భాసుని కవిత్వం:
జయదేవుడనే ఓ కవి సంస్కృతకవుల గురించి ఒక అభాణకం వ్రాశాడు.
యస్యాశ్చోరః చికురనికురో కర్ణపూరో మయూరః
భాసో హాసః కవికులగురుః కాళిదాసో విలాసః।
హర్షో హర్షః హృదయవసతిః పంచబాణస్తు బాణః
కేషాం నైషా కథయ కవితాకామినీ కౌతుకాయ॥
కవితాకన్యక యొక్క కురులు చోరకవి. కర్ణాభరణం మయూరకవి. భాసుడు చిఱునగవు. కవికులగురువైన కాళిదాసు ఆమె విలాసం. హర్షుదు ఆమె ఆనందం. ఆమె హృదయంలో నివసించే మన్మథుడు బాణుడు. ఇలాంటి కవితాకన్యక ఎవరిని అలరించదు?
మన వ్యాసంలో ప్రస్తావింపబడే భాసకవి – కవితాకన్యక చిఱునగవు. చిఱునగవు – చక్కని స్నేహానికి చిహ్నం. స్నేహం అంటే కూడా తెలుపే కదా! భాసకవిత ఓ చక్కని స్నేహితుడు. ఈ స్నేహితుడు ఎంత గొప్పవాడైనా, మన స్థాయిలోనే ఉంటాడు. మనకు మంచీ, చెడూ చెబుతాడు. (చూపుతాడు). కవిత్వం ద్వారా దృశ్యాన్ని చూపడం భాసుడు సిద్ధహస్తుడు. ఈయన – గొప్ప దర్శకుడు. అందుకనే భాసకవి తన రచనలను అన్నిటినీ నాటకాలుగానే రచించినాడు. భాసకవితలో ఈ స్వభావాన్ని మనం కాళిదాసుతో పోల్చి మాట్లాడుకుందాం. ఇందుకు మన భూమిక పంచరాత్రమ్ – అనబడే మహాభారత విరాటపర్వం ఘట్టాన్ని అనుసరించిన నాటకం.
దుర్యోధనుడు గొప్ప యజ్ఞం చేశాడు. ఎందరో ద్విజులు ఈ యజ్ఞంలో పాల్గొన్నారు. ఆ యజ్ఞప్రభావం ఇలా ఉంది.
ద్విజోచ్ఛిష్టైరన్నైః ప్రకుసుమితకాశా ఇవ దిశో
హవిర్ధూమైః సర్వే హృతకుసుమగంధాస్తరుగణాః।
మృగైస్తుల్యా వ్యాఘ్రా వధనిభృతసింహాశ్చ గిరయో
నృపే దీక్షాం ప్రాప్తే జగదపి సమం దీక్షితమివ॥
ద్విజోచ్ఛిష్టైః = ద్విజులు వదలివేసిన; అన్నైః = అన్నముతో; దిశాః = దిక్కులు; ప్రకుసుమితకాశాః ఇవ = విచ్చిన రెల్లుగడ్డి వలె; (ఉన్నవి) హవిర్ధూమైః = యజ్ఞధూళిచేత; సర్వే తరు గణాః = వృక్షములన్నియూ; హృతకుసుమగంధాః = సుగంధము కోల్పోయినవిగా; (ఐనవి)వ్యాఘ్రాః = పులులు; మృగైః తుల్యాః = జింకలవలె (సాధువులైనవి); వధనిభృత సింహా చ = వేటను వదలిన సింహములునూ; గిరయః = గుట్టలవలె (నిశ్చలముగా ఐనవి); దీక్షాం ప్రాప్తే = దీక్ష వహించిన; నృపే = దుర్యోధనుని యందు; సమం దీక్షితమివ = సమముగా దీక్ష వహించినయట్లు; జగత్ అపి = ప్రపంచమునూ; పరిణమించినది;
యజ్ఞంలో ద్విజుల చేత వదలబడిన (బలి) యన్నము తో దిక్కులన్నీ రెల్లుగడ్డిలా ప్రకాశిస్తున్నాయి. యాగధూళి అంతటా వ్యాపించి, వృక్షాలనుండి వచ్చే సుగంధాన్ని మరుగు పరుస్తున్నాయి. పులులు హింస మానేసి జింకల్లా సాధువులుగా అయ్యాయి. సింహాలు నిశ్చలంగా గుట్టల్లా ఉన్నవి. రాజుతో బాటు సకలప్రపంచమూ సమంగా దీక్షవహించినట్టు ఉన్నది.
ఇద్దరు పాత్రలు మాట్లాడుకుంటుండగా ఆ ప్రస్తావన లోని శ్లోకం యిది. ఈ శ్లోకంలో మొదటిపాదం తాలూకు ఉపమాలంకారం – ఊహకు అందగలిగే దృశ్యబద్ధమైనచిత్రం. మూడవ నాలుగవ పాదాలు – కాళిదాసు శాకుంతలంలో మునివాటికల వర్ణనకు కొంతమేర పెట్టుబడి.
ఇదే ఘట్టంలో మరొక శ్లోకం ఎంత నవనవోన్మేషంగా ఉందో చూడండి.
ఏతే వాతోద్ధతా వంశాః దహ్యమానాః మఖాగ్నినా।
భాగ్యానీవ మనుష్యాణామున్నమతి నమంతి చ॥
యజ్ఞం చేస్తూ, యజ్ఞకీలలకు దొరికిన కలపను వెదుళ్ళనూ హవిస్సుగా ఆహుతిస్తున్నారు. ఆ ద్రవ్యంలో భాగంగా వేణువులు కూడా దహింపబడుతున్నాయి. వేణువుల గొట్టాలలో ఒకవైపు నుండి ప్రవేశించిన అగ్ని – గొట్టం తాలూకు మరొకవైపు నుంచి బయటకు వస్తూ, మధ్యలో కన్నాలు ఉండటంతో వాటి నుంచి వినిర్గతమవుతోంది. ఆ క్రమంలో భాగంగా అగ్ని, వేణువుల తాలూకు వెదురుగొట్టాలలో ఉన్నట్టుండి వెలుగుతూ, ఉన్నట్టుండి ఆరిపోతూ – మానవుల సంపద లాగా పెరుగుతూ తరుగుతూ ఉంది.
ఈ శ్లోకంలో వస్తువు ఎంత విభిన్నంగా ఉందో మనం గమనింపవచ్చు. అగ్నికీలలు వెదురుగొట్టాలలో అల్లల్లాడుతో కన్నాలలో, ఒక్కోసారి ఇవతల వైపు నుంచీ వెలుగుతూ, ఆరుతూ పోవడం – ఊహించుకోవలసిందే!
***
“ఉపమా కాళిదాసస్య” అని కాళిదాస కవికి బిరుదు. కాళిదాసు ఉపమల ద్వారా గొప్ప చిత్రాలను చూపటం ఉంది కానీ, అనేక సందర్భాలలో కాళిదాసు ఉపమల ద్వారా అందమైన/గొప్ప భావాన్ని వ్యక్తీకరిస్తాడు. కాళిదాసు యొక్క కొన్ని ప్రముఖ ఉపమలను చూద్దాం.
“వాగర్థావివ సంపృక్తౌ” – వాక్కు, అర్థముల వలె కలిసి ఉన్న (పార్వతీపరమేశ్వరులు);
“పృథివ్యాః మానదండ యివ స్థితః” – (హిమాలయాలు) భూమికి కొలబద్ధలా ఉన్నాయి.
“దినక్షపామధ్యగతేవ సంధ్యా” – దిలీపుడు, కపిలగోవు, సుదక్షిణ ఒకరి వెనకల ఒకరు వెళుతుంటే దినము, రాత్రి మధ్యన సంధ్య వెళుతున్నట్టుంది.
“దినాన్తే నిహితం తేజ: సవిత్రేవ హుతాశన:” – సాయంసంధ్యలో సూర్యుని చేత ఉంచబడిన తేజస్సును స్వీకరించిన అగ్నిలాగా..
వాగర్థములు, భూమికి కొలబద్ద, రేబవళ్ళమధ్య సంధ్య, సూర్యుని తేజస్సును హరించిన అగ్ని – ఇవన్నీ కంటికి కనిపించు పదార్థాలు కావు. అవి భావాలు. ఆ కవి ఉపమానాలలో సాధారణంగా భావాలు ఎక్కువ. అలాగని కాళిదాసు ఉపమలలో పదచిత్రాలూ లేకపోలేదు. “సంచారిణీ దీపశిఖ“, “ఉద్బాహురివ వామనః” (కొమ్మనందుకోవాలని ఎగురుతున్న కురచవాడు), “తటిత్ తోయదయోరివ” (మెఱుపు మేఘముల వలె) ఇత్యాది ఉపమల వెనుక శబ్దచిత్రాలు స్పష్టమే. అయినా స్వభావతః కాళిదాసు భావాంబరవీథీవిహారి. రసమయకల్పనాపథికబేహారి. భావుకులకు, కవులకు కవి. దరిమిలా కవికులగురువు.
అంతే కాదు కాళిదాసు ఏ ఉపమను ఉద్యోతించినా అది అనాయాసంగా, అప్పటికప్పుడు అలా అలవోకగా అలా ఊడిపడినట్టు అనిపిస్తుంది.
భాసుడు కవులకవి అవునో కాదో కానీ, సామాన్యులకు మిత్రుడు. సామాన్యప్రేక్షకులకు/నేల టికెట్ వారికి స్నేహితుడు. ఎందుకంటే భాసకవి నేర్పంతా చూపెట్టటంలో ఉంది. అంతే కాదు, శ్లోకం ద్వారా పాత్రల స్వభావాన్ని, ఏదేని ఘట్టం తాలూకు తాత్పర్యాన్ని భాసుడు అతి సమర్థంగా చూపిస్తాడు. ఈ రెంటికీ పంచరాత్రంలో ఉదాహరణలున్నై.
పాత్రలు, పాత్ర స్వభావం:
యజ్ఞం పూర్తయ్యింది. దుర్యోధనుణ్ణి అందరూ అభినందిస్తున్నారు. పురస్కృతులు అందిస్తున్నారు. కర్ణుని వంతు వచ్చింది. అతనన్నాడు.
క్రతువ్రతైస్తే తను గాత్రమేతత్ సోఢుం బలం శక్యసి పీడయాని।
అంతస్త్వనామంత్ర్య న ధర్షయామి రాజర్షి ధీరాత్ వచనాత్ భయం మే॥
మిత్రమా దుర్యోధనా! యాగకార్యంలో నిమగ్నమై నీ శరీరం చిక్కిపోయింది. నా శరీరపు ధృఢత్వాన్ని తట్టుకోగలిగితే నిన్ను ఆలింగనం చేసుకుంటాను. నీకు ఇబ్బంది కలిగే పక్షాన అలా చెయ్యను. నా వద్ద ఆలింగనం తప్ప మరొకటి లేదు. ఈ మహర్షుల లా గొప్ప గొప్ప వాక్యాలు పలుకలేను. ఆ పలుకులంటే నాకు భయం.
పైన వాక్యాలలో కర్ణునికి దుర్యోధనుని యెడల ఉన్న కృతజ్ఞత, మిత్రభావం, వినయం, గౌరవం, పాండవపక్షపాతుల పట్ల నిరాసక్తి – ఇవన్నీ కూడగట్టి ఒక్కపెట్టున శబ్దాలలో బయటకు వచ్చినట్టు అగుపిస్తుంది. ఈ మాటలు కర్ణుడు (తెరపై పాత్రధారి) చెబుతుండగా చూడాలి, వినాలి. ఒకవేళ చదువుకుంటే కర్ణుని ఊహించాలి. ఈ ప్రక్రియనంతా నాటకంలో భాగంగా చూపుతాడు భాసుడు. ఇక్కడ భాసుడు కవిగా కన్నా గొప్ప దర్శకుడుగా కనిపిస్తాడు.
స్వభావాన్ని బట్టి పాత్రలను చిత్రీకరించటంతో బాటు, పాత్రల లక్షణాలను – ధ్వనియుతంగా చెప్పడం భాసకవి కవిత్వంలో అనేకచోట్ల కనిపిస్తుంది. మధ్యమవ్యాయోగం అనే నాటకంలో ఈ విధానాన్ని కవి చాలా సమర్థవంతంగా ఉపయోగించాడు. పంచరాత్రంలో కూడా మధ్యమవ్యాయోగంలో పాత్రవర్ణన తీరు తెన్ను కనిపిస్తుంది. అభిమన్యుడు (భీముడి చేత) బంధింపబడి విరాటరాజు కొలువుకు కొనిరాబడినాడు. తన యెదుట ఉన్నది తన తండ్రులేనని అతనికి తెలియదు. (మధ్యమవ్యాయోగంలో ఘటోత్కచునికి ఏర్పడిన సందర్భం లాంటిదే ఇది). ఆతడు బృహన్నలను చూచాడు.
ఎవరీ విచిత్రరూపధారి? ఈయన ఉమా వేషం ధరించిన శివుడి వలె ప్రకాశిస్తున్నాడు? (“…విభాతి ఉమావేషమివాశ్రితో హరః”) అనుకుంటాడు. అర్ధనారీశ్వరుడని ధ్వని. స్త్రీలను రూపాన్ని బట్టి, పురుషులను పరాక్రమాన్ని బట్టి గుర్తించాలట! అర్జునుడు పాశుపతం కోసం ఆ ఈశ్వరునితో తలపడి మెప్పించిన మహా పరాక్రమవంతుడు. అందుకనే హర శబ్దం. నిజానికి శివుడు ధవళవర్ణుడు. అర్జునుడు కఱ్ఱి. రూపంలో సామ్యం పొసగదు. కానీ పరాక్రమంలో సామ్యం ఉంది. అదీ ఇక్కడ ఔచిత్యం. స్త్రీలను రూపంతో, పురుషులను పరాక్రమంతో గుర్తించాలన్నదీ మరొక చోట కవి సూక్తే. (“రూపేణ స్త్రియః కథ్యన్తే. పరాక్రమేణ తు పురుషాః|”)
మరొక సందర్భం.
భీముడు – అభిమన్యుని రథాన్ని అడ్డగించి ఆతణ్ణి తన చేతుల్లో పట్టుకొని తీసుకు వస్తాడు. అప్పుడు భీముడు అనుకుంటాడు. “లాక్షాగృహం నుంచి బయటపడే సందర్భాన నేను నా అన్నదమ్ములను నలుగురినీ, అమ్మను కూడా నా చేతులతో ఒకే సారి మోసి ఉన్నాను. కానీ ఈ బాలకుడు ఆ నలుగురికంటే శ్రమ కలిగిస్తున్నాడు.” – అభిమన్యుడు పాండవులు నలుగురికీ పెట్టు అని ఇక్కడ ధ్వని!
క్లుప్తత:
ఘట్టాన్ని క్లుప్తంగానైనా సమర్థంగా చెప్పడం.
విరాటరాజు గోవులను కౌరవులు అపహరించి గోగ్రహణం చేశారు. రాజు కుపితుడైనాడు. అంతలో ఉత్తరగోగ్రహణం జరిగింది. భటుడు పరుగుపరుగున వచ్చి విరాటరాజుకు విన్నవించినాడు.
భటుడు : మహారాజుకు జయము.
రాజు: ’మహారాజ’ శబ్దం చాలు! నా క్షత్రియత్వానికి తలవంపులయింది. అక్కడ జరిగినదంతా విస్తారంగా చెప్పు.
భటుడు: విస్తారంగా చెప్పే వివరం కాదు మహారాజా. ఆ ఉదంతం యిదీ.
“ఏకవర్ణేషు గాత్రేషు గవాం స్యందనరేణునా।
కశాపాతేషు దృశ్యంతే నానావర్ణవిభక్తయః॥
ఆ శ్లోకం భావం విశదంగా ఇది: శత్రువుల రథాలతో బాగా దుమ్మురేగి, అక్కడ ఆవులగుంపంతా దుమ్ముచేత కప్పబడిపోయింది. తెల్లావులు, కర్రావులు, కపిలగోవులూ అన్నీ ఒకే విధంగా దుమ్ముతో నిండి కనిపిస్తున్నాయి. అయితే శత్రుగణం వాళ్ళు ఆ గోవులను అదలిస్తూ చెలకోలతో వాటిపై కొడుతున్నారు. “అలా కొట్టిన దెబ్బలతో అక్కడక్కడా చారికలతో ఆ గోవుల గుంపు – ఒకే రంగు (కేన్వాసు) మధ్యన అక్కడక్కడా వివిధ రంగులతో కనిపిస్తోంది.”
భటుడు అతి క్లుప్తంగా, అంతే సమర్థంగా, మహారాజు వద్ద జరిగినది చెప్పాడు. చెబుతున్న విషయంలో కవిత్వానికి ఆస్కారం లేదు. కానీ భాసుడి కుంచెలో ఆ శ్లోకం రంగులీనింది. అంతే కాదు, పాఠకుడికి సన్నివేశంతో బాటు ఓ చిక్కని దృశ్యాన్ని అందించాడు కవి!
ఇది తద్గుణాలంకారం అని ఒక వ్యాఖ్యాకారుడు. ఒక వస్తువు తన గుణాన్ని వదిలి, మరొక వస్తువుతో సంబంధం వలన ఆ వస్తువు గుణాన్ని పొందడం తద్గుణాలంకారం అని కావ్యప్రకాశకారుడు.
శబ్దచిత్రాలు:
అదే భటుడు – ఉత్తరకుమారుడు, బృహన్నల లతో కూడిన రథం యుద్ధభూమిలో చేసే విన్యాసాలను గురించి విరాటరాజుతో చెబుతున్నాడు.
ఆలంబితో భ్రమతి ధావతి తేన ముక్తో
న ప్రాప్య ధర్షయతి నేచ్ఛతి విప్రకర్తుమ్।
ఆసన్నభూమిచపలః పరివర్తమానో
యోగ్యోపదేశమివ తస్య రథః కరోతి॥ (2.20)
వేగంగా పరుగెడుతున్న ఆ రథాన్ని కళ్ళెంతో ఆపగానే ఆ అదటుకు రథం ఆగి, గుర్రాలతో చర్రున తిరుగుతోంది. కళ్ళేలు విడువగానే శత్రువుల గుర్రాలతో పోటీపడి పరుగులెడుతూంది. శత్రువుల స్థావరం చుట్టూ తిరుగుతూ, తనకొక ఉపదేశం ఇచ్చినట్టుగా ఆ రథం ప్రవర్తిస్తోంది.
శాకుంతలంలో కాళిదాసు కూడా మరింత విపులంగా ఇటువంటి పరుగును వర్ణించేడు. “గ్రీవాభంగాభిరామం ముహురనుపతతి..” శ్లోకం ద్వారాను. భాసుడు యుద్ధ వాతావరణాన్ని చూపుతే, కాళిదాసు భయానకరసాన్ని ఉద్యోతించాడు. (కాళిదాసు శ్లోకాన్ని కావ్యప్రకాశకారుడు భయానకరసానికి ఉదాహరణగా స్వీకరించి చూపాడు).
పైని శ్లోకంలో యుద్ధరంగంలో రథం ఎంత వేగంగా పరిభ్రమిస్తూ ఉందో చెప్పాడు. ఈ రథం బృహన్నల, ఉత్తరకుమారులది అయినా సాధారణంగా యుద్ధరంగానికి చెందిన రథం విన్యాసానికి అన్వయించినా ఇబ్బంది ఉండదు. అంత వేగంచా చలించే రథాన్ని ఆపాలంటే శత్రుయోధుడికి ఎంత బలం కావాలి? – ఈ ప్రశ్నకు సమాధానం తరువాతి అంకంలో దొరుకుతుంది.
భీముడు – కౌరవుల తరపున యుద్ధానికి వచ్చిన అభిమన్యపుత్రుని రథాన్ని అడ్డగిస్తున్నాడు.
లంఘయిత్వా జవేనాశ్వాన్ న్యస్త ఆపస్కరో కరః।
ప్రసరిత హయగ్రీవో నిష్కంపశ్చ రథః స్థితః॥ (3.10)
పరిగెడుతున్న జవనాశ్వాల వేగాన్ని దాటి, రథం ముందుకు దూకి, రథం ముందు భాగాన చేరి, చేతులతో ఆ రథాశ్వాల మెడలను వంచాడు. అంతటితో రథం కదలకుండా నిలుచుంది!
మరొక అప్రస్తుతప్రశంస.
యజ్ఞంలో భాగంగా ద్రోణుడు దుర్యోధనుని ఒక వరం యాచించాడు. పాండవులకు వారి రాజ్యం వారికి ఇచ్చివెయ్యమన్నదే ఆ వరం. దుర్యోధనునికి నోట పచ్చివెలక్కాయ పడినట్టయింది. ఆతడు శకునితో చర్చించి, ఓ షరతు ప్రకారం ద్రోణుని కోరికను అంగీకరిస్తానంటాడు. ఆ షరతేమిటంటే – ఐదు రాత్రులలోపల, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల ఉనికిని కనుక్కోవాలి.
ఈ షరతు విని ద్రోణుడు హతాశుడయ్యాడు. ఇంతలో ఓ దూత వచ్చి, విరాటనగరంలో ఓ యోధుడు, (కీచకుడు) ఆతని నూర్గురు సోదరులు విచిత్రమైన రీతిలో హతులయ్యారన్న వార్తను చెప్పాడు. పక్కన ఉన్న భీష్ముడికి సంగతి అర్థమయింది. ఆ యోధుని, ఆతని సోదరులను వధించినది భీముడే. ఆతడు ద్రోణునితో ఆ మాటే చెప్పాడు. ఆ విషయం మీకెలా తెలుసు? (కథం భవాన్ జానాతి?) అడిగాడు ద్రోణుడు.
భీష్ముడు:
కథం పండిత! కూలేషు భ్రాంతానాం బాలచాపలమ్।
నాభిజానంతి వత్సానాం శృంగస్థానాని గోవృషః॥
నదీతీరాలలో అలవోకగా తిరుగుతున్న దూడల యొక్క అప్పుడప్పుడే మొలుస్తున్న కొమ్ముల (మూల) పదునేదో (అనుభవజ్ఞుడైన/ముసలి) ఎద్దుకు తెలియదా? (కీచకుడు, ఆతని సోదరులు – భీమనసేనుడనే వృషభం తాలూకు పరాక్రమం ముందు దూడల వంటి వాళ్ళు.)
ఈ అప్రస్తుత ప్రశంస ఆ ఘట్టాన గొప్పగా అలరారుతోంది. భీమసేనుని ఆనవాలు దొరికినందున భీష్ముని ఉత్సాహం ఈ మాటలో ధ్వనిస్తోంది. అంతే కాదు, మరొక భావం కూడా ఉంది. ఎక్కడో మారుమూల రాజ్యంలో దాగిన పాండవుల ఉనికి నా వంటి వానికి తెలియదా? హనుమంతుని ముందు కుప్పిగంతులేల? అన్నట్టూ ఈ శ్లోకం లీలగా ధ్వనిస్తున్నది. రాబోయే గోగ్రహణ కార్యాన్ని కూడా ఈ శ్లోకం సూచిస్తూంది. ’శృంగస్థానాని’ అన్న శబ్దం కూడా ఇక్కడ గమనార్హం. కొత్తగా కొమ్ములు మొలుస్తున్న దూడలకు – ఆ స్థానంలో కొంత దురదగా ఉంటుందట. కీచకుడు, ఆతని నూర్గురు సోదరుల చాపల్యం కూడా అలాంటిదే.
ఆ వెంటనే ద్రోణుడు చెబుతాడు.
ద్రోణః: గోవృషః ఇతి| హన్త! సిద్ధం కార్యమ్ | పుత్ర దుర్యోధన ! అస్తు పంచరాత్రమ్ |
(ఓహ్, వృషభమన్నమాట! ఆహా, పని జరిగింది. పుత్రా, దుర్యోధనా, అలాగే కానీ, ఐదురాత్రుల షరతుకు ఒప్పుకుంటున్నాను)
వృత్తౌచిత్యం:
క్షేమేంద్రుడనే పండ్రెండవ శతాబ్దపు కవి సువృత్తతిలకం లో వివిధ సంస్కృత ఛందస్సులను గురించి విచారణ చేశాడు. ఏయే కావులు ఏయే వృత్తాలలో నిష్ణాతులో చెప్పియున్నాడు. ఈ ఆలంకారికులలో చాలామంది యెందు చేతనో భాసుని అంతగా పట్టించుకొనలేదు. బహుశా కాళిదాసుకే పూర్వుడైన భాసుని గురించి వారికి తెలియలేదో, లేక ప్రస్తుతం మనకు లభిస్తున్న నాటకాలు భాసుడి మూలనాటకాలు కాక, మరెవరైనా సంక్షిప్తీకరించి కూర్చినవో తెలియదు.
భాసకవి ఎక్కువగా ఉపజాతివృత్తమైన ఇంద్రవ్రజాన్ని ఉపయోగించినప్పటికీ, అక్కడక్కడా కొన్ని విశిష్టమైన వృత్తాలను ప్రయోగించాడు. వీటి ప్రయోగాలలో ఆశ్చర్యకరమైన ఔచిత్యం కనిపిస్తుంది.
భీముడు అభిమన్యుని బంధించే వృత్తం పేరు – వంశస్థము. వంశస్థము అంటే వెదురుకఱ్ఱపై నిలబెట్టిన గొడుగు లేదా వంశమునందు రూఢమైన గోత్రము. అభిమన్యుడు పాండవసుతుడు కాబట్టి ఈ వృత్తం అక్కడ భాసిస్తోంది.
మరొక సందర్భాన కర్ణుడు దుర్యోధనుని యుద్ధనీతిని ఎంతో మెచ్చుకుని ఓ శ్లోకం చెబుతాడు. ఆ శ్లోకం తాలూకు వృత్తం పేరు ప్రహర్షిణి! ప్రహర్షిణి అంటే గొప్ప హర్షంతో కూడినది!
***
సారాంశం ఏమిటంటే భాసుడు శ్లోకాన్ని, నాటకానికి రచన, దర్శకత్వం వహించటంలో భాగంగా తీర్చిదిద్దుతాడు. ఆయనకు శ్లోకం అంటే – పాఠకుడికి చూపించే చిత్తరువు, లేదా చెబుతున్న కథ/పాత్రస్వభావంలో అంతర్భాగం. సహృదయులయిన ప్రేక్షకుల/పాఠకుల కోసమే రచనను రచించే కవి కాబట్టి – భాసుడు ఆతడికి చక్కని స్నేహితుడు.
ఈ పేర్కొన్న లక్షణాలు సాధారణ లక్షణాలు. ఏ కవికైనా సాధారణ లక్షణాలతో బాటూ ఆ సాధారణలక్షణాలను వ్యతిక్రమించే వార్తికలక్షణాలూ ఉండనే ఉంటాయి. శ్లోకాన్ని, దృశ్యబద్ధమో, పాత్రబద్ధమో చేయటం ఆయన కవిత్వపు ప్రధానలక్షణమైనప్పటికీ, అప్పుడప్పుడూ ఈ కవి పాత్రలతో సుభాషితాలూ చెబుతాడు.
మిథ్యాప్రశంసా ఖలు నామ కష్టా యేషాం తు మిథ్యావచనేషు భక్తిః।
అహం హి యుద్ధాశ్రయముచ్యమానో వాచానువర్తీ హృదయేన లజ్జే॥ (2.60)
“ఎవరికైతే అబద్ధపు మాటలమీద ఆసక్తి ఉంటుందో, అలాంటి వారి పొగడ్తలతో నాకు నొప్పి కలుగుతుంది. నేను యోధుణ్ణని, యుద్ధంలో గొప్పగా పరాక్రమించానని అంటే బయట ఊరుకుంటాను కానీ మనసులో సిగ్గుపడతాను.”
ఈ మాటలు ఉత్తరకుమారుడు చెబుతాడు. ఉత్తరకుమారుడు గొప్ప యోధుడు అయి ఉండకపోవచ్చు, కానీ నిస్సందేహంగా గొప్ప ‘కవి’, గొప్ప సాహిత్యకారుడు. వేల యేళ్ళకు ముందు ఉత్తరకుమారుని చేత కవి చెప్పించిన ఈ పలుకు నేటికి (ఉత్త ‘కుమారు’ లైన కవులకు) కూడా వర్తిస్తూ, ఎంత నవనవోన్మేషంగా ఉందో తెలుస్తూనే ఉన్నది.
***
‘నాటకాంతే సాహిత్యం’ అని సంస్కృతసూక్తి. నేడు ఎక్కడో మూలలో తక్క సంస్కృతనాటకాలు ప్రదర్శనకు నోచుకోలేకపోయినా, అసలు ఆ భాషే మనకు లేకపోయినా, ఆ దృశ్యకావ్యాలు మాత్రం ఏవో రూపాల్లో కొనసాగుతున్నాయి. కనుక వాటి అధ్యయనం – నేడు ఉపయోగకరమే కాక గొప్ప సంతోషకరం కూడా.
అంతే కాదు, చక్కని సాహిత్యం వలన చక్కని సంస్కారం అలవడుతుంది. ఉపయోగించుకుంటే కావ్యంలో ఔచిత్యం – నిజజీవితంలో కార్యనిర్వహణ ఔచిత్యానికి బాటలు వేయగలదు. ఇటువంటి ప్రయోజనాలు గల నాటకాలను అనుశీలించటం ఏ కాలానికైనా లాభకరమే.