భయానికి వచ్చిన ధైర్యం

0
11

[శ్రీమతి యామినీఅశోక్ రచించిన ‘భయానికి వచ్చిన ధైర్యం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“భ[/dropcap]యంగా ఉండాదిరా లోకేషా!” నులకమంచంపై ఓ పక్కకు ముడుచుకుని పడుకుని, పక్కనే కింద చాపపై పడుకున్న తమ్ముడుతో అంది పోలమ్మ.

“అరే..‌! ఏంగాదులే అక్కా! ఆ పొద్దు కాడ్నుంచీ ఒకటే సతాయిస్తుండావూ..! చీకటి పడిన కాడ్నుంచీ ఇదే వరస. నువ్వు పండుకో ముందర. నన్ను గూడా నిద్దరపోనీ!” సున్నితంగా విసుక్కున్నాడు లోకేష్.

“అదిగాదురా! ఊర్లో పెద్దోళ్ళంతా అప్పుడనంగా అడివికి పోతిరి. అడివి పందిని ఈళ్ళంతా కలిసి పట్టుకోగలుగుతారా ఏంది..!? అయినా ఆడోళ్ళన గూడా ఏసుకుపోయినారెందుకో అయ్యోళ్ళు. పొద్దుపొయ్యింది గూడా! ఊళ్ళో అంతా పిలకాయలమే ఉంటిమే!”

“అబ్బబ్బా.. ఏందే నీ గోల. నన్ను నిద్దరబోనీవా ఏంది!?” టక్కున చిరుగుల దుప్పటి పక్కకు లాక్కుని లేచి కూర్చున్నాడు లోకేష్.

“అది గాదురా! ఆ అడివిపందిగాని ఈళ్ళని తప్పించుకుని ఊరుమీదబడితే, మనవంతా పిలకాయలమే గదారా..!?” చిన్న స్వరంతో భయంగా అందామె.

ఇంతలో ఆ నిశిరాత్రిలో, గుడిసె ద్వారానికి తాడుతో కట్టిన తడిక కదిలింది. ఆ శబ్ధానికి రహస్యంగా మాట్లాడుకుంటున్న ఇద్దరూ భయంతో బిగుసుకుపోయి అటు చూసారు.

తడిక ముందుకూ వెనక్కూ ఊపుతున్నట్టు వేగంగా కదులుతోంది.

“వచ్చేసిందిరా..! ఇన్నిరోజులూ ఊరిబయట పొలాల్లో పనిచేసేటోళ్ళమిందనే దాడి జేసేది. మనం అమ్మా అయ్యోళ్ళు అడివికి బోయి దాన్ని గెలికినారు. అదిప్పుడు ఊరు మింద బడిందిరా నాయనా..!?” శబ్ధం పెద్దగా రానివ్వకుండా నోటిని రెండు చేతులతో కప్పుకుని మంచంమధ్యలో ముడుచుకు కూర్చుని ఏడుపు లంకించుకుంది పోలమ్మ.

“ఇదిగో.. తలుపెనక అది ఎవురో? ఏందో..!? తెలీకుండా ఆగాయిత్యం చైబాక. నేనేం చిన్న పిల్లోడ్నిగాదు. పదారేళ్ళు నాకు. నేం జూసుకుంటా భయపడమాక.” రహస్యంగానే మాట్లాడి అక్కకు ధైర్యం చెబుతూ.. చూరులో దోపి ఉన్న కొడవలిని లాగి చేతిలో పట్టుకుని కదులుతున్న తడికవైపే కన్నార్పకుండా చూస్తూ కూర్చున్నాడు లోకేష్.

“ఒరే..! పుడింగి నాయాలా!? నువ్వొక్కడివేం జేస్తావ్ రా! అడివిపంది, పులిని గూడా పీస్ పీస్ జేసేస్తదని అయ్యజెప్పుళ్ళా..!? ఆ మల్లేసు గోడ్నైనా ఓ కేకైరా!?” నిస్సహాయత కోపంగా మారి, భయంతో వణికిపోతూ ఏడుస్తోంది పోలమ్మ.

“ఎవుడు!? ఆ మల్లేశుగాడ్నా!? వాడుత్త పిరికినాయాలు. ఆడి తమ్ముడికి పదమూడేళ్ళైనా, ఆ ఓబులేశుగోడే నయ్యం.” చూపు కదులుతున్న తడికిమీద నుండి మరల్చకుండా అన్నాడు లోకేష్.

హఠాత్తుగా తడిక బలంగా తోస్తున్నట్టు ముందుకు ఊగింది.

పోలమ్మ కెవ్వుమంది. లోకేష్ బిత్తరపొయ్యాడు.

పోలమ్మ పెట్టిన కేకకి బిత్తరపోయిన లోకేష్ చెయ్యి ఏమరపాటున తడికకి ఉన్న తాడు మీద పడటం, తడిక ఊడటంతో ఒక్క ఉదుటున లేచింది పోలమ్మ.. కింద పడిన తడికని ఎత్తి అడ్డుగా పట్టుకుని నిలబడింది.

లోకేషుకి గొంతుక తడారిపోతోంది. ఇక పోలమ్మ సంగతి చెప్పాల్సిన పని లేదు. తలుపు తెరుచుకునేసరికి రివ్వున వీచిన గాలికి అంతంత మాత్రంగా ఉన్న దీపం కొండెక్కిపోయింది.

ఇక పోలమ్మ పెట్టే శోకాలకి అంతు లేకుండాపోయింది.

“ఓరే లోకేసూ.. ఎలపటికైనా పోదాంరారా! వాకిట్లోకి పందులు జొరబడినట్టుంది. రారా అయ్యా..! నీకు దండం పెడతా..! ఇగో, నే జెప్తాండేది నిమ్మలంగా ఇనుకో, ఓరం గా వచ్చి తడికె దియ్యి. అయి లోపటికి అస్తయ్. ఆపళంగా లగెత్తుకొని పోదాం. ఏ గుళ్లోనో, బళ్ళోనో గుట్టుగ కూసుందాం. అయ్యోళ్ళు వచ్చిన్దనుక.”

“ఎహె, ఊకే అరవబాక. అయ్యి పందులు గాదేమో లే. అయ్యుంటే ఇంత దాంక గమ్ముగుంటాయా..! అరుపులు ఇనరావా పందులు అయ్యుంటే..! ఆ తలుపు నే బట్టుకుంట గనీ, నువ్ పొయ్యి ముందు దీపం ఎలిగించు.”

“ఒరినీ పాసుగాల.. నేనీడ వొణికి జస్తాంటే దీపం ఎలిగించాలనా..! అమ్మా.. పందులూ.. మేమీడనే కూకోని ఉండామని పేరంటం జెప్పేదా సన్నాసోడా!”

లోకేషుకి ఆ పరిస్థితిలో కూడా నవ్వొచ్చింది గానీ, ఇప్పుడు గానీ నవ్వితే పోలమ్మ నోటికి అడ్డు ఆపూ ఉండదని తెలుసు.

అందుకే.. “సర్లేగనీ, నువ్వాపళంగా గట్టిగా పట్టుకో, నేను పొయ్యి దీపం ఎలిగిత్తా” అనేసరికి పోలమ్మ గిజగిజలాడి పోయింది.

“ఓరయ్యో! నేనేపాటి దాన్నిరో రబ్బయ్యా! నువ్వాడికి బొయ్యేపాలికి ఇయ్యి ఇట్లా దోసుకొని జొరబడి నయ్యనుకో.. నేను దిక్కులేని సావుజావాల నన్ను ఆ పందులు ఇరుసుకు తింటాంటే నువ్వు సంమ్మంగా జారుకుందామనా..!”

“ఎహె. నీ.. గోల..!”

“ఇగో, ఇగో జూడ్రా.. ఈ తడికె ఊడిపోతాందిరా రేయ్ అయ్యా! నా పని అయిపోనాదిరిరో.. యవ్వా, అయ్యా యాడున్నారే.. రాండే.. ఇగ మీకు పోలమ్మ లేదు.. ఈ ముదనష్టపోడు ఒక్కడే నే.. మీకిగా..! తల్లో..” అంటూ శోకాలు పెడుతోంది.

ఇక లోకేషు కోపం ఆపుకోలేక , “ఒసేయ్, అక్కవికాంగ బతికిపోతివి. చుప్.. సప్పుడు జేస్తివంటే పందులు గావు, నేను జంపుత నీ.. చుప్..” అని గట్టిగా అరిచేసరికి పోలమ్మ గొంతులో రాయి పడ్డట్టు బిగుసుకుపోయింది.

“ఇప్పుడు జూడు, రోంత సవుండు తగ్గిన్ల్యా..!”

పోలమ్మ భయంతోనూ, తమ్ముడు తిట్టాడన్న కోపం తోనూ బదులు పలకలేదు.

కాసేపటికి, మామూలయ్యి “నిజమేరో! ఇందాకటిమింద సవుండు తక్కువాయే. కానీ, ఈ అడివి పందుల్ని నమ్మలేమబ్బా! అదాట్టుగా మీదబడినయ్యనుకో..! లగెత్తుకొని బొయ్యేపాలికే మన పేనాలు గాల్లో కలిసిపోతుండ్లా..!”

“ఎహె, పద్దాక సావు సావు అని సంపక తింటాండావు గదే, రానీయే.. పందుల్ని అయ్యో, మనమో జూసుకుందాము.” అంటూ పోలమ్మని ఒక్క తోపు త్రోసి, తడికని రెండు చేతుల్తో ఎత్తి పట్టుకున్నాడు. పక్కకి లాగేశాడు తడికని.

చిమ్మచీకట్లో గభాల్న రెండు ఆకారాలు లోనికి దూరేసరికి పోలమ్మకి పిచ్చి ధైర్యం వచ్చేసింది. లోకేషు తోసిన తోపుకి పోలమ్మ ఎల్లకిలా పడబోయి తట్టుకోని ఇంటిమూలకి చేరింది. మూలకి ఆనించిపెట్టిన పంగలకర్ర మీద పడింది ఆమె చెయ్యి. ఆమెకి వచ్చిన ధైర్యానికి కర్ర తోడయ్యింది. అంతే గుడ్డి వాటంగా బాదుడు మొదలు పెట్టింది.

కెవ్వు కెవ్వు మని కేకలు.. అందులో ఒక గొంతు లోకేషుది. “సచ్చానోసే..!” అంటూ. అసలు లోనికి దూరినవి ఎవరు? ఏంటన్నది పెద్ద ప్రశ్న అయ్యింది పొలమ్మకి. గభాల్న బయటికి పోయి “లోకేసూ గభాల్న ఎలపటికి రారా!” అంటూ గగ్గోలు పెట్టేస్తోంది.

అప్పటికే పోలమ్మ గుడ్డి వాటం దెబ్బలు తిన్న ఆ ఆకారాలు.. “ఒరే లోకేసూ మీయక్క సావనూకిందిరా అయ్యా..!” అంటూ ఏడవడం మొదలుపెట్టారు.

“వొవుర్రా.. జీకట్ల ఇళ్లలోకి జొరబడింది?” అని లోకేషు అరిచినా.. అంత టెన్షన్ లోనూ ఒక నిశ్చింత అనిపించింది లోకేషు కి.. అవి పందులు కానందుకు.

“ఒరె ఒరే.. మీ పాసుగాల.. ఇదేందిరా.. ఇట్టా జేసిన్రు. అట్నే కూసోండి. బుడ్డి దీపం ఎలిగిత్తా” అంటూ తడుముకుంటూ పొయ్యికాడికి పొయ్యి గూట్లో అగ్గిపెట్టె తీస్తూ అక్కని పిలిచాడు.

“యకా.. రాయే పందులనుకోని జావగొట్టింది ఎవుర్నో జూద్దువు గానీ,రా!” అంటూ. బిక్కుబిక్కుమంటూ బయటే నిల్చున్న పోలమ్మ నిదానంగా లోనికి వచ్చి తమ్ముడూ వెలిగించిన బుడ్డి దీపం వెలుగులో ఆ ఇద్దర్నీ జూసి పకపకా నవ్వుతూ “ఓరి ఓబులేసు.. మల్లేసు.. మీరు ఏమిటికి రా పందులల్లే తలుపునూకింది. నా దెబ్బలకి మీరు గానీ సచ్చుంటే మీ అమ్మా అయ్యా నన్ను పందులకంటే ఎక్కువ పీక్కోని తినేందుండ్లా..!” అని “బాగా తగిల్నాయ దెబ్బలు.. బయం కొద్దీ కొట్టినాన్రా.. మనసులో పెట్టుకుని మీ అమ్మా అయ్యలకి సెప్పకండ్రా..!” అంటూ బ్రతిమాలుకోవడం మొదలుపెట్టింది.

“అసలేమిటికి దూరినార్రా మా గుడిసెలో?” అడిగాడు లోకేషు.

“మేమూ ఇద్దరమే ఉంటిమి. మీరూ ఇద్దరే ఉంటిరి. నలుగురం ఒక్కతావుల ఉంటే రోంత బాగుంటాదని రాబడితిమి. మీ యక్క బయపడేడిది ఇని ఆసికానికి సప్పుడు చేయకుండా తడిక తోయబడితిమి. మీ రచ్చంతా ఇంటా బల్లే నవ్వుకుంటాన్డాము.

అంతలో నువ్వు తడిక దీస్తివి, మీ యక్క ఈరంగం ఆడింది గదరా.. ఏ ఆయువుపట్టు మీదో దెబ్బతాకుంటే ఏమయ్యేడిదుండే. అంటూ తగిలిన దెబ్బలకి తడి గుడ్డయినా పెట్టు లోకేశా..” దీనంగా అనేసరికి తేరుకున్న పోలమ్మ గబుక్కున తాడు మీదున్న తువ్వాలు కుండలో ముంచి ఇదుగో యాడ దెబ్బుందో ఆడ పెట్టుకోండి అనింది.

“కొంచెం తెల్లారితే ఏ పసుపో ఏదో పెడదాములేయ్యా!” అని సముదాయించింది. అలా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు..!

బయటినుంచి డప్పుల చప్పుడు కోలాహలంగా..! పోలమ్మ, లోకేషు, మూలుక్కుంటా మల్లేషూ, ఓబులేసు.. బయటికి వచ్చేసరికి దూరంగా కాగడాలు పట్టుకుని కొందరు, పెద్ద కొయ్యకి నాలుగు కాళ్ళు కలిపికట్టి వ్రేలాడదీసిన అడవి పందిని ఇద్దరు భుజాలమీద మోసికొని వస్తూ కనిపించారు. రివ్వున పరుగెత్తారు నలుగురూ.

ఇక అడవికెళ్లి వచ్చిన వారి ఆనందం చెప్పనలవి కాదు.

డప్పులు కొట్టుకుంటూ డ్యాన్సులు పంది చుట్టూ తిరుగుతూ. కొందరు మంట సిద్ధం చేశారు. పందుల్ని కాల్చి మరుసటి రోజు విందుకు సిద్ధం చేస్తున్నారు.

తెల్లారి వెలుగు మెల్లగా వెలుగుతోంది. ఓబులేసు వాళ్ళమ్మా, అయ్యా.. పిల్లల్ని చూసి “ఓరి నాయనో.. ఈ దెబ్బలేందిరా అయ్యా..?” అంటూ వాటేసుకుని కళ్ళమ్మడ నీళ్ళేట్టుకుంది.

ఓబులేశు “చిన్న పందిపిల్ల గుడిసెలోకి దూరింది. దాన్ని చితకబాదినము. తప్పించుకొని పోయింది” అన్నాడు.

“అయితే ఇంకొరోజు యేటకి పోక తప్పేది లేదా!” అంటూ ఉసూరన్నాడు.. ఓబులేశు తండ్రి.

“పసి పిలకాయల్ని ఇట్టా ఏపుకుతిన్న పందిని ఇడిసేదే ల్యా” అంటా శపథం చేశాడు పోలమ్మ తండ్రి.

నలుగురు పిల్లలూ ఒకరి ముఖాలొకరు చూసుకుని ఆ పంది దొరికినప్పటికి లే.. అని గుట్టుగా ఉండి పోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here