భూమి నుంచి ప్లూటో దాకా… -19

0
4

అధ్యాయం 54: ఆహ్వానం

గాయపడిన మనసులకి సాంత్వన, అలసిన శరీరాలకి విశ్రాంతి కల్పిస్తూ మేము ఆమ్రపాలిలో కొన్ని రోజులు గడిపాం. మా క్రుంగుబాటును ఎదుర్కుంటూ, భూమిలో తారుమారయిన పరిస్థితులను అర్థం చేసుకుంటున్నాం.

మహా తన ఇంటికి వెళ్ళిపోయారు. నేను ప్రకృతితో కలసి మా నాన్న ఇంట్లో బస చేసి మా తదుపరి కార్యక్రమం గురించి ఆలోచించసాగాను.

నాకు ఆశ్చర్యం కలిగించిన అంశం ఏంటంటే – భూమి మీద నివసించడం ఏనిమాయిడ్‌కి ఎందుకో బాగా సంతోషంగా ఉంది. అతను గ్రామమంతా తిరుగుతున్నాడు. చుట్టుపక్కల ప్రాంతాల గురించి ఆరా తీస్తున్నాడు. గ్రహాంతరవాసి కావడం, మాంత్రికుడు కావడంతో అతనికి విశిష్ట హోదా కల్పించబడింది.

నాకు టీవీ, ఐజి నెట్, ఇంకా వారం వారం వచ్చే వార్తాపత్రికల ద్వారా వార్తలు తెలుస్తున్నాయి.

ఇండికా సెంట్రల్ ఇప్పుడు “సమూరా పారానార్మల్ రీసెర్చ్ సెంటర్“గా మారింది. మిస్టర్ శాన్ సజీవంగా ఉంటాడనే ఆశ దాదాపుగా పోయింది. ఇతర ప్రొఫెసర్లని ఫోన్ లేదా నెట్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను, కానీ ఫలితం లేదు. అయితే నేను నా బ్యాంకు ఖాతాని ఉపయోగించుకోగలిగాను. నాకు విముక్తి కల్పించినందుకు బిశ్వాస్ గారికి న్యాయవాది రుసుం చెల్లించాను.

మాంత్రికుల పాలన వ్యతిరేకంగా తిరుగుబాటుకు నన్ను ఏ ఒక్క మానవుడైనా సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాడేమో తెలుసుకునేందుకు ఐజి నెట్‌నీ, ఇంకా విశ్వవ్యాప్తంగా లభించే అన్ని సిగ్నల్స్‌నీ పరిశీలించమని యురేకస్‌ని ఆదేశించాను. ఇది దాదాపు 21వ శతాబ్దంలో ఎస్‌ఇటిఐ (సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్) అనే సంస్థ గ్రహాంతరవాసుల సంకేతాల కోసం జరిపిన అన్వేషణ లాంటిదే. కానీ నేను ఆశించిన ఫలితం లభించలేదు.

గ్రామంలోనే ఉండడమా లేక ఒకప్పటి ఇండికా సెంట్రల్‌కి వెళ్ళి – నాకు తెలిసినది – విశ్వశక్తి సాధన- బోధించడమా అన్నది తేల్చుకోలేకపోతున్నాను. కానీ దుష్ట సామ్రాజ్యం గురించి నా అనుమానాలు నాకున్నాయి.

ట్రైటాన్‍లో జోస్యాల త్రికాల గ్రంథాన్ని చదివాను.

అది సమూరా కోరుకున్న చివరి అద్భుత వస్తువు. కాని అతనకది లభించలేదు.

నాకు దొరికింది, నేను చదివాను. ఈ రకమైన ఆలోచనలు, ప్రణాళికలతో ఆమ్రపాలిలో గడిపాము. రెండు నెలలు రెండు యుగాల వలె అనిపించాయి.

రెండు నెలలు గడిచాకా, ఒక రోజు చక్రవర్తి వద్ద నుండి సందర్శకులు వచ్చారు.

వారు ఒక పెద్ద ఆధునిక ఎగిరే కారులో వచ్చారు, బహుశా ఇతర గ్రహాల నుండి దిగుమతి చేసుకున్నట్లుంది.

వారు నల్లటి దుస్తులు ధరించి ఉన్నారు, పొడవైన టోపీలు పెట్టుకున్నారు.

తాంత్రికులకు చిహ్నం లాంటి నల్లటి పొడవైన గడ్డాలతో, చేతుల్లో మంత్రదండాలతో ఉన్నారు.

“వచ్చే వారంలో మీకు ప్రదానం చేయబోయే పురస్కారాన్ని స్వీకరించడానికి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులని అమెరికాలోని న్యూ హొప్ సిటీకి విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. మీ టిక్కెట్లు మరియు వసతి వివరాలు ఈ పత్రాలలో ఉన్నాయి. మీరు పురస్కారం స్వీకరించి, ఆమోద ప్రసంగం ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఇష్టమయితే, చక్రవర్తి మీకు ఇక్కడ ఒక భూభాగాన్ని కానుకగా ఇవ్వాలనుకుంటున్నారు, బహుశా దక్షిణ ఆసియా ప్రాంత గవర్నర్‌గా నియమిస్తారు… అంటే 888 నగరం ప్రాంతంలో.. ఒకప్పటి ఢిల్లీలో మీ ప్రధాన కార్యాలయం ఉంటుంది. అది కూడా మీరు అంగీకరిస్తేనే” చెప్పారు చక్రవర్తి దూతలు.

ఇప్పుడు ఇదో రకం పరిహాసంగా ఉంది. నా సేవలకు సత్కరించబడుతున్న మాంత్రికుడిని. ఒకప్పుడు మానవులపై గూఢచర్యం కోసం నియమించబడ్డాను. ఆపై నేను ఒక మిషన్‌కి నాయకత్వం వహించాను. ఇక ఇప్పుడు నేను వేటాడటం లేదు, వేటాడబడటం లేదు.

నా జీవితమంతా నా విధి యొక్క ఈ ద్వంద్వత నా మనసును తీవ్రంగా ప్రభావితం చేసింది.

నేను ఎవరు? నేను సమూరా సేవకు వెళ్ళాలా? ఎందుకు? జీవులకు లభించే అన్ని సౌకర్యాల కోసమా, అధికారం కోసమా, తుచ్ఛ సంపద కోసమా?

ప్రకృతి నాకేసి సాలోచనగా చూసింది.

దక్షిణ పొలాలలో వర్షం కురిసిన ఆ చీకటి సాయంత్రాన్ని గుర్తు చేసుకున్నాను. నా తల్లిదండ్రులను చంపిన రాక్షసులు జ్ఞాపకమొచ్చారు.

ప్రకృతి నాకేసే చూస్తోంది. ఏనిమాయిడ్ గుర్రుమన్నాడు.  యురేకస్ తనలో ఉన్న వెయ్యి ఎల్.ఇ.డి లైట్లను వెలిగించింది.

“సరే, నేను చక్రవర్తి యొక్క ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నాను. నేను ఆయనతో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను!” చెప్పాను.

ఇప్పుడు – ఒకనాటి అమెరికా రాజధాని, ప్రస్తుతం మొత్తం భూమికే రాజధాని అయిన నగరానికి మా ప్రయాణం మళ్ళీ నిర్ణయించబడింది.

ప్రభుత్వ అతిథులుగా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here