[box type=’note’ fontsize=’16’] “తానొకటి తలిస్తే భార్య ఇంకొకటి తలుస్తుంది. అది నిజం చేస్తుంది కూడా అని ఒక సామెత వుంది. ఈ నిజాన్ని అత్యంత హాస్యంగా ప్రదర్శిస్తుంది కె.కె.రఘునందన కథ భయమ్ము నిశ్చయమ్ము రా!!! ఇది చదివిన తరువాత మాత్రం పడీ పడీ నవ్వుట తథ్యమ్మురా!!!![/box]
అసలు మీకింత సడన్‌గా క్యాంపేంటి?” భార్య గంగానమ్మ అదిరేటి గొంతుతో అడిగేసరికి కంగుతిన్నాడు బాలకేశవులు.
“మరి… మరి.. నేనూ అనుకోలేదు…కాని మా ఆఫీసరు బతకనివ్వలేదు. నన్ను నిల్చున్నపాటుగా వచ్చేయమన్నాడు” వణుకుతూనే జవాబిచ్చాడు.
“మీరెలా తగలడండి నాకు తెలీదు. ఈ రాత్రికి గుమ్మం చేరాల్సిందే!” కరాఖండీగా చెప్పేసింది.
“అదికాదు గంగా! మావాడి మూడ్ చెప్పలేం! పని అయిపోతే వచ్చేస్తా! లేకపోతే రావటం కుదరదేమో!” నానుస్తూ చెప్పాడు బాలకేశవులు.
“ఏమైనా చెప్పండి కాని… మీర్రావాల్సిందే! అయినా పది రోజులుండిపోయేట్లుగా చేతిలో ఆ పెద్ద సూట్ కేసేంటి? చిన్న సంచి ముక్క చాల్దూ!” భర్త ప్రయాణ సన్నాహం చూసి అనుమానంగా ప్రశ్నించింది గంగానమ్మ.
“ఒకవేళ రావటం ఆలస్యమైతే ఈ ఒక్క జత కంపుకొట్టదూ! అందుకని…” అనేసి నమ్రంగానే అన్నాడు. అయినా గంగానమ్మ ఊరుకోలేదు. షరతు మీద షరతు విధించి మరీ పంపింది.
“జాగ్రత్త గంగా!! ఇల్లు జాగ్రత్త!” అనేసి వెళ్ళిపోతుంటే గంగానమ్మ నవ్వుకుంది. తనకు జాగ్రత్తలు చెప్పేంత మొగాడా! తన మొగుడు?అని….
ఆ రాత్రికి కూడా భర్త రాకపోవటంతో చిర్రెత్తుకొచ్చింది గంగానమ్మకు. ‘నేను చెప్పిందానికి విరుద్ధంగా నడుస్తాడా! రానీ చెబుతా!’ అని కసిగా అనుకుంది.
ఏనాడు గంగానమ్మతో కరగ్రహణం జరిగిందోగాని అది దాదాపు గ్రహణంగానే మారింది బాలకేశవులికి. యతి అంటే ప్రతి అనటం… ఎడా పెడా వాదించటం… భర్తను ఎన్ని విధాలుగా తొక్కి పెట్టాలో అన్ని విధాలుగానూ తొక్కి పెట్టి అణచేసింది. ఓ మిస్సుడ్ కాల్ వస్తే ఎవరు చేసారంటూ ఆరా! బజార్లో ఎవరైనా పలకరిస్తే అదెవత్తంటూ తగవు!
గంగానమ్మ భర్తకు ఫోన్ చేసి కడిగేద్దామనుకుంటే అట్నుంచి స్విచాఫ్ అన్న జవాబు!మరిక రాడనే భావించి తనమట్టుకు వండుకు తినేసి, పక్క మీదకి చేరి గుర్రెట్టి నిద్రలోకి జారిపోయింది.
***
సరిగ్గా అర్ధరాత్రి సమయం! ఓ ముసుగుదొంగ ఆ ఇంట్లోకి దభీమని గెంతాడు. చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళ దృష్టి పడలేదు. ఎరిగిన ఇంట్లో దూరినట్లే అతి సులువుగా లోపలికి చొరబడ్డాడు. మెల్లగా గదులన్నీగాలిస్తూ పోయాడు. అప్పటికే గాఢనిద్రలో ఉన్న గంగానమ్మకింకా అలికిడి కాలేదు. ముసుగుదొంగ ఆ చీకట్లో తడుముకుంటూ పోతుంటే టీపాయ్ తన్నుకున్నాడు. దాని మీద ఉన్న గాజు ప్లవర్ వేజ్ కిందపడి భళ్ళున బ్రద్దలైన చప్పుడైంది. గభాలున లేచింది గంగానమ్మ.
“ఎవడ్రా! అది?”అన్నది భీకర స్వరంతో.
“హ…హ…హ..” అని నవ్వాడు ముసుగు దొంగ.
“ఆ నవ్వేంట్రా? ఎక్కడ?” అన్నది.
“ఏయ్! అడుగు కదిపితే చంపేస్తా! ముందు నేను చెప్పినట్లు చెయ్! లేదా! హ.. హ.. హ..” అని హుంకరించాడు.
“నువ్వు చెయ్యమన్నట్లుగా నేను చెయ్యాలా! అది మన జీవితంలో లేదే! నా ఇంట్లోకి అడుగు పెట్టే ధైర్యం నీకెక్కడిదిరా?” అన్నది గదమాయిస్తూ.
“అదంతా నీకనవసరం. ముందు బీరువా తాళాలు నా చేతిలో పెట్టు. లేకపోతే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. హ..హ..హ..”
“ఏం చెయ్యాలో తెలీనివాడి నువ్వేం దొంగ రా బాబూ!”
“ఏంటీ! నేనేం దొంగనా! బీహార్ మా స్థావరం. మొండిఘటాలకి మారు పేర్లం మేం”
“బీహార్ వాడివైతే బెంగాల్లోనో, హిందీలోనో ఏడవాలిగాని… తెలుగులో తగలడతావేంరా?”
“హ…హ…హ… అదంతా నీకనవసరం… ముందు నే చెప్పినట్లు చెయ్…హుఁ! ఏదీ బీరువా తాళాలు… ఇవ్వకుంటే నీ గొంతుకోస్తా!” అదిలించాడు ముసుగుదొంగ.
“హార్నీ! కత్తి కటారుతో దిగబడ్డావన్నమాట! ఛస్తే ఇవ్వను..” అన్నది మొండికెత్తిన గంగానమ్మ.
“ఈ కత్తికి ఎంతనుభవం ఉందో తెల్సా?రాయలసీమను శ్మశానంగా మార్చిన ఘనత దీనికుంది. ఎందరి చావునో చవి చూసి రక్తదాహం తీర్చుకుంది. హ…హ…హ…”ముందుకు ఒక్కో అడుగు వేస్తూ కత్తిని చేత్తో తిప్పాడు ముసుగుదొంగ.
ప్రతిగా ఘోరంగా నవ్వింది గంగానమ్మ!
“నేను ఈ గడప తొక్కింది కడపనుండని నీకు తెలీదురా! నా మొగుడికే దిక్కులేదు నువ్వెవడి రా కోన్ కిస్కాగాడివి. చంపురా! చంపు!” అన్నది గంభీరంగా.
ముసుగుదొంగ అలనాటి జానపద హీరో కాంతారావుకి మల్లే కత్తి తిప్పడమే తప్ప సాహసించలేకపోతున్నాడు. వాళ్ళిద్దరి మధ్యన మంచం ఒక్కటే అడ్డు. ఇటోకరు.. అటొకరు చుట్టూ తిరుగుతున్నారు.
“ఏయ్! ఏంటా మొండితనం? ముందు నీ మెళ్ళో నగలిస్తావా! లేదా? నా దగ్గర కత్తి ఒక్కటే ఉందనుకోకు. ఎ.కె.47 కంటే పవర్‌ఫుల్ అయిన పిస్తోలుంది. దాన్ని గురి పెట్టి కాల్చానంటే నీ గుండె పేలిపోద్ది.”
“నగలా! ఇవి నీక్కావాలా! ఓ.కే. తీసేసుకో! హ…హ…హ… ఒరే! ఇవి గిల్టువి రా! నీలాటి దొంగ సచ్చినోళ్ళుంటారనే మంచివన్నీ లాకర్లో పడేసా!”
“హమ్మనీ!… ఈ నగలు నాకెందుకు చెప్పు? ముందా బీరువాలో ఉన్న నగదు అంతా ఈ సూట్ కేసులో పడేయ్! ఊఁ! లేదా! గుండు పేల్చేస్తా!” ఝడిపించాడు పిస్తోలు చూపిస్తూ….
“అలాగే!” అని గభాలున బీరువా తెరచేసి పర్సులోంచి చిల్లరంతా తీసి సూట్‌కేసులో వంపేసింది గంగానమ్మ!
“ఏయ్!నీ కేమన్నా పిచ్చా? పప్పులాటి ఈ చిల్లరేంటి? కరెన్సీ నోట్లొచ్చి పడతాయనుకుంటే!” అనేసి అగ్గగ్గలాడిపోయడు ముసుగుదొంగ.
“ఏడ్సినట్లే ఉంది! నోట్ల కట్టలు ఇంట్లో పెట్టుకుంటామా! ఫిక్సుడ్ డిపాజిట్ చేస్తారుగాని”
“నువ్వు గొరకపీచులాగుందే! అబద్దాలాడకు. పోపుల పెట్టెలో కట్టలు దోపావేమోనని అనుమానంగా వుంది. ముందెళ్ళి తియ్!” అని భయపిస్తూ పిస్తోలు చూపించాడు.
“బాగా కనిపెట్టావే! వుండు. ఒక్క నిముషం… వెయిట్…” అని వెనక్కి తగ్గుతూ వంటింట్లోకి నడిచింది.
“అదీ! అలా రావాలి దారికి.హ…హ…హ…” అని బిగ్గరగా నవ్వాడు ముసుగుదొంగ. ముసుగుకి ఉన్న రెండు రంధ్రాల్లోంచి కళ్ళు పెట్టి చూడసాగాడు.
“ఇదిగో తీసుకో!ఏదో వెండిపట్టీలు కొనుక్కుందామని దాచుకున్నా! మరేం చేస్తాం!” అనగానే దొంగ ముందుకు వంగాడు.
అంతే!ఒక్కసారిగా కారంగుండ జల్లింది. సరాసరి వెళ్ళి రెండు రంధ్రాల్లోంచి కనిపిస్తున్న కళ్ళల్లోకి పడింది. ఒక్కసారిగా ముసుగుదొంగ కేక! “మంట…మంట…” అంటూ!
“నన్నే దబాయించాలని చూస్తావురా! రాస్కెల్! నీకు తగిన శాస్తి చేస్తా!” అనేసి ఇరుగుపొరుగులకి చెప్పడానికి బయటకెళ్ళింది గంగానమ్మ. సెల్ ఫోన్ లోంచి పోలీసులకి ఫోన్ చేసింది.
***
“ఏరా! ఒంటరిగా ఆడదొక్కర్తి ఉందని కనిపెట్టి ఇంట్లోకి జొరబడతావా!? నీకెన్ని గుండెలు? ఇంకా ఎన్ని ఇళ్ళు కాజేద్దామనుకున్నావ్?” అన్నారు దయాకరంగారు.
“నీ బాబుగారి సొమ్మేమన్నా ఇక్కడ దాచి పెట్టావేంట్రా?ఎత్తుకుపోటానికి వచ్చావ్?” చిరుబురులాడుతూ సమరసింహంగారన్నారు.
“ఒక్కసారి బొక్కలోకి తోస్తే రోగం కట్టేస్తుంది.” మెటికలు విరిచింది నీలాంబరి.
“అదిగో పోలీసు వాళ్ళు కూత పెట్టుకుని వచ్చేస్తున్నారు. ఇక సంకటం కట్టిస్తారు” అనేసి మహ సరదా పడిపోయింది భానుమతమ్మ.
“రండి.. రండి…ఇదిగో… కళ్ళల్లో కారం పడి గిలగిలలాడుతున్నాడు” పోలీసులను చూసి కసిగా అన్నాడు శంకరసత్యం.
“ఏవమ్మా! ఆయన ఎక్కడికెళ్ళాడు? అసలే దొంగలు మహ రచ్చ చేస్తున్నారు కదా!నిన్నొదిలేసి అలా వెళ్ళిపోవటమేనా? ముందాయన సెల్ నెంబర్ ఇలా ఇయ్యి. రమ్మని చేస్తాం” అనేసి సెల్ తీసాడు కానిస్టేబిల్ కనకమూర్తి.
గంగానమ్మ నంబరిచ్చింది. కనకమూర్తి చేసాడు. అయితే గమ్మత్తే ఏంటంటే అక్కడే రింగవుతోంది. ఎక్కడోనని కనిపెట్టేందుకు మరో పోలీసు కలయతిరిగాడు. “గొప్పవాడేనమ్మా మీ ఆయన! ఫోన్ ఇక్కడే ఒదిలి పెట్టి క్యాంపుకి చెక్కేసాడు” అనేసి ఛర్రుమన్నాడు కనకమూర్తి.
“ఎక్కడో కాదండీ మహాశయా! ఇదిగో ఈ దొంగవెధవ దగ్గరనుంచే రింగ్ టోన్ అనిపిస్తోంది” అన్నారు భూలోకేశ్ గారు.
“అమ్మనీ!…ఇంట్లోకి వస్తూనే సెల్ నొక్కేసావా నాయనా!” అని కనకమూర్తి సెల్‌ను దొంగ జేబులోంచి లాక్కున్నాడు. ముసుగుదొంగ ఎవరికీ కనబడకుండా గోడవైపు తిరిగిపోయాడు.
“చేసింది వెధవ పని చాలుగాని! నీ నాటకాలింక ఆపు! ఊఁ! లే….లే..” అని మహ చిరాకు ప్రదర్శించాడు సమరసింహం.
“జవానుగారూ! ఇంకా చూస్తారేంటండీ?మక్కలిరగదన్నక! లాఠీ ఝుళిపించండి మరి” అని కనకమూర్తికి పురెక్కించాడు దయాకరం.
మరో పోలీసు పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ “ఇక చూస్కోండి మా పోలీసోళ్ళ ప్రతాపం… లేస్తావా! లేవవా! లేలే..” అని దొంగ చెయ్యిపట్టుకు గుంజాడు.
“అమ్మో! అమ్మో! నన్నేం చెయ్యకండి. నన్నేం అనద్దు ప్లీజ్!” అన్న గొంతు వినిపించింది.
“అరే! ఈ గొంతు ఎక్కడో విన్నట్లుందే! ఎక్కడ చెప్మా!” అనేసి తీవ్ర ఆలోచనలో పడ్డారంతా!
“మీరంతా అలా తలలు కాటెక్కేలాగ ఆలోచించనక్కర్లేదుగాని… ఈ దొంగను చూసి మీకు తెలిస్తే.. అదేదో మాతో ఏడవండి.. మేం లాకప్‌లో పడేస్తాం” అని ఒక్కసారిగా ముసుగు లాగేసాడు పోలీసు.
అంతే! అంతా నిర్విణ్ణులైనారు!
“అరే!బాలకేశవులు!!?” అని నోళ్ళు నొక్కుకున్నారు.
“అదేంటండీ!అందరూ అలా కొయ్యబొమ్మల్లగుండిపోయారు? ఇతగాడు మీకు తెల్సా?” పోలీసులిద్దరూ ముక్తకంఠంతో అన్నారు.
“తెలీడమేంటండీ ఖర్మకాకపోతే! ఈ గ్రహం ఎవరో కాదు. ఇదిగో ఈ గంగానమ్మ భర్తే!” అన్నాడు భూలోకేష్.
“అదేంటి? తనింట్లోకి తనే దొంగతనానికి రావటమా!? ఎక్కడా విన్లేదే? ఇంత సర్వీసు చేసిన మా కెదురవలేదు ఇలాటి కేసు” కనకమూర్తి తెగ నివ్వెరపోతూ అన్నాడు.
“అయినా బాలూ!నీ కేమన్నా మతిసుతి వున్నాయటయ్యా? నీ ఇంట్లోకి నువ్వే దొంగగా జొరబడ్డావేంటి? నీకు మతి భ్రమించిందా ఏం?” రుసరుసలాడారు పరబ్రహ్మం నాయుడు..
“దీని వెనుక కారణమేంటో చెబితే తప్ప మేం కదిలేది లేదంతే!”అని పోలీసులు భీష్మించుక్కూచున్నారు.
“చెప్పవయ్యా! చెప్పు! అలా మిడిగుడ్డేసుకు చూస్తావేం?”ఒత్తిడి తెచ్చారు సమరసింహంగారు.
బిక్కచచ్చిపోయినట్లుగా భార్య గంగానమ్మ వైపు చూసి, మళ్ళా అటు తిరిగిపోయి “మరి… మరి… ఇంతకాలంగా నేనే మాత్రం స్వేచ్చగా జీవిoచలేకపోయాను. పెళ్ళయిన మరుక్షణం నుంచి మా ఆవిడకి భయపడుతూనే బ్రతికాను. ఏనాడు ధైర్యంచేసి ఎదిరించలేకపోయా! కాని, నాకు ఎప్పటికప్పుడు అనిపించేది. జీవితంలో ఒక్కసారయినా మా ఆవిడను భయపించాలని… కాని, మార్గమేదీ కానరాలేదు. చివరికి ఇలా దొంగగా చొరబడి, అదిలిస్తే లొంగి బెదురుతుందనుకున్నా! అందుకే ఈ ప్రయత్నం! అయినా ఫలించలేదు. నా పథకం మొత్తం బెడిసికొట్టింది.” అని ఒక్కసారి బరువుగా నిట్టూర్చాడు బాలకేశవులు..
“నీ మొహం లాగుందయ్యా నీ పథకం, నువ్వూను! నయం పోలీసులు నిజం దొంగ అనుకుని నిన్ను లాక్కుపోయి బొక్కలోకి తోసి, ముందు వెనక చూడకుండా థర్డ్ డిగ్రీ మెథడ్స్ గాని ప్రయోగిస్తే చచ్చూరుకునేవాడి…. ఇకనుంచి వెర్రిమొర్రి వేషాలెయ్యకుండా జాగ్రత్తగా ఉండు” అని అగ్గగ్గలాడిపోయారు దయాకరం, సమరసింహంగార్లు.
తమని అర్దరాత్రిపూట శ్రమ పెట్టి రప్పించినందుకు నాలుగు డబ్బులు గుంజుకువెళ్ళారు పోలీసులు. తమ ఇంటిగుట్టును రట్టు చేసిందికాక తననే భయపెట్టాలని చూసిన భర్త బాలకేశవులికి గంగానమ్మ ఆ తర్వాత ఎటువంటి శిక్ష విధించివుంటుందో వేరే చెప్పనక్కర్లేదేమో!
– కె.కె. రఘునందన