భూమి నుంచి ప్లూటో దాకా… -18

0
6

[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]

అధ్యాయం 49: నెప్ట్యూన్ – ప్లూటో స్పేస్ ప్లాట్‌ఫామ్

[dropcap]నె[/dropcap]ప్ట్యూన్, ప్లూటో యొక్క అనేక ఉపగ్రహాలకు వెళ్లే వాటికి ల్యాండింగ్ పాయింట్; ఇంకా ఆల్ఫా సెంటారీ, ఇతర సౌర వ్యవస్థకు వెళ్ళే అన్ని వ్యోమనౌకలకు మార్గమధ్యం అయిన నెప్ట్యూన్-ప్లూటో స్పేస్ ప్లాట్‌ఫామ్‌ను చేరుకోవడానికి సుమారు 10 గంటలు పడుతుంది. ప్లూటోనే ఒక చిన్న మరుగుజ్జు గ్రహం. నెప్ట్యూన్ యొక్క ఉపగ్రహాలలో అనేక చిన్న కాలనీలున్నాయి, సాహసికులు, అన్వేషకులు మరియు పర్యాటకులు వచ్చిపోతుంటారు.

ప్రయాణం ఏ ఆటంకాలు లేకుండా సాగిపోతుంటే, నా బెదిరింపు పనిచేసిందని నేను అనుకున్నాను. లో-గ్రావిటి షటిల్‌లో నిశ్శబ్దంగా తేలుతూ, స్టెవార్డ్స్ అందించిన ఒకటో రెండో తినుబండారాలను తింటూ మేం కాలం గడిపాం.

ఇక చివరి డాకింగ్ సమయం వచ్చింది, మేము ప్లాట్‌ఫామ్‌పై నిర్ణీత స్థానంలో డాకింగ్ చేశాం, తలుపులు తెరుచుకోడం కోసం వేచి ఉన్నాం.

మేము ఇబ్బందుల్లో ఉన్నామని అప్పుడు నేను గ్రహించాను. షటిల్ పైలట్లు కూడా తాంత్రికులేననీ విస్మరించి, వారిని అసమర్థులుగా భావించడం పొరపాటే. బహుశా వారు ఒక అలారం బటన్ ఒకసారో రెండుసార్లో నొక్కి ఉండాలి. తలుపులు తెరుచుకోగానే సైరన్లు మ్రోగాయి, డజన్ల కొద్దీ ఇంటర్ గెలాక్సీ గార్డులు, సమూరాకి చెందిన నల్ల దుస్తులు మాంత్రిక గార్డులు ఎరుపు లేజర్ తుపాకులతో షటిల్‌ లోకి ప్రవేశించారు.

“కాల్పులు జరపకండి. నేను పేలుడు పదార్థాలు అమర్చాను. మొత్తం షటిల్ పేలిపోతుంది. మేము శాంతియుతంగా లొంగిపోతాము!” అన్నాను.

ఎరుపు-వెండి-నీలం రంగు దుస్తులలో భారీ శరీరంతో ఉన్న ఇంటర్ గెలాక్టిక్ పోలీస్ కమాండర్ ముందుకు వచ్చి యూనివర్సల్ డిజిటల్ లాంగ్వేజ్‌లో ఇలా చెప్పాడు:

“చేతులు పైకెత్తండి, బయటికి నడవండి! కుజ గ్రహ చక్రవర్తి సామ్రాజ్యంలో భాగమైన ట్రైటాన్ యొక్క రక్షణ స్థావరాన్ని నష్టపరిచిన నేరస్థులు మీరు. ఇప్పుడు మీరు ఇంటర్ గెలాక్టిక్ నియంత్రణలో ఉన్న ప్రాంతంలో ఉన్నారు. మీరు ఖైదు చేయబడతారు కాని హత్య చేయబడరు! మీ చేతులను పైకెత్తండి, ఆయుధాలను వదలండి. ఎటువంటి మాయమంత్రాలు వద్దు!”

వారి ఆదేశాలను పాటిస్తూ – పదిమంది భద్రతా సిబ్బంది, మేం నలుగురం – నేను, ప్రకృతి, డిమిట్రీ, ఏనిమాయిడ్ బయటకు నడిచాం.

వివిధ గ్రహాలకు చెందిన ప్రయాణీకులు రకరకాల ఆకృతులలో – పొడుగ్గా, ఎర్రగా, నల్లగా, తలపై రెండు లేదా మూడు యాంటెనాలు, రోబోలతో తమ సామాను పట్టుకుని మమ్మల్ని విస్మయంతోనూ, ఆశ్చర్యంగాను చూస్తున్నారు.

మేం కొంత వరకు సురక్షితమని గ్రహించాను, ఎందుకంటే ఇది ప్రయాణ ప్రాంగణం, పైగా ఇంటర్ గెలాక్టిక్ కౌన్సిల్ నియంత్రణలో ఉంది.

జైళ్ళు చివరి కొసలో చాలా దూరంగా ఉన్నాయి. మేము అరగంటలో అక్కడ చేరుకున్నాము.

జైలు యొక్క భారీ ఎలక్ట్రానిక్ తలుపులు మూసుకోగానే, గెలాక్టిక్ ఫోర్స్ యొక్క కెప్టెన్ నాతో “వేచి ఉండండి! త్వరలో విచారణ కోసం మీరు పిలవబడతారు. ఇక్కడ అన్ని రకాలైన రక్షణ ఉంది. మీ మాయాజాలం ప్రయత్నించకండి.

మేజిక్, ఫోర్స్, అన్ని గెలాక్సీల ఆయుధాలు, కుట్రలు ఇక్కడ పనిచేయవు, వాటికి మా దగ్గర విరుగుడు ఉంది. నియమాలు పాటించండి, నిజాయితీగా మీ కేసుని వివరించండి. నీకు న్యాయం జరుగుతుంది, ఏమో స్వేచ్ఛ కూడా లభించవచ్చు, ఎవరికి తెలుసు. నాకైతే అనుమానమే, ఎందుకంటే మీరు ట్రైటాన్‌లో ప్రజలను హతమార్చారు” అన్నాడు.

***

స్పేస్ ప్లాట్‌ఫామ్ యొక్క జైల్లో అనేక గంటలు గడిచాయి. ఇప్పుడు మేమంతా ఖైదీ జీవితానికి అలవాటు పడ్డాం.

“భూమి మరియు మానవ జాతి స్వేచ్ఛ కోసం నేను ఈ తపస్సు చేస్తాను. పోరాటానికి ఒక శతాబ్ద కాలం అవసరమైతే, వందేళ్ళూ పోరాడుతాను!” అని నాలో నేను అనుకున్నాను.

నన్ను ప్రకృతి నుంచి, యురేకస్ నుంచి విడదీశారు, ఒంటరి నిర్బంధంలో ఉంచారు.

చివరికి ఓ రోజు మమ్మల్ని విచారణ కోసం ట్రిబ్యునల్ ముందు హాజరు కమ్మని ఆదేశించారు. గతంలో ఒకసారి మార్స్ స్పేస్‌డ్రోమ్‌లో జరిగినట్లు ఇక్కడా నేర విచారణ జరుగుతుంది.

ఎనిమిది మంది వృద్ధ మానవులు, హ్యుమనాయిడ్స్, చూడ్డానికి గ్రహాంతర వాసుల్లా ఉన్న న్యాయమూర్తుల బృందం ముందు మమ్మల్ని హాజరు పరిచారు. మానవ న్యాయమూర్తులందరిదీ తెల్ల జుట్టు, ముడతలు పడిన ముఖాలు. న్యాయాధికారులు ధరించే నల్లటి వస్త్రాలతో ఉన్నారు.

ఆ బృందం హ్యుమనాయిడ్స్, గ్రహాంతర న్యాయమూర్తుల సమూహమనీ;  వారంతా అనుభవజ్ఞులు, తెలివైనవారని నేను ఊహించాను.

ఇక మా సుదీర్ఘ విచారణ మొదలయింది. జవాబులిచ్చేందుకు మాకు తగినంత సమయం ఇచ్చారు. జరిగినదంతా తు.చ. తప్పకుండా వివరించాము. వాస్తవాల నిర్ధారణ, నిజాన్ని వెలికితీయడం ఈ ప్రక్రియ ఉద్దేశం.

నన్ను బ్లాక్‌మెయిల్ చేశారనీ, సౌర వ్యవస్థ ఆక్రమణదారులు నన్నీ పనికి బలవంతంగా ఒప్పించారని నేను వివరించాను. మేము మంచి మాంత్రుకుల, మానవుల స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర్యం కోసం పోరాడామని చెప్పాను. క్లుప్తంగా చెప్పాలంటే మేము శరణార్థులమనీ, బలవంతంగా మాతో చేయిస్తున్న నేరం నుంచి,  బ్లాక్‌మెయిల్ నుండి తప్పించుకోవడానికి ఇలా చేశామని వెల్లడించాను. మేము ఒకరితో ఒకరు మాట్లాడటానికి అనుమతి లేదు కానీ డిమిట్రీ, ప్రకృతి, ఇంకా ఏనిమోయిడ్ కూడా ఇదే విధంగా చెప్పి ఉంటారని నేను ఊహిస్తున్నాను.

నిజాల్ని నిర్ధారించుకోడానికి ఈ విజ్ఞులకు తమదైన మార్గాలున్నాయి.

ఈ విచారణలో ఎన్నో సుదీర్ఘ దినాలు గడిచిపోయాయి.

చివరికి తీర్పు వచ్చింది.

“మీరు ఇప్పుడు పాలపుంత గెలాక్సీలోని తటస్థ ప్రాంతంలో ఉన్నారు. మీరు హత్యలు చేశారు, ఆస్తి నష్టం కలిగించారు. కానీ మీరు భూమి మరియు కుజగ్రహపు సైన్యం ద్వారా కిడ్నాప్ చేయబడ్డారనీ, ట్రైటాన్‌కు బలవంతంగా తీసుకురాబడ్డారని గ్రహించాం. మీకు ఓ హెచ్చరికతో విముక్తి కలిగిస్తున్నాం. కానీ మీరు ఇప్పుడు ఏ రాజ్య పౌరులు కారు. మేము మిమ్మల్ని చక్రవర్తి సమూరా దళాలకు అప్పగించం. ఏదైనా గ్రహం మీకు ఆశ్రయం ఇచ్చినట్లయితే మీరు ‘అక్కడికి’ వెళ్లవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకోవాలనుకుంటే, ఆ గ్రహం వారు మీకు, డబ్బు టికెట్లు ఏర్పాటు చేస్తారు. లేకపోతే మీరు ఏమి చేయాలో నిర్ణయించుకునే వరకు మీరు ఇక్కడే ఉండవలసి ఉంటుంది. మీ గ్రహం తిరిగి వెళ్లాలని మీరు కోరుకుంటే, మీరు వెళ్ళవచ్చు. కానీ మీరు మీ గ్రహాల చట్టాలకు లోబడి విచారణని ఎదుర్కోవలసి ఉంటుంది!”

‘ఏం తీర్పు!’ అనుకున్నాను.

అన్ని పత్రాలను కోల్పోయి, ఎక్కడి వెళ్ళలేని స్థితిలో స్పేస్ ప్లాట్‌ఫామ్ జైల్లో కాలం గడుపుతున్న సమయంలో… ఏం తీర్పు ఇది అనుకున్నాను.

మేము ఎకానమీ టికెట్ పొందినప్పటికీ,  భూమికి తిరిగి వెళ్ళడానికి దాదాపు తొమ్మిది సంవత్సరాలు పడుతుంది. మేము వెళ్ళగానే, మాకు ఖచ్చితంగా జైలు శిక్ష విధిస్తారు.

“చిన్న విన్నపం యువర్ ఆనర్! నా రోబోని నాతో ఉండడానికి దయచేసి అనుమతించండి! నేను వివిధ దేశాలకు,  గ్రహాలకు ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోడంలో నాకు సాయంగా ఉంటుంది” అన్నాను.

“అనుమతిస్తున్నాం!” అన్నారు. “కానీ మీ సహచరులతో చర్చించడానికి వీలు లేదు.”

“కనీసం నేను నా భార్యతోనైనా మాట్లాడటానికి అనుమతివ్వండి” అన్నాను.

సమాధానం చెప్పేందుకు ఆ వృద్ధ న్యాయమూర్తి అనంత కాలం తీసుకున్నట్టనిపించింది.

“సరే! మానవీయ కారణాలపై అనుమతిస్తాం. మీ ఇద్దరి యోగ్యతలు మంచిగానే ఉన్నాయి.”

***

నేనూ ప్రకృతి కలుసుకోడం మొదలయ్యాకా, జైలు జీవితం మెరుగయింది. నా రోబో యురేకస్‌ని పూర్తిగా ఛార్జ్ చేసి ఇచ్చారు. అయితే, రాత్రి ఎనిమిది గంటలవుతోందని గార్డులు చెప్పగానే అప్పటిదాకా నాతో ఉంటున్న ప్రకృతి ఆమె సెల్‌కి తిరిగి వెళ్ళవలసి వస్తోంది.

మేమిద్దరం మా దురవస్థ గురించి ఆలోచించాం, యురేకస్ యొక్క విశాలమైన ఎన్‌సైక్లోపీడియాను పరిష్కారాల కోసం అన్వేషించాం.

చివరికి యురేకస్ అంది:

“మాస్టర్, మీరు మీ కేసుని వాదించేందు కోసం ఒక ఇంటర్ గెలాక్టిక్ హ్యుమన్‌రైట్స్ న్యాయవాదిని నియమించుకోవచ్చు. గెలాక్సీ కౌన్సిల్ నియంత్రణలోని అంతరిక్ష వేదిక మీద జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు మీ సొంత గ్రహం భూమికి తిరిగి వెళ్ళాలంటే ఇదొక్కటే మార్గం.”

“భూమిపైన నన్ను అరెస్టు చేస్తే? ఇది ఇప్పుడు సమూరాచే పరిపాలించబడుతుంది…?”

“ముందు అక్కడకు చేరుకుందాం. ఆ తర్వాత తప్పించుకోడానికో లేదా రక్షణకో లేదా వివరణ గురించో ఆలోచించవచ్చు… కానీ మీరు ఇప్పుడీ పని చేయకపోతే, నిరాశ్రయ శరణార్థుల గెలాక్టివ్ కౌన్సిల్ జైళ్లలో సుదీర్ఘంగా ఖైదీగా ఉండాల్సి వస్తుంది. ఇలాంటివారు నా లెక్క ప్రకారం, అన్ని ఇంటర్ గెలాక్టిక్ ప్లాట్‌ఫామ్‌లలో 2300 మంది ఉన్నారు.”

“అయితే ఒక న్యాయవాది కోసం వెతుకు, అలాంటి వ్యక్తి ఉంటే అతనికి సందేశం పంపు.”

కొంతమంది మానవ హక్కుల న్యాయవాదులు ఉన్నారు. ముఖర్జీ బిశ్వాస్ వంటి ఆసియా పేరుతో ఉన్న ఒక వ్యక్తి నాకు ఆసక్తిగా అనిపించాడు.

అతని బయో-డేటా ఆకట్టుకొనేలా ఉంది. ఇంకా ఆసక్తికరమైన అంశమేంటంటే అతను మేము భూమికి చేరుకున్నప్పుడు మాత్రమే ఫీజు తీసుకుంటాడు.

“50,000 అంతర్జాతీయ కరెన్సీ యూనిట్లు. నేను 200,000 కరెన్సీ యూనిట్లు పొదుపు చేశాను. అతని ఫీజు చెల్లించగలను” చెప్పాను.

“ఆమ్రపాలి బ్యాంకు లాకర్లో నా బంగారు ఆభరణాలున్నాయి, కొంత నగదు కూడా దాచాను. నేను కూడా సాయం చేస్తాను” అంది ప్రకృతి.

మేమింకా డిమిట్రీకి, ఏనిమోయిడ్‌కి సహాయం చేయాలి! మాతో అరెస్టు చేసిన ట్రైటాన్ సెక్యూరిటీ గార్డుల గురించి మాకు ఎలాంటి సమాచారమూ లేదు.

మొత్తానికి ఆశలు చిగురించాయి, సందేశాలు పంపుకున్నాం.

రోబో సందేశాల ద్వారా ఇంటర్ గెలాక్టిక్ న్యాయ సహాయం సాధ్యమైంది.

మా జైలు అధికారులు ఇందుకు ఒప్పుకున్నారు, 4వ సహస్రాబ్ది మానవ హక్కులు!

ఒకరోజు లేదా స్పేస్ ప్లాట్‌ఫామ్‌పై పగలని భావిస్తున్న సమయంలో బిశ్వాస్ ముఖర్జీ ఒక గెలాక్సీ గార్డుతో మా గదికి వచ్చాడు.

అతను భారతీయుడు, బహుశా బెంగాలీ మూలాలున్న వ్యక్తి కావచ్చు. బూడిద రంగు జుట్టు, కళ్ళజోడుతో సుమారు 90 సంవత్సరాల వయస్సుండే మనిషిలా ఉన్నాడు. బహుశా ఇప్పటికీ అతని లోపల దహిస్తున్న అగ్ని యేదో ఉంది.

నా హెచ్.ఓ.డి శాన్, చనిపోయిన ధరణి మామయ్య, నాకు విశ్వశక్తిని నేర్పించిన లోగోస్ నా జీవితంలో మరపురాని వ్యక్తులు… రక్షకుల, మర్చిపోలేని వ్యక్తుల జాబితాకి ఈ మనిషినీ చేర్చాలి.

“నా నివాసం భూమి అయినప్పటికీ, నేను ఇక్కడకి గనీమీడ్ నుండి వచ్చాను. అమాయకుల జీవితాలను రక్షించడంపై నాకు విశ్వాసం ఉంది. స్వేచ్ఛ, సమానత్వం ఇంకా న్యాయం! మీరు నాకు మీ కథ చెప్పండి. చట్టబద్ధంగా మీకు సహాయపడడం సమర్థనీయమో కాదో నేను నిర్ణయిస్తాను. డబ్బు నాకు రెండవ ప్రాధాన్యత మాత్రమే” అన్నాడాయన.

ఆయన నెమ్మదిగా మాట్లాడాడు. అతని ముడతలు పడిన ముఖం డజన్ల కొద్దీ రాజకీయ శరణార్థుల కష్టాలను తీర్చడంలోనూ, వారిని రక్షించటంలోని అనుభవాన్ని సూచించింది.

నాకు ఆశ ఉంది, దేవుని మీద ఇంకా మానవులపై నా విశ్వాసం తిరిగి వచ్చింది.

అసలేం జరిగిందో అంతా పూసగుచ్చినట్టు, గంటల కొద్దీ వివరంగా చెప్పుకొచ్చాను. నేను చెప్పేవన్నీ ఆయన జాగ్రత్తగా రాసుకున్నాడు, తలూపాడు.

నాకు ఆశ ఉంది. డిమిట్రీ తోనూ, ఏనిమోయిడ్‌తోనూ పదిసార్లు మాట్లాడిన తర్వాత, ఆయన ఒక రోజు ఫైళ్ళను, సిడిలు, కొన్ని కాగితాలను మోసుకొచ్చాడు.

“నేను మీ కేసును తీసుకుంటున్నాను, ఇక్కడే ఉన్న గెలాక్టిక్ రెఫ్యూజీ ట్రిబ్యునల్‌లో కేసు వేస్తాను. విశ్వశక్తిని అనే శక్తి మీకుందనీ, మీరు అమాయకులని నేను గ్రహించాను. ఇక ఏనిమాయిడ్ తన సొంత గ్రహంలోనే ఒక బాధితుడని అనిపిస్తుంది. మిమ్మల్ని బెదిరింపులతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఇదంతా కనీసం పాక్షికంగా నిరూపించబడింది. మాంత్రిక చక్రవర్తికి, అతని అధికారులకు నోటీసులు జారీ చేయబడతాయి. కానీ వారు ఈ కేసులో పోరాడుతారని నేను అనుకోవడం లేదు, ఎందుకంటే  సౌర వ్యవస్థలో కొత్తగా ఏర్పడిన సామ్రాజ్యం వాళ్లది, వాళ్ళు కొంత సౌహార్ద్రతని కోరుకుంటారు. మీరు ఇప్పుడు నాకు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ భూమికి చేరుకున్నాక వెంటనే మీరు నా బ్యాంకులోకి డబ్బు బదిలీ చేయాలి. మీరు ఖైదు చేయబడే అవకాశం ఉంది, కానీ గెలాక్టివ్ కౌన్సిల్ నుండి మిమ్మల్ని అరెస్టు చేయకూడదనే వారెంట్‍ని తీసుకుంటాను.”

“కానీ మమ్మల్ని చంపేయచ్చు” అన్నాను. “అందుకే నేను ఒక విల్లు వ్రాసిస్తాను. అక్కడ నా బ్యాంకులో ఉన్న నగదుని మీకు రాసిస్తాను. ధన్యవాదాలు. భైరవస్వామి మిమ్మల్ని అనుగ్రహించు గాక!” అన్నాను.

ఈ విధంగా జైలు శిక్ష ముగిసింది, కేసు విచారణ ప్రారంభమైంది. అనేక నెప్ట్యూన్ – ప్లూటో గంటల అనంతరం ఒక రోజు తీర్పు వచ్చింది.

చిట్టచివరికి మాకు స్వేచ్ఛ లభించింది. నేను బిశ్వాస్‌ని హత్తుకున్నాను.

“మిమ్మల్ని అరెస్టు చేయద్దనీ, మీ ఇళ్ళకి చేరుకోవటానికి అవసరమైన అన్ని పత్రాలను జారీ చేయాలన్న ఆదేశాలతో మీరు కేసు గెలిచారు. మీరు రక్షిత జాతులు, ఎందుకో తెలుసా? పిసియుఎఫ్ లను లేదా జన్యుపరంగా శక్తివంతులైన వారినీ తాంత్రికులు లేదా మాంత్రికులను సౌర వ్యవస్థలో రక్షిత జాతులుగా ప్రకటిస్తూ సమూరా స్వయంగా కొత్త చట్టాలను చేశాడు. అతని సొంత చట్టమే మిమ్మల్ని రక్షించింది” చెప్పాడు బిస్వాస్.

“కానీ ఇప్పటికే 10 సంవత్సరాలు ముగిసాయి, భూమికి చేరడానికి మరో 9 ఏళ్ళు పడుతుంది” అన్నాను. “మేము మా స్నేహితులనీ, భూమి మీద జీవితాన్ని, ఇంకా రహస్యంగా ఉంటున్న ఎర్త్ కౌన్సిల్ అధికారులను కూడా కోల్పోతాం…” అన్నాను.

దీర్ఘాలోచనలో పడినట్టుగా బిశ్వాస్ ముఖం మరింత ముడతలు పడింది.

“మూడు రెట్లు ఎక్కువ చెల్లిస్తే మీరు హైపర్ స్పేస్‌లో ప్రయాణించే ఒక టేకియన్ వ్యవస్థ విమానం అందుకోవచ్చు. మీ వద్ద డబ్బు ఉంటే, నేను టికెట్లను స్పాన్సర్ చేస్తాను. తరువాత నాకు తిరిగి చెల్లించండి. అప్పుడు మీరు ఒక వారంలో భూమిని చేరవచ్చు” చెప్పాడు బిశ్వాస్.

నలుగురికి, మూడు రెట్లంటే…. పెద్ద మొత్తమే! పైగా న్యాయవాది రుసుము కూడా చెల్లించాల్సి ఉంది. నేను భూమికి చేరుకున్నప్పటికి చేతిలో పూచిక పుల్ల లేకుండా అయిపోతాను!

నేను కొంతసేపు ఆలోచించాను. “సరే. నా జీవితమంతటినీ మళ్లీ ప్రారంభించవలసి ఉంటుంది. నేను చేయగలను. నేను చెల్లిస్తాను. మాకు టేకియన్ హైపర్ స్పేస్ ద్వారా టికెట్లను కొనండి. మాకు స్వేచ్ఛ కావాలి” అన్నాను.

నా మనస్సులో మాత్రం “ప్రతీకారం!” అనుకున్నాను మొదటిసారిగా.

***

ప్రాచీన కాలంలో వలె, కోర్టు విచారణలకు 4వ సహస్రాబ్దిలో కూడా చాలా కాలం పట్టింది. సుదీర్ఘ వాదనలు, సాక్ష్యాలు, ధ్రువీకరణ, వాయిదా వేయడం, విచారణలు, గెలాక్టిక్ కౌన్సిల్ ప్రాసిక్యూటర్ క్రాస్ ఎగ్జామినేషన్స్, ఇవన్ని వారి సమయం అవి తీసుకున్నాయి.

“మీకు స్వేచ్ఛ లభిస్తుంది!” అంటూ బిశ్వాస్ ఎల్లప్పుడూ నమ్మకంగా ఉన్నాడు. “ఎందుకంటే గెలాక్టిక్ కౌన్సిల్ ప్రాసిక్యూటర్లు, న్యాయమూర్తులలో ఒక వంతు స్వాభావికంగా తాంత్రికులు, వారు మీ పట్ల సానుభూతితో ఉన్నారు.” అనేవాడు.

సూర్యోదయం జరగని ఓ ఉదయం పూట సుదూర నెప్ట్యూన్-ప్లూటో ప్లాట్‌ఫామ్ యొక్క కృత్రిమ దీపాల వెలుగులో, న్యాయమూర్తులు తీర్పు వెల్లడించారు. “నేరస్తులు కారు, కానీ పరిస్థితుల దృష్యా, సౌర వ్యవస్థని ఆక్రమించిన మాంత్ర్రిక దళాల ద్వారా బ్లాక్‌మెయిల్ చేయబడడం వల్ల మాత్రమే నేరం చేశారు” అని తీర్పు చెప్పారు.

“ఇది గ్రహాల వ్యవస్థ అంతర్గత వ్యవహారం కాబట్టి, మేము గ్రహాల వ్యవస్థలో ఒక యుద్ధ నైతికత లేదా అనైతికతలోకి వెళ్ళలేము. యుద్ధంలో చిక్కుకున్న ఈ ఖైదీలను విడుదల చేయవలసి ఉంటుంది. వారు చేసినదంతా బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌కి గురై చేసినవే. కాబట్టి వారి గ్రహాలకు వెళ్ళడానికి విడుదల చేయవచ్చు. యుద్ధ ఖైదీల మానవ హక్కుల సంస్థలతో మేము వారు వారి ఇళ్లకు చేరుకోవటానికి సహాయం చేస్తాము. గెలాక్టిక్ కౌన్సిల్ మరియు రెగ్యులేటరీ కౌన్సిల్ అఫ్ నెప్ట్యూన్ – ప్లూటో స్పేస్ ప్లాట్‌ఫామ్ వారి నియమాల ప్రకారం తగిన సహాయాన్ని పొందవచ్చు. భూమిపై సరైన డాక్యుమెంట్లను అందించడానికి సూచనలతో మీకు ‘నో అరెస్ట్’ ఆర్డర్ జారీ చేయబడుతుంది.”

ఈ విధంగా చివరికి స్వేచ్ఛ లభించింది, జైళ్లకి వెళ్ళడం, రావడం; బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ నాకేమీ కొత్త కానప్పటికీ;  ఈ అపరిచితుడి నుండి నేను పొందిన సహాయం మరువరానిది. ప్రతి చెడుకీ ఈ విశ్వంలో ఒక మంచి పరిష్కారం ఉంది. ఇది ఆయా శక్తులను సమన్వయం చేయడానికని నేను భావించాను.

యురేకస్‌తో కలసి ప్రయాణీకుల నిష్క్రమణ ప్రాంతాలలో మళ్ళీ నడుస్తూ వెళ్ళి నెప్ట్యూన్-ప్లూటో అధికారిని కలుసుకున్నాము. అతను మమ్మల్ని కార్యాలయంలోకి తీసుకువెళ్లారు.

“మీకు సుప్తావస్థ సౌకర్యంతో సాధారణ ఎకానమీ క్లాస్ టికెట్లు ఇస్తాం” అన్నాడతను.

“ఓహ్, వద్దు! అలాగైతే మా ఇంటికి వెళ్ళడానికి ఒక దశాబ్దం పడుతుంది!” అంటూ అరిచింది ప్రకృతి.

డిమిట్రీ నాకేసి చూసింది. “నాదీ అదే అభిప్రాయం. కానీ నేను నీతోనే వస్తాను. అక్కడ ప్రతిఘటన జరుగుతుందని విన్నాము. నేను బదులు తీర్చుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయి. కానీ ముందుగా నా తండ్రిని చూడాలి” అంది.

బిశ్వాస్ నల్లటి కోటు, తెల్లని ప్యాంటు ధరించి ఉన్నాడు.

“హైపర్ స్పేస్‌లో మీకు టికెట్లు నా సంస్థ ద్వారా అందుతాయి. దీని గురించి నేను ముందే ఆలోచించాను. మీరు ఎకానమీ క్లాస్ తీసుకోండి, మిగతా అదనపు మొత్తాన్ని తర్వాత నాకు చెల్లించండి. అప్పుడు మీరు కొన్ని రోజుల్లో ఇంటికి చేరుకోవచ్చు. గనీమీడ్ మీద, టైటాన్ యొక్క క్యాసిని ప్లాట్‌ఫామ్‌పైన ఆగుతుందీ విమానం” చెప్పాడు బిశ్వాస్.

డిమిట్రీ తన తండ్రినీ, తమ్ముడిని చూడడానికి ‘క్యాసిని’ వద్ద దిగిపోవాలని, తరువాత భూమిపై మాతో చేరాలని నిర్ణయించాము. ఏనిమాయిడ్ నాతోనే ఉంటానన్నాడు. యురేకస్‍ని పూర్తిగా ఛార్జ్ చేశాము.

“బిశ్వాస్ గారూ, మీకు ధన్యవాదాలు. నన్ను నమ్మండి, మేము భూమికి చేరగానే మీ ఫీజుని చెల్లించేస్తాను. మీరు మమ్మల్ని రక్షించారు!” అన్నాను.

“కానీ ‘మానవ హక్కుల’ పట్ల నాకు ఆసక్తి మెండు. నేను గ్రహాల ప్లాట్‌ఫామ్‌ల మీదా, గెలాక్సీ కోర్టుల వద్దా తిరుగుతుంటాను. వ్యవస్థలకు బలయిన, అర్హులైన అమాయక బాధితులను రక్షిస్తాను.”

తన లక్ష్యానికే అంకితమైన వృద్ధ న్యాయవాది కనుమరుగయ్యే వరకు చూసి, మేము హైపర్ స్పేస్ గేటు వైపు నడిచాం.

ఇప్పుడు, నక్షత్ర వ్యవస్థల మధ్య హైపర్ స్పేస్ విమానాలు అసాధారణం కాదు, అయినప్పటికీ, అవి భూ గ్రహవాసులకు, నా లాంటి అల్పాదాయ సమూహాలకు మాత్రం అత్యంత ఖరీదైనవి. నేను వారి గురించి విన్నాను, కానీ వాటిలో ఎన్నడూ ప్రయాణం చేయలేదు. ఆకాశంలో ఒక విమానం చూసినా, జీవితకాలంలో ఎన్నడూ విమానం ఎక్కే అవకాశం పొందలేని 20వ శతాబ్దపు గ్రామీణుడి పరిస్థితే నాదీనూ. పరిస్థితులు, అదృష్టం కలిసొచ్చి, కాంతివేగంతో ప్రయాణించే హైపర్ స్పేస్ విమానంలో ప్రయాణించే అవకాశం మాకు లభించింది. దీనివల్ల ప్రయాణ వేగం అధికమై, ప్రయాణ సమయం తగ్గుతుంది.

విమానానిది పెద్ద దీర్ఘవృత్తాకార నిర్మాణం. మాకు మా సీట్లు చూపించారు, సూచనలు ఇచ్చారు. వింత ఆకారాలు గల గ్రహాంతర  జీవులున్నారు. పొడవాటి శరీరం, రెండు నేత్రాల మధ్య అసాధారణ దూరం, కోసుగా ఉన్న చెవులతో స్టెవార్డ్ ప్రత్యక్షమయ్యాడు. విమానం కెప్లెర్ వ్యవస్థ నుండి ఆండ్రోమెండా గెలాక్సీలో సిరియస్ నక్షత్ర వ్యవస్థకు వెళుతోందని చెప్పాడు.

మనసుకి అందని దూరాలని కాంతి సంవత్సరాలలో కొలుస్తారు. మా ప్రయాణం అత్యంత వేగంగా సాగింది.

భూమికి వెళ్ళేందుకు అటువంటి విమానమే మేము ఎక్కాం. కాసేపటికి గోళాకారపు షటిల్ గుండ్రంగా తిరిగింది. చిన్న కుదుపు వచ్చినట్లయ్యింది. హోలోగ్రాఫిక్ అక్షరాలతో మా ముందు “హైపర్ స్పేస్” అన్న సంకేతం, కొన్ని సూచనలు కనబడ్డాయి.

“మీకు తల తిప్పడం, వికారం, దృష్టి మసకబారడం జరుగుతుంది. విశ్రాంతి తీసుకోండి. మీ సీట్ల ముందు వెర్టిగోకి, వాంతులకి మందులున్నాయి. తీసుకోండి. త్వరలో సర్దుబాటుకుంటుంది. అధిక రక్తపోటు ఉన్నవారు, షటిల్ వైద్యులనుంచి వైద్య సేవల సహాయం కోసం రెడ్ బటన్ నొక్కండి.”

కాసేపు అంతా మసక. నేను ఫోటాన్ల ద్రవ్యరాశిగా మారిపోయాను. ఎర్ర చీర ధరించిన ప్రకృతి, తలపై యాంటెనాతో ఉన్న డిమిట్రీ బూడిద రంగులో మసకగా కనిపించారు. తర్వాత సమయం గడిచిపోయింది. మనసంతా శూన్యం. ఎంత సమయం గడిచిందో చెప్పడం కష్టం.

“సాధారణ స్పేస్‌లోకి దిగుతున్నాం” అని ఎర్ర రంగు హోలోగ్రాఫిక్ అక్షరాలు మా ముందు ప్రత్యక్షమయ్యాయి.

కాసేపటికి మేము సాధారణ స్పేస్ ప్రయాణంలో వచ్చేశాం.

“క్యాసిని స్పేస్ ప్లా‍ట్‌ఫాంపై దిగుతున్నాం. టైటాన్, ఎన్‌సెలాడస్‌కు వెళ్ళేవారు దిగడానికి సిద్ధంగా ఉండాలి. ఈ ప్రయాణీకులకు ప్రత్యేక గమనిక… మిస్ డిమిట్రీ పొసయిడన్, మిస్టర్ సోలోఖోవ్…” అంటూ ప్రకటన ఇంటర్‌కామ్‌లో వినబడింది.

చివరగా నేను డిమిట్రీకి వీడ్కోలు పలికాను.

“భూమి మీద జరిగే ప్రతిఘటనకి నువ్వు తిరిగి రావాలి” అని భావోద్వేగంతో, కన్నీళ్ళతో చెప్పాను.

“తప్పకుండా. నీతో సంప్రదింపులు కొనసాగిస్తా. వీలైతే, చివరి యుద్ధం కోసం నేను మా నాన్ననీ, తమ్ముడిని కూడా తీసుకువస్తాను!” అంది.

తర్వాత మళ్ళీ హైపర్ స్పేస్‌లోకి… ల్యాండిస్‌ పైన కొద్ది సేపు ఆగి… మళ్ళీ ప్రయాణమై జుపిటర్ స్పేస్ ప్లాట్‌ఫాంపై ఆగి, చివరికి భూమి యొక్క లా టెరె స్పేస్ ప్లాట్‌ఫామ్ చేరాము.

“భూమికి వెళ్ళాల్సిన ప్రయాణీకులు దిగడానికి సిద్ధంగా ఉండండి! మేము ఇక్కడ కొద్దిసేపే ఉంటాం. కాబట్టి మిగతా ప్రయాణీకులు వారి స్థానాల్లోనే ఉండాలి. ఇక్కడి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, మీ భద్రత కోసమే ఈ నిర్ణయం. స్నాక్స్ లోపలికే వస్తాయి. మీరు మరో 3 గంటల్లో సన్ స్టార్‌ని దాటి ఆండ్రోమెడా గేట్ వే వద్ద మాత్రమే దిగుతారు” అంటూ ప్రకటన వచ్చింది.

మా పేర్లను ప్రకటించినప్పుడు మేం దిగి, టెర్మినల్ గుండా లా టెర్ ప్లాట్‌ఫామ్ పైకి నడిచాము.

“హనీ ఆమ్రపాలి, ఏనిమోయిడ్ క్వాడ్రిపెడియస్, ప్రకృతి ఆమ్రపాలి, రోబో యురేకస్ 7776… మీరు బయటకి నడవాలి. టేకియాన్ కంపెనీ యొక్క హైపర్ స్పేస్‌తో ప్రయాణించినందుకు ధన్యవాదాలు. మీ గమ్యానికి సురక్షితంగా చేరుకోండి!”

చివరిగా మేము బయటికి నడుస్తున్నప్పుడు వినిపించిన ఈ ప్రకటన మా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తోంది.

భూమిని వదిలి – నెప్ట్యూన్‌కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి – భూమి కాలమానం ప్రకారం 13 సంవత్సరాలు పూర్తయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here