భవి

18
6

[dropcap]”సై[/dropcap]రన్ మోగుతోంది నిద్రలేవండి” తలుపులు బద్దలయ్యేలా బాదుతున్నారు విద్యార్థి పిల్లలు.

తెల్లవారి మూడైంది. బ్రహ్మీ ముహూర్తం. చెవులు గింగురుమనెలా సైరన్ మ్రోగుతోంది. ఆ శబ్దానికి చుట్టుప్రక్కల ఇళ్ళల్లో లైట్లు వెలిగాయి. విద్యార్థి గది మాత్రం ఇంకా చీకట్లోనే ఉంది.

అలసిపోయిన కళ్ళని అయిష్టంగా తెరుస్తూ తను నిద్ర లేచి, తన భార్య భుజం తట్టి నిద్ర లేపాడు విద్యార్థి. ఇంకా తలుపులు బాదుతూ ఉన్న పిల్లలకి

“అబ్బా వస్తున్నా” అంటూ తలుపు తీసాడు.

ఓ చిచ్చర పిడుగు పరిగెట్టుకుంటూ వెళ్ళి అమ్మ పక్కకి చేరాడు. మరొకడు వచ్చి మంచం మీద కూర్చున్నాడు.

“అసలు మీరిద్దరూ పడుకున్నారా?” అడిగాడు విద్యార్థి.

“పడుకొని లేచి తయారు కూడా అయ్యాం. సైరన్ మోగి పావుగంటైంది అంతా వెళ్ళి పోయుంటారు. మీరిద్దరే ఇంకా తయారుకాలే” నిష్ఠూరంగా అంటున్న విద్యార్థి కొడుకుని చూసి నవ్వుకుంటూ

“సరే పది నిమిషాల్లో వస్తున్నాం వెళ్ళు” అని పిల్లలిద్దర్ని హాలుల్లోకి పంపాడు.

ఆ రోజు పండుగ రోజు. పండుగకి ప్రత్యేకమైన కారణం లేని రోజులవి. నలుగురూ కలవడమే ఓ పండుగ. ప్రత్యేకంగా కట్టబడిన ‘ఆడిటోరియం’లో జరుపుతారా పండుగ. అటలు, పాటలు, రోజూ ప్రభుత్వం ఇచ్చే భోజనం కాకుండా రకరకాల రుచికరమైన పదార్థాలు, ముఖ్యంగా అక్కడున్న వాళ్ళందరికీ కావలసినంత ఆక్సిజన్ అందేలా ప్రభుత్వం ఆ ఆడిటోరియాన్ని కట్టడంతో ఎవ్వరూ ఆక్సిజన్ మాస్కులు, వేసుకోవలసిన అవసరం లేదు. అందుకే పిల్లలకి ఆ రోజంటే అంత సరదా. మూడింటికి సైరెన్‍తో మొదలై మర్నాడు రాత్రి పదింటికి మరో సైరన్‌తో ముగుస్తుంది. అయితే మూడు నెలలకి ఓసారి మాత్రమే చెయ్యగలరా పండగని ఆక్సిజన్ కొరత వల్ల.

విద్యార్థి తయారయి వచ్చేసరికి పిల్లలిద్దరు అప్పటికే ఇంటి తలుపు దగ్గర ఎదురుచుస్తున్నారు. ఈ శ్రద్ధ చదువుమీద చూపిస్తే మంచిది అని విద్యార్థి భార్య అంటుండగా కుటుంబమంతా పండక్కి బయలుదేరారు.

పూర్వం మనుషులు ఎలా ఉండేవారు? జంతువులంటే ఏంటి? వాటి జీవనం ఎలా ఉండేది? ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పిల్లలకి అక్కడ చూపిస్తారు. విద్యార్థి పిల్లలిద్దరూ వాటిలోనే లీనమైపోయారు. విద్యార్థి, అతని భార్య తమ స్నేహితులతో కాలక్షేపం చేస్తున్నారు. హఠాత్తుగా ఓ పెద్ద శబ్దం. చుట్టుప్రక్కల వాళ్ళంతా ఒక్కొక్కరుగా మాయమౌతున్నారు. విద్యార్థి కంగారుగా దిక్కుతోచక చూస్తున్నాడు. ఆ ఆడిటోరియం, తన స్నేహితులు, పిల్లలు, ప్రక్కన ఉన్న తన భార్య అంతా మాయమౌతున్నారు.

విద్యార్థి తన ‘వర్చ్యువల్ రియాలిటి’ కళ్ళజోడును ప్రక్కఅ విసిరికొట్టి, తన ‘స్పేస్ కాబిన్’ నుండి బయటకొచ్చాడు.

“భవి!!” అని గట్టిగా అరుస్తూ కంట్రోల్ సెంటర్ వైపు తేలుతూ వెళ్ళాడు.

“భవి! ఇది నా మెమొరీ టైమ్ ‘భవి’. నీకు లక్షసార్లు చెప్పాను దీన్ని పాడు చేయొద్దని” అటువైపు నుండి ఏ శబ్దం రాలేదు. విద్యార్థికి మరింత కోపం వచ్చింది.

“’భవి’! భవి!!” అని అరుస్తూ కంట్రోల్ సెంటర్ చేరాడు. అక్కడికి వెళ్ళేసరికి తన కళ్ళముందు స్క్రీన్ పై ఒక ‘ప్రొజెక్షన్’ ఉంది.

“ఈ పాలపుంతలో చివరి సౌర వ్యవస్థ ఇది. ఆ నక్షత్రం చుట్టూ నాలుగు గ్రహాల ఉన్నాయి. సూర్యుడికి భూమికి ఎంత దూరం ఉందో సుమారు అంతే దూరం ఈ నక్షత్రానికీ, మూడో గ్రహానికీ ఉంది. కాబట్టి అక్కడ ప్రాణులు వుండే అవకాశం, నీరుండే అవకాశం ఉంది. అక్కడికి వెళ్ళగలిస్తే…” ఇంకా ‘భవి’ పూర్తి చెయ్యకుండానే విద్యార్థి తనని ఆపాడు.

“అయితే అక్కడికే పద. నీకు పూర్తి కంట్రోల్ ఇచ్చి సంవత్సరమైంది. ఇది చెప్పడానికి నా ‘మెమొరీ టైమ్’ ఆపావా?” కోపడ్డాడు విద్యార్థి.

‘భవి’ నుండి ఏ జవాబు రాలేదు. విద్యార్థి తిరిగి స్పేస్ కాబిన్లోకి వెళ్ళి, మళ్ళీ తన వర్చ్యువల్ కళ్ళజోడు పెట్టుకొని తిరిగి ఆ పండగ రోజులోకి వెళ్ళిపోయాడు. భూమి కాలమానం ప్రకారం, విద్యార్థి స్పేస్‌లో ప్రయాణిస్తూ ఐదు సంవత్సరాలౌతోంది. రెండు సంవత్సరాల ముందు తమ ‘ఎర్త్ స్టేషన్’ నుండి సమాచారం రావడం కూడా ఆగిపోయింది. విద్యార్థి మాత్రం తాను సేకరించిన వివరాలు, విలువైన సమాచారం ట్రాన్స్‌మిట్ చేస్తూనే ఉన్నాడు, అంతరిక్ష యాత్రికులకెవరికైనా ఉపయోగపడొచ్చని.

తను ఇంకా మనిషిలాగే ఉన్నాడంటే, మనిషి బ్రతకగల మరో భూమిని వెతకాలనే అతని దృఢ సంకల్పం ఒక కారణమైతే, మరొకటి, ముఖ్యమైనది ‘భవి’. ‘భవి’ విద్యార్థి ‘వర్చ్యువల్ అసిస్టెంట్’. తేలికగా కంప్యూటర్ అని కొట్టిపారేయొచ్చుగాని అంతకంటే చాలా గొప్పది. స్పేస్‌షిప్ యొక్క నిర్వహణ, కొత్త సౌరవ్యవస్థల వెతుకులాట, వాటికీ సూర్య సౌరవ్యవస్థకీగల తేడాలు, వాటిమీద తన దగ్గర ఉన్న డేటాబేస్ లోని సమాచార నిర్వహణ ఇలా ఒకటి అని కాకుండా అన్నీ చేస్తుంది. ముఖ్యంగా విద్యార్థి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని రక్షించడం. అందులో భాగమే ‘వర్చ్యువల్ రియాలిటీ’ ద్వారా తన కుటుంబాన్ని తన ముందునట్లు, తన జ్ఞాపకాల్ని తిరిగి జీవిస్తున్నట్లు చెయ్యడం. దాన్ని ‘మెమొరీ టైమ్’ అంటారు వాళ్ళిద్దరు. అలిసిపోయి విద్యార్థి నిద్రపోయే ముందు లేదా అసలింకా మనుషులు భూమిపై ఉన్నారా? ఉంటే ‘స్పేస్ స్టేషన్’ ఎందుకు పలకట్లేదని అనుమానం కలిగినప్పుడు ప్రతీసారి తు.చ. తప్పకుండా తన వర్చ్యువల్ కళ్ళజోడు పెట్టుకొని జ్ఞాపకాల్లోకి జారుకుంటాడు. ఆ సమయం చెడగొట్టిందని ‘భవి’ మీద అంత కోప్పడిపోయాడు.

నిద్రలేచిన విద్యార్థికి జరిగిన గొడవ గుర్తొచ్చింది. తను అనవసరంగా కోప్పడ్డాడని అనిపించింది. చాలా సేపు కంట్రోల్ సెంటర్ వైపు వెళ్ళలేదు. కాని అతనికి ఆహారం కావాలన్నా ‘భవి’నే అడగాలి. స్పేస్‌షిప్‌లో కొన్ని సంవత్సరాలకి కావలసినంత ఆహారం పెట్టుకుని బయలుదేరాడు విద్యార్థి. కాని పూర్తి కంట్రోల్ ‘భవి’ దగ్గరే ఉంటుంది. ఇష్టమైన ఆహారం, వైన్, వీటికి అలవాటుపడిపోతే అవి పూర్తయ్యాక కష్టమౌతుంది కదా. అందుకే వాటిని ముఖ్యమైన సందర్భాలకి మాత్రమే వాడుతుంది ‘భవి’. మిగతా సమయాల్లో సాధారణమైన భోజనం ఇస్తుంది. తన వంట కాబిన్ దగ్గర ఉన్న కౌంటర్‌లో ఆ పూట ఆహారాన్ని ఉంచుతుంది. దాన్ని నీటిలో కలుపుకొని తినాలి విద్యార్థి. చాలా సేపు ఆకలి ఆపుకున్నా, ఇక ఉండలేక వంట కాబిన్ వైపు వెళ్ళాడు. అప్పటికే కౌంటర్‌లో ఆ పూట ఆహారం ఉంది.

‘ఐయామ్ సారీ’ అని మొహమాటంగా చెప్పి భోంచేసాడు. కాని క్షమాపణ అడగల్సింది చేతల్లో, వెంటనే కంట్రోల్ సెంటర్‌కి వెళ్ళి, నిన్న ‘భవి’ చూపించిన సౌరవ్యవస్థ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడు. దాని గురించి తమ దగ్గర పెద్దగా సమాచారం లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అక్కడి పరిస్థితులు భూమిలానే ఉండొచ్చు అన్న ఒకే ఒక్క ఆశతో వెళ్ళడం చాలా ప్రమాదకరమనిపించింది, కానీ విద్యార్థి అవకాశాన్ని వదులుకోవాలనుకోలేదు. తన టెలిస్కోప్ నుండి పొందిన సమాచారంతోనే ఆ గ్రహం కక్ష్యలోకి వెళ్ళడానికి తన స్పేస్‌షిప్‌లో చెయ్యాల్సిన మార్పులన్నీ చెయ్యడం మొదలు పెట్టాడు.

మార్పులన్నీ పూర్తిచేసి, అలిసిపోయి, ఆకలితో వంట కాబిన్ దగ్గరికి వెళ్ళాడు. మొత్తం సిద్ధమైందన్న ఆనందంతో తనకి ఇష్టమైన, ఆ స్పేస్‌షిప్‌లో దొరికే ఏకైక రుచికరమైన ఆహారం ‘మేగీ’ ఉంటుందనుకున్నాడు. కానీ ఆ రోజు కూడా ఎప్పటిలానే ముద్దచేయబడ్డ కూరలు, సెనగలు ఉన్నాయి. విద్యార్థికి చెడ్డ కోపం వచ్చింది. తినకుండా తన స్పేస్ కాబిన్‌కి వెళ్ళిపోయాడు. కాని అది తెరుచుకోలేదు.

‘భవి’ అని అరుస్తూ కంట్రోల్ సెంటర్ కి వెళ్ళాడు.

ప్రొజెక్షన్ మీద ‘48:00 అవర్స్ మోర్’ అనుంది. విద్యార్థికి విషయం అర్ధమైంది. “అయితే లాన్డ్ అయ్యాక వైన్ కూడా కావాలి.” సుమారుగా ఆదేశించాడు విద్యార్థి. ప్రొజెక్షన్ ఆగిపోయింది. “నీ దగ్గర ఉందని నాకు తెలుసు. లాన్డ్ అయ్యాక ‘వైన్’ అంతే” అనుకుంటూ తనకి ఇచ్చిన ఆహారమే తిన్నాడు. తన కాబిన్‌లో జ్ఞాపకాల్లోకి, తరువాత నిద్రలోకి జారుకున్నాడు.

ఒక గ్రహం కక్ష్యలోకి స్పేస్‌షిప్ తీసుకెళ్ళడం, అందులోనూ ఏ సమాచారం లేకుండా అన్నది అతి కష్టతరమే కాక మహా ప్రమాదకరం కూడా. గణాంకాలు ఏ మాత్రం తప్పినా కాలి బూడిదైపోతుంది స్పేస్‌షిప్. ఎలా ఉన్నా, ఎక్కడున్నా, తనకంటూ ఏమీ, ఎవరూ ఉన్నా, లేకున్నా, చావంటే మనిషి ఒకడుగు వెనక్కే వేస్తాడు. కాని అవేవి విద్యార్థిని ఒక్క క్షణం కూడా ఆపలేదు. తన ఆశయమే ఆయుధంగా, తన మేధస్సు తనకి దారి చూపించగా, కక్ష్యలోకి ప్రవేశించాడు. అక్కడి వాతావరణంలో జరిగే రాపిడికి రేగిన మంటలు తన స్పేస్‌షిప్‌ని చుట్టుముట్టాయి. నిప్పులు కక్కుకుంటూ క్షణాల తేడాలో ప్రాణాపాయం తప్పించుకుంటూ ఆ గ్రహంమీద క్షేమంగా వాలిపోయాడు విద్యార్థి. మనుషులకి అప్పటిదాకా తెలియని గ్రహం అది. విద్యార్థి ఆనందానికి హద్దుల్లేవు. చిన్నపిల్లాడిలా గట్టి గట్టిగా అరుస్తూ గాల్లోకి ఎగిరాడు. ‘భవి’ ప్రొజెక్షన్‌లో బాణాసంచా పేళ్ళుళ్ళ వీడియోలు వేసింది.

తన స్పేస్‍సూట్ వేసుకొని, డ్రోన్స్ తీసుకొని, భూమి జెండా పట్టుకుని ఆనందంతో, ఆసక్తితో, భయంతో, కాస్తంత గర్వంతో ఆ గ్రహంమీద అడుగు మోపాడు విద్యార్థి. అసలు పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. ఆ గ్రహంలో నీరుందా, జీవరాశులున్నాయా, ఉంటే మనిషికి ఉన్నంత మేధస్సు కలిగి ఉన్నాయా, ఉష్ణోగ్రతలేంటి, కాలాలేముండొచ్చు ఇలా వాతావరణం దగ్గర నుండి వనరులు దాకా ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి విద్యార్థి. తన డ్రోన్ల ద్వారా వచ్చే సమాచారాన్ని ‘భవి’ ప్రతి క్షణం పరిశీలించి అందజేస్తుంది. విద్యార్థి మొదట భూమి జెండా పాతి తన శక్తి మేరకు తిరిగి అక్కడి సమాచారాన్ని సేకరించాడు.

సేకరించిన ప్రతి సమాచారం, అర్ధం చేసుకున్న ప్రతి విషయం, అక్కడ గడుపుతున్న ప్రతీ క్షణం నిరాశ కలిగించాయి విద్యార్థికి. నీటి జాడ లేకపోవడం మొదటిదైతే, నీరు ఏర్పడడానికి కొన్ని వేల సంవత్సరాల దూరంలో ఉందా గ్రహం అని తేలడం ముఖ్యమైనది. తన డ్రోన్స్ ద్వారా తను వెళ్ళలేని దూరం వెళ్ళినా అక్కడ కూడా ఏమీ లేదన్న విషయమే మళ్ళీ రుజువైంది. నిరాశ మిగిల్చింది విద్యార్థికి తన స్పేస్‌సూట్ బరువెంతో తెలిపింది, ఓటమితో వంగిపోయి ఆ గ్రహాన్ని వదిలి వెళ్ళేలా చేసింది. అంతరిక్షంలో దిక్కుతోచక ఒంటరైపోయాడు విద్యార్థి. అతను కొన్ని రోజులపాటు ఎటు వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏమి అడగలేదు ‘భవి’ని. ఓటమి కన్నా గెలుస్తామేమో అన్న ఆశ పోగోట్టుకోవడం చేసే నష్టం ఎక్కువుంటుంది. అది విద్యార్థిని నిద్రాహారాలకు కూడా దూరం చేసింది. తినకపోవడం వల్ల శారీరకంగా ఒంగిపోయాడు. నిరాశవల్ల మానసికంగా కృంగిపోయాడు. చివరికి ‘భవి’ ఎంత ప్రయత్నించినా కనీసం మెమొరీ టైం కూడా తీసుకోవడం మానేసాడు విద్యార్థి.

ఆ పరిస్థితుల్లో ఓనాడు గట్టి చప్పట్ల శబ్దం తన నిద్రను లేపింది. చిరాకుగా కంట్రోల్ సెంటర్ వైపు వెళ్ళాడు. ప్రొజెక్షన్‌లో ఎప్పటిదో భూమి మీదటి వీడియో ఉంది.

“‘భవి’! ‘భవి’ ఏంటీ ఈ సుత్తి వీడియో? ఆపు!” అని చిరాకు పడుతూ, ఆపమని చెప్తూ తిరిగి తన స్పేస్ కాబిన్‌కి వెళ్తుండగా

“నౌ వుయ్ వెల్‌కమ్ ఆన్ టు ది డయాస్… మిష్టర్ విద్యార్థి!!” అన్న ప్రకటన విని ఆగి వెనక్కి చూసాడు. మాట్లాడబోతున్న విద్యార్థి ఆ ప్రొజెక్షన్‌లో ఉన్నాడు.

విద్యార్థికి ఆ వీడియోలో ఏముందో తెలుసు. ‘వర్చ్యువల్ కళ్ళజోడు’ పెట్టుకొమ్మని ‘భవి’ ప్రొజెక్షన్ మీద తెలిపింది. వర్చ్యువల్ మెమొరీలో ఆ క్షణానికి వెనక్కి వెళ్ళాడు విద్యార్థి.

మానవజాతి ఇక భూమి మీద బ్రతకలేదని అర్థమైన రోజులవి. అణు యుద్ధం వల్ల జరిగిన నష్టాలు, కొత్త కొత్త వింత రోగాలు, తుఫాన్లు, భూకంపాలు, కొన్ని నెలలపాటు కమ్మే నల్లటి మేఘాలు, తీవ్ర ఉష్ణోగ్రతలు, నింగిని చీల్చుకొని పడే పిడుగులు ఇలా అనేక రకాల విపత్తులు కొన్ని కోట్ల మంది ప్రాణాల్ని బలిగొన్నాయి. భూమికి మానవులపట్ల కోపం దాటిపోయి విరక్తి కలిగిందేమోననిపించిన రోజులవి. మానవజాతి కొనసాగాలంటే ఈ భూమిని వదిలి వెళ్ళాలి. మరో భూమి కావాలి. వేల ప్రయత్నాల్లో కొన్ని మాత్రమే విజయాన్నిచ్చాయి. అవి కనుగొన్న గ్రహాలు కూడా మనుషులు బ్రతికేందుకు అనువుగా లేనివి. ఈ సేకరించిన సమాచారాన్ని ఉపయోగిస్తూ, అంతరిక్ష పర్యటనలో అప్పటికప్పుడు నిర్ణయాలని తీసుకోగల ఒక ‘సూపర్ కంప్యూటర్’ కావల్సివచ్చింది. ఒక ‘వర్చ్యువల్ అసిస్టెంట్’ కావాలి. ఆ రోజు విద్యార్థి కనుగొన్న ఆ ‘వర్చ్యువల్ అసిస్టెంట్’ని ప్రపంచానికి పరిచయం చేసిన రోజు.

“దీనికి శాస్త్రపరమైన పేరేదైనా, నేను పెట్టుకున్న పేరు (నా భార్య పేరు) ‘భవి’త. మరో భూమిని వెతకడంలో, మనందరి భవిష్యత్తు మార్చడంలో ఇది కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను” అన్న విద్యార్థి మాటలకి చప్పట్ల హోరు మారుమోగింది. తన వర్చ్యువల్ కళ్ళజోడు తీస్తూ ప్రొజెక్షన్ వైపు చూసాడు. ‘భవి’ ఏం చెప్పాలనుకుంటోందో విద్యార్థికి అర్థమయింది. తన కుటుంబాన్ని పోగొట్టుకున్న తరువాత కూడా ఆ బాధ నుండి బయటకొచ్చి ‘భవి’ని కనిపెట్టాడు విద్యార్థి. అలాంటిది ఇప్పటి ఈ ఓటమి అతన్ని ఏమీ చెయ్యలేదు. ఒక్క క్షణం అదంతా మళ్ళీ గుర్తుచేసుకున్నాడు విద్యార్థి. తన లోపల ఆశని మళ్ళీ బ్రతికించుకున్నాడు. చిరునవ్వుతోనే ‘భవి’కి కృతజ్ఞతలు చెప్పాడు. తిరిగి తన కాబిన్‌కి వెళ్తుండగా ఫుడ్ కౌంటర్ తెరిచి ఉంది. అందులో వైన్, అతనికిష్టమైన, అక్కడున్న ఒకే ఒక్క రుచికరమైన పదార్ధం ‘మేగీ’ కనిపించాయి. ఒకవేళ అంతరిక్షంలో శబ్దం ప్రయాణిస్తే, ఆ రోజు తాగి విద్యార్థి పాడిన పాటలు చుట్టుప్రక్కల గ్రహవాసులందరి నిద్రలు చెడగొట్టుండేవి.

తలపట్టుకు నిద్రలేచాడు విద్యార్థి. అతని కోసం కాఫీ సిద్ధంగా ఉంది. కంట్రోల్ సెంటర్లో ప్రొజెక్షన్‌పై తను నిద్రపోయినప్పటినుండి ‘భవి’ చేసిన, చేస్తున్న పనంతా కనబడుతోంది. ఇంతకు ముందటి గ్రహం నిరాశ మిగిల్చినప్పటికీ ఈ పాలపుంతలో తమ డాటాలో లేని సౌర వ్యవస్థలు మరిన్ని ఉన్నాయన్న విషయం రుజువుచేసింది. తమకు తెలిసిన మూడు వేల సౌరవ్యవస్థలు కాక మరిన్ని నక్షత్రాలవైపు వెళ్ళొచ్చని అర్థమైంది. తమ వద్ద మిగిలిన వనరులు, ఇంధనం, ఇతర నక్షత్రాల గురుత్వాకర్షణ శక్తిని తమ వేగానికి ఉపయోగించు కోగలిగే తీరు, ఇలా ప్రతి విషయం పై ‘భవి’ లెక్కింపు వేసింది. విద్యార్థి తన యాత్రని ముందుకు తీసుకువెళ్ళాడు. తెలియని సౌరవ్యవస్థల్ని, గ్రహాల్ని కనుకొన్నారు. తను కనుగొన్న ప్రతీ గ్రహం, నీరున్నా లేకున్నా, ప్రాణం ఉండే పరిస్థితులున్నా లేకున్నా విద్యార్థికి విజయంలాగే కనిపించింది. ఆనందాన్నే ఇచ్చింది. మెల్లిగా స్పేస్‌షిప్ లోని వనరులు తగ్గిపోసాగాయి. కాని వెనక్కి తిరిగి వెళ్ళలేని ప్రయాణమది. అదే చివరి సౌరవ్యవస్థ అవొచ్చు అనుకొని, అందులో వారి అంచనా మేరకు ప్రాణం ఉండొచ్చు అనిపించిన ముఖ్యమైన గ్రహానికి చేరుకుంది స్పేస్‌షిప్.

ప్రతీ గ్రహం పైనా చేసే పనే, భూమి జండా, డ్రోన్లు పట్టుకొని స్పేస్ సూట్ వేసుకొని ఆ గ్రహంపై కాలుమోపాడు విద్యార్థి. చుట్టూ రాళ్ళే కనిపించాయతనికి. పరిశీలన కోసం డ్రోన్స్ పంపించి తను కూడా వెళ్తుండగా, అప్పటికే అక్కడి గాలిని విశ్లేషించిన ‘భవి’ విద్యార్థికి శుభ సమాచారం అందించింది. వాతావరణం మనిషి ఊపిరి పీల్చేందుకు అనువైంది. కొన్ని సంవత్సరాల తరువాత ఒక నేలమీద, తన స్పేస్‌సూట్ లేకుండా అక్కడి గాలి పీల్చే అవకాశం కలిగింది. విద్యార్థికి మరింత ఆసక్తి పెరిగింది. ప్రతీ కోణం వెతికేందుకు డ్రోన్లని పంపాడు. కొంత సమయంలోనే నీటి జాడ తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్ళి, ఆ నీటిని పరిశీలించి, తాగాడు. అక్కడ మట్టిని పరిశీలించసాగాడు.

తమవద్ద ఉన్న డాటాబేస్‌లో అతను తెలుసుకున్న సమాచారం అంతా పెడుతుండగా, ఆ స్పేస్‌షిప్ బయట సమస్య ఉందని ‘భవి’ సమాచారం యిస్తే అసలు ఊహించలేనిది చూసాడు విద్యార్థి. తన జీవితంలో మళ్ళీ చూడలేననుకున్నది అసలు ఊహించలేనిది బయటకు వెళ్ళి చూసాడు. ఆశ్చర్యం, ఆనందం కలిసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తను పంపిన డ్రోన్స్‌ని అనుసరిస్తూ ముగ్గురు మనుషులొచ్చారక్కడికి. వేరే మనిషిని విద్యార్థి చూసి కొన్నేళ్ళవుతోంది. మనసుకి ఆత్రుత ఉన్నప్పటికీ అతని శరీరం భయపడుతూనే ముందుకు వెళ్ళింది. తన కళ్ళు పెద్దవై వారిని పరిశీలిస్తుండగా, తన ముందున్నతని ముఖాన్ని తాకాడు విద్యార్థి. అప్పుడే వాళ్ళు మనుషులని, అది నిజమని పూర్తిగా నమ్మాడు. ఆ వ్యక్తి చిరునవ్వు విద్యార్థికి స్వాగతం తెలిపింది. ఆ ముగ్గుర్ని ముట్టుకొని, గట్టిగా పట్టుకొని, దగ్గరకి తీసుకున్నాడు విద్యార్థి. తన కన్నీరు ఇన్నాళ్ళూ పడ్డ బాధనీ, నవ్వు ఆనాటి ఆనందాన్ని తెలిపింది.

ముగ్గుర్నీ తీసుకుని “భవి’!!” అని అరుస్తూ, స్పేస్‌షిప్ లోకి వెళ్ళాడు విద్యార్థి. “’భవి’! మనుషులు!” పరిచయం చేసాడు.

అంతరిక్షంలోని, ముఖ్యంగా వేరే గ్రహాలమీద సమయం, భూమి మీద సమయం ఒకే విధంగా ఉండవు. ఒక్కోసారి కొన్ని గ్రహాల మీద ఒక గంట, భూమి మీద కొన్ని రోజులు, సంవత్సరాలైనా కావచ్చు. అలా భూమి కాలమానం ప్రకారం విద్యార్థి భూమిని వదలి ఇరవై సంవత్సరాలు దాటుండొచ్చని వారితో మాట్లాడాక తెలిసింది.

విద్యార్థి భూమిని వదలి, మరో భూమిని వెతుకుతూ బయలుదేరిన కొంతకాలానికి భూమిపై పరిస్థితులు మరింత విషమించాయి. దేశాలంతా ఒకే త్రాటిమీద నడవలేకపోయాయి. ఎవరి అంతరిక్ష పరిశోధనలు వారు ప్రారంభించారు. అవి తిరిగి యుద్ధాలకు దారితీసి కోట్ల మంది ప్రాణాలు బలిగొన్నాయి. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కూడా మూసివేయాల్సిన పరిస్థితి కలిగింది. చివరికి స్పేస్‌షిప్ గురించి తెలిసినవారు ఆ సౌకర్యం ఉన్నవాళ్ళు మిగిలిన మనుషులను వదిలి అంతరిక్షంలో మరో భూమిని వెతుకుతూ బయలుదేరారు. అలాంటి వాళ్ళలో అదృష్టవంతులు ఈ గ్రహంలో విద్యార్థికి పరిచయమయ్యారు. మిగతా వాళ్ళు ఎక్కడున్నారో, అసలున్నారో లేరో, భూమిమీద మిగిలిన మనుషులేమయ్యారో ఏ సమాచారం వారి దగ్గర లేదు. వారికి తోడున్నదల్లా విద్యార్థి, ‘భవి’ పంపిన సమాచారం, ‘వర్చ్యువల్ అసిస్టెంట్’పై విద్యార్థి చేసిన పరిశోధన. ఆ పరిశోధన ఆధారంగానే ప్రతీ దేశం తమ వర్చ్యువల్ అసిస్టెంట్లని చేసి వారి వారి స్పేస్‌షిప్‌లలో వాడింది.

విద్యార్థి వచ్చిన విషయం తమ స్పేస్ సెంటర్‌కి చెప్పి, అతని స్పేస్‌షిప్‌తో సహా అక్కడికి తీసుకెళ్ళారు ఆ ముగ్గురు. స్పేస్ సెంటర్, చుట్టూ మనుషులు, మాస్క్‌లు లేకుండా పీల్చదగ్గ గాలి, ఇళ్ళు, పిల్లలు, కుటుంబాలు, మొక్కలు, విద్యార్థి మాటిమాటికి తనకి తాను ఇదంతా నిజమని చెప్పుకుంటూనే ఉన్నాడు. విద్యార్థికి స్పేస్ సెంటర్ లో ఘన స్వాగతం, సన్మానం లభించాయి. సెంటర్ హెడ్ సహా ప్రతి ఒక్కరు అతను చేసిన పరిశోధన, అందించిన సమాచారం అక్కడి మనుషులకి ఎంత ఉపయోగపడ్డాయో తెలుపుతూనే ఉన్నారు. విద్యార్థి ప్రతీ ఒక్కరితో ‘నేను’ అని కాక ‘నేనూ భవి’ అనే మాట్లాడాడు. విద్యార్థికి ఉండేందుకు ఇల్లు, అలాగే అదే స్పేస్ సెంటర్‌లో మరింత పరిశోధన చేసేందుకు అవకాశం ఇచ్చారు. అతని స్పేస్‌షిప్‌ను బాగుపరిచి మరింత ఆధునికంగా మార్చేందుకు తీసుకున్నారు. ‘భవి’ని వదలి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. తన వద్దనున్న సమాచారం అక్కడి స్పేస్ సెంటర్ సిస్టమ్‌కి అప్పటికే ఇచ్చింది ‘భవి’. విద్యార్థికి వీడ్కోలు చెప్పే ధైర్యం కూడా లేకపోయింది. తను రిమోట్‌గా కనెక్ట్ అవుతూనే ఉంటానని, తన పరిశోధన మొదలయ్యాక ఎలానూ ‘భవి’ అవసరం ఉంటుందని ఇలా ఇంకా ఇబ్బంది పడుతుండగానే ప్రొజెక్షన్ పై

“విద్యార్థి! ఐ యామ్ ఎ కంప్యూటర్” అంది ‘భవి’. ఊపిరాగినంత పనైంది విద్యార్థికి.

‘భవి’ అతనికి కేవలం ఒక కంప్యూటరా! ఎప్పుడూ కాదు, కాలేదు.

మర్నాడు అక్కడి ముఖ్య శాస్త్రవేత్తను కలిసి ఆ గ్రహం పరిస్థితులు, వనరులు, కాలాలు, అక్కడికి వారొచ్చిన తీరు మొత్తం తెలుసుకున్నాడు విద్యార్థి. ఇంతటి అనువైన గ్రహం ఉందని మిగిలిన మనుషులకి తెలియాలి అన్నాడు విద్యార్థి.

“కానీ ఆ విషయం ఎవ్వరూ మాట్లాడరు. మాట్లాడితే భూమిపై లక్షల మందిని వదిలి వచ్చినందుకు, ఈ గ్రహం కనుగొన్నాక మరే స్పేస్‌షిప్‌కి ఆ సమాచారం కూడా ఇవ్వనందుకు ముందు బాధ తరువాత పశ్చాత్తాపం కలుగుతాయి. అవి తిరిగి ఇక్కడి ప్రజల్ని గుంపులుగా విడదీసి గొడవలకి దారితీస్తాయి” అక్కడి ముఖ్య శాస్త్రవేత్త ఇచ్చిన వివరణ విద్యార్థికి ఏ మాత్రం అర్ధవంతంగా అనిపించలేదు. స్వార్థం, భయం తప్ప వారిలో మరేం కనిపించలేదు. గ్రహాలు, సౌరవ్యవస్థలు, పాలపుంతలు దాటి వచ్చారు. అయినా మనిషి మారలేదు. అతని స్వార్థం వదలిపోదు. వారాలు, నెలలు గడిచినా, జీవితం సాధారణమౌతున్నా విద్యార్థికి శాంతి లేదు. స్పేస్‌షిప్‌ని చూడ్డానికి వెళ్ళినప్పుడల్లా ‘భవి’తో ఇవే విషయాలు షేర్ చేసుకునేవాడు. చుట్టూ మనుషులున్నా, మెమొరీ టైం అవసరం లేకపోయినా అతనికి మానసిక ఆనందం అయితే లేదని అర్ధమైంది ‘భవి’కి.

ఓనాడు అతని స్పేస్‌షిప్‌కి అనవసరంగా ఇంధనం, అధిక వనరులు వెళ్ళాయని, అందుకు రిక్వెస్ట్ విద్యార్థి నుండే వచ్చినట్టుందని అక్కడి ముఖ్య శాస్త్రవేత్త నుండి అందుకు కారణం అడుగుతూ మెయిల్ వచ్చింది అన్నాడు. విద్యార్థికి అర్థం కాలేదు. అతను అలాంటి రిక్వెస్ట్ ఏం పెట్టలేదు. పైగా ఇంధనం అవసరం అసలు లేనేలేదు. అలాంటి రిక్వెస్ట్ తను పెట్టలేదని రిప్లయి పంపిన కొన్ని నిమిషాలకే విద్యార్థికి విషయం అర్థమైంది. మరుక్షణం తన స్పేస్‌షిప్‌కి వెళ్ళాడు. అప్పటికే ఇంధనం వనరులు, అక్కడికి వాళ్ళు ఆ గ్రహానికి వచ్చిన తీరు, దగ్గరలోని సౌరవ్యవస్థలు, ఇలా సమాచారం అంతా సిద్ధం చేసుంచింది ‘భవి’. విద్యార్థి పెదవిపై ఓ చిరునవ్వు. అక్కడి ముఖ్యశాస్త్రవేత్త, మిగిలిన సిబ్బంది ఆపాలనుకున్నా ప్రయోజనం లేకపోయింది.

ఇంతకు ముందు మనిషి బ్రతకగల మరో గ్రహం కోసంమైతే, ఈసారి అంతరిక్షంలో తప్పడిపోయిన మనుషుల కోసం ప్రయాణం మొదలు పెట్టారు విద్యార్థి, ‘భవి’త.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here