యువభారతి వారి ‘భారతంలో ప్రేమకథలు’ – పరిచయం

0
13

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]

భారతంలో ప్రేమకథలు

[dropcap]ఈ[/dropcap] పుస్తకం పేరు వినగానే మీ అందరికీ ఒక రకమైన ఆశ్చర్యం, ఆసక్తి, ఆనందం కలుగుతుందని నాకు తెలుసు. భారతం వీర కథలకూ, నీతి కథలకూ, తత్వ కథలకూ, ధార్మిక కథలకూ ప్రసిద్ధి కానీ, అందులో ప్రేమ కథలకు కూడా బలమైన స్థానం ఉందా అని మీకు అనిపించవచ్చు.

‘ప్రేమ’ అనే వస్తువు ఎంత విస్తృతమైనదో, అంత వివాదాస్పదమైనది కూడా. ప్రేమ – వివాహితులైన, లేదా వివాహితులయ్యే సతీ పతుల మధ్యే ఉంటుందా? స్త్రీ కానీ, పురుషుడు కానీ ఎవరి మీదనైనా మనసుపడి వారితో పొందును పొందడం వల్లనే ప్రేమ ఫలవంతమౌతుందని భావించే వారిదీ ప్రేమ ఔతుందా? అనే మీమాంస రాక తప్పదు. ప్రేమకథలంటే ధర్మబద్ధమైన రతిభావం కలిగి వివాహితులయ్యే నాయికా నాయకుల ప్రణయ వృత్తాంతాలన్న అర్ధమే తెలుగువారు గ్రహిస్తారు.

ఈ కథలు చదువుతూంటే, ఆధునిక కథలు చదువుతున్న తృప్తి కలుగుతుంది. దానికి నాలుగైదు కారణాలున్నాయి.

  1. మూలంలో లేని పరిసరాలను కథలో కల్పించి సహజ వాతావరణంలో పాత్రలు జీవించేట్లు చేయడం;
  2. నాయికా నాయకుల పాత్రలన్నింటిలో యవ్వనం సామాన్య వయోధర్మం లాగా కనబడుతుంది. ఆ యౌవన సౌందర్యాన్ని, మానసికావస్తలను, సాత్త్విక భావాలను వ్యక్తం చేసే సంకేతాలకు మాత్రమే పరిమితం చేసి అంగాంగ వర్ణనం విరివిగా చేయకపోవడం;
  3. పాత్రల స్వభావాన్ని తెలియజేసే కథాంశాలను నిపుణంగా సందర్భాన్ని బట్టి కస్తూరి లేపనంలాగా అందించడం;
  4. కథనూ, సంభాషణలనూ ఎలా, ఎంతగా నడపాలో తెలిసి నిష్పత్తిని తెలివిగా ప్రయోగించడం;
  5. దేవతల్ని కూడా మానవుల్లాగా చిత్రించడం. ఉదాహరణకు ఈ కథల్లో నాయికను నఖశిఖ పర్యంతం చూడని నాయకుడు గానే, నుదురు మీద సాత్త్విక భావోదయానికి చిహ్నంగా చిరు చెమట పోయని నాయిక గానీ కనపడదు. ఈ కథలలో ఇలా ఎన్నో విశేషాలున్నాయి.

ఈ పుస్తకంలోని కథలన్నీ, పాత్రలన్నీ మనకు తెలిసినవే. కానీ ఈ కథల్లో అవి నివురు వీడిన నిప్పుల్లా ప్రజ్వలిస్తాయి. మనసులు విప్పి మాట్లాడుతున్నట్లూ, మర్మం విడిచి మనతో చెపుతున్నట్లూ అనిపిస్తుంది. అంటే భారతేతిహాసంలో ధర్మం కోసం జీవించిన మనుషులు, దేవతలు, మనీషులు కనబడతారు కానీ, ఈ కథల్లో ఎవరైనా, ఏ తెగకు చెందినవారైనా, మనసుతో జీవిస్తున్నట్లు మన అనుభవానికి అందుతారు.

మరో ముచ్చటైన విశేష మేమంటే – ప్రేమకథలు భార్యాభర్తలు కలిసి వ్రాయడం. తిరుపతి వేంకట కవులు, వేంకట పార్వతీశ్వర కవులు మొదలైన వారిని ‘జంటకవు’లని అంటాం. వారిలో ఏ ఒక్కరు ఏ భాగం చెప్పినా మొత్తం రచన ఇద్దరి పేర్ల మీద ప్రచురించడం పరిపాటి. ఈ సంప్రదాయం కథా రచనలో నిలిపారు శ్రీ ముక్తేవి లక్ష్మణ రావు గారూ, డా. భారతి గారూ. వీరు జంట రచయితలే గాదు – రచయితల జంట..!! ‘జంట’ అనే మాటకు నిండుదనాన్ని తెచ్చిన పంట – ఈ కథా వాహిని.

కవిత్రయ భారతం లోని కథలను ఈ రచయితల జంట ఎలా మలచారో తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉంటే; కథను చెప్పటంలో, అనుభూతిని ఆవిష్కరించడంలో వీరు చూపిన శైలీ మాధుర్యాన్ని మీరు చవి చూడాలని అనుకుంటే – ఆలస్యం చేయకుండా క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/YuvaBharathi/%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B%20%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%AE%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B1%81/page/n5/mode/2up

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here