అధ్యాయం 51: అఘోరియా
చివరికి నేను – ప్రకృతి, నా అతిథిగా అంగీకరించబడిన ఏనిమాయిడ్, రోబో యు-7776 లతో కలిసి 888 ప్రాంతంలోని పాత ఢిల్లీ విమానాశ్రయంలో దిగాను, దీన్ని ఇప్పుడు స్వామి భూతనాథ్ విమానాశ్రయం అని పిలుస్తున్నారు. మునుపటి పేరు ‘వీర ఇంటర్నేషనల్’ని మార్చేశారు.
గ్రామీణ ప్రాంతాలలో తాంత్రిక పాలకులు చేసిన విధ్వంసం, వినాశనం గురించి, వాళ్ళ ఆధిపత్యం గురించి చెప్పాలంటే – 20వ శతాబ్దానికి చెందిన కవులు, గొప్ప రచయితల పదాలను నేను అరువు తెచ్చుకోవాలి.
దెయ్యాల పాలనలో చీకటి, అంధవిశ్వాసాలు రాజ్యమేలుతునట్లు అనిపించింది. ఇది అత్యంత దైన్య స్థితిలా తోచింది.
ఎర్రని కళ్ళు, కొమ్ములతో ఉన్న ఓ పెద్ద తల ఆకారం విమానాశ్రయం భవనంపై ఉంది. నల్లటి దుస్తులతో, తలపై పుర్రెలను టోపీలుగా ధరించిన గార్డులు ఉన్నారు. కొందరి మెడల్లో పుర్రెల దండలు కూడా ఉన్నాయి. వారు ఆధునిక తుపాకులను పట్టుకున్నారు, కాని వాళ్ళ నడుముల్లో దోపుకున్న నల్ల మంత్రదండాలు నాకు కనబడ్డాయి. ఒకవేళ తుపాకులు విఫలమైతే, వాటిని ఉపయోగిస్తారు.
ఇమ్మిగ్రేషన్ అధికారులు నల్లటి దుస్తులు ధరించిన మాంత్రికులు. చూడ్డానికి క్రూరంగా కనబడుతున్నారు. ప్రయాణీకులు మాంత్రికులో కాదో తెలుసుకునేందుకు డి.ఎన్.ఎ. ముద్రణ యంత్రాలు, రెటీనా చెకింగ్ యంత్రాలు ఉన్నాయి.
అవును, మాంత్రికుడు, మంత్రగత్తె అనే పదాలు మళ్ళీ గౌరవప్రదమైనవిగా మారాయి. పురాతన కాలం యొక్క పిసియుఎఫ్ అనే పదాన్ని ఇప్పుడు వాడడం లేదు.
“జై సమూరా!” అన్నాడో అధికారి. “తనిఖీ కోసం వెళ్ళండి!”
ఇక మేము నిజంగా మాంత్రికులమని నిరూపితమయ్యాక, అతను ఇలా అన్నాడు: “మీరు వెయ్యి నక్షత్రాల సామర్ధ్యపు మాంత్రికులని నిర్ధారించాము. మీ చరిత్ర ధ్రువీకరించబడింది. మీరు మహనీయ చక్రవర్తి సీక్రెట్ సర్వీస్ యొక్క కావలసిన వ్యక్తుల జాబితాలో ఉన్నారు. మీకు పౌరసత్వం లభిస్తుంది, అయితే మీరు ఆమ్రపాలి గ్రామానికి వెళ్ళే ముందు మిమ్మల్ని ప్రశ్నించాలి.”
“కానీ మేము ‘భూమి’ పౌరులం, ‘ఆమ్రపాలి’ వాసులం మిత్రమా” అని నేను నిరసన వ్యక్తం చేశాను. “మేం ఇక్కడికి వచ్చి దాదాపు పదేళ్ళయ్యింది. ఈ గ్రామంలోని మామగారిని, ఇతర బంధువులని వెంటనే చూడాలి” అన్నాను.
ఆ ముసలి మాంత్రికుడు ఏదో గొణిగి, ‘ఇంటలిజెన్స్ పోలీస్’ అని రాసి ఉన్న ఓ గదివైపు చూపించాడు.
“అక్కడికి వెళ్ళు! వీలైనంత తొందరగా మిమ్మల్ని వదిలివేయడానికిని ప్రయత్నిస్తాము” అని ఇకిలిస్తూ, “అది కూడా మీరు ప్రమాదకారులు కాదని మేము తెలుసుకుంటేనే!” అన్నాడు
ఆ గదిలో ఆధునిక కంప్యూటర్లు, హోలోగ్రాఫిక్ మానిటర్, వర్చ్యువల్ స్క్రీన్ ఇంకా పురాతన తాంత్రికుల మెరిసే అద్దం ఉన్నాయి. వీటని నేను అరుణ భూములలో చూశాను. సమూరా తన సామ్రాజ్యంలో – పురాతన మాంత్రిక ఆచారాలను, ఆధునిక విజ్ఞాన సాంకేతికని మిళితం చేసినట్లుంది. మా జీవిత చరిత్ర యొక్క పరీక్షలు మరియు సమీక్ష ప్రారంభమైంది.
తలపై రెండు కొమ్ములు, కోసుగా ఉన్న చెవులతో చూడ్డానికి భయంకరంగా ఉన్న ఓ యువకుడు చెప్పాడు: “మీరు చక్రవర్తి చేత రహస్యంగా నియమించబడ్డారు. మీరు చంద్రుడు, గనీమీడ్, టైటాన్, వీనస్ యొక్క ‘లాండిస్, ఇంకా నెప్ట్యూన్-ప్లూటో వరకు వెళ్ళారు.
మీరు అప్పటి వరకు దోషరహిత ప్రవర్తననే కలిగి ఉన్నారు. కానీ విధ్వంసం ఆరోపణలపై మిమ్మల్ని పట్టుకున్నారు. ‘కోర్ట్ ఫర్ స్టేట్‌లెస్’ ద్వారా విచారించబడ్డారు. అమాయకులుగా నిరూపించబడ్డారు. ట్రైటాన్‌లో మీరేం విధ్వంసం చేశారు?” అడిగాడు.
నా మనస్సు వేగంగా పరుగులు తీసింది. ప్రకృతి ఏదో చెప్పబోతుంటే నేను ఆమెని ఆపాను.
ట్రైటాన్‌లో జరిగినదేదీ ఈ కంప్యూటర్లో నమోదవలేదనేది స్పష్టమవుతోంది.
ఒకటి, అక్కడ మేము అన్ని సమాచార వ్యవస్థలను నాశనం చేసాము. రెండు, మాతో వచ్చిన సెక్యూరిటీ గార్డులందరిని బంధించి నెప్ట్యూన్ – ప్లూటో స్పేస్ వేదికపై చంపేశారు. బహుశా మా తిరుగుబాటుకు సంబందించి ఏ సమాచారమూ లేదు, నేను త్రికాల గ్రంథాన్ని చదివిన సంగతీ ఎవరికీ తెలియదు.
చాలా దూరంలో ఈ ఘటనలు జరగడం లేదా సమాచార మార్పిడిలో ఆలస్యం ఇందుకు కారణం కావచ్చు. మేము హైపర్ స్పేస్ ద్వారా ప్రయాణించి తొందరగా వచ్చాము.
“మేమంతా పరిశుద్ధులం. మేము సమూరాకు, అతని ప్రతినిధులకు విధేయులుగా ఉన్నాం. వారు చెప్పినట్టే చేశాం. మమ్మల్ని అనేక సంవత్సరాల పాటు ట్రైటాన్‌పై వదిలేశారు. అందుకే మేము ఒక షటిల్ తీసుకుని తప్పించుకున్నాం. అంతే. మేమే తప్పు చేయలేదు” చెప్పాను.
యూనివర్సల్ కమ్యూనికేషన్ మిర్రర్, మంత్రదండం, గ్లోబ్ వంటి ప్రాచీన అద్భుత వస్తువుల గురించి ఏ వివరాలు నమోదు కాలేదు. అలాగే వాటి కోసం మా అన్వేషణ గురించి కూడా!
“సరే! మీరు దోషరహితంగానే ఉన్నారు. కానీ మేము మిమ్మల్ని గమనిస్తూంటాము. ఇంకా న్యూ హోప్ సెంట్రల్ విజార్డ్ కమాండ్‌కి ఒక నివేదికను పంపుతాము. మీరు మీ ప్రదేశాలకు వెళ్ళవచ్చు” అన్నాడా యువకుడు.
దాంతో మేము విమానాశ్రయం నుండి బయటపడి, ఆమ్రపాలి వెళ్ళేందుకు ఒక బస్సు ఎక్కాము. ఒక మాంత్రికుడిగా నా స్థితి నాకిప్పుడు సహాయం చేస్తోంది. కానీ అనేక బాధలకు గురువతున్న తోటి మానవుల పట్ల నా హృదయంలో వేదన. ఎటుచూసినా వ్యాకులత. ఎండిన పొలాలను, ఆకుల్లేని చెట్లను చూస్తున్నాను. మనుష్యులనే ఎద్దుల్లా కాడికి కట్టి భూమిని దున్నిస్తున్న మాంత్రికులను చూశాను. అనేక గ్రామాలలో స్త్రీపురుషులు జీవచ్ఛవాలుగా నడవడం చూశాను. వివిధ దుస్తులలో… నలుపు, ఎరుపు, పసుపు, చారల దుస్తులలో ఉన్న తాంత్రిక దళాలు – మంత్రదండాలు, తుపాకులతో చాలా గ్రామాలలో మొత్తం జనాభాను నియంత్రించడం చూశాము.
రహదారి శిథిలమైపోయింది. ఇకపై ఇది ‘మాగ్-లెవ్’ ఎనిమిది లేన్ సిస్టం కాదు. సాధారణ ట్రక్కులు, ఎడ్ల బండ్లు పరుగెత్తుతున్న పది లేన్‌ల మామూలు రహదారి ఇది.
బస్సంతా చాలావరకు మానవ ప్రయాణీకులతో నిండివుంది. కృశించిన ముఖాలు, బూడిద రంగు జుట్టు, జీవంలేని లోతైన కళ్ళతో ఉన్నారు జనాలు. వాళ్ళ ముఖాలపై చిరునవ్వు లేదు, అసలు వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు.
ప్రతి స్టాపు వద్ద డ్రైవర్ ధ్యానం చేస్తున్నాడు. “మిత్రులారా! మీరూ ప్రార్థన చేస్తారా? ఏదైనా ఆహారం తీసుకుంటారా?” అని అడుగుతున్నాడు.
ఒకప్పటి ‘హైవే ఔల్’, ‘నైట్ పీకాక్’ రెస్టారెంట్లు ఇంకా ఉన్నాయి. కానీ మనుషులెవరూ క్రిందకి దిగలేదు; మేము మాత్రమే దిగాం. మాంత్రికులుగా మాకు ప్రత్యేక హక్కు ఉందని అనుకుంటున్నాను. ఇది ఒక వింత అనుభూతి. మేము వెళ్లి ‘హైవే ఔల్’ రెస్టారెంట్‍లో ఆహారం తీసుకున్నాం. కొరడా దెబ్బల శబ్దాలు, కేకలు వినపడి మేము బయటకు వచ్చి చూశాం. తలపై ఉన్న టోపీలపై శ్రిశూలం గుర్తులున్న మాంత్రిక గార్డులు – అర్ధనగ్నంగా, కృశించిన శరీరాలతో డజను మందికి పైగా ఉన్న గ్రామస్తులను కొరడాలతో కొడుతున్నారు. వాళ్ళేమో రక్తం కారుతున్న గాయాలతో, క్షమించమని కనికరం చూపమంటూ వేడుకుంటున్నారు.
“జై జై సమూరా! ఇకపై హోటళ్ళ నుండి ఆహారం దొంగిలించకుండా ఉండాలంటే మీకు ఈ మాత్రం దెబ్బలు పడాలి. అప్పుడే మీరు నేర్చుకుంటారు!”
మా ప్రయాణం మొత్తం ఇలాంటి దృశ్యాలతోనే… మానవజాతి అవమానాలను ఎదుర్కోడం, మాంత్రికుల క్రూరమైన పాలన దృష్టాంతాలతో నిండిపోయింది.
అవును, గ్రామీణ ప్రాంతాలలో ఆధిపత్యం నెరపుతున్న కొత్త ఉపాసకుల బృందాలను చూస్తున్నాను. “అఘోరా సెంటర్స్ ఫర్ మెడిటేషన్”, “అఘోరా సెంటర్స్ ఫర్ వర్షిప్”, “ది అఘోరా సెంటర్స్ ఫర్ కమ్యూనిటీ డైనింగ్”.
నేను వణికిపోయాను. పురాతన కాలంలో భారతదేశంలోని అఘోర సాధువులు – శ్మశానాలలో ఉంటూ, చనిపోయిన వారి వస్త్రాలను ధరించడం, మృతదేహాల మాంసాన్ని తినడంలో ప్రసిద్ధి చెందారు. అది మోక్షానికి ఒక మార్గం అని వారు నమ్మారు. ప్రాపంచిక సుఖాలను విడిచి, నగ్నంగా సంచరిస్తూ, శ్మశానంలో దొరికినవి మాత్రమే తినడం వాళ్ళ ఆచారం.
వాళ్ళు ఇప్పుడు భూమిని ఆక్రమించారా? వారు ఇప్పుడు కూడా మనుషులను తింటున్నారా?
యురేకస్ యియర్ ఫోన్‌లో నాతో చెప్పింది:
“మాస్టర్! ఇప్పటి పాలకులు అఘోరాలే. కాని వాళ్ళ ఒకప్పటి అఘోరాల పేరుని మాత్రమే స్వీకరించారు, కానీ పద్ధతులు మార్చబడ్డాయి. నిగూఢ శక్తులైన ‘అష్టసిద్ధులు’ వారి ఆధీనంలో ఉన్నాయి. వారు మానవులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సహాయపడినందుకు సమూరా నుండి దక్షిణాసియాను కానుకగా పొందారు.”
బస్సులో నేను గత దశాబ్దపు వార్తాపత్రికలు, చిత్రాలను బ్రౌజ్ చేసాను. న్యూయార్క్ నగరంలోనూ, ఢిల్లీలోనూ అర్ధరాత్రి విప్లవాలు సంభవించాయి. సమూరాకు విధేయులు, విశ్వాసపాత్రులు అయిన తాంత్రికులు అణ్వాయుధ స్థావరాలను, సైన్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సైనిక, వైమానిక దళం మరియు నౌకాదళంలోని కీలకమైన అధికారులకు మరణశిక్ష విధించారు.
ఎర్త్ కౌన్సిల్ యొక్క రాజకీయ వినాశనం 31 డిసెంబరు 3572 క్రీ.శ. నాడు సంభవించింది. చివరిగా భూమిపై ప్రభుత్వాన్ని ఆక్రమించుకున్నారు.
ఆ తర్వాత పరిశ్రమలు వారి ఆధీనంలోకి వెళ్ళాయి, స్టాక్ మార్కెట్ కొత్త శక్తులకు విధేయతను ప్రకటించింది.
సమూరా ఇప్పుడు చంద్రుడు, టైటాన్, గనీమీడ్, లాండిస్, ఇంకా అన్ని స్పేస్ ప్లాట్‌ఫామ్‌లకు కమాండర్. అతనికి వ్యాపారం లేదా విద్య లేదా వ్యవసాయం అనే భావన పట్టవు. బానిసలతో పనిచేయిండడం, ఇతర గ్రహాల నుండి వస్తువులను కొనడం మాత్రమే తెలుసు. అతీంద్రియ, ఆధ్యాత్మిక, తాంత్రిక శక్తులని పిలవబడే శక్తులను ఉపయోగించుకోవడమే అతడి ఏకైక పరిజ్ఞానం.
“తాంత్రికులైన వారు యజమానులు. రెండు కాళ్ళు, రెండు చేతులు, ఒక తల ఉన్న సాధారణ మానవులు మాకు బానిసలు. వారు పొలాలలో, కర్మాగారాలలో పని చేసి ఉత్పత్తి చేయాలి. ఆఁ, వారికి మరో విధి ఉంది, అదే పునరుత్పత్తి. అవును, పని చేయలేని వారు, పునరుత్పత్తి చేసి జనాభాని పెంచలేనివారు… వృథా. వారిని అంతమొందిస్తాం.” – 1 జనవరి 3573 న చక్రవర్తి ఉపన్యాసం.
ఎటువంటి వ్యతిరేకత లేదు. రాజకీయవేత్తలు, సైనికాధికారులు, శాస్త్రవేత్తలు పారిపోయారు లేదా దాక్కున్నారు. వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, రైతులు, కార్మికులు అందరూ సమూరాకి లొంగిపోయారు. ఆర్ధిక వ్యవస్థ ఏదోలా నడుస్తోంది.
సైనికులను, రక్షణ దళాలను తాంత్రిక శక్తులు ఆదేశిస్తున్నాయి. సాధారణ సైనికులు వారికి విధేయత చూపారు.
ఒక సంవత్సరం క్రితం, యువరాణి సయోని చనిపోయింది.
అమరుడైన సమూరా ఇప్పుడు కుజుడి అరుణభూములు, భూమి యొక్క న్యూ హోప్ సిటీ మధ్య తిరుగుతూ చేత్తో మంత్రదండంతో ఓ నియంతలా పాలిస్తున్నాడు. ఇదంతా భూమి మీద తాంత్రిక సామ్రాజ్యం గురించి యురేకస్ హార్డ్ డిస్క్‌కి అనుసంధానించబడిన ఐజి నెట్‌లో నేను చదివిన కథ!
ఇక ఈ సామ్రాజ్యం ఇటీవలే గెలాక్టిక్ కౌన్సిల్ ద్వారా పునః గుర్తింపు పొందింది. ఇది వస్తుతః రాజకీయ నిర్ణయం. ఏ ప్రాంతం ఎవరి నియంత్రణలో ఉంటే వారే ఆ ప్రాంతం పాలకులవుతారు. బస్సు పెద్దగా శబ్దం చేస్తూ చీకటి రాత్రిలో ముందుకు సాగుతోంది. దాని హెడ్లైట్లు రోడ్డుకిరువైపులా ఉన్న చెట్లపై నీడలు ప్రసరిస్తున్నాయి. ఎట్టకేలకు నేను ఆమ్రపాలికి వెళ్తున్నాను. ఈ ఘోరమైన ప్రయాణంలో చీకటి రాత్రి ముగిసే సమయానికి నాకు కాస్త నిద్ర పట్టింది.
ఇది స్థానభ్రంశం చెందిన భూమా? లేదంటే దీన్ని నేను అఘోరియా అని పిలవనా?!
(సశేషం)