భూమి నుంచి ప్లూటో దాకా… -13

0
6

[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]

అధ్యాయం 34: సెరెబ్రస్, అతని బృందం

పొడుగ్గా ఊబకాయంతో, సుమారు ఏడు అడుగుల ఎత్తు ఉన్న ఒక వ్యక్తి, అతని బరువు సుమారు నూట యాభై కిలోల బరువు ఉంటుందేమో, పొడవాటి దుస్తులు ధరించి, మా వెనుక నిలబడి ఉన్నాడు. అతను మా వెనుకగా వచ్చినందుకు మేము ఆశ్చర్యపోలేదు, కానీ, భయంగొల్పినది ఏంటంటే ఆ వ్యక్తికి రెండు తలలు, నాలుగు కళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళు మమ్మల్నే గుచ్చి గుచ్చి చూస్తున్నాయి. అవి ఎరుపు రంగులో ఉన్నాయి, మెరుస్తున్నాయి. రెండవ తల ఒక బేసి కోణం వద్ద ఉంది. ఒక తల మాట్లాడుతుంటే రెండో తల నిశ్శబ్దంగానే ఉండిపోయినా, దాని కళ్ళు మాత్రం సంజ్ఞలు చేస్తూనే ఉన్నాయి.

ఈ వ్యక్తికి ఇరువైపులా ఇద్దరు మానవులు ఉన్నారు లేదా వాళ్ళు హ్యుమనాయిడ్స్ అయి ఉండవచ్చు.

ఒకరిని నేను గుర్తించగలిగాను, అతను జైల్లో మమ్మలి ప్రశ్నించిన హెరోడోటస్. ఖచ్చితంగా ఒక తల, రెండు కళ్ళు, రెండు చెవులు కలిగి ఉన్నాడు కానీ ఇప్పుడు నేను అతన్ని లోపల యంత్రాలు ఉన్న, జన్యుపరివర్తనాలు కలిగి ఉన్న హ్యుమనాయిడ్‌గా భావిస్తున్నాను.

మరొకరు భూమికి చెందని హ్యుమనాయిడ్. అతని తలపై ఉన్న యాంటీనా ద్వారా, అతని చెవుల ద్వారా, అతను మార్షియన్ అని భావిస్తున్నాను.

“పాలీసెఫాలీ” అంది యురేకస్, దాని అభిప్రాయం కోరనప్పటికీ.

“క్రేనియోఫేగస్ పారాసైటికస్ – పుర్రెతో జత చేసిన పరాన్నజీవి జంట తల. పుట్టుకతో సంభవించే జన్యుదోషం.”

“మేధావి గారికి ధన్యవాదాలు! నా పేరు సెరెబ్రస్. నేను ఈ కేంద్రం యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ని. వీళ్ళిద్దరూ నా డిప్యూటీలు. మిగిలిన అన్ని రోబోలు యాంత్రికంగా మా నియంత్రణలో ఉంటాయి. జైళ్ళకు కాపాలాగా, స్పేస్‌షిప్స్ నడపడంలోనూ, పర్యాటకం మరియు వాణిజ్యాన్ని నడుపడంలోనూ మాకు సాయంగా ఉంటాయి. మేము పర్యాటకరంగంలో వృద్ధి చెందుతున్నాము, విలక్షణ లోహాల కోసం సమీపంలోని ఆస్టరాయిడ్ బెల్డ్‌లోని గనులను తవ్వుకునేందుకు మా బృందాలను పంపుతాము. వీటన్నింటి కోసం, మేము సౌరశక్తి మరియు వీనస్ వాతావరణం నుండి ఉత్పన్నమైన అంశాలపై ఆధారపడుతున్నాము!” చెప్పాడు సెరెబ్రస్.

నన్ను నేను సంబాళించుకుని, మాట్లాడాను.

“శుభాకాంక్షలు! సెరెబ్రస్ మహాశయా! నిజానికి మీ యంత్రాలను పాడు చేసే ఉద్దేశం మాకు లేదు. కానీ మాంత్రిక చక్రవర్తి సమూరాకి బందీలం. అద్భుత వస్తువులను వెతకడానికి మమ్మల్ని వాడుకుంటున్నాడు. మీ కారాగారం నుండి తప్పించుకోవడానికి మేము మా సొంత చిన్న చిట్కాలను ఉపయోగించుకున్నాం! జరిగిన నష్టానికి మమ్మల్ని క్షమించండి!” అన్నాను.

సెరెబ్రస్ రెండు తలలు కోపంతో భీకరంగా ఊగిపోతున్నాయి.

“భూమికి చెందిన మానవ పందుల్లారా! టైటాన్, గనీమీడ్‌ల అలగా జనం! ఛీ! మీరు నా పవర్ స్టేషన్‌ని దెబ్బతీయడమే కాకుండా, యూనివర్సల్ కరెన్సీలో ట్రిలియన్ల మేరకు భారీ నష్టాన్ని కలిగించారు. ఇప్పుడు మేమీ కేంద్రాన్ని మరమత్తులు చేసుకోవాలంటే కనీసం ఒక వీనస్ సంవత్సరం కాలం పడుతుంది. లేదా విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల మేమంతా చావాల్సి వస్తుంది! ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? మీ మూర్ఖపు గ్లోబ్‌ని… నేను నా నాలుగు కళ్ళతో కూడా చూడలేను! మీరు నష్టపర్చిన డబ్బును నాకు చెల్లించకపోతే నేను మీ అందరిని చంపేస్తాను! లేదా ఇక్కడికి అనుమతి లేకుండా ప్రవేశించినందుకు నేను గెలాక్టిక్ పోలీసులని పిల్చి మిమ్మల్ని పట్టిస్తాను!” అరుస్తూ చెప్పాడు సెరెబ్రస్.

ఇప్పుడు ఈ రెండు తలలున్న సెరెబ్రస్‍కు సమూరా గురించి, అతని బ్లాక్‌మెయిల్ గురించి అన్ని వివరాలను వివరించడం కష్టమైంది.

అతని క్రోధాన్ని చూస్తే మమ్మల్ని తప్పకుండా చంపేస్తాడనిపించింది.

“ఓ మహానుభావా!”అన్నాను. అతనిని శాంతపరచడానికి ప్రయత్నించాను. “హాని చేసే ఉద్దేశం మాకు లేదు. కానీ మేము కష్టాల్లో ఉన్నాము. మీకు కలిగిన అన్ని నష్టాలకు మేం పరిహారం చెల్లించలేం. కానీ మా చక్రవర్తి సమూరాకి ఈ యూనివర్సల్ గ్లోబ్ చాలా అవసరం” అన్నాను.

ఇప్పుడు చీకటిగా ఉన్న ఆ హాల్లోకి మరిన్ని హ్యుమనాయిడ్లు ప్రవేశించాయి. అక్కడ అప్పటికే చాలా రోబోలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఈ తేలియాడే వేదికపై ఆక్సిజన్‌ను శ్వాసించే మానవులై ఉండాలి. వారు సుమారు పన్నెండు మంది. వారు వేర్వేరు శరీర ధోరణితో ఉన్నారు, పొడవుగా, పొట్టిగా, ఒకటి లేదా రెండు మెరిసే యాంటినాలు, కోసు చెవులు, ఒకే ఒక్క తలతో ఉన్నారు. వారు ఖచ్చితంగా ఇతర గ్రహాల నుండి ఉద్భవించిన అన్ని గ్రహాంతర జీవులనేది స్పష్టంగా తెలుస్తోంది.

రోబోల వద్ద ఉన్నట్లే వీళ్ళకీ ఆయుధాలు ఉన్నాయి. ఒక్క రౌండ్‌లో ఐదు వేల బులెట్లను పేల్చగల మిలీనియం రూజ్ లేజర్ తుపాకులు. మాలో విశ్వశక్తి  ఏ మాత్రం మిగిలినా కూడా మాకు బ్రతికే అవకాశం లేదని నాకు తెలుసు.

నేను యురేకస్‌ని అడిగాను, “ఏం చేయాలో చెప్పు! పారిపోవాలా లేదా పోరాడాలా?”

నిశ్శబ్దం. పిరికివాళ్ళ, నిస్సహాయుల నిశ్శబ్దం.

కాలం గడుస్తోంది, రెండు తలల సెరెబ్రస్ అరిచే వరకూ. “మీరు ఇప్పుడు చెల్లించలేకపోతే, మీ ఇష్టదైవాలు ఎవరైతే వాళ్ళని ప్రార్థించుకోండి! ఈ విశ్వంలో ఇదే మీ చివరి రోజు. అంతరిక్షంలో మీ అంత్యక్రియలు చక్కగా జరుగుతాయి, మీ రోబో నా సొంతమవుతుంది” అన్నాడు.

తుపాకులు మాకేసి గురిపెట్టబడ్డాయి!

“భైరవస్వామీ! ఓం నమశ్శివాయ!” అంటూ అరిచింది ప్రకృతి. “హనీ! పోరాడటానికి ఆజ్ఞ ఇవ్వు. మనం ప్రయత్నిద్దాం!” అంది.

“ఓ శని మహాదేవా! టైటాన్‌పై నా తండ్రి పొసయిడన్‌ని, నా గుడ్డి సోదరుడిని కాపాడు! నా ఆత్మని రక్షించు” అంది డిమిట్రీ.

ఏనిమాయిడ్ తన స్థానిక భాషలో ఏదో గొణిగాడు. ‘జుపిటర్, దయాళువు, గనీమీడ్ నా స్వదేశం’ అన్న మాటలే నాకు అర్థమయ్యాయి.

అప్పుడు యురేకస్ మాట్లాడింది. ఆశ్చర్యకరంగా ఈసారి ఇంగ్లీష్‌లో మాట్లాడింది, అందుకే అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు. అది నా చెవులకు సంగీతంలా అనిపించింది.

“మాస్టర్, చూడండి! హెరోడోటస్, ఇంకా ఆ ఇద్దరు గ్రహాంతరవాసుల చుట్టూ ఉన్న కాంతివలయాన్ని చూడండి. విశ్వశక్తి యొక్క ఎరుపు రంగు ప్రకాశం. వాళ్ళు మన వైపు ఉన్నారు!” అంది.

మొత్తం సెంట్రల్ కమాండ్ హాల్ చల్లగా అయింది. విశ్వశక్తిని వాడటంతో చల్లగా అయిపోయి, ఎరుపు రంగులో మెరుస్తోంది.

సౌర వ్యవస్థలో అన్ని చోట్లా – భూమి మీద, చంద్రుడి మీదా, గనీమీడ్ మీదా, ఇప్పుడు శుక్రుడి తేలియాడే కాలనీ లాండిస్-2 అన్ని చోట్లా – సమూరాకి ‘స్లీపర్’ అనుచరులు మరియు ‘గూఢచారులు’ ఉన్నారు. ఉత్తర అమెరికాలోని న్యూ హోప్ నగరంలో, మాంట్‌గోమెరి యొక్క స్పేస్ ఎలివేటర్‌కి వెళ్తున్నప్పుడు సైనిక విమానంలో, లా టెర్ అంతరిక్ష వేదికపై నేను వాళ్ళని చూశాను.

హెరోడోటస్, సెరెబ్రస్‌కి ఇరువైపులా ఉన్న ఇద్దరు ఒక నిమిషంలో ఎర్రని నిప్పు ముద్దలు అయ్యారు. వాళ్ళ తుపాకుల నుంచి వచ్చిన లేజర్ కిరణాలు లాండిస్ యొక్క గ్రహాంతర పాలకులైన సెరెబ్రస్, అతని బృందంపై దూసుకుపోయాయి.

అది చూసి మేము కూడా – నేను, డిమిట్రీ, ఏనిమోయిడ్ మా చేతి వేళ్ళ కొసల నుంచి లేజర్ కిరణాలను సృష్టించాం.

సెరెబ్రస్ రెండు తలలకీ నిప్పు అంటుకుంది. మిగతావాళ్ళలో నెమ్మదిగా కదలికలు ఆగిపోయాయి. నేను గాజు అల్మారా వద్దకి పరుగెత్తాను. మొదట శక్తిని ఉపయోగించి నా చేత్తో దానిని బద్దలు కొట్టాను. యూనివర్సల్ గ్లోబ్ అని పిలవబడే ఆ మెరుస్తున్న గోళాన్ని అందుకున్నాను.

నేను దానిని చూడగలుగుతున్నాను. ఈసారి నేను భవిష్యవాణి కోసం వెతకడం మర్చిపోలేదు. యూనివర్సల్ డిజిటల్ భాషలో ఎరుపు రంగులో ప్రకాశించే అక్షరాలతో నా పాదాల వద్ద పడిన చర్మపత్రాన్ని పైకి తీశాను.

“ఓ మానవా! అభినందనలు! ఇక్కడి దాకా వచ్చి, అలనాటి గొప్ప మాంత్రికుడికి మునిమనవడు, 16వ శతాబ్దం మేధావి యొక్క వంశస్తుడు అయిన పదవ లియోనార్డో డా విన్సీ రూపొందించిన ఈ యూనివర్సల్ గ్లోబ్‌ని సాధించావు. దీనితో ఈ విశ్వంలో ఏ ప్రాంతాన్నైనా ఎంపిక చేసుకుని, విశ్వశక్తితో నాశనం చేయవచ్చు. ఎంచుకున్న ప్రదేశాన్ని నాశనం చేయడానికి వంద నక్షత్రాల స్థాయి తాంత్రికుల ఏకాగ్రత మాత్రమే అవసరమవుతుంది. మీ దృష్టిని ఎంచుకున్న స్థలంలో నిలపాలి.” అని రాసి ఉంది.

“ఒక క్షిపణి వలె!” అనుకున్నాను.

వణికాను. ఏదో చల్లదనం నా వెన్నునిండా పాకిన అనుభూతి కలిగింది.

“కానీ ఓ మానవ మేధావీ! ప్రపంచాన్ని జయించటం కోసం అమాయకులను చంపే స్వార్థపూరిత ఉద్దేశంతో మీరు దీనిని ఉపయోగించమని మీరు హామీ ఇవ్వాలి. మీరు దుష్టులను ఎదుర్కునేడప్పుడే దీనిని ఉపయోగించాలి. మీరు అమాయకులను మరియు మీపై దాడి చేయనివారికి హాని చేస్తే, మీరు ఈ గ్లోబ్ వల్లే నాశనమవుతారు!” అని ఉందా చర్మపత్రంలో.

‘న్యాయమే!’ అనుకున్నాను. భవిష్యవాణి ద్వారా ప్రతి శక్తికి ఒక హెచ్చరిక వచ్చింది. నిరోధ సమతౌల్యాలు. కానీ ఇవన్నీ సమూరా వింటాడా? పాటిస్తాడా?

లాండిస్ పాలకుల మధ్య పోరు జరుగుతూనే ఉంది, నేను పరుగుతీశాను.

“ప్రకృతీ! డిమిట్రీ! ఏనిమాయిడ్! యురేకస్! నన్ను అనుసరించండి! యురేకస్, నువ్వు సమూరా యొక్క స్పేస్‌షిప్ ‘లెత్వాల్ రూజ్’ నుండి వచ్చే సంకేతాల కోసం వెతుకు. ఖచ్చితంగా మన కోసం ఒక డిసెంట్ వెహికల్ పంపుతారు. తూర్పు రన్‌వే వైపు పరిగెత్తండి” అని పరిగెడుతూనే అరిచాను.

నేను వెనక్కి తిరిగి చూసేసరికి నా వెనుక ఒక పెద్ద అగ్నిగోళం ఉంది కాని నా జట్టు సభ్యులందరూ ఆ కాంతివంతమైన నిప్పుల నుంచి, తెల్లని పొగల మధ్యగా – చనిపోయిన బూడిద నుండి బ్రతికొచ్చే ఫీనిక్స్ పక్షుల వలె – బయటికి వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here