భీమయ్య బలం

0
9

[dropcap]సిం[/dropcap]గవరంలో భీమయ్య పెద్ద బరువుల్ని సైతం అవలీలగా ఎత్తేవాడు. బరువు ఎత్తిన తరువాత అతని మొహంలో అస్సలు అలసట కనబడేది కాదు!

ఒక రోజు ధాన్యం వ్యాపారం చేసే జగపతి తన బండిలో ఐదు బస్తాల ధాన్యం వేసుకుని పక్క పల్లెకు బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి బండి చక్రం రహదారి పక్కనున్న బురదలో దిగబడింది, ఎద్దులు బండి లాగ లేకపోయాయి. బండి ముందుకు కదలలేదు, అప్పుడే అటు వస్తున్న భీమయ్య నిస్సహాయంగా నిలబడి ఉన్న జగపతిని, బురదలో కూరుకున్న బండి చక్రాన్ని చూసి పరిస్తితి అర్థం చేసుకున్నాడు.

“అయ్యా, తమరు అనుమతిస్తే నేను బండి చక్రాన్ని బురదనుండి లేపుతాను” అన్నాడు.

జగపతి ఆశ్చర్యంతో “నీవొక్కడివే లేపగలవా?లేప గలిగితే లేపు,కానీ నీవు గాయపడితే నాకు సంబంధం లేదు”అని అన్నాడు.

జగపతిలో డబ్బు యావ, పిసినారితనం ఉన్నట్టు భీమయ్య గమనించాడు. అయినా పరోపకార బుద్ధి ఉన్న భీమయ్య బండికి ఉన్న ఎద్దులను విప్పి వేసి అతి సులువుగా బండిని బురదలో నుండి బయటకు తీశాడు!

భీమయ్య బలానికి, అతని మంచి బుద్ధికి జగపతి ఆశ్చర్యపోయాడు. తనకు సహాయం చేసినందుకు కొంత మంచి బుద్ధితో ఐదు రూపాయలు తీసి ఇవ్వబోయాడు.

“అయ్యా, చూస్తుంటే తమరు ధాన్యం వ్యాపారం చేస్తున్నట్టున్నారు… నేను బరువులు ఎత్తగలను, దయచేసి బస్తాలు బండికెత్తే ఉద్యోగం ఇవ్వండి, ఇక్కడా అక్కడా బరువులు ఎత్తకుండా స్థిరంగా మీవద్ద ఉద్యోగం చేసుకుంటాను” అని వినయంగా అడిగాడు.

జగపతి ఒక క్షణం ఆలోచించాడు ‘ఒక్క బస్తాకు రూపాయి కూలీ ఇస్తున్నాను, ఇటువంటి బలశాలి నా దగ్గర ఉంటే ఒకేసారి రెండు బస్తాలు ఎత్తించి రెండు బస్తాలకు కలిపి ఒక రూపాయి ఇస్తే ఒక రూపాయి ఆదా అవుతుంది’ అని లాభసాటి ఆలోచన చేశాడు.

“సరే,నీ పేరు ఏమిటి?” అడిగాడు జగపతి.

“భీమయ్య”

“అబ్బా, పేరుకు తగ్గట్టే బలశాలివి, రేపే కొత్తవీధిలో ఉన్న నా గిడ్డంగికి వచ్చి పనిలో చేరు, రెండు బస్తాలు బండిలో వేస్తే రూపాయి ఇస్తాను” అని చెప్పాడు.

“తప్పకుండా వస్తాను” అని నమస్కారం పెట్టి చెప్పాడు భీమయ్య.

అనుకున్నట్టుగానే భీమయ్య జగపతి దగ్గర పనిలో చేరాడు. అమాయక భీమయ్య రెండు బస్తాలు, పని తొందరగా అవుతుందని ఒక్కొక్కసారి మూడు బస్తాలు ఎత్తి వేయసాగాడు. భీమయ్య బలం చూసి జగపతి ఆశ్చర్యపోయాడు.

ఇలా ఉండగా సింగవరంలో వినాయక చవితినాడు పెద్ద బండలాగుడు పోటీలు నిర్వహించాలని ఊరి పెద్దలు నిర్ణయించారు.

ఈ విషయం భీమయ్యకు తెలిసి జగపతితో “అయ్యా, ఆ బండలాగుడు పోటీలో నేను కూడా పాల్గొంటాను” అని చెప్పాడు.

అప్పుడే జగపతిలో భీమయ్యను ఆ పోటీలో పాల్గొనేటట్లు చేసి డబ్బు సంపాదించాలనే ఆలోచన వచ్చింది.

“సరే, భీమయ్యా నీవు పోటీలో గెలవాలి కాబట్టి నీకు పండ్లు,మంచి బలవర్థక ఆహారం పెడతాను, నీవు గెలిస్తే వెయ్యి రూపాయలు ఇస్తారు, నిన్ను నేను పోషిస్తున్నాను కాబట్టి, ఆ డబ్బు నేనే తీసుకుంటాను” అన్నాడు గజపతి.

జగపతి నీచ బుద్ధి భీమయ్యకు అర్థం అయింది. ఏది ఏమైనా తను గెలిస్తే మంచి పేరు వస్తుందని జగపతి చెప్పినట్టే చెయ్యాలనుకున్నాడు.

పోటీ దినం వచ్చింది కొంతమంది పోటీదారులు అలసి పోయి కూర్చుండి పోయారు.

భీమయ్య చిన్న బండలను అలవోకగా లాగి,తన శక్తినంతా ఉపయోగించి పెద్ద బండలను లాగడానికి ప్రయత్నించసాగాడు. అవి లాగలేక పోతే ఎక్కడ డబ్బు రాక పోతుందేమోనని ఆత్రం ఎక్కువ అయి, అటు తరువాత బుద్ధి వికలమై భీమయ్యను ఉద్దేశించి “గాడిదా, బండను బాగా లాగు, నీవు తిన్న తిండి ఖర్చు నాకు వచ్చేట్టు చూడు, లాగు… లాగు”అని మానసిక అశాంతితో అరిచాడు.

జగపతి మాటలకు భీమయ్య నొచ్చుకుని జగపతికి తగిన బుద్ధి చెప్పాలని బండను లాగకుండా అక్కడే కూర్చున్నాడు.

జగపతి తల పట్టుకున్నాడు.

“తమరు తిట్టకుండా ఉంటే గెలిచేవాడిని, ఎవరైనా పోటీలో పాల్గొంటే వారికి మంచిమాటలతో గెలుపు స్ఫూర్తిని ఇవ్వాలి అంతేగానీ తిడితే లేక పశువుల్ని అదిలించినట్లు అదిలిస్తే మానసిక నీరసం ఆవహించి ఓడిపోతారు” అని చెప్పాడు.

భీమయ్యను తిట్టినందుకు జగపతి కూడా బాధ పడ్డాడు.

తను ఈసారి బండలు లాగి జగపతికి డబ్బు వచ్చేట్టు చేసి, అతని బుద్ధిని మార్చాలని అనుకున్నాడు భీమయ్య.

మరలా పక్క ఊరిలో దసరాకి బండలాగుడు పోటీ పెడుతున్నారని రెండువేలు బహుమతిగా ఇస్తున్నారని భీమయ్య తెలుసుకుని జగపతితో చెప్పాడు.

“నీవు పోటీలో పాల్గొంటానంటే వచ్చిచూస్తాను, నేను ఏమీ మాట్లాడను” అన్నాడు జగపతి.

 ఆ పోటీలో భీమయ్య అతి పెద్ద బండను తన శక్తినంతా ఉపయోగించి లాగి విజేతగా నిలిచాడు. జనం భీమయ్యకు జేజేలు పలికి చప్పట్లు కొట్టారు.

భీమయ్య తనకు వచ్చిన రెండువేలు జగపతికి ఇచ్చాడు.

ఒక్కసారిగా జగపతిలో మార్పు వచ్చింది. కష్టపడి బహుమతిని గెలుచుకున్న భీమయ్య డబ్బును తను తీసుకోవడం అన్యాయం అనిపించింది. ఇప్పటికే తను రెండు బస్తాల ఎత్తటానికి ఇచ్చేకూలీలో రూపాయి ఇచ్చి మోసం చేస్తున్నాడు! ఇవన్నీ ఆలోచించి జగపతి,

“భీమయ్యా, నీ కష్టంతో నీవు బహుమతి గెలుచుకున్నావు, నీ బలాన్ని గురించి ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు, అది నాకు గర్వ కారణం, ఇక నీకు బస్తాకు రెండు రూపాయల చొప్పున ఇస్తాను. ప్రతి దీపావళి పండక్కి కొత్త బట్టలు కుట్టిస్తాను” అని మంచి మనసుతో చెప్పాడు జగపతి.

జగపతిలో మారిన బుద్ధికి భీమయ్య సంతోషంతో ఆకాశానికి దండం పెట్టాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here