భాష – భవిత

0
12

[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘భాష – భవిత’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]శ[/dropcap]తాబ్దాల నాటి భాష మన తెలుగు భాష
నన్నయాదులు కవిత్వీకరించిన భాష
పదాలు పద్యాలుగా రూపొందిన భాష
అమ్మపాలలా అమృతమయమైన భాష

కథకు కవితకు ప్రాణమైన భాష
అమ్మచల్లని జోలపాటకు ఆలవాలమైన భాష
జానపదులకు వరమైన భాష
అమ్మభాషలో అక్షరాలు దిద్దుకుని
బతుకు విలువలు నేర్చుకున్న భాష

దేశమేదైనా మానవ నాడీ వ్యవస్థలో
అత్త తాత అమ్మ పదాలే తొలిగా
పసివారు పలుకుతారు
అందుకే అన్నారు అమ్మభాషని

విదేశీయులు సైతం అభ్యసించి
సాహిత్యపు లోతులను తెలుసుకొని
శబాసన్న అందమైన భాష
సుందరం తెలుగని ఇతరులచే
కీర్తిగన్న మాతృభాషను వదిలి
జాతిని సంస్కృతిని
విచ్ఛిన్నం చేయటానికి
నాడు మెకాలే ప్రవేశపెట్టిన
ఆంగ్లవిద్యా విధానం
నేడు ఆశ్రయం పొందిన ఒంటె అయినది

ఆంగ్ల భాషను అభ్యసించు
బతుకు జీవనం కోసం
భాషలెన్ని నేర్చినా
మాతృభాషను మరువవద్దు
మాట నేర్పిన అమ్మ గొంతుక నొక్కద్దు
ఏ దేశమేగినా ఎందు కాలిడినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
మరువకురా పలుకులమ్మను అన్న
కవి మాటలను మరువవద్దు
అమ్మ భాషలోనే మాట్లాడదాం
మాతృభాషను మృతభాషను కానీయక
కాపాడుకోవటం మన జాతి కర్తవ్యం
భాష లేకపోతే జాతి లేదు
జాతి నశిస్తే జగతి శూన్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here