అధ్యాయం 35: తిరిగి ‘లెత్వాల్ రూజ్’కి
సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా కనిపించే ప్రదేశాన్ని తూర్పు అని పిలిస్తే, ఆ ప్లాట్‌ఫాం యొక్క కొస తూర్పు వైపే ఉంది. పోరాటం, సాహసం, పలాయనం, ఇంకా విజయం సాధించిన ఓ సుదీర్ఘ రాత్రికి ముగింపు ఇది.
నా ఛాతీ, చేతులపై అయిన చిన్న గాయాల నుంచి రక్తం కారుతోంది. ప్రకృతి జడ ఊడిపోయి జుట్టంతా చిందరవందరగా మారింది, తన నోట్లోంచి కూడా కొద్దిగా రక్తం కారుతోంది. డిమిట్రీ పైకి బానే ఉన్నట్టుంది కానీ కుంటుతోంది. ఆమె కాలి ఎముకలలో ఎటువంటి ఫ్రాక్చర్ అయి ఉండకూడదని నేను కోరుకున్నాను..
ఏనిమాయిడ్ కూడా గాయపడ్డాడు, నుదుటిపై తగిలిన దెబ్బని ఎడమచేతిలో ఒక వస్త్రాన్ని పట్టుకుని నొక్కుకుంటున్నాడు.
దూరంగా తెల్లని సూర్యబింబం దిగువన హఠాత్తుగా ఏదో కాంతి పొడలా కనిపించింది. అది క్రమంగా పెద్దదిగా మారింది.
“డిసెంట్ వెహికల్ వస్తోంది… ఇప్పుడే నాకు ‘లెత్వాల్ రూజ్’, ‘డివి’ (డిసెంట్ వెహికల్) ల కో-ఆర్డినేట్లు లభించాయి…” చెప్పింది యురేకస్.
యురేకస్ అక్షాంశాల డిగ్రీల కోసం సంఖ్యలను గబగబా పటపటలాడించింది. తర్వాత సయోనీ నుంచి వచ్చిన సందేశాన్ని పైకి చదివింది: “అభినందనలు హనీ! విశ్వశక్తి గెలిచింది. నువ్వు లాండిస్‌ని జయించావు. శభాష్! యుద్ధంలో మొదటి బహుమతి గెల్చుకున్నావ్”
బహుమతి ఏమిటో నాకు అర్థం కాలేదు.
అప్పుడు డిసెంట్ వెహికల్ మా తలల మీదుగా ఎగురుతూ, క్రిందకి దిగసాగింది. సరిగ్గా మాకు ఒక కిలోమీటర్ దూరంలో దిగింది. అది ఒక పెద్ద గుండ్రని వాహనం. ఆరుగురు కూర్చునేలా సీట్లు. నావిగేట్ చెయ్యడానికి ఒక ఆస్ట్రోనాట్-పైలట్.
డిసెంట్ వెహికల్ తలుపులు తెరుచుకున్నాయి. మెట్లతో కూడిన ఒక ర్యాంప్ వెలుపలికి వచ్చింది. నల్లటి దుస్తులతో అస్థిపంజరంలా ఉన్న సమూరా క్రిందకి దిగసాగాడు. అతనితో పాటు ఆఫ్రికన్ లక్షణాలూ, కండలు తిరిగిన శరీరాలు ఉన్న ఐదురుగు సాయిధ గ్రహాంతర భద్రతా సిబ్బంది కూడా దిగసాగారు.
మేము ఆ వాహనం కేసి పరిగెత్తాం. కాని కొన్ని క్షణాల తర్వాత మా వెనుక వినిపించిన బాధామయ ఆక్రందనలకు వెనక్కి తిరిగి చూశాము.
లాండిస్-2 యొక్క మాజీ సిబ్బంది కుంటుతూ, శరీరాలతోపై మంటల వల్ల కలిగిన గాయాలకు బాధతో సాయం అరుస్తూ… పరిగెత్తుతూ వస్తున్నారు. వారు మాకు దగ్గరగా వచ్చినప్పుడు బాగా కాలిపోయిన హెరోడోటస్‌నీ, మరికొంత మందిని గుర్తించాను. నిశ్చయంగా వారు లాండిస్-2 పై సమూరా రహస్య అనుచరులే… వాళ్ళ సహాయమే లేకపోతే మేమీ పాటికి సెరెబ్రస్ చేతిలో బూడిదైపోయుండేవాళ్ళం.
వారి పట్ల నాకు జాలి కలిగింది, నేను ఆగిపోయాను. వాళ్ళకి వైద్య సహాయం అవసరం.
సమూరా మా వైపు వస్తున్నాడు. అతనితో పాటు సాయుధ దళం కూడా.
మేము రాంప్ మధ్యలో ఉన్నాము. చేతులెత్తి సమూరాకి వందనం చేశాం.
లాండిస్‌లో జరిగిన పోరులో గాయపడిన వారు హెరోడోటస్ నేతృత్వంలో మా వాహనం దగ్గరికి వచ్చారు. వాళ్ళెంత తీవ్రంగా కాలిపోయినా, మరణం అంచులలో ఉన్నా – ఎంతో కాలంగా దర్శనం కోసం ఎదురుచూసిన తమ గురువు, దైవము అయిన సమూరాని చూసిన ఆనందంతో వారి కళ్ళు ప్రకాశించాయి.
“నా ప్ర్రభూ! మాస్టర్!” అంటూ హెరోడోటస్ – రక్తం నిండిన నోటితో సణుగుతున్నట్లుగా మాట్లాడాడు: “మేము మీరు చెప్పినట్టే చేశాము. మా విధి మేము నిర్వహించాం! ఇప్పుడు మమ్మల్ని రక్షించండి! మేము మీతో ఉండాలనుకుంటున్నాము. మాస్టర్! కాపాడండి!”
సమూరా తన చేతిని పైకెత్తాడు. పుర్రెలాంటి ముఖంలోంచి అతని కళ్ళు ఎరుపు రంగులో ప్రకాశించాయి.
అంతే! ఒకేసారి ఐరు లేజర్ గన్‌లు గర్జిస్తే ఎంత కాంతి వస్తోందో అంతలా కళ్ళు చెదిరే కాంతి వెలువడింది. నేనూ, డిమిట్రీ, ప్రకృతీ భయంతోనూ, విస్మయంతోనూ పక్కకి దూకాం.
అది నా జీవితంలోనే అత్యంత భయంకరమైన దృశ్యం. మనల్ని ప్రేమించే వారి పట్ల చూపిన క్రూరత్వానికి నిదర్శనం!
సెరెబ్రస్‍కి వ్యతిరేకంగా విశ్వశక్తిని ఉపయోగించి తిరుగుబాటు చేసిన హెరోడోటస్, అతని అనుచరులు క్షణాలలో ప్రాణాలు కోల్పోయారు.
నేను వెనక్కి తిరిగి చూశాను. వాళ్ళ కళ్ళలో అపనమ్మకంతో కూడిన విస్మయం స్పష్టంగా కనబడింది.
“అయ్యో! సమూరా! మీరిలా చేసి ఉండకూడదు!” అన్నాను అరుస్తూ.
నిశ్శబ్దం.
మృత్యువు యొక్క నిశ్శబ్దం.
సమూరా స్థిరంగా నా వైపుకు వస్తున్నాడు.
అతని పొడవాటి నల్లటి దుస్తులు రన్‌వే పై వీస్తున్న గాలిలో తేలుతున్నాయి.
“నా గ్లోబ్! నాకు ఇచ్చేయ్!”
అసహ్యం, ద్వేషం నిండిన చూపులతో అతనిని చూసాను. నేను అతన్ని చంపాలని కోరుకున్నాను. కానీ నాకు శక్తి లేదు.
యూనివర్సల్ డిజిటల్ గ్లోబ్‌నీ, భవిష్యవాణి చర్మపత్రాన్ని బయటకు తీశాను. పరుగుదీస్తున్నప్పుడు దాన్ని నా స్పేస్‌సూట్ ముందు భాగంలో దాచాను. వాటిని అతనికి ఇచ్చాను.
“నమ్మశక్యం కానంత రాతిగుండె మీది! వాళ్ళు మాకు సహాయం చేసారు. వాళ్ళు మీకు సాయం చేసారు” అన్నాను.
లేజర్ తుపాకులు పట్టుకున్న గార్డులు తమ తుపాకీలను పైకెత్తి, మృతదేహాలకు వందనం చేశారు.
“అనివార్యం! హనీ! వారు దశాబ్దాలుగా నా అనుచరులుగా ఉన్నారు. వారు లాండిస్‌లో అన్ని శక్తులను పొందారు, పవిత్రమైన ఆనందాన్ని అనుభవించారు. ఇప్పుడీ మారుమూల ప్రాంతంలో వాళ్ళని ఏవిధంగానూ కాపాడలేము. థర్డ్ డిగ్రీ బర్న్స్ కోసం సుదీర్ఘ కాలం కొనసాగే చికిత్స కన్నా నొప్పి లేకుండా ప్రసాదించే మరణం చక్కని ప్రత్యామ్నాయం. నాకూ బాధగానే ఉంది, కానీ నేనేం చేయలేను.
ఇప్పుడు, ఇక ఈ వాహనంలోకి ప్రవేశించండి! నీ బాధ్యత నువ్వు చక్కగా నిర్వర్తించావు. లాండిస్-2 సంగతి గార్డులు చూసుకుంటారు, అది ఇక నాదే. కుజుడి కోసం జరిగే యుద్ధంలో నేను మొదటి బహుమతిని పొందాను. అరుణ భూములనీ, కుజుడిని, ఇంకా ఇతర గ్రహ కాలనీలన్నింటిని తిరిగి పొందడానికి వెళుతున్నాను. ఖచ్చితంగా పొందుతాను. నువ్వు నిజంగానే ఎంపికైన వ్యక్తివి. అద్భుత వస్తువులని గుర్తించేవాడివి. విశ్వశక్తి యొక్క ‘అద్భుత వాడుకరి’వి నువ్వు. నా ప్రధాన ఆస్తివి. లోపలికి వెళ్ళు! లేదంటే మిమ్మల్నీ చంపేస్తాను!” అన్నాడు సమూరా.
యురేకస్ లోహస్వరంలో అరిచింది. జరిగిన హత్యలకు ప్రకృతి వెక్కివెక్కి ఏడుస్తోంది. డిమిట్రీ కళ్ళు మూసుకుంది.
“మాస్టర్! మీ శక్తి పూర్తిగా నశించిపోయింది. నా శక్తి కూడా అయిపోయినది. నన్ను ఛార్జ్ చేయవలసి ఉంటుంది. అతను చెప్పినట్లు చెయ్యండి!”
యురేకస్ యొక్క బలహీనమైన స్వరం వినపడింది. మెల్లిగా దాని దీపాలు ఆరిపోయాయి. “నన్ను లోపలికి తీసుకువెళ్ళి చార్జ్ చేయండి!” అంది.
దాని సలహాను పాటించడమే మంచిదని నాకు తెలుసు.
మేము లోపలికి వెళ్ళి, మా సీట్లలో అభావంగా కూర్చున్నాం. డిసెంట్ వెహికిల్‌లో ఉన్న ఒక పవర్ అవుట్‌లెట్‍లో ప్లగ్ పెట్టి యురేకస్‌ని ఛార్జ్ చేయసాగాను.
సమూరా తన గార్డులతో లాండిస్‌లోనే ఉండిపోయాడు. మేము అంతరిక్ష నౌక ‘లెత్వాల్ రూజ్’ దిశగా ఎగిరిపోయాం.