భావవిహంగాలు – పుస్తక విశ్లేషణ

0
8

[box type=’note’ fontsize=’16’] “విశ్వకవి కవిత్వం చేత ప్రభావితమై ఒక ఉద్రేకంతో ఉత్సాహంతో చేసిన అనువాదం తప్పితే ఠాగూర్ లాంటి మహాకవిని తెలుగువారికి వివరించగల సామర్థ్యం ఉంది అని అహంకరించి చేసిన అనువాదం కాదు” అని చెప్పుకున్న డా. కల్లూరి శ్యామల గారి ‘భావవిహంగాలు‘ పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు వసుధారాణి. [/box]

[dropcap]డా[/dropcap]క్టర్ శ్యామల కల్లూరి వీరు ఢిల్లీ ఐఐటీ విశ్రాంత ఆచార్యులు. తెలుగు సాహిత్యానికి అరుదైన సేవలు అందించారు. స్వయంగా కవిత్వం, కథలు రాయటమే కాక, ఎన్నో పుస్తకాలను తెలుగునుంచి ఇంగ్లీష్‌లోకి అనువాదం చేశారు.

శ్యామలగారివి కొన్ని రచనలు 20వ శతాబ్దం మహిళా రచయిత్రుల కథల అనువాదం, 20 వ శతాబ్దం 100 తెలుగు కవితలు ఇంగ్లీష్ లోకి అనువాదం, గోదావరి, స్వగతాలు అనే కవితా సంపుటి స్వయంగా రచించారు.”If You Want To Be A Poet” ఆంగ్లములో రచించారు.

1998 లో శ్రీ రమణ గారి ‘మిథునం’ కథ అనువాదానికి కథ నేషనల్ అవార్డ్ ఫర్ ట్రాన్సలేషన్ వచ్చింది. తర్వాత మల్లేశ్వరి గారి ‘ఎ సాఫ్ట్‌వేర్ ఫర్ లైఫ్’ అదే టైటిల్‌తో అనువాదం చేశారు. ఆవకాయ.కామ్ అనే వెబ్ జర్నల్ లో ‘Selections from Sri Sri and other essays’ అనే పుస్తకం దాదాపు 50 శ్రీశ్రీ కవితలు అనువదించి, ఆయన మీద ప్రముఖ తెలుగు సాహితివేత్తలతో సాహిత్య వ్యాసాలు రాయించి, అనువదించి ప్రచురించారు. తెలుగు మహిళా రచయితల కథల అనువాదానికి 2001లో జ్యేష్ఠ అవార్డ్ వీరికి వచ్చింది.

శ్రీ రమణ గారిని వీరు కలిసినప్పుడు, ఆయన చెప్పారట మలయాళ డైరెక్టర్ వాసుదేవన్ నాయర్ గారు ‘మిథునం’కు వీరు చేసిన ట్రాన్స్‌లేషన్ చదివే డైరెక్ట్ చేశారని. తెలుగులో కన్నా మొదట మిథునం మలయాళంలో వచ్చింది.

రజనీగంధా పాపినేని శివశంకర్ గారి సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కవితా సంకలనాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేశారు.

“కంచికి వెళ్లకూడని కధలు” వీరి మరో రాబోయే పుస్తకం.

పుస్తకపఠనం నిరంతరంగా చేసే వీరు స్వయంగా ఎన్నో పుస్తకాలు సేకరించారు. పుస్తక పఠనం ఆసక్తిగా గల మరికొందరు మిత్రులతో కలిసి విశాఖపట్నం ‘పుస్తకాల పురుగులు’ అని ఒక చిన్న కూటమిని తయారు చేశారు. నిరంతరం సాహిత్యంతో మమేకమై వుండటాన్ని ఇష్టపడతారు.

వీరు ఎంతో సంక్లిష్టమైన “శ్రీ అరవిందుల కవిత్వంలో ప్రతీక వాదం” అనే టాపిక్ నుంచి డాక్టరేట్ పొందారు. అరవిందుని సావిత్రిని తెలియని వారు ఉండరు కదా. చెపుతూ పోతే వీరి గురించి ఎంతో చెప్పవలసినది ఉంది. ఐతే ఈరోజు వీరు అనువాదం చేసిన భావవిహంగాలు (STRAY BIRDS) మూలం రవీంద్రనాధ్ ఠాగూర్. ఈ పుస్తకం గురించి మాట్లాడితే వీరు ఏమిటో మిత్రులకి తెలిసి పోతుంది.

భావవిహంగాలు – డాక్టర్ కల్లూరి శ్యామల.

(STRAY BIRDS) రవీంద్రనాధ్ ఠాగూర్.

నిజానికి ఇవి నా భావాలకి అందనంత మృదువైన సుతిమెత్తని సిల్కురెక్కలు కల ఊహా విహంగాలు. ఐతే రవీంద్రుని ఆత్మని ఈమె చదివారా అన్నంతగా మైమరపు కలిగే లాగా ఉన్న ఈ భావవిహంగాలను మీతో పంచుకుంటున్నాను.

మూలం ఠాగూరు అయినా చలం అనువాదం చేసిన గీతాంజలి చలం వ్రాసినట్లే అనుకుంటాను నేను. ఎందుకంటే విశ్వకవి ఆత్మని చలం ప్రజెంట్ చేసినట్లు ఇంకెవరు చేయలేక పోయారని నా భావన. ‘గీతాంజలి’ ఇంకెవరి అనువాదాలూ నా మనసును అలా హత్తుకోలేదు.

మళ్ళీ ఈ ‘భావవిహంగాలు’ అలా అనిపించాయి. ‘సూర్యుణ్ణి చూడలేకపోయానని కన్నీళ్లు కారుస్తూ కూర్చుంటే నక్షత్రాలని కూడా చూడలేవు’. ఇక్కడ నాకు అనువాదం అన్న ఊహ పోయి తోటల్లో, నదీతీరాల్లో ఏళ్ల తరబడి ప్రకృతితో పరవశించిన విశ్వకవి ఠాగూర్ కనిపించాడు.

“నీడ తన మేలిముసుగుని సవరించుకుని వెలుతురుని రహస్యంగా, అణకువగా, ప్రేమగా అనుసరిస్తూ ఉంటుంది.”

“అప్పుడు ఆమె అడుగుల చప్పుడు ప్రేమ దేవత పదధ్వనిలా ఉంటుంది.”

ఇలా ఒక్కొక్కటి మనలోని భారాన్ని తగ్గించి మనస్సుని ఓ చిన్ని అతి తేలికగా ఎగిరే భావవిహంగంగా మార్చేవి.

“ఈ సృష్టిలో కొన్ని అందాలు స్పర్శ మాత్రం చేత వాడిపోతాయి. దూరంనుంచి వాటిని చూసి ఆనందించ గలిగితే శాశ్వతంగా నిల్పుకోవచ్చును.”

ఇంత సౌకుమార్యమైన భావన ఠాగూర్‌కి మాత్రమే కలుగుతుంది. శ్యామల గారు దాన్ని వడిసి పట్టటంలో ఎంతో నేర్పును చూపారు. అనువాదంలో మూలరచనకు పూర్తిగా న్యాయం జరిగిన సందర్భాలు ఇలా చాలా అరుదుగా ఉంటాయి.

శ్యామలగారు రవీంద్రునిపై అభిమానం గుండెల్లో నింపుకుని ఎంతో సగౌరవంగా, సవినయంగా తన మాటగా ఈ పుస్తకంలో ఓ మాట అన్నారు. అది నన్ను కదిలించిన మాట. “ఈ అనువాదంలో లోపాలు ఉండి ఉండవచ్చు. ఈ కవిత్వం చేత ప్రభావితమై ఒక ఉద్రేకంతో ఉత్సాహంతో చేసిన అనువాదం తప్పితే ఠాగూర్ లాంటి మహాకవిని తెలుగువారికి వివరించగల సామర్థ్యం ఉంది అని అహంకరించి చేసిన అనువాదం కాదు.”

అయితే ఆవిడ ఈ ప్రయత్నంలో 100% సఫలీకృతులు అయ్యారు. ముత్యాలు, వజ్రాల లాంటి భావ కవితల్ని పుస్తకంలో అందంగా పరిచారు. ఠాగూర్ని మళ్ళీ మనందరం మరొక్కసారి సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఠాగూర్ సాహిత్యానికి సరయిన అనువాదాలు కొరవడుతున్నాయి అని అనుకున్న సమయంలో ఈ భావవిహంగాలు నా చేతికి రావటం నాకు ఎంతో ఆనందం కలిగించింది. మిత్రులతో ఈ విషయం పంచుకోవటానికి ప్రేరేపించిన ఠాగూర్, కల్లూరి శ్యామల గారికి అభివాదములతో.

మరో మనసును తాకే కవితతో ముగిస్తాను.
“పుష్పాలు వికసించటానికి రాత్రి రహస్యంగా తోడ్పడుతుంది.
దానికి కృతజ్ఞతలు పగలుకు చెందుతుంటే కూడా చూస్తూ ఊరుకుంటుంది.”
ఈ పుస్తకం 1990లో విశాలాంధ్ర పబ్లికేషన్స్ నుంచి వెలువడింది. త్వరలో ద్వితీయ ముద్రణకు వెళుతోంది. ప్రస్తుతం అలభ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here