భాసుని పంచరాత్రమ్

1
59

నాంది:

సంస్కృతనాటకాలు ప్రదర్శించే రోజుల్లో, నాటకం ఆరంభించడానికి ముందు సుదీర్ఘమైన తతంగం ఉండేది. అందులో భాగంగా అవిఘ్నం కోసం దేవతాప్రార్థన, జ్యోతిప్రజ్వలనం, నటీనటుల అలంకరణ, ధ్రువాగానాలు పాడటం వగైరా. ఈ వ్యవహారానికి పూర్వరంగం అని పేరు.

యన్నాట్యవస్తునః పూర్వం రంగవిఘ్నోపశాంతయే

కుశీలవాః ప్రకుర్వంతి పూర్వరంగం స ఉచ్యతే

ఏదైతే నాట్యవస్తువుకు ముందు రంగస్థలంలో ఆపదలు తొలగిపోవడానికి ఉద్దేశించబడి, నటులచేత ఆచరించబడుతుందో దానిని పూర్వరంగం అందురు. (కుశీలవులు – అంటే నాటకంలో పాత్రధారులు)

భరతుడు తన నాట్యశాస్త్రంలో 4,5 అధ్యాయాలలో ఈ పూర్వరంగాన్ని గురించి సుదీర్ఘంగా వివరించి ఉన్నాడు.(ఈ రోజుకూ ఈ పూర్వరంగపు ఛాయలు – కథకళి ప్రదర్శనలో కనిపిస్తాయి. కథకళి ప్రదర్శనలో ఆటకు ముందు నటకుల అలంకరణ, దీపం వెలిగించటం వంటివి జరుపుతారు.) ఈ పూర్వరంగం ముగిసిన తర్వాత నాటకం ఆరంభమయ్యేది. ఈ ఆరంభానికి పేరు ‘నాంది’.

భాసుని నాటకాలలో పూర్వరంగం తర్వాతి నాటకప్రదర్శనను – సూత్రధారుడే (Stage Manager) ఆరంభిస్తాడు. “నాంద్యంతే తతః ప్రవిశతి సూత్రధారః” అన్న నిర్దేశంతో ఈ నాటకాలు ఆరంభమవుతాయి. పైన శ్లోకంలో నటులు పూర్వరంగాన్ని ఆచరిస్తారని చెప్పాడు సూత్రకారుడు (భరతుడు). భాసనాటకం భరతుని నిర్దేశానికి వ్యతిరేకంగా ఉంది!

ఈ నిర్దేశం సంస్కృతనాటకాలలో చాలా ప్రాచీనమైన నాటకాల్లో మాత్రమే కనిపిస్తుంది. (నేడు మనకు దొరుక్తున్న నాటకాల్లో భాసనాటకాలు, చతుర్భాణి లో మాత్రమే ఈ నిర్దేశం కనిపిస్తోంది) తర్వాతి కాలంలో వచ్చిన సంస్కృతనాటకాలలో నాందిని (నటుడు) చదివి ముగించిన తరువాత సూత్రధారుడు రంగంపై ప్రవేశించి నాటకపరిచయాన్ని, రచయిత పరిచయాన్ని ఆరంభిస్తాడు.

నాందిలో భాగంగా ఆశీర్వచన సంయుక్తంగా శ్లోకం ఉంటుంది. శ్లోకాన్ని చదువుతాడు సూత్రధారుడు. అది నాటకంలో పాత్రల గురించి కానీ, ఏదేని ఋతువు గురించి కానీ అయి ఉంటుంది. (చతుర్భాణిలో ఋతువర్ణన ఉంది)

పంచరాత్రమ్ లో ఆరంభశ్లోకం (నాందిశ్లోకం) ఇది.

ద్రోణః పృథివ్యర్జునభీమదూతో యః కర్ణధారః శకునీశ్వరశ్చ

దుర్యోధనో భీష్మయుధిష్ఠిరః స పాయాత్ విరాడుత్తరగోభిమన్యుః

ఇలా పాత్రధారులపేర్లను శ్లోకంలో ఉపయోగిస్తే, ఆ ప్రక్రియను ముద్రాలంకారం అని అంటారు.

పృథివ్యర్జున భీమదూతః = తేజోవంతమై, భీకరుడైన భూమిపై దూత;(భీమార్జునుల సందేశమును కౌరవులకు చేర్చిన భూమిపతి); ద్రోణః = మేఘమువంటివాడు (శ్రీకృష్ణుడు); శకునీశ్వరశ్చ = పక్షిరాజు గరుత్మంతుని యొక్క; (శకుని అంటే పక్షి); కర్ణధారః = వాహనము నడుపువాడై; యః = ఎవడు (కలడో); దుర్యోధనః = శత్రువులచేత జయించుటకు దుష్కరుడైన వాడు; (దుష్కరం శత్రుభిః యోధనం యస్య); యుధిష్ఠిరుడు = స్థిరముగా యుద్ధము చేయుటయందు నేర్పరి యగు; ఉత్తరగః = ఉత్తమ కార్యముల నాచరించుచు; అభిమన్యుః = యజ్ఞకర్త్రియైన; సః విరాట్ = ఆ విరాట్పురుషుడు; పాయాత్ = రక్షించుగాక!

తాత్పర్యము: యజ్ఞకర్త్రియైన విరాట్పురుషుడు మనలను కాపాడుగాక! ఆ విరాట్పురుషుడెట్టివాడు? తేజస్వి, భీకరుడు, భూమిపై యవతరించిన దేవదూత,మేఘము వంటివాడు, పక్షిరాజు గరుడుని వాహనముగా కలిగినవాడు, శత్రువులచే జయింప నశక్యుఁడు, యుద్ధమునందు స్థిరముగా నుండువాడు, ఉత్తమకార్యమగ్నుడు.

మహాభారతంలోని పాత్రల పేర్లతో అల్లిన విరాట్పురుషుని యొక్క స్తుతి ఈ శ్లోకం. ఇందులో పదకొండు పాత్రధారులు ఉన్నారు. ద్రోణుడు, అర్జునుడు, భీముడు, కర్ణుడు, శకుని, దుర్యోధనుడు, భీష్ముడు, యుధిష్ఠిరుడు, విరాటుడు, ఉత్తరుడు, అభిమన్యుడు. ఈ శ్లోకంలో లేకుండా, నాటకంలో ఉన్న మరొక ముఖ్యపాత్ర బృహన్నల. బృహన్నల – అర్ధనారీశ్వరుడు కాబట్టి ఆతణ్ణి ఈ శ్లోకాన ప్రస్తావించనట్లు కనబడుతున్నది. పాత్రధారులను కాక వారి పేర్ల తాలూకు వ్యుత్పత్తితో అల్లిన శ్లోకం ఇది. నాటకం తాలూకు నాందిలో ఈ పద్ధతికి బహుశా భాసుడే నాంది అయి ఉండవచ్చు.

***

సంస్కృత/ప్రాకృత భాషలలోని నాటకసాహిత్యంలో నాటకకళలో నిష్ణాతుడైన కవి భాసుడు. ఈయన నాటకాలను బాగా అధ్యయనం చేస్తే, నేటి కాలంలో కూడా ఒక కథను దృశ్యంగా ఎలా చెప్పవచ్చు, పాత్రలను ఎంత అద్భుతంగా మలచవచ్చు అని అర్థం అవుతుంది. ఈ కవి వ్రాసిన నాటకాలు పరిమాణరీత్యా కొంచెం చిన్నవి. అయినప్పటికీ, ఈయన వస్తునిర్వహణ అత్యద్భుతంగా ఉంటుంది. ఈయన కాళిదాసుకన్నా ఎంతో పాతకాలపు కవి. బహుశా చాణక్యుని కన్నా కాస్త ముందువాడై ఉండే అవకాశం ఉంది. ఈ కాలంలోనే నాటకానికి కావలసిన విషయాలను ఈయన ఎంత ఘనంగా తన నాటకాలలో పొదిగాడో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.

సాధారణంగా దృశ్యసంవిధానానికి కావలసింది క్లుప్తత. నాటకంలో పాత్రల సంఖ్య పరిమితంగా ఉండాలి. పంచరాత్రంలో ఈయన కావాలనే నకులసహదేవుల పాత్రలను వదిలివేశాడు.

పాత్రలు, పాత్రౌచిత్యం:

సాధారణంగా పాత్రల నిర్వహణ విషయంలో మనకు రెండు రకాల సంవిధానాలు కనిపిస్తాయి.మొదటి పద్ధతిలో పూర్తీగా నాటకరచయిత భావాలకు అనుగుణంగా పాత్రలు నడయాడటం. అంటే పాత్రలు – కవి భావాలను ఊపిరిపోసుకుని ప్రవర్తిస్తుంటాయి. కవి రొమాంటిసిస్టు అయితే, రచనలో పాత్ర కూడా ఆ లక్షణాన్ని పొందుపర్చుకుంటుంది. కాళిదాసు విక్రమోర్వశీయం ఇందుకు ప్రధానమైన ఉదాహరణ. మేఘదూతం కూడా. ఇంకా, ఈ పద్ధతిలో కవికి కొన్ని విషయాలలో ఆర్తి ఉంటే ఆ విషయాలు నాటకంలో ప్రతిఫలిస్తాయి. శాకుంతలంలోని దుష్యంతుడు పసిబిడ్డలపై, వారి తల్లిదండ్రులపై ఒక అపూర్వమైన శ్లోకం చెప్పాడు. “అలక్ష్యదంత ముకుళాననిమిత్తహాసైః..” అన్న ఆ శ్లోకం – కాళిదాసు నిజజీవితానికి చెందినదేనని, ఆయన మనసులోంచే ఆ భావం వచ్చిందని తిరుమల రామచంద్ర వంటి విమర్శకుల అభిప్రాయం.

మరొక సంవిధానం ప్రకారం – కవి/రచయిత – పాత్రల ప్రవర్తన మూలకావ్యం ప్రకారం ఎలా ఉన్నదో, ఎలా ఉండాలో ఆ స్వభావాన్ని తాను సమగ్రంగా అధ్యయనం చేసి, ఆ పాత్రను కావ్యానికి, కావ్యవాతావరణానికి అనుగుణంగా తీర్చిదిద్దుతాడు. తన భావాలను కావ్యంలో జొప్పించటం ఉండదు. ఒకవేళ ఉన్నా, అది చాలా క్లుప్తంగా మాత్రమే ఉంటుంది. భాసుని భీముడు, దుర్యోధనుడు, కర్ణుడు, అభిమన్యుడు ఇత్యాది పాత్రలు ఇందుకు ఉదాహరణ. ఈ సంవిధానానికి చెందిన మరొక కవి శూద్రకుడు. అయితే ఒక్కొక్కసారి పాత్రల స్వభావంలో – మూలకావ్యానికి విరుద్ధమైన స్వభావాన్ని ప్రతిపాదించటంలో కూడా కవి వెనుకాడడు. ఈ విషయం పైన చెప్పుకున్నాం.

పంచరాత్రంలో దుర్యోధనుడు కూడా ఉదాత్తమైన పాత్ర. అందుకనే నాటకం చివరన అనుకున్నట్టుగా ద్రోణునికి గురుదక్షిణగా పాండవులకు అర్ధరాజ్యాన్ని కట్టబెట్టేశాడు. అంతే కాదు, దుర్యోధనుని సమరనీతి కూడా ఓ చోట ఉదాత్తంగా చిత్రీకరిస్తాడు కవి. ఆ ఉదంతం ఇది.

గోగ్రహణం లో భాగంగా విరాటరాజుపైకి కౌరవసేన దండెత్తింది.ఈ సేనలో భాగంగా అభిమన్యుడు కూడా యుద్ధానికి వెళ్ళాడు. అభిమన్యుడు శత్రువులకు బందీగా చిక్కాడని సూతుని ద్వారా తెలుస్తుంది రారాజుకు. ఆ సందర్భాన ఆయన అంటాడు.

“సూత! చెప్పు చెప్పు, ఎవరు అభిమన్యపుత్రుని బందీ చేశారు. నేను పూనుకొని విడిపిస్తాను. ఎలా అంటావా?”

మమ హి పితృభిరస్య ప్రస్తుతో జ్ఞాతిభేదః తదిహ మమ చ దోషో వక్తృభిః పాతనీయః 

అథ చ మమ స పుత్రః పాండవానాం తు పశ్చాత్ సతి చ కులవిరోధే నాపరాధ్యంతి బాలాః

“నాకు, అభిమన్యుని తండ్రికి జ్ఞాతిభేదం ఉంది, కానీ అభిమన్యుడు నా సేనలో ఉన్నాడు కనుక అతడు మొదట నా పుత్రుడు, ఆ తర్వాతనే పాండవసుతుడు. ఆతడు బందీ అయితే అది నా దోషం అవుతుంది. మా కులవిరోధుల (విరాటరాజు) చేత ఆ బాలుడు బాధింపబడరాదు.”

చాలా సూక్ష్మంగా దుర్యోధనుని రాజనీతిని అందరి ముందు చెప్పించిన శ్లోకం ఇది. ఈ ఒక్క శ్లోకంతో దుర్యోధనుని పాత్ర చాలా ఎత్తుకు ఎదిగేలా చేస్తాడు కవి.

నిజానికి ఈ నాటకంలో దుర్యోధనునికి, కర్ణపాత్రకు ఎక్కువ Scope లేదు. అయినప్పటికీ, అవకాశం దొరికినప్పుడు, ఔచిత్యం చెడకుండానే కవి (నాటకరచయిత), ఆయా పాత్రల స్వభావాన్ని ఉత్కృష్టంగా నిర్వహిస్తాడు. భీముని పాత్ర సరేసరి. ఆతని పరాక్రమాన్ని ఎంతో సున్నితంగానూ, అద్భుతంగానూ చెపుతాడు కవి. అందులో కొంత ఈ లంకెలో తీరిగ్గా చదువుకొనండి.

కథానిర్వహణలో భాగంగా ఓ చిన్న విషయాన్ని కూడా ఉపయోగించుకుని పాత్ర స్వభావాన్ని తీర్చిదిద్దడంలో ఈ కవి నేర్పు సూక్ష్మమైనది, రోచకమైనది.

మూడవ అంకంలో, భీష్ముని రథసారథి ఓ బాణాన్ని తీసుకుని భీష్ముని వద్దకు వస్తాడు. బాణంపై ఏ పేరు వ్రాసి ఉంటుందో, అతడే ఆ బాణాన్ని ప్రయోగించి ఉంటాడు. భీష్ముడు తను వృద్ధుడయాడు కాబట్టి శకునికి ఆ అమ్మును ఇచ్చి దానిపై పేరు చదవమంటాడు. శకుని ఆ బాణాన్ని నిరసనగా చూసి, “అర్జునుని బాణం’ అని చెప్పి విసిరి వేస్తాడు. అది సరిగ్గా ద్రోణుని పాదాలపై పడుతుంది.

ద్రోణుడు ఇలా అంటాడు. “ఆ బాణాన్ని నా శిష్యుడు అర్జునుడు భీష్మపితామహులకు నమస్కార సూచకంగా ఆయన పాదాల వద్ద వేశాడు. ఇప్పుడా బాణం తన గమ్యాన్ని (గురువు పాదాలను) కూడా చేరింది“.

చాలా చిన్న ఘట్టం. కానీ ద్రోణుని శిష్యవాత్సల్యం, శకుని నిరసన, భీష్ముని వృద్ధాప్యం – ఇన్నిటిని పొదిగాడు కవి!

పతాకాస్థానకాలు (Dramatic Ironies):

భాసుని ప్రత్యేకతలలో చెప్పుకోవలసింది Dramatic ironies. వీటిని పతాకాస్థానకాలు అంటారు. అంటే ఏం జరుగబోతోందో/పాత్ర స్వభావం/కొన్ని నిజాలు ఏమిటో ప్రత్యక్షంగా కాక పాత్రల మాటల్లో పరోక్షంగా దొర్లేలా చెప్పటం. కావ్యసాహిత్యంలో ఇటువంటి వాటిని “వక్రోక్తులు” గా పేర్కొంటే, దృశ్యకావ్యాలకు సంబంధించి ఇవి ’పతాకాస్థానకాలు’.

భీష్మద్రోణులు అభిమన్యుని ఎత్తుకెళ్ళిన శత్రు వీరుణ్ణి పొగుడుతూ ఉంటారు. ఆతడెవరనేది అప్పటికి తెలియలేదు. ఆ సందర్భాన రారాజుకు చిర్రెత్తి, ఇలా అంటాడు.

కిమర్థం స్తూయతే కోపి భవతా గర్వితాక్షరైః

కథ్యతాం నాస్తి మే త్రాసో యద్యేష పవనో జవే  (3.9)

“ఎందుకు మీరు, ఎవరినైనా అతిశయోక్తులతో పొగడుతారు? మీరు ఇంతగా చెప్పినా, ఆతడికి ’వాయుదేవుడి’కున్న వేగం ఉన్నా, నాకు మాత్రం ఆతడిపై భయం లేదు.”

‘పవనో జవే’ – అన్నది వక్రోక్తి. అతడు ఎవరిని ఉద్దేశిస్తున్నాడో, ఆతడు (భీముడు) వాయుసుతుడే కాక, వాయువుకున్నంత వేగం కలవాడే. ఇక్కడ దుర్యోధనుని పాత్ర తనకు తెలియకనే ఒక సత్యాన్ని నాటకంలో ఇతరపాత్రలకు కూడా చెప్పక, నేరుగా ప్రేక్షకులకు చెబుతోంది!

రెండవ అంకంలో – భటుడు విరాట రాజు వద్దకు వచ్చి యుద్ధరంగం గురించి విన్నవిస్తాడు. బృహన్నల, ఉత్తరకుమారుల రథం శ్మశానం వైపు వెళుతోందని అంటాడు. పక్కన కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజుకు విషయం అర్థమవుతుంది. అజ్ఞాతవాసానికి మునుపు పాండవులు తమ ఆయుధాలను శ్మశానంలో ఉన్న శమీ వృక్షంపైన దాచి ఉంచారు. ఆ ఆయుధాలలో నుంచి తన ఆయుధమైన గాండీవాన్ని తీసుకుందుకే బృహన్నల రూపంలోని అర్జునుడు శ్మశానానికి వెళుతున్నాడు. రాజు ఖంగారు పడుతుంటే, యుధిష్ఠిరుడంటాడు.

“…..ధార్తరాష్ట్రాః స్థితా యత్ర శ్మశానం తద్ భవిష్యతి।” – “..ధార్తరాష్ట్రులు ఎక్కడ ఉంటే శ్మశానం అక్కడే అవుతుంది.”

ధార్తరాష్ట్రులు – అంటే ఆహారం కోసం లేదా నివాసం కోసం రాష్ట్రాలు దాటిపోయేవి – ’పక్షులు’ అని కూడా సంస్కృతంలో అర్థం.

ధర్మరాజు చెప్పిన ఈ మాటలోనూ అర్జునుని విజయం తథ్యం అనే సూచన దాగి ఉంది. అతి క్లుప్తంగానూ, చమత్కారంగానూ, రాజుకు ధైర్యం చెబుతున్నట్టుగానూ, భవిష్యసూచనగానూ కవి పాత్ర చేత చెప్పించిన వాక్యం ఇది!

ఇటువంటివి అక్కడక్కడా నాటకం మధ్యలో మెఱుపుల్లా భాసకవి నాటకంలో వస్తూనే ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here