భూమి నుంచి ప్లూటో దాకా… – 2

    2
    6

    [box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]

    అధ్యాయం4: చందమామ: విలియమ్స్ అండ్ వాట్సన్ స్పేస్ ప్లాట్‌ఫారం

    [dropcap]ఆ[/dropcap]ఫీసర్ ఆన్ డ్యూటీ బల్లకి ఎదురుగా నల్లటి దుస్తులు ధరించిన పొడవాటి వ్యక్తులు పదిమంది నిలుచుని ఉన్నారు. చంద్రుడి కాలమానం ప్రకారం అప్పుడు సమయం తెల్లవారు జామున రెండు గంటలు అవుతోంది. గ్రహాంతర నౌకలకు, ప్రయాణీలకు స్వాగతం పలికి, ఇమ్మిగ్రేషన్ తదితర వ్యవహారాలు చూసే లూనార్ స్పేస్ ప్లాట్‌ఫారం మీద కొంతమంది సందర్శకులు ఉన్నారు. అక్కడ బాగా చీకటిగా ఉంది. చాలా దీపాలు ఆర్పేసి ఉన్నాయి. అర్థరాత్రి దాటింది కాబట్టి రెండే కౌంటర్లు పనిచేస్తున్నాయి. 2064లో మూన్ కాలనీని స్థాపించిన మాజీ అమెరికా అధ్యక్షుడు, బ్రిటీష్ మాజీ ప్రధాని గౌరవార్థం వాళ్ళ పేర్లు ఈ లూనార్ ప్లాట్‍ఫారానికి పెట్టారు. విలియమ్స్ అండ్ విల్సన్ అనే అక్షరాలు కిటికి అద్దాల మీద మెరుస్తున్నాయి.

    “మీరంతా ఆల్ఫా సిస్టమ్ నుంచి వచ్చారా?” ఆశ్చర్యంగా అడిగాడు ఇమ్మిగ్రేషన్ క్లర్క్.

    నల్లని ఆ పది ఆకారాలు అవునన్నట్టు తలలు ఊపాయి.

    “ఆల్ఫా సెంటారీ యొక్క సిస్టమ్ కెప్లర్ నుంచి వచ్చాం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే జంటతారలలో ఒకటైన ఆల్ఫా వన్ దగ్గర నుంచి వచ్చాం”

    “అబ్బో. చాలా దూరం నుంచే వచ్చారు!” ఇంకా ఆశ్చర్యపోతున్న ఆ క్లర్క్ అన్నాడు. వాళ్ళ స్పేస్ పాస్‍పోర్టుల డిజిటల్ పేజీలను తిప్పుతూ.. “చాలా గ్రహాలకే వెళ్ళారు…” అంటూ.. “…విశ్వశక్తిని హేతుబద్ధంగా ఉపయోగించగల నిపుణులు మీరు అని ఇక్కడ రాసి ఉంది. అంటే ఏంటి?” అని అడిగాడు.

    తరువాత వాళ్ళ కేసి చూశాడు. మళ్ళీ కంప్యూటర్ తెరకేసి చూశాడు.

    “జెంటిల్‌మెన్! మీ మీద పూర్తి గౌరవంతో చెబుతున్నాను. విశ్వశక్తిని సాధన చేసే అందరిలానే మీరు కూడా మైండ్ అండ్ బాడీ చెకప్ చేయించుకోవాలి. విశ్వశక్తిని ఉపయోగించేవారి ప్రవేశంపై చంద్రుడి అమృత కాలనీలో నిషేధం ఉంది. దయచేసి పక్కకి నిలబడండి” అన్నాడు.

    ఒక బటన్ నొక్కాడు. లేజర్ గన్స్‌ పట్టుకుని దూరంగా తచ్చాడుతున్న సెక్యూరిటీ సిబ్బంది కౌంటర్ వైపు రాసాగారు.

    “సాధారణ సెక్యూరిటీ సిబ్బంది మీ ఆయుధాలు, ఆరోగ్య ప్రమాదాలని పరీక్షిస్తారు. విశ్వశక్తిని గుర్తించగలిగే ప్రత్యేక సిబ్బంది మీలో మా కాలనీని కలుషితం చేసే ఏవైనా దుష్టశక్తులుంటే గుర్తిస్తారు. దయచేసి పక్కకి నిలుచోండి” అన్నాడా క్లర్క్.

    ఆ పది నల్లని ఆకారాలు పక్కని జరిగి నిల్చున్నాయి. ఉన్నట్టుండి ప్రార్థిస్తున్నట్టుగా చేతులు పైకెత్తి, అన్ని ఆకారాలు ఒకేసారి మెల్లగా పరాయి భాషలో ఏవో ఉచ్చరించసాగాయి.

    ఉన్నట్టుండి ఆ ఫ్లాట్‌ఫారం చల్లగా అయిపోయింది. దీపాలు ఆరిపోయాయి. విద్యుత్ సరఫరా ఆగిపోయి అక్కడ దట్టమైన చీకటి అలుముకుంది.

    విశ్వశక్తిని ఉపయోగించే వారిని పరీక్షించే చంద్రుడి అమృత కాలనీ సైనికులు తమ మెరుపుల మంత్రదండాలను పట్టుకుని ఆ ఆకారాల వైపుకు దూసుకువచ్చారు.

    “ఆపండి. ఇక్కడ విశ్వశక్తిని ప్రయోగించడానికి వీల్లేదు”

    అప్పుడు అక్కడ భయంకరమైన చీకటి ఏర్పడింది. రెండు బృందాల వారి అరుపులు, తుపాకీలు పేలుస్తున్న చప్పుళ్ళు వినిపించాయి.

    నిశీధి కొనసాగింది.

    ***

    యురేకస్ 7776 ఛాతి ప్రాంతంలో ఉన్న కంప్యూటర్ తెర బ్లాంక్ అయిపోయింది.

    సమూరా కోసం యురేకస్ ఐజినెట్‍ యూట్యూబ్ వెతికి, భద్రపరచగలిగిన అతి తక్కువ వీడియోలలో ఒకదాన్ని నేనిప్పుడు చూశాను.

    ఒకనాటి ఇంటర్‍నెట్‌కి యూట్యూబ్‍ ఇప్పుడు ఇంటర్ గెలాక్టిక్ యూట్యూబ్‌గా రూపాంతరం చెందింది. విశ్వం నలుమూలల నుంచి ఔత్సాహికులు, హాకర్లు, వృత్తి నిపుణులు ఒకే రకమైన ఆసక్తితో ఎన్నో వీడియోలు పోస్ట్ చేస్తూంటారు.

    “నా కలలో కనిపించినట్టే ఉంది” యురేకస్‍తో చెప్పాను. “నాకొచ్చిన ఆ పీడకలలో ఇలా నల్లటి ముసుగులు వేసుకున్న వ్యక్తులు బూడిద నుంచి ఓ సయోనీని సృష్టించడం నాకు బాగా గుర్తుంది. ఈ ఆకారాలు వాళ్ళే అనడంలో నాకెటువంటి సందేహమూ లేదు. వాళ్ళు చంద్రుడిపైకి చేరారు” అని చెబుతూ, “యురేకస్, నీకు ఈ క్లాసిఫైడ్ క్లిప్ ఎలా దొరికింది?” అని అడిగాను.

    ఎర్త్ కౌన్సిల్ పిలుపు మేరకు మేము నార్త్ అమెరికన్ జోన్‌కి ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇండికా సెంట్రల్ యూనివర్సిటీలో మా అపార్ట్‌మెంట్‌లో వేచి ఉన్నాం. అప్పుడే యురేకస్ ఐజినెట్ యూట్యూబ్‌లోని వేలాది క్లాసిఫైడ్ వీడియోలలోంచి దీన్ని సంపాదించింది.

    “ఇది చాలా విలువైన సాక్ష్యం మాస్టర్. దుష్టశక్తులు చంద్రుడిపైకి ప్రవేశించాయనడానికి ఇదే గొప్ప సాక్ష్యం. వాళ్ళు లూనార్ ఫ్లాట్‌ఫారం మీద సెక్యూరిటీ చెక్ తప్పించుకుని చంద్రుడి చీకటి వైపుకి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళని గుర్తించలేకపోయారు. అనేక మంది ఇంటలిజెన్స్ సిబ్బంది, డిఫెన్స్ సిబ్బంది అందించిన సమాచారం ప్రకారం వాళ్ళతో పాటు సమూరా ఉన్నాడన్నది ఖచ్చితంగా చెప్పవచ్చు” అంది యురేకస్.

    “ఈ సమాచారమంతా ఎలా సంపాదించావు యురేకస్?” అడిగాను ఆ రోబో డాటా కలెక్షన్, విశ్లేషణా శక్తులకు అబ్బురపడుతూ.

    అంగారకుడిపై తయారైన ఈ రోబోలో ఒక లోపం ఉంది. అది నవ్వలేదు… లేదా ప్రశంసని స్వీకరిస్తున్నట్టుగా తన కాలర్‌ని సర్దుకోలేదు.

    “నా మొదటి సృష్టికర్తలు నన్నలా తయారుచేశారు మాస్టర్.  మీరు మాట్లాడే అందరి వ్యక్తులకు సంబంధించిన వివరాలు సేకరించడం, ఐజినెట్ నుంచి వివరాలు సేకరించడం, ఫొటోలు, వీడియోలు, పుకార్లు…. ఏవైనా సరే వాటిని సేకరించడం, విశ్లేషించడమే నా విధి!” అని చెబుతూండగానే దాని స్క్రీన్‌పైన సమూరా, సయోనీలకు సంబంధించిన సమాచారం ప్రత్యక్షమైంది.

    “సమూరా, సయోనీలకి సంబంధించి అన్ని సమాచారాల కొరకు వెతుకుతునే ఉన్నాను. సౌరవ్యవస్థలో గ్రహాంతరవాసులు చేసే నేరాలకి సంబంధించి ఎప్పటికప్పుడు నాకు తెలిసేలా అలెర్ట్స్‌ ఏర్పాటు చేసుకున్నాను. సమూరా భూమి మీద మాంటెగొమరీ స్పేస్ ఎలివేటర్ నుంచి పారిపోయిన కొన్ని రోజులకి ఈ ఘటన జరిగింది. కాబట్టి విశ్వశక్తిని ఉపయోగించడంలో నిపుణులైన తన మిత్రులు, సిబ్బందితో కలసి సమూరా చంద్రుడిపైకి అక్రమంగా ప్రవేశించినట్టు ఊహిస్తున్నాను”.

    “మరి ఈ ఆల్ఫా సిస్టమ్ ఏంటి?”

    “మాస్టర్! ఆల్ఫా సిస్టమ్ అనేది ఆల్ఫా, ప్రాక్సిమా అనే జంట నక్షత్రాలలో ఆల్ఫా నక్షత్రానికి చెందినది. పాలపుంతలో సూర్యుడికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఇది. ఆల్ఫా సిస్టమ్‌లో కెప్లర్ బి అనే గ్రహం ఉంది. ఇది మానవుల ఆవాసానికి అనుకూలమైనది…”

    “అలాగా. ఒకవేళ వాళ్ళు కనుక ఆల్ఫా సిస్టమ్ నుంచే వచ్చి ఉంటే వాళ్ళు కూడా విశ్వశక్తిని ఉపయోగించడంలో సమూరాలా సిద్ధహస్తులై ఉంటారు. లేదా సమూరా మనుషులే నకిలీ పత్రాలతో ఈ అవతారాలు ఎత్తి ఉంటారు”.

    “ఏదైనా కావచ్చు. కాని ఆ నల్ల వ్యక్తులది దాదాపుగా అక్రమ ప్రవేశమే. స్పేస్ ఎలివేటర్ ఘటన తర్వాత జరిగినది కాబట్టి మనం దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

    ఇండికా సెంట్రల్ యూనివర్సిటీలో వివాహిత సిబ్బందికి ఇచ్చే క్వార్టర్స్‌లో నేను ప్రకృతీ ఇప్పుడిప్పుడే వైవాహిక జీవితం ప్రారంభించాం. మా పెళ్ళయి కొన్ని వారాలే అయ్యింది. ప్రకృతి సమక్షంలోని పరవశం, మల్లెల గులాబీల పరిమళం, మధ్యధరా సముద్రం వద్ద అందమైన బీచ్‍‌లో నీలి, తెలుపు కెరటాలని చూస్తూ గడిపిన సంతోషకరమైన క్షణాలు…. నా మనసులో తాజాగా ఉన్నాయి.

    వెచ్చని రాత్రులలో పక్కమీద తను, ఆమె గుసగుసల సంగీతం, జరగబోయేదాన్ని ఆశిస్తూ ఆమె గుండెలదరడం… తియ్యని జ్ఞాపకాలు.

    ప్రకృతి సమక్షం, పరమానందం పొందేందుకు మా శరీరాలు అల్లుకుపోవడం….

    చివరికి తృప్తిగా నిట్టూర్చడం… మంద్రస్వరంలో మాట్లాడుతూ విడివడడం…

    ఒక స్వప్నంలా ఉంది. వాస్తవిక స్వప్నం! మధుర స్మృతులతో, తృప్తినిండిన రాత్రుళ్ళతో జీవితం గడిచిపోతోంది.

    ఇప్పుడు ఈ పిలుపు! అత్యంత శక్తివంతమైన ఎర్త్ కౌన్సిల్ నుంచి వచ్చిన కబురు! వారి ఆజ్ఞని పాటించక తప్పదు.

    “ప్రకృతీ సామన్లు సర్దు. నార్తర్న్ టెరిటరీ 001కి వెళ్ళాలి. యురేకస్ ప్రయాణపు ఏర్పాట్లు చేస్తాడు. మన సమ్మతిని వాళ్ళకి తెలియజేస్తాడు.”

    “సరే, మాస్టర్!” అంది యురేకస్. “మాస్టర్, నేనూ వస్తాను. ఎందుకంటే, అన్ని ఖర్చులు… వ్యక్తిగత రోబోతో సహా వాళ్ళే భరిస్తామని అంటున్నారు కదా, ఇక నేనూ మీతో పాటు రావడంలో ఇబ్బందేమీ లేదు”.

    అధ్యాయం5: ఏరియా 001: నాల్గవ సహస్రాబ్ది – భూమి – 3466 సంవత్సరం

    మధ్య ఆసియా జోన్‍లో ఉన్న ఇండియా సెంట్రల్ నుంచి ఏరియా 001కి 6 గంటల ప్రయాణం. గత శతాబ్దాలలో దీన్ని నార్త్ అమెరికా అని పిలిచేవారు. అసాధారణమైన శాస్త్ర, సాంకేతిక, సైనిక, ఆర్థిక శక్తుల సహాయంతో ఈ ప్రాంతం ఇప్పటికీ మొత్తం భూగోళాన్ని ప్రభావితం చేస్తోంది. ధ్వని వేగం కన్నా ఎన్నో రెట్లు అధికమైన వేగంతో ప్రయాణించే హైపర్‌సోనిక్ విమానాల ద్వారా ఈ దూరాన్ని ఇంత తక్కువ కాలంలో చేరుకోగలుగుతున్నాం.

    అయితే విమానం టికెట్టు మాత్రం బాగా ఖరీదు. ఇంటర్ గెలాక్టీ కరెన్సీ యూనిట్లతో లెక్కిస్తే ఒక హైపర్‌సోనిక్ విమానం టికెట్టు ఖరీదుతో మూడో తరగతిలో చంద్రుడి మీదకి ప్రయాణించవచ్చు. ఆ టికెట్టు ధర 20000 యూనిట్లు. అందుకే మధ్య ఆసియా ప్రజలు అభివృద్ధి చెందిన నార్త్ అమెరికా ప్రాంతానికి తరచూ వెళ్ళలేరు.

    టెక్నాలజీ విషయంలోనూ, సాంకేతికత విషయంలోనూ ఏరియా 001 ఏ గ్రహాంతర కాలనీలకు తీసిపోదు. ఎందరో మాజీ అమెరికన్లు, బ్రిటీషర్లు, కెనడియన్లు ఈ ప్రాంతానికి వచ్చేశారు. ఇక్కడ్నించి చంద్రుడిపైకి వెళ్ళి అక్కడో కాలనీ ఏర్పాటు చేసుకున్నారు. సౌరవ్యవస్థలో అత్యాధునిక కాలనీ ఇది.

    21వ శతాబ్దపు ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల నుంచి ఆవిర్భవించిన ఎర్త్ కౌన్సిల్‌లో బహుళ జాతీయ నేతలు ఉన్నారు. భూమి యొక్క వ్యవహారాలను నియంత్రించే అత్యంత శక్తివంతమైన సంస్థ.

    ఇదో కొత్త ప్రపంచం.. కొత్త నాగరికత. ఉన్నతమైన ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. అయితే అదే సమయంలో చాలా విషయాలు నిగూఢంగా, అర్థం కాకుండానే ఉన్నాయి. మనుషులందరికీ ఎంతో స్వేచ్ఛ ఉంది, కానీ వారికే తెలియని అత్యంత శక్తివంతమైన శక్తులతో వారు నియంత్రించబడతారు. ‘1984’ అనే ఆంగ్ల నవలలో లాగా జనాలపై నిరంతర నిఘా ఉంటుంది, కనపడని ‘పెద్దన్నలు’ వాళ్ళని కాపాడుతూంటారు. నా విషయానికొస్తే, విశ్వశక్తి, టెలిపతీ, మైండ్ కంట్రోల్‌లపై పట్టు ఉన్న దుష్ట గ్రహాంతరవాసులు నాపై నిఘా ఉంచారు.

    33వ శతాబ్దమంతా – మంచికి ప్రతిరూపమైన సాంప్రదాయక శాస్త్ర విజ్ఞానానికీ, చెడుకు ప్రతినిధులైన దుష్ట, చీకటి శక్తులకు మధ్య జరిగిన పోరాటానికి – సంబంధించినదని నేను భావిస్తాను.

    దైవమూ, దెయ్యమూనా? నాకు అమితాశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఇరువర్గాలలోను రెండు లక్షణాల వాళ్ళూ ఉండడం! శాస్త్రసాంకేతిక రంగాలలో శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్న భూగోళవాసులందరూ మంచివాళ్ళు కాదు. అదే విధంగా, అద్భుత శక్తులున్న అందరూ చెడ్దవాళ్ళు కాదు. నా జీవితంలోంచే ఇందుకు ఉదాహరణలు ఇవ్వగలను – మా నాన్న, అరుణ మైదానాలకు చెందిన మీరోస్, టైటాన్‌కి చెందిన డిమిట్రీ, ఇంకా నేను! జనరల్ గ్యాని ఆన్ గారక్ గుర్తొచ్చాడు. అతను మానవుడే కానీ, నేను విశ్వశక్తిని ఉపయోగించగల మాంత్రికుడనని నన్ను అసహ్యించుకున్నాడు, వెంటాడాడు.

    న్యూ హోప్ సిటీ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండవగానే నా హృదయం సంతోషంతో ఉప్పొంగింది. న్యూ హోప్ సిటీ అంటే వందల ఏళ్ళ క్రితం నాటి న్యూ యార్క్ నగరమే.. 2650 సంవత్సరంలో టోర్నడోలు, వరదలు నాశనం చేయగా, పునర్నిర్మితమైన నగరం. విమానం నెమ్మదిగా ల్యాండ్ అయి, టెర్మినల్ వైపు సాగుతుండగా ప్రకృతి నా చేయి పట్టుకుంది.

    “భూమి మీద అత్యంత శక్తివంతమైన న్యూ హోప్ సిటీలోకి అడుగుపెడుతున్నాం. భూమిని నియంత్రించే ఎర్త్ కౌన్సిల్ వారి అధికారిక కేంద్రం ఇది” చెప్పాను.

    యురేకస్ 7776 కళ్ళు మిటకరించింది. మెటాలిక్ స్వరంతో… “ఇది – ఒకప్పటి ఉత్తర అమెరికా అయిన ఏరియా 001కి చెందిన న్యూ హోప్ సిటీ. జనాభా రెండు మిలియన్లు. వైశాల్యం వంద చదరపు మైళ్ళు. భూతలం, గగనతలం నుంచి పలు రకాలుగా రక్షింబడుతున్న నగరం. అత్యంత ధనిక నగరం, భూమి మీద శాస్త్రవిజ్ఞానం అత్యధికంగా అభివృద్ధి చెందిన నగరం. ఫ్లయింగ్ కార్లు, మాగ్నెటిక్ ట్రైన్స్ ఈ నాల్గవ సహస్రాబ్ది సంపదకి చిహ్నాలు…” అని చెప్పింది.

    ఇమ్మిగ్రేషన్ కౌంటర్ దగ్గరకి రాగానే, పొడవాటి బలిష్ఠమయిన ఆఫీసర్లు నన్ను బయోమెట్రిక పద్ధతిలోనూ, ఇంటర్‌స్టెల్లార్ స్కానర్లతోను పరీక్షించారు. ఇంతలో మా కోసం అరైవల్ ఏరియాలోని పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ నుంచి ఒక ప్రకటన వెలువడింది.

    “మిస్టర్ హనీ ఆమ్రపాలి, మిసెస్ ప్రకృతి ఆమ్రపాలి, రోబో యురేకస్‌లకు – ఏరియా 001 న్యూ హోప్ సిటీ స్వాగతం పలుకుతోంది. మీ బ్యాగేజిని ప్రయారిటీ బేసిస్‌లో బెల్ట్ 1 నుంచి తీసుకోండి. రాయబార కార్యాలయానికి చెందిన అధికారి మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకు గేట్ నెంబర్ 1 దగ్గర ఉన్నారు. మీ కారు నెంబరు సిడి ఎ 1.”

    మేం ముగ్గురం – పురుషుడు, స్త్రీ, యంత్రం – మా బ్యాగేజిలు తీసుకుని బయటకి నడిచాం.

    అధ్యాయం6: న్యూ హోప్ సిటీ

    పది చదరపు మైళ్ళ వైశాల్యంలో విస్తరించి ఉన్న భారీ భవనాల సముదాయం ఆ ఎయిర్‌పోర్ట్. ఎన్నో ఖండాంతర విమానాలు రోజూ వస్తుంటాయి, పోతుంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది – ఇక్కడ స్పేస్‌పోర్ట్ ఉండడం. ఇతర గ్రహాల కాలనీలకు వెళ్ళే స్పేస్‌క్రాఫ్ట్‌లను ఎక్కేందుకు అంతరిక్షంలోని లా టెర్ స్పేస్ ప్లాట్‌ఫారంపైకి వెళ్ళే స్పేస్ షటిల్స్ ఇక్కడి నుంచే బయల్దేరుతాయి. అది కొత్త సహస్రాబ్ది. ఈ నగరం 21వ శతాబ్దం నాటి న్యూ యార్క్.  టార్నెడోలు, వరదలు, తీవ్రవాదులు, అగ్నిప్రమాదాల వల్ల ఎన్నోసార్లు నాశనమై, ఎన్నో రకాలుగా పునర్నిర్మితమైన నగరం. 27వ శతాబ్దంలో అణుబాంబు ప్రయోగించడంతో ఈ నగరంపై చివరి దెబ్బ పడినట్లయింది. అణుధార్మికత భయంతో చాలామందిని నగరం నుంచి తరలించారు. ఆధునిక గ్రహాంతర వలసలు 30వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి. ఎందరో న్యూ యార్క్ నగరవాసులు సౌరవ్యవస్థలోని సుదూర గ్రహాలలోని కాలనీలకు ఆద్యులు. కాంతివేగం కన్నా ఎక్కువ వేగంతో నడిచే టాచ్‌యాన్ సిస్టమ్స్ ద్వారా ఇంటర్ గెలాక్టిక్ ప్రయాణాలు చేసి సూదూర అంతరిక్ష ప్రయాణాలకు మార్గదర్శకులయ్యారు.

    నాలుగో సహస్రాబ్దికొచ్చేసరికి మానవుల చరిత్ర విస్తృతమైంది, భౌగోళికంగానూ ఎన్నో మార్పులొచ్చాయి. అయితే ఒకప్పుడు విపరీతమైన జనాభాతో కిక్కిరిసిన ఖండాలన్నీ ఇప్పుడు జనాలు లేక బోసిపోయాయి. పేద ప్రాంతాల ప్రజలంతా మెరుగైన జీవనం కోసం ధనిక ప్రాంతాలకు వలసపోయారు. మిగిలిన ధనికులు న్యూ హోప్ సిటీ నుంచి తన ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో మొత్తం భూమిని నియంత్రిస్తున్నారు. రహస్యంగా నిరంకుశ పాలనని అమలుచేస్తున్నారు.

    “మిస్టర్ హనీ ఆమ్రపాలి, మిసెస్ ప్రకృతి ఆమ్రపాలి…. ఒకటో నెంబరు గేటు వద్దకు రావల్సిందిగా మీకు సూచించడమైనది. మీకు స్వాగతం పలకడానికి ఎర్త్ కౌన్సిల్ సైన్ బోర్డుతో ఒక కారు సిద్ధంగా ఉంది” అని ఎయిర్‍పోర్ట్ లోని డిజిటల్ స్పీకర్స్ నుంచి లో ఫ్రీక్వెన్సీలో ఒక ప్రకటన నా చెవులకు చేరింది.

    మా బ్యాగులుంచిన ట్రాలీలను తోసుకుంటూ బయటికి నడిచాము. శతాబ్దాలు గడిచినా ఈ పద్ధతి పెద్దగా మారలేదు. అయితే మాగ్నెటిక్ మోటార్ సిస్టమ్స్ రావడం వల్ల ట్రాలీల బరువు బాగా తగ్గిపోయింది, దాంతో తేలికగా తోసుకోవచ్చు.

    రకరకాల జాతీయతలు కల్గిన మనుషులు, వేర్వేరు రంగులు, పలు జాతుల వ్యక్తులు కలిసి నడుస్తున్నారు. అక్కడక్కడా విచిత్రమైన దుస్తులతో, తలపై యాంటీనాలతో, పైకి లేచిన జుట్టుతో కొంతమంది గ్రహాంతరవాసులు కూడా కనబడుతున్నారు. పలు గ్రహాంతర నమూనాల రోబోలు కనబడుతున్నాయి.

    అసలీ న్యూ హోప్ నగరమే గ్రహాంతవాసుల నిలయంలా అనిపించింది నాకు. పొడవైన తెల్లని శరీరవర్ణంబంగారురంగుజుట్టూ, నీలి కళ్ళతో ఫార్మల్‌వేర్ దుస్తులు ధరించిన ప్రతి ఒక్కరి చేతిలోనూ చిన్నదో పెద్దదో ఏదో ఒక గాడ్జెట్ ఉంది లేదా ఒక మొబైల్ ఫోన్ లాంటి పరికరం ఉంది లేదా ఒక రోబో ఉంది. ఎయిర్‌పోర్ట్ కూడా అతి భారీ ప్రదేశం. ఆటోమేటిక్ మిషన్స్ సమాచారం అందించడం ఎన్నో చోట్ల కనబడుతోంది.

    బయటకి నడుస్తుంటే – ఓ మనిషి, విచిత్రమైన దుస్తులలో ఉన్న ఓ మహిళ చేతులు కలుపుకుని నడుస్తూ కనబడ్డారు. ఆ మనిషి పొడుగ్గా, నీలి కళ్ళతో ఉన్నాడు. ఆ మహిళ జీన్స్, జాకెట్ ధరించి ఉంది. ఆమె అతనితో ఏదో ఊసులాడుతోంది. గ్రే మెటాలిక్ స్కిన్ టైట్ డ్రెస్ వేసుకుందామె. ఆ డ్రెస్‌‍ పై భాగంలో ఎద అందాలు ప్రింట్ చేయబడి ఉన్నాయి. ఆమె పొడవాటి జుట్టు వంకీలు ఉంగరాలుగా మెలితిరిగి ఉంది. ఏదో అద్భుత లోకపు వనితలా నెమ్మదిగా నడుస్తూ, అందంగా నవ్వుతోంది.

    తన పక్కనున్న మనిషి కేసి చూస్తూ నవ్వినప్పుడు ఆమె కళ్ళలో ఏదో మెరుపు! తమకు ప్రియమైన వ్యక్తి పక్కనున్నప్పుడు స్త్రీలలో కలిగే పారవశ్యపు వయ్యారం అది!

    ప్రకృతి కూడా వాళ్ళిద్దరిని అబ్బురపడుతూ చూసింది, చిన్నగా నవ్వింది.

    “గొప్ప ప్రేమికులు కదూ” అన్నాను ప్రకృతి చెవిలో గుసగుసగా. “ఎక్కడో 20వ శతాబ్దపు నవలలో చదివాను – భూమి ప్రేమ చుట్టూ తిరుగుతుంది, యుద్ధం చుట్టూ కాదని” అని పైకే అన్నాను.

    గొంతు సవరించుకోవాల్సిన అవసరం లేని యురేకస్ వెంటనే అంది.

    “మాస్టర్! ఈ జీవితం మీకు పరిచయం లేనిది. కానీ నేను రోబోని. యూనివర్సల్ ఎన్‌సైక్లోపీడియా గెలాక్టికాని బ్రౌజ్ చేస్తుంటాను కాబట్టి నాకు తెలుసు. వాళ్ళదో వింత వివాహం. ఇప్పుడు ఇటువంటి వివాహాలు ఇక్కడ ఆమోదించబడుతున్నాయి. ఏరియా 001లో చట్టబద్ధమైనవి…”

    “ఏంటీ?” అన్నాను ఆశ్చర్యంగా.

    “నిజం మాస్టర్! మీరు షాక్‌ అవడం సరైనదే. ఆమె మహిళా రోబో. అతను ఆమెని పెళ్ళి చేసుకున్నాడు. మనిషి, యంత్రాల వివాహాలను ఏరియా 001లో ఇక్కడి అధికారులు ఆమోదిస్తున్నారు. కండరాలూ, మెదడు కలిగి కోరికలు ఉన్న మగవారికి ఉపయోగపడే అత్యంత ఆధునికమైన ఫిమేల్ రోబో.”

    “ఏంటీ?” అంటూ నేను మళ్ళీ నోరెళ్ళబెట్టాను.

    ప్రకృతి కూడా నవ్వింది.

    “హాస్యాలొద్దు యురేకస్! ఇలాంటివెన్నడూ వినలేదు” అంది.

    “నిజం మేడమ్. ఆమె నడిచే తీరు చూడండి. ఆమె చుట్టూ ఉన్న శక్తి వలయాన్ని నేను గుర్తిస్తున్నాను. పైగా ఇది చట్టబద్ధం”

    “రోబోలను పెళ్ళి చేసుకోవడం…” అంటూ అక్కడికి ఆ సంభాషణ ముగించాను. కొత్త సహస్రాబ్దిలో ఇదో వింత!

    నన్ను నేను సంబాళించుకుని ముందుకు సాగాను. నాకు చాలా విషయాలు తెలుసని భావించాను, కాని నేను ఊహించలేని వింతైన విషయాలు ఉన్నాయని అర్థమవుతోంది. విశ్వశక్తిని కలిగి ఉన్న వింతజీవులను, భారీ ఎద అందాలతో, తల మీద యాంటినాలతో ఆపుకోలేని శృంగార వాంఛలు ఉన్న స్త్రీలను టైటాన్‌లో చూసినప్పుడు – ఇదేమంత పెద్ద వింత కాదనిపిస్తోంది.

    “విజ్ఞానం, సేవలు, పైగా శారీరక సుఖం….” చెప్పుకొచ్చింది యురేకస్. “ఫిమేల్ రోబో మగాడి అహాన్ని సంతృప్తి పరుస్తుంది. బాగా ఆకట్టుకునే అంశం ఏంటంటే – మగవాడి అవసరాలకు తగ్గట్టుగా ఫిమేల్ రోబోని ప్రోగ్రామ్ చేసుకోవచ్చు.”

    “సరే… సరే… ఈ మాటలు ఇక్కడితో ఆపేద్దాం. రకరకాల పనుల చేయడం కోసం సృష్టించబడ్డ యంత్రం అదని మనకి తెలుసు. మిగతా విషయాలు తరువాత. కానీ ఒక యంత్రం…. ఎలా….?” సిగ్గుతో ఇక మాట్లాడలేకపోయింది ప్రకృతి.

    యురేకస్ తన ప్రొఫెషనల్ మెకానికల్ స్వరంతో చెప్పడం కొనసాగించింది.

    “పునరుత్పత్తి ప్రక్రియ గురించి మీ సందేహానికి జవాబు ఉంది. ఆర్టిఫీషియల్ ఇన్‌సెమినేషన్, టెస్ట్ ట్యూబ్‌లో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా సంతానం పొందుతారు. పిండం ఎదుగుదలని లేబొరేటరీలో ప్రోగ్రామ్ చేసి, నియంత్రింవచ్చు. కావాలనుకుంటే ఆ మగవాడు తన కణాల జెనెటిక్ క్లోనింగ్ ద్వారా పిల్లల్ని కనవచ్చు. తన లాగే ఉంటారా పిల్లలు. ఎందుకంటే అందరూ రోబో భార్యలని పొందలేరు. అది అత్యంత ఖరీదైన వ్యవహారం…”

    “ఎంత?” అడిగాను షాక్ నుంచి తేరుకుంటూ.

    “ఒక మిలియన్ యూనివర్సల్ కరెన్సీ యూనిట్లు. లేబొరేటరీలో మీ పిల్లలని కనాలనుకుంటే ఇంకా ఎక్కువ”.

    “ఓహ్! థాంక్ గాడ్. సగం యంత్రం, సగం మనిషి కలగలిసి పుడతారేమో. నీ సమాచారానికి థ్యాంక్స్ యురేకస్” అంది ప్రకృతి.

    “అవును మేడమ్. సగం యంత్రాలుగా ఉన్న హ్యుమనాయిడ్స్ బయటి గ్రహాలలో ఉన్నారు. కానీ భూమి మీద లేరు. ఇక్కడ అనుమతులు లేవు..”

    “ఇది నాకు తెలుసు.  మనమింకా హ్యుమన్-మషీన్స్ సిస్టమ్స్ తయారీ దశలోనే ఉన్నాం. ఆ సైన్సులో తొలి దశలోనే ఉన్నాం…” అన్నాను నేను.

    బయటకు రాగానే ఒక పెద్ద నల్లని లిమోసిన్ కనబడింది. పక్కనే డ్రైవరు ఒక డిజిటల్ సైన్ బోర్డు పట్టుకుని ఉన్నాడు. దాని మీద ‘వెల్‍కమ్ హనీ ఆమ్రపాలి’ అనే అక్షరాలు వెలిగి ఆరుతున్నాయి. ఆ కారు మీద ఎర్త్ కౌన్సిల్ వారి చిహ్నం – నీలీ ఆకుపచ్చ రంగులలో భూమి – కనబడింది.

    రోబో మా సామాన్ల ట్రాలీలు తోసుకువస్తుండగా మేము కారుకేసి నడిచాం. డ్రైవర్ నవ్వుతూ… మాకెదురొచ్చాడు. “వెల్‍కమ్ మిస్టర్ అండ్ మిసెస్ హనీ ఆమ్రపాలి. ఎర్త్ కౌన్సిల్ మీ కోసం పంపిన వాహనం ఇది”అంటూBien-venue అని ఫ్రెంచ్‌లో స్వాగతం చెప్పి, హిందీలో”స్వాగత్” అన్నాడు.

    “మాతో ఇంగ్లీషులో మాట్లాడవచ్చు. వెడదాం” అన్నాను.

    “మీ బస కెప్లర్ గ్రాండ్ షెరటాన్ హోటల్‌లో ఏర్పాటు చేయబడింది…” అంటూ. “ఇటు రండి సర్..” అంటూ దారి చూపాడు డ్రైవర్.

    డ్రైవర్ తలుపులు తీయగానే మేము సీట్లలో కూలబడ్డాం. ముందు సీట్లో కూర్చున్న యురేకస్ కన్నా శ్రద్ధగా గమనిస్తున్న పకృతి నా చెవిలో గుసగుసలాడింది.

    “ఓహ్… దేవా.. భైరవా… హనీ! ఇతను మనిషి కాదు. ఇతని గొంతు విను. ఇతను హ్యుమనాయిడ్. రోబో డ్రైవర్…”

    కార్ మెకానికల్ వాయిస్ కమాండ్‌తో స్టార్ట్ అయ్యింది, పార్కింగ్ లాట్ నుంచి దూసుకుపోయింది. ప్రయారిటీ సెక్యూరిటీ ఎగ్జిట్ అప్పటికే తెరవబడింది.

    లిమోసిన్ నిజంగానే గాల్లో ఎగిరినట్లుగా న్యూ హోప్ ఎయిర్‌పోర్టు నుంచి కెప్లర్ గ్రాండ్ షెరటాన్ హోటల్‌కి దూసుకుపోయింది.

    (ఇంకా ఉంది)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here