Site icon Sanchika

భూమి నుంచి ప్లూటో దాకా… -19

[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]

అధ్యాయం 52: మళ్ళీ ఆమ్రపాలి

[dropcap]ఆ[/dropcap]మ్రపాలిలో సూర్యోదయమేమీ ఉత్సాహదాయకంగా లేదు. దట్టమైన మేఘాలు కమ్ముకుని ఉన్నాయి.

పాత బస్ స్టేషన్‌లో బస్సు నెమ్మదిగా ఆగింది. నేను ఊహించినదాన్ని చూడడానికి నా హృదయాన్ని రాయి చేసుకున్నాను.

నిర్మానుష్యంగా ఉండడం వల్ల గ్రామంలో ఒక రకమైన ప్రశాంతత ఉంది. ఒకప్పుడు అక్కడ మామిడి చెట్లు, ఆకుపచ్చ పొలాలు, నీలి సరస్సు ఉండేవి. ఇప్పుడు పొలాలు బీడుబారాయి, సరస్సులో నీళ్ళు సగానికే ఉన్నాయి.

కొండ ఉంది. భైరవాలయం అక్కడే ఉంది మరియు కొత్తగా అలంకరించబడిన దీపాలతో అది మెరుస్తూ ఉంది. వెలుగు రేకలు విచ్చుకోడంతో ఆ ప్రత్యేక దీపాలను తొలగించారు.

మేం బస్సు దిగి, మా చిన్న సంచులు పట్టుకుని నడుస్తున్నాం. “భైరవాలయం తప్ప, మిగతా అన్నీ మారిపోయాయి” అంది ప్రకృతి దిగులుగా.

తెల్ల బూడిదని ఒంటికి దట్టంగా పూసుకుని పూర్తి నగ్నంగా ఉన్న ఒక మనిషి ఒక చేతిలో పుర్రె, మరో చేతిలో త్రిశూలంతో మాకు ఎదురొచ్చాడు.

“ఓం నమశ్శివాయ!! నాకు భిక్ష ఇవ్వండి!” అంటూ, “భైరవుడి గ్రామానికి స్వాగతం” అన్నాడు.

అతని శరీరం నుంచి దుర్వాసన వస్తోంది. జుట్టు అంతా మురికిగా ఉంది. కేశాలు అల్లబడి ఉన్నాయి, వాటిపై తెల్లబూడిద గడ్డలు కట్టి ఉంది.

నేను గబుక్కున భిక్షాపాత్ర లాంటి ఆ పుర్రెలో కొంత డబ్బు వేశాను.

ఇతనిలాంటి వాళ్ళే చాలామంది బస్ స్టేషన్‌లో తిరుగుతూ ఉన్నారు. తర్వాత మేము మాకు చిరపరిచితమైన గ్రామ రహదారిపై నడిచి, ప్రకృతి తండ్రి, గ్రామపెద్ద అయిన మహా ఇంటికి దారితీశాం.

చూడడానికి అఘోరీలా ఉన్న ఓ వ్యక్తి కేకపెట్టాడు, “నేను మీకు సహాయం చేయగలనా? మీరు ఒక హోటల్‌కు వెళ్ళాలనుకుంటున్నారా? పర్యాటకులా?”

“ఇది మా ఊరే. గ్రామపెద్ద, మహా గారిని చూడాలనుకుంటున్నాము. మేము అతని కుటుంబం.”

అతను భీతిగొల్పేలా నవ్వాడు.

“ప్రస్తుతం గ్రామపెద్ద మహా లేడు! ఇది అఘోరి గ్రామం. మేమే ఇక్కడ యజమానులం. మహా, ఒకప్పటి గ్రామపెద్దని ఎప్పుడో ఆ పదవి నుంచి తొలగించారు. మేము ఇక్కడ మా ఆచారాలను పాటిస్తాము. గ్రామస్తులు మా కోసం పని చేస్తారు, భూములు సాగుచేసి మాకు ఆహారం అందిస్తారు” అన్నాడతను.

“మహా ఎక్కడ… మా నాన్న మహా ఎక్కడ ఉన్నారు? దయచేసి చెప్పు! మీరు ఆయన్ని చంపేశారా? ఛీ… దుర్మార్గులారా… నేను నిన్ను బూడిద చేస్తాను!” అంటూ కోపంతో అరిచింది ప్రకృతి.

ఆ నగ్న బిచ్చగాడు… అఘోరీ… విస్మయానికి గురయ్యాడు.

అతను తన చేతిని అడ్డంగా ఊపాడు.

“మేము అఘోరీలం… మా ఆచారాల ద్వారా శివుణ్ణి చేరుకోడాన్ని విశ్వసిస్తాం. మేము మానవ మాంసాన్ని తింటాము. చనిపోయినవారి బూడిదను శరీరంపై ధరిస్తాము. మేము యాచించడం ద్వారా జీవిస్తాము. ఇలా చేయడం వల్ల మా అహంకారం, గర్వం తుడిచిపెట్టుకుపోతాయి. ఈ చర్యల వల్ల ద్వేషం, కోపం, అసూయ, దురాశ మరియు లైంగిక ఆసక్తి వంటి ఎనిమిది బంధనాల నుంచి మేము తప్పించుకుంటాము. అప్పుడు మేము పరమాత్మను పొందుతాము. మేము గ్రామంలో నివసిస్తున్నాం. కానీ మనుష్యులకు వరి పొలాల పక్కనే గృహాలు కట్టించి ఇచ్చాం. వారు అక్కడ పని చేస్తారు. మీ తండ్రి కోసం అక్కడ వెళ్ళి వెదుక్కోవచ్చు. లేదు, మేము అతన్ని చంపలేదు. మేము వాళ్ళపై అధికారం చలాయిస్తున్నాం, అంతే. నేను తలచుకొంటే మిమ్మల్ని కూడా నాశనం చేయగలను. కానీ అలా చేయను. వెళ్ళండి…!” అన్నాడా అఘోరీ.

మేమెంతో వేదనతో బాధపడ్డాము. అంతా అర్థమవుతోంది. భైరవాలయం తప్ప మిగిలిన అన్నీ పోయాయి. గ్రామస్తులందరూ ఈ వికారమైన అఘోరీల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళంతా వీరి పాలనలో ఉన్నారు. సమూరా మొత్తం మధ్య, దక్షిణ ఆసియా ప్రాంతాలను వారికి కానుకగా ఇచ్చేశాడు!

నేనూ ప్రకృతీ వెక్కిళ్ళు పెడుతూ పరిగెత్తాం. యురేకస్ వెనుకే వస్తోంది. ఏనిమాయిడ్ జంతుభాషలో ఏదో గొణుగుతూ మమ్మల్ని అనుసరిస్తున్నాడు.

ఒకప్పటి టూరిస్ట్ హోటల్ మాంగో ఆర్చర్డ్ ఇప్పుడు శిథిలమైపోయింది. లాన్‌లో కూర్చుని కొంతమంది నగ్న అఘోరీలు “చిలుం” (గంజాయి) తాగడం చూశాను.

“వారు శవాలను తింటారు! వారు శవాలను పూజిస్తారు. వారు శ్మశానం ద్వారా దేవుడిని చేరుకోవచ్చని అనుకుంటున్నారు. వారు చనిపోయినవారి దుస్తులను ధరిస్తారు. కానీ ఇప్పుడు వారే ఇక్కడి పాలకులు” చెప్పింది యురేకస్. “ఇది ఐజి నెట్ నుండి తెలుసుకున్నాను. ఈ ఉపాసన విధానాన్ని కినారం బెనారస్‌లో 18 వ శతాబ్దంలో ప్రారంభించాడు. వారు హిమాలయాల అంచుల లోని నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో, బెనారస్ మరియు అటువంటి ప్రదేశాలలో ఉన్నారు, అన్నిచోట్లా శ్మశానాల్లో ఉంటారు. వారు మార్మిక శక్తులు కలిగి ఉంటారు, విశ్వశక్తిని కూడా కలిగి ఉండవచ్చు” చెప్పింది యురేకస్.

“వెర్రితనం…!” అంది ప్రకృతి వెక్కిళ్ళు పెడుతూ. “నాకు మా నాన్న కావాలి! ఇప్పుడు నాకు ఆయనతో మాట్లాడాలనిపిస్తోంది” అంది.

“వరి పొలాల గట్ల మీద ఇటుక నివాసాల శ్రేణి ఉంది… నా టెలిస్కోపిక్ లెన్స్‌తో వాటిని చూడవచ్చు” చెప్పింది యురేకస్.

మేము వరి పొలాల వైపు వెళ్ళిపోయాము.

అక్కడ కార్మికుల కోసం కట్టిన నాసిరకం ఇటుక ఇళ్ళని చూసి విస్తుపోయాం. పొగ గొట్టాల నుంచి పొగలు వస్తున్నాయి. బలహీనమైన వికారమైన స్త్రీ పురుషులు తమ తమ సామానులతో పనిచేయడానికి బయల్దేరుతున్నారు

పరిగెత్తు, పరిగెత్తు, ముఖాలను వెతుకు, ఒకప్పటి హోటల్ రిసెప్షనిస్ట్ మందార కనిపించిందా? బూడిద రంగు జుట్టుతో కాలిన ముఖంతో ఉన్నది ఆమేనా? దుకాణదారులు, మా వివాహానికి వచ్చిన అతిథులు, ఉపాధ్యాయులు, పూల విక్రేత, వీళ్ళందరూ కనిపిస్తారా… దుర్మార్గులైన అఘోరీల కోసం పనిచేస్తున్నారా? బూడిద నిండిన జుట్టు, పాలిపోయిన కళ్ళు, పోషకాహారం లోపించడంతో వంగిపోయిన శరీరాలు… వీళ్ళు జీవచ్ఛవాలు!

ఇంతలో ఒక భయంకరమైన ఆలోచనతో నాలో గగుర్పాటు కలిగింది… వీళ్ళు చనిపోతే, వీళ్ళని ఈ అఘోరీలు తినేస్తారా? ఈ ఆలోచనే భయంకరంగా ఉంది.

ఒక ముఖం తరువాత మరొకటి చూస్తూ ముందుకు సాగుతున్నాం. చివరికి, ఓటమి భారంతో వంగిపోయి నడుస్తున్న ఎనభై ఏళ్ళు దాటిన పెద్దాయన, ముడతలు పడిన ముఖంతో విచారంగా నడుస్తున్న వృద్ధుడిని చూశాం. త్రవ్వడం కోసం చేతిలో ఈటెతో నెమ్మదిగా నడుస్తున్న… ఆయనే మహా!

“నాన్నా… నాన్నా…!” అంటూ ప్రకృతి పరిగెత్తింది. నేను కూడా “మావయ్యా” అని అరిచాను.

అప్పుడు ఆయన నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. ఆనందం, భయం, విస్మయం… ఇంకా ఆశ్చర్యంతో మమ్మల్ని చూశాడు.

“అమ్మా! ప్రకృతీ…!” అంటూ ఆయన మా వైపు పరిగెత్తాడు. శ్వాస తీసుకోడంలో ఇబ్బందిగా ఉన్నా, ఆ బాధని సంతోషం కప్పి ఉంచింది.

తండ్రీకూతుళ్ళు 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నారు. ఇన్ని బాధల మధ్య నేను చూసిన ఉత్తమ దృశ్యం ఇదే. వీళ్ళకిన్ని బాధలు కలగడానికి నేనే కారణమన్న ఆలోచన నాలో అపరాధభావాన్ని కలిగించింది.

ఇప్పుడు సూర్యుడు తూర్పున ప్రకాశవంతంగా ఉదయించాడు, కానీ ఆకాశంలో నిప్పురవ్వలు… ఆకాశంలో ఎరుపు రంగు లేజర్ అక్షరాలతో “జై సమూరా” అనీ, ఇంకా త్రిశూలం ఆకారంలో మెరుపుల ప్రదర్శనని చూశాను.

“పనికి వెళ్ళమని వారికది సూచన” చెప్పింది యురేకస్.

అధ్యాయం 53: మాంత్రికుల పాలన

ఇది భూమి మీద చీకటి కాలం.

ఇక్కడే కాదు, సౌర వ్యవస్థ లోని అన్ని మానవ కాలనీల్లోనూ ఇలాగే ఉంది.

చంద్రుడు, గనీమీడ్, టైటాన్, లాండిస్ యొక్క ఫ్లోటింగ్ ప్లాట్‍ఫామ్, నెప్ట్యూన్ ఉపగ్రహం ట్రైటాన్ లలోని మానవ కాలనీలలోనూ ఇదే పరిస్థితి.

ఈ సామ్రాజ్యానికి కేంద్రం కుజగ్రహంలో ఉంది.

అరుణభూములలోని రాజధాని ‘మంత్ర’!  కుజగ్రహంపై ఉన్న మానవ కాలనీ, దాని  రాజధాని ‘లిబర్టీ’ పరిస్థితి ఇప్పుడెలా ఉంటుందో నేను ఊహించగలను. అరుణభూముల దళాల చేత ఈపాటికే నాశనం చేయబడి ఉండాలి!

సహస్రాబ్దుల పాటు అద్భుతమైన ప్రగతి సాధించిన మానవ నాగరికతలు – అంతరిక్ష ప్రయాణాలు, స్పేస్ కాలనీలు, కమ్యూనికేషన్లు, వైద్యశాస్త్రం, సైనిక మరియు అణుపాటవం… ఇవన్నీ సమూరా యొక్క విశ్వాసపాత్రులు, విశ్వశక్తి సాధకులు అయిన అనుచరగణం చేతిలో నాశనమైపోయాయి. మాంత్రిక చక్రవర్తి నిశ్శబ్దంగా ప్రభుత్వాలను కూలదోసి ఆక్రమించుకోవడం, ఇంకా నియంత్రించడం జరిగింది.

వారు ఎక్కడైనా హత్యలు, దాడుల ద్వారానే దీనిని సాధించారు. అవకాశమున్న చోట చర్చలు, బెదిరింపులు ఉపయోగించారు. మానవ సంస్కృతి, వ్యవస్థలు, రక్షణ వ్యవస్థలు క్షుద్రశక్తులకి ఇలా లొంగిపోతాయని అత్యంత నిరాశావాదైన చరిత్రకారుడు లేదా ఆలోచనాపరుడు మాత్రమే ఊహించగలడు.

కానీ నేను కుజగ్రహంపై  అరుణభూముల దళాలు మానవులతో యుద్ధం చేయడం చూశాను. ఆమ్ల వర్షం, క్లోన్డ్ సైనికులు, మనోశక్తి ద్వారా క్షిపణులను దారి మళ్ళించడం… విశ్వశక్తి, క్షుద్రశక్తి ఆధారంగా మొత్తం మానవుల ఆయుధ వ్యవస్థనే తిప్పికొట్టారు. ప్రణాళికలు, మోసపూరిత దౌత్యం, ఉన్నత హోదాలలో ఉన్న రహస్య అనుచరులు తిరుగుబాటు చేశారు – దాంతో భూమిపైనా, ఇంకా ఇతర ప్రాంతాలలో మానవ పాలన అంతమైంది.

ఇంకా నేను సమూరాకి అందించిన అద్భుత వస్తువులు ఇందుకు నిస్సందేహంగా కారణాలే.

“కానీ మాస్టర్! మీలాంటి మనుషులు ఇంకొందరు, ఎంపికైన వ్యక్తులు చాలామంది ఎన్నో రకాలుగా సమూరా చక్రవర్తికి సహాయం చేసి ఉండవచ్చు. పైగా నాలాంటి రోబోలు ప్రత్యేకంగా అతని తాంత్రికుల ద్వారా ప్రోగ్రామ్ చేయబడినవి… సౌకర్యాలను కల్పించి ఉంటాయి” చెప్పింది యురేకస్.

 ఆమ్రపాలి గ్రామంలో మేము విశ్రాంతి తీసుకుంటున్నాము, మహా పొలం నుంచి తిరిగి రాగానే… ఆయన ఇంట్లో అందుబాటులో ఉన్న పాలు, రొట్టెలు, కొన్ని తృణధాన్యాలను ఆహారంగా తీసుకునే వాళ్ళం.  భూమి యొక్క గత దశాబ్ద చరిత్రను బ్రౌజ్ చేయడానికి ఐజి నెట్‌కి కనెక్ట్ అయ్యేవాడిని.

కార్మికులను నియంత్రించేందుకు తాంత్రిక దళాలు, గార్డులు ఉన్నారు, కాని మాకెవరూ ఏ ఆటంకమూ కలగనివ్వలేదు.

50 క్రోమోజోములు, 10000 కంటే ఎక్కువ నక్షత్రాల స్థాయి ఉన్న ఒక మాంత్రికుడిని కావడం, నాతో సమాన మాంత్రిక శక్తి కలిగిన భార్య ఉండడం, ఒక గ్రహాంతర మాంత్రికుడు సహాయకుడిగా ఉండడం, యుద్ధ సామర్థ్యం గల రోబోని కలిగి ఉండడం నాలో దైధీభావం కలిగిస్తోంది. ఇక్కడ మాదో ప్రత్యేక హోదా.

సౌరవ్యవస్థలో నేను అధికార వర్గానికి చెందినవాడిని. నాతో అలాగే ప్రవర్తిస్తున్నారు. ప్రతి గ్రహంలో ప్రతి యుద్ధం యొక్క చరిత్రనీ రాయొచ్చు, కానీ దుర్భరమైన బతుకు చిత్రం ఎక్కడైనా ఒకేలా ఉంది!

ఉరితీయబడిన నాయకులు, ధ్వంసమైన రక్షణ సంస్థలు, తమ క్షిపణులను తమవైపే గురిపెట్టిన వైనం…

దహనమైన ‘న్యూ హోప్’ నగరం.

అరుణభూములలో సమూరా పట్టాభిషేకము.

న్యూ హోప్ నగరానికి సమూరా రాక. ఓ సమావేశంలో భూమి యొక్క ప్రజలను ఉద్దేశించి ప్రసంగం. మానవ పాలకుల స్థానంలో మాంత్రిక ప్రభుత్వం ఏర్పడింది. ఆసియాలో అఘోరాలు, ఆఫ్రికాలోని ఊడూ, దక్షిణ అమెరికాలోని విచ్ డాక్టర్స్ వంటి పెద్ద స్థానిక ఉపాసక బృందాలకు ప్రాధాన్యనతీయడంలో రాజకీయంగా మార్పులు సంభవించాయి. వాళ్ళకి భారీ స్థాయిలో భూభాగాలను పాలించుకోడానికి కానుకగా ఇచ్చారు.

చంద్రగ్రహం ఓడింది. అది ఇప్పుడు వింత జీవులకు, విశ్వశక్తి సాధకులకు ఓ ధ్యాన కేంద్రం.

ఇవీ వార్తలు….

సైన్యంలో తాంత్రిక నాయకులు ఉన్నారు. అణ్వాయుధాలు వారి చేతుల్లో ఉన్నాయి. కర్మాగారాలు, పారిశ్రామిక సంస్థలన్నీ మానవ సాంకేతిక నిపుణుల అదుపులోనే ఉన్నాయి… కానీ ఈ మానవులు తాంత్రికులచే నియంత్రించబడుతున్నారు.

అన్ని దేశాలలోనూ మనుషుల మానసిక స్థితి ఒకేలా ఉంటుంది. అధికారంలో ఉన్నవారికి విధేయులుగా ఉంటారు.

కొందరు, చాలా తక్కువంది – విలువలు, ధైర్యం, దేశభక్తి ఉన్నవారు మాత్రమే తిరుగుబాటు చేస్తారు.

అన్ని గ్రహాల కాలనీలు ఒకే పాలనలో ఉన్నందున ఒక దశాబ్దం పాటు వ్యవస్థలన్నీ ఇలాగే కొనసాగాయి.

గెలాక్టిక్ కౌన్సిల్ లేదా వేర్వేరు వ్యవస్థల్లోని కాలనీల్లోని మానవులు ఎన్నడూ సహాయం చేయలేదు. దేశాల అంతర్గత వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోరు, వారి సొంత భద్రతకి ప్రమాదం ఎదురైతే తప్ప లేదా ఆర్థిక వ్యవస్థ పతనమైతే తప్ప.

మేము ఆ ఇంటిలో మహాతో వారం రోజులు గడిపాము. అనేక వివరాలను తెలుసుకున్నాము.

మా కథ అర్థం చేసుకోవడం మా మావగారికి కష్టంగా ఉంది –

ఎందుకంటే నేను సుప్తావస్థలో దాదాపు ఒక దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ గడిపాను; సుదూర గ్రహాలలో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నా కోసం స్థానిక తాంత్రిక పాలకుల వద్ద నుండి రోజూ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు.

కానీ నేను మాంత్రికుడిని కాబట్టి ఇక్కడో ప్రముఖుడిగా చలామణీ అవుతున్నాను. ఈ ప్రాంతపు కొత్త అధికారి నాకు బహుమతులు పంపాడు. ఇప్పుడు ఒక్కో గ్రామానికి ఒక్కో పెద్ద లేడు, వంద గ్రామాలు మరియు పట్టణాల్లో ఒకే ఒక్క అధికారి ఉన్నాడు.

“నా జీవితమంతా నేను మాంత్రికులని ద్వేషించాను. మేము మీ అమ్మనీ, నాన్ననీ బహిష్కరించాము. ఇప్పుడు నా సొంత కూతురు, అల్లుడు తాంత్రికులుగా ఉన్నారు. కానీ మళ్ళీ దుష్ట గ్రహాంతరవాసుల చేతిలో నేను బాధపడ్డాను. దేవుని పద్ధతులు అర్థంకానివి!” అన్నాడు మహా.

మహాను కార్మిక శిబిరం నుంచి విడుదల చేసి, తన ఇల్లు, ఆస్తికి తిరిగి ఇచ్చేయమని మాంత్రిక పాలకులను కోరాను.

నా మాట మన్నించి, కొన్ని రోజుల్లో నేను అడిగినట్లే చేశారు పాలకులు.

మేము మా ఇళ్లకు తిరిగి వెళ్ళాము. నాకు నా పూర్వీకుల ఇంటికి, మహా గారు తనింటికి.

తరువాత ఒకరోజు నాకు ఐజి నెట్ ద్వారా ఒక సందేశం వచ్చింది. రెండు నెలల తర్వాత సమూరా కుజగ్రహం నుంచి న్యూ హోప్ సిటీకి వస్తున్నాడట. వచ్చి చక్రవర్తిని కలుసుకోమని ఆదేశిస్తూ సందేశం వచ్చింది.

“తాంత్రిక సామ్రాజ్యానికి మీరు చేసిన సేవలకు, మీరు చేసిన త్యాగాలకు గాను మీకు ‘ఆర్డర్ ఆఫ్ విజార్డ్ ఎంపైర్’ పురస్కారం అందజేయబడుతుంది. హనీ ఆమ్రపాలి, చక్రవర్తికి మీరు చేసిన సేవకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం!”

దాని యొక్క ద్వంద్వత భయపెడుతోంది.

ఇప్పుడు నేను గౌరవించబడ్డాను!

ఒకప్పుడు నేను వేటాడబడ్డాను!

కానీ నా మనస్సు ఒక పరిష్కారాన్నీ, ప్రతీకారాన్నీ బలంగా కోరుకుంటోంది. ఈ దుష్ట కుజగ్రహ మాంత్రికులు భూమిని, సౌర వ్యవస్థలో ఉన్న అన్నిటిని నాశనం చేశారు. సమూరా నా తల్లిదండ్రులను చంపాడు, నన్ను ఇంకా ఎందరినో దోచుకున్నాడు. ఇప్పుడు అతనిచ్చే పురస్కారాలు ఎవడికి కావాలి?

“విశ్వాసపాత్రులైన మానవులంతా ఎక్కడికి వెళ్లిపోయారు?” అంటూ అరిచాను.

మేధావులు, శాస్త్రవేత్తలు మరియు సైనికులు ఎక్కడ ఉన్నారు? ఎర్త్ కౌన్సిల్ – రక్షణ విభాగం ఎక్కడ?

ఎక్కడో అక్కడ తప్పనిసరిగా ప్రతిఘటన వస్తుంది. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కోసం మానవుల ప్రతిఘటన.

కాని ఎక్కడ? ఇది శాశ్వతంగా కొనసాగడానికి వీల్లేదు! వెతుకు! యురేకస్, వెతుకు!”

అధ్యాయం 54: ఆహ్వానం

గాయపడిన మనసులకి సాంత్వన, అలసిన శరీరాలకి విశ్రాంతి కల్పిస్తూ మేము ఆమ్రపాలిలో కొన్ని రోజులు గడిపాం. మా క్రుంగుబాటును ఎదుర్కుంటూ, భూమిలో తారుమారయిన పరిస్థితులను అర్థం చేసుకుంటున్నాం.

మహా తన ఇంటికి వెళ్ళిపోయారు. నేను ప్రకృతితో కలసి మా నాన్న ఇంట్లో బస చేసి మా తదుపరి కార్యక్రమం గురించి ఆలోచించసాగాను.

నాకు ఆశ్చర్యం కలిగించిన అంశం ఏంటంటే – భూమి మీద నివసించడం ఏనిమాయిడ్‌కి ఎందుకో బాగా సంతోషంగా ఉంది. అతను గ్రామమంతా తిరుగుతున్నాడు. చుట్టుపక్కల ప్రాంతాల గురించి ఆరా తీస్తున్నాడు. గ్రహాంతరవాసి కావడం, మాంత్రికుడు కావడంతో అతనికి విశిష్ట హోదా కల్పించబడింది.

నాకు టీవీ, ఐజి నెట్, ఇంకా వారం వారం వచ్చే వార్తాపత్రికల ద్వారా వార్తలు తెలుస్తున్నాయి.

ఇండికా సెంట్రల్ ఇప్పుడు “సమూరా పారానార్మల్ రీసెర్చ్ సెంటర్“గా మారింది. మిస్టర్ శాన్ సజీవంగా ఉంటాడనే ఆశ దాదాపుగా పోయింది. ఇతర ప్రొఫెసర్లని ఫోన్ లేదా నెట్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను, కానీ ఫలితం లేదు. అయితే నేను నా బ్యాంకు ఖాతాని ఉపయోగించుకోగలిగాను. నాకు విముక్తి కల్పించినందుకు బిశ్వాస్ గారికి న్యాయవాది రుసుం చెల్లించాను.

మాంత్రికుల పాలన వ్యతిరేకంగా తిరుగుబాటుకు నన్ను ఏ ఒక్క మానవుడైనా సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాడేమో తెలుసుకునేందుకు ఐజి నెట్‌నీ, ఇంకా విశ్వవ్యాప్తంగా లభించే అన్ని సిగ్నల్స్‌నీ పరిశీలించమని యురేకస్‌ని ఆదేశించాను. ఇది దాదాపు 21వ శతాబ్దంలో ఎస్‌ఇటిఐ (సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్) అనే సంస్థ గ్రహాంతరవాసుల సంకేతాల కోసం జరిపిన అన్వేషణ లాంటిదే. కానీ నేను ఆశించిన ఫలితం లభించలేదు.

గ్రామంలోనే ఉండడమా లేక ఒకప్పటి ఇండికా సెంట్రల్‌కి వెళ్ళి – నాకు తెలిసినది – విశ్వశక్తి సాధన- బోధించడమా అన్నది తేల్చుకోలేకపోతున్నాను. కానీ దుష్ట సామ్రాజ్యం గురించి నా అనుమానాలు నాకున్నాయి.

ట్రైటాన్‍లో జోస్యాల త్రికాల గ్రంథాన్ని చదివాను.

అది సమూరా కోరుకున్న చివరి అద్భుత వస్తువు. కాని అతనకది లభించలేదు.

నాకు దొరికింది, నేను చదివాను. ఈ రకమైన ఆలోచనలు, ప్రణాళికలతో ఆమ్రపాలిలో గడిపాము. రెండు నెలలు రెండు యుగాల వలె అనిపించాయి.

రెండు నెలలు గడిచాకా, ఒక రోజు చక్రవర్తి వద్ద నుండి సందర్శకులు వచ్చారు.

వారు ఒక పెద్ద ఆధునిక ఎగిరే కారులో వచ్చారు, బహుశా ఇతర గ్రహాల నుండి దిగుమతి చేసుకున్నట్లుంది.

వారు నల్లటి దుస్తులు ధరించి ఉన్నారు, పొడవైన టోపీలు పెట్టుకున్నారు.

తాంత్రికులకు చిహ్నం లాంటి నల్లటి పొడవైన గడ్డాలతో, చేతుల్లో మంత్రదండాలతో ఉన్నారు.

“వచ్చే వారంలో మీకు ప్రదానం చేయబోయే పురస్కారాన్ని స్వీకరించడానికి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులని అమెరికాలోని న్యూ హొప్ సిటీకి విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. మీ టిక్కెట్లు మరియు వసతి వివరాలు ఈ పత్రాలలో ఉన్నాయి. మీరు పురస్కారం స్వీకరించి, ఆమోద ప్రసంగం ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఇష్టమయితే, చక్రవర్తి మీకు ఇక్కడ ఒక భూభాగాన్ని కానుకగా ఇవ్వాలనుకుంటున్నారు, బహుశా దక్షిణ ఆసియా ప్రాంత గవర్నర్‌గా నియమిస్తారు… అంటే 888 నగరం ప్రాంతంలో.. ఒకప్పటి ఢిల్లీలో మీ ప్రధాన కార్యాలయం ఉంటుంది. అది కూడా మీరు అంగీకరిస్తేనే” చెప్పారు చక్రవర్తి దూతలు.

ఇప్పుడు ఇదో రకం పరిహాసంగా ఉంది. నా సేవలకు సత్కరించబడుతున్న మాంత్రికుడిని. ఒకప్పుడు మానవులపై గూఢచర్యం కోసం నియమించబడ్డాను. ఆపై నేను ఒక మిషన్‌కి నాయకత్వం వహించాను. ఇక ఇప్పుడు నేను వేటాడటం లేదు, వేటాడబడటం లేదు.

నా జీవితమంతా నా విధి యొక్క ఈ ద్వంద్వత నా మనసును తీవ్రంగా ప్రభావితం చేసింది.

నేను ఎవరు? నేను సమూరా సేవకు వెళ్ళాలా? ఎందుకు? జీవులకు లభించే అన్ని సౌకర్యాల కోసమా, అధికారం కోసమా, తుచ్ఛ సంపద కోసమా?

ప్రకృతి నాకేసి సాలోచనగా చూసింది.

దక్షిణ పొలాలలో వర్షం కురిసిన ఆ చీకటి సాయంత్రాన్ని గుర్తు చేసుకున్నాను. నా తల్లిదండ్రులను చంపిన రాక్షసులు జ్ఞాపకమొచ్చారు.

ప్రకృతి నాకేసే చూస్తోంది. ఏనిమాయిడ్ గుర్రుమన్నాడు.  యురేకస్ తనలో ఉన్న వెయ్యి ఎల్.ఇ.డి లైట్లను వెలిగించింది.

“సరే, నేను చక్రవర్తి యొక్క ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నాను. నేను ఆయనతో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను!” చెప్పాను.

ఇప్పుడు – ఒకనాటి అమెరికా రాజధాని, ప్రస్తుతం మొత్తం భూమికే రాజధాని అయిన నగరానికి మా ప్రయాణం మళ్ళీ నిర్ణయించబడింది.

ప్రభుత్వ అతిథులుగా!

అధ్యాయం 55: న్యూ హోప్ సిటీ… అమెరికా

అంతా మారిపోయింది. ఇప్పుడు ఏరియాలు లేవు, ఏరియా నెంబర్లు లేవు. సమూరా ఒకప్పటి పాత పేర్లనే ఉంచమన్నాడు. ఒకప్పటి యుఎస్ఎ మళ్ళీ ఇప్పుడు యుఎస్ఎ, కెనడా మళ్ళీ కెనడానే.  న్యూ హోప్ సిటీ పేరు అలాగే ఉంది. ఎర్త్ కౌన్సిల్ స్థానంలో విజర్డ్ కౌన్సిల్ వచ్చింది.

నేను ఎక్కడికి వెళ్ళినా, నల్లటి దుస్తులు ధరించి గడ్డాలతో ఉన్న సైనికులు లేజర్ తుపాకులతో కనబడ్డారు. ఇక మంత్రదండాలు ధరించిన మాంత్రిక దళాలు ఉన్నాయి. సాధారణ అమెరికన్ సైనికులూ కనిపిస్తున్నారు, కానీ వారి టోపీల పైన ఎర్ర త్రిశూలాల గుర్తులున్నాయి. వారి దుస్తుల భుజాలపై కుజగ్రహం యొక్క “రెండు కత్తులు” చిహ్నం ఉంది.

మిగిలినవన్నీ అలాగే ఉన్నాయి. విమానాశ్రయం, ఇమ్మిగ్రేషన్, రహదారులపై కార్లు, హోటళ్ళు, జనాలు.

నిరంకుశత్వ పాలనైనా, మతాధికారిల పాలనైనా, మౌలిక విశ్వాసుల పాలనైనా, సైనిక పాలనైనా – పరిపాలనలోని మార్పులకు జనాలు తొందరగా అలవాటుపడతారు. మార్పులెలా ఉన్నా వారు తమ జీవితాలను జీవించడం నేర్చుకుంటారు.

ఇదంతా కుటుంబాలలోని మహిళలకు బాగా తెలుసు. జీవితం కొనసాగుతుంది. ఆహారం తయారు చేసుకోవాలి, పిల్లలని మగవాళ్ళని చూసుకోవాలి. ఇక ఇంటి పనులు ఉండనే ఉంటాయి.

పురుషులు కూడా పని చేయాలి.

సమాజంలో ఒక అరాచక స్థితి రేకెత్తకుండా ఉండేందుకు సమూరా కాస్త వివేకాన్ని ప్రదర్శించాడు.  ప్రజలు ప్రధానంగా ఏమి కోరుకుంటున్నారో అది వారికి ఇవ్వడం ఉత్తమమని అతనికి తెలుసు! అదేంటంటే ఒక క్రమం! సాధారణ జీవితం, వారి క్లబ్బులు! వారి సినిమాలు! వారి కెరీర్లు!

కానీ అత్యంత విద్యావంతమైన, సంస్కారయుక్తమైన సమాజంలో స్వతంత్ర్యం కోసం కాంక్ష, స్వేచ్ఛ ఉండాలి. ఎంపికలో స్వేచ్ఛ, విజ్ఞానం, ఇంకా ఉదారవాదం ద్వారా జీవితాల మెరుగుదల – మానవ లక్ష్యాలకు ఋజువులు.

క్షుద్ర శక్తుల ద్వారా లేక కొత్తగా ఆవిష్కరణ అయిన విశ్వశక్తి ద్వారా ఈ లక్ష్యాలు నెరవేరవు. ఇదంతా భయానకంగా ఉంది, ఎప్పుడో హారర్ పుస్తకాలలో చదివిన, హారర్ సినిమాలలో చూసిన ఈ భయనక జీవనం ఇప్పుడు వాస్తవంగా ఉంది.

మంత్రశక్తి, మనసు గ్రహించడం (టెలీపతీ), మానవాతీత శక్తులు, విపరీత మానసిక ప్రవర్తనలు, ఇంకా తలపై కొమ్ములతో, కోసు చెవులతో గ్రహాంతరవాసులు, కొందరు రక్త దాహంతో ఉండేవారు….

ఇది 20వ శతాబ్దానికి చెందిన రచయితల క్రూరమైన కల్పనల్లో కూడా లేదు.

ఇప్పుడు క్రీ.శ.3560లో అమెరికాలో ఒక పీడకల వాస్తవంగా ప్రత్యక్షమైంది.

ఈ భీతి అంతా నిజమే, ఎందుకంటే క్షుద్ర విద్యలున్నాయని నాకు తెలుసు. అవి అనంతమైనవి. విశ్వవ్యాప్తంగా ఉన్నాయి. వాటిని నేనూ, నా భార్య కూడా సాధన చేస్తున్నాం. అయితే మా విలువలు వేరు.

ఓ సాయంత్రం మాకు చక్రవర్తితో సమావేశానికి సమయం ఇచ్చారు.

అతను ఇప్పుడు తన రాజభవనంలో ఉన్నాడు. కొన్ని సహస్రాబ్దుల క్రితం అది వైట్ హౌస్, ఎన్నోసార్లు పునరుద్ధరించబడింది. ఓడిపోయిన, ఒకప్పటి ఎర్త్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం.

అతను ఎర్రగా మెరుస్తున్న కళ్ళున్న అస్థిపంజరంలా ఉన్నాడు. వెయ్యేళ్ళ కంటే ఎక్కువ వయసున్న ఆ శరీరంపై వజ్రాల కిరీటం, నగలు ఉన్నాయి. మంత్రులు పాతవాళ్ళే ఉన్నారు. కానీ సయోని లేదు. తల వెనుక వైపుగా ఉండేలా చేసి కృత్రిమంగా జీవం పోసిన కారణంగా ఆమె ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం జీవించలేకపోయింది.

“హనీ ఆమ్రపాలి, ప్రకృతి! మిమ్మల్ని ఇక్కడ చూడడం సంతోషంగా ఉంది. నా విజయానికి దోహదపడినందుకు మీరు కూడా చాలా సంతోషంగా ఉండి ఉండాలి” అన్నాడు సమూరా.

ప్రేక్షకులలో వివిధ వర్ణాల వారున్నారు. సాధారణ అంగరక్షకులు, సహాయకులు మాకిచ్చేందుకు పతకాలను తీసుకువచ్చారు. కెమెరాలు ఫ్లాష్‌లతో క్లిక్‌మంటున్నాయి, టీవీ కవరేజ్‌ని భాధ్యతగా నిర్వహిస్తున్నారు. మొత్తం నాగరికతని లోబరుకున్న ఈ గ్రహాంతర జీవుల గుంపుకి నేను  నమస్కరించాలా ?

నా గుండె మండిపోతుండగా, నా హృదయం తిరుగుబాటు చేస్తుండగా నేనందరికీ నమస్కరించాను.

“నాతో చేయి కలుపు హనీ! మొత్తం సౌర వ్యవస్థ మనది. నేను మీ ఖండాన్ని నీకు బహుమతిగా ఇస్తాను. నువ్వో అద్భుతమైన మాంత్రికుడివి. నీ భార్య కూడా నీలా శక్తిమంతురాలే. మీరు నా సామ్రాజ్యానికి ఒక ఆస్తిలా ఉంటారు.”

“కిరీటంలోని రత్నంలా!” అన్నాడు ఒక వృద్ధ మార్షియన్.

“చక్రవర్తికి ధన్యవాదాలు! నేను మీ కోసం చేసినదేదీ స్వచ్ఛందంగా చేయలేదు. నన్ను బెదిరించారు, బ్లాక్‌మెయిల్ చేశారు, బలవంతపెట్టారు. క్విప్పర్ బెల్ట్ వరకు తరిమేసి ప్లూటో, నెప్ట్యూన్‌లకు నన్ను సుప్తావస్థలో తీసుకెళ్ళారు. మాకు జైలు శిక్ష పడింది, అనేక బాధలు అనుభవించాం. ఇక నా గ్రామస్థులంతా బానిసలయ్యారు. నా విశ్వవిద్యాలయం తాంత్రిక విద్యార్థినీ విద్యార్థులకు ఆవాసంగా మారింది. ఇదంతా ఏంటి? నేను మానవుడిని. ఆదర్శవంతమైన మానవ విలువల పట్ల విశ్వాసం ఉన్నవాడిని. క్షమించండి! మా మానాన మమ్మల్ని వదిలేయండి! మేము వెళ్తాము!” అన్నాను.

గట్టిగా నవ్వాడు సమూరా. మత్తులో ఉన్నవాడిలా ఆగకుండా నవ్వుతూనే ఉన్నాడు – విజయం, అమరత్వం మరియు నాగరికతలపై పొందిన అధికారాల సారాన్ని త్రాగినవాడిలా!

“కావలసినంత సమయం తీసుకో! భవిష్యత్తు నాదే! నువ్వు నన్ను అమరుడిని చేశావు, నా విజయానికి కావల్సిన అన్ని వస్తువులను తెచ్చావు. నేను నీకు సమయం ఇస్తాను. నీకు హాని చేయను. నిన్ను గమనిస్తునే ఉంటాను. కానీ మీరు ఇద్దరూ బాగా ఆలోచించుకోండి. మీరు మోసం చేయనంత వరకు నా ఈ ఆహ్వానం ఉంటుంది. మోసం చేయడానికి ప్రయత్నించకండి! నేను అజేయుడిని, విశ్వశక్తితో సర్వాంతర్యామిని. పైగా నేనిప్పుడు మానవులు ఆవిష్కరించిన గొప్ప వస్తువులను కూడా కలిగి ఉన్నాను… నేను నిన్ను గమనిస్తుంటాను. ఇక నువ్వు నిర్ణయించుకుంటే, నువ్వో గొప్ప మాంత్రికుడివి కావచ్చు, ‘దక్షిణ ఆసియా మాస్టర్’ కావచ్చు, మీ స్వంత భారతదేశానికి అధినేతవి కావచ్చు” చెప్పాడు సమూరా.

కొన్ని క్షణాలు ఆగాడు. “మీ అమ్మానాన్నలని చంపినందుకు నీకు నా మీద పగ ఉందని గ్రహించాను. ఒక సామ్రాజ్యం ఏర్పడేటప్పుడు ఇలాంటివి తప్పవు! నన్ను క్షమించు. కానీ నువ్వు నాకు కావాలి! ఆలోచించుకో. నేను నీకు సమయం ఇస్తాను” అన్నాడు.

ఇదే సమూరా అత్యుత్తమ రాజనీతిజ్ఞత, అతను ఉత్తమ వ్యవహారదక్షుడు. అతనిని నేను చంపలేనని నాకు తెలుసు. అతనిని నశింపజేయడానికి వేరే ఇతర పద్ధతులు ఉండాలి. నేను ప్రకృతీ వంగి నమస్కరించి, అతని వద్ద వీడ్కోలు తీసుకుని వెనక్కి నడుస్తూ బయటకు వచ్చాం.

పానీయాలు, ఆహారాలు, నృత్యగానాలతో విందు సందడిగా ఉంది. యువ మాంత్రికుల సమూహం… గ్రహాంతర మాంత్రికులని స్పష్టంగా తెలుస్తున్న సమూహం… రకరకాల మాయాజాల ప్రదర్శనలు చేస్తోంది. ఆ సాయంత్రపు విందు విలాసాలలో విలక్షణమైన పాటలు పాడారు ఆ బృందంలోని వాళ్ళు.

(సశేషం)

Exit mobile version