భూమి నుంచి ప్లూటో దాకా… -19

0
4

అధ్యాయం 55: న్యూ హోప్ సిటీ… అమెరికా

అంతా మారిపోయింది. ఇప్పుడు ఏరియాలు లేవు, ఏరియా నెంబర్లు లేవు. సమూరా ఒకప్పటి పాత పేర్లనే ఉంచమన్నాడు. ఒకప్పటి యుఎస్ఎ మళ్ళీ ఇప్పుడు యుఎస్ఎ, కెనడా మళ్ళీ కెనడానే.  న్యూ హోప్ సిటీ పేరు అలాగే ఉంది. ఎర్త్ కౌన్సిల్ స్థానంలో విజర్డ్ కౌన్సిల్ వచ్చింది.

నేను ఎక్కడికి వెళ్ళినా, నల్లటి దుస్తులు ధరించి గడ్డాలతో ఉన్న సైనికులు లేజర్ తుపాకులతో కనబడ్డారు. ఇక మంత్రదండాలు ధరించిన మాంత్రిక దళాలు ఉన్నాయి. సాధారణ అమెరికన్ సైనికులూ కనిపిస్తున్నారు, కానీ వారి టోపీల పైన ఎర్ర త్రిశూలాల గుర్తులున్నాయి. వారి దుస్తుల భుజాలపై కుజగ్రహం యొక్క “రెండు కత్తులు” చిహ్నం ఉంది.

మిగిలినవన్నీ అలాగే ఉన్నాయి. విమానాశ్రయం, ఇమ్మిగ్రేషన్, రహదారులపై కార్లు, హోటళ్ళు, జనాలు.

నిరంకుశత్వ పాలనైనా, మతాధికారిల పాలనైనా, మౌలిక విశ్వాసుల పాలనైనా, సైనిక పాలనైనా – పరిపాలనలోని మార్పులకు జనాలు తొందరగా అలవాటుపడతారు. మార్పులెలా ఉన్నా వారు తమ జీవితాలను జీవించడం నేర్చుకుంటారు.

ఇదంతా కుటుంబాలలోని మహిళలకు బాగా తెలుసు. జీవితం కొనసాగుతుంది. ఆహారం తయారు చేసుకోవాలి, పిల్లలని మగవాళ్ళని చూసుకోవాలి. ఇక ఇంటి పనులు ఉండనే ఉంటాయి.

పురుషులు కూడా పని చేయాలి.

సమాజంలో ఒక అరాచక స్థితి రేకెత్తకుండా ఉండేందుకు సమూరా కాస్త వివేకాన్ని ప్రదర్శించాడు.  ప్రజలు ప్రధానంగా ఏమి కోరుకుంటున్నారో అది వారికి ఇవ్వడం ఉత్తమమని అతనికి తెలుసు! అదేంటంటే ఒక క్రమం! సాధారణ జీవితం, వారి క్లబ్బులు! వారి సినిమాలు! వారి కెరీర్లు!

కానీ అత్యంత విద్యావంతమైన, సంస్కారయుక్తమైన సమాజంలో స్వతంత్ర్యం కోసం కాంక్ష, స్వేచ్ఛ ఉండాలి. ఎంపికలో స్వేచ్ఛ, విజ్ఞానం, ఇంకా ఉదారవాదం ద్వారా జీవితాల మెరుగుదల – మానవ లక్ష్యాలకు ఋజువులు.

క్షుద్ర శక్తుల ద్వారా లేక కొత్తగా ఆవిష్కరణ అయిన విశ్వశక్తి ద్వారా ఈ లక్ష్యాలు నెరవేరవు. ఇదంతా భయానకంగా ఉంది, ఎప్పుడో హారర్ పుస్తకాలలో చదివిన, హారర్ సినిమాలలో చూసిన ఈ భయనక జీవనం ఇప్పుడు వాస్తవంగా ఉంది.

మంత్రశక్తి, మనసు గ్రహించడం (టెలీపతీ), మానవాతీత శక్తులు, విపరీత మానసిక ప్రవర్తనలు, ఇంకా తలపై కొమ్ములతో, కోసు చెవులతో గ్రహాంతరవాసులు, కొందరు రక్త దాహంతో ఉండేవారు….

ఇది 20వ శతాబ్దానికి చెందిన రచయితల క్రూరమైన కల్పనల్లో కూడా లేదు.

ఇప్పుడు క్రీ.శ.3560లో అమెరికాలో ఒక పీడకల వాస్తవంగా ప్రత్యక్షమైంది.

ఈ భీతి అంతా నిజమే, ఎందుకంటే క్షుద్ర విద్యలున్నాయని నాకు తెలుసు. అవి అనంతమైనవి. విశ్వవ్యాప్తంగా ఉన్నాయి. వాటిని నేనూ, నా భార్య కూడా సాధన చేస్తున్నాం. అయితే మా విలువలు వేరు.

ఓ సాయంత్రం మాకు చక్రవర్తితో సమావేశానికి సమయం ఇచ్చారు.

అతను ఇప్పుడు తన రాజభవనంలో ఉన్నాడు. కొన్ని సహస్రాబ్దుల క్రితం అది వైట్ హౌస్, ఎన్నోసార్లు పునరుద్ధరించబడింది. ఓడిపోయిన, ఒకప్పటి ఎర్త్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం.

అతను ఎర్రగా మెరుస్తున్న కళ్ళున్న అస్థిపంజరంలా ఉన్నాడు. వెయ్యేళ్ళ కంటే ఎక్కువ వయసున్న ఆ శరీరంపై వజ్రాల కిరీటం, నగలు ఉన్నాయి. మంత్రులు పాతవాళ్ళే ఉన్నారు. కానీ సయోని లేదు. తల వెనుక వైపుగా ఉండేలా చేసి కృత్రిమంగా జీవం పోసిన కారణంగా ఆమె ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం జీవించలేకపోయింది.

“హనీ ఆమ్రపాలి, ప్రకృతి! మిమ్మల్ని ఇక్కడ చూడడం సంతోషంగా ఉంది. నా విజయానికి దోహదపడినందుకు మీరు కూడా చాలా సంతోషంగా ఉండి ఉండాలి” అన్నాడు సమూరా.

ప్రేక్షకులలో వివిధ వర్ణాల వారున్నారు. సాధారణ అంగరక్షకులు, సహాయకులు మాకిచ్చేందుకు పతకాలను తీసుకువచ్చారు. కెమెరాలు ఫ్లాష్‌లతో క్లిక్‌మంటున్నాయి, టీవీ కవరేజ్‌ని భాధ్యతగా నిర్వహిస్తున్నారు. మొత్తం నాగరికతని లోబరుకున్న ఈ గ్రహాంతర జీవుల గుంపుకి నేను  నమస్కరించాలా ?

నా గుండె మండిపోతుండగా, నా హృదయం తిరుగుబాటు చేస్తుండగా నేనందరికీ నమస్కరించాను.

“నాతో చేయి కలుపు హనీ! మొత్తం సౌర వ్యవస్థ మనది. నేను మీ ఖండాన్ని నీకు బహుమతిగా ఇస్తాను. నువ్వో అద్భుతమైన మాంత్రికుడివి. నీ భార్య కూడా నీలా శక్తిమంతురాలే. మీరు నా సామ్రాజ్యానికి ఒక ఆస్తిలా ఉంటారు.”

“కిరీటంలోని రత్నంలా!” అన్నాడు ఒక వృద్ధ మార్షియన్.

“చక్రవర్తికి ధన్యవాదాలు! నేను మీ కోసం చేసినదేదీ స్వచ్ఛందంగా చేయలేదు. నన్ను బెదిరించారు, బ్లాక్‌మెయిల్ చేశారు, బలవంతపెట్టారు. క్విప్పర్ బెల్ట్ వరకు తరిమేసి ప్లూటో, నెప్ట్యూన్‌లకు నన్ను సుప్తావస్థలో తీసుకెళ్ళారు. మాకు జైలు శిక్ష పడింది, అనేక బాధలు అనుభవించాం. ఇక నా గ్రామస్థులంతా బానిసలయ్యారు. నా విశ్వవిద్యాలయం తాంత్రిక విద్యార్థినీ విద్యార్థులకు ఆవాసంగా మారింది. ఇదంతా ఏంటి? నేను మానవుడిని. ఆదర్శవంతమైన మానవ విలువల పట్ల విశ్వాసం ఉన్నవాడిని. క్షమించండి! మా మానాన మమ్మల్ని వదిలేయండి! మేము వెళ్తాము!” అన్నాను.

గట్టిగా నవ్వాడు సమూరా. మత్తులో ఉన్నవాడిలా ఆగకుండా నవ్వుతూనే ఉన్నాడు – విజయం, అమరత్వం మరియు నాగరికతలపై పొందిన అధికారాల సారాన్ని త్రాగినవాడిలా!

“కావలసినంత సమయం తీసుకో! భవిష్యత్తు నాదే! నువ్వు నన్ను అమరుడిని చేశావు, నా విజయానికి కావల్సిన అన్ని వస్తువులను తెచ్చావు. నేను నీకు సమయం ఇస్తాను. నీకు హాని చేయను. నిన్ను గమనిస్తునే ఉంటాను. కానీ మీరు ఇద్దరూ బాగా ఆలోచించుకోండి. మీరు మోసం చేయనంత వరకు నా ఈ ఆహ్వానం ఉంటుంది. మోసం చేయడానికి ప్రయత్నించకండి! నేను అజేయుడిని, విశ్వశక్తితో సర్వాంతర్యామిని. పైగా నేనిప్పుడు మానవులు ఆవిష్కరించిన గొప్ప వస్తువులను కూడా కలిగి ఉన్నాను… నేను నిన్ను గమనిస్తుంటాను. ఇక నువ్వు నిర్ణయించుకుంటే, నువ్వో గొప్ప మాంత్రికుడివి కావచ్చు, ‘దక్షిణ ఆసియా మాస్టర్’ కావచ్చు, మీ స్వంత భారతదేశానికి అధినేతవి కావచ్చు” చెప్పాడు సమూరా.

కొన్ని క్షణాలు ఆగాడు. “మీ అమ్మానాన్నలని చంపినందుకు నీకు నా మీద పగ ఉందని గ్రహించాను. ఒక సామ్రాజ్యం ఏర్పడేటప్పుడు ఇలాంటివి తప్పవు! నన్ను క్షమించు. కానీ నువ్వు నాకు కావాలి! ఆలోచించుకో. నేను నీకు సమయం ఇస్తాను” అన్నాడు.

ఇదే సమూరా అత్యుత్తమ రాజనీతిజ్ఞత, అతను ఉత్తమ వ్యవహారదక్షుడు. అతనిని నేను చంపలేనని నాకు తెలుసు. అతనిని నశింపజేయడానికి వేరే ఇతర పద్ధతులు ఉండాలి. నేను ప్రకృతీ వంగి నమస్కరించి, అతని వద్ద వీడ్కోలు తీసుకుని వెనక్కి నడుస్తూ బయటకు వచ్చాం.

పానీయాలు, ఆహారాలు, నృత్యగానాలతో విందు సందడిగా ఉంది. యువ మాంత్రికుల సమూహం… గ్రహాంతర మాంత్రికులని స్పష్టంగా తెలుస్తున్న సమూహం… రకరకాల మాయాజాల ప్రదర్శనలు చేస్తోంది. ఆ సాయంత్రపు విందు విలాసాలలో విలక్షణమైన పాటలు పాడారు ఆ బృందంలోని వాళ్ళు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here