భారతీయులు కాపాడుకున్న దేవతామూర్తులు

4
7

[శరచ్చంద్రిక గారు రచించిన ‘భారతీయులు కాపాడుకున్న దేవతామూర్తులు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

గుళ్ళో విగ్రహము అంటే ఓ రాయి మాత్రమేనా?

[dropcap]రా[/dropcap]మకృష్ణ పరమహంస గారు కలకత్తాలోని దక్షిణేశ్వర్ గుళ్లో కాళికా అమ్మవారి దగ్గర కూర్చుని ఆవిడ ఊపిరి పీల్చుకుంటుందా లేదా అని ముక్కు దగ్గర చేయి పెట్టి చూసేవారట. ఆవిడ కనపడలేదని వెక్కి వెక్కి పడి దొర్లి ఏడ్చేవారట ‘నా జీవితంలో ఇంకో రోజు అయ్యింది. నువ్వు మాత్రం కనపడలేదు’ అని.

మా బాలవికాస్‌లో పిల్లలకి ఒక పూజ అనేది ఎలా చేయాలో చెబుతూ, భగవంతుడికి చేసే 16 రకాల సేవలు వివరంగా చెప్పాక ఆ పూజ ఆ విధంగా వారితో చేయిస్తారు గురువులు. నృత్యం దర్శయామి అన్నపుడు పిల్లలు నాట్యం చేస్తారు. గీతం శ్రావయామి అన్నపుడు పాటలు పాడతారు. పూజ చేసినంత సేపు భగవంతుడు ఎదురుగా ఉన్నట్లు ఊహించుకోవాలి. అక్షంతలు విసిరి కొట్టకుండా గుండెలో ఉన్న ఆయన దగ్గరకి తీసుకెళ్ళి తిరిగి ఆయన పాదాల మీద పెట్టాలి. ఇవన్నీ గురువులు చెప్పే నియమాలు. పిల్లలు అక్షరాలా పాటిస్తారు.

ఇటువంటివి వింటే తప్ప గుళ్ళో విగ్రహము అంటే ‘ప్రాణప్రతిష్ఠ చేసిన ఒక మూర్తి’ అన్న సంగతి ఎపుడో మర్చిపోయాము నాలాంటి వాళ్ళం. రామకృష్ణుల వారినే ‘ఈయన పిచ్చి వాడు’ అన్నారు అంటే చాలా దూరం వచ్చేసాము. ‘అదొక రాయి విగ్రహం. భక్తి మనసులో ఉంటే చాలు. spiritual గా ఉంటే చాలు. పూజలు చేస్తేనే భగవంతుడు కాడుగా’ అన్నంత అత్యాధునికమైన ఆలోచన నాలాంటి దానికి.

  •  ‘ఎందుకిలా పూజ చేయాలి’ అంటే సరియైన సమాధానం ఇవ్వని ఇంట్లో ముందు తరాల వారు ఒక కారణం.
  • ఈనాటి భారతీయుల్ని తమ పూర్వీకుల కన్నీళ్ళు, కష్టాలు మరచిపోయేలా చేసిన, నరనరాన బ్రాహ్మణద్వేషం నింపుకున్న వితండవాదుల/నాస్తికవాదుల గెలుపు ఇంకొక కారణం.

Flight of Deities

అబ్రహామిక్ మతాలలో మూడవ మతమైన ఇస్లాములో విగ్రహారాధన నిషేధము. వారి మత స్థాపనకై ఆ మతస్థులు కొందరు భారతదేశం వైపు వచ్చారు. వచ్చిన వారు విగ్రహారాధనని విపరీతంగా ఖండించారు.

  • ప్రముఖ దేవాలయాలని విధ్వంసం చేయడం
  • ఆలయంలోని ధనాన్ని/నిధులను దోచుకెళ్ళడం,
  • ఆలయంలో ఉన్న అర్చకులను, వారితో బాటు ఉండే ఇతర దేవాలయ సేవకులను హింసలు పెట్టడం
  •  ఆ ఆలయదేశపు హిందూ రాజు ఓడిపోతే వారి స్త్రీలని, పిల్లలని బానిసలుగా తీసుకెళ్లడం

ఇవన్నీ మతస్థాపనలో భాగమే.

ఈ విధంగా దేవాలయాల్లో మూర్తి పూజ చేసిన కారణంగా ఎన్నో అవమానాల పాలయ్యారు గుడిని నమ్ముకున్న మన పూర్వీకులు. దేవాలయము, మూర్తి పూజ అనేది భారతీయుల జీవనవిధానంలో చాలా ముఖ్యభాగం. ఆ వ్యవస్థ లేకపోతే జీవనం లేదు. ఈ రోజుకి కూడా దేవాదాయశాఖ అనేది ఉంది అంటే కొన్ని వందల ఏళ్ళ క్రిత్రం ఈ వ్వవస్థ ఎంత పటిష్ఠంగా ఉండేదో ఊహించవచ్చు.

అందుకే ఎన్ని సార్లు అవమానింపబడ్డా అది మర్చిపోయి ఆ భగవంతుడికి తిరిగి గుడి కట్టి పూజలు చేసారు. ఒక చోటి నుంచీ ఒక చోటికి వెఱ్ఱివాళ్ళలా ప్రాణాలకు తెగించి దాచిన ఆ దేవతామూర్తులని మోసుకుంటూ, దేవుళ్ళకి నైవేద్యాలు పెట్టుకుంటూ, ధర్మాన్ని రక్షించి తమ భక్తికి సాటిలేనిది ఏదీ లేదని చెప్పారు. ఆ సంస్కృతిని మిగిల్చి వెళ్ళిన మన పూర్వీకులకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం? ‘నేను సనాతన ధర్మం పాటిస్తాను’ అనేవారు వారి గురించి ప్రపంచానికి చాటి చెప్పాలి.

మతసామరస్యం గురించి మాట్లాడే నాయకులు ఎంత మంది ఈ Iconoclasm దారుణం గురించి మాట్లాడారు? బాబ్రీ మసీదు కూలగొట్టడం నేను ఏ మాత్రం సమర్థించను. కానీ ప్రార్థనలు కూడా జరగని ఒక్క మసీదు కూలగొట్టినందుకే ప్రపంచం అంతా ‘తప్పు’ అని చెప్పిందే? మరి ఒక వ్యవస్థని ‘నా నమ్మకం ఒప్పుకోదు’ అంటూ హిట్లర్ చేసిన దారుణాలు లాగా అత్యంత దారుణాలు చేస్తే మాట్లాడదా ఈ ప్రపంచం? ఎందుకు నాలాంటి వారికి ఈ చరిత్రని దాచి పెట్టారు? భారత స్వాతంత్య్రం వచ్చాక కూడా ఏ పరిశోధనలు జరగనీయకుండా, ఈ చరిత్రని చాప కింద తోసేసి, నా సంస్కృతి నుండీ నన్ను, నాలాంటి వాళ్ళని దూరం చేసేసారు. ఇది క్షమించరాని తప్పు.

ప్రముఖ చరిత్రకారిణి మీనాక్షి జైన్ గారు ‘Flight of Deities’ మీద చేసిన ప్రసంగం విన్నాక కళ్ళలో నీరు రాని భారతీయులు ఉండరేమో అనిపించింది. నా పూర్వీకుల నమ్మకాన్ని, వారి భక్తిని కళ్ళకు కట్టినట్టుగా చెప్పి, నా పూర్వికులపై నాకు అపారమైన గౌరవాన్ని కలుగజేసిన మీనాక్షి జైన్ గారి ప్రసంగాన్ని తెలుగులో వ్రాసే సాహసం చేసాను.

సూర్య దేవాలయం ముల్తాన్ ( మూలస్థానం)

ముల్తాన్ అనే ఊరు ఈరోజున పాకిస్థాన్లోని పంజాబ్‌లో ఉన్నది. ఇక్కడే ఉన్న సింధూ నదీ తీరంలో ఋగ్వేదం వ్రాసారు అని చెప్తారు. హిందూ ధర్మం మొదలయ్యింది ఇక్కడే కాబట్టి అందుకే ‘మూలస్థానం’ పేరు వచ్చిందేమో అని అంటారు. దీనికి కాశ్యపపురి అని కూడా పేరు. హిరణ్యకశిపుడి పరిపాలించాడు. ఆ తరువాత ప్రహ్లాదుడు పరిపాలించాడు. అందుకే ప్రహ్లాదపురి అని కూడా పేరు. హోలీ మొట్టమొదట ఈ ఊరు నుండీ మొదలయ్యిందిట. హోలీ రోజు చెప్పుకునే హోలిక కథ అందరికీ తెలుసు. నారసింహుడు బయటికి వచ్చిన స్తంభం ఇక్కడే ఉండేది అని కూడా చెప్తారట. అందుకే భారతీయులకి ఇది చాలా ముఖ్యమైన ప్రదేశం.

మొట్టమొదట ఈ గుడి గురించి లభ్యమయిన ఆధారం చైనా నుంచి వచ్చిన యాత్రికుడైన హుయాన్ త్సాంగ్ ఏడవ శతాబ్దంలో వ్రాసిన భారత దేశ యాత్ర చరిత్ర నుంచీ దొరుకుతుంది. ఈయన ఏమన్నారంటే ‘ఈ గుడికి చాలామంది భక్తులు వచ్చేవారు, రాజులు కూడా ఎంతోమంది ఎన్నో విరాళాలు ఇచ్చేవారు, ఈ గుడిలో ఉన్న సూర్యనారాయణ భగవానుడి మూర్తి బంగారంతో మరియు ఎన్నో విలువైన వజ్రాలతో చేసినది’ అని రాశారు. అందుకే అరబ్బు దేశాల వారు ఈ దేవాలయ ఈ ఊరిని సిటీ ఆఫ్ గోల్డ్ అంటే బంగారపు నగరం అని పిలిచేవారుట. భరతఖండమైన సింధు ప్రాంతంలో ఏడవ శతాబ్దంలోని అరబ్బు దేశీయుల నుంచి దండయాత్రలు మొదలయ్యాయి. మహమ్మద్ బిన్ ఖాసీం అనే వాడు విజయవంతంగా సింధు దండయాత్ర చేయడం జరిగింది. ఈ యుద్ధంలో పోరాడిన వాడు ఆనాడు సింధుని పరిపాలిస్తున్న భారత రాజు Raja Dhahir . ఇది అరబ్బు దేశాలనుండి జరిగిన మొట్టమొదట దండయాత్ర. మహమ్మద్ బిన్ ఖాసీం విగ్రహాన్ని పడగొట్టలేదు కానీ మాంసాన్ని విగ్రహానికి వేలాడదీసాడు. భక్తులు ఆయనికి మూడవ వంతు గుడి నుంచీ వచ్చే ఆదాయాన్ని ఇస్తాము అని ఒప్పుకున్నారట. బహుశా ఈ గుడి విరాళాలు, సంపద అతనికి అర్ధమయ్యి ఉండొచ్చేమో. 986 CE వరకూ ఇస్లాములో షియా శాఖ వారు వచ్చి సింధు ప్రాంతాన్ని ఆక్రమించేవరకూ ఈ గుడి బాగానే ఉంది. వాళ్ళు గుడిని ఆక్రమించి దేవుడి మూర్తిని, గుడిని విధ్వంసం చేసారు.1130 CEలో మొరాకో యాత్రికుడు చూసిన ప్రకారం ఆ గుళ్లో చెక్కతో చేసి, ఎర్రటి మొరాకో వస్త్రం ధరించిన మూర్తి పూజలు అందుకుంటున్నాడు. తరువాత 13వ శతాబ్దంలో చూసిన సాక్ష్యులు ఆ గుళ్లో పూజారులు మాత్రమే ఆరాధన చేస్తున్నారు అని చెప్పారు. 1666 CEచూసిన ఫ్రెంచ్ యాత్రికుడు పూజలు జరుగుతున్నట్లు చెక్కతో చేసిన మూర్తి పూజలు అందుకుంటున్నట్లు చెప్పాడు. అంటే ఎన్ని దాడులు జరుగుతున్నా ఆ మూర్తిని ఎక్కడ దాచారు ,తిరిగి పూజలు ఎలా చేసారు అన్నది పెద్ద ప్రశ్న అయితే, వారి భక్తి, నమ్మకం అనేది ఊహించుకుంటే అద్భుతం అనిపిస్తుంది. చివారికి ఔరంగజేబు గుడిని కూల్చి మసీదుగా మార్చాడట. కథ ఇక్కడితో ఆగలేదు. బ్రిటిష్ వారు వచ్చి తవ్వకాలు జరిపాక ఒక అద్భుతమైన సూర్యభవానుడి మూర్తి కనిపించిందట. అది వాళ్ళ మ్యూజియంలో ఇప్పటికీ ఉంది.

కాశీ విశ్వనాథుడి గుడి 

మొదట మొహమ్మద్ ఘోరీ ఈ గుడిపైన దాడి చేసాడు. తరువాత రజియా సుల్తానా ఈ గుడి పడగొట్టించి మసీదు కట్టించింది. ఈ గుడి పైన ఎన్నో దాడులు జరగటం మూలాన, అసలైన గుడి సరిగ్గా ఏ ప్రదేశం (location)లో ఉన్నది అన్న సంగతి, దేవాలయాన్ని తిరిగి పునరుద్దాం అనుకున్న వారికి తెలియలేదుట. అంటే ఎంత నేలమట్టం చేసారో ఊహించవచ్చు. అప్పుడు నారాయణ భట్టు అనే ఒక మహానుభావుడు కాశీ వచ్చే భక్తులతో తాను వ్రాసిన ‘త్రిస్థలి సేతు’ లో చెప్పారట ‘కాశీ వచ్చి విశేశ్వరుడు లేదని చింత వద్దు. ఇది ఎంత పవిత్రమైన ప్రదేశం అంటే శివలింగం లేకపోయినా ఉన్నట్లు ఊహించుకుని పూజలు, అభిషేకాలు చేయండి’ అని. అక్బర్ దగ్గర ఉన్న తోడరమల్లు కొడుకు, నారాయణ భట్టు కలిసి గుడిని పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. ఔరంగజేబు 1669 CE లో అన్ని గుడులని కొల్లగొట్టమని ఫర్మానా ఇచ్చాడు. అప్పుడు దశనామి సన్యాసులు (నాగసాధువులలో సైన్యం) ఈ సైన్యాన్ని తిప్పికొట్టేందుకు వారితో యుద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఔరంగజేబు పడగొట్టిన గుడిని అహల్యాబాయి హోల్కర్ పునరుద్ధరించారు.

ఈవిడ కట్టించిన కాశీ విశ్వనాథుడి గుడిలో శివుడి లింగం గుడి మధ్యలో ఉండకుండా ఒక మూలలో ఉంటుంది. ఇది దేవాలయ శాస్త్ర ఉల్లంఘన. అయితే, ఇలా ఎందుకు అన్నదానికి కూడా ఒక కారణం ఉందిట. ఔరంగజేబు గుడిని కొల్లగొట్టినపుడు ఆ శివలింగంని ఆ పూజారి గారు తన గుడిసె లోనే దాచిపెట్టి చాలా ఏళ్ళు పూజలు అందించారు. ఆ స్థలాన్ని కదల్చకుండా దాని చుట్టూ గుడి కట్టారు.

మథుర బృందావనం కేశవుడి గుడి & ఇతర ఆలయాలు

మథురలో శ్రీకృష్ణుడిని పూజించడం అనేది ఎప్పటినుండో ఉన్నది. ఆయన పుట్టిన స్థలమేగా మరి! మొట్టమొదట ఈ ఆలయం మీద దండయాత్ర చేసినవాడు మొహమ్మదు ఘజిని. 1017 CE లో 21 రోజుల పాటు దండయాత్రని చేసి ఉన్న అవశేషాలను విధ్వంసం చేసి దోచుకున్నాడు. నూరేళ్ళ తరువాత Jhajha అనే అతను ఈ గుడిని పునర్నిర్మించినట్లు అక్కడ ఉన్న శిలాశాసనం వలన తెలుస్తుంది. తరువాత క్కుతుబుద్దీన్ ఐబక్ ఈ గుడిని ధ్వంసం చేసాడు. ఫిరోజ్ షా తుగ్లక్ కూడా కొంత చేసాడని అంటారు. ఎంతవరకూ నిజమో తెలియదు. తరువాత సికందర్ లోడి దండయాత్ర చేసి ఈ గుడిని విధ్వంసం చేసాడు. దేశంలోని ఎక్కడడెక్కడి నుంచో హిందూ మత పెద్దలు ఈ పుణ్యక్షేత్రాన్ని హిందువులు దక్కించుకునేందుకు ప్రయత్నించారని తెలుస్తుంది. తెలంగాణ నుంచి నింబర్క అనే బ్రాహ్మణుడు వచ్చి ఇక్కడే నివాసం ఏర్పరుచుకున్నారు. తరువాత మాధవేంద్ర పురి అనే బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడి మొదటి విగ్రహం ప్రతిష్ఠించారట. ఈ ప్రదేశం ఎన్నో సార్లు ధ్వంసానికి గురవుతుందని తెల్సినా కూడా వారు ఏదీ లెక్క చేయకుండా ఏ ఆయుధాలు లేకుండా ఉండటం ఆశ్చర్యానికి లోను చేస్తుంది. వల్లభాచార్యులు మరియు చైతన్య మహాప్రభు శిష్యులు కూడా వ్రజ్ ప్రాంతంలో శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర ఆనవాళ్లు భద్రపరిచే ప్రయత్నం చేసారు. అటువంటి సమయంలో చైతన్య మహాప్రభు వారు స్వయంగా వచ్చి రాధా కుండ్ కనుక్కున్నారట. తరువాత అక్బర్ కాలంలో ఒక పోర్చుగీస్ Jesuit Father వచ్చి చూసినట్టు రికార్డుల్లో ఉన్నది. ఆయన ‘ఇక్కడ ఒక్కటే కృష్ణుడి గుడి ఉంది. ఎంతో మంది భక్తులు తలనీలాలు ఇచ్చి యమునాలో స్నానం చేసి ఆ గుడికి వచ్చి దర్శనం చేసి వెళ్లేవారు’ అని చెప్పాడు. తరువాత జహంగీర్ కాలంలో ఈ గుడిని 33 లక్షల రూపాయలతో Bir Singh Dev Bundela నిర్మించారట. దానిని చూసిన ఇద్దరు ఫ్రెంచ్ యాత్రికులు తమ యాత్రావిశేషాల్లో వ్రాసుకున్నారు. ఔరంగజేబు 1669 CE లో అన్ని గుడులని కొల్లగొట్టమని ఫర్మానా ఇచ్చాడు. 1670 CEలో ఈ గుడిని కొట్టేయమని ఉత్తర్వులు ఇచ్చారు. రాజపుత్రుల రాజులు నిస్సహాయంగా బాధతో చూస్తూ ఉండిపోయారుట. ఆ విగ్రహాలని ఆగ్రాలో మసీదులో వచ్చేవారు ఎక్కాలని మసీదులో మెట్లలాగా వాడుకున్నారు.

ఈ ఒక్క సంఘటనతో పూజారులలో ఒక భీతి వచ్చింది. ఫర్మానా ప్రకారం ఇదొక్కటే కాదు రాజపుత్రులు కట్టించిన ఇతర గుళ్ళలో విగ్రహమూర్తులకి కూడా ఇదే అవమానం జరుగుతుంది అని అర్ధమయ్యింది. ఇక ఈ దుర్మార్గం నుంచీ ఈ విగ్రహమూర్తులని, ప్రతిమలని ఎలా రక్షించుకోవాలి అన్న దుఃఖం వారిలో మొదలయ్యింది. ఎలాగైనా ఈ విగ్రహమూర్తులని రక్షించుకోవాలన్న సంకల్పంతో మూర్తులని తీసుకుని తమకు దగ్గరగా ఉన్న రాజస్థాన్ ప్రయాణమయ్యారు.

అటువంటి ఒక ఉదాహరణ రాజా మాన్ సింగ్ కట్టించిన గోవింద దేవ్ జీ ఆలయం.

ఈ గుడిలో మూర్తి చరిత్ర ఏంటంటే → చైతన్య మహాప్రభువుల వారి శిష్యులకి ఈ దేవతామూర్తి దొరికిందట. వారు ఒక చిన్న గుడి కట్టించారట. అక్బరు కాలంలో రాజా మాన్ సింగ్ ‘శ్రీకృష్ణులవారికి ఇంత చిన్న గుడి ఏమిటి’ అని చాలా పెద్ద ఆలయం నిర్మించారు. ఆ ఆలయానికి అక్బర్ కూడా భూమిని ఇచ్చాడట. ఆలయాలు కొట్టివేయాలి అన్న ఔరంగజేబు యొక్క ఫర్మానా రాగానే 1670 CE లో ఆ ఆలయ అర్చకులు మూర్తిని తీసుకుని రాజస్థాన్ వెళ్ళారు. ‘దేవతంటే దేవత. ఆయనని మనం బంధించకూడదు. ఏ పూజలు, సేవలు చేయాలో అవి మాత్రం మనం మానకూడదు’ అని ఎక్కడి క్షేమకరం అనుకుంటే అక్కడ తాత్కాలికంగా చిన్న గుడిలాంటిది ఏర్పాటు చేసి, స్వామి వారికీ చేయవలసిన సేవలు అంటే నైవేద్యాలు పెట్టడం లాంటివి చేసేవారు. 1670 CE నుంచీ 1739 CE వరకూ ఆ విగ్రహమూర్తి ఒక చోట నుండీ ఒక చోట వరకూ వెళ్తూనే ఉంది. రాజా జైసింగ్ గారు జైపూర్‌లో ఈ మూర్తికి పెద్ద ఆలయం కట్టించారు. ఇప్పటికీ ఆ ఆలయానికి వేలమంది భక్తులు వెళ్తూనే ఉంటారు. ఈ తాత్కాలిక గుళ్ళు కూడా కొత్త మూర్తులతో ఇంకా ఉన్నాయట.

ఇంకొక ఉదాహరణ గోవిందనాథ్ ఆలయం. ఈ మూర్తి వల్లభ సంప్రదాయానికి చెందినది. ఈయననే ఈరోజు శ్రీనాథ్‌జీ అని అంటారు. ఒక మనిషంత ఎత్తులో ఉంటాడు. ఈ గుళ్లో ఒక్క శ్రీనాథ్‌జీ మూర్తి తప్ప మిగిలిన మూర్తులన్నీ తలపాగాలో చుట్టుకునేంత చిన్నవి. అందుకని ఆ మూర్తులని తలపాగాలో చుట్టేసుకున్నారట. శ్రీనాథ్‌జీని ఆగ్రాలో ఒక ఇంట్లో దాచారట. ఆగ్రా అంటే ఔరంగజేబు నివాసం అక్కడే, అంటే వారి జీవితాలు ఎంత ప్రమాదపుటంచున ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఈయనని రాజస్థాన్ ఎలా తరలించాలా అని తర్జనభర్జన పడ్డారట. ఆ క్రమంలో ముగ్గురు హిందూ రాజులు వచ్చి ఆయనకి పూజలు చేశారట. తరువాత Maharana Raj Singh of Mewar లక్ష మంది సైనికుల్ని ఆయనకి రక్షణగా పంపి, గుడి కట్టిస్తాను అన్నారు. అప్పుడు ఉదయపూర్‌కి ఒక బండిలో పెట్టుకుని తీసుకెళ్తుండగా బండి బురదలో ఇరుక్కుని చక్రం బయటికి రాలేదు. శ్రీనాథ్‌జీ అదే స్థలంలో ఉండదల్చుకున్నాడు అని అర్ధమయ్యి అక్కడే ఒక తాత్కాలికమైన గుడిని కట్టారు. క్రమేణా Maharana Raj Singh of Mewar ఒక అద్భుతమైన గుడి కట్టారు. ఈనాటికీ పూజలందుకున్నాడు ఈ శ్రీనాథుడు. ఆ ఊరికి అందుకే ‘నాథ్ ద్వారా’ అని పేరు వచ్చింది.

సోమనాథ్ దేవాలయం, గుజరాత్ 

ఈ గుడి గురించి అందరికీ తెలిసినదే. ఈ గుడిని 1026 AD మొహమ్మద్ ఘజిని కొల్లగొట్టాడు. ఆ గుడిలో ఉన్న లింగాన్ని కూడా పూర్తిగా నిర్మూలించాడు. రాజా భీం దేవ్, ఆయన తరువాత ఆయన మనవడు జయసింహ ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు. తరువాత కుమారపాల్ పరిపాలించాడు. ఆయన ఆస్థానంలో పని చేసే జైన్ మంత్రి అయిన హేమచంద్రతో పాటు ఆయన గుడిని దర్శించినప్పుడు అక్కడ పూజారి దేవాలయం పరిస్థితి బాలేనందున మరమ్మత్తులు చేయమని అడిగాడు. కుమార్ పాల్ కొత్త కట్టడం కట్టారు. ఈ కొత్త దేవాలయం గుజరాత్ లోని రుద్రమహాలయం కంటే చాలా పెద్దదిగా ఉండేదిట. 1300 ప్రాంతాలలో ఈ గుడిని అల్లాఉద్దీన్ ఖిల్జీ పడగొట్టాడు. కొన్ని వందల ఏళ్ళ తరువాత, రాజపుత్రుల చిన్న రాజ్యమైన జలోర్ ఆస్థాన కవి ఒకరు, తమ జలోర్ రాజు ఖిల్జీ సైన్యాన్ని ఎదురించి సోమనాథ గుడిలోని శివలింగాన్ని భద్రపరచారని తన రచనలో చెప్పాడు. ఇది నిజమో కాదో తెలియదు కానీ, ఒక చిన్న రాజు తనని తాను ఢిల్లీ సుల్తాన్‌ని ఎదిరించడం గర్వంగా చెప్పుకోవడం తీసివేయవలసిన విషయం కాదు. 1325 CE ప్రాంతాలలో ఈ ఆలయం తిరిగి పునరుద్ధరించి శివలింగాన్ని ప్రతిష్టించారు. 1413 CE లో సుల్తాన్ అహ్మద్ షా ఈ గుడిని పడగొట్టాడు. ఈయన మనవడు శివలింగాన్ని కూడా తీసివేయించడమే కాక ఒక మసీదులాగా మార్చేశాడు. చరిత్రకారుడు కే.ఎం. మున్షీ ‘ఆ గుడి మసీదుగా మార్చబడ్డా మసీదులాగా పనిచేయలేదు’ అన్నారు. ఈమధ్య కాలంలో ఏమైంది ఎవరు తిరిగి నిర్మించారు అనేది తెలీదు కానీ గుడిలో పూజలు కొనసాగాయి. ఇక 1701 CE లో ఔరంగజేబు పూర్తిగా మసీదు లాగా మార్చేశాడు. 1783 CEలో మొగలు సామ్రాజ్యం కూలిపోయింది అనుకున్నాక ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్ గారు తిరిగి కట్టించారు. మళ్ళీ దాడులు జరుగుతాయేమో అన్నట్టు భయపడి, ఆవిడ గర్భగుడి ఎత్తు కొంచెం కిందకి పెట్టారుట. ఆ భయం ఎన్ని ఏళ్ళు ఉన్నదో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

‘The temple of Somnath was demolished early in my reign and idol worship (there) put down. It is not known what the state of things there is at present. If the idolators have again taken to the worship of images at the place, then destroy the temple in such a way that no trace of the building may be left, and also expel them (the worshippers) from the place.’’—Letter of Aurangzib in the last decade of his reign. Inayetullah’s Ahkam, 10a; Mirat 372.

చింతామణి 

ఈ గుడిని శాంతిదాస్ అనే జైనుడైన పెద్ద నగల వ్యాపారి గుజరాత్‌లో అహ్మదాబాద్ ఓ కట్టించారు. ఔరంగజేబు గుజరాత్‌కి గవర్నర్‌గా ఉన్నపుడు, ఈ గుడిలో గోహత్య చేసి మసీదుగా మార్చాడు. శాంతిదాస్ బాగా డబ్బు పరపతి గల వ్యక్తి. అతడు వెళ్లి షాజహానుతో ‘ఈ విధంగా చేయడం నచ్చలేదు’ అని చెప్పారు. ఎంతో సంపద కురిపించే గుజరాత్‌ని వదులుకోవడం ఇష్టం లేక షాజహాను ఔరంగజేబుని అక్కడ నుండీ గవర్నర్‌గా తీసివేసాడు. ‘మసీదుని ఆ విధంగానే ఉంచి, మధ్యలో గోడ కట్టి మిగితా స్థలం గుడికి వదిలివేయమని’ ఫర్మానా ఇచ్చాడు. శాంతిదాస్ ‘ఆ ప్రదేశం గోహత్య వల్ల అపవిత్రం అయింది. ఇంక గుడిగా మార్చలేము’ అన్నారట. అంతే కాదు రెండు పెద్ద పాలరాయి జైన విగ్రహాలు కూడా విధ్వంసానికి గురయ్యాయి అని చెప్పారట. ఒక వందేళ్ల తరువాత ఎక్కడో నేలమాళిగలో దాచిన ఈ రెండు మూర్తులు కనిపించాయి. అక్కడ భక్తులు పెద్ద ఉత్సవంతో ఈ రెండు మూర్తులని ప్రతిష్ఠించారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది అంత పెద్ద విగ్రహాలని తరలించి దాచడం, విరిగిపోయాయని అబద్ధం చెప్పడం. ఎంత భయబ్రాంతులకు లోనయ్యారో అనడానికి ఒక ఉదాహరణ.

“The temple of Chintaman, situated close to Sarashpur, and built by Sitadas jeweller, was converted into a mosque named Quwat-ul-islam by order of the Prince Aurangzib, in 1645.”” (Mirat-i-Ahmadi, 232.) The Bombay Gazetteer, vol. 1. pt. 1. p. 280, adds that he slaughtered a cow in the temple, but Shah Jahan ordered the building to be restored to the Hindus.

శ్రీరంగనాథుడు 

శ్రీరంగం దక్షిణంలో ఉన్న దేవాలయం. ఖిల్జీ దగ్గర గవర్నర్ అయిన మల్లిక్ ఖఫుర్ అనేవాడు ఈ దేవాలయం మీద దాడి చేసాడు. అదే మొట్టమొదటి దాడి అవడంతో ఆ విధంగా గుళ్ళమీద దాడి చేస్తారు అన్న ఆలోచన కూడా వారికి లేదు. దాంతో ఆలయమూర్తిని గాయపరచి, ధనాన్ని దోచుకెళ్లారు. ఈ విధంగా రెండవసారి కూడా దాడి జరుగుతుందని తెల్సింది. సైన్యం దేవాలయం దగ్గరగా వచ్చిందని ముందుగానే తెలియడం వలన జాగ్రత్త పడ్డారు.. ఈ సారి వచ్చిన వాడు తుగ్లక్. అప్పుడు ఆలయమూర్తిని రక్షించుకోవడానికి పెద్ద పెద్ద బండరాళ్ళు పెట్టి అక్కడ గోడ ఉన్నట్టు చేశారట. ఇక ఉత్సవ మూర్తితో పరుగెత్తి తప్పించుకున్నారట. ఈ గుడి చరిత్రలో ఆనాటి గుడి అర్చకులు ఆ మూర్తిని రక్షించడానికి ఆయనని తీసుకుని ఎక్కడ ఎక్కడ పరిగెత్తారో చెబుతుంది. ఒకటి రెండు రోజులు కాదు కొన్నేళ్ళు పరుగెత్తారు. కేరళ క్షేమకరం అని అక్కడికి వెళ్ళారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ విధంగా వచ్చిన మూర్తులు అక్కడ బోలెడు ఉన్నాయి. చివరకి తిరుమల చేరుకున్నారు. అదే మనం చూసే రంగ మండపం. కొన్నేళ్ల పాటు ఆయన అక్కడే ఉండిపోయారు. ఈయన నివేదన వేరు. వెంకటేశ్వర స్వామి వారి నివేదన వేరు. తిరుమలలో అర్చకులు అలా శాస్త్రోక్తంగా నివేదనలు, సేవలు అందిస్తూ ఆ స్వామిని చూసుకున్నారు. తరువాత విజయనగర సామ్రాజ్య సైన్యాధికారి గోపన్న తిరుమల దర్శించి ఆయనని తమ రాజ్యానికి తీసుకెళతామని అడిగి, తిరిగి రంగనాయకుల స్వామిని శ్రీరంగం తీసుకెళ్ళారు.

కంచి వరద రాజా స్వామి వారి గుళ్లో, మధురై మీనాక్షి గుళ్లో ఇటువంటి అనుభవాలే ఉన్నట్టు చెప్పారు వారు.

ఓ ప్రశ్న వేసుకుందామా?

ఇదంతా తెలుసుకున్నాక పాఠకులకి కొన్ని ప్రశ్నలు రావాలి. నాకు వచ్చాయి. కానీ నేను చెప్పను.

References

HISTORY OF AURANGZIB VOL.3: JADUNATH SARKAR

https://www.youtube.com/watch?v=nmGDF9J37Xo&t=3000s

https://www.youtube.com/watch?v=VNmjknf_5v0&t=2554s

https://youtube.com/shorts/0lIEIbFQU3g?feature=share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here