[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]
అధ్యాయం 63: కుజుడి కోసం ఆఖరి పోరాటం
[dropcap]ఈ[/dropcap] విశ్వంలో త్వరిత ప్రయాణానికి గొప్ప ప్రత్యామ్నాయం – కాంతివేగంతో వార్మ్‌హోల్స్ గుండా ప్రయాణించడమే. ఒకప్పుడు వీటిని మరో విశ్వంతోనూ, మరో మితితోనూ భావప్రసారంలా ఉపయోగించారేమో. వాటిని సౌర వ్యవస్థల ద్వారా తక్షణ ప్రయాణానికి వినియోగించవచ్చని ఎర్త్ కౌన్సిల్ నాకు ఇప్పుడే చెప్పింది. ఇది మార్మికత, శాస్త్రీయతల మేళవింపు. ఇదే అందరూ అనుకునే ‘విశ్వశక్తి’, మాంత్రిక గ్రంథాలలో ఉన్న శక్తి ఇదే!
నాల్గవ సహస్రాబ్ది యొక్క శాస్త్రీయ పరిభాషలో చెప్పాలంటే ఇది ఇంటర్ డైమెన్షనల్ కమ్యూనికేషన్ యొక్క వార్మ్‌హోల్. నేనూ, ఇంకా నాలాంటి ఉత్పరివర్తులు (మ్యూటంట్స్) ఉపయోగించగల ఓ ప్రత్యేక శక్తిగా పిలవచ్చు. లేదా మీరు మమ్మల్ని పిసియుఎఫ్‌లు అనీ లేదా చెడుపై పోరాటానికి నిర్ణయించుకున్న ఎంపికైన వ్యక్తులని పిలవచ్చు.
ఇదంతా పదజాలం! నాల్గవ సహస్రాబ్దిలో మార్మికత, శాస్త్రీయత – రెండూ దాదాపు సంపూర్ణ స్థాయికి వచ్చాయి.
కానీ అవి వరణాత్మకమైనవి.
19వ శతాబ్దపు మాంత్రిక గ్రంథాలలో ప్రస్తావించిన ‘పోర్ట్‌కీ’ ఇది. బహుశా ఇది మా నాన్న ఇతర గ్రహాలకు ప్రయాణించడానికి ఉపయోగిందినది కావచ్చు, దీని ద్వారానే భావప్రసారం చేసుండవచ్చు. ఈ మార్గం గుండానే గ్రహాంతర రాక్షసులు భూమిపైకి వచ్చి నా తల్లిదండ్రులను బెదిరించారు, ఆపై హత్య చేశారు.
ఈ ప్రాచీన, మార్మిక, భారీ మర్రిచెట్టు యొక్క మందపాటి వేర్లు, ఆకులు, కొమ్మలు, దాని కాండంలోని తొర్ర…. ఇవన్నీ వార్మ్‌హోల్‌కు ప్రవేశద్వారంలా ఉన్నాయి.
మీరు నమ్మినా నమ్మకపోయినా నేను కాలాతీతమైన ఒక మగతలో తిరుగుతున్నాను. తరువాత ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందాను.
సమయం ఒక గంటే గడిచిందో లేదా అనంతకాలమే గడిచిందో తెలియదు కానీ, నేను కళ్ళు తెరిచేసరికి కుజుడి వివర్ణ ఆకాశం దర్శనమిచ్చింది.
కుజుడి ఎర్రటి భూతలం, అంగారకుడి బండరాళ్లు ఇంకా బిలాలు… మేఘాలు లేని ఆకాశం.
గుమ్మటాలను కలిగి ఉన్న నిర్మాణాలతో నిండిన నగరాలు.
యుద్ధంవల్ల ధ్వంసమైన లిబర్టీ సిటీ.
నా ముందు ఒక హోటల్ గోడలో ఒక రంధ్రం ఉంది. నేను దాని గుండా వెళ్ళి ధబ్‌మన్న చప్పుడుతో కిందపడ్డాను.
తర్వాత ప్రకృతి.
ఆపై నీలిరంగు కాంతిని వెలువరిస్తున్న యురేకస్‌ని పట్టుకుని ఏనిమాయిడ్.
మేమంతా ఇప్పుడే ఒక వార్మ్‌హోల్ అనుభవం పొందాం. దేవుని దయ, నేను కుజగ్రహానికి మళ్ళీ వచ్చినందుకు నాకు సంతోషంగా లేదూ? ఏమో?
ఊడిపోయిన వాల్‌పేపర్, పురాతన ఇటుకలతో చేసిన గచ్చు, ఇంకా భారీ అద్దాల కిటికీ.
ఇది కుజ గ్రహపు ప్రభుత్వంలో ఏదైనా ‘మంత్రి’ గారిల్లా? లేక ఒక హోటలా?
మేము నెమ్మదిగా మా ఇంద్రియాలకు స్వాధీనంలోకి తెచ్చుకున్నాం. 300 మిలియన్ మైళ్ళ దూరంలో పడవేసిన విసురును మా శరీరాలు సర్దుకుంటుండగా, భారీ చెక్క తలుపులు తెరుచుకున్నాయి. ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చారు.
ఎర్రటి ముఖం, మీసాలు, పదునుదేరిన క్రూరమైన కళ్ళతో… ఇంకెవరు… గ్యానీ అంగారక్ .. ఇక రెండో వ్యక్తి… ఆశ్చర్యంలో కెల్లా ఆశ్చర్యం – వయసుపైబడిన లూనా… మార్స్ హోటల్ సందర్శనలో ఒకప్పుడు నాకు సహాయపడిన గైడ్.. అది ఎప్పుడో యుగాల క్రితం జరిగినట్లు అనిపించింది.
కుజుడు…. ఇక్కడే అన్నీ మొదలయ్యాయి.
కుజుడు…. ఇక్కడే అన్నీ ముగియబోతున్నాయి.
అందమైన సయోనీ కలలతో నన్ను ఆకర్షించిన కుజగ్రహం, నా జీవితాన్ని ఒక పీడకలగా మార్చింది. కలలు కల్లలయ్యాయి!
“రక్షణ మంత్రి భవనంలో స్థానిక సమయం 4.00 గంటలకు ఒక సమావేశం ఉంది. మీరు మరియు మీ బృందం వివరాల కోసం ఆ సమావేశానికి హాజరవ్వాలని కోరుతున్నాను” చెప్పాడు జనరల్ గ్యాని. “సౌకర్యవంతంగా ఉండండి. ఏ అవాంతరాలు లేని వార్మ్‌హోల్ అనుభవాన్ని మీరు పొంది ఉంటారని ఆశిస్తున్నాము.”
“ఓహ్! అవును. కొద్దిగా మగత, అంతే” అన్నాను. “మీరెలా ఉన్నారు జనరల్? ఇది ఇప్పుడు చిన్న విశ్వం. మనమెప్పుడూ విపత్కర పరిస్థితులలోనే ఒకరికొకరు కలుసుకుంటున్నాం.”
గదిలో ఉన్న ఫుడ్ బార్ నుంచి ఓ శాండ్‌విచ్ తీసుకున్నాడు జనరల్ గ్యాని. తానే రంగంలోకి దిగి చర్య తీసుకున్నాడు. ఒక నిజమైన అలసటతో యుద్ధ అనుభవజ్ఞునిలా నిట్టూర్పులు విడిచాడు.
“ఇది యుద్ధం, ఎల్లప్పుడూ యుద్ధమే! ఇప్పుడు మానవత్వం యొక్క భవిష్యత్తే ప్రమాదంలో పడింది. అయినప్పటికీ, ఎప్పటిలాగానే, సమూరా లొంగడంలేదు. అతను మాతో పోరాడటానికి తన అన్ని భూతవిద్యలనీ, మంత్ర తంత్ర యుక్తులని ఉపయోగిస్తున్నాడు” చెప్పాడు గ్యాని. మంచి మాంత్రికుడైనా, దుష్టతాంత్రికుడైనా… గ్యానీ అసలే మాంత్రికుడిని ఇష్టపడడన్న విషయం నాకు గుర్తొచ్చింది. అతను మమ్మల్ని తరిమిన తీరు… అతని పశువుల కొట్టంలో వింత జంతువులు… నాకు అన్నీ గుర్తున్నాయి. కాని వాటిని అతనికి గుర్తుచేయకూడదని నిర్ణయించుకున్నాను.
“జనరల్, అన్ని ఇతర గ్రహాలు సమూరా సైన్యాలని ఓడించినప్పుడు మీరు ఎందుకు ఓడిపోతున్నారు?” అని అడిగాను.
“అదే మాకూ ఆశ్చర్యంగా ఉంది. బహుశా కొన్ని రాజకీయ అవకతవకల వల్ల కావచ్చు. మాంత్రికుల పాలన ప్రజలకు అనుకూలం కాదు; అది మాంత్రికులకు అనుకూలం.. విశ్వశక్తి, క్షుద్రపూజల అధ్యయనం, సాధనను ప్రోత్సహించింది. వ్యవసాయం, వినియోగదారుల వస్తువులు ఉత్పత్తి చేసే కర్మాగారాలు, విద్యుత్, విద్య మొదలైనటువంటివి విస్మరించబడ్డాయి. అందుకే కొందరు, ప్రభుత్వంలో కూడా తిరుగుబాటు చేశారు, సమూరాకి వ్యతిరేకంగా యుద్ధానికి వెర్రిగా మద్దతునిచ్చారు. కానీ ఇక్కడ అతను నిలదొక్కుకున్నాడు, ఎందుకంటే అతని దగ్గర అనేక వింత ఆయుధాలున్నాయి.”
“ఎలాంటివి?” అడిగాను, నాలో ఏదో అపరాధ భావం తలెత్తుతుండగా.
“ఇక్కడి మానవ కాలనీని నాశనం చేయడానికి అతను మాయా ఆయుధం ఉపయోగిస్తానని బెదిరించాడు. ఉపయోగించాడు కూడా. చంద్రునిలోని అమృతా కాలనీ రాజధానిలో ఒక చిన్న భాగాన్ని నాశనం చేయడం ద్వారా అతను తన శక్తిని చూపించాడు.”
“ఇవన్నీ నాకు తెలుసు జనరల్! నన్ను బ్లాక్‌మెయిల్ చేయడం వల్ల నేనే ఆ వింత వస్తువులు సంపాదించి అతనికి ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు నేను అతనిని చంపాలి. అతను మళ్ళీ శక్తియుక్తులు కూడగట్టుకుని, అనుచరులను సమీకరించుకుని తన దుర్మార్గపు ప్రణాళికలను అమలు చేసే లోపు అతన్ని నాశనం చేయడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం. అతను అమరుడు. అమృత ఔషధం సేవించినందున అతనికి మరణం లేదు” చెప్పాను.
“యుద్ధాలు రోజూ మొదలవుతున్నాయి” చెప్పాడు గ్యానీ అంగారక్.
“ఒకప్పటిలానే” మరొక మానవ మంత్రి అన్నారు.
“మేము మా యుద్ధ విమానాలు, క్షిపణులతో వెళ్ళి అరుణభూములను నాశనం చేశాం. కానీ ఎక్కడ నుండో మాపై అగ్ని, విద్యుత్ ప్రసరించి మా విమానాలు కాలిపోయాయి, పేలిపోయాయి. మేము ఎగిరే రోవర్ క్రాఫ్టులతో మా రోవర్లతో దాడి చేస్తాము. వాళ్ళేమో అరుణ భూములలోని కనిపించని గోడ నుండి విశ్వశక్తితో మా దాడులను తిప్పికొడతారు.”
“అప్పుడు వారు మా గుమ్మటాలపై యుద్ధ విమానాలతో దాడి చేస్తారు, మేము వారిపై దాడి చేస్తాం, వారి క్షిపణులను విజయవంతంగా తిప్పికొడతాం. కానీ వారు చాలా పురాతనమైన నకిలీ విమానాలతో… కొన్నిసార్లు అచేతనమైన రోబోలను పైలట్లుగా కలిగి ఉండడంతో మేమేమి చేయలేకపోతున్నాం.
ఇదంతా అతను కావాలనే చేస్తున్నాడు, ప్రతిష్టంభన కలిగేలా, మమ్మలి ఎప్పుడూ అయోమయంలోనే ఉంచుతున్నాడు.”
“సౌరవ్యవస్థలోని ఏ స్థలాన్నైనా నాశనం చేయటానికి అతను ఒక కొత్త ఆయుధం కలిగి ఉన్నాడని నాకు తెలుసు. నేను లాండిస్ లోని ఫ్లోటింగ్ కాలనీలో ఆ అద్భుత వస్తువుని కనుగొని అతనికిచ్చాను. శత్రు సైనికుల నియామకాలను గుర్తించడానికి అతనికా అద్దం ఉపయోగపడుతుంది. ఇది ఒక మాయా వస్తువు. ఇన్ని అద్భుత వస్తువులు పొందాకా కూడా అతను మానవ కాలనీల్లో ఓడిపోవడం ఆశ్చర్యంగా ఉంది, వాటిని చేజిక్కించుకుని ఒక దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలం వారిని పాలించిన తర్వాత కూడా… “
“పాలన అనేది రాజకీయాలు మరియు పరిపాలనకి సంబంధించినది. పాలన అంటే ప్రక్రియలు, అభివృద్ధి, ప్రజల అవసరాలు తీర్చడం, వారి సంక్షేమం కోసం పాటుపడడం, వారి సంస్కృతిని సంరక్షించడం” చెప్పాడు గ్యానీ.
“స్వీయ-మమకారం ఉన్న తాంత్రికుడు సమూరా. అతని మంత్రులు క్షుద్రశక్తులు, మంత్రతంత్రాలలో బాగా ప్రావీణ్యం ఉన్నవారు. అయితే… రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, ఆధునిక శాస్త్ర విజ్ఞానంలో వారికి అవగాహన లేదు. సహజంగానే విరోధాలు తలెత్తుతాయి, అందుకే మానవులు అజ్ఞాతంలో ఉండి తిరుగుబాటుకు దిగారు” అన్నాను.
“విప్లవం! ఇది ఒక వృత్తము. అందువల్ల దీనిని రెవల్యూషన్ అని పిలుస్తారు. “
“కానీ కుజుడిలో మేము ఇరుక్కుపోయాం” చెప్పాడు గ్యానీ. “ఇప్పుడు మీరు మాత్రమే మాకు సహాయం చేయగలరు!”
నేను కిటికీ లోంచి బయటకు చూశాను. నేనేం చేయాలో నాకు తెలుసు, ఇప్పుడిక నేనో అతనో. ‘అతను’ అంటే సమూరా!
నేను చారిత్రక పత్రాలలో చదివాను.
మానవుల అధ్యక్షుడు చెన్ లీ సందేశాలను నాకు వివరించారు.
రాబోయే పరిణామాల గురించి యురేకస్ చెప్పింది.
ఎర్రటి భూతలం, బండరాళ్లు. బిలాలు. వివర్ణ ఆకాశం.. భారీ గ్లాస్ డోమ్డ్ కాలనీలు. ఇవన్నీ మానవ నాగరికతకి నిదర్శనాలు. గాజు గుమ్మటాలపై ఉన్న దట్టమైన మరకలు యుద్ధ ప్రభావానికి ఋజువులుగా నిలిచాయి.
భూఉపరితలానికి కొద్దిగా పైనుంచి ఎగురుతూ రోవర్ క్రాఫ్ట్స్ సైనికులను తీసుకెళ్తున్నాయి. కొన్ని యుద్ధ విమానాలు వివర్ణమైన ఆకాశంలో అప్పుడప్పుడు ఎగురుతున్నాయి.
ప్రకృతి నాతో ఉంది, ఏనిమోయిడ్ నాతోనే ఉన్నాడు.
మమ్మల్ని ప్రభుత్వ అతిథులుగా పరిగణించారు. ఘనమైన విందుని ఏర్పాటు చేశారు.
మార్షియన్ సలాడ్లు; చిక్కుళ్ళు; సూప్; భూగ్రహం శైలిలో తయారు చేసిన ప్రత్యేక బిర్యానీ, కూరలు; పండ్లు ఇంకా డెజర్ట్స్. ఇవన్నీ చూస్తుంటే అసలేమాత్రం యుద్ధ భయం లేనట్టు, లేదా బయట ఎటువంటి ముప్పు లేనట్లుగా అనిపిస్తుంది.
మానవులు, తాంత్రికుల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినట్లు గ్రహించాను. ఒక వైపు వృద్ధ, దుర్బలమైన మాంత్రిక చక్రవర్తి. అమరుడు, మోసకారి. మానవాళికి ఎల్లప్పుడూ ముప్పుగా ఉండేవాడు. రెండో వైపు మానవ అధ్యక్షుడు చెన్ లీ, మార్షియన్ రక్షణ మంత్రి గ్యానీ అంగారక్ ఉన్నారు.
ఇదంతా కుజుడిలో ఓ చదరంగం ఆటలా ఉంది. ఒకరు ఒక పోరు గెలిచినప్పటికీ, యుద్ధం ముగియదు.
ఈ అడ్డంకి ఎవరంటే సమూరా. అతన్ని నాశనం చేస్తే గాని యుద్ధం ఆగదు.
దుష్ట చక్రవర్తిపై విజయం సాధించడానికి నన్ను నేను బలిగా అర్పించాలని ఆ క్షణంలో నా మనసులో మెరుపులా తట్టింది. చెస్ బోర్డు మీద బంటులా.
నేను మంత్రశక్తులున్న మానవ బంటుని, బలి కావాల్సినవాడిని.
మానవజాతిని లోబరుచుకున్న దుష్ట శక్తిని నా రక్తం నాశనం చేస్తుందని మాంత్రిక పత్రాలు వెల్లడించాయి.
ఎప్పటిలానే బలిపశువుని నేనే… త్యాగం చేయాల్సిందీ నేనే!
ఎప్పటిలాగానే నన్ను – దుష్ట మాంత్రికులు, మానవజాతి – ఇద్దరూ ఒకేలా ఉపయోగించుకుంటున్నారు. వెంటాడుతున్నారు, వాడుకుంటున్నారు. నాతో త్యాగం చేయిస్తున్నారు.
ఈ విందు భోజనం ఈ బలిపశువుకి చివరి వీడ్కోలు లాంటిదేమో.