భూమి నుంచి ప్లూటో దాకా… -14

0
45

అధ్యాయం 38: టైటాన్ మానవ భూగర్భ కాలనీ

టైటాన్ శనిగ్రహపు మూడవ అతి పెద్ద ఉపగ్రహం. 20వ శతాబ్దం నుండి మానవులు టైటాన్‌కి వలసరావడం గురించి కలలుగన్నారు. ఇక్కడ భూగర్భ జలాలు ఉన్నాయి, వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, మీథేన్ పుష్కలంగా ఉన్నాయి. వీటి నుండి ఆక్సీజన్‌ని తయారు చేయవచ్చని, భూగర్భ కాలనీలు నిర్మించవచ్చని భావించారు. కానీ సమస్యల్లా వాతావరణంలో హైడ్రోజన్ క్లోరైడ్ అధికంగా ఉండడమే. ఇది మానవులకు హానికరం.

శనిగ్రహం చుట్టూ అంతరిక్ష వేదిక నిర్మించబడింది, 21వ శతాబ్దంలో అప్పటి స్పేస్ ప్రోబ్ స్టేషన్ పేరిట “క్యాసిని” అని పేరు పెట్టబడింది. సాంకేతికత అభివృద్ధి చెందడంతో మానవ బృందాలు తరలివచ్చాయి, అంతరిక్ష వేదికపై నివసించాయి. తర్వాత ఉపగ్రహాలైన టైటాన్‌, ఎన్‌సెలాడస్ లలో భూగర్భ కాలనీలు నిర్మించుకున్నారు. ఆక్సీజన్‌ని తయారుచేసుకునేందుకు భారీ రసాయన కర్మాగారాలు, భారీ సౌర విద్యుత్ గ్రిడ్లను నిర్మించుకుని నీటిని, ప్రాణవాయువుని సరఫరా చేయటం ద్వారా భూగర్భంలోని కాలనీలను తయారు చేశారు. ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగింది. గనుల తవ్వకం ద్వారా విలువైన లోహాలు, హైడ్రోకార్బన్లు, ఖనిజాలను విక్రయించడం ఆదాయ మార్గం.

కాలంతో పాటు శనిఉపగ్రహాలమీద నాగరికతలు ఏర్పడ్డాయి, నశించాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, రాజ్యాలు ఏర్పడ్డాయి. విలక్షణ జాతుల జీవులు అక్కడ నివసిస్తున్నారు. సాధారణ మానవులు, తలమీద యాంటెన్నాలతో ఉండే యంత్రమానవులు, విశ్వశక్తిని వినియోగించగల మానవులు అక్కడ నివసించారు. అయితే మంత్రగాళ్ళుగా ముద్రపడిన వ్యక్తుల పట్ల చులకనగా వ్యవహరించారు, సాధారణంగా పాలకవర్గంతోనూ, సమాజంతోనూ వేధింపబడినవారు. డిమిట్రీ, ఆమె తండ్రి పొసయిడన్, సోదరుడు జూలియస్ అటువంటి వేధింపులకు గురైన మాంత్రికుల తరగతికి చెందినవారు. తుఫానులు, మెరుపులు, ఉరుములను సృష్టించగల పొసయిడన్ శక్తుల గురించి నాకు తెలుసు. కుజుడి మీద మేము  జనరల్ గ్యానీ అంగారాక్ దళాల నుండి తప్పించుకుంటున్నప్పుడు అతని శక్తులని స్వయంగా చూశాను.

ఈ వివరాలన్నీ ఇప్పుడు నేను యురేకస్ యొక్క హార్డ్‌డిస్క్‌లో ఐజి నెట్ వేగవంతమైన బ్రౌజింగ్ ద్వారా తెలుసుకున్నాను. సౌర వ్యవస్థ, విశ్వం ఎంత విస్తారమైనవంటే గ్రహాలు, ఉపగ్రహాలపై కాలనీల చరిత్ర గురించి ఎవరికీ తెలియదు. ఈ సమాచారం అపారమైనది, అనంతమైనది. నేను నా మిషన్ కోసం అవసరమైన మేరకే తెలుసుకున్నాను.

శనిగ్రహపు క్యాసిని స్పేస్ ప్లాట్‌ఫాంపైన దిగాం. ఇది లా టెర్ స్పేస్ ప్లాట్‌ఫాం కన్నా చాలా పెద్దది. శని ఉపగ్రహ కాలనీలకు వెళ్ళే వ్యోమనౌకలు ఇక్కడ ఆగుతాయి. ఇతర సౌర వ్యవస్థలకు; సుదూర నక్షత్రాంతర కాలనీలకు ప్రయాణం యొక్క హైపర్ స్పేస్ రవాణా వ్యవస్థల వాహనాలకు ఇమ్మిగ్రేషన్ చెక్‌లకు ఉపయోగించబడుతుంది.

తలనీ, మెదడునీ వ్యత్యయంగా అమర్చినా పునర్జీవితం గడుపుతున్న సయోని ప్రతిదీ బాగా ఆలోచించింది. అయానిక్ అవతారానికి శరీరధర్మ శాస్త్రంతో పట్టింపు లేదేమోనని అనుకున్నాను.

నకిలీవైనా చెల్లుబాటయ్యే వీసా పత్రాలు, ఐడిలు, యూనివర్సల్ డిజిటల్ యూనిట్లలో నగదు అందజేసింది.

“డిమిట్రీ, ఇది నీ స్వస్థలం. నువ్వు హనీకి మార్గనిర్దేశం చెయ్యి! నీ తండ్రి, అంధుడైన సోదరుడంటే నీకెంతో ఇష్టమని నాకు తెలుసు. నేను నిన్ను ప్రతిసారీ బెదిరించడం అవసరం లేదు. ఇప్పుడు హనీని చూడు, అతను మాతో ఇష్టపూర్వకంగానే సహకరిస్తాడు… “

ఆమె వాక్యాన్ని పూర్తి చేయలేదు. ఆమె ఉద్దేశమేంటే నాకు తెలుసు. నాకు కోపంగా ఉంది. “సమయం వచ్చినప్పుడు నేను మిమ్మల్నిద్దరినీ చంపుతాను. నేను నిన్ను మళ్ళీ అయాన్లుగా మార్చి కరిగించేస్తాను” నాలో నేను అనుకున్నాను.

ఇక, ఒక చిన్న డిసెంట్ వెహికల్‌లో మేము క్యాసిని స్పేస్ ప్లాట్‌ఫాం మీద దిగాం, ఇమ్మిగ్రేషన్ చెక్ సజావుగా సాగిపోయింది.

టైటాన్ యొక్క స్పేస్ డ్రోంకు వెళ్ళేందుకు స్పేస్ షటిల్ కోసం మేము ఎదురుచూస్తున్నప్పుడు, డిమిట్రీ అకస్మాత్తుగా ఏడవసాగింది.

“హనీ! మా తండ్రీ, సోదరుడి గురించి నాకు భయంగా ఉంది. వాళ్ళు అడిగిన పనులు చేయలేదని నాన్నని వాళ్ళు జైల్లో పెట్టారు. చాలాకాలం క్రితం మెరుపులను ప్రయోగించి నా సోదరుణ్ణి అంధుడిని చేసి శిక్షించారు. వాళ్ళు చెడ్డవాళ్ళు” అంది.

“అసలేం జరిగింది?”

“అదో పెద్ద కథ. సమూరా ఏజెంట్లు ఎన్‌సెలాడస్‌లో రాజుని చంపడానికి ఒక మెరుపు తుఫానును సృష్టించమని నాన్నని అడిగారు, కానీ నాన్న ఒప్పుకోలేదు. వాళ్ళు నాన్న కలల్లోకి, తన టివిలోకి, కంప్యూటర్ మానిటర్‍లోకి వచ్చి బెదిరించారు, వ్యక్తిగతంగా వచ్చి గట్టిగా కోరారు. అయినా నాన్న నిరాకరించాడు. ఇది యాభై సంవత్సరాల క్రితం సంగతి. కాబట్టి వాళ్ళు గత్యంతరం లేక తుఫాను సృష్టించడానికి మరొక మాంత్రికుడిని ఎన్‌సెలాడస్‌‌కి పంపారు. అప్పటికి చిన్న కొడుకు ఉన్న మా నాన్న పొసయిడన్‌పై మెరుపులతో దాడి చేశారు. హానికారక కిరణాలనుంచి రక్షణ కల్పించే కవచాలతో నాన్న తనని తాను కాపాడుకున్నాడు; కానీ రెండేళ్ళ వయస్సు ఉన్న జూలియస్ అంధుడయ్యాడు. అప్పుడు నేను రాజధానిలో చదువుకుంటున్నాను. మాకు చిన్నప్పటి నుంచి అమ్మ లేదు, మమ్మల్ని మా నాన్నే పెంచాడు” చెప్పుకొచ్చింది డిమిట్రీ.

చెప్పేందుకు ప్రతిఒక్కరికి ఒక కథ ఉంది, అది కూడా వ్యథాభరితమైనది.

లా టెర్ లానే క్యాసిని కూడా ప్రయాణీకులతో రద్దీగా ఉంది. నేను మార్షియన్ మనుషులను, భూమికి చెందిన మానవులను, యజమానులతో ఉన్న రోబోలను గుర్తించాను, కొంతమంది గ్రహాంతరవాసులన్నా, వారు ఎక్కడ నుండి వచ్చారో గ్రహించలేకపోయాను. చాలామంది డిమిట్రీ లానే తలపై యాంటెన్నాలు, వలల్లాంటి కాలి వేళ్ళు, కోసు చెవులతో ఉన్నారు. బహుశా వాళ్ళు టైటాన్‌కి చెందినవారై ఉంటారు.

ప్రయాణం సజావుగా సాగింది.  టైటాన్ యొక్క స్పేస్‌పోర్టు నుండి బయటకు వచ్చాము, అధికారులు అందజేసిన ప్రెజర్ స్యూట్లు, ఆక్సీజన్ మాస్క్‌లు ధరించి బయటకు నడిచాం. సాధారణ పీడనం, ఆక్సీజనేడ్ వాతావరణం ఉన్న భూగర్భ కాలనీకి చేరుకునేంత వరకూ ఇవి మమ్మల్ని సురక్షితంగా ఉంచుతాయి.

టైటాన్ యొక్క భూభాగం కనబడుతోంది. ఆ వాతావరణంలో ఇప్పటికీ విషపూరితమయిన హైడ్రోజన్ క్లోరైడ్ ఉంది. టైటాన్‌లో కొండలు, శిలలు, లోయలు, బండరాళ్లు ఉన్నాయి. టైటాన్‌కున్న గొప్ప ప్రయోజనం ఏంటంటే అక్కడి మంచు నుంచి ఏర్పడిన భూగర్భ జలాలు.

అక్కడఉపరితలంపై భారీ టెర్రాఫార్మింగ్ ప్లాంట్లను, రసాయన రియాక్టర్లు నిర్మించారు. విశాలమైన, భారీ విద్యుత్ గ్రిడ్లని సౌరశక్తి నుండి విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయడం కోసం లక్షలాది చిన్న సౌర ఫలకలను అమర్చారు. అవి పగటి వెలుగులో ప్రకాశిస్తున్నాయి.

కుజుడిపై నేనొక్కడినే ఒక రోవర్‌లో ప్రయాణించినట్లుగా కాకుండా, మేము ఒక చిన్న రోవర్ క్రాఫ్ట్‌లో ప్రయాణిస్తున్నాము. స్పేస్‌డ్రోమ్ వద్ద అద్దెకు తీసుకున్న ఒక రోవర్లోనే అందరం ప్రయాణిస్తున్నాం. ఈ స్పేస్‌డ్రోం మొత్తం – టైటాన్ ఉపరితలం

 మీద వ్యోమనౌకలు దిగేందుకు వీలుగా పొడవాటి రన్‌వేలతో, ఇంటర్నల్ ఆక్సిజన్, సాధారణ గురుత్వాకర్షణ వంటి సౌకర్యాలతో నిర్మించబడింది.

రోవర్ క్రాఫ్ట్ టైటాన్ఉపరితలంపై ప్రయాణిస్తుండగా, జరిగినదంతా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఒక ప్రకాశవంతమైన ప్రకృతి దృశ్యం, కానీ ఎక్కడో చీకటి జీవులు ఉన్నారనిపిస్తోంది. వాస్తవానికి కుజుడి అరుణభూములు వారి ప్రధాన కేంద్రం. కానీ ప్రతిచోటా వాళ్ళకి రహస్య ఎజెంట్లు, స్లీపర్ సెల్స్ ఉన్నారు. ప్రతి కాలనీలోనూ ప్రతి కేంద్రంలోనూ సమూరాకు సహాయపడే రహస్య కేంద్రం ఉంది. ఎర్త్ కౌన్సిల్, విజర్డ్ మానిటరింగ్ సెల్స్, ఇంటర్ గెలాక్టిక్ పోలీస్‌లకు ఏమైంది?

ఇమ్మిగ్రేషన్ వద్ద మమ్మల్ని తనిఖీ చేసినప్పుడు వాళ్ళు – మేం విశ్వశక్తిని కలిగి ఉన్నామో లేదో నిర్ధారించుకోడానికి మా చుట్టూ ‘కాంతివలయం’ యొక్క ప్రసరణం కోసం వెతికారు. మేము మా శరీరాన్ని నిశ్చలంగా ఉంచి, ఆలోచనలను తటస్థంగా చేశాము. మా అందరికీ మా గ్రహాలలో ఇచ్చిన ధ్రువపత్రాలోనూ, పాస్‌పోర్టులలోనూ మేం విశ్వశక్తి సాధకులమని ప్రస్తావించారు. కాని ఇక్కడ మాలాంటి వారి రాకపోకలపై ఎలాంటి నిషేధమూ లేదు.

డిమిట్రీ టైటాన్ పౌరురాలు. నేను, ఏనిమోయిడ్ తక్కువ స్థాయి విశ్వశక్తిని కలిగి ఉన్నాం, కానీ మానిటరింగ్ సెల్ వాళ్ళు మమ్మల్ని అనుమతించారు. అయితే, వీళ్ళు లెత్వాల్ రూజ్‌లోని సయోని బృందంచే మోసగింపబడ్డారు.

మేము భూగర్భ ఆవాసాలకు దారితీసే మెట్లతో ఉన్న విశాలమైన ప్రాంతాన్ని చేరినప్పుడు.. ఒక బోర్డ్ మీద ఇలా రాసి ఉంది.

“టైటాన్ రాజధాని నగరం మంద గేట్ 1 కు స్వాగతం”

‘మంద’ అంటే సంస్కృతంలో శనికి మరో పేరు.

మేము వాహనం దిగాం. డిమిట్రీ మాకు మార్గనిర్దేశం చేస్తుండగా మెట్లు దిగి కిందకి నడిచాం.

“ఆహా, అద్భుతమైన కాలనీ! ఇప్పుడు మీ గ్రావిటీ స్యూట్‌లను తీసేయచ్చు. ఇక్కడ సాధారణ పీడనం, ఆక్సిజన్ ఉన్నాయి” చెప్పింది యురేకస్.

***

నాల్గవ సహస్రాబ్ది యొక్క గ్రహ కాలనీలు విపరీతమైన సాంకేతికతకు నిదర్శనాలు. సైన్స్, మెటలర్జీ, స్పేస్ సైన్స్, బయాలజీ, ఇంజనీరింగ్, ఐడియాలజీ పురోగతికి ఉదాహరణ. ఇతర సందర్శకులతోపాటు సుమారు అర కిలోమీటరు దూరం మెట్లు దిగాకా, టైటాన్ రాజధాని నగరంలోని విశాలమైన ప్రాంతాన్ని మేము చూడగలిగాము. పొడవాటి ఇరుకైన వీధులకి ఇరువైపులా చతురస్రాకారాల ఆకారంలో ఉండే ఇళ్ళు ఉన్న ఒక టౌన్‌షిప్ ఇది. మేము ఇప్పుడు మళ్ళీ రోవర్ క్రాఫ్ట్ ఎక్కాల్సి వచ్చింది. అయితే ఇది ఓపెన్ నమూనాది. వాహనం డ్రైవర్ మా గ్రావిటీ సూట్లు, ఆక్సీజన్ మాస్కులు తీసేయమని అభ్యర్థించాడు. ఈ రోవర్ ఆరు చక్రాలతో పెద్దగా ఉంది, బహుశా సౌరశక్తిపై పనిచేసే మోటార్‌ని కలిగి వున్నట్లుంది. ఇది నేలపైన కదిలే రోవర్‌క్రాఫ్ట్ వలె లేదు.

“ఇది రాజధాని నగరం. మేము 10,000 మంది పౌరులం, రాజభవనంలో నివసిస్తున్న రాజు ఉంటాం ఇక్కడ. ఈ రాజధాని నగరం చుట్టుపక్కల, వివిధ పేర్లతో పిలువబడే అనేక చిన్న కాలనీలు ఉన్నాయి, వాటి గుర్తింపు కోసం డిజిటల్ సంఖ్యలు కూడా ఉన్నాయి. టైటాన్‌లో దాదాపు 20,000 మంది నివసిస్తున్నారు. అయితే మేం మాత్రం జనాలకి బాగా దూరంగా ఉండే చోట జీవిస్తున్నాము. మాంత్రిక శక్తులున్న మాది ఒక ప్రత్యేక తెగ. మేము నీరు ఉన్న చోట ఉంటాం. సముద్ర తీరంలో భూగర్భంలో మేము పెద్ద ఇల్లు నిర్మించాము. మా ఇంటిలో చెట్లున్నాయన్నా, మా తోటలో పువ్వులు పూస్తాయాన్నా మీరు నమ్మడం కష్టం. టైటాన్ భూగర్భ సముద్ర జలాలు – నీటికి, ఇతర ఆర్గానిక్స్‌కి విస్తృత వనరులు. ‘మెర్ నోర్డ్’ తీరంలో మా నాన్న తుఫానులను సృష్టించడాన్ని సాధన చేసేవాడు.” అని చెబుతూ డిమిట్రీ ఒక్కసారిగా మౌనం వహించింది. ఆమెకి దుఃఖం ముంచుకొచ్చింది. వెక్కిళ్ళు పెడుతూ, “మా ఇంటి చుట్టూ విద్యుచ్ఛక్తితో ఉన్న రక్షణాత్మక కంచె అమర్చారు. మా నాన్నని తన స్వంత ఇంట్లోనే ఎలా బందీగా చేశారో నాకు అర్థం కావడం లేదు” అంది.

“ప్రస్తుతం మనం హోటల్‌కి వెళ్దాం” అన్నాను. “ఏం చేయాలో అక్కడ నిర్ణయిద్దాం. వాళ్ళని వదలం!” చెప్పాను.

‘హోటల్ ప్లాజా టైటానిక్’ వీధి చివరలోనే కనబడింది. ఇది ఒక ప్రకాశవంతమైన సైన్ బోర్డు కలిగి ఉంది.

సాధారణ తంతులన్నీ ముగించి, మేం హోటల్లోకి ప్రవేశించాం.

ఏనిమాయిడ్, డిమిట్రీ తమ తమ గదులకి వెళ్తుండగా “భోజన సమయంలో కలుద్దాం” అన్నాను.

***

“రెండు విషయాలు నా మనసులో ఉన్నాయి” అన్నాను, భోజనంలో రుచికరమైన ‘ప్వాసాన్తీసుకుంటూ. “ప్వాసాన్ఫ్రీత్.”

అంటే ‘కాల్చిన చేప’ అని అర్థం.

డిమిట్రీ తండ్రి పొసయిడన్‌ను, ఆమె అంధ సోదరుడు జూలియస్‌ని రక్షించడం మొదటి కర్తవ్యం. రెండవది ఆ అద్భుత ‘వస్తువు’ ఎక్కడుందో తెలుసుకోవడం. సయోని గానీ, సమూరా గానీ అదేం వస్తువో, ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకునేందుకు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు.

కాకపోతే ఇప్పుడు నాకు పద్ధతి తెలుసు. అదొక మెరిసే వస్తువుగా ఉంటుంది. నాకూ లేదా సమూరా వంటి నిపుణులైన మాంత్రికులకి మాత్రమే కనిపిస్తుందది. దానితో పాటు దాని ఉపయోగాన్ని కొన్ని పరిస్థితులకు పరిమితం చేసే ఒక భవిష్యవాణి ఎల్లప్పుడూ ఉంటుంది. ఎన్‌సైక్లోపీడియా గెలాక్టికాలో చెప్పినది నిజమే అయితే, ఇక రెండు వస్తువులు మాత్రమే ఉన్నాయి – ఇక్కడ టైటాన్‌లో ఒకటి, ఇంకెక్కడో మరొకటి. అది బుధగ్రహంలో ఉండదు, ఎందుకంటే అది సూర్యునికి చాలా దగ్గరగా ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది, పైగా దానికి ఉపగ్రహాలు లేవు. ఒక్కో గ్రహంలో ఒక్కో వస్తువుని దాచారని అనుకున్నా… చివరి అద్భుత వస్తువు శనిగ్రహం లేదా ఉపగ్రహాలలో ఉండాలి. శనిగ్రహం కూడా ఆవాసయోగ్యం కాదు.

టైటాన్‌లో ఒక అద్భుత వస్తువుని దాచగల అవకాశం ఉంది కాబట్టి నన్నిక్కడికి పంపారు. ఆ మరో అద్భుత వస్తువు ఎన్‌సెలాడస్ మీద లేదా శని యొక్క మరో ఉపగ్ర్రహం మీద ఉండి ఉండవచ్చు.

నేను వాటి కోసం ప్రయత్నించనా? ఈ వస్తువులని సాధించి భూమికి లేదా చంద్రుడికి మీదకి పారిపోయి వాటిని ఎర్త్ కౌన్సిల్‌కి లేదా అమృతా కాలనీకి అప్పగించనా? కానీ ఎలా? నేను క్యాస్సిని ప్లాట్‌ఫాం వద్ద సుదూర ప్రయాణాలు చేయగల అంతరిక్ష నౌకని హైజాక్ చేసి, దానిని భూమికి మళ్ళించమని ఒత్తిడి చేస్తాను. నేను నా శక్తులను ఉపయోగించాలి.

ఇది సాధ్యం కావచ్చు. ఏమైనా నేను ఇలా ఎంతో కాలం వేచి ఉండలేను. నా ప్రయత్నాలు విఫలమైతే నేను చనిపోతాను, ప్రకృతినీ చంపేస్తారు. ఖచ్చితంగా చంపేస్తారు. పొసయిడన్‌ని రక్షించి, ఆ అద్భుత వస్తువుని అన్వేషించాలి.

నేను నిద్రపోయాను. ఆ రహస్యమైన అద్భుత వస్తువు ఎక్కడుందో తెలిపే కల వస్తే బాగుండు! కలలు నా జీవితాన్ని మార్చాయి. స్వప్నాలు నా దిశను మార్చాయి. ఇదంతా ఒక అందమైన అమ్మాయి, మార్షియన్ యువరాణి నా కలలోకి రావడంతో ప్రారంభమైంది. కానీ అది నా దిశగా మార్చింది, నాలో దాగి ఉన్న సామర్థ్యాన్ని వెలికితీసి ఎన్నో సూదూర ప్రాంతాలకు నన్ను నడిపించింది.

మాంత్రికులకి ఉండే అతీంద్రియ శక్తులలో దూరదృష్టి, దూరశ్రవణం కూడా భాగమే.

అయితే వాటిని నియంత్రించగలిగితే, సమయానుకూల ప్రయోజనాలు పొందవచ్చు.

సంక్షోభం సమయంలో నేను నా తల్లిదండ్రులను, ఆమ్రపాలి కొండమీద ఉండే భైరవుడిని ప్రార్థిస్తాను.

కానీ ఇప్పుడు అది ఏ ఫలితాలను ఇవ్వలేదు.

నేను ప్లాజా టైటానిక్ హోటల్ యొక్క చల్లని గదిలో పడుకుని, నా మెదడుని ఆదేశించాను.

“చూడు, వెతుకు, ఆ అద్భుత వస్తువును గుర్తించు! అది టైటాన్‍‌లో ఎక్కడ దాచబడి ఉందో నాకు చెప్పు. నేను ఎంపికైన వ్యక్తిని!”

అయితే నేను కోరుకున్నప్పుడు మాత్రం శక్తులు అరుదుగా పని చేస్తాయి. నేను నిజమైన సంక్షోభంలో పడినప్పుడు మాత్రమే నాకా శక్తులు ఉపయోగపడ్డాయని ఊహిస్తున్నాను.

ఇప్పుడు ఇది సంక్షోభం. టైటాన్ వంటి పెద్ద ఉపగ్రహంలో ఏ లక్షణాలు తెలియని ఒక వస్తువుని శోధించడం ఎలా?

నేను దృష్టి కేంద్రీకరించి ధ్యానం చేస్తూ నిద్రలోకి జారుకున్నాను. అయితే అది కలత నిద్ర.

నా కళ్ళ ముందు అనేక చిత్రాలు కదలాడుతున్నాయి. రాతి భూభాగం, కొండలు, ఎండిన భూమి, భూగర్భ వీధులు సుడులు తిరుగుతూ పైకొచ్చి ప్రధాన భూభాగంలో కలవడం కనబడుతోంది, తరంగాల హోరు వినిపిస్తోంది, అక్కడ నీలి ఆకాశం తెల్లటి మెరిసే తరంగాలను తాకుతోందా అన్నట్టుంది. ఆకాశంలో మెరుపులు!

అప్పుడు కనబడ్డారు సముద్ర రాక్షసులు. నలుగురున్నారు. పొడుగ్గా, శరీరమంతా బొచ్చుతో వికారమైన రూపం వాళ్లది. ముళ్ళ కొరడాని ఆయుధాలుగా పట్టుకున్నారు, వాళ్ళ కళ్ళల్లోంచి నిప్పురవ్వలు వెలువడుతున్నాయి.

నాకు పరిచితమైన పొడవాటి, బలిష్టుడైన నిడుపాటి గడ్డం కలిగిన ఓ ముసలాయన చుట్టూ వాళ్ళు నిలబడి ఉన్నారు. తుఫానుల దేవుడి పేరుపెట్టుకున్న ఆయనే పొసయిడన్. తుపానులను సృష్టించగల సామర్థ్యం ఉన్న ఆయన డిమిట్రీ యొక్క తండ్రి. ఆయన పక్కన ఓ పదహారేళ్ళ కుర్రవాడు చెదిరిన గిరజాల జుట్టుతో ఉన్నాడు. ఆ అబ్బాయి నిలబడి ఉన్నాడు, పరిసరాలను చూడలేని అంధుడతను. ఆ అబ్బాయి డిమిట్రి యొక్క సోదరుడైన జూలియస్. ఇద్దరినీ భారీ ఇనుప గొలుసులతో కట్టేసి ఉంచారు. సముద్ర రాక్షసులు వారిద్దరి చుట్టూ తిరుగుతూ తమ ఆయుధాలతో వారిని బెదిరిస్తున్నారు.

అది పెద్ద కోట వంటి ఇల్లు. గోడలపై వివిధ చిత్రాలు ఉన్నాయి, ముఖ్యంగా నేను గుర్తించలేని వస్తువుల చిత్రాలు. అధివాస్తవిక కాలంలా బొమ్మలు ఒకసారి స్పష్టంగానూ, మరోసారి మసకగానూ కనబడుతున్నాయి.

నా మెదడు ఏకాగ్రమైంది, శోధనపై కేంద్రీకృతమైంది, నేను పొసయిడన్‌తో మాట్లాడుతున్నానని భావించాను.

“హనీ, హనీ! నిన్ను మళ్ళీ చూసినందుకు సంతోషంగా ఉంది! కుజగ్రహం మీద ఆనాటి పలాయనం తరువాత మళ్ళీ ఇదే చూడడం!”

“హాయ్! పొసయిడన్! కానీ నిన్నిలా చూడడం బాలేదు. వాళ్ళు సమూరా అనుచరులని నాకు తెలుసు. నువ్వు వాళ్ళపై దాడి చేయలేవా?”

“హా! హా! నేను వేచి ఉన్నాను. రండి. వచ్చి నాకు సహాయం చెయ్యండి. నేను వాళ్ళని చంపడానికి మీ కోసం ఎదురు చూస్తున్నాను. కానీ అది ముఖ్యం కాదు. నేను ‘డూప్లికేటర్’ను కాపాడాలి!”

“డూప్లికేటర్… డూప్లికేటర్! సయోని కోరుకునేది ఇదేనా? అది ఏమి చేస్తుంది?”

జవాబు చెప్పడానికి పొసయిడన్ నోరు తెరిచాడు. కానీ సముద్ర రాక్షసులు అతన్ని కొడుతుంటే నొప్పితో బాధపడ్డాడు.

“రా” అతను అరిచాడు. “నీ మెదడును అనుసరించు, అదే నీ జిపిఎస్. డిమిట్రీకి చెప్పు అది ‘మెర్…’ … “

అప్పుడు అక్కడంతా చీకటయ్యింది. నా శరీరం మునిగిపోయేంత చల్లటి చెమటతో నేను మేల్కొన్నాను.

నేను ఇప్పుడు నా సహజ జ్ఞానాన్నే అనుసరించాల్సి ఉంది. నా మెదడే ఒక గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here