[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]
అధ్యాయం 25: స్పేస్ షిప్: లెత్వాల్ రూజ్ (ఎర్ర నక్షత్రం)
[dropcap]ఇ[/dropcap]ది చాలా పెద్ద వ్యోమనౌక, మేము ఆస్టరాయిడ్ బెల్ట్ ద్వారా గురుగ్రహం వైపు ప్రయాణిస్తున్నాం.
సమూరాతోనూ, అతని బృందంతోనూ వాళ్ళ కుట్రలకు సహకరించాలని నిర్ణయించుకున్నాక, ఇక చర్చించడానికేం మిగలలేదు.
చక్రవర్తి సమూరా కోరుకుంటున్న గురుగ్రహపు మంత్రదండం ఎక్కడుందో కనుగొనేందుకు మేమిప్పుడు గనీమీడ్ వైపు ప్రయాణిస్తున్నాం.
హనీ ఆమ్రపాలి అనబడే నేను అందుకు ఎంపికైన వ్యక్తిని.
లేదంటే అతను ప్రకృతి తండ్రి మహాని చంపుతానని బెదిరిస్తాడు లేదా చంపడానికి ప్రయత్నిస్తాడు లేదా వేగవంతమైన ఈ అంతరిక్ష నౌకలో మాతో పోరాడటానికి దిగుతాడు. దాంతో అందరం నాశనమైపోతాం.
కాబట్టి మేము అతనికి లొంగిపోయాం. మాకు అన్నపానీయాలు, నిద్రించడానికి అనువైన బంకర్ సీట్లు ఇచ్చారు.
వ్యోమనౌక యొక్క గుండ్రని కిటికీల గుండా, కొన్నిసార్లు మానిటర్ మీద నేను ఓడ చుట్టూ వేగంగా కదిలే అనేక గ్రహశకలాలు చూశాను. అయితే వ్యోమనౌకని అత్యంత లాఘవంగా నడపడంతో, పెద్ద గ్రహశకలాలను ఢీ కొట్టే ప్రమాదం నుంచి తప్పించుకున్నాం.
కొద్దిసేపటికే మేము ఆస్టరాయిడ్ బెల్ట్ దాటి, గురుగ్రహపు దిశలో ప్రవేశించాము.
గమ్మత్తైన విషయమేంటంటే భూమి కన్నా 2½ రెట్లు ఎక్కువ గురుత్వాకర్షణ కలిగిన గురుగ్రహం అత్యంత శక్తితో మా వ్యోమనౌకని తనవైపుకు లాక్కుంది.
ఇంతలో వ్యోమనౌక కమాండర్, తలపై నాలుగు యాంటెన్నాలు, పొడుచుకు వచ్చినట్టు ఉన్న చెవులు, మెరుస్తున్న కళ్ళను కలిగిన పొడవాటి గ్రహాంతరవాసి పొడవైన బయటకు వచ్చాడు. మా అందర్నీ చూస్తూ:
“గౌరవనీయులారా, మనం ఆస్టరాయిడ్ బెల్ట్ దాటాము, మరో ఎనిమిది గంటలలో బృహస్పతి కక్ష్యలో ప్రవేశిస్తాము. గురుగ్రహపు గురుత్వాకర్షణ నుండి మనల్ని మనం కాపాడుకోడానికి రెట్రో రాకెట్లు పేలుస్తాం. తరువాత మనం గనీమీడ్‌పై దిగేందుకు ప్రయత్నిస్తాము.
గనీమీడ్, యురోపా అనేవి గురుగ్రహానికి ఉపగ్రహాలని మీకు తెలుసు. వాటిల్లో భూగర్భ కాలనీలు ఉన్నాయి. గురుగ్రహంలో కాలనీలు లేవు, ఎందుకంటే అక్కడ హైడ్రోజన్ అధికంగా ఉంది, ఆమ్లజని లేకపోవడం వల్ల అది నివాసయోగ్యం కాదు.
ఇక్కడ స్పేస్ ప్లాట్‌ఫామ్ కూడా లేదు, గురుగ్రహం గురుత్వాకర్షణశక్తి కారణంగా అది నిలిచి ఉండదు, కదిలిపోతుంది. మనం రెట్రో రాకెట్లని పేల్చి, అధిక గురుత్వాకర్షణని అధిగమించి, గనీమీడ్‍పై దిగడానికి ప్రయత్నించాలి. అది అంత ఆహ్లాదకరంగా ఉండదు, మీరు కొంత స్పేస్ సిక్‌నెస్ పొందవచ్చు. తల తిరుగుడునీ, వికారాన్ని నియంత్రించడానికి మీరు మాత్రలు వేసుకోవచ్చు” అని చెప్పాడు.
ఈ విధంగా అతని సూచనల ప్రకారం మేము దిగడానికి సిద్ధమయ్యాం.
నేను ఏనిమాయిడ్‌కేసి చూశాను. అతనెందుకో తుంటరిగా నవ్వుతున్నాడు.
“మీ ఆవాసానికే వెళ్తున్నాం ఏనిమాయిడ్, ఈ ప్రాంతమంతా నీకు బాగా తెలుసనుకుంటా! మీ ప్రయాణాలెప్పుడూ ఇలాగే ఉంటాయా?” అడిగాను.
ఏనిమాయిడ్ ఎల్లప్పుడూ మితభాషి. కానీ అతను గుర్రుమంటున్నట్టుగా “అవును. మేము ఇక్కడ నుండి చంద్రుడి లా టెర్ పైకి లేదా బుధగ్రహంపైకి వెళ్ళేందుకు స్పేస్‌షిప్ ఉపయోగిస్తాం. ఇక్కడ గనీమీడ్ భూగర్భంలో అనేక కాలనీలు ఉన్నాయి.”
“మరి పైన ఏమున్నాయి?”
“సముద్రం, పర్వతాలు, శిలలు! ఇక్కడ ఆక్సిజన్ లేదు. కానీ గ్రావిటీ స్యూట్ ధరించి నడవవచ్చు. మేము మా నగరాలు, కాలనీలను ప్రేమిస్తాం.”
వాన్ కు జాక్ పళ్ళికిలిస్తూ… “ఇక్కడ మరి మీలాంటి జంతువులు ఏం చేస్తాయి?” అన్నాడు.
“ఓహ్! అతన్ని అలా అవవద్దు. అతను బాధపడతాడు” అన్నాడు చాంద్.
ఏనిమాయిడ్ మళ్ళీ గుర్రుమన్నాడు. “మేము జీవవాదులం. మేము కొన్ని శక్తులున్న తాంత్రికులం. మా రాజు జీవవాది కాదు. పాలక వర్గంలో ఉండేవారంతా మానవులు. మేం.. జీవవాదులం.. డ్రైవర్లు, పైలట్లు, వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నాం. కొందరు ఇంద్రజాలికులు. వారు విషయాలు జరిగేలా చూస్తారు! నియమితకార్యాలు చేస్తాం.”
ఏనిమాయిడ్ సగం జంతువు, సగం శక్తులున్న మనిషి అని నాకు తెలుసు. సమూరా బృందం చేత హిప్నటైజ్ చేయబడి కుజగ్రహానికి వచ్చాడు; నాతో పాటు ఒలింపస్ పర్వత యాత్రలో పాల్గొన్నాడు. అతనికి ఇంకా శక్తులు పొందాలని కోరిక.
అతను స్పేస్‌షిప్‌లను, యుద్ధ విమానాలను నడపగలడు. సెక్యూరిటీ గార్డు వంటి పనులు చేయగలడు. ఎలాంటి పరిస్థితిలోనయినా అతను దొంగలను, దుష్టశక్తులు తరిమేయగలడు. గొప్ప తాంత్రికుడిగా ఎదగాలన్నది అతని ఏకైక కల.
“ఎవరూ ఏమీ మాట్లాడద్దు! దిగడానికి సన్నద్ధమవ్వండి. ఏనిమాయిడ్! మంత్రదండాన్ని పొందడానికి నువ్వు నాకు సహాయం చేస్తే నేను నా గెలాక్సీ సైన్యానికి నిన్ను అధిపతిగా చేస్తాను. నువ్వు శక్తులు పొందుతావు. లాగోస్ నీకు మరిన్ని విద్యలు బోధించేలా చూస్తాను, హనీ వలె నువ్వు కూడా శక్తులను మెరుగుపరుచుకునేలా చూస్తాను! సరేనా?”
తాంత్రిక చక్రవర్తి ఎల్లప్పుడూ మమ్మల్ని గమనిస్తునే ఉన్నాడు. మేము నిశ్శబ్దంగా ఉన్నాము.
అతన్ని చంపడానికి అవకాశం కోసం నేను వేచి ఉన్నాను. మొదట్లో బెదిరించేవాడు, ఇప్పుడు నా భార్యకీ, మా మామగారికి హాని చేస్తున్నాడు. అందరు చెడ్డ వ్యక్తుల్లానే అతనూ ఒక బ్లాక్‍మెయిలర్.
ఒక పెద్ద గర్జనతో, రెట్రో రాకెట్లను పేల్చారు. భారీ గురుగ్రహం అక్కడి ఆకాశంలో నాల్గింట మూడు వంతులు ఆక్రమించింది. మేము కిందకి దిగడం ప్రారంభించాం.
మా అందరికీ కడుపు తిప్పేస్తోంది, తల తిరగసాగింది, వికారంగా ఉంది. లైట్లు వెలిగి, ఆరి, వెలిగి మళ్లీ మెరవసాగాయి.
“నేను ధ్యానం చేస్తాను, మీరంతా కూడా చేయాలి” అన్నాడు సమూరా.
అతని పక్కన ఉండే ఆల్ఫా గ్రహాంతర తాంత్రికులు గుర్రుపెట్టి, తమ కళ్ళు మూసుకున్నారు.
ఒక గంట తర్వాత మా వ్యోమనౌక గనీమీడ్ మీద ఒక భారీ సముద్రంలోకి దిగింది. ఒకప్పుడు అది ఘనీభవించిన మంచుతో నిండివుండేది. అయితే మానవులు నివాసం కోసం అన్వేషించడం వల్ల మంచు కరిగిపోయింది. మంచు కరిగిన ఏర్పడిన నీటి నుంచి ఆక్సిజన్‍ను తయారుచేయడంతో, వందలాది భూగర్భ కాలనీలు నిర్మితమయ్యాయి, గనీమీడ్ తన సొంత నాగరికతను అభివృద్ధి చేసుకుంది. కానీ ఉపరితలంపై ఘనీభవించిన సముద్రం చాలా ఉంది. అయితే భారీ స్థాయిలో మంచు కరిగిపోవడం వల్ల ఇప్పుడు నీరు ద్రవ స్థితిలో ఉంది.
భారీ నీటి వనరులు ఉపయోగించి గనీమీడ్‌లో కొన్ని ప్రాంతాలలో టెర్రాఫార్మింగ్ జరిపారు. మరియు మిగతా నీటిని వ్యవసాయ ప్రయోజనాల కోసం టైటాన్‌కి, కుజగ్రహానికి కూడా పంపించారని విన్నాను. వాతావరణంలోని గ్రీన్‌హౌస్ వాయువులు, పలచని ఆక్సిజన్ ఈ బృహస్పతి ఉపగ్రహంలో వ్యవసాయానికి దోహదం చేసింది, కాలనీల స్థాపనలో సహాయపడింది.
కానీ అక్కడున్న అతిపెద్ద సమస్య రేడియోధార్మికత. ఇది ఈ గ్రహం మీద అపారమైనది. దీనిని అధిగమించడానికి, కాలనీల వ్యవస్థాపకులు రేడియేషన్ స్యూట్లను ధరించి భూగర్భాన్ని తవ్వి, రేడియేషన్ లేకుండా ఉండే కాలనీలను నిర్మించారు.
మానవులు… ముఖ్యంగా తూర్పు ఐరోపా మరియు చైనాల నుంచి వచ్చి మానవులు ఇక్కడ స్థిరపడేందుకు ఎంతో సాహసం చేశారు, ఎంతో అన్వేషణ సాగించారు. వారికిది ఆవశ్యకత కూడా. బృహస్పతి యొక్క ఈ ఉపగ్రహం మీద చాలా ముడి ఇనుము ఉంది, భూగర్భంలో అయస్కాంత ప్రవాహాలున్నాయి.
అయినప్పటికీ, ఇంత ప్రమాదకరమైన వికిరణ ప్రాంతాలలో, భూగర్భంలోని పెద్ద అయస్కాంత ప్రవాహాలతో ఈ ప్రజలు ఎలా నివసిస్తున్నారో తెలుసుకోవాలి.
“మనం ఎందుకు సముద్రం మీద దిగుతున్నాం?” సమూరాని అడిగాను అరుస్తున్నట్లుగా.
లోహపు రోబో తన మెటాలిక్ స్వరంతో చెప్పింది; “ఇది సరైనదే మాస్టర్! క్రాష్ అయ్యే అవకాశాలు తక్కువ. ఈ వ్యోమనౌక కూడా తేలుతుందని నేను నమ్ముతాను!”
సమూరా నవ్వాడు “హా! హా! ఇలాంటి చిన్న గ్రహాలనెన్నో చూశాను. సముద్రం మీద దిగడం ఎప్పుడూ సురక్షితం. లేదంటే అయస్కాంతానికి అతుక్కునే ఇనుప రజను వలె నేలకి కరుచుకుపోతాం. ఈ వ్యోమనౌక తేలుతుంది. మనకు పడవలు ఉన్నాయి, ఆపై వాటిమీద నేలమీదకి చేరుకోవడమే కాకుండా రోవర్స్ ద్వారా భూగర్భంలోకి ప్రవేశించవచ్చు! అక్కడ, ఏం చేయాలో మీ జంతు స్నేహితుడు తెలియచేస్తాడు” అన్నాడు.
“మనల్ని అనుమతిస్తారా? వీసాలు అవసరమా? “
సమారా నవ్వాడు.
“అది మీ సమస్య, హనీ అమ్రాపాలి. నీకు బాగా తెలుసు. నువ్వు మిషన్ కమాండర్‌వి. మీ నలుగురు స్నేహితులు ఎంతో శక్తివంతమైన తాంత్రికులు, పైగా మీరో తెలివైన రోబోని కలిగి ఉన్నారు. మంత్రదండం సాధించలేకపోతే, ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు, నీ ప్రేయసి, వాళ్ళ నాన్న నీకిక ఉండరు. సరేనా?”
నిజంగానే మేము గనీమీడ్ సముద్రం మీద ఒక మృదువైన బుడగాలా దిగాం. వ్యోమనౌక వెనుక నుంచి బయటకు తీసిన ఒక పడవను విడుదల చేయడంలో సిబ్బంది మాకు సహాయం చేశారు.
“మీకున్నవి ఏడు గనీమేడ్ రోజులు! ఇది ఏడు రోజుల ఒకసారి గురుగ్రహం చుట్టూ తిరుగుతుంది. ఆలోపు మీరు మంత్రదండంతో రావాలి! లేదా నీ భార్య, మామగారిని శవాలుగానే చూస్తావు!” అన్నాడు సమూరా. కాకిలాంటి స్వరంతో మళ్ళీ తనే మాట్లాడుతూ “ఖచ్చితంగా వస్తావు! ఈ పని చేయడానికి నువ్వే ఎంపికైన వ్యక్తికి అని నేను అనుకుంటున్నాను” అన్నాడు వెక్కిరింతగా.
“అయ్యా చక్రవర్తి గారు! నాపై మీరు పెట్టుకున్న నమ్మకానికి నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను. కానీ కనీసం మంత్రదండం ఉన్నట్లు నాకు కొన్ని ఆధారాలు ఇవ్వండి… చంద్రుడి కక్ష్యలోని సౌర ఫలకలలో అద్దం ఉందని చెప్పినట్టే! నేను వెండి కొవ్వొత్తిని సాధించి ఇచ్చాను కానీ మీరు దాన్ని చంద్రునిపై కోల్పోయి తిరిగి పొందారు. చోటు చెప్పండి, ఆధారాలు చూపించండి! అది తప్పక సాధించవలసినంతటి గొప్ప మంత్రదండమా?” అడిగాను.
“అవును” అన్నాడు సమూరా. “అది గనిమీడ్ యొక్క ముడి ఇనుముతోనూ ఇతర మిశ్రమ లోహాలతోనూ తయారైనది. బృహస్పతి యొక్క అయస్కాంత శక్తిచే సమృద్ధమైంది. అది దాని యజమానికి కట్టుబడి ఉంటుంది. దాంతో మీరు శక్తిమంతమైన ఒక పూర్తి సైన్యాన్నే సృష్టించవచ్చు లేదా ఒక ఆదేశం ద్వారా ఎలక్ట్రానిక్ శక్తితో కూడిన తుఫానును రప్పించవచ్చు.
సహజంగానే ఆదేశాలతో పాటు దానితో హెచ్చరికలూ ఉండవచ్చు. భూగర్భంలో నివసించే రాజు ఫెరియస్ యొక్క రాజధానిలోని రాజభవనంలో అది ఉందని నేను ఊహిస్తున్నాను. ఫెరియస్ ఎప్పుడూ ఆ మంత్రదండాన్ని ఉపయోగించలేడు. అతను మంగోలియన్ జాతికి చెందిన వ్యక్తి. ఇక్కడ నిజమైన తాంత్రికులు ఎవరంటే ఏనిమాయిడ్ వంటి జీవవాదులే. కాని వారు ఇక్కడ బానిసలు. కాబట్టి రాజభవనానికి వెళ్ళండి. ఈ బొమ్మ రోబోతో మంత్రదండం వెలువరించే రేడియేషన్ కోసం వెతకండి… విశ్వశక్తి యొక్క ఏ ప్రయోగంతోనైనా పోరాడండి, నాకా మంత్రదండం తీసుకురండి! వెండి కొవ్వొత్తిని నేను మళ్ళీ పొందాను, నువ్వు అందించిన సమాచారంతోనే నేను దుష్టులైన ఆ నరమాంస భక్షకులను హతమార్చాను, నీకు కృతజ్ఞతలు!” చెప్పాడు సమూరా.
“ఎంత సులభంగా చెప్పారు ప్రభూ?” అరిచాను. “నాకు సాయంగా కనీసం ఈ ఆల్ఫా వ్యవస్థకి చెందిన మంత్రగాళ్ళని పంపండి!” అన్నాను.
సమారా కోపంతో అరిచాడు.
“కుదరదు. వాళ్ళు నా స్నేహితులు. మీరు విఫలమైతే లేదా మరణిస్తే నేను వారిని వాడుకుంటాను! వారు దానిని ఖచ్చితంగా తెస్తారు, కానీ నేను రెండు గ్రహాలను వారికి వదిలేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆలస్యం చేయద్దు. వెళ్ళండి…!” అన్నాడు.
మమ్మల్ని పడవలో నెట్టారు, పడవ తేలుతున్న స్పేస్‌షిప్ నుండి సముద్రపు నీటిలో పడటం జరిగింది.
***
ఇక నుంచీ మా పాట్లు మావి.
ఇక్కడ కూడా స్పేస్ సూట్లు, ఆక్సీజన్ అవసరమే. అయితే నీలి సముద్ర జలాలపై పడవలో ప్రయాణం చేస్తుంటే భూమి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొచ్చాయి. మేము ఇప్పటివరకు ఓ ఇరుకైన వ్యోమనౌకలో ఉన్నాం, ఘనీభవించజేసిన ఆహారం తిన్నాం, చివరికి కాలకృత్యాల తీర్చుకోడం కూడా కష్టంగా ఉండే చోట కూడా మాకు బెదిరింపులు తప్పలేదు.
మేము నిరంతరం ఒత్తిడికి గురయ్యాము. ఇప్పుడు అది ముగిసింది.
గనీమీడ్ ఒకప్పుడు ఘనీభవించిన గ్రహం. ఇప్పుడు మంచు కరిగిపోయింది, భూగర్భ మరియు ఉపరితల భూభాగంలో సాగు కోసం సముద్రపు నీటిని ఉపయోగించారు. కొంత నీటిని సమీప గ్రహాలకు ఎగుమతి చేశారని కూడా నాకు తెలిసింది.
ఏనిమాయిడ్‌కి ఈ ప్రాంతమంతా పరిచయమున్నదే.
“మనం తీరానికి వెళదాం. నాకు మాప్ ఇవ్వండి!” అన్నాడు. తీరం నుంచి భూగర్భ కాలనీలకు దారితోసే ప్రవాహలు ఉన్నాయి.
నాల్గవ సహస్రాబ్దిలో గ్రహాలు మరియు ఉపగ్రహాల కాలనీలలో విపరీతమైన పెరుగుదల ఉంది.
గురుగ్రహం, శనిగ్రహం యొక్క వివిధ ఉపగ్రహ గ్రహాలు చైనీయులు, మంగోలులు, తూర్పు ఆసియా ప్రజలు వంటి శక్తిమంతమైన మానవ జాతుల ద్వారా అన్వేషించబడ్డాయి.
శతాబ్దాలుగా ఈ వలసరాజ్యాలలోని సమాజాలలో అసమానతలు ఉండేవి. అధికార వర్గాలు ఏనిమాయిడ్ వంటి బలహీన జాతులపై జులుం చేసేవారు. దానిని బానిసత్వం అని పిలుస్తారు. ఇది గ్రహాలలో కొత్త సామ్రాజ్యవాదం ప్రభావమేనా?
అసలు ఏనిమాయిడ్ సంభవం ఎలా జరిగిందనేది రహస్యమే.
కొన్నాళ్ళ క్రితం, నేను యురేకస్ సహాయంతో ఐజినెట్‌లో దీని గురించి అధ్యయనం చేశాను.
ఇది జన్యువుల పరివర్తన లేదా పరిణామ ప్రక్రియ యొక్క సహజ ఎంపిక కావచ్చు. మానవ-జంతు జాతులు కూడా గనీమీడ్ వంటి ఉపగ్రహ గ్రహాలపై ఉద్భవించాయి, బహుశా యురోపా మరియు టైటాన్ వంటి ఇతర చిన్న ఏకాంత కాలనీలలో ఉండవచ్చు. ఈ వ్యక్తులు విశ్వశక్తిని ఉపయోగించగలరు. పశువులలో ఉండే సహజాతాలు, మానవులలోని ముఖ లక్షణ విజ్ఞానం వీళ్ళలో ఉంటాయి.
శారీరక శ్రమతో చేసే పనులకు, ఇతర నీచమైన పనులకు మానవజాతి వీరిని ఉపయోగకరంగా భావించింది. తాంత్రిక శక్తులున్న వారూ ఉండేవారు, అలాంటి వాళ్ళని అనుమానించి, సంశయవాదంతో వారి పట్ల జాతి వివక్ష చూపారు.
ఏనిమాయిడ్ గుర్రుమన్నాడు, ఒక కఠినమైన స్వరంలో మాట్లాడాడు.
“మాస్టర్ హనీ! మనం తీరానికి చేరుకున్నప్పుడు భూగర్భంలోకి వెళ్ళాలి. భూగర్భ కాలనీలన్నీ రాజధాని నగరంలో ఉన్నాయి. అక్కడ రాజు నివసిస్తాడు. శిలలతో కూడిన, మానవులు జీవించలేని అడవి వృక్షాలున్న మేం… జంతువులం… నివసిస్తాం. కానీ మేము అక్కడే నివసిస్తున్నాం. మంత్రదండాన్ని పొందడానికి, మనం రాజ భవనంలోకి వెళ్ళాలి. మీరు విశ్వశక్తిని ఉపయోగించాలనుకుంటున్నారా? అదృశ్యరూపంలో వెళ్తారా? ఎలా?”
తీరం కనిపిస్తోంది… నేను ఆలోచిస్తున్నాను. కొండలు, శిలలు, రాతి నిర్మాణాలు కనిపిస్తున్నాయి.
ఒక వైపున సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, కానీ పశ్చిమ దిశలో మొత్తం ఆకాశం పూర్తిగా గురుగ్రహపు నీడతో నిండి ఉంది. అది చాలా పెద్దదిగా ఉంది, అత్యంత సమీపంలో ఉన్నట్టు అనిపించింది.
“నేను ఖచ్చితంగా చెప్తున్నాను, విశ్వశక్తిని ఉపయోగించను. మనం పర్యాటకులుగా వెళ్లి, సరైన సమయంలో అదృశ్యరూపంలో రాజభవనంలో ప్రవేశించాలి. విశ్వశక్తిని ఉపయోగిస్తే ఎలక్ట్రానిక్ అల్లకల్లోలం ఏర్పడి మనల్ని గుర్తించి, వెంబడిస్తారు” అన్నాను.
తీరం చేరాం… ఒకరొకరుగా మేము గట్టు మీదకి దూకాం.
గురుత్వాకర్షణ ఎక్కువగా ఉన్నందున మేము తేలలేదు. మేమంతా తలనొప్పితో బాధపడ్డాం.
డిమిట్రీ కిలకిలా నవ్వింది. “మనం మంచి ప్రదేశాలను చూస్తామని నాకు అనిపిస్తోంది.”
చాంద్, వాన్ కు జాక్ నిశ్శబ్దంగా ఉండిపోయారు.
మేము గనీమీడ్ నేల మీద పెద్ద గులకరాళ్ళపై నడుస్తుండగా, “అదిగో! భూగర్భ సొరంగానికి దారితీసే వంపుకట్టడం” అన్నాడు ఏనిమాయిడ్.
అది చాలా పెద్ద వంపుకట్టడం. దాని మీద వింత చిత్ర లిపిలో ఏదో రాసి ఉంది, ఏవేవో బొమ్మలున్నాయి.
మేము అక్కడకు వెళ్ళాం. కిందకి దిగేందుకు రాతి మెట్లు ఉన్నాయి. అక్కడంతా చీకటిగా ఉంది.
“ఎవరైనా కిందకి వెళ్ళవచ్చు! హా! హా!” అంటూ డిమిట్రీ మళ్ళీ నవ్వింది. “గార్డులు ఎక్కడున్నారు? సెక్యూరిటీ చెక్ ఎక్కడ?” అంది.
“గార్డులు, కస్టమ్స్ అధికారులు కింద ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ చెక్ అక్కడ అవుతుంది. మనల్ని బాడీ రేడియేషన్‌తో ఇప్పటికే స్కాన్ చేశారు!” చెప్పాడు ఏనిమాయిడ్.
మేము కిందకి వెళ్ళాం. హఠాత్తుగా ఒక చోట పెద్ద వేదిక కనబడింది. ‘మిలీనియం రూజ్ గన్స్’ పట్టుకున్న, మెటాలిక్ యూనిఫామ్ ధరించిన ఇద్దరు గార్డులు కనబడ్డారు. వారు మమ్మలి ఆగమని సైగ చేసి, వింత భాషలో ఏవేవో ప్రశ్నలు అడిగారు.
మేము అజ్ఞానం వ్యక్తం చేశాం. ఇప్పుడు లోపల నుండి ఇంకో వ్యక్తి బయటకు వచ్చాడు, గట్టి ఉచ్ఛారణలో డిజిటల్ భాషలోనూ ఇంగ్లీష్‌లోనూ మాట్లాడాడు.
“మాకు మీ గుర్తింపుకార్డులు, పాస్‌పోర్ట్‌లు, వీసాలు చూపించండి! మీరు నేను ఊహిస్తున్న గ్రహం నుండి రాలేదు. మీ పత్రాలు లేకపోతే, మీరు జైలు శిక్షను పొందుతారు!”
ఏనిమాయిడ్ వెంటనే స్పందించి, ముతక యాసలో, మాకు తెలియని భాషలో ఆ అధికారితో మాట్లాడాడు.
“మీ వద్ద డబ్బు, పాస్‌పోర్ట్‌లు ఉంటే, ట్రాన్సిట్ వీసాకి దరఖాస్తు చేసుకోండి” అన్నాడా అధికారి.
“నేను భూమి నుండి వచ్చిన హనీ ఆమ్రపాలిని” అని చెప్పి నా డిజిటల్ ఐడిని, ఇంటర్ గెలాక్టిక్ యాత్రలకి చెల్లుబాటయ్యే పాస్‌పోర్ట్‌ను ఇచ్చాను. వాళ్ళ వద్ద మొత్తం సమాచారం ఉన్న, ప్లాటినంతో తయారుచేసిన డిజిటల్ డిస్కులు ఉన్నాయి.
“మేము ట్రాన్సిట్ వీసాలకు దరఖాస్తు చేసుకుంటాం. మీకు డిజిటల్ కరెన్సీలో చెల్లిస్తాం. మేమొక ప్రైవేట్ చార్టర్ స్పేస్‌షిప్ వచ్చాం. వాళ్ళిక్కడ మమ్మల్ని సముద్రంలో విసిరి వెళ్ళిపోయారు, మమ్మల్ని మోసం చేశారు. అవును, మాదే తప్పు! ఖర్చు తక్కువని, అసలైన ఖర్చులో సగమేనని ఆలోచించి – చంద్రుడి మీద ఆ స్పేస్‌షిప్ ఎక్కాం. మేము ఇక్కడ కాలనీని చూడాలనుకుంటున్నాము” అన్నాను.
ఆ అధికారి మా డిజిటల్ ఐడిలను సేకరించాడు, మమ్మల్ని లోపలికి పిలిచాడు.
“ఓ రైలు వచ్చే సమయమైంది. మీరు ఏ రకం పర్యాటకులు? ఫీజు తదనుగుణంగా విధించబడుతుంది. మీరు మా రాజధానిలో అంతర్ గ్రహ బ్యాంకు వద్ద చెల్లించాలి. మీరు భూమి నుండి వచ్చారు కాబట్టి నగదు బదిలీ సమస్య కాదు; లేకపోతే మీరు యూనివర్సల్ కరెన్సీ యూనిట్లలో ఇక్కడే నగదు చెల్లించవలసి ఉంటుంది “.
ఇప్పుడు మా యజమాని చక్రవర్తి సమురా మాకు నగదు లేదా బంగారం లేదా ప్లాటినం లేదా ఏ ఇతర మెటల్ కరెన్సీలో మాకు డబ్బు ఇవ్వలేదు. గనీమీడ్ కస్టమ్స్ ఫీజు ఎలా చెల్లించాలో నిజంగా నాకు అర్థం కాలేదు.
“యురేకస్, నువ్వు డబ్బు బదిలీ ఏర్పాటు చేయగలవా? లేదా డబ్బు పంపమని చక్రవర్తి సమూరని అడగవా?” అన్నాను యురేకస్‌తో.
యురేకస్ మాతోనే ఉన్నాడు.
“మాస్టర్! మీ ఖాతాలో ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సరిపోయే డబ్బు ఉంది. సమూరాతో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. మెయిల్ ఐడి, ఐజి నెట్ ఐడి ఇవ్వలేదు. నలుగురు వ్యక్తులు, ఇంకా నాకు… రోబో కోసం మీరు పదివేల యూనివర్సల్ కరెన్సీ యూనిట్లను చెల్లించాలి. పైగా నా లాంటి రోబో బీమా కోసం రెండువేలు అదనం” చెప్పింది యురేకస్.
ఇంతలో పెద్ద కూత వినబడింది. కొన్నిక్షణాలలో నాలుగు బోగీలున్న ఓ రైలు ప్లాట్‌ఫాం మీదకు వస్తూ కనబడింది.
“మీరు మీ బ్యాంక్ నుంచి చెల్లిస్తారా లేదా డబ్బులిస్తారా? సమయం లేదు” అన్నాడా అధికారి.
“ఏ పద్ధతిలోనూ మేము చెల్లించలేము. అందుకని మేం పారిపోతున్నాం! మిత్రులారా రైలులోకి గెంతండి!” అన్నాను నేను అరుస్తూ. యురేకస్‌తో పాటుగా మేమంతా మెరిసిపోతున్న, మెత్తని సీట్లున్న లోహపు బోగీలోకి దూకాం. అందులో ఒకే ఒక ముసలి ప్రయాణీకుడున్నాడు.
దిగ్భ్రాంతికి గురైన అధికారి మొబైల్ ఫోన్ లాంటి పరికరాన్ని త్వరితగతిన తీసుకుని మాట్లాడటం మొదలుపెట్టేసరికి బోగీ తలుపులు మూసుకున్నాయి.
రైలు వేగం అందుకుంది. గనీమీడ్ రాజధాని వైపు పరుగుపెట్టింది.