భిక్షుక బృహస్పతులు

0
6

[box type=’note’ fontsize=’16’] మాటలతో బోల్తాకొట్టించే బిచ్చగాళ్ళ బారిన పడిన ఓ దంపతుల గురించి ‘భిక్షుక బృహస్పతులు’ కథలో చెబుతున్నారు ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి. [/box]

[dropcap]ఎ[/dropcap]న్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న ఆఫీసర్ ప్రమోషన్ వచ్చింది అప్పారావుకి ఆ రోజే.

స్నేహితులు, స్నేహితులు కాని వాళ్ళు కూడా చుట్టుముట్టేశారు – “పార్టీ లేదా?” అంటూ.

తలూపాడు అప్పారావు తప్పక కొంత, ఉత్సాహంతోటి కొంత. దానికి తోడు ఉన్న ఊళ్ళోనే పోస్టింగ్. అందువల్ల మరింత ఒత్తిడి. అయినా ఆనందంగానే అనిపించింది అప్పారావుకి.

క్రెడిట్ కార్డు జేబులో వేసుకుని ఆఫీసువాళ్ళని వెంటేసుకుని హోటల్‌కి బయలుదేరాడు అప్పారావు.

వారి వారి గొంతెమ్మ కోర్కెల ప్రకారం వెజ్‌లు, నాన్-వెజ్‌లు చిరునవ్వు అలుముకుని ఇప్పించి బయటకు వచ్చాడు అప్పారావు.

“బాబూ ధర్మం చేయండి” అంటూ లేచి వచ్చింది అప్పటి వరకు హోటలు బయట కూర్చున్న ముష్టిది.

అప్పటికే శాలరీలో సగం ఖర్చయిపోయినందుకు మనస్సులో బాధపడుతున్న అప్పారావు ఆ కోపం ముష్టిదాని మీద చూపిస్తూ, “పోవమ్మా వేళా పాళా లేదు” అన్నాడు కోపంగా.

“ఎందుకయ్యా అంత కోపం. మీరు వేసే టిప్పులో పదోవంతు ఉండదు. దానికే అంత చిరాకా?” అంది.

‘టిప్పు’ అనే పదం అంత స్పష్టంగా పలకటం చూసి ముచ్చటేసింది అప్పారావుకి. దాని తెలివికి మనసులోనే మెచ్చుకుని రూపాయి తీసి వేశాడు.

“పది రూపాయలు టిప్పేస్తే ఈ హోటల్లో బాగుంటుందా?” అంది ఆశ్చర్యంగా ముష్టిది.

అవాక్కయ్యాడు అప్పారావు. తాము వెళ్ళింది త్రీ-స్టార్ హోటలు. కొందరు కొలీగ్స్ ముసిముసిగా నవ్వుకోవటం, మరికొంతమంది నవ్వు ఆపుకోవటం చూసి కోపం మరింత ఎక్కువయ్యింది.

డబ్బూ పోయి, శని పట్టి అన్నట్లు అవమానం నిండిన మనస్సుతో కుతకుతలాడుతూ ఇంటికొచ్చాడు అప్పారావు.

***

“అన్నం వద్దమ్మా. ఏ వేళకి తింటామో ఏమో. డబ్బులు లేక కనీసం బియ్యమో వెయ్యండి” అని ఖచ్చితంగా అవే ముష్టి కావాలన్నట్లు చెప్తున్న ముష్టివాడి గోల వినబడి లేచాడు అప్పారావు.

రాత్రి మిగిలిన అన్నం ముష్టివాడి కెయ్యబోయింది కాబోలు భార్య. వాడు తిరస్కరిస్తున్నాడు. చేసేదేం లేక ఆ గిన్నె లోపలికి తీసుకుపోయి, రూపాయి తెచ్చి వేసింది భార్య. పిలిచినందుకు ఉట్టి చేత్తో పంపితే పాపమనే భయంతో కాబోలు. మొహం చిరాగ్గా పెట్టుకుని (బహుశా రూపాయి చూసి కాబోలు) ముందుకు కదిలాడు ముష్టివాడు.

“టైమయింది. అన్నం పెట్టు” అన్నాడు అప్పారావు టేబుల్ దగ్గరికి వస్తూ.

“పారేసుకుంటామా ఏమిటి? కిలో బియ్యం 35 రూపాయలు” అని స్వగతంలా చెప్తూ అన్నం పెట్టింది భార్య.

కోపం రెట్టింపయినా చేసేది లేక ముష్టివాడు వద్దన్న ఆ చద్దన్నం, జతగా కొద్దిపాటి వేడన్నం తిని బయలుదేరాడు ఆఫీసుకు అప్పారావు.

బియ్యం రేట్లు మరీ పెరిగిపోవడం వల్ల అన్నం పారేయ్యకుడదనే రూలు తనే పెట్టాడు. ఎందుకంటే  భార్యది భారీ చేయి. సమానంగా వండలేదు. దానికితోడు చిన్నతనంలో పుట్టింటివారికి పొలాలుండేవట. వచ్చిపోయే ఇల్లు. అస్తమాను వండలేక వాళ్ళమ్మ బియ్యం ఫ్రీయే కాబట్టి ఎక్కువే వండేదిట. పొలాలైతే లేవు గానీ ఆ భారీతనం భార్యకీ అబ్బింది. అందుకే ఎక్కువ వండి పారెయ్యద్దని చెబితే అది తనకే చుట్టుకుంది.

ఎందుకంటే భార్య పనీ, పూజా గట్రా ముగించేసరికి ఒంటిగంట అయిపోతే అప్పటికి చద్దన్నం పాడయిపోతుందని భార్య ఉవాచ. పిల్లవాడు అయితే ప్రొద్దున్నే పాలు త్రాగి ఆరింటికే వెళ్ళిపోతాడు. క్యారియర్లలో వాడికి చద్దన్నం బాగుండదు.

మొదట్లో పనిమనిషికి పెట్టేద్దామని ప్రయత్నించేది. కానీ ఆమెకి మాత్రం ఏమవసరం? రూపాయకి కిలో బియ్యం దొరుకుతుంటే చద్దన్నం ఎందుకు తింటారు? ఆమె కూడా తిరస్కరించింది. ఇక మిగిలింది తనే.

“మిగలకుండా వండరాదా?” అంటే “ముద్దలు కొలుస్తామా? ఒకసారి ఆకలి ఎక్కువ వేస్తుంది. ఒకసారి తక్కువేస్తుంది” అంటుంది భార్య. లాయరు చదివించాలని తండ్రి అనుకున్నాడట. అది కుదరలేదు. ఆ తెలివి తనమీద ప్రయోగిస్తుంది. స్కూటర్ పాడవటంతోటి బస్టాపులో కూర్చున్నాడు. వరసాగ్గా కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, కుష్టువాళ్ళు రాసాగారు.

“ఎంతమందికెయ్యాలి? నువ్వు పదోవాడివి ముష్టి అడగటం” అన్నాడు చిరాగ్గా.

“పదిమంది అడిగినా, పాతికమంది అడిగినా మీలాంటివాళ్ళనే అడుగుతారు గానీ, మాలాంటి వాళ్ళను అడగరు కదా సార్’ అన్నాడు ముష్టివాడు తెలివిగా.

తెల్లబోవడం అప్పారావు వంతయ్యింది. చేసేది లేక నిన్నటి అనుభవంతోటి, రూపాయి తీసినవాడే  మానేసి, అయిదు రూపాల బిళ్ల వేశాడు. వరసాగా మరో నలుగురు వచ్చేశారు. పాతిక రూపాయలు వదిలింది. మనస్సులో వాడి మాటలకు మురిసినందుకు అయిన పెనాల్టీ అది.

“ఆటోలో వెళ్ళినా అంతే అయ్యేది. శ్రమ తగ్గేది” అనుకున్నాడు బాధగా.

***

“అమ్మా, బిచ్చం వెయ్యమ్మా.”

“వీధి తలుపు తెరవటం పాపం, వరసాగ్గా వస్తున్నారు. ఎంతమందికేస్తాం? విసుక్కుంది భార్య.

“అబ్బో, దానకర్ణుడి చెల్లెలు. పాపం, ముష్టి వేసి వేసీ, చేతులు పడిపోతున్నాయి కాబోలు” తిట్టుకుంటూ వెళ్ళిపోయింది.

ఇంతలో”చూడు పిన్నమ్మా పాడు పిల్లడూ” అని పాడుతూ చప్పట్లు కొడుతూ వచ్చారు. భార్య ఎంత చెబుతున్నా వాళ్ళు వెళ్ళకపోవడంతోటి, విశ్రాంతిగా పడుకున్న అప్పారావు లేచివచ్చాడు.

“క్రిందటి నెలేగా వంద రూపాయలు ఇచ్చింది. అస్తమాను వస్తే ఎలాగ? పూర్వం పిల్లలు పుట్టినప్పుడే వచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారు” అన్నాడు చిరాగ్గా.

“అందరూ ఫామిలీ ప్లానింగులేనాయే. అందరూ ఒకళ్ళనో, ఇద్దరినో కంటున్నారు. దాంతో రోజూ మా కడుపెలా నిండుతుంది? మీకైతే వాళ్లని చూసుకున్నా నిండిపోతుంది” అన్నారు తెలివిగా

చేసేది లేక ఏబై రూపాయలిచ్చి, కష్టం మీద వదుల్చుకున్నాడు.

***

ఆ మధ్య ఓ ముష్టిది అడిగితే ఓ చీర ఇచ్చింది భార్య. ఆ చీర ఆమెకు నచ్చలేదు.

“నువ్వన్నీ మంచి మంచి చీరలు జరీవి కడతావు కదా అని అడిగితే నాకు ఏరి, ఏరి ఇల్లాంటిది ఇచ్చారు. నాకేం వద్దు” అని పడేసి పోయింది. నిజానికి జరీది కాకపోయినా రోజూ భార్య కడుతున్న, ఇంకా కొంతకాలం కట్టగలిగే చీరే అది. మరీ పాతది ఇవ్వలేక అది ఇచ్చింది. నలగని సింథటిక్ అయితే వాళ్ళకి ఎలా కట్టినా పర్వాలేదు అనే ఉద్దేశంతో. ఆమెకి నచ్చలేదు.

ముష్టిది పడేసిన చీర కట్టలేక, ఇంట్లో పెట్టలేక, స్టీలు సామాన్ల వాడికిచ్చేసి వాడిచ్చిన చెంచా (మాత్రమే) తీసుకుంది భార్య (ఆ చీర ఖరీదు రూ.350/-).

మర్నాడు బాగు చేయించిన స్కూటర్ తీసుకుని ఆఫీసుకు తొందరగా బయల్దేరాడు అప్పారావు. ఇన్‌స్పెక్షన్ ఉంది.

అనుకున్నంతా అయ్యింది. సిగ్నల్ పడింది. ముష్టివాళ్ళు వలయంలా చుట్టుముట్టేశారు. వాళ్ళకి వేస్తేనే వదులుతారు, లేదంటే కదలరు. విదిలించీ, అదిలించీ ఎంతో కొంత వదుల్చుకుని చూసేటప్పటికి సిగ్నల్ మారిపోయి మళ్ళీ రెడ్ లైట్ వెలగటం జరిగింది. వెనకనుంచీ, ఇందాకటి నుంచీ వినిపిస్తున్న హారన్లు, పక్కనుంచీ వెళ్ళేవాళ్ళ కోపం చూపులకి కారణాలు అప్పుడర్థమయ్యాయి. మళ్ళీ గ్రీన్ లైట్ ఎప్పుడు వెలుగుతుందో, ఆపీసుకు ఎప్పుడు వెళ్ళగలుగుతాడో, మళ్ళీ ఆఫీసరు దండకం తప్పదు. ‘తొందరగా బయలుదేరినా లాభం లేకపోయింది’ అనుకుని నిట్టూర్చాడు – పాపం, ముష్టి బాధితుడు అప్పారావు, గ్రీన్ లైట్ కోసం ఎదురుచూస్తూ.

ఇంతలో పక్క నుంచీ వినబడింది “బాబూ ధర్మం.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here