అధ్యాయం 36: లెత్వాల్ రూజ్ – విజయ వాహనం!
సమూరా యొక్క వ్యోమనౌక లెత్వాల్ రూజ్ యొక్క విస్తృత వృత్తాకారంలో ఉన్న ప్రధాన క్యాబిన్‌లోకి మేము ప్రవేశించగానే, మిగిలిన సిబ్బంది చప్పట్లు కొడుతూ, మెగాఫోన్ల నుండి పెద్ద శబ్దాలతో సంగీతాన్ని వినిపిస్తూ స్వాగతం పలికారు. విజయం నృత్యం చేశారు. వాళ్ళంతా సంతోషకరమైన మూడ్‌లో ఉన్నారు. పొడవైన నల్లటి దుస్తులు ధరించిన ఆల్ఫా సెంటారి యొక్క ముసలి తాంత్రికులు కూడా నవ్వుతూ ఉన్నారు, తల వెనక్కి తిరిగి ఉండే ముసలి మంత్రగత్తె సయోని తన వీపు చూపి అదుపు లేకుండా నవ్వింది. ఈ దృశ్యం వింతగా ఉంది, భయంకరంగా ఉంది. ఒక గ్రహ కాలనీని గెలుచుకున్న ఉత్సవం ఇది. వారు అరుణ భూములని కోల్పోయారు, కానీ ఇప్పుడు వారి సామ్రాజ్యంలోకి ఒక చిన్న రాజ్యం చేరడం నేను చూస్తున్నాను.
సయోని తల మాట్లాడింది: “హనీ! యూనివర్సల్ గ్లోబ్‌ను మా తండ్రికి ఇచ్చావా? అక్కడ ప్రతి ఒక్కరికీ భద్రత ఉందా?”
ఇది సిగ్గుమాలిన ప్రశ్న.
మాడి మసైన హెరోడోటస్, అతని సహచరుల మృతదేహాలు గుర్తొస్తే నేను ఇప్పటికీ వణుకుతున్నాను. విధేయుల గతే ఇలా ఉంటే, వారి ఉద్యమంలో అయిష్టంగా చేతులు కలిపిన మాలాంటి భాగస్వాములు గతి ఏంటి?
ఆల్ఫా సెంటారీ మాంత్రికులు కూడా ఏదో అర్థం కాని మాటలు మాట్లాడారు, యురేకస్‌లో విద్యుచ్ఛక్తి అయిపోవడం, అది ఛార్జింగ్‌లో ఉండడం వల్ల వాళ్ళేం మాట్లాడారో నేను తెలుసుకోలేకపోయాను.
అప్పుడు పానీయాలు, తినుబండారాలు వచ్చాయి. ప్రాచ్యప్రాంతపు లక్షణాలు కలిగిన ఇద్దరు పొడగరులైన మహిళలు మా గాయాలను శుభ్రం చేసి, కట్లు కట్టారు. ఇన్‌ఫెక్షన్‌లను నివారించడానికి మాకు సూది మందులు, నొప్పిని తగ్గించడానికి మాత్రలు ఇచ్చారు.
మాకు సీట్లు ఇచ్చారు. షాంపేన్‌లా రుచిగా ఉన్న పానీయాలను సేవించాము. ఒక హోలోగ్రామ్ సృష్టించబడింది. దానిలో ఒక యువతి అర్ధనగ్నంగా కనిపించింది. పొట్టనీ, వక్షోజాలని ఊపుతూ విలాసవంతంగా నృత్యం చేయసాగింది. డ్రమ్స్, బాకాలు, మానవ గాత్రాలతో కూడిన ఇంద్రియాలకు ఉత్తేజాన్నిచ్చే సంగీతం వినబడుతోంది, అన్ని గ్రహాల వింత భాషలతో రాప్ సంగీతాన్ని ఒక విధంగా పాడుతున్న గ్రహాంతర గాత్రాలు వినవస్తున్నాయి, సిబ్బంది లోని ప్రతి బృందం వారి పానీయాలను ఒక చేత్తో పట్టుకుని తాగుతూ నృత్యం చేయడం ప్రారంభించింది.
నేను మళ్ళీ ఆలోచించసాగాను. నా వింత అంతర్దృష్టి పట్ల ఆశ్చర్యపోయాను. నేనొక మాంత్రికుడిని, మనిషిని. భూమిని, అన్ని ఇతర గ్రహ కాలనీలను ఆక్రమించుకున్న దుష్ట శక్తులతో ఉన్నానా? నేను వారికి సహాయం చేశానా? నిరాకరించి, నేను ఉన్నత శక్తి నుండి మరణాన్ని పొంది ఉండాల్సిందా? ఎర్త్ కౌన్సిల్ ఎక్కడ ఉంది? కుజుడు, చంద్రుడి పైన ఇంటర్‌ప్లానెటరీ కౌన్సిల్స్ ఏం చేస్తున్నాయి? శాంతిని కాపాడవలసిన గెలాక్టిక్ కౌన్సిల్ సంగతి ఏమిటి? ఎంపిక చేసిన వ్యక్తిగా ఉండి నా ప్రతిభతో నేను దుర్మార్గులకు సాయం చేశానా? నేను నిజంగానే సమూరాకు సాయం చేస్తున్నాను. మేం సందర్శించిన ప్రతీ గ్రహంలోనూ మానవుల స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం విలువలను తీవ్రమైన అపాయంలోకి వచ్చాయి. ఈ దుర్మార్గులు నన్ను బెదిరించడం ద్వారా నా సహాయంతో ప్రతి అద్భుత వస్తువుని సాధిస్తున్నారు.
నేను తిరుగుబాటు చేయనా?
నా ఆలోచన రీతిని, గందరగోళాన్ని అర్థం చేసుకున్నట్లు డిమిట్రీ గట్టిగా నా చేయి పట్టుకుంది.
ప్రకృతి నా రక్తం, మా జన్యువులు ఒకటే. బహుశా టెలిపతీ ద్వారా ఆమె నా ఆలోచనలు గ్రహించింది.
“హనీ! ఓపికపట్టు! సహనంతో ఉండు! మన సంఖ్య చాలా తక్కువ!”
నేను నిరర్థకమైన కోపంలో ఉన్నానని నాకు తెలుసు. ఈ విషయాన్ని ఎర్త్ కౌన్సిల్ లేదా మూన్ లేదా కుజగ్రహంలోని ‘హ్యూమన్ కాలనీ’ ప్రెసిడెంట్‌కి నివేదించడం ఉత్తమమా?
కానీ ఎలా? మేము దుష్టశక్తులచే నడపబడుతున్న స్పేస్‌షిప్‌లో ఉన్నాం. అంతర్ గ్రహ మరియు ఇంటర్ గెలాక్టిక్ ప్రయాణాలు, టాచియాన్ నౌకలు అతి సాధారణమైన ఈ రోజులలో వీనస్ మరీ మారుమూల గ్రహం కాదనే చెప్పాలి. ఏదో ఒక గ్రహానికి చెందిన మీడియానో లేదా భద్రతా సంస్థనో నేను అప్రమత్తం చేయలేనా? నేను విశ్వశక్తిని ఉపయోగించగల వ్యక్తినైతే కావచ్చు, కాని దానికన్నా ముందు నేను భూమికి చెందిన మానవుడిని. దుష్ట శక్తులతో పోరాడి అశువులు బాసిన గొప్ప తల్లిదండ్రుల కుమారుడిని నేను.
నేను నా తల్లిదండ్రులను చంపిన ఈ దౌర్భాగ్యులకు ఆయా అద్భుత వస్తువులను గుర్తించి తెచ్చి ఇచ్చి సహాయం చేస్తున్నానా?
తప్పించుకోవటం ఎలా?
సంగీతం ప్రతిధ్వనిస్తుండగా, డిమిట్రీ మరో రెండు గ్లాసుల పానీయం తాగి లేచింది, నృత్యం చేయటానికి నా చేయి పట్టుకుని లాగింది. ప్రకృతి కోపం నటిస్తూ మాకేసి చూసింది.
ఏనిమాయిడ్ కూడా గ్లాసులతో పానీయం తాగుతూ, అడవిలో పులిని వేటాడుతున్న భంగిమలో నాట్యం చేయసాగాడు.
ప్రకృతి నవ్వుతూ మమ్మల్ని చూస్తోంది.
మేము ఒక దఫా నృత్యం పూర్తి చేసేసరికి, డిమిట్రీ ప్రకృతిని లాగింది, తనతో నాట్యం చేయించింది! మంత్రగాళ్ళు, మంత్రగత్తెలు, ఆఫ్రికన్ లక్షణాలతో ముదురు రంగు పొట్టి కేశాల గార్డులు, ముసలి అస్థిపంజరాల్లాంటి ఆల్ఫా సెంటారీ మాంత్రికులు అందరూ చప్పట్లు కొడుతూ నవ్వసాగారు.
డిమిట్రీ నా నుదుటి మీద ముద్దు పెట్టింది, తర్వాత ప్రకృతి నుదుటి మీద కూడా.
“హనీ! ఎంపికైన వ్యక్తి! వేచి చూడు! చివరి రెండు వస్తువులను గుర్తించే వరకు మనకి విముక్తి లేదు. తదుపరి మజిలీ టైటాన్, నా సొంత గ్రహమే అవుతుంది. మనం అక్కడ ఏమి చూస్తాం? ఓ ఎంపికైన సజ్జనుడా! అప్పుడు మాత్రమే మా ప్రణాళికలను తయారుచేయండి!”
నేను పానీయంతో మత్తులో ఉన్నాను, “చూద్దాం!” అన్నాను.
ఈ వింత వేడుక రాత్రంతా కొనసాగగా, లెత్వాల్ రూజ్ డీప్ స్పేస్‌లోకి ప్రయాణించింది.
(సశేషం)