[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]
అధ్యాయం 60: తిరుగుబాటు ప్రారంభం
[dropcap]ఆ[/dropcap]సియా ప్రాంతపు, భారతదేశం యొక్క గవర్నర్ జనరల్‌గా కొన్ని రోజుల పాటు అనేక విషయాలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించాను. అఘోరీల పాలనలో బానిసలుగా బతుకుతున్న బీదలను విముక్తి చేయడం, దెబ్బతిన్న పట్టణాలు మరియు విద్యా సంస్థల పునర్నిర్మాణం మొదలైనవాటికి ప్రాధాన్యతనిచ్చాను. అధికారులందరిని సమావేశానికి పిలిచాను. విద్యార్థులకు పరిశోధన మరియు సరైన విద్యను తిరిగి ప్రారంభించటం ఎంత ముఖ్యమో వారికి వివరించాను. సాంకేతిక ప్రక్రియలు అవసరమని వాదించాను, మంత్రశక్తులు, విశ్వశక్తి యొక్క అభ్యాసంతో అవీ పాటూ ఉండాలని గట్టిగా చెప్పాను. ఆర్థికాభివృద్ధి, మానవ హక్కుల ప్రాముఖ్యత గురించి వారికి చెప్పాను. అనేక కమిటీలను నియమించడం ద్వారా పరిపాలనా, ఆర్ధిక, విద్యా సంస్కరణలు అమలు చేయడంలో తలమునకలయ్యాను. నిధులు మంజూరు చేయమని న్యూ హోప్ నగరంలోని విజార్డ్ కౌన్సిల్‌కు ఉత్తరాలు పంపాను.
అప్పుడు ఆ ఘటన జరిగింది.
ఈ కాలమంతా… ప్రకృతి, ఏనిమోయిడ్ నిశ్శబ్దంగా నన్ను గమనిస్తున్నారు. అప్పుడే నా ప్రతిపాదనలను తిరస్కరిస్తూ అమెరికాలోని న్యూ హోప్ లోని విజార్డ్ కౌన్సిల్ నుండి లేఖ వచ్చింది.
“మీరు చక్రవర్తి విధానాన్ని మార్చలేరు. మిత్రపక్షాల పాలనను అమలుచేయాలి. భూమి మాత్రమే కాదు, ఇతర అన్ని గ్రహాలు మాంత్రికుల పాలనలో ఉన్నాయి. ఇది విశ్వశక్తి యొక్క నియమం. మనకు తగిన సాంకేతిక ప్రక్రియలు ఉన్నాయి! కొత్త అభివృద్ధికి ఎటువంటి అవసరం లేదు.” నా సంస్కరణలు, నిధుల కోసం నా అభ్యర్థన అన్నీ బుట్టదాఖలయ్యాయి.
ఓరోజు గంభీరమైన ఆలోచనలలో మునిగి ఉండగా నా గదిలో యురేకస్ వచ్చింది.
“మాస్టర్! మీకు రహస్య సందేశాలు! నేను డీకోడ్ చేశాను. మీరు మాత్రమే చూడాలి” అంది.
అన్ని సందేశాలలో విషయం ఒకటే.
“పదిరోజులలో తిరుగుబాటు భూమి మీద అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. ఇది ఆసియా, అమెరికా, ఆఫ్రికా లోని అన్ని గ్రామాలలో, జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ప్రారంభమవుతుంది. మీరు సహకరించాలి! మానవుల స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం కోసం, మానవ కాలనీల కోసం!”
అప్పుడు స్వయంగా చెన్ లీ పంపిన ఒక సందేశం అందింది. “హనీ, మీరు మన విధానం నుంచి, సూచనల నుండి పక్కకి జరుగుతున్నారు. తాత్కాలిక అధికారం, హోదా మిమ్మల్ని గందరగోళపరిచాయి. వాస్తవాలు గ్రహించండి. మీరు ఎంపికైన వ్యక్తి.”
ఇటువంటి అనేక సందేశాలు ఉన్నాయి.
నేను నిరాశకు గురయ్యాను.
నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను.
రెండు రోజులు సుదీర్ఘంగా ఆలోచించాను.
ధ్యానం చేసాను.
విశ్వశక్తిని ఆవాహన చేసి శక్తిని లోపలికీ బయటకీ పంపసాగాను. ట్రైటాన్‌లో చదివిన త్రికాల గ్రంథాన్ని మళ్ళీ చూసాను.
నారా ఆమ్రపాలి, నయన ఆమ్రపాలిల అభౌతిక రూపాలను చూశాను. నాన్న తెల్లగడ్డంతో తేలుతున్న తెల్ల దుస్తులలో పొడుగ్గా కనిపిస్తున్నాడు; అమ్మ నల్లని జుట్టుతో, ఎర్రని ‘సిందూరంతో దేవదూతలా నాకేసి చూస్తూ నవ్వుతోంది.
“హనీ, సమయం ఆసన్నమైంది!”
నాకు విపరీతమైన తలనొప్పి వచ్చింది. మరణం, వ్యాధులు, ఉత్పాతల దృశ్యాలు గోచరించాయి నాకు.
నాకు పీడకలలు వచ్చాయి. యుద్ధ జ్వాలలు చూశాను.
***
రెండు రోజుల తరువాత, గెలాక్టిక్ టివీలో వార్తలు చూస్తుండగా, చంద్రుడి అమృతా కాలనీలో భారీ పేలుడు సంభవించిందనీ, ప్రభుత్వ దళాలకీ ‘తిరుగుబాటుదారుల’కీ మధ్య అప్పుడప్పుడు కాల్పులు జరుగుతున్నాయని తెలిసింది. తిరుగుబాటు ఒక గ్రహ స్థాయిలో మొదలైందని నేను అర్థం చేసుకున్నాను.
అదే సమయంలో గనీమీడ్, టైటాన్‌లలో చెదురుమదురు ‘పేలుళ్ళ’ గురించిన వార్తలు వచ్చాయి, వార్తా ప్రసారంపై ఆంక్షలు విధించబడ్డాయని స్పష్టమైంది.
తర్వాత న్యూ హోప్ సిటీపైనా, ప్యారిస్, లండన్, ఇంకా మధ్య ఆసియా ప్రాంతాలు, ఐరోపాలోని పలు నగరాల్లో పేలుళ్లు జరిగాయనీ, డ్రోన్ విమాన దాడులు జరినట్లు వరుస వార్తలు వచ్చాయి. ఈ భూభాగాల పలు పాలకుల వారం పాటు రోజువారీ ప్రకటనలు ఇచ్చారు. తరువాత భూమిపై అంతర్యుద్ధం జరుగుతోందనీ, అభివృద్ధి చెందిన మానవులు ఆఫ్రికా నుండి విమానాలతో, ఇతర గ్రహాలపై రహస్య దళాలతో దాడులు చేస్తున్నట్టు గెలాక్టిక్ టివి ప్రకటించింది.
తర్వాత ఉన్నత హెచ్చరికలు అందాయి, రక్షణ అధికారులకు, దళాలకు మధ్య సమావేశాలు జరిగాయి. దళాలకు ‘పై’ నుండి… అక్షరాల అంగారకుడినుంచి ఆదేశాలు వచ్చాయి.
“దాడి చేయండి! నిర్దాక్షిణ్యంగా వ్యవహరించండి. ఆసియాలోని తిరుగుబాటుదారులను చంపేయండి. మేము జీవాన్ని పునఃసృష్టించగలం, కాని సామ్రాజ్యం ప్రమాదంలో పడితే అంగీకరించం” అని అరుణ భూముల చక్రవర్తి, సౌర వ్యవస్థలోని గ్రహాల అధ్యక్షుడు అయిన సమూరా ఆదేశించాడు.
తర్వాత ఎర్త్ కౌన్సిల్ అధ్యక్షుడు చెన్ లీ నుంచి, ఇంకా చంద్రుడు, గనీమీడ్, టైటాన్, ప్లూటో నుండి ఇతర అజ్ఞాతంలో ఉన్న నాయకుల నుండి సందేశాలు వచ్చాయి.
“హనీ! స్వేచ్ఛ, సమానత్వం ఇంకా సౌభాతృత్వం. మీరు ఎంపికైన వ్యక్తుల్లో ఒకరు. మానవ జాతికి సహాయపడండి.” ఇది నాకొక్కడికే వచ్చిన సందేశమా లేక నాలాంటి అందరికీ అందిన సందేశమో నాకు తెలియదు. కానీ ఇది నాలో శాశ్వతమైన గందరగోళాన్ని కలిగించింది. నాలో సగం మనిషి, సగం మాంత్రికుడు ఉన్నారు.
నేను ఎవరి పక్షం?
ఆ రాత్రంతా పొడవాటి నీడలు దర్శనమిచ్చాయి. ఢిల్లీ, ఆగ్రా, టెహ్రాన్, బీజింగ్, మాస్కో ఇంకా అనేక నగరాలలో పేలుళ్లు జరిగాయి. విశ్వవిద్యాలయాలపై కూడా దాడి చేశారు.
తిరుగుబాటు నేను ఊహించినదాని కన్నా మరింత తీవ్రంగా, ఘోరంగా ఉంది.
ఏ చారిత్రాత్మక ఘటనలోనైనా ఏక వ్యక్తి పాలన స్వల్పమైనదే.
అయినప్పటికీ ప్రతి ఒక్కరూ విలువలను కాపాడటానికి తామే ఎంపికైనవారమని భావిస్తున్నారు.
నాకు సమయం, శక్తి ఉంటే ప్రతి గ్రహంలో జరుగుతున్న ప్రతి తిరుగుబాటు యుద్ధంపైన ఒక్కో పుస్తకం వ్రాసి ఉండేవాడిని.
కానీ నాది అల్పమైన ఉనికి! నాతో పాటు ప్రకృతి, ఏనిమోయిడ్, యురేకస్ ఉన్నారు.
పురుషుడు, స్త్రీ, జంతువు, ఇంకా యంత్రం.
నేను గెలాక్టివ్ టివీలో వార్తలు చూడసాగాను. ఉన్నత స్థాయి రక్షణ సమావేశాలలో అభావంగా, మౌనంగా ఉండిపోయాను.
తర్వాత ‘నైట్ ఆఫ్ లాంగ్ నైవ్స్’ సంభవించింది.
ఢిల్లీ లేదా 888 నగరంలో ఆ రాత్రంతా నిరంతరంగా బాంబుల దాడి, కౌంటర్ మిస్సైల్ ఎటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి గడిచేసరికి నా రాజభవనం – పురాతన వైస్రాయి రాయల్ ప్యాలెస్ మరియు శతాబ్దాల క్రితం నాటి రాష్ట్రపతి భవన్ – చుట్టూ యుద్ధ ట్యాంకులు నిలిచాయి. కమాండర్లు తుపాకులతో నిలబడి ఉన్నారు.
నాకు తెలుసు.
నేను మారిపోయానని వారికి తెలిసిపోయింది. వాళ్ళు నన్ను పట్టుకోవాలని కోరుకుంటున్నారు. బాల్కనీలోకి వెళ్ళి చూశాను, నాలుగు మిలిటరీ జీపులు ప్యాలెస్‌లోకి వేగంగా వచ్చి ప్రధాన ద్వారం దగ్గరికి చేరుకున్నాయి. యుద్ధ ట్యాంకులన్నీ నెమ్మదిగా ప్యాలెస్ వైపు మొహరించాయి.
వారు నెమ్మదిగా లోపలికి వచ్చారు. నాకు తుపాకీలు గురిపెట్టారు.
“గవర్నర్ జనరల్ హనీ ఆమ్రాపాలి! మీరు మరియు మీ కుటుంబం ఖైదు చేయబడుతున్నారు. రాజద్రోహం, యుద్ధంలో చక్రవర్తికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారన్న అభియోగంపై మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాము. మీరు మాతో రావలసి ఉంటుంది. మీ అధికారాలు తొలగించబడ్డాయి.
ఇప్పుడు మీరు ఖైదీగా, దేశద్రోహిగా ఉన్నారు” అని చెబుతూ గడ్డంతో ఉన్న సిక్కు జనరల్ నాకు మెషిన్ గన్ గురిపెట్టాడు.
ప్రకృతి, ఏనిమోయిడ్, యురేకస్ నెమ్మదిగా బాల్కనీలో బయటకి వచ్చి, నిశ్చలంగా నిలుచుండిపోయారు.
“మీ అధికారాలను తొలగించబడ్డాయి. రాజద్రోహిగా ఉన్నందుకు మీరు త్వరలోనే ఉరి తీయబడతారు మిస్టర్ గవర్నర్ జనరల్! నెమ్మదిగా మీ చేతులు పైకెత్తి మాతో రండి. లేదా మిమ్మల్ని ఇప్పుడే ఇక్కడే చంపేస్తాం.”