భూమి నుంచి ప్లూటో దాకా… -19

0
10

[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]

అధ్యాయం 52: మళ్ళీ ఆమ్రపాలి

[dropcap]ఆ[/dropcap]మ్రపాలిలో సూర్యోదయమేమీ ఉత్సాహదాయకంగా లేదు. దట్టమైన మేఘాలు కమ్ముకుని ఉన్నాయి.

పాత బస్ స్టేషన్‌లో బస్సు నెమ్మదిగా ఆగింది. నేను ఊహించినదాన్ని చూడడానికి నా హృదయాన్ని రాయి చేసుకున్నాను.

నిర్మానుష్యంగా ఉండడం వల్ల గ్రామంలో ఒక రకమైన ప్రశాంతత ఉంది. ఒకప్పుడు అక్కడ మామిడి చెట్లు, ఆకుపచ్చ పొలాలు, నీలి సరస్సు ఉండేవి. ఇప్పుడు పొలాలు బీడుబారాయి, సరస్సులో నీళ్ళు సగానికే ఉన్నాయి.

కొండ ఉంది. భైరవాలయం అక్కడే ఉంది మరియు కొత్తగా అలంకరించబడిన దీపాలతో అది మెరుస్తూ ఉంది. వెలుగు రేకలు విచ్చుకోడంతో ఆ ప్రత్యేక దీపాలను తొలగించారు.

మేం బస్సు దిగి, మా చిన్న సంచులు పట్టుకుని నడుస్తున్నాం. “భైరవాలయం తప్ప, మిగతా అన్నీ మారిపోయాయి” అంది ప్రకృతి దిగులుగా.

తెల్ల బూడిదని ఒంటికి దట్టంగా పూసుకుని పూర్తి నగ్నంగా ఉన్న ఒక మనిషి ఒక చేతిలో పుర్రె, మరో చేతిలో త్రిశూలంతో మాకు ఎదురొచ్చాడు.

“ఓం నమశ్శివాయ!! నాకు భిక్ష ఇవ్వండి!” అంటూ, “భైరవుడి గ్రామానికి స్వాగతం” అన్నాడు.

అతని శరీరం నుంచి దుర్వాసన వస్తోంది. జుట్టు అంతా మురికిగా ఉంది. కేశాలు అల్లబడి ఉన్నాయి, వాటిపై తెల్లబూడిద గడ్డలు కట్టి ఉంది.

నేను గబుక్కున భిక్షాపాత్ర లాంటి ఆ పుర్రెలో కొంత డబ్బు వేశాను.

ఇతనిలాంటి వాళ్ళే చాలామంది బస్ స్టేషన్‌లో తిరుగుతూ ఉన్నారు. తర్వాత మేము మాకు చిరపరిచితమైన గ్రామ రహదారిపై నడిచి, ప్రకృతి తండ్రి, గ్రామపెద్ద అయిన మహా ఇంటికి దారితీశాం.

చూడడానికి అఘోరీలా ఉన్న ఓ వ్యక్తి కేకపెట్టాడు, “నేను మీకు సహాయం చేయగలనా? మీరు ఒక హోటల్‌కు వెళ్ళాలనుకుంటున్నారా? పర్యాటకులా?”

“ఇది మా ఊరే. గ్రామపెద్ద, మహా గారిని చూడాలనుకుంటున్నాము. మేము అతని కుటుంబం.”

అతను భీతిగొల్పేలా నవ్వాడు.

“ప్రస్తుతం గ్రామపెద్ద మహా లేడు! ఇది అఘోరి గ్రామం. మేమే ఇక్కడ యజమానులం. మహా, ఒకప్పటి గ్రామపెద్దని ఎప్పుడో ఆ పదవి నుంచి తొలగించారు. మేము ఇక్కడ మా ఆచారాలను పాటిస్తాము. గ్రామస్తులు మా కోసం పని చేస్తారు, భూములు సాగుచేసి మాకు ఆహారం అందిస్తారు” అన్నాడతను.

“మహా ఎక్కడ… మా నాన్న మహా ఎక్కడ ఉన్నారు? దయచేసి చెప్పు! మీరు ఆయన్ని చంపేశారా? ఛీ… దుర్మార్గులారా… నేను నిన్ను బూడిద చేస్తాను!” అంటూ కోపంతో అరిచింది ప్రకృతి.

ఆ నగ్న బిచ్చగాడు… అఘోరీ… విస్మయానికి గురయ్యాడు.

అతను తన చేతిని అడ్డంగా ఊపాడు.

“మేము అఘోరీలం… మా ఆచారాల ద్వారా శివుణ్ణి చేరుకోడాన్ని విశ్వసిస్తాం. మేము మానవ మాంసాన్ని తింటాము. చనిపోయినవారి బూడిదను శరీరంపై ధరిస్తాము. మేము యాచించడం ద్వారా జీవిస్తాము. ఇలా చేయడం వల్ల మా అహంకారం, గర్వం తుడిచిపెట్టుకుపోతాయి. ఈ చర్యల వల్ల ద్వేషం, కోపం, అసూయ, దురాశ మరియు లైంగిక ఆసక్తి వంటి ఎనిమిది బంధనాల నుంచి మేము తప్పించుకుంటాము. అప్పుడు మేము పరమాత్మను పొందుతాము. మేము గ్రామంలో నివసిస్తున్నాం. కానీ మనుష్యులకు వరి పొలాల పక్కనే గృహాలు కట్టించి ఇచ్చాం. వారు అక్కడ పని చేస్తారు. మీ తండ్రి కోసం అక్కడ వెళ్ళి వెదుక్కోవచ్చు. లేదు, మేము అతన్ని చంపలేదు. మేము వాళ్ళపై అధికారం చలాయిస్తున్నాం, అంతే. నేను తలచుకొంటే మిమ్మల్ని కూడా నాశనం చేయగలను. కానీ అలా చేయను. వెళ్ళండి…!” అన్నాడా అఘోరీ.

మేమెంతో వేదనతో బాధపడ్డాము. అంతా అర్థమవుతోంది. భైరవాలయం తప్ప మిగిలిన అన్నీ పోయాయి. గ్రామస్తులందరూ ఈ వికారమైన అఘోరీల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళంతా వీరి పాలనలో ఉన్నారు. సమూరా మొత్తం మధ్య, దక్షిణ ఆసియా ప్రాంతాలను వారికి కానుకగా ఇచ్చేశాడు!

నేనూ ప్రకృతీ వెక్కిళ్ళు పెడుతూ పరిగెత్తాం. యురేకస్ వెనుకే వస్తోంది. ఏనిమాయిడ్ జంతుభాషలో ఏదో గొణుగుతూ మమ్మల్ని అనుసరిస్తున్నాడు.

ఒకప్పటి టూరిస్ట్ హోటల్ మాంగో ఆర్చర్డ్ ఇప్పుడు శిథిలమైపోయింది. లాన్‌లో కూర్చుని కొంతమంది నగ్న అఘోరీలు “చిలుం” (గంజాయి) తాగడం చూశాను.

“వారు శవాలను తింటారు! వారు శవాలను పూజిస్తారు. వారు శ్మశానం ద్వారా దేవుడిని చేరుకోవచ్చని అనుకుంటున్నారు. వారు చనిపోయినవారి దుస్తులను ధరిస్తారు. కానీ ఇప్పుడు వారే ఇక్కడి పాలకులు” చెప్పింది యురేకస్. “ఇది ఐజి నెట్ నుండి తెలుసుకున్నాను. ఈ ఉపాసన విధానాన్ని కినారం బెనారస్‌లో 18 వ శతాబ్దంలో ప్రారంభించాడు. వారు హిమాలయాల అంచుల లోని నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో, బెనారస్ మరియు అటువంటి ప్రదేశాలలో ఉన్నారు, అన్నిచోట్లా శ్మశానాల్లో ఉంటారు. వారు మార్మిక శక్తులు కలిగి ఉంటారు, విశ్వశక్తిని కూడా కలిగి ఉండవచ్చు” చెప్పింది యురేకస్.

“వెర్రితనం…!” అంది ప్రకృతి వెక్కిళ్ళు పెడుతూ. “నాకు మా నాన్న కావాలి! ఇప్పుడు నాకు ఆయనతో మాట్లాడాలనిపిస్తోంది” అంది.

“వరి పొలాల గట్ల మీద ఇటుక నివాసాల శ్రేణి ఉంది… నా టెలిస్కోపిక్ లెన్స్‌తో వాటిని చూడవచ్చు” చెప్పింది యురేకస్.

మేము వరి పొలాల వైపు వెళ్ళిపోయాము.

అక్కడ కార్మికుల కోసం కట్టిన నాసిరకం ఇటుక ఇళ్ళని చూసి విస్తుపోయాం. పొగ గొట్టాల నుంచి పొగలు వస్తున్నాయి. బలహీనమైన వికారమైన స్త్రీ పురుషులు తమ తమ సామానులతో పనిచేయడానికి బయల్దేరుతున్నారు

పరిగెత్తు, పరిగెత్తు, ముఖాలను వెతుకు, ఒకప్పటి హోటల్ రిసెప్షనిస్ట్ మందార కనిపించిందా? బూడిద రంగు జుట్టుతో కాలిన ముఖంతో ఉన్నది ఆమేనా? దుకాణదారులు, మా వివాహానికి వచ్చిన అతిథులు, ఉపాధ్యాయులు, పూల విక్రేత, వీళ్ళందరూ కనిపిస్తారా… దుర్మార్గులైన అఘోరీల కోసం పనిచేస్తున్నారా? బూడిద నిండిన జుట్టు, పాలిపోయిన కళ్ళు, పోషకాహారం లోపించడంతో వంగిపోయిన శరీరాలు… వీళ్ళు జీవచ్ఛవాలు!

ఇంతలో ఒక భయంకరమైన ఆలోచనతో నాలో గగుర్పాటు కలిగింది… వీళ్ళు చనిపోతే, వీళ్ళని ఈ అఘోరీలు తినేస్తారా? ఈ ఆలోచనే భయంకరంగా ఉంది.

ఒక ముఖం తరువాత మరొకటి చూస్తూ ముందుకు సాగుతున్నాం. చివరికి, ఓటమి భారంతో వంగిపోయి నడుస్తున్న ఎనభై ఏళ్ళు దాటిన పెద్దాయన, ముడతలు పడిన ముఖంతో విచారంగా నడుస్తున్న వృద్ధుడిని చూశాం. త్రవ్వడం కోసం చేతిలో ఈటెతో నెమ్మదిగా నడుస్తున్న… ఆయనే మహా!

“నాన్నా… నాన్నా…!” అంటూ ప్రకృతి పరిగెత్తింది. నేను కూడా “మావయ్యా” అని అరిచాను.

అప్పుడు ఆయన నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. ఆనందం, భయం, విస్మయం… ఇంకా ఆశ్చర్యంతో మమ్మల్ని చూశాడు.

“అమ్మా! ప్రకృతీ…!” అంటూ ఆయన మా వైపు పరిగెత్తాడు. శ్వాస తీసుకోడంలో ఇబ్బందిగా ఉన్నా, ఆ బాధని సంతోషం కప్పి ఉంచింది.

తండ్రీకూతుళ్ళు 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నారు. ఇన్ని బాధల మధ్య నేను చూసిన ఉత్తమ దృశ్యం ఇదే. వీళ్ళకిన్ని బాధలు కలగడానికి నేనే కారణమన్న ఆలోచన నాలో అపరాధభావాన్ని కలిగించింది.

ఇప్పుడు సూర్యుడు తూర్పున ప్రకాశవంతంగా ఉదయించాడు, కానీ ఆకాశంలో నిప్పురవ్వలు… ఆకాశంలో ఎరుపు రంగు లేజర్ అక్షరాలతో “జై సమూరా” అనీ, ఇంకా త్రిశూలం ఆకారంలో మెరుపుల ప్రదర్శనని చూశాను.

“పనికి వెళ్ళమని వారికది సూచన” చెప్పింది యురేకస్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here