అధ్యాయం 50: మళ్ళీ లా టెర్‌కి
లా టెర్ మీదకి దిగి నడుస్తుండగా, మాకు కొద్దిగా తల తిరిగినట్లయింది, ముఖాలు ఎర్రబడ్డాయి.
మేము భూమికి సమీపంలో ఉన్నాము, కానీ ఇప్పటికీ గెలాక్టిక్ కౌన్సిల్ పరిధిలో గ్రహాంతర తటస్థ ప్రాంతంలో ఉన్నాము.
జనాలు ఎక్కువగా లేని భూమి ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద మేము మా ‘నో అరెస్ట్’ ఆర్డరూ, ఇంకా నెప్ట్యూన్-ప్లూటో గెలాక్టిక్ కోర్ట్ తీర్పు ప్రకారం మాకు భూమి యొక్క పత్రాలను అందించమనే ఆదేశాలను చూపించాము.
ఈ రోజుల్లో భూమిని సందర్శించేవారి సంఖ్య బాగా తగ్గినట్టుంది. పర్యాటకులు అసలే మాత్రం లేరు. చక్రవర్తి సమురా భారీ చిత్రపటం ఒకటి అక్కడ ఉంది.
“విశ్వశక్తి, ధ్యానం మరియు ప్రశాంతత ఉన్న గ్రహం; సూర్యోదయ సూర్యాస్తమయాలు, వర్షం, ఆహ్లాదకరమైన సముద్రం ఉన్న గ్రహం – భూమిని సందర్శించండి!” అని భూమి యొక్క పర్యాటక శాఖ వారి ప్రకటన కనబడింది.
భూమి ఇప్పుడు తాంత్రికుల రాజ్యం. ఇతర గ్రహాల నుండి కొంతమంది ప్రజలు దీనిపై ఆసక్తి కలిగి ఉన్నారు. కానీ వాతావరణం, ప్రాచీన మానవ ఆవాసాలకు నెలవనే ఒక గతవ్యామోహం మాత్రమే ప్రస్తుత ఆకర్షణ.
నల్లటి కోటు ధరించిన ఓ వ్యక్తి మా దగ్గరికి వచ్చాడు.
“నా పేరు అవినాష్ టాగోర్. నేను బిశ్వాస్ ముఖర్జీ సంస్థకి చెందిన న్యాయవాదిని. ఇక్కడ పత్రాలకు సంబంధించి మీకు సహాయపడమని నాకు ఆదేశాలున్నాయి.”
అప్పుడు ప్రకృతి నా భుజం తట్టి నాకు ఒక సైన్‌బోర్డ్‌ని చూపించింది.
“నూతన చక్రవర్తి సామ్రాజ్యం యొక్క రాజ్యంలో శరణార్థులకు సాయం లభిస్తుంది. పాత భూమికి చెందిన పిసియుఎఫ్‌లు, గెలాక్సీల మాంత్రికులు మరియు వివిధ దళాల నిగూఢ లేక విశద శక్తుల అభ్యాసకులకు స్వాగతం! మీకు విచారణ నుండి మినహాయింపు లభిస్తుంది!”
మేము అన్ని విధి విధానాలను పూర్తి చేశాం. చక్రవర్తి యొక్క రహస్య వేగులు లేదా అవలోకులు మమ్మల్ని గమనిస్తూ ఉండవచ్చు. కానీ వారి స్వంత నిబంధనలనే మమ్మల్ని కాపాడాయి.
ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద పనులు పూర్తి చేసుకుని, ప్రయాణీకుల కారిడార్ లోకి ప్రవేశించాం. భూమికి వెళ్ళేందుకు స్పేస్ షటిల్ కోసం వేచి ఉండగా, న్యాయవాది అవినాష్ మాకు టిక్కెట్లు అందజేశారు.
“ఇదిగోండి – మొత్తం ఖర్చుల బిల్లు! అన్ని ఖర్చులు, న్యాయవాది రుసుము కలిపిన మొత్తం బిల్లు! ఒక మిలియన్ 33,000 యూనివర్సల్ డిజిటల్ కరెన్సీ యూనిట్లు. మీరు చెల్లింపుకి చెక్ ఇవ్వచ్చు లేదా మా ఖాతాకు నగదుని డిజిటల్ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు!” చెప్పాడు.
” నా బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బుందో నాకు తెలియదు. ఖచ్చితంగా ఒక మిలియన్ కంటే తక్కువే ఉంటుంది. నా ఆదాయ మార్గం ఉద్యోగం మాత్రమే, అదీ పోయింది! మా గ్రామం ఆమ్రపాలిలో నాకు ఇరవై ఎకరాల భూమి ఉంది. ఈ మొత్తాన్ని చెల్లించాలంటే నా మొత్తం ఆస్తిని మీకివ్వాలి” అన్నాను. నా హృదయంలో నిరాశ.
“అదంతా 13 ఏళ్ళ క్రితం మాట. బ్యాంకులోని మీ డబ్బుకి వడ్డీ వచ్చి ఉంటుంది. మీ భూముల విలువ పెరిగి ఉండవచ్చు. మీ భార్య, మీ మావగారు కూడా బంగారం, ఇంకా భూములను కలిగి ఉన్నారు. మీరు ఇక్కడ్నించి వెళ్ళే ముందు, ఈ విలువకి సరిపోయే ఆస్తి మొత్తాన్ని మా సంస్థకు బదలాయిస్తున్నట్టుగా ఓ లేఖపై సంతకం చేయండి. మాకు అది సరిపోతుంది.”
అతను చెప్పినట్టే చేశాను. నా బ్యాంక్ ఖాతాలో నగదు ఎంత పెరిగిందో తెలియదు. ఇక తాంత్రికుల పాలనలో ఉన్న ఆ తూర్పు ఆసియా గ్రామంలో భూమి విలువ పెరిగిందో లేదా క్షీణించిందో నిజంగా నాకు తెలియదు.
“మొదట మేము మా గ్రామానికి వెళ్ళాలి. నా భార్య వాళ్ళ నాన్నని చూసుకోవాలి. నా చిరునామా ఇండికా సెంట్రల్, ఇంకా ఆమ్రపాలి” అంటూ నేను అతనికి రాసిచ్చాను.
అవినాష్ టాగోర్ నవ్వాడు.
“ప్రస్తుతం ఇండికా సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఏదీ లేదు. దాన్నిప్పుడు సమూరా సెంటర్ ఆఫ్ మెడిటేషన్ అని పిలుస్తున్నారు. మీ గ్రామం అలాగే ఉంది, మీ మామగారు గ్రామపెద్దగా ఉన్నారు, మీ భూములను కాపాడుతున్నారు. మీ ఖాతాలో తగినంత డబ్బు ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇవి భూమిపైన ద్రవ్యోల్బణపు రోజులు. పదండి, భూమికి వెళ్ళేందుకు ఏడవ గేట్ వైపు. ఏవైనా తినాలనుకుంటే ఇప్పుడే తినండి. ఈ షటిల్ మిమ్మల్ని ఫ్లోరిడాలో దింపుతుంది. కానీ అక్కడ మీరు తినడానికి కుదరదు. తక్షణమే మిమ్మల్ని ఢిల్లీకి వెళ్ళే విమానంలో కూర్చోబెడతారు. అది మీ రాజధాని, ఒకప్పుడు ఏరియా డిజిటల్ నంబర్ 888. మిమ్మల్ని మీ స్వంత గ్రామానికి మాత్రమే పంపిస్తారు. మీరు చక్రవర్తి యొక్క భూభాగంలో అమెరికాలో తిరుగాడలేరు” చెప్పాడు అవినాష్.
“అంటే మొత్తం భూమి సమూరా అధికారంలో లేదా?”
“భూమి అంతా సమూరాదే. కాని ఇండియా, మధ్యప్రాచ్యం, చైనాలతో కూడిన ఆసియా ప్రాంతం – ఆల్ఫా సెంటారీ మాంత్రిక సామ్రాజ్యానికి విధేయులైన అఘోరా తాంత్రికులకు ఇజారాగా ఇవ్వబడింది. మీరు అక్కడే ఉండాలి, విధేయుడైన పౌరుడిగా ఉండాలి. గౌరవం పొందే ఓ మాంత్రికుడిగా, పౌరులలో కలిసిపోవాలి!”
“అయ్యో!” అన్నాం నేనూ, ప్రకృతీ ఒకేసారి.