భయం గుప్పిట్లో..

0
9

[dropcap]అ[/dropcap]ర్చన పసుపు వేసి మరిగించిన వేడి నీళ్ళు, కాఫీ ప్లేస్క్, ఇడ్లి అన్ని ఒకేసారి తీసుకుని పొద్దున్న ఆరింటికి మేడ మెట్లెక్కింది. గది తలుపు తోసి ‘ఏమండీ’అని పిలిచింది.

‘అక్కడ పెట్టి వెళ్ళు’, వెనక గది లోంచి అన్నాడు రాజారావు.

అర్చన అన్నీ ముందు గదిలో పెట్టి కిందకు వచ్చేసింది.

పన్నెండింటికి కంచంలో అన్నం, పప్పు, చిన్న చిన్న గిన్నెల్లో చారు పెరుగు పెట్టుకుంది. కింద నుంచి ‘ఏమండీ, భోజనం తెమ్మంటారా’ అడిగింది ఫోన్లో.

‘వూ’ అని పెట్టేసాడు రాజారావు.

పైకి వెళ్లి గది తలుపు తోసి ‘ఏమండీ’ అంది అర్చన.

‘అక్కడ పెట్టి వెళ్లు’

‘ఒక్కసారి బైటకి రావచ్చుగా, అంత ముఖం కూడా చూడకూడదా?’

‘నువ్వు వెళ్లిపో ఆర్చనా వెంటనే’ అన్నాడు రాజారావు.

అర్చన కళ్ళు తుడుచుకుంటూ మెట్లు దిగేసింది.

నాలుగు రోజులైంది హోమ్ క్వారంటైన్ మొదలయి.

ఇప్పటిదాకా అర్చన రాజారావు ముఖం చూడలేదు. మేడ మీద రెండు గదుల వాటాలో అద్దెకుంటున్నవాళ్ళు ఈ మధ్యే ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇంకా ఎవరికి ఇవ్వలేదు ఇంతలో ఈ ఉపద్రవం! రాజారావుకు కరోనా పాజిటివ్ వచ్చింది. జ్వరం, దగ్గు వస్తుంటే గవర్నమెంట్ ఆసుపత్రిలో చూపించుకున్నాడు. ఇంట్లోనే పద్నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండమని, మందులు ఇచ్చి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ చెప్పారు. శ్వాసలో ఏ మాత్రం తేడా కనిపించినా వెంటనే వచ్చి చేరిపొమ్మని చెప్పారు. ఆ రోజు నుంచి రాజారావు పైన గదిలో ఉంటూ ముఖం కూడా చూపించట్లేదు.

పైన రాజారావు ఒంటరిగా. కింద అర్చన ఒంటరిగా

మధ్యాహ్నం మూడింటికి అర్చన ‘ఏమండీ ఎలా ఉన్నారండి’ అంది ఫోన్లో.

‘బాగానే ఉన్నాలే’

‘టెంపరేచర్ చూసుకుంటున్నారా’?

‘చూసుకుంటున్నాలే’

‘ఏమైనా మాట్లాడచ్చు కదండీ’

ఫోన్ పెట్టేసాడు రాజారావు.

ఎందుకింత ముభావంగా ఉంటున్నారు? ఫోన్లో నైనా మాట్లాడచ్చుగా కనీసం నాతోనైనా? పిల్లలు నాన్న ఫోన్ తీయట్లేదని రోజూ గొడవ చేస్తున్నారు. ఇద్దరు మగపిల్లలు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా చేస్తున్నారు. వాళ్ళకి రెక్కలు కట్టుకుని వాలాలని వుంది. రాలేని పరిస్థితి. అర్చన, కంగారు పడద్దని నాన్న బాగానే ఉన్నారని చెపుతోంది. నాతో మాట్లాడకపోతే పిల్లలతోనైన మాట్లాడచ్చుగా అని అర్చన బాధ. పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఎవరో వచ్చి ఇంటి ముందంతా బ్లీచింగ్ చల్లేసారు. ఇంట్లో అందరూ పరీక్ష చేయించుకోవాలని చెప్పారు. తను ఒక్కతే ఎలా వెళ్లగలదు రాజారావును వదిలేసి? అసలు తమ ఇంట్లోంచి బైటకి వచ్చిన వారిని ఆటో గూడ ఎక్కించుకోరు. ఎలా అనుకుంది అర్చన.

అర్చన గేటు బైట ముగ్గు వేయటం మానేసింది. లోపల గుమ్మం ముందు కూడా వీధిలో ఎవరూ లేవకముందే తెల్లవారు జామున రెండు గీతలు గీసి లోపలికి వెళ్ళిపోతోంది. అన్నీ దగ్గర దగ్గర ఇళ్లు, ఎదురెదురుగా పక్కపక్కన. మొదటిరోజు ఎదురింటావిడ ‘తలుపు వేసుకొమ్మా, బైటకి కనపడతావెందుకు’ అని కేకలేసి వెళ్ళింది. అర్చనకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. పేషంట్ మేడ మీద వున్నారు. నన్ను కూడా చూడకూడదా, అని కుమిలిపోయింది తనలో తనే.

వీధి చివర ఉండే సుబ్బారావుగారు వాళ్ళబ్బాయితో పాల పేకెట్లు, కూరలు పంపిస్తున్నారు. ఆయన రాజారావు స్నేహితుడే. ఆ అబ్బాయి గేటుకి తగిలించి వెళితే అర్చన గబగబా లోపలికి తెచ్చేసుకుని తలుపు వేసేసుకుంటోంది. ఇంకా పది రోజులు ఈ శిక్ష! లోకమంతా తమని ఒంటరి వాళ్ళను చేసి అనుమానంగా చూస్తున్నట్లు అనిపిస్తోంది అర్చనకు. ఇందులో తమ తప్పేం ఉంది? నాలుగు రోజుల క్రితం వీళ్లంతా తమకు ఆత్మీయులే. బాగా పలకరించే వారే. చూస్తే వాళ్ళకి ఏమవుతుందో ననే ప్రాణభయం. బైట వాళ్ళ సంగతి ఎలా వున్నా ఇంట్లో మనిషి ప్రవర్తనే భయంగా ఉంది అర్చనకు. ఇటువంటి సమయంలో ఒంటరితనంతో కృంగిపోకూడదంటారు. మనోబలంతో ఉండాలంటారు. కాస్త ఫోన్‌లో మాట్లాడుతుంటే బాధ పంచుకుంటూ ఉంటే బాగుంటుంది కదా ఇద్దరికీ అని అర్చన దిగులు పడిపోతోంది.

అర్చన రాత్రి ఎనిమిదింటికి భోజనం, కాచిన నీళ్లు పైన పెట్టేసి కిందకు వచ్చేసింది. కాసేపు టి.వి. చూసింది. విసుగ్గా ఉంది. పదయ్యేదాకా ఎలాగో గడిపి పడుకుంది. భర్తే గుర్తొస్తున్నాడు. నిద్ర పడుతుందో లేదో అనుకుంటూ ఎప్పటికో నిద్ర లోకి జారుకుంది.

రాత్రి ఒంటిగంటకి ఫోన్ మోగుతోంది. టక్కున మెలకువ వచ్చింది అర్చనకు. ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ చూసింది.

భర్త రాజారావు !

వణుకు కాళ్ళలోంచి తల దాకా పాకింది ఒక్కసారిగా అర్చనకు.

‘అర్చనా’

‘ఏమండీ, నీరసంగా ఉందా, పాలు తేనా’

‘అర్చనా’ అంటూ ఏడ్చేశాడు రాజారావు ఒక్కసారిగా!

‘ఏమైందండీ’ అంటూ అర్చన ఏడుస్తూ ‘నేను వస్తున్నాను, ఏడవకండీ’ అంటూ మంచం దిగింది. కాళ్ళు తడబడుతున్నాయి.

వెంటనే రాజారావు ‘వద్దు,అర్చనా, రావద్దు, బాగానే ఉన్నానులే, పడుకో ఇంక’ అన్నాడు.

‘ఏమండీ, అలా ఏడ్చేశారేంటండి’ అంటుంటే అర్చనకు మళ్ళీ ఏడుపు వచ్చేసింది.

‘నిద్ర పట్టట్లేదు. నువ్వు గుర్తు వచ్చావు. చూసి చాలా రోజులయ్యింది. బైట ప్రపంచంతో సంబంధం లేదు. ఈ శిక్షేమిటి అని ఏడుపు వచ్చేసింది.’

‘నాతోనైనా మాట్లాడొచ్చుగా, ముఖం చూస్తేనే వచ్చేస్తుందా’ అంది అర్చన.

‘నా మానసిక స్థితి అలా ఉంది అర్చనా, ఎవరితోనూ మాట్లాడ బుద్ధి కాలేదు. పిల్లలు రోజూ ఫోన్ చేస్తున్నారు. మెస్సేజ్‌లు పెడుతున్నారు. ఏదో భయం, దిగులు, ఒంటరితనం నన్ను చుట్టు ముట్టేసాయి. క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయి అర్చనా’ అన్నాడు రాజారావు.

‘దిగులు పడకండి. మీకు తగ్గిపోతుంది. ఇంకెంత పది రోజులు. మీకు హాస్య కథల పుస్తకం ఇచ్చాను కదా చదవండి. ఆఫీసు పని ఒత్తిడి నించి విశ్రాంతి దొరికిందనుకోండి. అసలు ఈ జబ్బు ఉందని మర్చిపోండి. పిల్లలతో మాట్లాడండి’ అని అర్చన ధైర్యం చెప్పింది.

‘రేపు మాట్లాడతా అర్చనా, స్నేహితులు కూడా చేస్తున్నారు. రేపు అందరితో మాట్లాడతాను’ అంటూ ఆ రాత్రి మూడింటి దాకా రాజారావు తన చిన్ననాటి కబుర్లు చెప్పాడు. పిల్లల గురించి మాట్లాడాడు. అర్చనకు చాలా సంతోషంగా అనిపించింది.

మర్నాడు పొద్దున్నేకాఫీ, వేన్నీళ్ళు పట్టుకుని పైకి వెళ్ళింది అర్చన. రాజారావు లోపలి గది లోంచి ముందుగది లోకి వచ్చాడు.

‘ఎంతసన్నగా అయిపోయారు’ అనుకుంది అర్చన.

‘ఎంత చిక్కిపోయింది అర్చన, ఒక్కతీ అయిపోయింది పాపం’ అనుకున్నాడు రాజారావు.

మాస్క్‌లతో ఇద్దరి ముఖాలు పూర్తిగా తెలియట్లేదు ఒకరికొకరికి.

‘అర్చనా ఎక్కువసేపు ఇక్కడొద్దు వెళ్లిపో, ఫోన్లో మాట్లాడతాలే’ అన్నాడు రాజారావు.

అర్చనకు మనసంతా తేలిగ్గా వుంది. రాజారావు పిల్లలకు ఫోన్ చేసాడు. ఇద్దరూ ‘ఎలా వున్నారు నాన్నా, కంగారు పడకండి. ఫోన్ ఎన్నిసార్లు చేసినా తీయలేదేం? రోజూ మేమే చేస్తుంటాం. జాగ్రత్త!’ అంటూ కంగారుగా, సంతోషంగా చాలాసేపు మాట్లాడారు. రాజారావుకు మనసులో బరువంతా ఎవరో లాగేసినట్లుంది. తనకేం లోటు! ఇంత ప్రేమించే పిల్లలూ, అర్చనా ఉండగా. ‘ఇష్టమైన మనుషులతో మాట్లాడుతుంటే మనసులో ఒత్తిడి, భయం తగ్గుతాయి అని అర్చన చెప్పే మాట ఎంత నిజం’ అనుకున్నాడు రాజారావు. స్నేహితులందరిని పలకరించాడు. ఇంకో పది రోజులు సునాయాసంగా గడిచిపోయాయి. రాజారావు ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకుని నెగటివ్ అనిపించుకుని వచ్చాడు. ఆ రోజు అర్చన ఆనందానికి అవధుల్లేవు.

రాజారావు పదిహేను రోజులు సెలవు పొడిగించాడు. అర్చన శ్రద్ధగా కావలసినవన్నీ చేసిపెడుతోంది. వేళకు తినటం, మధ్యాహ్నం కాసేపు పడుకోవడం, ఇద్దరూ చెరో పుస్తకం పట్టుకుని చదువుకోవడం ఇదే దినచర్య! అర్చనకు లాక్డౌన్ కొత్తలో గడిపిన రోజులు గుర్తు వచ్చాయి.

లాక్డౌన్ పెట్టిన కొత్తలో ఎప్పుడూ వచ్చిపోయే చుట్టాలతో అలిసిపోయిన ఇంటికి విశ్రాంతి దొరికింది. ఇంట్లోనే వుంటూ వేడి నీళ్లు తాగుతూ వేడి వేడిగా తింటూ బైట ప్రపంచంతో సంబంధం లేకుండా గడిపారు అర్చనా రాజరావులు.

రాజారావు తక్కువ స్థలంలో తన అభిరుచి మేరకు డూప్లెక్స్ పద్దతిలో ఆ ఇల్లు కట్టించుకున్నాడు. పైన ఒక గది పూర్తిగా అర్చనకు రీడింగ్ రూమ్. అందులో పెద్ద చెక్క టేబుల్. దాని ముందు కుర్చీ. ఆ గది అల్మారాలలో అద్దాలలో కనిపిస్తూ అందంగా అమర్చిన పుస్తకాలు ప్రాచీన సాహిత్యము అంతా ఒక దగ్గర ఆధునిక మంతా ఒకదగ్గర. ఏది కావాలన్నా వెతుక్కోకుండా వెంటనే తీసుకోగలిగేంత అమరికగా సర్దుకుంది. ఆ గది ఆమె సామ్రాజ్యం! పిల్లలకు పుస్తకాలు చదివే అలవాటు లేదు. రాజారావుకు తీరిక ఉండదు. అర్చన పెళ్లికి ముందు కొనుక్కున్న పుస్తకాలే చాలా వరకు. పెళ్లయ్యాక ఎప్పుడూ చుట్టాలు పని. తీరిక ఉండేది కాదు చదవటానికి. రాత్రి పడుకునే ముందు ఎంత అలిసిపోయినా ఇష్టమైన పుస్తకాన్ని నాలుగు పేజీలైనా చదవకుండా నిద్రపోదు. అలాంటి అవిశ్రాంత జీవితములో ఎవరూ ఎవరిళ్లకు వెళ్లకూడదు ఇంట్లోనే ఉండాలి అనే నిబంధన వచ్చింది. రాజారావు కు పదిరోజులు ఆఫీసుకు సెలవలు ఇచ్చారు.అర్చన మొదటి రోజు పని తొందరగా ముగించుకుని భర్తని పుస్తకాల గదిలోకి తీసుకువెళ్లింది. ఎన్ని పుస్తకాలు!ఎందరు మహారచయితలవి! ఈ గదిలోకి వచ్చి ఎన్నాళ్ళయింది! ఇప్పుడు తీరిగ్గా ఉన్నాగా నేనూ చదువుతా అంటూ అన్నీచూసి రాజారావు శ్రీపాద వారి కథలు తీసుకున్నాడు. చదువుతున్నకొద్దీ ఆసక్తి కలుగుతోంది. అర్చన పుస్తకం చదవనిదే రోజు పూర్తైనట్లుండదని ఎందుకంటుందో అర్థమైంది రాజరావుకు. రోజూ ఇద్దరు చెరో పుస్తకం పెట్టుకోవటం చదివినవి చర్చించుకోవటం, పొద్దున్న, సాయంత్రం పూజలు మధ్య మధ్యలో పిల్లలతో మాట్లాడటం ఒక ఆశ్రమ జీవితంలా గడిచిపోయింది ఇద్దరికీ!

రాజారావుకు ఆఫీసు తెరిచారు. వెళ్లక తప్పని స్థితి. ముఖానికి మాస్కు, చేతికి తొడుగులు, భోజనం రెండు సీసాల కాచిన నీళ్లు, అన్నీ తీసుకుని వీర సైనికుడిలా బయలుదేరాడు. బండి మీద వెళ్తాడు. గంట ప్రయాణం ఇంటి నుంచి. అర్చనకు ఏదో దిగులు. ఆఫీసులో అందరూ కలుస్తారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా. ఏమో ఎలా వుంటుందో! ‘సెలవు పెట్టేయమంటే ఎన్నాళ్ళని పెట్టగలను ఇది ఒకరోజు, రెండు రోజుల సమస్యా? ఎప్పటికి తగ్గుతుందో తెలీదు. అయినా సెలవలు ఇవ్వరు. భయపడుతూ ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చుంటాను? మన జాగ్రత్తలు మనం పాటించటమే మందు’ అంటూ వెళ్ళిపోయాడు. తీసుకెళ్లిన నీళ్లే జాగ్రత్తగా తాగమని టీ, కాఫీలు బైట తాగొద్దని ఎవరైనా ఏమైనా ఇచ్చినా తినద్దని వంద జాగ్రత్తలు చెప్పింది అర్చన.

మొదటి రోజు రాజారావు ఆఫీసుకు వెళ్లిన దగ్గర నుంచి అర్చన మనసులో భయం! ఎప్పుడూ టీ. వి.కి దూరంగా ఉండేది ఈ మధ్య వార్తలు వింటోంది వింటున్న కొద్దీ దడ. భర్త వెళ్లి ఎన్నో గంటలైనట్లుంది. తీరా చూస్తే టైం పన్నెండయినా కాలేదు. కాలం స్తంభించిన్నట్లుంది. తను చదివిన పుస్తకాలలో మనోధైర్యాన్నిచ్చే వాక్యాలు ఏవీ గుర్తుకు రావట్లేదు

సాయంత్రం రాజారావు వచ్చేవరకు అర్చన కాలు కాలిన పిల్లిలా ఇల్లంతా తిరిగింది. రాజారావు గేటు తీసి సందు లోంచి వెళ్లి అక్కడ పంపు దగ్గర కేరియర్ పడేసి బాత్రూంలో స్నానం చేసేసి, బట్టలు తడిపేసి, లుంగీ కట్టుకుని, లోపల హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. అయినా అతనికి కాఫీ అందిస్తుంటే ఏదో జంకు అర్చనకు. మనిషిని తగలాలంటే, పక్కన కూర్చోవాలంటే భయం!

‘ఆఫీసులో అంతా బాగానే ఉందిలే. భౌతిక దూరం పాటిస్తున్నారందరు. ఎవరినీ ముట్టుకోలేదు. కంగారు పడకు’అన్నాడు రాజారావు అర్చన భుజం మీద చెయ్యేస్తూ.

ఒక్కసారి ఉలిక్కిపడి చేయి తోసేసింది అర్చన.

ఆ రోజు నుంచి అర్చన హాల్లో, రాజారావు బెడ్ రూంలో పడక.

నెమ్మదిగా అలవాటు పడుతోంది అర్చన. మనకేం రాదు. భర్త జాగ్రత్తగా వెళ్లివస్తున్నాడు అనుకుంది తృప్తిగా. మళ్ళీ పుస్తక పఠనంలో, పూజల్లో పడుతోంది. ఒకరోజు రాజారావు మధ్యాహ్నం నీరసంగా ఇంటికి వచ్చాడు. ‘తలనొప్పిగా ఉంది.’ అంటూ కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు మార్చుకుని వచ్చి కూర్చున్నాడు. అర్చన రాజారావు నుదిటి మీద చేయి వేసి చూసింది. వేడిగా ఉంది. మనసంతా ఏదోలా అయిపోయింది. ఇదే ఇదివరకైతే వెంటనే టాబ్లెట్ వేసుకుని పడుకోమనేది. ఇప్పుడు జ్వరం పేరు వింటేనే భయం! తుమ్ము, దగ్గు శబ్దం వింటే దడ!. ఆ రాత్రి జ్వరం ఎక్కువైంది. దగ్గు కూడా మొదలైంది. రాత్రంతా నిద్ర లేదు ఇద్దరికీ. అది కాకపోతే చాలు, మాములు జ్వరమైతే బాగుండును అని అర్చన మొక్కులు మొక్కేసింది.

మర్నాడు రాజారావు సెలవు పెట్టేసాడు. ఎవరి దగ్గరకెళ్లాలి? జ్వరాలైతే డాక్టర్లు చూడట్లేదు. కరోనా టెస్ట్‌కి వెళ్ళిపొమ్మంటున్నారు. అక్కడ చాంతాడంత క్యూ ఉంటుంది. అయినా నిర్లక్ష్యం చేయకూడదు. జ్వరం పెరుగుతోంది.

‘అర్చనా నేను గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకొస్తాను’ అన్నాడు రాజారావు. ‘నేనూ వస్తాను’ అంది అర్చన.

‘వద్దు, నాక్కొంచెం అనుమానంగా ఉండి వెళుతున్నాను. నువ్వొద్దు’ అన్నాడు రాజారావు.

‘ఎలా వెళ్తారు జ్వరంతో’ అంది

‘ఫర్వాలేదు వెళ్లగలనులే’ అంటూ వెళ్ళిపోయాడు.

అర్చన ఒకచోట నిలవలేక పోతోంది. గంటయ్యాక ఫోన్ చేసింది.

‘అర్చనా, ఇక్కడ చాలా మంది ఉన్నారు. అయినా తొందరగానే చూస్తున్నారు. వచ్చేస్తాలే. కంగారుపడకు’ అంటూ ఫోన్ పెట్టేసాడు. పరీక్ష చేయించుకొచ్చాడు. మర్నాడు రిపోర్ట్ వచ్చేదాకా భయంకరమైన నిరీక్షణ!

గుమ్మంలో నిల్చునే ‘పాజిటివ్’ అన్నాడు రాజారావు.

గుండె ఒక్కసారి ఆగి మళ్ళీ కొట్టుకుంది అర్చనకు.

‘ఆర్చనా, ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకొమ్మన్నారు. ఇదిగో ఏం మందులు వాడాలో ఇచ్చారు. నేను పైన గదిలో ఉంటాను. నువ్వు కిందే ఉండు. భయం లేదులే’ అన్నాడు.

అర్చన ‘ఇదేమిటండీ, ఇంత జాగ్రత్తగా ఉండే మీకు’ గట్టిగా ఏడ్చేసింది.

‘ఊరుకో, మన జాగ్రత్త ఒక్కటే పనికి రాదు దీనికి ఎలా వచ్చిందో ఏం తెలుసు’ అంటూ మేడ మీదకి వెళ్ళిపోయాడు. అంతే! అప్పటినుంచి మాట్లాడటం మానేశాడు ఫోన్లో కూడా.

***

ఆలోచనల్లోంచి బయట పడింది అర్చన. ఆ భయంకరమైన రోజుల్ని మర్చిపోవాలి అనుకుంది.

పెట్టిన సెలవలు ఇట్టే అయిపోయాయి.

మర్నాటి నుంచి ఆఫీసుకి వెళ్ళాలి. అర్చనకు నిద్ర పట్టట్లేదు. ఆ రోజు జ్వరంతో తలనొప్పితో వచ్చిన భర్త ముఖమే గుర్తు వస్తోంది. రాజారావు నిద్ర పోతున్నాడు.

‘ఏమండీ’

‘ఏమండీ’

‘వూ, నిద్ర పోలేదా నువ్వు!’

‘ఒక నెల సెలవు పెట్టేయచ్చు కదండీ. అప్పటికి తగ్గిపోతుందేమో!’ ‘ఎప్పటికి తగ్గుతుందో ఎవరికి తెలుసు? ఆఫీసులో చాలామంది వేరే జ్వరాలతో సెలవులో ఉన్నారట. ఇలాంటప్పుడు బాగున్న నేను వెళ్లకపోతే ఎలా? అందరూ పనులకు వెళ్లట్లేదూ! నేనూ అంతే! నాకు భయమేసినప్పుడు నువ్వు, నీకు భయమేసినప్పుడు నేను ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ భయం గుప్పిట్లో వుంటూ బతుకు పోరు సాగించక తప్పదు. ఆలోచించకు. పడుకో’ అన్నాడు అవులిస్తూ రాజారావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here