భూమి మీద దేవతలు

0
14

[dropcap]స్వ[/dropcap]ర్గంలో దేవతలు అందరూ ఆనంద డోలికల్లో మునిగిపోయి ఉన్నారు. వీనుల విందైన సంగీతానికి కొందరు దేవతలు నాట్యం చేస్తున్నారు. దూరంగా ఆకాశంలో మన  భూమి కనబడుతోంది.

దేవశ్రీ అనే దేవత దృష్టి భూమి మీద పడింది. అలా దేవశ్రీ స్వర్గపు రంగు రంగు మేఘాల మీద నిలబడి భూమి వైపు తదేకంగా చూడసాగింది!

“ఏంటమ్మా భూ గ్రహాన్ని అలా చూస్తున్నావు?” అడిగాడు సోమదేవుడు.

“స్వామీ నాకెందుకో భూమిమీద విశేషాలు చూడాలని ఉంది, మీరు అనుమతిస్తే నేను వెళ్ళి భూమి మీద విశేషాలు చూసి వస్తాను” అని నమ్రతతో అడిగింది.

“నీకీ కోరిక కలగడానికి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది, నీవు భూమి మీదకు వెళ్ళు. అక్కడి విశేషాలను చూడు నీవు భూవాసులకు ఏదైనా మేలు చెయ్యి” అని ఆశీర్వదించి చెప్పాడు సోమదేవుడు.

దేవశ్రీ సోమదేవునికి నమస్కరించి మేఘాల మీదుగా వేగంగా భూమి మీదకు చేరుకుంది.

భూమి మీద వెండి కొండలవంటి మంచుకొండలు, రంగురంగుల పూలతో అందమైన చెట్లు ఇంపైన పక్షిపాటలతో దేవశ్రీ పులకించి పోయింది!

పొలాలను దున్నే రైతులు, కుండలు చేసే కుమ్మరులు, బొమ్మలు చిత్రంచే కళాకారుల్ని చూసి దేవశ్రీ ఆనందపడిపోయింది. స్వర్గానికి అలవాటు పడిపోయిన దేవశ్రీకి భూలోకం అంతా వింతగా కనబడసాగింది!

అలా చూస్తుండగా చిన్న చిన్న పిల్లలు అనేక ఇళ్ళలో కనబడసాగారు. కొంత మంది పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. ఆ పిల్లలకి అమ్మలు తిండి పెడుతున్నా కొందరు తినక మారాం చేస్తున్నారు.

దేవశ్రీ ఆ పిల్లలను చూసి ఆశ్చర్య పోయింది.

అలా అలా భూమి మీద రాత్రి అయిపోయింది. దేవశ్రీకి ఇదొక వింత ఎందుకంటే స్వర్గంలో మరి రాత్రి ఉండదు కదా!

దేవశ్రీ బాగా ఆలోచించింది. గబుక్కున ఆకాశంలోకి ఎగిరింది. కొన్ని నక్షత్రాలు పట్టుకొచ్చి పిల్లలకు మిఠాయిలుగా మార్చి ఇచ్చింది. కొన్ని నక్షత్రాల తెలుపును తెచ్చి పాలలో కలిపి పాలు బలవర్థకంగా ఉండేట్టు తయారు చేసింది.

అప్పుడే పుట్టిన పాపాయిలు, బాబులకు కలలో కనబడి దేవలోకపు కథలు చెప్పసాగింది దేవశ్రీ.

అప్పటినుండే  చిన్నపిల్లలు ఆ కథలు వింటూ నిద్రలో నవ్వసాగారు!

కొంచెం పెద్ద పిల్లలు ఏ మిఠాయి పెట్టినా, ఏ తిండి పెట్టినా తినకుండా మారాం చెయ్యసాగారు! దేవశ్రీ ఆ పిల్లల మంకుతనం చూసి చాలా బాధ పడింది. భూమి మీదనుండే సోమదేవుడికి పిల్లలు ఆహారం తీసుకోకుండా చేసే మారాం గురించి చెప్పింది. సోమ దేవుడు దేవశ్రీకి ఒక మంచి ఆలోచన కలిగేట్టు చేసాడు. అంతే దేవశ్రీ ఆకాశంలోకి వెళ్ళి సుదూర తీరాల్లో ఉన్న ఒక ఒంటరి నక్షత్రాన్ని తీసుకవచ్చి భూమికి కొంత దూరంలో ఉంచింది. ఆ నక్షత్రాన్ని పెద్దదిగా చేసి దాన్ని గుండ్రంగా మలచి దానిలో చల్లదనం నింపింది. అలా నక్షత్రాన్ని మార్చినపుడు దానిలో మచ్చ ఏర్పడింది, ఆ మచ్చే దేవశ్రీ చేసిన మంచిపనికి గుర్తుగా మిగిలి పోయింది. అప్పటినుండి దానిని అక్కతెచ్చిన ‘చందమామ’ అని పిల్లలు పిలుచుకో సాగారు!

అలా ఆ అందమైన చందమామ ఎందరో కవులకు స్ఫూర్తినిచ్చింది. వాళ్ళు చందమామ మీద ఎన్నో పాటలు వ్రాసారు. ఆ విధంగా అన్నమయ్య అనే కవి ‘చందమామ రావే.. జాబిల్లి రావే..’ అనే పాటను ఎంతో అందంగా వ్రాసాడు. అప్పటినుండి తల్లులు పిల్లలు తిండికి మారాం చేస్తే ఎంచక్కా గోరుముద్దలు తినిపిస్తూ ‘చందమామ రావే’ పాటను పాడుతున్నారు.

అన్నీ చూసి పిల్లలను ఎంతో ఆనందపరచిన దేవశ్రీ స్వర్గాన్ని చేరుకుని భూమి వైపు చూస్తూ, సోమదేవుడితో “పిల్లలే భూమి మీద నిజమైన దేవతలు” అని చెప్పింది. సోమ దేవుడు దేవశ్రీ మాటలకు ఎంతో సంతోషించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here