Site icon Sanchika

భాసుని పంచరాత్రమ్

[box type=’note’ fontsize=’16’] “భాసుని వలే నాటకాన్ని అత్యంత ప్రతిభావంతంగా తీర్చిదిద్దటంలో సంస్కృతకవులెవ్వరూ సాటిరారు అంటే అతిశయోక్తి లేదు” అంటున్నారు అంటున్నారు రవి ఇ.ఎన్.వి.భాసుని పంచరాత్రమ్” వ్యాసంలో. [/box]

బాఢం దత్తం మయా రాజ్యం పాండవేభ్యో యథాపురమ్।

మృతేపి హి నరాః సర్వే సత్యే తిష్ఠంతి తిష్ఠతి॥” – దుర్యోధనుడు.

[dropcap]“పాం[/dropcap]డవులకు ఇదివరకటిలా వారి అర్థరాజ్యాన్ని సంతోషంగా ఇచ్చేశాను. మరణం అన్నది ఉన్నా కూడా మనుషులు సత్యాన్ని పాలించాలి.” – దుర్యోధనుడన్నాడు.

***

మహాభారతంలో దుర్యోధనుడే? పాండవుల వద్ద మాయాజూదంలో హరించిన రాజ్యం తిరిగి ఇచ్చివేయటమే? మనకు తెలిసిన మహాభారత ఇతిహాసంలో ఇలా లేదే? ఈ విపరీతకల్పన ఎక్కడిది? ఏ కవి కూర్పు యిది? ఆ సందర్భం ఏమిటి?

ఈ సందర్భం పంచరాత్రమ్ అనే మూడు అంకాల నాటిక చివరన వచ్చేది. ఇలా ఓ పాత్రను, ఓ ఇతిహాసాన్ని మూలమట్టంగా మార్చి స్వీయకల్పన చేయగలిగిన ధీరుడు సంస్కృతంలో బహుశా భాసకవి మాత్రమేనేమో. ఈ సందర్భం గురించి తెలియాలంటే పంచరాత్రమ్ అనే రూపకాన్ని (Sanskrit Drama) గురించి తెలుసుకోవాలి.

పంచరాత్రమ్ – రూపక కథ.

1.

జూదంలో ఓడిన పాండవులు నియమం మేరకు పదమూడేళ్ళ అరణ్యవాసాన్ని ముగించినారు. పదునాలుగవ యేడు అజ్ఞాతవాసంలో విరాటరాజు కొలువులో మారువేషాలలో చేరారు. అజ్ఞాతవాసం అయిపోవస్తున్నది. ఇక కొన్ని రోజులే మిగిలి ఉన్నై. ఆ సమయంలో ఇవతల హస్తినాపురంలో దుర్యోధనుడు ఓ గొప్ప యజ్ఞాన్ని చేశాడు. యజ్ఞానికి సామంతరాజులు, బ్రాహ్మణులు, ప్రజలు విచ్చేశారు. యజ్ఞం చాలా ఘనంగా జరిగింది. ఆ సందర్భాన దుర్యోధనుడు బ్రాహ్మణులకు ఏమి అడిగినా కాదనక దానాలు చేస్తున్నాడు. అప్పుడు ద్రోణుడు దుర్యోధనుడి వద్ద ఓ వరాన్ని యాచించాడు. ’పాండవులకు – వారికి చెందవలసిన రాజ్యభాగాన్ని వారికి ఇచ్చెయ్య’ మన్నదే ఆయన అభిమతం. దుర్యోధనుడి నోట పచ్చివెలక్కాయ పడినట్లయింది. అతడు శకునితో సంప్రదించినాడు. ఓ షరతు ప్రకారం ఆ కోరిక తీర్చగలనని ఒప్పుకున్నాడు. ఆ షరతు ఏమిటంటే, ఐదు రాత్రులలోపు అజ్ఞాతంలో ఉన్న పాండవుల ఉనికి ద్రోణుడు కనుక్కొని చెప్పాలి. ఈ షరతుకు హతాశుడైనాడు ద్రోణుడు. అరణ్యవాసం మొదలైనప్పటి నుంచి అంతదాకా ఎక్కడున్నారో తెలియని పాండవులను ఐదురోజుల్లో వెతికి కనుక్కోవడమా? ఎలా?

సరిగ్గా అప్పుడే ప్రతీహారి మత్స్యదేశం నుంచి ఓ వార్త తెచ్చాడు. ఆ దేశంలోని విరాటనగరంలో ఎవరో అజ్ఞాతవ్యక్తి కీచకుడిని, ఆతని నూర్గురు సోదరులను ఆయుధం లేకుండా మట్టుపెట్టాడట! ఈ వార్త విన్న భీష్ముడు – ఆ సోదరులను మట్టుపెట్టింది భీముడే అని, దరిమిలా పాండవులు విరాటరాజ్యంలో ఉండే అవకాశం ఉందని ఊహిస్తాడు. విరాటరాజు యజ్ఞానికి ఆహ్వానం పంపినా రాలేదు కాబట్టి ఆ నెపం మీద ఆతని గోవులను అపహరించి, తద్వారా పాండవులను బయటికి లాగవచ్చునని పథకం రచిస్తారు. అలా పాండవులను బయటకు తెస్తే, ద్రోణుడికిచ్చిన మాటమేరకు పాండవుల రాజ్యం తిరిగి ఇచ్చివెయ్యాలి, తద్వారా ధర్మం నిలుస్తుందని భీష్ముని తపన కూడా.

ఈ పథకం ప్రకారం వెంటనే విరాటనగరంపై దండయాత్ర మొదలవుతుంది.

2.

మత్స్యదేశం రాజధాని విరాటనగరం శివార్లలో గోపాలకులు ఆవులు కాచుకుంటున్నారు. వారు ఆనందంతో పాటలు పాడుకుంటూ నృత్యాలు చేసుకుంటూ, విరాటరాజు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఇంతలో ధార్తరాష్ట్రుల సైన్యం అనుకోకుండా వచ్చిపడి, గోవులను అపహరించింది. ఈ వార్తను భటులు కంచుకి (ఓ వృద్ధబ్రాహ్మణుడు) ద్వారా రాజుకు తెలియజేశారు.

వార్త విని రాజు మండిపడి, యుద్ధసన్నాహాలు మొదలెట్టమన్నాడు. అంతలో అక్కడికి బ్రాహ్మణరూపంలో ఉన్న యుధిష్ఠిరుడు వచ్చాడు. జరిగింది తెలుసుకున్నాడు. ఇంతలో భటుడు రాజు వద్దకు మరొక వార్తను తెచ్చాడు. యుద్ధానికి దుర్యోధనుడొక్కడే కాక, ద్రోణ, భీష్మ, జయద్రథ, శల్య, కర్ణ, శకుని, కృపాది వీరులు వచ్చారని, వారి ధ్వజాలను చూస్తూనే భయంతో గుండెలు బాసి పరిగెత్తుకొచ్చామని చెప్పాడు. ఇక జాప్యం తగదని, వెంటనే సూతుణ్ణి తన రథాన్ని, ధనుర్భాణాలను తెమ్మంటాడు విరాట రాజు. కానీ అప్పటికే ఉత్తరకుమారుడు బృహన్నలను రథసారథిగా చేసుకొని, ధార్తరాష్ట్రులను ఎదుర్కునేందుకు యుద్ధభూమికి వెళ్ళాడని తెలుస్తుంది. ఇది విని రాజు కంగారుపడతాడు, కానీ విరాటరాజు సమక్షంలోని బ్రాహ్మణరూపధారి కంకుభట్టు (యుధిష్ఠిరుడు) రాజుకు ధైర్యం చెబుతాడు.

కాసేపటికి మరొక భటుడు వచ్చి, ఉత్తరకుమారుని రథం యుద్ధభూమికి బదులు శ్మశానం వైపు వెళుతోందని విన్నవిస్తాడు. అసలు విషయం ఏమిటంటే – అర్జునుని గాండీవం శ్మశానంలో జమ్మిచెట్టుపై ఉంది. దాన్ని తెచ్చుకోవడానికే ఆ రథం అక్కడికి వెళుతోంది. ఈ కారణం తెలిసిన యుధిష్ఠిరుడు ధార్తరాష్ట్రులకు శ్మశానమే గతి అవుతుందని విరాటరాజుకు ధైర్యం చెబుతాడు. మరిన్ని వార్తలు కొనిరమ్మని సైనికుడిని పంపుతాడు రాజు.

అంతలో వారికి ఓ గొప్ప శబ్దం, యుద్ధసందోహం వినిపిస్తాయి.

సైనికుడు కాసేపటికి వార్తలు తెచ్చాడు. గొప్పయుద్ధం జరిగింది. యుద్ధంలో ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, ఇతరులు ఓడిపోయారు. కానీ ఒక్క అభిమన్యు కుమారుడు మాత్రం విక్రమింపసాగినాడు. యాదవ, పాండవ వంశజుడైన అభిమన్యునికి ఈ పరాక్రమం సహజమే కదా అంటాడు మహారాజు.

ఇంకాసేపటికి భటుడు విజయవార్త తెచ్చాడు. తమ గోవులు క్షేమమని, ధార్తరాష్ట్రులు వెనక్కు మళ్ళారని చెబుతాడు భటుడు. తన కుమారుని పరాక్రమం తలచి గర్విస్తాడు విరాటరాజు. బృహన్నల కూడా వెంట వెళ్ళాడుగా, అతణ్ణి ప్రవేశపెట్టమని అంటాడు మహారాజు.

అంతలో బృహన్నల అక్కడికి వచ్చి, రాజుకు జయం చెబుతాడు. రాజుకు యుద్ధవిశేషాలు వినిపిస్తుండగా, ఇందాకటి భటుడు వచ్చి, అభిమన్యుకుమారుణ్ణి మనవాళ్ళు బందీగా పట్టుకొన్నారని విన్నవిస్తాడు. తన సేనలో అభిమన్యుని పట్టుకునేంత వీరుడెవరబ్బా, కీచకుడు మరణించాడు కదా, అని ఆలోచించాడు రాజు. ఆ పట్టుకున్నది – వంటవాని రూపంలో ఉన్న తన అన్న భీమసేనుడేనని, అభిమన్యుడు ఓడిపోలేదని, భీముని ఆత్మీయమైన శరీరస్పర్శకు వశమైనాడని తనకు తాను చెప్పుకుంటాడు బృహన్నల. పట్టుబడిన యువరాజు అభిమన్యుని సగౌరవంగా తీసుకురమ్మని ఆదేశిస్తాడు మహారాజు.

యువరాజు అభిమన్యుడు సభలో బృహన్నలను, కంకుభట్టు రూపంలోని ధర్మరాజును చూసి ఆశ్చర్యపడతాడు. వారెవ్వరో మహాపురుషులన్న భావం అతనికి తడుతుంది. అంతలో అక్కడికి ఉత్తరకుమారుడు వచ్చాడు. అతడు – మర్యాదలన్నీ దక్కవలసినది బృహన్నలకనీ, ఆ బృహన్నల వేషంలో ఉన్నది అర్జునుడేనని, ఆతని మోచేతికి గాండీవం ధరించి ధరించి మచ్చ ఏర్పడిందని చూపిస్తాడు. జరిగింది గ్రహించి అభిమన్యుడు తన తండ్రులందరికి, విరాట రాజుకున్నూ అభివాదం చేస్తాడు. తనను తన రాజ్యాన్ని గెలిపించినందుకు తన అమ్మాయి ఉత్తరను అర్జునునికి బహుమతిగా ఇస్తాడు. అర్జునుడు ఆమెను అభిమన్యుని కోసమై స్వీకరిస్తాడు. అందరూ సంతోషిస్తారు. ఉత్తరాభిమన్యుల వివాహ నిశ్చితార్థం జరుగుతుంది. ఈ వార్తను భీష్మునికి చెప్పడానికి ఉత్తరకుమారుణ్ణి హస్తినాపురానికి పంపించాడు విరాటరాజు.

3.

విరాటరాజుకు పట్టుబడిన అభిమన్యుడిని వదిలి ధార్తరాష్ట్రులు, సేన అందరూ హస్తినకు వెనుదిరిగారు. అభిమన్యుడి రథసారథి కొలువుకు వచ్చాడు. ఆతడు అభిమన్యుడు శత్రువులకు ఎలా చిక్కాడో వివరించాడు. శత్రువర్గంలోని ఒక పదాతి-యోధుడు – ఒంటరిగా యుద్ధభూమికి నడుస్తూ వచ్చి, అభిమన్యుడిని తన చేతులతో బందీగా చేసి మత్స్యదేశానికి తీసికెళ్ళినాడు. రథసారథి చెప్పిన ఆనవాలుని బట్టి ఆ యోధుడు భీముడేనని పోల్చుకుంటారు భీష్మద్రోణులు. భీముని పరాక్రమం గురించి మాట్లాడుకుంటారు. శకునికి భీష్మద్రోణులు భీముని పొగడ్డం నచ్చదు. ఆతడు వారిని అవహేళన చేస్తాడు. అంతే కాక, ఉత్తరకుమారుడే – మారువేషంలోని అర్జునుడై ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తాడు.

అంతలో అక్కడికి భీష్ముని సారథి కూడా వచ్చాడు. ఆతని చేత ఓ అమ్ము ఉంటుంది. ఆ అమ్ముపై అర్జునుని పేరు చెక్కబడి ఉంది. ఆ బాణాన్ని అర్జునుడు భీష్ముని పాదాలకు నమస్కారసూచకంగా ప్రయోగించి ఉంటాడు. ఆ అమ్మును శకుని కూడా చూసి, కేవలం దీనిపై పేరు ఉన్నంత మాత్రాన ఈ బాణం అర్జునునిదని చెప్పటానికి వీల్లేదంటాడు. భీష్మద్రోణులు – కేవలం పాండవులకు రాజ్యం కట్టబెట్టే ఉద్దేశ్యంతో అబద్ధం చెబుతుంటే, తనకు యుధిష్ఠిరుణ్ణి చూపాలని, యుధిష్ఠిరుణ్ణి చూసిన వెంటనే అర్ధరాజ్యం ఇచ్చివేస్తానని అంటాడు దుర్యోధనుడు.

ఇంతలో సభకు ఉత్తరుడు – యుధిష్ఠిరుని సందేశం తీసుకొని వచ్చాడు. ఉత్తరాభిమన్యుల వివాహ ఆహ్వానమే ఆ సందేశం.

ఇక యుధిష్ఠిరుడు విరాటరాజ్యంలో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం అదివరకే ద్రోణుడు చెప్పాడు; దరిమిలానే గోగ్రహణం జరిగింది. అందుచేత ద్రోణుడు – దుర్యోధనునితో – షరతు పూర్తయినట్టు, తాను ఐదురాత్రులలో పాండవుల జాడ కనుగొన్నట్టు చెప్పి, వారి రాజ్యాన్ని ఇచ్చివేసి తన గురుదక్షిణ చెల్లించమంటాడు.

దుర్యోధనుడు ఈ క్రింది శ్లోకం చెబుతూ పాండవుల రాజ్యాన్ని ఇచ్చివేయడంతో నాటకం ముగింపు.

బాఢం దత్తం మయా రాజ్యం పాండవేభ్యో యథాపురమ్।

మృతేపి హి నరాః సర్వే సత్యే తిష్ఠంతి తిష్ఠతి॥

“పాండవులకు ఇదివరకటిలా వారి అర్థరాజ్యాన్ని సంతోషంగా ఇచ్చేశాను. మరణం అన్నది ఉన్నా కూడా మనుషులు సత్యాన్ని పాలించాలి”.

***

నాటక కథ చదువుకున్నాం. ఇక సాహిత్యాంశాలను సావకాశంగా అనుశీలన చేద్దాం.

భాసుని మార్పులు, చేర్పులు.

మహాభారతకథలో విరాటపర్వంలో ఘట్టాన్ని స్వీకరించి, భాసుడు చాలా సునిశితమైన మార్పులతోనూ, కొన్ని చేర్పులతోనూ ఈ నాటకాన్ని రచించినాడు. క్లుప్తంగా వాటిని చూద్దాం.

ఇలా ఓ ప్రముఖ ఇతిహాసంలో ఓ ఘట్టాన్ని తీసికొని వస్తునిర్వహణ లో ఎంతో చాకచక్యం చూపుతూ ఈ నాటకాన్ని మలచాడు భాసుడు.

భాసకవి ప్రత్యేకతలు:

దృశ్యకావ్యాలలో – స్పష్టంగా ఇతివృత్తాన్ని ఎన్నుకోవడానికి, దానిని అతిక్లుప్తమైన సంవిధానంలో రచించడానికి, మూలకావ్యాలలో లేని అనూహ్యమైన పాత్రచిత్రణకు, నాటకాన్ని సామాజిక రీతులకు అన్వయించడానికి, ఇతివృత్తాన్ని అద్భుతంగా దృశ్యబద్ధం చెయ్యడానికి, గొప్పవైవిధ్యభరితమైన నాటక సంవిధానంగా కూర్చడానికి – భాసుడు పెట్టింది పేరు. భాసుని వలే నాటకాన్ని అత్యంత ప్రతిభావంతంగా తీర్చిదిద్దటంలో సంస్కృతకవులెవ్వరూ సాటిరారు అంటే అతిశయోక్తి లేదు. తరువాతి కాలంలో సంస్కృతాన్ని కవికులతిలకుడు కాళిదాసు మొత్తంగా ఆక్రమించి ఇతరకవులను మరుగున పరచి ఉండవచ్చును కానీ, నిజానికి సంస్కృతనాటకాన్ని, భరతముని నిర్దేశించిన సంవిధానపు ఉద్దేశ్యాల మేరకు రచించి, రక్తికట్టించటమే కాక, నాటిసమాజానికి చేరువ చేసినది, సమాజరీతులను తన నాటకాల్లో ప్రతిఫలింపజేసినది, వినోదంతో బాటు నాటిసమాజానికి అంతో ఇంతో ఈ మాధ్యమం ద్వారా వికాసాన్ని అందజేసినది భాసకవి. కాళిదాసు గొప్పకవి, రొమాంటిసిస్టు, సృజనాత్మకుడు. అయితే భాసుడు గొప్ప నాటకకర్త. ఈయన దృక్పథమూ, విస్తృతీ వేరు. నిజానికి భాసుని తదనంతరపు కవులు, భాసుని అనుసరించి ఉంటే బహుశా నాటకకళ ఇంకా బలపడి ఉండేదేమో! భాసుని నాటకాల్లో కొన్ని అపూర్వమైన విషయాలను చూస్తే నాటకకళను ఆయన ఏ స్థాయికి తీసుకెళ్ళినాడో తెలుస్తుంది.

పైన పేర్కొన్న విషయాలు కొన్ని మాత్రమే. ఇలాంటి ఎన్నో విషయాలను పుసాల్కర్, రాఘవన్ వంటి విమర్శకులు సుదీర్ఘంగా వివరిస్తూ పుస్తకాలే వ్రాశారు. ఇటువంటి ఎన్నో అనూహ్యమైన, చమత్కారభరితమైన, అద్భుతమైన విషయాలతో బాటు, ఈయన పతాకాస్థానకాలను (Dramatic ironies), పాత్రోచితిని, క్లుప్తతను, పాత్రల స్వభావంలో గొప్ప సొగసును, అపూర్వమైన కవిత్వాన్ని కూడా పోషిస్తాడు. ఓ విధంగా చెప్పాలంటే ఈయన నాటకం – ఓ సంపూర్ణమైన రచనా ప్రక్రియ/ సంవిధానం.

పంచరాత్రమ్ – సమవకారము:

సంస్కృత దృశ్యకావ్యాలను “రూపకములు” అని సాధారణంగా ప్రస్తావించినప్పటికి, నిజానికి అవి పది రకాలు. వీటినే దశరూపకములు అన్నారు. అవి –

నాటకం సంప్రకరణం భాణః ప్రహసనం డిమః 

వ్యాయోగసమవకారౌ వీథ్యంకేహామృగా ఇతి

(దశరూపకం – 1.8)

నాటకం, సంప్రకరణము, భాణము, ప్రహసనము, డిమము, వ్యాయోగము, సమవకారము, వీథి, అంకము, ఈహామృగము అని రూపకాలు పదిరకాలు. ఈ లక్షణాలు నాయకుని బట్టి, రసపోషణను బట్టి, ఏర్పడినవి. ఈ రీతులలో ప్రస్తుతనాటకం పంచరాత్రమ్ అన్నది “సమవకారము” అన్న రూపకభేదానికి చెందినదని గణపతిశాస్త్రి గారు, రాఘవన్ గారు పేర్కొన్నారు. “సమవకీర్యన్తే అస్మిన్నర్థా యితి సమవకారః” అని వ్యుత్పత్తి. నాటకం యొక్క ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రూపకభేదంలో చక్కగా పరుచుకుని ఉంటాయట!

సమవకారము ముఖ్య లక్షణాలు:

ఇవన్నీ సూచనలు. ఈ సూచనలు ఖచ్చితంగా పాటిస్తే కథ మిగలదు. అందుకని అయినంతవరకూ సూచనలు స్వీకరిస్తూనే, కొన్ని విషయాల్లో స్వేచ్ఛను పాటిస్తాడు నాటకకర్త.

నాంది:

సంస్కృతనాటకాలు ప్రదర్శించే రోజుల్లో, నాటకం ఆరంభించడానికి ముందు సుదీర్ఘమైన తతంగం ఉండేది. అందులో భాగంగా అవిఘ్నం కోసం దేవతాప్రార్థన, జ్యోతిప్రజ్వలనం, నటీనటుల అలంకరణ, ధ్రువాగానాలు పాడటం వగైరా. ఈ వ్యవహారానికి పూర్వరంగం అని పేరు.

యన్నాట్యవస్తునః పూర్వం రంగవిఘ్నోపశాంతయే

కుశీలవాః ప్రకుర్వంతి పూర్వరంగం స ఉచ్యతే

ఏదైతే నాట్యవస్తువుకు ముందు రంగస్థలంలో ఆపదలు తొలగిపోవడానికి ఉద్దేశించబడి, నటులచేత ఆచరించబడుతుందో దానిని పూర్వరంగం అందురు. (కుశీలవులు – అంటే నాటకంలో పాత్రధారులు)

భరతుడు తన నాట్యశాస్త్రంలో 4,5 అధ్యాయాలలో ఈ పూర్వరంగాన్ని గురించి సుదీర్ఘంగా వివరించి ఉన్నాడు.(ఈ రోజుకూ ఈ పూర్వరంగపు ఛాయలు – కథకళి ప్రదర్శనలో కనిపిస్తాయి. కథకళి ప్రదర్శనలో ఆటకు ముందు నటకుల అలంకరణ, దీపం వెలిగించటం వంటివి జరుపుతారు.) ఈ పూర్వరంగం ముగిసిన తర్వాత నాటకం ఆరంభమయ్యేది. ఈ ఆరంభానికి పేరు ‘నాంది’.

భాసుని నాటకాలలో పూర్వరంగం తర్వాతి నాటకప్రదర్శనను – సూత్రధారుడే (Stage Manager) ఆరంభిస్తాడు. “నాంద్యంతే తతః ప్రవిశతి సూత్రధారః” అన్న నిర్దేశంతో ఈ నాటకాలు ఆరంభమవుతాయి. పైన శ్లోకంలో నటులు పూర్వరంగాన్ని ఆచరిస్తారని చెప్పాడు సూత్రకారుడు (భరతుడు). భాసనాటకం భరతుని నిర్దేశానికి వ్యతిరేకంగా ఉంది!

ఈ నిర్దేశం సంస్కృతనాటకాలలో చాలా ప్రాచీనమైన నాటకాల్లో మాత్రమే కనిపిస్తుంది. (నేడు మనకు దొరుక్తున్న నాటకాల్లో భాసనాటకాలు, చతుర్భాణి లో మాత్రమే ఈ నిర్దేశం కనిపిస్తోంది) తర్వాతి కాలంలో వచ్చిన సంస్కృతనాటకాలలో నాందిని (నటుడు) చదివి ముగించిన తరువాత సూత్రధారుడు రంగంపై ప్రవేశించి నాటకపరిచయాన్ని, రచయిత పరిచయాన్ని ఆరంభిస్తాడు.

నాందిలో భాగంగా ఆశీర్వచన సంయుక్తంగా శ్లోకం ఉంటుంది. శ్లోకాన్ని చదువుతాడు సూత్రధారుడు. అది నాటకంలో పాత్రల గురించి కానీ, ఏదేని ఋతువు గురించి కానీ అయి ఉంటుంది. (చతుర్భాణిలో ఋతువర్ణన ఉంది)

పంచరాత్రమ్ లో ఆరంభశ్లోకం (నాందిశ్లోకం) ఇది.

ద్రోణః పృథివ్యర్జునభీమదూతో యః కర్ణధారః శకునీశ్వరశ్చ

దుర్యోధనో భీష్మయుధిష్ఠిరః స పాయాత్ విరాడుత్తరగోభిమన్యుః

ఇలా పాత్రధారులపేర్లను శ్లోకంలో ఉపయోగిస్తే, ఆ ప్రక్రియను ముద్రాలంకారం అని అంటారు.

పృథివ్యర్జున భీమదూతః = తేజోవంతమై, భీకరుడైన భూమిపై దూత;(భీమార్జునుల సందేశమును కౌరవులకు చేర్చిన భూమిపతి); ద్రోణః = మేఘమువంటివాడు (శ్రీకృష్ణుడు); శకునీశ్వరశ్చ = పక్షిరాజు గరుత్మంతుని యొక్క; (శకుని అంటే పక్షి); కర్ణధారః = వాహనము నడుపువాడై; యః = ఎవడు (కలడో); దుర్యోధనః = శత్రువులచేత జయించుటకు దుష్కరుడైన వాడు; (దుష్కరం శత్రుభిః యోధనం యస్య); యుధిష్ఠిరుడు = స్థిరముగా యుద్ధము చేయుటయందు నేర్పరి యగు; ఉత్తరగః = ఉత్తమ కార్యముల నాచరించుచు; అభిమన్యుః = యజ్ఞకర్త్రియైన; సః విరాట్ = ఆ విరాట్పురుషుడు; పాయాత్ = రక్షించుగాక!

తాత్పర్యము: యజ్ఞకర్త్రియైన విరాట్పురుషుడు మనలను కాపాడుగాక! ఆ విరాట్పురుషుడెట్టివాడు? తేజస్వి, భీకరుడు, భూమిపై యవతరించిన దేవదూత,మేఘము వంటివాడు, పక్షిరాజు గరుడుని వాహనముగా కలిగినవాడు, శత్రువులచే జయింప నశక్యుఁడు, యుద్ధమునందు స్థిరముగా నుండువాడు, ఉత్తమకార్యమగ్నుడు.

మహాభారతంలోని పాత్రల పేర్లతో అల్లిన విరాట్పురుషుని యొక్క స్తుతి ఈ శ్లోకం. ఇందులో పదకొండు పాత్రధారులు ఉన్నారు. ద్రోణుడు, అర్జునుడు, భీముడు, కర్ణుడు, శకుని, దుర్యోధనుడు, భీష్ముడు, యుధిష్ఠిరుడు, విరాటుడు, ఉత్తరుడు, అభిమన్యుడు. ఈ శ్లోకంలో లేకుండా, నాటకంలో ఉన్న మరొక ముఖ్యపాత్ర బృహన్నల. బృహన్నల – అర్ధనారీశ్వరుడు కాబట్టి ఆతణ్ణి ఈ శ్లోకాన ప్రస్తావించనట్లు కనబడుతున్నది. పాత్రధారులను కాక వారి పేర్ల తాలూకు వ్యుత్పత్తితో అల్లిన శ్లోకం ఇది. నాటకం తాలూకు నాందిలో ఈ పద్ధతికి బహుశా భాసుడే నాంది అయి ఉండవచ్చు.

***

సంస్కృత/ప్రాకృత భాషలలోని నాటకసాహిత్యంలో నాటకకళలో నిష్ణాతుడైన కవి భాసుడు. ఈయన నాటకాలను బాగా అధ్యయనం చేస్తే, నేటి కాలంలో కూడా ఒక కథను దృశ్యంగా ఎలా చెప్పవచ్చు, పాత్రలను ఎంత అద్భుతంగా మలచవచ్చు అని అర్థం అవుతుంది. ఈ కవి వ్రాసిన నాటకాలు పరిమాణరీత్యా కొంచెం చిన్నవి. అయినప్పటికీ, ఈయన వస్తునిర్వహణ అత్యద్భుతంగా ఉంటుంది. ఈయన కాళిదాసుకన్నా ఎంతో పాతకాలపు కవి. బహుశా చాణక్యుని కన్నా కాస్త ముందువాడై ఉండే అవకాశం ఉంది. ఈ కాలంలోనే నాటకానికి కావలసిన విషయాలను ఈయన ఎంత ఘనంగా తన నాటకాలలో పొదిగాడో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.

సాధారణంగా దృశ్యసంవిధానానికి కావలసింది క్లుప్తత. నాటకంలో పాత్రల సంఖ్య పరిమితంగా ఉండాలి. పంచరాత్రంలో ఈయన కావాలనే నకులసహదేవుల పాత్రలను వదిలివేశాడు.

పాత్రలు, పాత్రౌచిత్యం:

సాధారణంగా పాత్రల నిర్వహణ విషయంలో మనకు రెండు రకాల సంవిధానాలు కనిపిస్తాయి.మొదటి పద్ధతిలో పూర్తీగా నాటకరచయిత భావాలకు అనుగుణంగా పాత్రలు నడయాడటం. అంటే పాత్రలు – కవి భావాలను ఊపిరిపోసుకుని ప్రవర్తిస్తుంటాయి. కవి రొమాంటిసిస్టు అయితే, రచనలో పాత్ర కూడా ఆ లక్షణాన్ని పొందుపర్చుకుంటుంది. కాళిదాసు విక్రమోర్వశీయం ఇందుకు ప్రధానమైన ఉదాహరణ. మేఘదూతం కూడా. ఇంకా, ఈ పద్ధతిలో కవికి కొన్ని విషయాలలో ఆర్తి ఉంటే ఆ విషయాలు నాటకంలో ప్రతిఫలిస్తాయి. శాకుంతలంలోని దుష్యంతుడు పసిబిడ్డలపై, వారి తల్లిదండ్రులపై ఒక అపూర్వమైన శ్లోకం చెప్పాడు. “అలక్ష్యదంత ముకుళాననిమిత్తహాసైః..” అన్న ఆ శ్లోకం – కాళిదాసు నిజజీవితానికి చెందినదేనని, ఆయన మనసులోంచే ఆ భావం వచ్చిందని తిరుమల రామచంద్ర వంటి విమర్శకుల అభిప్రాయం.

మరొక సంవిధానం ప్రకారం – కవి/రచయిత – పాత్రల ప్రవర్తన మూలకావ్యం ప్రకారం ఎలా ఉన్నదో, ఎలా ఉండాలో ఆ స్వభావాన్ని తాను సమగ్రంగా అధ్యయనం చేసి, ఆ పాత్రను కావ్యానికి, కావ్యవాతావరణానికి అనుగుణంగా తీర్చిదిద్దుతాడు. తన భావాలను కావ్యంలో జొప్పించటం ఉండదు. ఒకవేళ ఉన్నా, అది చాలా క్లుప్తంగా మాత్రమే ఉంటుంది. భాసుని భీముడు, దుర్యోధనుడు, కర్ణుడు, అభిమన్యుడు ఇత్యాది పాత్రలు ఇందుకు ఉదాహరణ. ఈ సంవిధానానికి చెందిన మరొక కవి శూద్రకుడు. అయితే ఒక్కొక్కసారి పాత్రల స్వభావంలో – మూలకావ్యానికి విరుద్ధమైన స్వభావాన్ని ప్రతిపాదించటంలో కూడా కవి వెనుకాడడు. ఈ విషయం పైన చెప్పుకున్నాం.

పంచరాత్రంలో దుర్యోధనుడు కూడా ఉదాత్తమైన పాత్ర. అందుకనే నాటకం చివరన అనుకున్నట్టుగా ద్రోణునికి గురుదక్షిణగా పాండవులకు అర్ధరాజ్యాన్ని కట్టబెట్టేశాడు. అంతే కాదు, దుర్యోధనుని సమరనీతి కూడా ఓ చోట ఉదాత్తంగా చిత్రీకరిస్తాడు కవి. ఆ ఉదంతం ఇది.

గోగ్రహణం లో భాగంగా విరాటరాజుపైకి కౌరవసేన దండెత్తింది.ఈ సేనలో భాగంగా అభిమన్యుడు కూడా యుద్ధానికి వెళ్ళాడు. అభిమన్యుడు శత్రువులకు బందీగా చిక్కాడని సూతుని ద్వారా తెలుస్తుంది రారాజుకు. ఆ సందర్భాన ఆయన అంటాడు.

“సూత! చెప్పు చెప్పు, ఎవరు అభిమన్యపుత్రుని బందీ చేశారు. నేను పూనుకొని విడిపిస్తాను. ఎలా అంటావా?”

మమ హి పితృభిరస్య ప్రస్తుతో జ్ఞాతిభేదః తదిహ మమ చ దోషో వక్తృభిః పాతనీయః 

అథ చ మమ స పుత్రః పాండవానాం తు పశ్చాత్ సతి చ కులవిరోధే నాపరాధ్యంతి బాలాః

“నాకు, అభిమన్యుని తండ్రికి జ్ఞాతిభేదం ఉంది, కానీ అభిమన్యుడు నా సేనలో ఉన్నాడు కనుక అతడు మొదట నా పుత్రుడు, ఆ తర్వాతనే పాండవసుతుడు. ఆతడు బందీ అయితే అది నా దోషం అవుతుంది. మా కులవిరోధుల (విరాటరాజు) చేత ఆ బాలుడు బాధింపబడరాదు.”

చాలా సూక్ష్మంగా దుర్యోధనుని రాజనీతిని అందరి ముందు చెప్పించిన శ్లోకం ఇది. ఈ ఒక్క శ్లోకంతో దుర్యోధనుని పాత్ర చాలా ఎత్తుకు ఎదిగేలా చేస్తాడు కవి.

నిజానికి ఈ నాటకంలో దుర్యోధనునికి, కర్ణపాత్రకు ఎక్కువ Scope లేదు. అయినప్పటికీ, అవకాశం దొరికినప్పుడు, ఔచిత్యం చెడకుండానే కవి (నాటకరచయిత), ఆయా పాత్రల స్వభావాన్ని ఉత్కృష్టంగా నిర్వహిస్తాడు. భీముని పాత్ర సరేసరి. ఆతని పరాక్రమాన్ని ఎంతో సున్నితంగానూ, అద్భుతంగానూ చెపుతాడు కవి. అందులో కొంత ఈ లంకెలో తీరిగ్గా చదువుకొనండి.

కథానిర్వహణలో భాగంగా ఓ చిన్న విషయాన్ని కూడా ఉపయోగించుకుని పాత్ర స్వభావాన్ని తీర్చిదిద్దడంలో ఈ కవి నేర్పు సూక్ష్మమైనది, రోచకమైనది.

మూడవ అంకంలో, భీష్ముని రథసారథి ఓ బాణాన్ని తీసుకుని భీష్ముని వద్దకు వస్తాడు. బాణంపై ఏ పేరు వ్రాసి ఉంటుందో, అతడే ఆ బాణాన్ని ప్రయోగించి ఉంటాడు. భీష్ముడు తను వృద్ధుడయాడు కాబట్టి శకునికి ఆ అమ్మును ఇచ్చి దానిపై పేరు చదవమంటాడు. శకుని ఆ బాణాన్ని నిరసనగా చూసి, “అర్జునుని బాణం’ అని చెప్పి విసిరి వేస్తాడు. అది సరిగ్గా ద్రోణుని పాదాలపై పడుతుంది.

ద్రోణుడు ఇలా అంటాడు. “ఆ బాణాన్ని నా శిష్యుడు అర్జునుడు భీష్మపితామహులకు నమస్కార సూచకంగా ఆయన పాదాల వద్ద వేశాడు. ఇప్పుడా బాణం తన గమ్యాన్ని (గురువు పాదాలను) కూడా చేరింది“.

చాలా చిన్న ఘట్టం. కానీ ద్రోణుని శిష్యవాత్సల్యం, శకుని నిరసన, భీష్ముని వృద్ధాప్యం – ఇన్నిటిని పొదిగాడు కవి!

పతాకాస్థానకాలు (Dramatic Ironies):

భాసుని ప్రత్యేకతలలో చెప్పుకోవలసింది Dramatic ironies. వీటిని పతాకాస్థానకాలు అంటారు. అంటే ఏం జరుగబోతోందో/పాత్ర స్వభావం/కొన్ని నిజాలు ఏమిటో ప్రత్యక్షంగా కాక పాత్రల మాటల్లో పరోక్షంగా దొర్లేలా చెప్పటం. కావ్యసాహిత్యంలో ఇటువంటి వాటిని “వక్రోక్తులు” గా పేర్కొంటే, దృశ్యకావ్యాలకు సంబంధించి ఇవి ’పతాకాస్థానకాలు’.

భీష్మద్రోణులు అభిమన్యుని ఎత్తుకెళ్ళిన శత్రు వీరుణ్ణి పొగుడుతూ ఉంటారు. ఆతడెవరనేది అప్పటికి తెలియలేదు. ఆ సందర్భాన రారాజుకు చిర్రెత్తి, ఇలా అంటాడు.

కిమర్థం స్తూయతే కోపి భవతా గర్వితాక్షరైః

కథ్యతాం నాస్తి మే త్రాసో యద్యేష పవనో జవే  (3.9)

“ఎందుకు మీరు, ఎవరినైనా అతిశయోక్తులతో పొగడుతారు? మీరు ఇంతగా చెప్పినా, ఆతడికి ’వాయుదేవుడి’కున్న వేగం ఉన్నా, నాకు మాత్రం ఆతడిపై భయం లేదు.”

‘పవనో జవే’ – అన్నది వక్రోక్తి. అతడు ఎవరిని ఉద్దేశిస్తున్నాడో, ఆతడు (భీముడు) వాయుసుతుడే కాక, వాయువుకున్నంత వేగం కలవాడే. ఇక్కడ దుర్యోధనుని పాత్ర తనకు తెలియకనే ఒక సత్యాన్ని నాటకంలో ఇతరపాత్రలకు కూడా చెప్పక, నేరుగా ప్రేక్షకులకు చెబుతోంది!

రెండవ అంకంలో – భటుడు విరాట రాజు వద్దకు వచ్చి యుద్ధరంగం గురించి విన్నవిస్తాడు. బృహన్నల, ఉత్తరకుమారుల రథం శ్మశానం వైపు వెళుతోందని అంటాడు. పక్కన కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజుకు విషయం అర్థమవుతుంది. అజ్ఞాతవాసానికి మునుపు పాండవులు తమ ఆయుధాలను శ్మశానంలో ఉన్న శమీ వృక్షంపైన దాచి ఉంచారు. ఆ ఆయుధాలలో నుంచి తన ఆయుధమైన గాండీవాన్ని తీసుకుందుకే బృహన్నల రూపంలోని అర్జునుడు శ్మశానానికి వెళుతున్నాడు. రాజు ఖంగారు పడుతుంటే, యుధిష్ఠిరుడంటాడు.

“…..ధార్తరాష్ట్రాః స్థితా యత్ర శ్మశానం తద్ భవిష్యతి।” – “..ధార్తరాష్ట్రులు ఎక్కడ ఉంటే శ్మశానం అక్కడే అవుతుంది.”

ధార్తరాష్ట్రులు – అంటే ఆహారం కోసం లేదా నివాసం కోసం రాష్ట్రాలు దాటిపోయేవి – ’పక్షులు’ అని కూడా సంస్కృతంలో అర్థం.

ధర్మరాజు చెప్పిన ఈ మాటలోనూ అర్జునుని విజయం తథ్యం అనే సూచన దాగి ఉంది. అతి క్లుప్తంగానూ, చమత్కారంగానూ, రాజుకు ధైర్యం చెబుతున్నట్టుగానూ, భవిష్యసూచనగానూ కవి పాత్ర చేత చెప్పించిన వాక్యం ఇది!

ఇటువంటివి అక్కడక్కడా నాటకం మధ్యలో మెఱుపుల్లా భాసకవి నాటకంలో వస్తూనే ఉంటాయి.

భాసుని కవిత్వం:

జయదేవుడనే ఓ కవి సంస్కృతకవుల గురించి ఒక అభాణకం వ్రాశాడు.

యస్యాశ్చోరః చికురనికురో కర్ణపూరో మయూరః

భాసో హాసః కవికులగురుః కాళిదాసో విలాసః 

హర్షో హర్షః హృదయవసతిః పంచబాణస్తు బాణః

కేషాం నైషా కథయ కవితాకామినీ కౌతుకాయ

కవితాకన్యక యొక్క కురులు చోరకవి. కర్ణాభరణం మయూరకవి. భాసుడు చిఱునగవు. కవికులగురువైన కాళిదాసు ఆమె విలాసం. హర్షుదు ఆమె ఆనందం. ఆమె హృదయంలో నివసించే మన్మథుడు బాణుడు. ఇలాంటి కవితాకన్యక ఎవరిని అలరించదు?

మన వ్యాసంలో ప్రస్తావింపబడే భాసకవి – కవితాకన్యక చిఱునగవు. చిఱునగవు – చక్కని స్నేహానికి చిహ్నం. స్నేహం అంటే కూడా తెలుపే కదా! భాసకవిత ఓ చక్కని స్నేహితుడు. ఈ స్నేహితుడు ఎంత గొప్పవాడైనా, మన స్థాయిలోనే ఉంటాడు. మనకు మంచీ, చెడూ చెబుతాడు. (చూపుతాడు). కవిత్వం ద్వారా దృశ్యాన్ని చూపడం భాసుడు సిద్ధహస్తుడు. ఈయన – గొప్ప దర్శకుడు. అందుకనే భాసకవి తన రచనలను అన్నిటినీ నాటకాలుగానే రచించినాడు. భాసకవితలో ఈ స్వభావాన్ని మనం కాళిదాసుతో పోల్చి మాట్లాడుకుందాం. ఇందుకు మన భూమిక పంచరాత్రమ్ – అనబడే మహాభారత విరాటపర్వం ఘట్టాన్ని అనుసరించిన నాటకం.

దుర్యోధనుడు గొప్ప యజ్ఞం చేశాడు. ఎందరో ద్విజులు ఈ యజ్ఞంలో పాల్గొన్నారు. ఆ యజ్ఞప్రభావం ఇలా ఉంది.

ద్విజోచ్ఛిష్టైరన్నైః ప్రకుసుమితకాశా ఇవ దిశో

హవిర్ధూమైః సర్వే హృతకుసుమగంధాస్తరుగణాః 

మృగైస్తుల్యా వ్యాఘ్రా వధనిభృతసింహాశ్చ గిరయో

నృపే దీక్షాం ప్రాప్తే జగదపి సమం దీక్షితమివ

ద్విజోచ్ఛిష్టైః = ద్విజులు వదలివేసిన; అన్నైః = అన్నముతో; దిశాః = దిక్కులు; ప్రకుసుమితకాశాః ఇవ = విచ్చిన రెల్లుగడ్డి వలె; (ఉన్నవి) హవిర్ధూమైః = యజ్ఞధూళిచేత; సర్వే తరు గణాః = వృక్షములన్నియూ; హృతకుసుమగంధాః = సుగంధము కోల్పోయినవిగా; (ఐనవి)వ్యాఘ్రాః = పులులు; మృగైః తుల్యాః = జింకలవలె (సాధువులైనవి); వధనిభృత సింహా చ = వేటను వదలిన సింహములునూ; గిరయః = గుట్టలవలె (నిశ్చలముగా ఐనవి); దీక్షాం ప్రాప్తే = దీక్ష వహించిన; నృపే = దుర్యోధనుని యందు; సమం దీక్షితమివ = సమముగా దీక్ష వహించినయట్లు; జగత్ అపి = ప్రపంచమునూ; పరిణమించినది;

యజ్ఞంలో ద్విజుల చేత వదలబడిన (బలి) యన్నము తో దిక్కులన్నీ రెల్లుగడ్డిలా ప్రకాశిస్తున్నాయి. యాగధూళి అంతటా వ్యాపించి, వృక్షాలనుండి వచ్చే సుగంధాన్ని మరుగు పరుస్తున్నాయి. పులులు హింస మానేసి జింకల్లా సాధువులుగా అయ్యాయి. సింహాలు నిశ్చలంగా గుట్టల్లా ఉన్నవి. రాజుతో బాటు సకలప్రపంచమూ సమంగా దీక్షవహించినట్టు ఉన్నది.

ఇద్దరు పాత్రలు మాట్లాడుకుంటుండగా ఆ ప్రస్తావన లోని శ్లోకం యిది. ఈ శ్లోకంలో మొదటిపాదం తాలూకు ఉపమాలంకారం – ఊహకు అందగలిగే దృశ్యబద్ధమైనచిత్రం. మూడవ నాలుగవ పాదాలు – కాళిదాసు శాకుంతలంలో మునివాటికల వర్ణనకు కొంతమేర పెట్టుబడి.

ఇదే ఘట్టంలో మరొక శ్లోకం ఎంత నవనవోన్మేషంగా ఉందో చూడండి.

ఏతే వాతోద్ధతా వంశాః దహ్యమానాః మఖాగ్నినా 

భాగ్యానీవ మనుష్యాణామున్నమతి నమంతి చ

యజ్ఞం చేస్తూ, యజ్ఞకీలలకు దొరికిన కలపను వెదుళ్ళనూ హవిస్సుగా ఆహుతిస్తున్నారు. ఆ ద్రవ్యంలో భాగంగా వేణువులు కూడా దహింపబడుతున్నాయి. వేణువుల గొట్టాలలో ఒకవైపు నుండి ప్రవేశించిన అగ్ని – గొట్టం తాలూకు మరొకవైపు నుంచి బయటకు వస్తూ, మధ్యలో కన్నాలు ఉండటంతో వాటి నుంచి వినిర్గతమవుతోంది. ఆ క్రమంలో భాగంగా అగ్ని, వేణువుల తాలూకు వెదురుగొట్టాలలో ఉన్నట్టుండి వెలుగుతూ, ఉన్నట్టుండి ఆరిపోతూ – మానవుల సంపద లాగా పెరుగుతూ తరుగుతూ ఉంది.

ఈ శ్లోకంలో వస్తువు ఎంత విభిన్నంగా ఉందో మనం గమనింపవచ్చు. అగ్నికీలలు వెదురుగొట్టాలలో అల్లల్లాడుతో కన్నాలలో, ఒక్కోసారి ఇవతల వైపు నుంచీ వెలుగుతూ, ఆరుతూ పోవడం – ఊహించుకోవలసిందే!

***

ఉపమా కాళిదాసస్య” అని కాళిదాస కవికి బిరుదు. కాళిదాసు ఉపమల ద్వారా గొప్ప చిత్రాలను చూపటం ఉంది కానీ, అనేక సందర్భాలలో కాళిదాసు ఉపమల ద్వారా అందమైన/గొప్ప భావాన్ని వ్యక్తీకరిస్తాడు. కాళిదాసు యొక్క కొన్ని ప్రముఖ ఉపమలను చూద్దాం.

వాగర్థావివ సంపృక్తౌ” – వాక్కు, అర్థముల వలె కలిసి ఉన్న (పార్వతీపరమేశ్వరులు);

పృథివ్యాః మానదండ యివ స్థితః” – (హిమాలయాలు) భూమికి కొలబద్ధలా ఉన్నాయి.

దినక్షపామధ్యగతేవ సంధ్యా” – దిలీపుడు, కపిలగోవు, సుదక్షిణ ఒకరి వెనకల ఒకరు వెళుతుంటే దినము, రాత్రి మధ్యన సంధ్య వెళుతున్నట్టుంది.

దినాన్తే నిహితం తేజ: సవిత్రేవ హుతాశన:” – సాయంసంధ్యలో సూర్యుని చేత ఉంచబడిన తేజస్సును స్వీకరించిన అగ్నిలాగా..

వాగర్థములు, భూమికి కొలబద్ద, రేబవళ్ళమధ్య సంధ్య, సూర్యుని తేజస్సును హరించిన అగ్ని – ఇవన్నీ కంటికి కనిపించు పదార్థాలు కావు. అవి భావాలు. ఆ కవి ఉపమానాలలో సాధారణంగా భావాలు ఎక్కువ. అలాగని కాళిదాసు ఉపమలలో పదచిత్రాలూ లేకపోలేదు. “సంచారిణీ దీపశిఖ“, “ఉద్బాహురివ వామనః” (కొమ్మనందుకోవాలని ఎగురుతున్న కురచవాడు), “తటిత్ తోయదయోరివ” (మెఱుపు మేఘముల వలె) ఇత్యాది ఉపమల వెనుక శబ్దచిత్రాలు స్పష్టమే. అయినా స్వభావతః కాళిదాసు భావాంబరవీథీవిహారి. రసమయకల్పనాపథికబేహారి. భావుకులకు, కవులకు కవి. దరిమిలా కవికులగురువు.

అంతే కాదు కాళిదాసు ఏ ఉపమను ఉద్యోతించినా అది అనాయాసంగా, అప్పటికప్పుడు అలా అలవోకగా అలా ఊడిపడినట్టు అనిపిస్తుంది.

భాసుడు కవులకవి అవునో కాదో కానీ, సామాన్యులకు మిత్రుడు. సామాన్యప్రేక్షకులకు/నేల టికెట్ వారికి స్నేహితుడు. ఎందుకంటే భాసకవి నేర్పంతా చూపెట్టటంలో ఉంది. అంతే కాదు, శ్లోకం ద్వారా పాత్రల స్వభావాన్ని, ఏదేని ఘట్టం తాలూకు తాత్పర్యాన్ని భాసుడు అతి సమర్థంగా చూపిస్తాడు. ఈ రెంటికీ పంచరాత్రంలో ఉదాహరణలున్నై.

పాత్రలు, పాత్ర స్వభావం:

యజ్ఞం పూర్తయ్యింది. దుర్యోధనుణ్ణి అందరూ అభినందిస్తున్నారు. పురస్కృతులు అందిస్తున్నారు. కర్ణుని వంతు వచ్చింది. అతనన్నాడు.

క్రతువ్రతైస్తే తను గాత్రమేతత్ సోఢుం బలం శక్యసి పీడయాని 

అంతస్త్వనామంత్ర్య న ధర్షయామి రాజర్షి ధీరాత్ వచనాత్ భయం మే

మిత్రమా దుర్యోధనా! యాగకార్యంలో నిమగ్నమై నీ శరీరం చిక్కిపోయింది. నా శరీరపు ధృఢత్వాన్ని తట్టుకోగలిగితే నిన్ను ఆలింగనం చేసుకుంటాను. నీకు ఇబ్బంది కలిగే పక్షాన అలా చెయ్యను. నా వద్ద ఆలింగనం తప్ప మరొకటి లేదు. ఈ మహర్షుల లా గొప్ప గొప్ప వాక్యాలు పలుకలేను. ఆ పలుకులంటే నాకు భయం.

పైన వాక్యాలలో కర్ణునికి దుర్యోధనుని యెడల ఉన్న కృతజ్ఞత, మిత్రభావం, వినయం, గౌరవం, పాండవపక్షపాతుల పట్ల నిరాసక్తి – ఇవన్నీ కూడగట్టి ఒక్కపెట్టున శబ్దాలలో బయటకు వచ్చినట్టు అగుపిస్తుంది. ఈ మాటలు కర్ణుడు (తెరపై పాత్రధారి) చెబుతుండగా చూడాలి, వినాలి. ఒకవేళ చదువుకుంటే కర్ణుని ఊహించాలి. ఈ ప్రక్రియనంతా నాటకంలో భాగంగా చూపుతాడు భాసుడు. ఇక్కడ భాసుడు కవిగా కన్నా గొప్ప దర్శకుడుగా కనిపిస్తాడు.

స్వభావాన్ని బట్టి పాత్రలను చిత్రీకరించటంతో బాటు, పాత్రల లక్షణాలను – ధ్వనియుతంగా చెప్పడం భాసకవి కవిత్వంలో అనేకచోట్ల కనిపిస్తుంది. మధ్యమవ్యాయోగం అనే నాటకంలో ఈ విధానాన్ని కవి చాలా సమర్థవంతంగా ఉపయోగించాడు. పంచరాత్రంలో కూడా మధ్యమవ్యాయోగంలో పాత్రవర్ణన తీరు తెన్ను కనిపిస్తుంది. అభిమన్యుడు (భీముడి చేత) బంధింపబడి విరాటరాజు కొలువుకు కొనిరాబడినాడు. తన యెదుట ఉన్నది తన తండ్రులేనని అతనికి తెలియదు. (మధ్యమవ్యాయోగంలో ఘటోత్కచునికి ఏర్పడిన సందర్భం లాంటిదే ఇది). ఆతడు బృహన్నలను చూచాడు.

ఎవరీ విచిత్రరూపధారి? ఈయన ఉమా వేషం ధరించిన శివుడి వలె ప్రకాశిస్తున్నాడు? (“…విభాతి ఉమావేషమివాశ్రితో హరః”) అనుకుంటాడు. అర్ధనారీశ్వరుడని ధ్వని. స్త్రీలను రూపాన్ని బట్టి, పురుషులను పరాక్రమాన్ని బట్టి గుర్తించాలట! అర్జునుడు పాశుపతం కోసం ఆ ఈశ్వరునితో తలపడి మెప్పించిన మహా పరాక్రమవంతుడు. అందుకనే హర శబ్దం. నిజానికి శివుడు ధవళవర్ణుడు. అర్జునుడు కఱ్ఱి. రూపంలో సామ్యం పొసగదు. కానీ పరాక్రమంలో సామ్యం ఉంది. అదీ ఇక్కడ ఔచిత్యం. స్త్రీలను రూపంతో, పురుషులను పరాక్రమంతో గుర్తించాలన్నదీ మరొక చోట కవి సూక్తే. (“రూపేణ స్త్రియః కథ్యన్తే. పరాక్రమేణ తు పురుషాః|”)

మరొక సందర్భం.

భీముడు – అభిమన్యుని రథాన్ని అడ్డగించి ఆతణ్ణి తన చేతుల్లో పట్టుకొని తీసుకు వస్తాడు. అప్పుడు భీముడు అనుకుంటాడు. “లాక్షాగృహం నుంచి బయటపడే సందర్భాన నేను నా అన్నదమ్ములను నలుగురినీ, అమ్మను కూడా నా చేతులతో ఒకే సారి మోసి ఉన్నాను. కానీ ఈ బాలకుడు ఆ నలుగురికంటే శ్రమ కలిగిస్తున్నాడు.” – అభిమన్యుడు పాండవులు నలుగురికీ పెట్టు అని ఇక్కడ ధ్వని!

క్లుప్తత:

ఘట్టాన్ని క్లుప్తంగానైనా సమర్థంగా చెప్పడం.

విరాటరాజు గోవులను కౌరవులు అపహరించి గోగ్రహణం చేశారు. రాజు కుపితుడైనాడు. అంతలో ఉత్తరగోగ్రహణం జరిగింది. భటుడు పరుగుపరుగున వచ్చి విరాటరాజుకు విన్నవించినాడు.

భటుడు : మహారాజుకు జయము.

రాజు: ’మహారాజ’ శబ్దం చాలు! నా క్షత్రియత్వానికి తలవంపులయింది. అక్కడ జరిగినదంతా విస్తారంగా చెప్పు.

భటుడు: విస్తారంగా చెప్పే వివరం కాదు మహారాజా. ఆ ఉదంతం యిదీ.

“ఏకవర్ణేషు గాత్రేషు గవాం స్యందనరేణునా। 

కశాపాతేషు దృశ్యంతే నానావర్ణవిభక్తయః॥

ఆ శ్లోకం భావం విశదంగా ఇది: శత్రువుల రథాలతో బాగా దుమ్మురేగి, అక్కడ ఆవులగుంపంతా దుమ్ముచేత కప్పబడిపోయింది. తెల్లావులు, కర్రావులు, కపిలగోవులూ అన్నీ ఒకే విధంగా దుమ్ముతో నిండి కనిపిస్తున్నాయి. అయితే శత్రుగణం వాళ్ళు ఆ గోవులను అదలిస్తూ చెలకోలతో వాటిపై కొడుతున్నారు. “అలా కొట్టిన దెబ్బలతో అక్కడక్కడా చారికలతో ఆ గోవుల గుంపు – ఒకే రంగు (కేన్వాసు) మధ్యన అక్కడక్కడా వివిధ రంగులతో కనిపిస్తోంది.”

భటుడు అతి క్లుప్తంగా, అంతే సమర్థంగా, మహారాజు వద్ద జరిగినది చెప్పాడు. చెబుతున్న విషయంలో కవిత్వానికి ఆస్కారం లేదు. కానీ భాసుడి కుంచెలో ఆ శ్లోకం రంగులీనింది. అంతే కాదు, పాఠకుడికి సన్నివేశంతో బాటు ఓ చిక్కని దృశ్యాన్ని అందించాడు కవి!

ఇది తద్గుణాలంకారం అని ఒక వ్యాఖ్యాకారుడు. ఒక వస్తువు తన గుణాన్ని వదిలి, మరొక వస్తువుతో సంబంధం వలన ఆ వస్తువు గుణాన్ని పొందడం తద్గుణాలంకారం అని కావ్యప్రకాశకారుడు.

శబ్దచిత్రాలు:

అదే భటుడు – ఉత్తరకుమారుడు, బృహన్నల లతో కూడిన రథం యుద్ధభూమిలో చేసే విన్యాసాలను గురించి విరాటరాజుతో చెబుతున్నాడు.

ఆలంబితో భ్రమతి ధావతి తేన ముక్తో

న ప్రాప్య ధర్షయతి నేచ్ఛతి విప్రకర్తుమ్

ఆసన్నభూమిచపలః పరివర్తమానో

యోగ్యోపదేశమివ తస్య రథః కరోతి  (2.20)

వేగంగా పరుగెడుతున్న ఆ రథాన్ని కళ్ళెంతో ఆపగానే ఆ అదటుకు రథం ఆగి, గుర్రాలతో చర్రున తిరుగుతోంది. కళ్ళేలు విడువగానే శత్రువుల గుర్రాలతో పోటీపడి పరుగులెడుతూంది. శత్రువుల స్థావరం చుట్టూ తిరుగుతూ, తనకొక ఉపదేశం ఇచ్చినట్టుగా ఆ రథం ప్రవర్తిస్తోంది.

శాకుంతలంలో కాళిదాసు కూడా మరింత విపులంగా ఇటువంటి పరుగును వర్ణించేడు. “గ్రీవాభంగాభిరామం ముహురనుపతతి..” శ్లోకం ద్వారాను. భాసుడు యుద్ధ వాతావరణాన్ని చూపుతే, కాళిదాసు భయానకరసాన్ని ఉద్యోతించాడు. (కాళిదాసు శ్లోకాన్ని కావ్యప్రకాశకారుడు భయానకరసానికి ఉదాహరణగా స్వీకరించి చూపాడు).

పైని శ్లోకంలో యుద్ధరంగంలో రథం ఎంత వేగంగా పరిభ్రమిస్తూ ఉందో చెప్పాడు. ఈ రథం బృహన్నల, ఉత్తరకుమారులది అయినా సాధారణంగా యుద్ధరంగానికి చెందిన రథం విన్యాసానికి అన్వయించినా ఇబ్బంది ఉండదు. అంత వేగంచా చలించే రథాన్ని ఆపాలంటే శత్రుయోధుడికి ఎంత బలం కావాలి? – ఈ ప్రశ్నకు సమాధానం తరువాతి అంకంలో దొరుకుతుంది.

భీముడు – కౌరవుల తరపున యుద్ధానికి వచ్చిన అభిమన్యపుత్రుని రథాన్ని అడ్డగిస్తున్నాడు.

లంఘయిత్వా జవేనాశ్వాన్ న్యస్త ఆపస్కరో కరః

ప్రసరిత హయగ్రీవో నిష్కంపశ్చ రథః స్థితః  (3.10)

పరిగెడుతున్న జవనాశ్వాల వేగాన్ని దాటి, రథం ముందుకు దూకి, రథం ముందు భాగాన చేరి, చేతులతో ఆ రథాశ్వాల మెడలను వంచాడు. అంతటితో రథం కదలకుండా నిలుచుంది!

మరొక అప్రస్తుతప్రశంస.

యజ్ఞంలో భాగంగా ద్రోణుడు దుర్యోధనుని ఒక వరం యాచించాడు. పాండవులకు వారి రాజ్యం వారికి ఇచ్చివెయ్యమన్నదే ఆ వరం. దుర్యోధనునికి నోట పచ్చివెలక్కాయ పడినట్టయింది. ఆతడు శకునితో చర్చించి, ఓ షరతు ప్రకారం ద్రోణుని కోరికను అంగీకరిస్తానంటాడు. ఆ షరతేమిటంటే – ఐదు రాత్రులలోపల, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల ఉనికిని కనుక్కోవాలి.

ఈ షరతు విని ద్రోణుడు హతాశుడయ్యాడు. ఇంతలో ఓ దూత వచ్చి, విరాటనగరంలో ఓ యోధుడు, (కీచకుడు) ఆతని నూర్గురు సోదరులు విచిత్రమైన రీతిలో హతులయ్యారన్న వార్తను చెప్పాడు. పక్కన ఉన్న భీష్ముడికి సంగతి అర్థమయింది. ఆ యోధుని, ఆతని సోదరులను వధించినది భీముడే. ఆతడు ద్రోణునితో ఆ మాటే చెప్పాడు. ఆ విషయం మీకెలా తెలుసు? (కథం భవాన్ జానాతి?) అడిగాడు ద్రోణుడు.

భీష్ముడు:

కథం పండిత! కూలేషు భ్రాంతానాం బాలచాపలమ్

నాభిజానంతి వత్సానాం శృంగస్థానాని గోవృషః

నదీతీరాలలో అలవోకగా తిరుగుతున్న దూడల యొక్క అప్పుడప్పుడే మొలుస్తున్న కొమ్ముల (మూల) పదునేదో (అనుభవజ్ఞుడైన/ముసలి) ఎద్దుకు తెలియదా? (కీచకుడు, ఆతని సోదరులు – భీమనసేనుడనే వృషభం తాలూకు పరాక్రమం ముందు దూడల వంటి వాళ్ళు.)

ఈ అప్రస్తుత ప్రశంస ఆ ఘట్టాన గొప్పగా అలరారుతోంది. భీమసేనుని ఆనవాలు దొరికినందున భీష్ముని ఉత్సాహం ఈ మాటలో ధ్వనిస్తోంది. అంతే కాదు, మరొక భావం కూడా ఉంది. ఎక్కడో మారుమూల రాజ్యంలో దాగిన పాండవుల ఉనికి నా వంటి వానికి తెలియదా? హనుమంతుని ముందు కుప్పిగంతులేల? అన్నట్టూ ఈ శ్లోకం లీలగా ధ్వనిస్తున్నది. రాబోయే గోగ్రహణ కార్యాన్ని కూడా ఈ శ్లోకం సూచిస్తూంది. ’శృంగస్థానాని’ అన్న శబ్దం కూడా ఇక్కడ గమనార్హం. కొత్తగా కొమ్ములు మొలుస్తున్న దూడలకు – ఆ స్థానంలో కొంత దురదగా ఉంటుందట. కీచకుడు, ఆతని నూర్గురు సోదరుల చాపల్యం కూడా అలాంటిదే.

ఆ వెంటనే ద్రోణుడు చెబుతాడు.

ద్రోణః: గోవృషః ఇతి| హన్త! సిద్ధం కార్యమ్ | పుత్ర దుర్యోధన ! అస్తు పంచరాత్రమ్ |

(ఓహ్, వృషభమన్నమాట! ఆహా, పని జరిగింది. పుత్రా, దుర్యోధనా, అలాగే కానీ, ఐదురాత్రుల షరతుకు ఒప్పుకుంటున్నాను)

వృత్తౌచిత్యం:

క్షేమేంద్రుడనే పండ్రెండవ శతాబ్దపు కవి సువృత్తతిలకం లో వివిధ సంస్కృత ఛందస్సులను గురించి విచారణ చేశాడు. ఏయే కావులు ఏయే వృత్తాలలో నిష్ణాతులో చెప్పియున్నాడు. ఈ ఆలంకారికులలో చాలామంది యెందు చేతనో భాసుని అంతగా పట్టించుకొనలేదు. బహుశా కాళిదాసుకే పూర్వుడైన భాసుని గురించి వారికి తెలియలేదో, లేక ప్రస్తుతం మనకు లభిస్తున్న నాటకాలు భాసుడి మూలనాటకాలు కాక, మరెవరైనా సంక్షిప్తీకరించి కూర్చినవో తెలియదు.

భాసకవి ఎక్కువగా ఉపజాతివృత్తమైన ఇంద్రవ్రజాన్ని ఉపయోగించినప్పటికీ, అక్కడక్కడా కొన్ని విశిష్టమైన వృత్తాలను ప్రయోగించాడు. వీటి ప్రయోగాలలో ఆశ్చర్యకరమైన ఔచిత్యం కనిపిస్తుంది.

భీముడు అభిమన్యుని బంధించే వృత్తం పేరు – వంశస్థము. వంశస్థము అంటే వెదురుకఱ్ఱపై నిలబెట్టిన గొడుగు లేదా వంశమునందు రూఢమైన గోత్రము. అభిమన్యుడు పాండవసుతుడు కాబట్టి ఈ వృత్తం అక్కడ భాసిస్తోంది.

మరొక సందర్భాన కర్ణుడు దుర్యోధనుని యుద్ధనీతిని ఎంతో మెచ్చుకుని ఓ శ్లోకం చెబుతాడు. ఆ శ్లోకం తాలూకు వృత్తం పేరు ప్రహర్షిణి! ప్రహర్షిణి అంటే గొప్ప హర్షంతో కూడినది!

***

సారాంశం ఏమిటంటే భాసుడు శ్లోకాన్ని, నాటకానికి రచన, దర్శకత్వం వహించటంలో భాగంగా తీర్చిదిద్దుతాడు. ఆయనకు శ్లోకం అంటే – పాఠకుడికి చూపించే చిత్తరువు, లేదా చెబుతున్న కథ/పాత్రస్వభావంలో అంతర్భాగం. సహృదయులయిన ప్రేక్షకుల/పాఠకుల కోసమే రచనను రచించే కవి కాబట్టి – భాసుడు ఆతడికి చక్కని స్నేహితుడు.

ఈ పేర్కొన్న లక్షణాలు సాధారణ లక్షణాలు. ఏ కవికైనా సాధారణ లక్షణాలతో బాటూ ఆ సాధారణలక్షణాలను వ్యతిక్రమించే వార్తికలక్షణాలూ ఉండనే ఉంటాయి. శ్లోకాన్ని, దృశ్యబద్ధమో, పాత్రబద్ధమో చేయటం ఆయన కవిత్వపు ప్రధానలక్షణమైనప్పటికీ, అప్పుడప్పుడూ ఈ కవి పాత్రలతో సుభాషితాలూ చెబుతాడు.

మిథ్యాప్రశంసా ఖలు నామ కష్టా యేషాం తు మిథ్యావచనేషు భక్తిః

అహం హి యుద్ధాశ్రయముచ్యమానో వాచానువర్తీ హృదయేన లజ్జే  (2.60)

“ఎవరికైతే అబద్ధపు మాటలమీద ఆసక్తి ఉంటుందో, అలాంటి వారి పొగడ్తలతో నాకు నొప్పి కలుగుతుంది. నేను యోధుణ్ణని, యుద్ధంలో గొప్పగా పరాక్రమించానని అంటే బయట ఊరుకుంటాను కానీ మనసులో సిగ్గుపడతాను.”

ఈ మాటలు ఉత్తరకుమారుడు చెబుతాడు. ఉత్తరకుమారుడు గొప్ప యోధుడు అయి ఉండకపోవచ్చు, కానీ నిస్సందేహంగా గొప్ప ‘కవి’, గొప్ప సాహిత్యకారుడు. వేల యేళ్ళకు ముందు ఉత్తరకుమారుని చేత కవి చెప్పించిన ఈ పలుకు నేటికి (ఉత్త ‘కుమారు’ లైన కవులకు) కూడా వర్తిస్తూ, ఎంత నవనవోన్మేషంగా ఉందో తెలుస్తూనే ఉన్నది.

***

‘నాటకాంతే సాహిత్యం’ అని సంస్కృతసూక్తి. నేడు ఎక్కడో మూలలో తక్క సంస్కృతనాటకాలు ప్రదర్శనకు నోచుకోలేకపోయినా, అసలు ఆ భాషే మనకు లేకపోయినా, ఆ దృశ్యకావ్యాలు మాత్రం ఏవో రూపాల్లో కొనసాగుతున్నాయి. కనుక వాటి అధ్యయనం – నేడు ఉపయోగకరమే కాక గొప్ప సంతోషకరం కూడా.

అంతే కాదు, చక్కని సాహిత్యం వలన చక్కని సంస్కారం అలవడుతుంది. ఉపయోగించుకుంటే కావ్యంలో ఔచిత్యం – నిజజీవితంలో కార్యనిర్వహణ ఔచిత్యానికి బాటలు వేయగలదు. ఇటువంటి ప్రయోజనాలు గల నాటకాలను అనుశీలించటం ఏ కాలానికైనా లాభకరమే.

Exit mobile version