నం చేసింది”

మాటలు ఆపి, చుట్టూ చూశాడు. సైనికులు తన మాటలు వింటూ ఉన్నా, వారి కళ్ళు మాత్రం ఆ ప్రదేశాన్ని జల్లెడ పడుతూ ఉండటం చూసి, సంతృప్తి చెందాడు మేజర్.

“పాకిస్తాన్ వాయవ్య సరిహద్దు నుండి పషూన్లు కాశ్మీర్ పై దాడి చేశారు. గెరిల్లా పోరాటం యొక్క అంతిమ లక్ష్యం మహరాజ్ హరిసింగ్ ను భయపెట్టి, పాకిస్థాన్లో కాశ్మీర్ లో విలీనం చెయ్యడమే. గతనెల అక్టోబర్ 24 నాడు తిరుగుబాటు దళాలు ‘ ఆజాద్ కాశ్మీర్’ అనే పేరుతో కొత్త రాజ్యం ప్రకటించారు”

“ఓహో! అప్పుడు ఆలోచన వచ్చి ఉంటుంది కాశ్మీర్ మహారాజ కు. మనకు కబురు పెట్టారు” నవ్వులు విరబూసాయి.

చిన్నగా నవ్వి “భారత్ నుంచి సహాయం కావాలంటే మీరు కాశ్మీర్ ను భారతదేశంలో విలీనం చేయాల్సిందే అని మన గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ విధించిన షరతుకు అంగీకరించి, కాశ్మీర్ ను భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు కాశ్మీర్ మహరాజ్ హరిసింగ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. తక్షణమే మన సైన్యం రావలసిన పరిస్థితి. మార్గాన రావడానికి సమయం, పరిస్థితులు కలిసిరాక, ఆకాశమార్గాన శ్రీనగర్ ఎయిర్ బేస్ లో అడుగుపెట్టాం. మిగిలిన కథ మీకు తెలిసిందే. Azk ముష్కరులను ఏరి పారేయ్యడమే మన లక్ష్యం”

బడ్గామ్ ప్రాంత సరిహద్దుల్లో తీవ్రవాదులు ఉన్నట్లు సమాచారం. అందుకే ప్రతీ గుట్టను, పుట్టను, చెట్టు చేమను ఆసాంతం పరిశీలిస్తున్నారు.

కానీ సోమనాథ్ శర్మకు తెలియని విషయం ఏమిటి అంటే వెయ్యిమంది లష్కరులు గొర్రెల కాపరుల వేషాలు ధరించి,. బడ్గామ్ ఉత్తరం దాలూర్ సరస్సు వైపు నుండి, ముజాఫరాబాద్ – బారాముల్లా వైపునుంచి, గుల్‌మార్గ్ మార్గం వైపునుంచి మూడు వైపుల బడ్గామ్‌ను చుట్టిముట్టారు అని.

“ఊ! నడవండి. బడ్గామ్ మనకు చాలా కీలకం. శత్రువు కనిపిస్తే క్షణం కూడా ఆలస్యం చేయవద్దు. కాల్చి పడేయండి” మేజర్ శర్మ ఉత్తర్వులు వింటూనే మరింత అప్రమత్తం అయ్యారు సైనికులందరూ.

పడమటి వైపు నుంచి మెరుపులా కనబడి మాయమయిన ముష్కరులను చూడగానే శర్మ చేతిలోని తుపాకీ గురి చూడసాగింది. కానీ అంతలోనే మూడు వైపుల నుంచి క్రూరమైన చూపులతో, పరిహాసమైన మాటలతో, ఎక్కుపెట్టిన ఆయుధాలతో లష్కర ముష్కరులు చుట్టుముట్టారు. అప్పుడు అర్థమయింది ఇంతకుముందు కనబడని అలజడికి కారణం ఏమిటో.

“మేజర్! మన చుట్టూ శత్రువులు వలయం కట్టారు” తదుపరి ఆజ్ఞ కోసం తుపాకి ఎక్కుపెడుతూ ఉత్సాహం సైనికుడి గొంతులో.

“వెరీ గుడ్. మనం ఎటు వైపు కాల్చినా శత్రువు నేలకరుస్తాడు”

మేజర్ మాటలు వింటూనే భారత సైనికుల పెదవులపై చిరునవ్వులు విరబూసాయి.

“మారో! సైతాన్ బచ్చే కో” లష్కరుల గుంపు పోరాటం ప్రారంభించింది.

“ఫైర్!” ఉరుము వెలివడింది మేజర్ కంఠం నుంచి.

భారత సైనికులు చిన్న చిన్న సమూహాలుగా విడిపోయి గుట్టలును రక్షణ చేసుకొని, వాటివెనుక ఉండి ఆయుధాలకు పని చెప్పారు.

“వెయ్యిమందిమి మేము. పట్టుమని యాభై మంది కూడా లేరు. మిమ్మల్ని చీమల్లా నలిపేస్తాం”

లష్కరుల నాయకుడి మాటలు తమ ఆత్మవిశ్వాసం దెబ్బ తియ్యడానికే, మానసికంగా జయించడానికే అని అర్థం అయిన మేజర్ “పిచ్చివాడా! మాలో ఒక్కొక్కరం వంద మందికి సమానం. ధర్మం వైపు నిలిచిన రక్షకులం. మాలో ఒక్కడు నేల కొరగాలి అంటే మీలో కనీసం వందమంది అయినా పైకి పోవాలి” మీసం పై చెయ్యివేసి గర్వంగా చెప్పాడు.

మేజర్ మాటలతో ఒళ్ళంతా పులకించిన అతని సైన్యం రెట్టించిన ఉత్సాహంతో పోరాడసాగింది. అలుపెరగక, గాయపడ్తున్న బండలు చాటుచేసుకొని ముందుకు వస్తున్న భారత సైన్యాన్ని చూసి, అదిరిపడ్డాడు లష్కరుల నాయకుడు. తమ బలంతో పోలిస్తే చాలా స్వల్పంగా ఉన్నారు. కానీ సాహసంలో ప్రాణాలను కూడా లెక్క చెయ్యడం లేదు.

ఇక ఊచకోత మొదలు పెట్టాల్సిందే అని చేతిలోని తుపాకీకి తీరిక లేకుండా చేశాడు.

మేజర్ మనసులో ఒక సందేహం తలెత్తింది. ఇంతకూ వీళ్ళ లక్ష్యం ఏమిటి? ఎందుకు బడ్గామ్‌పై పట్టుకోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు అని. క్షణంలో వెయ్యోవంతులో అర్థం అయింది శత్రువుల వ్యూహం ఏమిటో?

బడ్గామ్ పట్టుకుంటే దాపునే ఉన్న శ్రీనగర్ విమానాశ్రయం చేతికి చిక్కుతుంది. ఎప్పడయితే ఎయిర్ బేస్ వారి ఆధీనంలోనికి వెళ్తుందో ఆకాశ మార్గాన వస్తున్న భారత సైన్యం రాకకు ఆటంకాలు కలిగించవచ్చు. భారత సైన్యాన్ని రాకుండా ఆపగలిగితే కాశ్మీర్ మొత్తం పాకిస్థాన్ చేతికి చిక్కడం చాలా సులువు.

శత్రువు వ్యూహం అర్థం కాగానే ఒళ్ళు గగుర్పొడిచింది. ఆవేశం నాసికాగ్రాం చేరింది. సాహసం కిరీటమయ్యింది.

“సైనికులారా! మన ముందు ఉన్న శత్రువును మట్టు పెడితే మన సైన్యం ఇక్కడకు రావడానికి, కాశ్మీర్‌ను ఆక్రమించుకోబుతున్న మిగిలిన శత్రువులను మట్టి కరిపించడానికి మార్గం సుగమం అవుతుంది. ఆలోచించకుండా కాల్చేయండి. ప్రతీ బుల్లెట్ శత్రువు శరీరంలో భారత మాత శూలం గుర్తులు అవ్వాలి”

రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అనుభవంతో రాటుదేలిన మేజర్ అప్పటికప్పుడు వ్యూహం పన్ని అమలుచేస్తున్నాడు మేజర్.

“వారిని చూసి అదరవద్దు, బెదరవద్దు. ధర్మం మనవైపు ఉంది. మీకు తెలుసుకదా ధర్మమే చివరకు విజయం సాధించేది”

ధన్ ధన్ మంటూ దూసుకు వస్తున్న గుళ్ళ వర్షంలో అదరక బెదరక బండల వెనక దాగిన ప్రతీ ఒక్క సైనికుడి వద్దకు వెళ్తూ ఉత్సాహపరుస్తూ మెరుపు వేగంతో కదులతున్నాడు మేజర్.

చిరుతపులిలా పరుగులు తీస్తూ తన ప్లటూన్లలను వెన్నుముకగా ఉన్న మేజర్‌ను దెబ్బ కొడితే గాని ముందుకు సాగలేమని గ్రహించిన లష్కరులు మేజర్‌ను టార్గెట్ చేశారు.

“అబ్బా!” నిప్పుల దూసుకువచ్చిన తూటా చేతిని గాయపర్చింది. జివ్వున ఎగిసిన రక్తం, కళ్ళముందు ఒక్కసారిగా చీకటి. యుద్ధంలో శారీరిక బలం కంటే మానసిక బలమే కీలకం అని తెలిసిన జ్ఞానసంపన్నుడు మేజర్.

తగిలిన గాయం, చిందిన రక్తం మేజర్‌లో మరింత పౌరుషాన్ని రేకెత్తిస్తోంది అని శత్రువు ఊహించలేకపోయాడు.

సైనికులు దాగి ఉన్నప్రతీ పోస్ట్‌కూ పరుగులు తీస్తూ మందుగుండు సరఫరా చేస్తూ, ఒంటిచేత్తోనే మ్యాగజైన్ లోడ్ చేస్తూ అక్కడ ఉన్న ప్రతీ భారత సైనికుడిలో శత్రువులను చంపి తీరాలి అన్న కాంక్షను, కసిని పెంచుతున్నారు మేజర్.

“ఇంకొంత సమయం మాత్రమే మనం వీళ్ళను ఆపగలిగితే చాలు. మన మిగిలిన ప్రటూన్లు, ఎయిర్ బేస్‌లో దిగిన సైన్యం ఇక్కడకు వచ్చి, శత్రువు అన్న ప్రతీ ఒక్కడినీ పైకి పంపిస్తాయి. ఇలాగే పోరాటం కొనసాగించండి”

చేతులతో ఆయుధాలను, మాటలతో పౌరుషాన్ని అందిస్తున్నారు మేజర్ శర్మ.

అటు ఇటు పరుగులు తీస్తూనే గమనించాడు తమవైపు నుండి రెండు ప్లటూన్లు సైనికులు మరణించారు అని. సుమారుగా శత్రువులు మూడువందల మంది చనిపోయి ఉంటారు అని అంచనా వేశారు. అటుచివర మిగిలి ఉన్న ప్లటూన్‌ను కాపాడితే చాలు ఇంకొక వందమంది శత్రువులను సులభంగా చంపవచ్చును అనే ఆలోచన అతని కాళ్ళలో చక్రాలను అమర్చింది.

మరొక విషయం కూడా గమనించాడు వాళ్ళ వైపు జరిగిన నష్టాన్ని చూసిన శత్రువు కాస్తా వెనుకంజ వెయ్యడం, పారిపోయేందుకు దారి చేసుకోవడం.

రెట్టించిన ఉత్సాహంతో చివరి పోస్ట్‌కు పరుగులు తీస్తున్న సమయంలో ఉరుములు ఉరిమినట్లు దూసుకుచ్చిన మోర్తార్ మేజర్ పక్కన పడి పేలిపోయింది.

ఒక్కసారిగా కళ్ళముందు అగ్ని పర్వతం బద్దలు అయినట్లు అయ్యింది. ఏం జరిగిందో గ్రహించే లోపలనే ఒక దృవ తార నేలకొరిగినట్లు మేజర్ సోమనాథ్ శర్మ ప్రాణత్యాగం చేశారు.

మేజర్ మరణం చూసిన అతని సైనికులు ఒళ్ళు తెలియని ఆవేశంతో, ప్రాణాలను తృణప్రాయంగా గాలిలో ఎగురువేస్తూ శత్రువులను తరిమి తరిమి కొట్టారు.

~

మొదటి ఇండో పాక్ యుద్ధంలో 1947 లో ప్రాణత్యాగం చేసి, శ్రీనగర్ ఎయిర్ బేస్‌ను, బడ్గామ్‌ను కాపాడి, తద్వారా భారత విజయానికి పునాది వేసిన మేజర్ సోమనాథ్ శర్మకు స్వాంతంత్ర భారతంలో మరణాంతరం మొట్టమొదటి పరమవీర చక్ర లభించింది. ఈ గౌరవం పొందిన తొలి వ్యక్తిగా కీర్తి శిఖరాలు అధిరోహించిన మేజర్ సోమనాథ్ శర్మకు సెల్యూట్ చేస్తోంది భారతం.

చనిపోవడానికి అతికొద్ది సమయం ముందు మేజర్ తమ హెడ్ క్వార్టర్‌కు పంపిన మెసేజ్ భారత సైనిక చరిత్రలో సువర్ణాక్షరాలతో చిరస్థాయిగా నిలబడతాయి.

“శత్రువు మాకు కేవలం యాభై గజాల దూరంలో ఉన్నారు. మేము అతితక్కువ మందిమే మాత్రమే ఉన్నాము. విపత్కర పరిస్థితుల్లో ఉన్నాము. కానీ ఒక్క అంగుళం కూడా వెనక్కి వెళ్ళం. చివరి సైనికుడి వరకు పోరాటం చేస్తూనే ఉంటాము.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here