భాసుని పంచరాత్రమ్

1
10

[box type=’note’ fontsize=’16’] “భాసుని వలే నాటకాన్ని అత్యంత ప్రతిభావంతంగా తీర్చిదిద్దటంలో సంస్కృతకవులెవ్వరూ సాటిరారు అంటే అతిశయోక్తి లేదు” అంటున్నారు అంటున్నారు రవి ఇ.ఎన్.వి.భాసుని పంచరాత్రమ్” వ్యాసంలో. [/box]

బాఢం దత్తం మయా రాజ్యం పాండవేభ్యో యథాపురమ్।

మృతేపి హి నరాః సర్వే సత్యే తిష్ఠంతి తిష్ఠతి॥” – దుర్యోధనుడు.

[dropcap]“పాం[/dropcap]డవులకు ఇదివరకటిలా వారి అర్థరాజ్యాన్ని సంతోషంగా ఇచ్చేశాను. మరణం అన్నది ఉన్నా కూడా మనుషులు సత్యాన్ని పాలించాలి.” – దుర్యోధనుడన్నాడు.

***

మహాభారతంలో దుర్యోధనుడే? పాండవుల వద్ద మాయాజూదంలో హరించిన రాజ్యం తిరిగి ఇచ్చివేయటమే? మనకు తెలిసిన మహాభారత ఇతిహాసంలో ఇలా లేదే? ఈ విపరీతకల్పన ఎక్కడిది? ఏ కవి కూర్పు యిది? ఆ సందర్భం ఏమిటి?

ఈ సందర్భం పంచరాత్రమ్ అనే మూడు అంకాల నాటిక చివరన వచ్చేది. ఇలా ఓ పాత్రను, ఓ ఇతిహాసాన్ని మూలమట్టంగా మార్చి స్వీయకల్పన చేయగలిగిన ధీరుడు సంస్కృతంలో బహుశా భాసకవి మాత్రమేనేమో. ఈ సందర్భం గురించి తెలియాలంటే పంచరాత్రమ్ అనే రూపకాన్ని (Sanskrit Drama) గురించి తెలుసుకోవాలి.

పంచరాత్రమ్ – రూపక కథ.

1.

జూదంలో ఓడిన పాండవులు నియమం మేరకు పదమూడేళ్ళ అరణ్యవాసాన్ని ముగించినారు. పదునాలుగవ యేడు అజ్ఞాతవాసంలో విరాటరాజు కొలువులో మారువేషాలలో చేరారు. అజ్ఞాతవాసం అయిపోవస్తున్నది. ఇక కొన్ని రోజులే మిగిలి ఉన్నై. ఆ సమయంలో ఇవతల హస్తినాపురంలో దుర్యోధనుడు ఓ గొప్ప యజ్ఞాన్ని చేశాడు. యజ్ఞానికి సామంతరాజులు, బ్రాహ్మణులు, ప్రజలు విచ్చేశారు. యజ్ఞం చాలా ఘనంగా జరిగింది. ఆ సందర్భాన దుర్యోధనుడు బ్రాహ్మణులకు ఏమి అడిగినా కాదనక దానాలు చేస్తున్నాడు. అప్పుడు ద్రోణుడు దుర్యోధనుడి వద్ద ఓ వరాన్ని యాచించాడు. ’పాండవులకు – వారికి చెందవలసిన రాజ్యభాగాన్ని వారికి ఇచ్చెయ్య’ మన్నదే ఆయన అభిమతం. దుర్యోధనుడి నోట పచ్చివెలక్కాయ పడినట్లయింది. అతడు శకునితో సంప్రదించినాడు. ఓ షరతు ప్రకారం ఆ కోరిక తీర్చగలనని ఒప్పుకున్నాడు. ఆ షరతు ఏమిటంటే, ఐదు రాత్రులలోపు అజ్ఞాతంలో ఉన్న పాండవుల ఉనికి ద్రోణుడు కనుక్కొని చెప్పాలి. ఈ షరతుకు హతాశుడైనాడు ద్రోణుడు. అరణ్యవాసం మొదలైనప్పటి నుంచి అంతదాకా ఎక్కడున్నారో తెలియని పాండవులను ఐదురోజుల్లో వెతికి కనుక్కోవడమా? ఎలా?

సరిగ్గా అప్పుడే ప్రతీహారి మత్స్యదేశం నుంచి ఓ వార్త తెచ్చాడు. ఆ దేశంలోని విరాటనగరంలో ఎవరో అజ్ఞాతవ్యక్తి కీచకుడిని, ఆతని నూర్గురు సోదరులను ఆయుధం లేకుండా మట్టుపెట్టాడట! ఈ వార్త విన్న భీష్ముడు – ఆ సోదరులను మట్టుపెట్టింది భీముడే అని, దరిమిలా పాండవులు విరాటరాజ్యంలో ఉండే అవకాశం ఉందని ఊహిస్తాడు. విరాటరాజు యజ్ఞానికి ఆహ్వానం పంపినా రాలేదు కాబట్టి ఆ నెపం మీద ఆతని గోవులను అపహరించి, తద్వారా పాండవులను బయటికి లాగవచ్చునని పథకం రచిస్తారు. అలా పాండవులను బయటకు తెస్తే, ద్రోణుడికిచ్చిన మాటమేరకు పాండవుల రాజ్యం తిరిగి ఇచ్చివెయ్యాలి, తద్వారా ధర్మం నిలుస్తుందని భీష్ముని తపన కూడా.

ఈ పథకం ప్రకారం వెంటనే విరాటనగరంపై దండయాత్ర మొదలవుతుంది.

2.

మత్స్యదేశం రాజధాని విరాటనగరం శివార్లలో గోపాలకులు ఆవులు కాచుకుంటున్నారు. వారు ఆనందంతో పాటలు పాడుకుంటూ నృత్యాలు చేసుకుంటూ, విరాటరాజు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఇంతలో ధార్తరాష్ట్రుల సైన్యం అనుకోకుండా వచ్చిపడి, గోవులను అపహరించింది. ఈ వార్తను భటులు కంచుకి (ఓ వృద్ధబ్రాహ్మణుడు) ద్వారా రాజుకు తెలియజేశారు.

వార్త విని రాజు మండిపడి, యుద్ధసన్నాహాలు మొదలెట్టమన్నాడు. అంతలో అక్కడికి బ్రాహ్మణరూపంలో ఉన్న యుధిష్ఠిరుడు వచ్చాడు. జరిగింది తెలుసుకున్నాడు. ఇంతలో భటుడు రాజు వద్దకు మరొక వార్తను తెచ్చాడు. యుద్ధానికి దుర్యోధనుడొక్కడే కాక, ద్రోణ, భీష్మ, జయద్రథ, శల్య, కర్ణ, శకుని, కృపాది వీరులు వచ్చారని, వారి ధ్వజాలను చూస్తూనే భయంతో గుండెలు బాసి పరిగెత్తుకొచ్చామని చెప్పాడు. ఇక జాప్యం తగదని, వెంటనే సూతుణ్ణి తన రథాన్ని, ధనుర్భాణాలను తెమ్మంటాడు విరాట రాజు. కానీ అప్పటికే ఉత్తరకుమారుడు బృహన్నలను రథసారథిగా చేసుకొని, ధార్తరాష్ట్రులను ఎదుర్కునేందుకు యుద్ధభూమికి వెళ్ళాడని తెలుస్తుంది. ఇది విని రాజు కంగారుపడతాడు, కానీ విరాటరాజు సమక్షంలోని బ్రాహ్మణరూపధారి కంకుభట్టు (యుధిష్ఠిరుడు) రాజుకు ధైర్యం చెబుతాడు.

కాసేపటికి మరొక భటుడు వచ్చి, ఉత్తరకుమారుని రథం యుద్ధభూమికి బదులు శ్మశానం వైపు వెళుతోందని విన్నవిస్తాడు. అసలు విషయం ఏమిటంటే – అర్జునుని గాండీవం శ్మశానంలో జమ్మిచెట్టుపై ఉంది. దాన్ని తెచ్చుకోవడానికే ఆ రథం అక్కడికి వెళుతోంది. ఈ కారణం తెలిసిన యుధిష్ఠిరుడు ధార్తరాష్ట్రులకు శ్మశానమే గతి అవుతుందని విరాటరాజుకు ధైర్యం చెబుతాడు. మరిన్ని వార్తలు కొనిరమ్మని సైనికుడిని పంపుతాడు రాజు.

అంతలో వారికి ఓ గొప్ప శబ్దం, యుద్ధసందోహం వినిపిస్తాయి.

సైనికుడు కాసేపటికి వార్తలు తెచ్చాడు. గొప్పయుద్ధం జరిగింది. యుద్ధంలో ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, ఇతరులు ఓడిపోయారు. కానీ ఒక్క అభిమన్యు కుమారుడు మాత్రం విక్రమింపసాగినాడు. యాదవ, పాండవ వంశజుడైన అభిమన్యునికి ఈ పరాక్రమం సహజమే కదా అంటాడు మహారాజు.

ఇంకాసేపటికి భటుడు విజయవార్త తెచ్చాడు. తమ గోవులు క్షేమమని, ధార్తరాష్ట్రులు వెనక్కు మళ్ళారని చెబుతాడు భటుడు. తన కుమారుని పరాక్రమం తలచి గర్విస్తాడు విరాటరాజు. బృహన్నల కూడా వెంట వెళ్ళాడుగా, అతణ్ణి ప్రవేశపెట్టమని అంటాడు మహారాజు.

అంతలో బృహన్నల అక్కడికి వచ్చి, రాజుకు జయం చెబుతాడు. రాజుకు యుద్ధవిశేషాలు వినిపిస్తుండగా, ఇందాకటి భటుడు వచ్చి, అభిమన్యుకుమారుణ్ణి మనవాళ్ళు బందీగా పట్టుకొన్నారని విన్నవిస్తాడు. తన సేనలో అభిమన్యుని పట్టుకునేంత వీరుడెవరబ్బా, కీచకుడు మరణించాడు కదా, అని ఆలోచించాడు రాజు. ఆ పట్టుకున్నది – వంటవాని రూపంలో ఉన్న తన అన్న భీమసేనుడేనని, అభిమన్యుడు ఓడిపోలేదని, భీముని ఆత్మీయమైన శరీరస్పర్శకు వశమైనాడని తనకు తాను చెప్పుకుంటాడు బృహన్నల. పట్టుబడిన యువరాజు అభిమన్యుని సగౌరవంగా తీసుకురమ్మని ఆదేశిస్తాడు మహారాజు.

యువరాజు అభిమన్యుడు సభలో బృహన్నలను, కంకుభట్టు రూపంలోని ధర్మరాజును చూసి ఆశ్చర్యపడతాడు. వారెవ్వరో మహాపురుషులన్న భావం అతనికి తడుతుంది. అంతలో అక్కడికి ఉత్తరకుమారుడు వచ్చాడు. అతడు – మర్యాదలన్నీ దక్కవలసినది బృహన్నలకనీ, ఆ బృహన్నల వేషంలో ఉన్నది అర్జునుడేనని, ఆతని మోచేతికి గాండీవం ధరించి ధరించి మచ్చ ఏర్పడిందని చూపిస్తాడు. జరిగింది గ్రహించి అభిమన్యుడు తన తండ్రులందరికి, విరాట రాజుకున్నూ అభివాదం చేస్తాడు. తనను తన రాజ్యాన్ని గెలిపించినందుకు తన అమ్మాయి ఉత్తరను అర్జునునికి బహుమతిగా ఇస్తాడు. అర్జునుడు ఆమెను అభిమన్యుని కోసమై స్వీకరిస్తాడు. అందరూ సంతోషిస్తారు. ఉత్తరాభిమన్యుల వివాహ నిశ్చితార్థం జరుగుతుంది. ఈ వార్తను భీష్మునికి చెప్పడానికి ఉత్తరకుమారుణ్ణి హస్తినాపురానికి పంపించాడు విరాటరాజు.

3.

విరాటరాజుకు పట్టుబడిన అభిమన్యుడిని వదిలి ధార్తరాష్ట్రులు, సేన అందరూ హస్తినకు వెనుదిరిగారు. అభిమన్యుడి రథసారథి కొలువుకు వచ్చాడు. ఆతడు అభిమన్యుడు శత్రువులకు ఎలా చిక్కాడో వివరించాడు. శత్రువర్గంలోని ఒక పదాతి-యోధుడు – ఒంటరిగా యుద్ధభూమికి నడుస్తూ వచ్చి, అభిమన్యుడిని తన చేతులతో బందీగా చేసి మత్స్యదేశానికి తీసికెళ్ళినాడు. రథసారథి చెప్పిన ఆనవాలుని బట్టి ఆ యోధుడు భీముడేనని పోల్చుకుంటారు భీష్మద్రోణులు. భీముని పరాక్రమం గురించి మాట్లాడుకుంటారు. శకునికి భీష్మద్రోణులు భీముని పొగడ్డం నచ్చదు. ఆతడు వారిని అవహేళన చేస్తాడు. అంతే కాక, ఉత్తరకుమారుడే – మారువేషంలోని అర్జునుడై ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తాడు.

అంతలో అక్కడికి భీష్ముని సారథి కూడా వచ్చాడు. ఆతని చేత ఓ అమ్ము ఉంటుంది. ఆ అమ్ముపై అర్జునుని పేరు చెక్కబడి ఉంది. ఆ బాణాన్ని అర్జునుడు భీష్ముని పాదాలకు నమస్కారసూచకంగా ప్రయోగించి ఉంటాడు. ఆ అమ్మును శకుని కూడా చూసి, కేవలం దీనిపై పేరు ఉన్నంత మాత్రాన ఈ బాణం అర్జునునిదని చెప్పటానికి వీల్లేదంటాడు. భీష్మద్రోణులు – కేవలం పాండవులకు రాజ్యం కట్టబెట్టే ఉద్దేశ్యంతో అబద్ధం చెబుతుంటే, తనకు యుధిష్ఠిరుణ్ణి చూపాలని, యుధిష్ఠిరుణ్ణి చూసిన వెంటనే అర్ధరాజ్యం ఇచ్చివేస్తానని అంటాడు దుర్యోధనుడు.

ఇంతలో సభకు ఉత్తరుడు – యుధిష్ఠిరుని సందేశం తీసుకొని వచ్చాడు. ఉత్తరాభిమన్యుల వివాహ ఆహ్వానమే ఆ సందేశం.

ఇక యుధిష్ఠిరుడు విరాటరాజ్యంలో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం అదివరకే ద్రోణుడు చెప్పాడు; దరిమిలానే గోగ్రహణం జరిగింది. అందుచేత ద్రోణుడు – దుర్యోధనునితో – షరతు పూర్తయినట్టు, తాను ఐదురాత్రులలో పాండవుల జాడ కనుగొన్నట్టు చెప్పి, వారి రాజ్యాన్ని ఇచ్చివేసి తన గురుదక్షిణ చెల్లించమంటాడు.

దుర్యోధనుడు ఈ క్రింది శ్లోకం చెబుతూ పాండవుల రాజ్యాన్ని ఇచ్చివేయడంతో నాటకం ముగింపు.

బాఢం దత్తం మయా రాజ్యం పాండవేభ్యో యథాపురమ్।

మృతేపి హి నరాః సర్వే సత్యే తిష్ఠంతి తిష్ఠతి॥

“పాండవులకు ఇదివరకటిలా వారి అర్థరాజ్యాన్ని సంతోషంగా ఇచ్చేశాను. మరణం అన్నది ఉన్నా కూడా మనుషులు సత్యాన్ని పాలించాలి”.

***

నాటక కథ చదువుకున్నాం. ఇక సాహిత్యాంశాలను సావకాశంగా అనుశీలన చేద్దాం.

భాసుని మార్పులు, చేర్పులు.

మహాభారతకథలో విరాటపర్వంలో ఘట్టాన్ని స్వీకరించి, భాసుడు చాలా సునిశితమైన మార్పులతోనూ, కొన్ని చేర్పులతోనూ ఈ నాటకాన్ని రచించినాడు. క్లుప్తంగా వాటిని చూద్దాం.

  • అర్ధరాజ్యాన్ని దుర్యోధనుడు పాండవులకు తిరిగి ఇచ్చెయ్యటం – పూర్తిగా మహాభారత విరుద్ధం.
  • దరిమిలా దుర్యోధన పాత్ర ఉదాత్తమైనది. (దుర్యోధనుడు కేవలం గురుదక్షిణ సమర్పించుకొన్నాడు. కాబట్టి దుర్యోధనుని పాత్ర గొప్పతనం ఏమీ లేదని కొందరు విమర్శకులు.)
  • పంచరాత్రం – ఐదు రోజుల్లో పాండవుల ఉనికి కూడా నూత్నకల్పన.
  • దుర్యోధనుడు యజ్ఞం చెయ్యటం – ఇది మహాభారత్విరాటపర్వంలో లేదు కానీ ఘోషయాత్రపర్వంలో దుర్యోధనుడు వైష్ణవయజ్ఞం చేయటం ఉంది.
  • బీభత్సప్రధామైన కీచకవధ ఘట్టాన్ని మొత్తం కవి ఒక్క ప్రస్తావనలో కుదించినాడు.
  • అభిమన్యుడు కృష్ణుని తరపున దుర్యోధనుని యజ్ఞంలో పాల్గొనటానికి వచ్చినట్టు కల్పించాడు కవి.
  • ఉత్తరకుమారుడు ఈ రచనలో యోధుడు కాకపోయినా భీరువు కాడు. కొంతమేరకు ’సహృదయుడు’.
  • ఉత్తర రాకుమారి – బొమ్మపొత్తికలకై అన్న ఉత్తరుని అడుగడం, కంకుభట్టు (ధర్మరాజు) నుదుటిపై విరాటుడు పాచికలతో కొడితే రక్తం స్రవించటం, మాలిని (ద్రౌపది) కట్టుకట్టటం వంటివి కవి పరిహరించాడు. వీటిని పరిహరించటం ద్వారా నూత కల్పనగా నాటకాన్ని స్ఫురింపజేశాడు.
  • అభిమన్యుడు విరాటరాజుకు పట్టుబడడం ఈ కవి అద్భుత కల్పన. దీన్ని విస్తరించి ఉత్తరాభిమన్యుల వివాహం వరకూ కవి ఉపయోగించుకున్నాడు.

ఇలా ఓ ప్రముఖ ఇతిహాసంలో ఓ ఘట్టాన్ని తీసికొని వస్తునిర్వహణ లో ఎంతో చాకచక్యం చూపుతూ ఈ నాటకాన్ని మలచాడు భాసుడు.

భాసకవి ప్రత్యేకతలు:

దృశ్యకావ్యాలలో – స్పష్టంగా ఇతివృత్తాన్ని ఎన్నుకోవడానికి, దానిని అతిక్లుప్తమైన సంవిధానంలో రచించడానికి, మూలకావ్యాలలో లేని అనూహ్యమైన పాత్రచిత్రణకు, నాటకాన్ని సామాజిక రీతులకు అన్వయించడానికి, ఇతివృత్తాన్ని అద్భుతంగా దృశ్యబద్ధం చెయ్యడానికి, గొప్పవైవిధ్యభరితమైన నాటక సంవిధానంగా కూర్చడానికి – భాసుడు పెట్టింది పేరు. భాసుని వలే నాటకాన్ని అత్యంత ప్రతిభావంతంగా తీర్చిదిద్దటంలో సంస్కృతకవులెవ్వరూ సాటిరారు అంటే అతిశయోక్తి లేదు. తరువాతి కాలంలో సంస్కృతాన్ని కవికులతిలకుడు కాళిదాసు మొత్తంగా ఆక్రమించి ఇతరకవులను మరుగున పరచి ఉండవచ్చును కానీ, నిజానికి సంస్కృతనాటకాన్ని, భరతముని నిర్దేశించిన సంవిధానపు ఉద్దేశ్యాల మేరకు రచించి, రక్తికట్టించటమే కాక, నాటిసమాజానికి చేరువ చేసినది, సమాజరీతులను తన నాటకాల్లో ప్రతిఫలింపజేసినది, వినోదంతో బాటు నాటిసమాజానికి అంతో ఇంతో ఈ మాధ్యమం ద్వారా వికాసాన్ని అందజేసినది భాసకవి. కాళిదాసు గొప్పకవి, రొమాంటిసిస్టు, సృజనాత్మకుడు. అయితే భాసుడు గొప్ప నాటకకర్త. ఈయన దృక్పథమూ, విస్తృతీ వేరు. నిజానికి భాసుని తదనంతరపు కవులు, భాసుని అనుసరించి ఉంటే బహుశా నాటకకళ ఇంకా బలపడి ఉండేదేమో! భాసుని నాటకాల్లో కొన్ని అపూర్వమైన విషయాలను చూస్తే నాటకకళను ఆయన ఏ స్థాయికి తీసుకెళ్ళినాడో తెలుస్తుంది.

  • భాసుని దుర్యోధనుడు దుష్టుడు కాదు. ఓ హీరో.
  • భాసుని ప్రతిమానాటకంలో కైక – అమ్మల గన్న యమ్మ. త్యాగశీలి. వాల్మీకి కవి కైకను దుష్టపాత్రగా తీరిస్తే, భాసకవి ఆ పాత్ర తీరుతెన్నులనే మార్చేశాడు. రాముడి ప్రాణాలను కాపాడటానికి కైక – తన సొంతకొడుకైన భరతుని ప్రాణాలనే పణంగా పెడుతుంది.
  • సంస్కృతనాటకాల్లో ప్రధానపాత్రలు మాత్రమే సంస్కృతం మాట్లాడాలని నియమం. మిగిలిన పాత్రలు ప్రాకృతంలో ఉండాలి. భాసుని స్వప్నవాసవదత్తంలో ఓ అంకం అంతా ప్రాకృతమే. అంటే నాటకంలో నాలుగు అంకాల్లో ఓ ప్రధాన అంకం అంతా అప్రధాన పాత్రలతో, మొత్తంగా స్త్రీలతో నడిపాడాయన. ఇది కూడా చాలా అలవోకగా, పాఠకులకు ఆ విషయాన్ని స్ఫురింపజెయ్యకనే నడుపుతాడు కవి. ఇది నేడు మనకు సాధారణవిషయం కావచ్చు కానీ ఆయన కాలానికి అది గొప్ప సాహసం.
  • భాసుని అవిమారక నాటకంలో నాయకుడు – ద్విజేऽతరుడు. ఈ విధంగా ద్విజేऽతరుని నాయకుడుగా పెట్టటం నాటికాలంలో గొప్ప విషయమే.
  • భాసుని నాయకుడైన చారుదత్తుడు ఓ నిరుపేద. నిరుపేద నాయకుడు నాటకంలో నాయకుడవటం నాటికాలాన అనూహ్యం.
  • భాసుని ప్రతిజ్ఞాయౌగంధరాయణుని నాటకం – ఏ ఉదయనుడు, వాసవదత్తల కోసం జరుగుతుందో, ఆ పాత్రధారులు నాటకంలో కనిపించరు.
  • భాసుని ఘటోత్కచుడు – ఓ గొప్ప పాత్ర. రాక్షసుడైన ఆ పాత్రను రాయబారిగా పెట్టి ద్యూతఘటోత్కచం అన్న నాటకాన్ని భాసుడు రచించినాడు. అందులో ఆ పాత్రధారితో దుష్టత్వం జాతి రీత్యా రాదని, ప్రవర్తన వల్ల వ్యక్తులు రాక్షసులు అవుతారని అనిపిస్తాడాయన.
  • భాసుని మధ్యమవ్యాయోగం – గొప్ప చమత్కారభరితమైన, హాస్యరసప్రధానమైన నాటకం. ఇంత సునిశితమైన హాస్యాన్ని తర్వాతి కవులెవ్వరూ పోషించలేదంటే అతిశయోక్తి లేదు.
  • భాసుని స్వప్నవాసవదత్త నాటకం – Human Psychology కి ఓ భాష్యం. ఈ నాటకంలో స్వప్నవృత్తాంతం – నేటి Freudian analysis of dreams కు స్పష్టమైన దృష్టాంతంగా ఉందని Vijay Pandya అన్న ఓ విమర్శకుడు సోపపత్తికమైన వ్యాసం రచించినాడు.
  • పంచరాత్రమ్ – ఈ నాటకంలో స్త్రీపాత్రలే లేవు! బహుశా స్త్రీపాత్రలు లేని మొదటినాటకం ఇదే కావచ్చు. తర్వాతి రోజుల్లో ముద్రారాక్షసమ్ వంటి నాటకాలు వచ్చినై.

పైన పేర్కొన్న విషయాలు కొన్ని మాత్రమే. ఇలాంటి ఎన్నో విషయాలను పుసాల్కర్, రాఘవన్ వంటి విమర్శకులు సుదీర్ఘంగా వివరిస్తూ పుస్తకాలే వ్రాశారు. ఇటువంటి ఎన్నో అనూహ్యమైన, చమత్కారభరితమైన, అద్భుతమైన విషయాలతో బాటు, ఈయన పతాకాస్థానకాలను (Dramatic ironies), పాత్రోచితిని, క్లుప్తతను, పాత్రల స్వభావంలో గొప్ప సొగసును, అపూర్వమైన కవిత్వాన్ని కూడా పోషిస్తాడు. ఓ విధంగా చెప్పాలంటే ఈయన నాటకం – ఓ సంపూర్ణమైన రచనా ప్రక్రియ/ సంవిధానం.

పంచరాత్రమ్ – సమవకారము:

సంస్కృత దృశ్యకావ్యాలను “రూపకములు” అని సాధారణంగా ప్రస్తావించినప్పటికి, నిజానికి అవి పది రకాలు. వీటినే దశరూపకములు అన్నారు. అవి –

నాటకం సంప్రకరణం భాణః ప్రహసనం డిమః 

వ్యాయోగసమవకారౌ వీథ్యంకేహామృగా ఇతి

(దశరూపకం – 1.8)

నాటకం, సంప్రకరణము, భాణము, ప్రహసనము, డిమము, వ్యాయోగము, సమవకారము, వీథి, అంకము, ఈహామృగము అని రూపకాలు పదిరకాలు. ఈ లక్షణాలు నాయకుని బట్టి, రసపోషణను బట్టి, ఏర్పడినవి. ఈ రీతులలో ప్రస్తుతనాటకం పంచరాత్రమ్ అన్నది “సమవకారము” అన్న రూపకభేదానికి చెందినదని గణపతిశాస్త్రి గారు, రాఘవన్ గారు పేర్కొన్నారు. “సమవకీర్యన్తే అస్మిన్నర్థా యితి సమవకారః” అని వ్యుత్పత్తి. నాటకం యొక్క ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రూపకభేదంలో చక్కగా పరుచుకుని ఉంటాయట!

సమవకారము ముఖ్య లక్షణాలు:

  • ఇందులో దేవతలు దానవులు పాత్రధారులుగా ఉండాలి.
  • ఇతివృత్తం ప్రఖ్యాతమైనది అయి ఉండాలి.
  • పండ్రెండు మంది ముఖ్యపాత్రధారులు ఉండాలి. (ఈ నాటకపు నాందిలో పండ్రెండు మంది పాత్రధారులను ప్రస్తావించాడు భాసుడు)
  • ఫలప్రాప్తి ఒకటికంటే ఎక్కువసార్లు ఉండాలి.
  • నగర అవరోధము, యుద్ధము, (నిప్పు, గాలి ద్వారా సంభవించే) ఉపద్రవము అన్న మూడు అంశాలు ఉండాలి.
  • మూడు అంకాలు, మూడు కపటదృశ్యాలు, మూడు శృంగారప్రస్తావనలు ఉండాలి. (ఈ నాటకంలో శృంగారం లేదు)
  • వస్తువు మొదటి అంకంలో 24 ఘడియలు, రెండవ అంకంలో 8, మూడవ అంకాన 4 ఘడియల పాటూ ఉండాలి.

ఇవన్నీ సూచనలు. ఈ సూచనలు ఖచ్చితంగా పాటిస్తే కథ మిగలదు. అందుకని అయినంతవరకూ సూచనలు స్వీకరిస్తూనే, కొన్ని విషయాల్లో స్వేచ్ఛను పాటిస్తాడు నాటకకర్త.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here