[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]
అధ్యాయం 34: సెరెబ్రస్, అతని బృందం
పొడుగ్గా ఊబకాయంతో, సుమారు ఏడు అడుగుల ఎత్తు ఉన్న ఒక వ్యక్తి, అతని బరువు సుమారు నూట యాభై కిలోల బరువు ఉంటుందేమో, పొడవాటి దుస్తులు ధరించి, మా వెనుక నిలబడి ఉన్నాడు. అతను మా వెనుకగా వచ్చినందుకు మేము ఆశ్చర్యపోలేదు, కానీ, భయంగొల్పినది ఏంటంటే ఆ వ్యక్తికి రెండు తలలు, నాలుగు కళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళు మమ్మల్నే గుచ్చి గుచ్చి చూస్తున్నాయి. అవి ఎరుపు రంగులో ఉన్నాయి, మెరుస్తున్నాయి. రెండవ తల ఒక బేసి కోణం వద్ద ఉంది. ఒక తల మాట్లాడుతుంటే రెండో తల నిశ్శబ్దంగానే ఉండిపోయినా, దాని కళ్ళు మాత్రం సంజ్ఞలు చేస్తూనే ఉన్నాయి.
ఈ వ్యక్తికి ఇరువైపులా ఇద్దరు మానవులు ఉన్నారు లేదా వాళ్ళు హ్యుమనాయిడ్స్ అయి ఉండవచ్చు.
ఒకరిని నేను గుర్తించగలిగాను, అతను జైల్లో మమ్మలి ప్రశ్నించిన హెరోడోటస్. ఖచ్చితంగా ఒక తల, రెండు కళ్ళు, రెండు చెవులు కలిగి ఉన్నాడు కానీ ఇప్పుడు నేను అతన్ని లోపల యంత్రాలు ఉన్న, జన్యుపరివర్తనాలు కలిగి ఉన్న హ్యుమనాయిడ్‌గా భావిస్తున్నాను.
మరొకరు భూమికి చెందని హ్యుమనాయిడ్. అతని తలపై ఉన్న యాంటీనా ద్వారా, అతని చెవుల ద్వారా, అతను మార్షియన్ అని భావిస్తున్నాను.
“పాలీసెఫాలీ” అంది యురేకస్, దాని అభిప్రాయం కోరనప్పటికీ.
“క్రేనియోఫేగస్ పారాసైటికస్ – పుర్రెతో జత చేసిన పరాన్నజీవి జంట తల. పుట్టుకతో సంభవించే జన్యుదోషం.”
“మేధావి గారికి ధన్యవాదాలు! నా పేరు సెరెబ్రస్. నేను ఈ కేంద్రం యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ని. వీళ్ళిద్దరూ నా డిప్యూటీలు. మిగిలిన అన్ని రోబోలు యాంత్రికంగా మా నియంత్రణలో ఉంటాయి. జైళ్ళకు కాపాలాగా, స్పేస్‌షిప్స్ నడపడంలోనూ, పర్యాటకం మరియు వాణిజ్యాన్ని నడుపడంలోనూ మాకు సాయంగా ఉంటాయి. మేము పర్యాటకరంగంలో వృద్ధి చెందుతున్నాము, విలక్షణ లోహాల కోసం సమీపంలోని ఆస్టరాయిడ్ బెల్డ్‌లోని గనులను తవ్వుకునేందుకు మా బృందాలను పంపుతాము. వీటన్నింటి కోసం, మేము సౌరశక్తి మరియు వీనస్ వాతావరణం నుండి ఉత్పన్నమైన అంశాలపై ఆధారపడుతున్నాము!” చెప్పాడు సెరెబ్రస్.
నన్ను నేను సంబాళించుకుని, మాట్లాడాను.
“శుభాకాంక్షలు! సెరెబ్రస్ మహాశయా! నిజానికి మీ యంత్రాలను పాడు చేసే ఉద్దేశం మాకు లేదు. కానీ మాంత్రిక చక్రవర్తి సమూరాకి బందీలం. అద్భుత వస్తువులను వెతకడానికి మమ్మల్ని వాడుకుంటున్నాడు. మీ కారాగారం నుండి తప్పించుకోవడానికి మేము మా సొంత చిన్న చిట్కాలను ఉపయోగించుకున్నాం! జరిగిన నష్టానికి మమ్మల్ని క్షమించండి!” అన్నాను.
సెరెబ్రస్ రెండు తలలు కోపంతో భీకరంగా ఊగిపోతున్నాయి.
“భూమికి చెందిన మానవ పందుల్లారా! టైటాన్, గనీమీడ్‌ల అలగా జనం! ఛీ! మీరు నా పవర్ స్టేషన్‌ని దెబ్బతీయడమే కాకుండా, యూనివర్సల్ కరెన్సీలో ట్రిలియన్ల మేరకు భారీ నష్టాన్ని కలిగించారు. ఇప్పుడు మేమీ కేంద్రాన్ని మరమత్తులు చేసుకోవాలంటే కనీసం ఒక వీనస్ సంవత్సరం కాలం పడుతుంది. లేదా విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల మేమంతా చావాల్సి వస్తుంది! ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? మీ మూర్ఖపు గ్లోబ్‌ని… నేను నా నాలుగు కళ్ళతో కూడా చూడలేను! మీరు నష్టపర్చిన డబ్బును నాకు చెల్లించకపోతే నేను మీ అందరిని చంపేస్తాను! లేదా ఇక్కడికి అనుమతి లేకుండా ప్రవేశించినందుకు నేను గెలాక్టిక్ పోలీసులని పిల్చి మిమ్మల్ని పట్టిస్తాను!” అరుస్తూ చెప్పాడు సెరెబ్రస్.
ఇప్పుడు ఈ రెండు తలలున్న సెరెబ్రస్‍కు సమూరా గురించి, అతని బ్లాక్‌మెయిల్ గురించి అన్ని వివరాలను వివరించడం కష్టమైంది.
అతని క్రోధాన్ని చూస్తే మమ్మల్ని తప్పకుండా చంపేస్తాడనిపించింది.
“ఓ మహానుభావా!”అన్నాను. అతనిని శాంతపరచడానికి ప్రయత్నించాను. “హాని చేసే ఉద్దేశం మాకు లేదు. కానీ మేము కష్టాల్లో ఉన్నాము. మీకు కలిగిన అన్ని నష్టాలకు మేం పరిహారం చెల్లించలేం. కానీ మా చక్రవర్తి సమూరాకి ఈ యూనివర్సల్ గ్లోబ్ చాలా అవసరం” అన్నాను.
ఇప్పుడు చీకటిగా ఉన్న ఆ హాల్లోకి మరిన్ని హ్యుమనాయిడ్లు ప్రవేశించాయి. అక్కడ అప్పటికే చాలా రోబోలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఈ తేలియాడే వేదికపై ఆక్సిజన్‌ను శ్వాసించే మానవులై ఉండాలి. వారు సుమారు పన్నెండు మంది. వారు వేర్వేరు శరీర ధోరణితో ఉన్నారు, పొడవుగా, పొట్టిగా, ఒకటి లేదా రెండు మెరిసే యాంటినాలు, కోసు చెవులు, ఒకే ఒక్క తలతో ఉన్నారు. వారు ఖచ్చితంగా ఇతర గ్రహాల నుండి ఉద్భవించిన అన్ని గ్రహాంతర జీవులనేది స్పష్టంగా తెలుస్తోంది.
రోబోల వద్ద ఉన్నట్లే వీళ్ళకీ ఆయుధాలు ఉన్నాయి. ఒక్క రౌండ్‌లో ఐదు వేల బులెట్లను పేల్చగల మిలీనియం రూజ్ లేజర్ తుపాకులు. మాలో విశ్వశక్తి ఏ మాత్రం మిగిలినా కూడా మాకు బ్రతికే అవకాశం లేదని నాకు తెలుసు.
నేను యురేకస్‌ని అడిగాను, “ఏం చేయాలో చెప్పు! పారిపోవాలా లేదా పోరాడాలా?”
నిశ్శబ్దం. పిరికివాళ్ళ, నిస్సహాయుల నిశ్శబ్దం.
కాలం గడుస్తోంది, రెండు తలల సెరెబ్రస్ అరిచే వరకూ. “మీరు ఇప్పుడు చెల్లించలేకపోతే, మీ ఇష్టదైవాలు ఎవరైతే వాళ్ళని ప్రార్థించుకోండి! ఈ విశ్వంలో ఇదే మీ చివరి రోజు. అంతరిక్షంలో మీ అంత్యక్రియలు చక్కగా జరుగుతాయి, మీ రోబో నా సొంతమవుతుంది” అన్నాడు.
తుపాకులు మాకేసి గురిపెట్టబడ్డాయి!
“భైరవస్వామీ! ఓం నమశ్శివాయ!” అంటూ అరిచింది ప్రకృతి. “హనీ! పోరాడటానికి ఆజ్ఞ ఇవ్వు. మనం ప్రయత్నిద్దాం!” అంది.
“ఓ శని మహాదేవా! టైటాన్‌పై నా తండ్రి పొసయిడన్‌ని, నా గుడ్డి సోదరుడిని కాపాడు! నా ఆత్మని రక్షించు” అంది డిమిట్రీ.
ఏనిమాయిడ్ తన స్థానిక భాషలో ఏదో గొణిగాడు. ‘జుపిటర్, దయాళువు, గనీమీడ్ నా స్వదేశం’ అన్న మాటలే నాకు అర్థమయ్యాయి.
అప్పుడు యురేకస్ మాట్లాడింది. ఆశ్చర్యకరంగా ఈసారి ఇంగ్లీష్‌లో మాట్లాడింది, అందుకే అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు. అది నా చెవులకు సంగీతంలా అనిపించింది.
“మాస్టర్, చూడండి! హెరోడోటస్, ఇంకా ఆ ఇద్దరు గ్రహాంతరవాసుల చుట్టూ ఉన్న కాంతివలయాన్ని చూడండి. విశ్వశక్తి యొక్క ఎరుపు రంగు ప్రకాశం. వాళ్ళు మన వైపు ఉన్నారు!” అంది.
మొత్తం సెంట్రల్ కమాండ్ హాల్ చల్లగా అయింది. విశ్వశక్తిని వాడటంతో చల్లగా అయిపోయి, ఎరుపు రంగులో మెరుస్తోంది.
సౌర వ్యవస్థలో అన్ని చోట్లా – భూమి మీద, చంద్రుడి మీదా, గనీమీడ్ మీదా, ఇప్పుడు శుక్రుడి తేలియాడే కాలనీ లాండిస్-2 అన్ని చోట్లా – సమూరాకి ‘స్లీపర్’ అనుచరులు మరియు ‘గూఢచారులు’ ఉన్నారు. ఉత్తర అమెరికాలోని న్యూ హోప్ నగరంలో, మాంట్‌గోమెరి యొక్క స్పేస్ ఎలివేటర్‌కి వెళ్తున్నప్పుడు సైనిక విమానంలో, లా టెర్ అంతరిక్ష వేదికపై నేను వాళ్ళని చూశాను.
హెరోడోటస్, సెరెబ్రస్‌కి ఇరువైపులా ఉన్న ఇద్దరు ఒక నిమిషంలో ఎర్రని నిప్పు ముద్దలు అయ్యారు. వాళ్ళ తుపాకుల నుంచి వచ్చిన లేజర్ కిరణాలు లాండిస్ యొక్క గ్రహాంతర పాలకులైన సెరెబ్రస్, అతని బృందంపై దూసుకుపోయాయి.
అది చూసి మేము కూడా – నేను, డిమిట్రీ, ఏనిమోయిడ్ మా చేతి వేళ్ళ కొసల నుంచి లేజర్ కిరణాలను సృష్టించాం.
సెరెబ్రస్ రెండు తలలకీ నిప్పు అంటుకుంది. మిగతావాళ్ళలో నెమ్మదిగా కదలికలు ఆగిపోయాయి. నేను గాజు అల్మారా వద్దకి పరుగెత్తాను. మొదట శక్తిని ఉపయోగించి నా చేత్తో దానిని బద్దలు కొట్టాను. యూనివర్సల్ గ్లోబ్ అని పిలవబడే ఆ మెరుస్తున్న గోళాన్ని అందుకున్నాను.
నేను దానిని చూడగలుగుతున్నాను. ఈసారి నేను భవిష్యవాణి కోసం వెతకడం మర్చిపోలేదు. యూనివర్సల్ డిజిటల్ భాషలో ఎరుపు రంగులో ప్రకాశించే అక్షరాలతో నా పాదాల వద్ద పడిన చర్మపత్రాన్ని పైకి తీశాను.
“ఓ మానవా! అభినందనలు! ఇక్కడి దాకా వచ్చి, అలనాటి గొప్ప మాంత్రికుడికి మునిమనవడు, 16వ శతాబ్దం మేధావి యొక్క వంశస్తుడు అయిన పదవ లియోనార్డో డా విన్సీ రూపొందించిన ఈ యూనివర్సల్ గ్లోబ్‌ని సాధించావు. దీనితో ఈ విశ్వంలో ఏ ప్రాంతాన్నైనా ఎంపిక చేసుకుని, విశ్వశక్తితో నాశనం చేయవచ్చు. ఎంచుకున్న ప్రదేశాన్ని నాశనం చేయడానికి వంద నక్షత్రాల స్థాయి తాంత్రికుల ఏకాగ్రత మాత్రమే అవసరమవుతుంది. మీ దృష్టిని ఎంచుకున్న స్థలంలో నిలపాలి.” అని రాసి ఉంది.
“ఒక క్షిపణి వలె!” అనుకున్నాను.
వణికాను. ఏదో చల్లదనం నా వెన్నునిండా పాకిన అనుభూతి కలిగింది.
“కానీ ఓ మానవ మేధావీ! ప్రపంచాన్ని జయించటం కోసం అమాయకులను చంపే స్వార్థపూరిత ఉద్దేశంతో మీరు దీనిని ఉపయోగించమని మీరు హామీ ఇవ్వాలి. మీరు దుష్టులను ఎదుర్కునేడప్పుడే దీనిని ఉపయోగించాలి. మీరు అమాయకులను మరియు మీపై దాడి చేయనివారికి హాని చేస్తే, మీరు ఈ గ్లోబ్ వల్లే నాశనమవుతారు!” అని ఉందా చర్మపత్రంలో.
‘న్యాయమే!’ అనుకున్నాను. భవిష్యవాణి ద్వారా ప్రతి శక్తికి ఒక హెచ్చరిక వచ్చింది. నిరోధ సమతౌల్యాలు. కానీ ఇవన్నీ సమూరా వింటాడా? పాటిస్తాడా?
లాండిస్ పాలకుల మధ్య పోరు జరుగుతూనే ఉంది, నేను పరుగుతీశాను.
“ప్రకృతీ! డిమిట్రీ! ఏనిమాయిడ్! యురేకస్! నన్ను అనుసరించండి! యురేకస్, నువ్వు సమూరా యొక్క స్పేస్‌షిప్ ‘లెత్వాల్ రూజ్’ నుండి వచ్చే సంకేతాల కోసం వెతుకు. ఖచ్చితంగా మన కోసం ఒక డిసెంట్ వెహికల్ పంపుతారు. తూర్పు రన్‌వే వైపు పరిగెత్తండి” అని పరిగెడుతూనే అరిచాను.
నేను వెనక్కి తిరిగి చూసేసరికి నా వెనుక ఒక పెద్ద అగ్నిగోళం ఉంది కాని నా జట్టు సభ్యులందరూ ఆ కాంతివంతమైన నిప్పుల నుంచి, తెల్లని పొగల మధ్యగా – చనిపోయిన బూడిద నుండి బ్రతికొచ్చే ఫీనిక్స్ పక్షుల వలె – బయటికి వచ్చారు.
అధ్యాయం 35: తిరిగి ‘లెత్వాల్ రూజ్’కి
సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా కనిపించే ప్రదేశాన్ని తూర్పు అని పిలిస్తే, ఆ ప్లాట్‌ఫాం యొక్క కొస తూర్పు వైపే ఉంది. పోరాటం, సాహసం, పలాయనం, ఇంకా విజయం సాధించిన ఓ సుదీర్ఘ రాత్రికి ముగింపు ఇది.
నా ఛాతీ, చేతులపై అయిన చిన్న గాయాల నుంచి రక్తం కారుతోంది. ప్రకృతి జడ ఊడిపోయి జుట్టంతా చిందరవందరగా మారింది, తన నోట్లోంచి కూడా కొద్దిగా రక్తం కారుతోంది. డిమిట్రీ పైకి బానే ఉన్నట్టుంది కానీ కుంటుతోంది. ఆమె కాలి ఎముకలలో ఎటువంటి ఫ్రాక్చర్ అయి ఉండకూడదని నేను కోరుకున్నాను..
ఏనిమాయిడ్ కూడా గాయపడ్డాడు, నుదుటిపై తగిలిన దెబ్బని ఎడమచేతిలో ఒక వస్త్రాన్ని పట్టుకుని నొక్కుకుంటున్నాడు.
దూరంగా తెల్లని సూర్యబింబం దిగువన హఠాత్తుగా ఏదో కాంతి పొడలా కనిపించింది. అది క్రమంగా పెద్దదిగా మారింది.
“డిసెంట్ వెహికల్ వస్తోంది… ఇప్పుడే నాకు ‘లెత్వాల్ రూజ్’, ‘డివి’ (డిసెంట్ వెహికల్) ల కో-ఆర్డినేట్లు లభించాయి…” చెప్పింది యురేకస్.
యురేకస్ అక్షాంశాల డిగ్రీల కోసం సంఖ్యలను గబగబా పటపటలాడించింది. తర్వాత సయోనీ నుంచి వచ్చిన సందేశాన్ని పైకి చదివింది: “అభినందనలు హనీ! విశ్వశక్తి గెలిచింది. నువ్వు లాండిస్‌ని జయించావు. శభాష్! యుద్ధంలో మొదటి బహుమతి గెల్చుకున్నావ్”
బహుమతి ఏమిటో నాకు అర్థం కాలేదు.
అప్పుడు డిసెంట్ వెహికల్ మా తలల మీదుగా ఎగురుతూ, క్రిందకి దిగసాగింది. సరిగ్గా మాకు ఒక కిలోమీటర్ దూరంలో దిగింది. అది ఒక పెద్ద గుండ్రని వాహనం. ఆరుగురు కూర్చునేలా సీట్లు. నావిగేట్ చెయ్యడానికి ఒక ఆస్ట్రోనాట్-పైలట్.
డిసెంట్ వెహికల్ తలుపులు తెరుచుకున్నాయి. మెట్లతో కూడిన ఒక ర్యాంప్ వెలుపలికి వచ్చింది. నల్లటి దుస్తులతో అస్థిపంజరంలా ఉన్న సమూరా క్రిందకి దిగసాగాడు. అతనితో పాటు ఆఫ్రికన్ లక్షణాలూ, కండలు తిరిగిన శరీరాలు ఉన్న ఐదురుగు సాయిధ గ్రహాంతర భద్రతా సిబ్బంది కూడా దిగసాగారు.
మేము ఆ వాహనం కేసి పరిగెత్తాం. కాని కొన్ని క్షణాల తర్వాత మా వెనుక వినిపించిన బాధామయ ఆక్రందనలకు వెనక్కి తిరిగి చూశాము.
లాండిస్-2 యొక్క మాజీ సిబ్బంది కుంటుతూ, శరీరాలతోపై మంటల వల్ల కలిగిన గాయాలకు బాధతో సాయం అరుస్తూ… పరిగెత్తుతూ వస్తున్నారు. వారు మాకు దగ్గరగా వచ్చినప్పుడు బాగా కాలిపోయిన హెరోడోటస్‌నీ, మరికొంత మందిని గుర్తించాను. నిశ్చయంగా వారు లాండిస్-2 పై సమూరా రహస్య అనుచరులే… వాళ్ళ సహాయమే లేకపోతే మేమీ పాటికి సెరెబ్రస్ చేతిలో బూడిదైపోయుండేవాళ్ళం.
వారి పట్ల నాకు జాలి కలిగింది, నేను ఆగిపోయాను. వాళ్ళకి వైద్య సహాయం అవసరం.
సమూరా మా వైపు వస్తున్నాడు. అతనితో పాటు సాయుధ దళం కూడా.
మేము రాంప్ మధ్యలో ఉన్నాము. చేతులెత్తి సమూరాకి వందనం చేశాం.
లాండిస్‌లో జరిగిన పోరులో గాయపడిన వారు హెరోడోటస్ నేతృత్వంలో మా వాహనం దగ్గరికి వచ్చారు. వాళ్ళెంత తీవ్రంగా కాలిపోయినా, మరణం అంచులలో ఉన్నా – ఎంతో కాలంగా దర్శనం కోసం ఎదురుచూసిన తమ గురువు, దైవము అయిన సమూరాని చూసిన ఆనందంతో వారి కళ్ళు ప్రకాశించాయి.
“నా ప్ర్రభూ! మాస్టర్!” అంటూ హెరోడోటస్ – రక్తం నిండిన నోటితో సణుగుతున్నట్లుగా మాట్లాడాడు: “మేము మీరు చెప్పినట్టే చేశాము. మా విధి మేము నిర్వహించాం! ఇప్పుడు మమ్మల్ని రక్షించండి! మేము మీతో ఉండాలనుకుంటున్నాము. మాస్టర్! కాపాడండి!”
సమూరా తన చేతిని పైకెత్తాడు. పుర్రెలాంటి ముఖంలోంచి అతని కళ్ళు ఎరుపు రంగులో ప్రకాశించాయి.
అంతే! ఒకేసారి ఐరు లేజర్ గన్‌లు గర్జిస్తే ఎంత కాంతి వస్తోందో అంతలా కళ్ళు చెదిరే కాంతి వెలువడింది. నేనూ, డిమిట్రీ, ప్రకృతీ భయంతోనూ, విస్మయంతోనూ పక్కకి దూకాం.
అది నా జీవితంలోనే అత్యంత భయంకరమైన దృశ్యం. మనల్ని ప్రేమించే వారి పట్ల చూపిన క్రూరత్వానికి నిదర్శనం!
సెరెబ్రస్‍కి వ్యతిరేకంగా విశ్వశక్తిని ఉపయోగించి తిరుగుబాటు చేసిన హెరోడోటస్, అతని అనుచరులు క్షణాలలో ప్రాణాలు కోల్పోయారు.
నేను వెనక్కి తిరిగి చూశాను. వాళ్ళ కళ్ళలో అపనమ్మకంతో కూడిన విస్మయం స్పష్టంగా కనబడింది.
“అయ్యో! సమూరా! మీరిలా చేసి ఉండకూడదు!” అన్నాను అరుస్తూ.
నిశ్శబ్దం.
మృత్యువు యొక్క నిశ్శబ్దం.
సమూరా స్థిరంగా నా వైపుకు వస్తున్నాడు.
అతని పొడవాటి నల్లటి దుస్తులు రన్‌వే పై వీస్తున్న గాలిలో తేలుతున్నాయి.
“నా గ్లోబ్! నాకు ఇచ్చేయ్!”
అసహ్యం, ద్వేషం నిండిన చూపులతో అతనిని చూసాను. నేను అతన్ని చంపాలని కోరుకున్నాను. కానీ నాకు శక్తి లేదు.
యూనివర్సల్ డిజిటల్ గ్లోబ్‌నీ, భవిష్యవాణి చర్మపత్రాన్ని బయటకు తీశాను. పరుగుదీస్తున్నప్పుడు దాన్ని నా స్పేస్‌సూట్ ముందు భాగంలో దాచాను. వాటిని అతనికి ఇచ్చాను.
“నమ్మశక్యం కానంత రాతిగుండె మీది! వాళ్ళు మాకు సహాయం చేసారు. వాళ్ళు మీకు సాయం చేసారు” అన్నాను.
లేజర్ తుపాకులు పట్టుకున్న గార్డులు తమ తుపాకీలను పైకెత్తి, మృతదేహాలకు వందనం చేశారు.
“అనివార్యం! హనీ! వారు దశాబ్దాలుగా నా అనుచరులుగా ఉన్నారు. వారు లాండిస్‌లో అన్ని శక్తులను పొందారు, పవిత్రమైన ఆనందాన్ని అనుభవించారు. ఇప్పుడీ మారుమూల ప్రాంతంలో వాళ్ళని ఏవిధంగానూ కాపాడలేము. థర్డ్ డిగ్రీ బర్న్స్ కోసం సుదీర్ఘ కాలం కొనసాగే చికిత్స కన్నా నొప్పి లేకుండా ప్రసాదించే మరణం చక్కని ప్రత్యామ్నాయం. నాకూ బాధగానే ఉంది, కానీ నేనేం చేయలేను.
ఇప్పుడు, ఇక ఈ వాహనంలోకి ప్రవేశించండి! నీ బాధ్యత నువ్వు చక్కగా నిర్వర్తించావు. లాండిస్-2 సంగతి గార్డులు చూసుకుంటారు, అది ఇక నాదే. కుజుడి కోసం జరిగే యుద్ధంలో నేను మొదటి బహుమతిని పొందాను. అరుణ భూములనీ, కుజుడిని, ఇంకా ఇతర గ్రహ కాలనీలన్నింటిని తిరిగి పొందడానికి వెళుతున్నాను. ఖచ్చితంగా పొందుతాను. నువ్వు నిజంగానే ఎంపికైన వ్యక్తివి. అద్భుత వస్తువులని గుర్తించేవాడివి. విశ్వశక్తి యొక్క ‘అద్భుత వాడుకరి’వి నువ్వు. నా ప్రధాన ఆస్తివి. లోపలికి వెళ్ళు! లేదంటే మిమ్మల్నీ చంపేస్తాను!” అన్నాడు సమూరా.
యురేకస్ లోహస్వరంలో అరిచింది. జరిగిన హత్యలకు ప్రకృతి వెక్కివెక్కి ఏడుస్తోంది. డిమిట్రీ కళ్ళు మూసుకుంది.
“మాస్టర్! మీ శక్తి పూర్తిగా నశించిపోయింది. నా శక్తి కూడా అయిపోయినది. నన్ను ఛార్జ్ చేయవలసి ఉంటుంది. అతను చెప్పినట్లు చెయ్యండి!”
యురేకస్ యొక్క బలహీనమైన స్వరం వినపడింది. మెల్లిగా దాని దీపాలు ఆరిపోయాయి. “నన్ను లోపలికి తీసుకువెళ్ళి చార్జ్ చేయండి!” అంది.
దాని సలహాను పాటించడమే మంచిదని నాకు తెలుసు.
మేము లోపలికి వెళ్ళి, మా సీట్లలో అభావంగా కూర్చున్నాం. డిసెంట్ వెహికిల్‌లో ఉన్న ఒక పవర్ అవుట్‌లెట్‍లో ప్లగ్ పెట్టి యురేకస్‌ని ఛార్జ్ చేయసాగాను.
సమూరా తన గార్డులతో లాండిస్‌లోనే ఉండిపోయాడు. మేము అంతరిక్ష నౌక ‘లెత్వాల్ రూజ్’ దిశగా ఎగిరిపోయాం.
అధ్యాయం 36: లెత్వాల్ రూజ్ – విజయ వాహనం!
సమూరా యొక్క వ్యోమనౌక లెత్వాల్ రూజ్ యొక్క విస్తృత వృత్తాకారంలో ఉన్న ప్రధాన క్యాబిన్‌లోకి మేము ప్రవేశించగానే, మిగిలిన సిబ్బంది చప్పట్లు కొడుతూ, మెగాఫోన్ల నుండి పెద్ద శబ్దాలతో సంగీతాన్ని వినిపిస్తూ స్వాగతం పలికారు. విజయం నృత్యం చేశారు. వాళ్ళంతా సంతోషకరమైన మూడ్‌లో ఉన్నారు. పొడవైన నల్లటి దుస్తులు ధరించిన ఆల్ఫా సెంటారి యొక్క ముసలి తాంత్రికులు కూడా నవ్వుతూ ఉన్నారు, తల వెనక్కి తిరిగి ఉండే ముసలి మంత్రగత్తె సయోని తన వీపు చూపి అదుపు లేకుండా నవ్వింది. ఈ దృశ్యం వింతగా ఉంది, భయంకరంగా ఉంది. ఒక గ్రహ కాలనీని గెలుచుకున్న ఉత్సవం ఇది. వారు అరుణ భూములని కోల్పోయారు, కానీ ఇప్పుడు వారి సామ్రాజ్యంలోకి ఒక చిన్న రాజ్యం చేరడం నేను చూస్తున్నాను.
సయోని తల మాట్లాడింది: “హనీ! యూనివర్సల్ గ్లోబ్‌ను మా తండ్రికి ఇచ్చావా? అక్కడ ప్రతి ఒక్కరికీ భద్రత ఉందా?”
ఇది సిగ్గుమాలిన ప్రశ్న.
మాడి మసైన హెరోడోటస్, అతని సహచరుల మృతదేహాలు గుర్తొస్తే నేను ఇప్పటికీ వణుకుతున్నాను. విధేయుల గతే ఇలా ఉంటే, వారి ఉద్యమంలో అయిష్టంగా చేతులు కలిపిన మాలాంటి భాగస్వాములు గతి ఏంటి?
ఆల్ఫా సెంటారీ మాంత్రికులు కూడా ఏదో అర్థం కాని మాటలు మాట్లాడారు, యురేకస్‌లో విద్యుచ్ఛక్తి అయిపోవడం, అది ఛార్జింగ్‌లో ఉండడం వల్ల వాళ్ళేం మాట్లాడారో నేను తెలుసుకోలేకపోయాను.
అప్పుడు పానీయాలు, తినుబండారాలు వచ్చాయి. ప్రాచ్యప్రాంతపు లక్షణాలు కలిగిన ఇద్దరు పొడగరులైన మహిళలు మా గాయాలను శుభ్రం చేసి, కట్లు కట్టారు. ఇన్‌ఫెక్షన్‌లను నివారించడానికి మాకు సూది మందులు, నొప్పిని తగ్గించడానికి మాత్రలు ఇచ్చారు.
మాకు సీట్లు ఇచ్చారు. షాంపేన్‌లా రుచిగా ఉన్న పానీయాలను సేవించాము. ఒక హోలోగ్రామ్ సృష్టించబడింది. దానిలో ఒక యువతి అర్ధనగ్నంగా కనిపించింది. పొట్టనీ, వక్షోజాలని ఊపుతూ విలాసవంతంగా నృత్యం చేయసాగింది. డ్రమ్స్, బాకాలు, మానవ గాత్రాలతో కూడిన ఇంద్రియాలకు ఉత్తేజాన్నిచ్చే సంగీతం వినబడుతోంది, అన్ని గ్రహాల వింత భాషలతో రాప్ సంగీతాన్ని ఒక విధంగా పాడుతున్న గ్రహాంతర గాత్రాలు వినవస్తున్నాయి, సిబ్బంది లోని ప్రతి బృందం వారి పానీయాలను ఒక చేత్తో పట్టుకుని తాగుతూ నృత్యం చేయడం ప్రారంభించింది.
నేను మళ్ళీ ఆలోచించసాగాను. నా వింత అంతర్దృష్టి పట్ల ఆశ్చర్యపోయాను. నేనొక మాంత్రికుడిని, మనిషిని. భూమిని, అన్ని ఇతర గ్రహ కాలనీలను ఆక్రమించుకున్న దుష్ట శక్తులతో ఉన్నానా? నేను వారికి సహాయం చేశానా? నిరాకరించి, నేను ఉన్నత శక్తి నుండి మరణాన్ని పొంది ఉండాల్సిందా? ఎర్త్ కౌన్సిల్ ఎక్కడ ఉంది? కుజుడు, చంద్రుడి పైన ఇంటర్‌ప్లానెటరీ కౌన్సిల్స్ ఏం చేస్తున్నాయి? శాంతిని కాపాడవలసిన గెలాక్టిక్ కౌన్సిల్ సంగతి ఏమిటి? ఎంపిక చేసిన వ్యక్తిగా ఉండి నా ప్రతిభతో నేను దుర్మార్గులకు సాయం చేశానా? నేను నిజంగానే సమూరాకు సాయం చేస్తున్నాను. మేం సందర్శించిన ప్రతీ గ్రహంలోనూ మానవుల స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం విలువలను తీవ్రమైన అపాయంలోకి వచ్చాయి. ఈ దుర్మార్గులు నన్ను బెదిరించడం ద్వారా నా సహాయంతో ప్రతి అద్భుత వస్తువుని సాధిస్తున్నారు.
నేను తిరుగుబాటు చేయనా?
నా ఆలోచన రీతిని, గందరగోళాన్ని అర్థం చేసుకున్నట్లు డిమిట్రీ గట్టిగా నా చేయి పట్టుకుంది.
ప్రకృతి నా రక్తం, మా జన్యువులు ఒకటే. బహుశా టెలిపతీ ద్వారా ఆమె నా ఆలోచనలు గ్రహించింది.
“హనీ! ఓపికపట్టు! సహనంతో ఉండు! మన సంఖ్య చాలా తక్కువ!”
నేను నిరర్థకమైన కోపంలో ఉన్నానని నాకు తెలుసు. ఈ విషయాన్ని ఎర్త్ కౌన్సిల్ లేదా మూన్ లేదా కుజగ్రహంలోని ‘హ్యూమన్ కాలనీ’ ప్రెసిడెంట్‌కి నివేదించడం ఉత్తమమా?
కానీ ఎలా? మేము దుష్టశక్తులచే నడపబడుతున్న స్పేస్‌షిప్‌లో ఉన్నాం. అంతర్ గ్రహ మరియు ఇంటర్ గెలాక్టిక్ ప్రయాణాలు, టాచియాన్ నౌకలు అతి సాధారణమైన ఈ రోజులలో వీనస్ మరీ మారుమూల గ్రహం కాదనే చెప్పాలి. ఏదో ఒక గ్రహానికి చెందిన మీడియానో లేదా భద్రతా సంస్థనో నేను అప్రమత్తం చేయలేనా? నేను విశ్వశక్తిని ఉపయోగించగల వ్యక్తినైతే కావచ్చు, కాని దానికన్నా ముందు నేను భూమికి చెందిన మానవుడిని. దుష్ట శక్తులతో పోరాడి అశువులు బాసిన గొప్ప తల్లిదండ్రుల కుమారుడిని నేను.
నేను నా తల్లిదండ్రులను చంపిన ఈ దౌర్భాగ్యులకు ఆయా అద్భుత వస్తువులను గుర్తించి తెచ్చి ఇచ్చి సహాయం చేస్తున్నానా?
తప్పించుకోవటం ఎలా?
సంగీతం ప్రతిధ్వనిస్తుండగా, డిమిట్రీ మరో రెండు గ్లాసుల పానీయం తాగి లేచింది, నృత్యం చేయటానికి నా చేయి పట్టుకుని లాగింది. ప్రకృతి కోపం నటిస్తూ మాకేసి చూసింది.
ఏనిమాయిడ్ కూడా గ్లాసులతో పానీయం తాగుతూ, అడవిలో పులిని వేటాడుతున్న భంగిమలో నాట్యం చేయసాగాడు.
ప్రకృతి నవ్వుతూ మమ్మల్ని చూస్తోంది.
మేము ఒక దఫా నృత్యం పూర్తి చేసేసరికి, డిమిట్రీ ప్రకృతిని లాగింది, తనతో నాట్యం చేయించింది! మంత్రగాళ్ళు, మంత్రగత్తెలు, ఆఫ్రికన్ లక్షణాలతో ముదురు రంగు పొట్టి కేశాల గార్డులు, ముసలి అస్థిపంజరాల్లాంటి ఆల్ఫా సెంటారీ మాంత్రికులు అందరూ చప్పట్లు కొడుతూ నవ్వసాగారు.
డిమిట్రీ నా నుదుటి మీద ముద్దు పెట్టింది, తర్వాత ప్రకృతి నుదుటి మీద కూడా.
“హనీ! ఎంపికైన వ్యక్తి! వేచి చూడు! చివరి రెండు వస్తువులను గుర్తించే వరకు మనకి విముక్తి లేదు. తదుపరి మజిలీ టైటాన్, నా సొంత గ్రహమే అవుతుంది. మనం అక్కడ ఏమి చూస్తాం? ఓ ఎంపికైన సజ్జనుడా! అప్పుడు మాత్రమే మా ప్రణాళికలను తయారుచేయండి!”
నేను పానీయంతో మత్తులో ఉన్నాను, “చూద్దాం!” అన్నాను.
ఈ వింత వేడుక రాత్రంతా కొనసాగగా, లెత్వాల్ రూజ్ డీప్ స్పేస్‌లోకి ప్రయాణించింది.
(సశేషం)