‘భవబంధాలు’ పంచే కథా మకరందాలు

0
7

[శ్రీమతి డి. కామేశ్వరి గారి ‘భవబంధాలు’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు శ్రీమతి వారణాసి నాగలక్ష్మి.]

[dropcap]శ్రీ[/dropcap]మతి డి. కామేశ్వరిగారు ఈ మధ్యే తన తొంభయ్యవ పుట్టినరోజున ‘భవబంధాలు’ కథా సంపుటిని ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలోనూ, తేనీటి విందులోనూ పాల్గొనమని ఆమె నుంచి ఫోన్ రాగానే – అయిదేళ్ల క్రితం ఆమె రాసిన ‘మహిమ’ నవలకి నే రాసిన ముందుమాటలో -‘ఎనభయ్యవ పడిలో ఉన్న ఒక రచయిత్రి ఇవాళ్టి ప్రకటనారంగాన్ని నేపథ్యంగా ఎన్నుకుని.. ఇంత కన్విన్సింగ్‌గా కథని కదను తొక్కించడం చూస్తే ఈవిడ సాహితీ సృజనలో ‘నైంటీ నాటవుట్’ అయినా ఆశ్చర్యం కలగదు’ అనడం గుర్తొచ్చింది. సరిగ్గా అలాగే – వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అంటూ ఆమె తన కొత్త కథా సంపుటిని తొంభయ్యేళ్ల వయసులో వెలువరించారు. ఆ సభలో పాల్గొన్న వారిలో ఇందిరా ధనరాజ్ గిరి వంటి ప్రముఖులు, ఎందరో సాహితీ ఉద్దండులూ ఉన్నారంటే ఆవిడ సాహిత్యం ఇంతకాలంగా ఎంతమందిని ఆకట్టుకుందో వేరే చెప్పనక్కర్లేదు.

ఈ సంపుటిలో 15 కథలున్నాయి. ఒకప్పుడు స్త్రీలెదుర్కొనవలసి వచ్చిన వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక సమస్యల్ని చర్చిస్తూ, కొత్తమలుపు(న్యాయం కావాలి) వంటి ఇతివృత్తాలతో స్త్రీల పక్షాన దృఢంగా నిలబడ్డ ఆమె – ఈ సంపుటిలోని కథల్లో అతివేగంగా మారిపోయిన నేటి సమాజపు ఒక పార్శ్వాన్ని ప్రతిభావంతంగా ఆవిష్కరించారు. వైవాహిక బంధాల్లో, కుటుంబ నిర్వహణలో, అనురాగ బంధాలు పెనవేసుకోవడంలో ఈనాటి మగపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ‘నో నాన్సెన్స్’ ధోరణిలో చర్చించి పరిష్కారాలు సూచించారు.

మొదటిదైన ‘భవబంధాలు’ కథ – జానకి, తన కొడుకు వరుణ్‌ని భార్యతో కలిసి ఆదివారం మధ్యాహ్న భోజనానికి రమ్మని పిలవడంతో మొదలవుతుంది. అతని భార్య ఇంట్లో లేదనీ, అతనితో చెప్పకుండానే పుట్టింటికి వెళ్లిందనీ తెలుస్తుంది. అతి గారాబంతో పెరిగిన ఆ కోడలుపిల్ల పనిపాటలేవీ నేర్వకుండా అత్తగారింటికొచ్చి, ఆవిడ వండిపెడితే తిని, ఉద్యోగానికి వెళ్లొస్తూ పుట్టింట్లోలాగే సాగించుకుంటుంది. తమ అపార్ట్మెంట్ తయారై వేరే కాపురం పెట్టాక కూడా ఆమె ఇల్లూ వాకిలీ పట్టించుకోకుండా పార్టీలంటూ తిరగడం, అవి నచ్చని మొగుడితో చీటికీ మాటికీ గొడవ పడడం జరుగుతాయి. మర్నాడు భోజనానికి వచ్చిన కొడుకుని మాటల్లో పెట్టి వారిద్దరి మధ్యనున్న సమన్వయ లోపాల గురించీ, కొరవడిన సామరస్యత గురించీ తెలుసుకుంటుంది జానకి. చివరికి కథ సుఖాంతమైన తీరు పాఠకులకి ఆహ్లాదాన్నిస్తుంది. కథ చదువుతున్న ఈనాటి అత్తగార్లు తప్పకుండా ఎక్కడో ఒకచోట తమని తాము చూసుకుంటారు.

ఈ సంపుటిలోని ‘తోడొకరుండిన’, ‘బతుకున బతుకై’ కథల్లోని ఇతివృత్తాలు కూడా అత్యంత సమకాలీనమైనవి. సర్దుబాటు తెలియకుండా పెరిగిన ఇప్పటి యువతరం వైవాహిక జీవితంలో ఎదుర్కొనే న్యూ ఏజ్ సమస్యలివి. ఈ మూడు కథలూ నిపుణుడైన చిత్రకారుడు అతి తక్కువ గీతల్లో ఒక సన్నివేశాన్ని స్కెచ్‌గా గీసిచ్చినట్టు రచించారు కామేశ్వరి గారు. కొన్ని కథల్లో ఆమె సూచించిన పరిష్కారాలు ‘క్విక్ ఫిక్స్’ ధోరణిలో కనబడుతూ సమస్య లోతుకి తగినంత ప్రాధాన్యతనివ్వలేదా అనిపించినప్పటికీ అధికశాతం ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇతివృత్తాలుగా ఎన్నుకుని కథలుగా మలచడంలో ఆమె విజయం సాధించారు.

‘ఆలస్యం అయింది’ కథలో ఇతివృత్తం పాతదే అయినా వాడిన టెక్నిక్, కథ నడిపిన కోణం, కథకు పెట్టిన శీర్షిక ఈ కథని మంచి కథల కోవలోకి చేరుస్తాయి. ‘వెంటనే వినవచ్చిన మగ కేకలు- ఆ కేకల మధ్య చిన్నగా ఏడుపు గొంతు, ఆడ మాటలు, తలుపు దఢాలున తీసిన చప్పుడు, అనవలసిన మాటలు, అరుపులు అయిపోయి గడప దాటి వెళ్లిన మగవాడు, అవమాన భారంతో కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న అమ్మాయి – తెలిసిన దృశ్యం! అంతలో సుడిగాలికి చీర లుంగలు చుట్టుకుని బాల్కనీ లోంచి ఎగిరిపోయినట్టు – ఓ చీర.. అది వట్టి చీర కాదనీ, చీరలో మనిషి ఉందనీ తట్టి, చేతులు చాచి పిలుస్తూ లేవబోయేలోగా ఆరో అంతస్తు నుంచి దబ్బున కింద పడ్డ చప్పుడు’

రెండు వాక్యాల్లో ఎంత వివరం చూపించారో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అనవసరాలన్నీ కత్తిరించి కథని చకచకా ముందుకి తీసుకుపోవడంలో కామేశ్వరి గారికున్న నేర్పు చాలా తక్కువమంది రచయితల్లో కనిపిస్తుంది. ‘ఇంత తొందర పడుతుందని ఊహించని వరలక్ష్మికి హఠాత్తుగా ‘అయ్యో! తను తొందర పడలే’దని తట్టిందంటారు. ఆత్మహత్య చేసుకున్న మిత్రులో, పరిచయస్థులో ఉండిన ప్రతి వ్యక్తికీ ఈ భావన కలుగుతుంది.

‘పేరెంట్స్ డెన్’- తమ అవసరాలకు కావలసినంత డబ్బుండీ, పూర్తిగా ఒంటరిగానూ ఉండలేక, పిల్లల ఇళ్లలో సర్దుకోలేక అవస్థ పడుతున్న వృద్ధులందరూ తమని తాము ఐడెంటిఫై చేసుకునే కథ ఇది. భార్య పోయిన జగన్నాధం తన పాత ఇల్లు పడగొట్టి బిల్డర్ ద్వారా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టించేటపుడు- టెర్రేస్ మీద అటాచ్డ్ స్నానాలగదితో సహా అన్ని సదుపాయాలూ ఉన్న గదులు కొన్ని కట్టిస్తాడు. ఒంటరైన పెద్దలు, తమ పిల్లలు కింద అపార్టుమెంట్లు కొనుక్కుంటే వాళ్లకి దగ్గర్లో తామూ స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండేందుకు వీలుగా ఉంటాయి పై మేడమీది ఆ గదులు. అందులో నివాసానికొచ్చిన వృద్ధులు పిల్లలు దగ్గరున్నారనే భరోసాతోనూ, అపార్ట్మెంట్స్‌లో నివాసముండే పిన్నలు ముసలివాళ్ల నిరంతర నిఘా లేని స్వేచ్ఛతోనూ – హాయిగా ఉండే వెసులుబాటు గురించిన చర్చ ఈ కథలో కనిపిస్తుంది. కామేశ్వరి గారి సృజన శక్తికీ, చుట్టూ కనపడే సమస్యల్లోంచి కొత్త కొత్త కథా వస్తువులనెన్నుకోగలిగే నేర్పుకీ ఈ కథ నిదర్శనంలా కనిపిస్తుంది.

కంప్యూటర్ల యుగంలో ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుని, భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాలతో తీరికలేని జీవితాలు గడుపుతూ, పిల్లల్ని కనడం వాయిదా వేయడం వల్ల వచ్చే కొత్త సమస్యల్ని ఎత్తి చూపిస్తుంది ‘పుత్ర కామేష్టి’ కథ. అప్పుడే పిల్లలొద్దనుకుని ఆలస్యం చేసి, చివరికి కావాలనుకున్నప్పుడు పిల్లలు పుట్టక, కృత్రిమ పద్ధతుల్లో లక్షలు ఖర్చుపెట్టి, ఎంతో ప్రయాసపడి, చివరికి ఒక బిడ్డని కన్న యువ జంట ఈ కథలో కనిపిస్తుంది.

జీవిత కాలమంతా భార్యని ఈసడించి, అధికారం చెలాయించిన భర్త కరోనా బారినపడి, భార్య చేసిన సేవలతో కోలుకుంటాడు. గదిలో బందీగా గడిపిన కాలంలో భార్య చేసిన సేవలూ, తన ప్రవర్తనను సహనంతో భరించిన తీరూ గుర్తొచ్చి పశ్చాత్తాప పడిన అతను ఇంకా పూర్తిగా బయటికి రాకముందే కరోనా అతన్ని మరోలా శిక్షిస్తుంది. సాధారణంగా ‘విలువలు తెలిసేది’ వ్యక్తిని కోల్పోయినపుడే అని తెలియజెప్తుంది.

జీవన ప్రయాణంలోనో, పిల్లల జీవితాల్ని చక్కదిద్దడంలోనో ఎదురయే సమస్యల్ని భార్యాభర్తల్లో ఒకరు దృఢంగా నిలబడి సమయస్ఫూర్తితో పరిష్కరించడం, రెండోవారు వారిని అనుసరించడం చూపించే ‘జీవిత పాఠాలు, భవబంధాలు, తోడొకరుండిన’- వంటి కొన్ని కథలున్నాయి ఇందులో. అవి చదువుతుంటే ఎవరికైనా ఇలాంటి సాహచర్యం దొరకడం ఎంత అదృష్టం అనిపించక మానదు. ఇదే సంపుటిలో ఇతర కథా సంపుటాల్లో చేరకుండా మిగిలిపోయిన ‘ఊరికి ఉపకారం, నగరంలో నాలుగిళ్ళు, మనిషి మారలేదు, వేట, నిమిత్తమాత్రులు’ వంటి కొన్ని పాత కథలు కూడా ఉన్నాయి. ఇతివృత్తం ఏదైనా ఆమె రచనలో చదివించే గుణం పుష్కలంగా కనిపిస్తుంది. ప్రత్యేకించి ‘వేట’ కథ చదివితే యాభయ్యేళ్ళ క్రితం ఒక రచయిత్రి ఇలాంటి ఇతివృత్తంతో కథ రాసి మెప్పించారంటే ఆశ్చర్యం కలుగుతుంది.

కారు యాక్సిడెంట్‌లో భార్యా బిడ్డల్ని ఒకేసారి పోగొట్టుకున్న వ్యక్తి దుఃఖసముద్రంలో మునిగి లేచి, జ్ఞాన సిద్ధి కలిగినట్టై, తన యావదాస్తినీ ఊరిబాగు కోసం ఖర్చు పెడతాడు. ధనవంతుడూ సమర్ధుడూ అయినవాడి జీవితం ఎంత విలువైనదో తెలుసుకున్న అతను తన సమర్ధతనూ, సంపదనూ ప్రజోపయోగానికి వినియోగించిన విధం ‘స్థితప్రజ్ఞుడు’ కథలో కనిపిస్తుంది.

ఆరు దశాబ్దాల పాటు విరివిగా కథలూ నవలలూ రాస్తూ పాఠకులని అలరించగలగడం, సంపాదకులని మెప్పించగలగడం సామాన్యమైన విషయం కాదు. పత్రికల్లో వచ్చే సాహిత్యాన్ని చదివే వారిలో కౌమారప్రాయం నుంచి ముది వయసు వరకూ అన్ని వయసుల వారూ ఉంటారు. రచయితగా ఇంతకాలం నిలబడాలంటే కాలంతోపాటు మారే సమాజాన్ని గమనించి, ఆయా కాలాలకి తగిన ఇతివృత్తాలని ఎన్నుకోవలసి ఉంటుంది. అందరినీ ఆకట్టుకునే రచన చేస్తూనే, ఆ రచనకు సామాజిక ప్రయోజనం ఉండేలా తీర్చిదిద్దాలంటే అది కత్తిమీద సామే. ముద్రణకి వాడిన మేలురకపు కాగితం, సౌకర్యంగా ఉన్న ఫాంట్ – చూపు మందగించిన వాళ్లకి కూడా పఠనసౌఖ్యాన్నిచ్చేలా ఉన్నాయి. కొద్దిగానే అయినా వాక్యార్ధాల్ని మార్చేసే అచ్చుతప్పులు అక్కడక్కడ కనిపించాయి.

‘ఇంక నాకు ఓపిక లేదు, ఇదే నా ఆఖరిపుస్తకం’ అని అనేకమార్లు ప్రకటించేసినా, మళ్లీ ఈ కొత్త పుస్తకంతో మన ముందుకి వచ్చిన కామేశ్వరిగారి సృజనాత్మక చైతన్య శీలత మెచ్చుకోదగ్గది. ‘హండ్రెడ్ నాటవుట్’ అంటూ ఆమె కలం ఇలాగే ముందుకి సాగి తన అనుభవసారాన్నీ, తనదైన దృక్కోణాన్నీ చూపిస్తూ- అనేక కొత్త తరపు సమస్యలకి తనకి తోచిన పరిష్కారాలతో మరిన్ని కథలందించాలని కోరుకుంటూ రచయిత్రికి అభినందనలు.

***

భవబంధాలు (కథల సంపుటి‌)
రచన: డి. కామేశ్వరి
పేజీలు: 196
వెల: ₹ 150/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
అచ్చంగా తెలుగు పుస్తకాలు – 085588 99478 (వాట్సప్ మాత్రమే)
రచయిత్రి:
శ్రీమతి. డి. కామేశ్వరి,
బ్లాక్ H-7, జలవాయు టవర్స్,
లోయర్ ట్యాంక్‍బండ్ రోడ్, హైదరాబాద్-80
ఫోన్: 9247331446
~
ఆన్‍లైన్‍లో
https://books.acchamgatelugu.com/products/bhava-bandhalu?sku_id=54194318

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here