Site icon Sanchika

భూమి నుంచి ప్లూటో దాకా… – 3

[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]

అధ్యాయం7: “సౌర” తీవ్రవాదం

[dropcap]ఆ[/dropcap]ధునిక కాలపు ఏరియా 001 లోని న్యూ హోప్ సిటీ ఇప్పటికీ ఆకాశహార్మ్యాలు, భారీ బహుళ అంతస్తుల భవనాలు ఉన్న నగరం. అవి విశాలమైనవి. నగరంలోని ఎక్స్‌ప్రెస్ హైవేలు పరిశుభ్రంగా ఉంటాయి, వీధులు అత్యంత శుభ్రంగా ఉంటాయి. అందమైన తోటలు, సరస్సులు ఉన్నాయి. అది డిసెంబర్ నెల. చలికాలం. గత రాత్రి కురిసిన మంచుతుఫాను వల్ల రోడ్లపై పేరుకుపోయిన మంచును యాంత్రిక రోబోలు తొలగిస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్ హైవే మీద నేలకి ఎగువగా అత్యంత వేగంతో కార్లు దూసుకుపోతున్నాయి. అవి వాయిస్ కమాండ్స్‌తో నడపబడుతున్నాయి.

కాసేపటికి కెప్లర్ గ్రాండ్ షెరటాన్ హోటల్ కనబడింది. ఒకప్పటి మన్‌హాటన్ లోని 36వ వీధిలో ఉంది. ఇప్పుడు దీన్ని ఏరియా 001లో ‘సబ్ ఏరియా ఎ’ అని పిలుస్తున్నారు. ఒక సైన్ బోర్డ్ చూస్తే ఈ విషయాలు తెలిసాయి.

రిసెప్షన్ వద్ద మా పేర్లు నమోదు, మా వివరాలు వ్రాసుకోడం పూర్తయ్యాక, హోటల్ సిబ్బంది లిఫ్ట్‌లో మమ్మల్ని 24వ అంతస్తులో ఉన్న మా గదికి తీసుకొచ్చారు. సెక్యూరిటీ చెక్ ఎంతో పకడ్బందీగా ఉంది. మా పాస్‌పోర్టులు, వీసా, ఎర్త్ కౌన్సిల్ పంపిన ఉత్తరాలను పరిశీలించడమే కాకుండా మా వేలిముద్రలు తీసుకున్నారు, డిఎన్‌ఎ పరీక్ష చేశారు.

“మిస్టర్ హనీ! ఏరియా 001‍కి స్వాగతం” అంది రిసెప్షన్ కౌంటర్‌లో ఓ అందమైన అమ్మాయి. “నా పేరు మార్గరెట్. వంద నక్షత్రాల స్థాయి కలిగిన పిసియుఎఫ్ దంపతులు మాకు అతిథులుగా ఉండడం సంతోషంగా ఉంది. మీకు కావలసినవన్నీ మీ గదిలోనే లభ్యమవుతాయి. లేదా రిసెప్షన్ కోస 0 డయల్ చేయండి. మీ రోబోని ఉచితంగా ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే మీ రోబో హోటల్ కంప్యూటర్లు ఉపయోగించడానికి మాత్రం పరిమితమైన అనుమతులిస్తాం” అంటూ నవ్వింది. “డాటా ట్రాన్స్‌ఫర్ చేయడానికి వీల్లేదు” అంది.

దొంగతనం అనే మాటకి ఇది సభ్యోక్తి. నా రోబో అరుణగ్రహం నుంచి దిగుమతి అయినది కావడంతో అది, తమ డేటాని సంగ్రహిస్తుందేమోనని వాళ్ళ అనుమానం. నాకు బాగా తెలుసు. యురేకస్ ఈ పాటికే ఈ హోటల్ ప్రాంగణాన్ని ఇన్‌ఫ్రా రెడ్ ఫొటో తీసి ఉంటుంది, హోటల్‍లోని అన్ని సిస్టమ్స్‌ని నిశ్శబ్దంగా మ్యాప్ చేసే ఉంటుంది.

గది చాలా విశాలంగా ఉంది. పై నుంచి చూస్తే కింద సబ్ ఏరియా 03 కనబడుతోంది. రోడ్డు కిరువైపులా ఎత్తుగా ఉన్న అపార్టుమెంట్లు ఉన్నాయి. కొన్ని అపార్ట్‌మెంట్లలో యాభై, అంతకు మించి అంతస్తులు ఉన్నాయి. అవి మేఘాల్లో దాగున్నాయి.

యురేకస్ 7776 రోబోల గదికి వెళ్ళింది. అది నాతోనూ ప్రకృతితోనూ మా గదిలో ఉండలేదు.

“మాస్టర్, నేను రోబో అనెక్సర్‌లో ఛార్జ్ చేసుకుంటాను. అవసరమైనప్పుడు మీ దగ్గరున్న మొబైల్ కాలర్‌తో నన్ను పిలవండి” అంది.

***

“వావ్! మనం కొత్త ప్రపంచంలో ఉన్నాం. అద్భుతం” అంది ప్రకృతి.

“ఆమ్రపాలి నుంచి అమెరికాకి! మన ప్రస్థానం గొప్పగా ఉంది!” అన్నాను.

“నిజం చెప్పాలంటే మార్స్ నుంచి ఏరియా 001కి, హనీ! నువ్వు సాధించావు” అంటూ నన్నుపెదాలపైముద్దాడింది సంతోషంతో.

ఈ అనుకోని విజయపు సంతోషాన్ని కలిసి పంచుకుంటున్న ఆనందపు క్షణాలను భగ్నం చేస్తూ తెల్లటి గది గోడల మీద కొన్ని సందేశాలు కనబడ్డాయి. కనబడని స్పీకర్ల నుంచి మంద్రస్వరంలో సంగీతం వినబడింది. చలి సాయంత్రపు వాతావరణాన్ని క్లయిమేటైజర్లు వెచ్చగా మారుస్తున్నాయి.

కాసేపు సేద తీరిన అనంతరం, టాప్ ఫ్లోర్ రెస్టారెంట్‌కి వెళ్ళి భోజనం చేయాలనుకున్నాం. గది నుంచి బయటకు వచ్చి ఎక్స్‌ప్రెస్ ఎలివేటర్‍లో ప్రవేశించాం.

సాగదీసిన ముఖం, మొనదేలిన చెవులు, తలపైన ఒక యాంటీనా, కళ్ళకి ఆకుపచ్చ కళ్ళజోడు ధరించిన ఓ బట్టతల మనిషి అప్పటికే లిఫ్ట్‌లో ఉన్నాడు. ముదురు మెటాలిక్ స్టీల్ బూడిద రంగు స్యూట్, బటన్డ్ జాకెట్, బిగుతైన ట్రౌజర్స్ ధరించి ఉన్నాడతను. అతని పక్కన ఓ మహిళ ఉంది. ఆమెది ఉంగరాల జుట్టు. ఆమె తలపైన ఒక యాంటీనా ఉంది. ఆకుపచ్చ కళ్ళజోడు పెట్టుకుని ఉంది. మెటాలిక్ స్టీల్ గ్రే స్యూట్ ధరించి ఉంది.

యురేకస్‌ని రోబో అనెక్సర్ నుంచి పిలవడం నేనూ, ప్రకృతీ ఇద్దరం మర్చిపోయాం. లేదంటే ఈపాటికి  గగుర్పాటు కలిగించే ఈ జంట గురించి వివరాలు చెప్పేసేదే.

వీళ్ళు గ్రహాంతరవాసులా?

లిఫ్ట్ వేగంగా కదిలింది. క్షణాల్లో 36వ అంతస్తుకి చేరింది. నేను ప్రకృతికేసి చూశాను. అర్థం చేసుకున్నానన్నట్టు కళ్ళతోనే జవాబు చెప్పి చిన్నగా నవ్వింది.

లిఫ్ట్ ఇంకా పైకి వెడుతుండగా హఠాత్తుగా ఆ మగమనిషి నాకేసి చూశాడు. అతని కళ్ళ జోడు నుంచి ఆకపచ్చని, ఎర్రని కిరణాలు.

ఆ మహిళ అరచేతులు మడిచి, ప్రకృతితో యుద్ధానికి సిద్ధం అన్నటుగా నిలబడింది.

నాకు పరిచితమైన భాషలో మంత్రాలు వినబడడంతో బెదిరిపోయాను. ఆ భాష ప్రాచీన లాటిన్, ఫ్రెంచ్, ఇంకా ఏవో రూపాంతర పదాల మిశ్రిత భాష.

“సెరెబ్రెలాసి మోర్టికామ్! ఒబుంటడో!”

గ్రహాంతర మాంత్రికుడి మరణ శాపం అయ్యుంటుంది. ఆ కిరణాలను తప్పించుకోడానికి నేను గబుక్కున వంగాను. ఇంతలో ప్రకృతి తన అరచేతులతో ఆ ఆకుపచ్చ కిరణాలను ఆపడానికి ప్రయత్నిస్తూ మంత్రాలు చదవసాగింది.

“రిపల్సియో! వాపస్ జావో! మరణం భవతు!!!”

ఆ మనిషి ఎగిరిపడ్డాడు. బట్టతల గోడని గుద్దుకుంది. యాంటీనా విరిగిపోయింది. రక్తం కారుతోంది. గట్టిగా అరుస్తూ విరిగిపడిన చెట్టులా ఆ వ్యక్తి తన పక్కనున్న స్త్రీ మీదకి ఒరిగిపోయాడు.

ఆ స్త్రీ పిల్లిలా గట్టిగా కూతపెట్టి బుసలు కొట్టసాగింది. ప్రకృతి తన ఎడమకాలితో కరాటే కిక్‌లా ఆమె నోటోపై కొట్టింది.

నా ఛాతికి తగిలిన కిరణం తన ప్రభావాన్ని చూపిస్తోంది. నాకు మగతగా ఉంది. అది ఓ మరణ శాపమని నాకు తెలుస్తోంది. భైరవ స్వామినీ, ధరణి మావయ్యని తలచుకుని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. అంత తీవ్రమైన బాధలోనూ నేనో విషయం గ్రహించాను. శక్తి ప్రయోగానికి భాషా, వ్యాకరణం, ఉచ్చారణలకి పట్టింపు లేదు, కావల్సిందల్లా తమ శక్తి నుంచి ఎదుటివారిపై దాడి చేయాలన్న దృఢమైన సంకల్పం, ఏకాగ్రత మాత్రమే. పదాలు – శక్తి యొక్క కార్యాచరణకి బాహ్యరూపం మాత్రమే. కాబట్టి హిందీ, లాటిన్, ఫ్రెంచ్ భాషల మిశ్రమం గురించి విశ్లేషణలు అక్కర్లేదు, వ్యాకరణం, అర్థాలను పట్టించుకోనవసరం లేదు. ఎదుటివారిని చంపడానికో లేదా వికలాంగుని చేయడానికో శక్తిని ప్రయోగించే ఓ వ్యక్తి యొక్క అంతరంగపు బలీయమైన కోరికకి అనునాదం అది.

దీన్ని సాంకేతిక యుద్ధంలోని వాయిస్ కమాండ్లతో పోల్చవచ్చు. మనిషి నుంచి వచ్చే మౌఖిక ఆజ్ఞల తరంగాలను కార్లు, కంప్యూటర్లు, ఇంకా ఆధునిక కాలపు యంత్రాలు స్వీకరించి అనుసరించడం తెలిసినదే.

నన్ను నేను సంబాళించుకుని, ఆ మగ మనిషి వైపు చూస్తూ “నాశన భవతు.. మరణ ప్రాప్తిరస్తు” అంటూ శక్తిని విసిరాను. నా దృష్టి నీలి రంగు లేజర్ కిరణంగా మారి అతని ఛాతిని తాకింది.

ఇటువంటిదే మరో కిరణం ఆ మహిళనూ తాకింది. ఇద్దరూ క్రింద పడిపోయారు. వాళ్ళ శరీరాలు మండిపోసాగాయి. లిఫ్ట్‌లో ఎర్రని మంటలు వ్యాపించాయి.

లిఫ్ట్ హఠాత్తుగా ఆగిపోయింది. తలుపుల మీద ఎంత గుద్దినా అవి తెరుచుకోలేదు.

ఆ రెండు శరీరాలు పూర్తిగా దగ్ధమై తెల్లని పొగ మమ్మల్ని ఆవరించింది. నేనూ ప్రకృతీ ఆ మంటల్లో మాడిమసై పోతామని అనిపించింది. ఇంతలో ఒక విస్ఫోటనం జరిగింది. లిఫ్ట్ తలుపుకి పెద్ద చిల్లు పడింది. ఏరియా 001 యూనిఫాంలో ఉన్న సైనికుల దృఢమైన చేతులు మమ్మల్ని బయటకు లాగాయి.

“హే, ఆర్యూ ఓకే” అంటూ ఓ మెరైన్ కమాండర్ అమెరికన్ యాసలో అడిగాడు. “లిఫ్ట్‌లో బాంబ్ పెట్టారని భావించాం. అయితే మాంత్రికుల పర్యవేక్షణ కేంద్రం వాళ్ళు మాకో మెసేజ్ పంపారు – ఇక్కడ గ్రహాంతర దుష్ట మాంత్రికులు ఉన్నారని!” అని చెబుతూ, “మీరు బానే ఉన్నారా?” అని అడిగాడా సైనికుడు.

“బానే ఉన్నాం” అంటూ గొణిగాను.

ఇప్పుడు నా శక్తి మొత్తం హరించుకుపోయింది. నా మనసు, శరీరం గాలి పోయిన బుడగల్లా అయిపోయాయి.

“ప్రకృతీ?”

“ఓహ్! దిగులు పడకండి. ఆమె క్షేమంగా ఉన్నారు. మీరిద్దరూ క్షేమంగా ఉన్నారు. ఇక్కడ విశ్వశక్తి ప్రయోగం జరుగుతోందని మాకు సమాచారం అందింది. మేం 30వ అంతస్తునుంచి గబగబా వచ్చాం”

“థాంక్యూ కమాండర్” అన్నాను. “లిఫ్ట్‌లో మంటల్లో కాలి బూడిదై పోకుండా మీరు మమ్మల్ని కాపాడారు.”

“పర్వాలేదు. మేమేమీ ప్రత్యేకంగా చేయలేదు. ఇటువంటి దుష్ట గ్రహాంతర మాంత్రికులను ఈమధ్య తరచూ ఎదురవుతున్నారు, వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. ఈ మొత్తం పాలపుంతలోకెల్లా నీచులు. మా సొంత పర్యవేక్షణ ఉంది, ఇలాంటి దుష్టులతో పోరాడడానికి మాకూ మంత్రశక్తులున్న సిబ్బంది ఉన్నారు.” గర్వంగా చెప్పాడా అధికారి. పొడుగ్గా దృఢంగా ఉన్న అతని యూనిఫాంపై రకరకాల్ మెడల్స్ మెరుస్తూ ఉన్నాయి. మీసాలను బాగా పెంచాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి.

“ఎర్త్ కౌన్సిల్ అధికారులు చాలా కోపంగా ఉన్నారు. మిమ్మల్ని గట్టి భద్రత మధ్య నన్నే స్వయంగా తీసుకురమ్మని ఆదేశించారు. వాళ్ళిద్దరూ మిమ్మల్ని చంపడానికే వచ్చారు. ఇప్పుడిక ఏ భయమూ లేదు. టాప్ టెర్రస్ నుంచి మనం కౌన్సిల్ ఆఫీసుకి చాపర్‌లో వెళదాం. మీ గాయాలకి ఆయింట్‍మెంట్ రాస్తే సరిపోతుంది, లేదా ఏదైనా మాత్ర వేసుకున్నా చాలు.”

నేను నా అవయవాలను కదిలించి చూశాను. అన్నీ సరిగ్గానే ఉన్నాయి. ఛాతి మీద చిన్న గాటు, ఎడమ బాహుమూల నుంచి రక్తం కారుతోంది. అక్కడే నన్ను ఆ కిరణం తాకింది. అయితే నా గుండె అక్కడ లేదు.

“నేను బానే ఉన్నాను” అంది ప్రకృతి నీరసంగా. తన నుదుటి మీద కాలిన గాయం. కాస్త యాంటీసెప్టిక్ పొవిడోన్ అయోడిన్ లేదా నొప్పి కోసం ఏదైనా అనల్జెసిక్ వాడితే చాలు. అదే చెప్పాను.

“సరే” అన్నాడా అధికారి. ఒక మెరైన్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌తో ముందుకు వచ్చాడు. యాంటీసెప్టిక్ అప్లయి చేశాడు. నాడి, బిపి చూశాడు.

సైనిక దుస్తులు ధరించిన ఇద్దరు పొడవాటి వ్యక్తులు ముందుకు వచ్చారు. ఇద్దరికీ గడ్డం ఉంది. “మా పేర్లు జేమ్స్, జాక్సన్. -మెరైన్ పిసియుఎఫ్‌లం. మేం ప్రభుత్వం కోసం విశ్వశక్తిని ఉపయోగిస్తాం. మిమ్మల్ని కాపాడుతాం” అని చెప్పారు.

ఓ మెరైన్ మాకు గ్లాసుతో మంచినీళ్ళు ఇచ్చాడు. మేం తాగాము. “పదండి. టెర్రస్ పైకి వెళదాం. అక్కడే భోజనం చేసి బయల్దేరుదాం. నాలుగు అంతస్తులేగా, నడిచి ఎక్కుదాం” అన్నాడు కమాండర్.

మెరైన్లు మాకు రక్షణగా మా చుట్టూ వలయంలా నడవసాగారు.  పిసియుఎఫ్‌లు కనబడని దుష్టశక్తుల నుంచి రక్షిస్తుండగా మేం నాలుగు అంతస్తులు ఎక్కాం.

అక్కడ ఓ పెద్ద ఆలీవ్ గ్రీన్ హెలికాప్టర్ ఆగి ఉంది. దాని రోటార్ బ్లేడ్స్ తిరుగుతున్నాయి.

కాసేపటి తర్వాత మేమా హెలికాప్టర్‌లో న్యూ హోప్ సిటీలోని సబ్ ఏరియా 2లో ఉన్న ఎర్త్ కౌన్సిల్ వారి ప్రధాన కార్యాలయానికి ప్రయాణిస్తున్నాం.

“వెధవలు! ఎక్కడా చూసినా ఈ గ్రహాంతర దుష్ట శక్తులే. రకరకాల ఆకారాలలో, వేర్వేరు రంగులలో వచ్చి మోసం చేస్తున్నారు. వాళ్ళకిక్కడ రహస్య సంఘాలు ఉన్నాయి. సభ్యులంతా ఇక్కడే ఎక్కడో రహస్యంగా దాక్కుని ఉంటారు. కనిపెట్టేస్తారనే భయంతో చాలామంది విశ్వశక్తిని సాధన చెయ్యడం లేదు. ఆఫీసుల్లోనూ, చుట్టుపక్కల గ్రామాల్లోనూ, ఇంకా ఆర్మీలో, ఎయిర్‌ఫోర్స్‌లో కూడా ఉన్నారట. దెయ్యాలు.. వీళ్ళంతా అంగారకుడి మీద నుంచో, ఇంకేవో ఉపగ్రహాల మీద నుంచో వస్తున్నారట. వీళ్ళని…. ! ఇది ఆధునిక సౌర తీవ్రవాదం.. అందరినీ చంపేయాలి… ఏదైనా మార్గముంటే నేను ఆ పనే చేస్తాను….”

హెడ్ క్వార్టర్స్ చేరేవరకూ కమాండర్ ఇలా సణుగుతూనే ఉన్నాడు.

అధ్యాయం 8: వోజోస్కీ, హిరానీ

ఒకప్పటి న్యూ యార్క్, నేటి న్యూ హోప్ సిటీలోని ఆకాశహార్మ్యాల మీదుగా ఎగురుతూ ఎర్త్ కౌన్సిల్ సెంటర్ భవనంపై ల్యాండ్ అవడానికి దాదాపు గంట పట్టింది.

నాకూ ప్రకృతికి హెలికాప్టర్‌లోనే ప్రథమ చికిత్స చేశారు. నావి అన్నీ పైపై దెబ్బలే, ప్రకృతి మాత్రం బాగా లోతుగా తగిలాయి. మా గాయాలకు వైద్యులు, పిసియుఎఫ్‌లు తమ తమ పద్ధతులలో చికిత్స చేశారు.

మాయల వల్ల తగిలిన గాయాలు మాయలకే నయమవుతాయి. మిగతా గాయాలకు యాంటీసెప్టిక్ వేసి, డ్రెస్సింగ్ చేస్తే చాలు. ఇది చాలా ఆసక్తికరంగానూ, నిష్కపటమైనదిగాను ఉంది.

న్యూ హోప్ సిటీలో ఎక్కడో ఉన్న ఎర్త్ కౌన్సిల్ వారి బహుల అంతస్తుల భవనం పైన మేము ల్యాండ్ అయినప్పుడు ఓ వృద్ధ జంట మాకు స్వాగతం పలికారు. వాళ్ళెంతో దయగా ఉన్నారు. ఆశ్చర్యకరంగా మాపై ఆపేక్ష కనబరిచారు.

“నా పేరు వోజోస్కీ. ఆమె శ్రీమతి హిరానీ. మేము కౌన్సిల్‌తో మీకు సమన్వయకర్తలం. మీరు బాగానే ఉన్నారా? ఇది ఒక అనూహ్యమైన ఘోరమైన దాడి! వాళ్ళిద్దరూ మా గూఢచార దళంలో వాళ్ళని తలచుకుంటుంటేనే చాలా… “

“మేం బాగానే ఉన్నాం సర్! ధన్యవాదాలు!” అంటూ నేను జవాబిచ్చాను. “కానీ వాళ్ళు ఎవరు? వాళ్ళు మీ గూఢచారి బృందంలో వారని మీరు ఎలా కనుగొన్నారు? మీలో కలిసిపోయిన పరాయిగ్రహ మాంత్రికుల ఉనికిని మీరు ఎలా గ్రహించారు? “

“రండి! అల్పాహారం మరియు టీ తీసుకోండి! మాట్లాడుకుందాం” అన్నారు మిస్టర్ వోజోస్కి.

టెర్రేస్ పైన గాలి విపరీతమైన వేగంతో వీస్తోంది.

రివాల్వింగ్ రెస్టారెంట్ ఎగువ అంతస్తు నుండి మేము కిందకి దిగి వచ్చాము, నగరం యొక్క అద్భుతమైన దృశ్యాలు కనబడేలా అమర్చిన ఒక గాజు కిటికీ పక్కన చక్కని సౌకర్యవంతమైన సీట్లు మరియు డైనింగ్ టేబుల్‌ని మాకు ఇచ్చారు. ఆ రోడ్లు మరియు లైన్లు వంటి వీధులు ఒక వివరణాత్మక ఉపగ్రహ మ్యాప్‌లా, ఆకాశహర్మ్యాలు అగ్గిపెట్టెల్లా, సుదూరంగా ఒక నీలం రేఖలా హడ్సన్ నది కనిపించాయి.

“వేడి టీ, కేకులు మీకు శక్తినిస్తాయి!” అన్నారు వోజోస్కి.

మేము అప్పటికే ఆకలితో ఉన్నందున కృతజ్ఞతాపూర్వకంగా ఆ కేకులను స్వీకరించాము. మిస్టర్ వోజోస్కీ లోగొంతుతో మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టారు.

“మా నావికా దళానికి చెందిన గూఢచారి బృందంలోని ఈ ఇద్దరు వ్యక్తులపై నాకు అనుమానంగా ఉంది. వాళ్ళ పూర్తి ప్రొఫైల్ ఉంది కానీ అనుమానాస్పదమైనది ఏదీ లేదు. ప్రతికూల నివేదికలు లేవు, దురలవాట్లు లేవు. భార్య, పిల్లలు మరియు ఉద్యోగం. అంతే. సైనిక మరియు కమాండో శిక్షణ. కల్నల్ ర్యాంకులు. మంచి జీతం. వారు పిసియుఎఫ్ పరిశోధన బృందంలో ఉన్నారు! దేవుడా! ఒకసారి వాళ్ళ ‘ఇంటర్‌గెలాక్టిక్ ఫేస్ బుక్’ పేజీ (ఇప్పటికీ ఫేస్ బుక్ ఉంది, గెలాక్టిక్ స్థాయిలో ఉంది) తనిఖీ చేస్తున్నప్పుడు -వాళ్ళకి నచ్చిన పుస్తకాల జాబితాలో ఒక వింత భాషలో జోనాథన్ అనే రచయిత వ్రాసిన ‘మానిటర్ యువర్ మైండ్’ మరియు యూనివర్సల్ డిజిటల్ భాషలో ‘కాంక్వర్ ది ఫోర్స్’ అనే రెండు పుస్తకాలు కనబడ్డాయి. వాళ్ళ స్టేటస్ రిపోర్టులలో, ఒకతను చాలాసార్లు ‘మళ్ళీ అదే బాధించే కల’ గురించి వివరించాడు. ‘ఆమె తిరిగి వచ్చింది! మార్స్ నుండి నన్ను పిలుస్తూ!’… “

“మళ్ళీనా… వద్దు! ఇది నాలో జ్ఞాపకాల వరదకి దారితీస్తుంది. గెలాక్సీ స్థాయిలో గ్రహాంతర మాంత్రికులచే టెలిపతీ, కలలు, మనస్సు నియంత్రణ ఉనికిలో లేవూ? ఉన్నాయి. నేనూ స్వయంగా వాటి బాధితుడినే. వారు తమ దుర్మార్గపు ప్రయోజనాల కోసం ఏజంట్లని నియమించుకోడం కోసం దీనిని ఉపయోగిస్తారు.” అన్నాను.

మిస్టర్ వోజోస్కి ఆపారు. టేబుల్‌పై శాండ్‍విచ్, పండ్లు, కేకులు మరియు కాఫీ కప్పులను అమర్చడానికి స్టెవార్డ్, బట్లర్ కోసం వేచి ఉన్నారు.

“మీ బ్రంచ్ కానివ్వండి… హనీ. ప్రకృ… తీ…” అని తన ఐరోపా యాసతో చెప్పారు. “మీరు అలసిపోయున్నారు, ఆకలితో ఉండి ఉండాలి.”

నేను శాండ్‍విచ్‌లు, జామ్, వెన్న తీసుకున్నాను. ఓ కప్పులో కాఫీ పోసుకున్నాను. నేను తింటుండగా మిస్టర్ వోజోస్కి కొనసాగించారు.

“వాళ్ళిద్దరినీ గమనించాలని నిర్ణయించుకున్నాను, మిమ్మల్ని కాపాడడానికి నియమించబడిన నావికా దళ సభ్యుల్లో వారిని ఉద్దేశపూర్వకంగా చేర్చాను. అదొక తప్పు. కానీ ఇప్పుడు మాకు ఋజువు ఉంది. “

ప్రకృతి ఓ గుక్క తాగి, “కానీ సర్, వాళ్ళు మనల్ని చంపేసుంటే?” అంది.

వోజోస్కి, హిరానీ ఇద్దరూ నవ్వారు.

“అప్పుడు మీరు – మేమనుకున్నట్టుగా భూమికి చెందిన ఉన్నత స్థాయి పిసియుఎఫ్‌లు కారని తెలిసేది. హనీ ఆమ్రపాలి…  మీరు మార్స్ వెళ్ళిందగ్గర్నుండి తిరిగి వచ్చేవరకూ మిమ్మల్ని మేము గమనిస్తూనే ఉన్నాం. ఉత్తమమైన అతికొద్ది 100 స్టార్ మాంత్రికుల్లో మీరూ ఒకరు. తమ స్వంత అంచనా ప్రకారం మీ తల్లీతండ్రి కూడా ఇదే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఇలాంటి వాళ్ళని మేము ‘పిసియుఎఫ్ విత్ పర్‌ఫెక్ట్ 100’ అని పిలుస్తాము, మీ లాంటి పిసియుఎఫ్‌ల సంఖ్య భూమిపై క్రమంగా క్షీణిస్తోంది. చాలామంది ఇతర గ్రహాల కాలనీలకు తరలిపోయారు, పలు మార్గాల్లో స్థిరపడ్డారు!”

“అంటే…! నాకిప్పుడు అర్థమైంది. ఇది మాకో పరీక్ష. తీవ్రవాదుల కోసం పన్నిన వల!” అన్నాను.  ఎర్త్ కౌన్సిల్ మనుషుల క్రూరమైన రాజకీయాలు గురించి నేను నా మనస్సులో భయపడ్డాను. ఎలా చూసినా ఇది విజయమే వారికి.

“హనీ, ప్రకృతీ! మీరు మీ సామర్థ్యాన్ని నిరూపించారు. కానీ ప్రమాదం ప్రతిచోటా ప్రచ్ఛన్నంగా ఉంది. ఎర్త్ కౌన్సిల్ యొక్క ముఖ్యమైన సమావేశం ఈ సమస్య పరిష్కారానికై చర్చిస్తోంది. మీరిద్దరూ ఆసియా నుండి ప్రధాన ఆహ్వానితులు. మరికొంతమంది ఉన్నారు, కానీ మీరు ఎప్పటికప్పుడూ మీ సమర్థతని నిరూపించారు. ఇప్పుడు, ఒక గంటలో మనం కౌంటర్ టెర్రరిజంపై ఎర్త్ కౌన్సిల్ యొక్క ఇంటర్‍ప్లానేటరీ సమావేశానికి వెళతాం. సరేనా? ఇంకా ఏవైనా ప్రశ్నలున్నాయా?” వోజోస్కీ తన ప్రసంగం ఆపి నా వైపు చూశారు.

నన్ను మళ్ళీ వాడుకుంటున్నారనే అస్పష్ట భావన కలిగింది. నేను మార్స్‌లోని మిషన్‌ని జ్ఞాపకం చేసుకున్నాను, దానిలో సమారా, సయోనీ నన్ను, మరో ప్రత్యేక జట్టుని నియమించారు. ఇప్పుడు ఇది భిన్నమైనది. నా సొంత మానవ జాతి, వారిపై… విశ్వశక్తిని సాధన చేసేవారిపై, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకునే వారిపై దాడి చేయమంటోంది!

“ఇటువంటి కార్యకలాపాలలో నేను చేరకపోతే, వారు నన్ను అర్థం చేసుకుంటారా సార్? దుష్ట సమూరా, సయోనీలు వచ్చి తమ ప్రయోజనాల కోసం నన్ను కిడ్నాప్ చేసినపుడు నేను అంగారక గ్రహం మీద, ఇక్కడ భూమి మీద తగినంత బాధలు పడ్డాను. నేను కొత్తగా పెళ్ళి చేసుకున్నాను, శాంతిని కోరుకుంటున్నాను. నేను ఎర్త్ కౌన్సిల్ కోసం పని చేస్తాను. కానీ … “

హిరానీ, వోజోస్కి ఒకరినొకరు చూసుకున్నారు.

“హనీ, నా సలహా వినండి. ఎర్త్ కౌన్సిల్‌ని అనుసరించడంలోనే వివేకం ఉంది. మీరు మానవుడు, పిసియుఎఫ్ కూడా. కానీ మీరు మంచివారు. కాబట్టి ప్రకృతీ, మీరు కౌన్సిల్ అప్పగించిన పనిని తిరస్కరించినప్పటికీ – గ్రహాంతర దుష్టశక్తులు మిమ్మల్ని వదలవు. వారు తమ ప్రయోజనాల కోసం నిన్ను వాడుకోడానికి మీపైకి వస్తారు. ఏ విధంగా చూసినా మీకు శాంతి ఉండదు.”

మార్స్ ప్రయాణం మొదలైనప్పటి నుండి నేను ఈ శాశ్వతమైన గందరగోళాన్ని ఎల్లప్పుడూ ఎదుర్కుంటూనే ఉన్నాను.

నాకు శాంతి కావాలి, నా బోధనా వృత్తి కావాలి, నా ప్రియమైన ప్రకృతితో జీవితం కావాలి. భూమిపై మానవుల బయోటెక్నాలజీని అన్వేషించడం, పరిశోధనను మెరుగుపరచడం మరియు ఇతర గ్రహాలు ముఖ్యంగా మారిటన్ టెక్నాలజీతో సమానంగా సాంకేతికతను తయారు చేయడం నా కోరిక.

సాంకేతిక పురోగతి ఎప్పుడూ అవసరంతోనే జరుగుతుంది. మార్స్ పైన మానవ మరియు విజర్డ్ కాలనీలు ఈ ప్రతికూలమైన వాతావరణాల్లో జీవించేందుకు అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందాయి, సఫలమయ్యాయి కూడా. భూమి వెనుకబడిపోయినా, మనకి వాతావరణం, ఆక్సిజన్, నీరు, చెట్లు ఉన్నాయి. ప్రాథమిక అవసరాల అభివృద్ధి అక్కర్లేదు.

కాబట్టి ఇక్కడ టైటాన్ లాంటి భూగర్భంలోని కాలనీలు లేదా చంద్రుడిలాంటి క్రేటర్లలోని కాలనీలలో వలె డ్యామ్లు, రోవర్ క్రాఫ్ట్‌లు అవసరం లేదు. ఎక్కువ రోబోలు లేవు… హ్యుమనాయిడ్లు తక్కువే. స్పష్టమైన, పూర్తిగా అర్థం కాని కారణాల కోసం ఎవరైనా పురోగతి అడ్డుకుంటున్నారా? ఎర్త్ కౌన్సిల్ యొక్క వ్యాపార మరియు సైనిక ప్రయోజనాల మాటేమిటి? వాళ్ళే పురోగతికి ఆటంకాలు కల్పిస్తున్నారా?

ఇప్పుడు దుష్ట పిసియుఎఫ్‌ల నుండి సవాళ్ళు. దుష్టశక్తులను సాధన చేసే తీవ్రవాదులు తమ దుష్ట సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకుంటారు, గెలాక్సీలో తమ యజమానిని సృష్టించాలనుకుంటారు. ఇలాంటి తీవ్రవాదులను అడ్డుకోడం కోసం నాలాంటి వ్యక్తులను నియమించుకుంటున్నారా?

అవసరం, ఆవశ్యకత ఇప్పటికి ఉద్భవించాయా?

“ఆలోచించు! నా ప్రియమైన హనీ! ఆలోచించు. మంచివారైన మీ తల్లిదండ్రులని వాళ్ళేం చేశారో గుర్తు చేసుకో! అవన్నీ మాకు తెలుసు. అవును, మీ నాన్న నారా అమ్రాపాలి విశ్వశక్తిని సాధన చేశాడు, కానీ మంచి వ్యక్తులకు సహాయం చేశాడు. అతను భూమిపైన దుష్టుల తీవ్రవాద దళాలలో చేరడానికి నిరాకరించాడు. హిమాలయాల నుండి ఆల్ప్స్ వరకూ, అమెరికాకు యూరోప్ వరకూ ప్రతిచోటా ఉన్న రహస్య మాంత్రికుల దళాలతోనూ, అండర్‌గ్రౌండ్ స్లీపర్ల బృందంతోనూ చేరమని అతనికి సందేశాలను, కలలను, వ్యక్తిగత అభ్యర్థనలను వెల్లువలా పంపించారు. చంపుతామని బెదిరించారు.

భూమి మీద అధికారం సాధించడమే వారి ఆశయం. నిశ్శబ్ద తిరుగుబాటు ద్వారా ఎర్త్ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్‌ను స్వాధీనం చేసులోవాలని వాళ్ళ కోరిక. ఇందు మీ తల్లిదండ్రులు అంగీకరించలేదు, వారితో చేతులు కలపలేదు.

… అందుకే మీ గ్రామం ఆమ్రపాలి యొక్క దక్షిణం వైపున్న పొలాల్లో.. ఆ వర్షపు రాత్రి.. ఘోరమైన పిడుగు శాపంతో చంపబడ్డారు. వారిని కాల్చి బూడిద చేశారు. మీ తల్లి మీ నాన్నని రక్షించలేక పోయింది. ఇద్దరూ బూడిదైపోయారు. ఎంత జ్ఞానమూ, ప్రతిభ ఉన్నప్పటికీ వారు దుష్టులను ఎదుర్కోలేకపోయారు. ఆ భీకరాకారులు తమ పిడుగు శాపాలతో విద్యుత్ శక్తిని సృష్టించి వాళ్ళని బూడిద చేశారు… “

నా శరీరం వణికిపోయింది. ఆ దురదృష్టవంతమైన రోజు నాటి వర్షపు చీకటి రాత్రిని తలచుకొన్నప్పుడల్లా… పగా … ప్రతీకారం గుర్తొస్తాయి… ఎవరిని చంపాలి? సమూరా, సయోనీలనా? మిగతా వాళ్ళెవరు? నేను చంపగలనా? నేను, ప్రకృతి కలసి ఇప్పటికే సయోనీని ఎలివేటర్‌లో చంపాం. ఇంకేంటి? కానీ నాకా శక్తి ఉందా?

నేనిలా ఆలోచిస్తుండగానే – ఎర్త్ కౌన్సిల్ నుంచి వచ్చిన వృద్ధ జంట వోజోస్కీ మరియు హిరానీ నన్ను చూస్తున్నారు. వోజోస్కీ యొక్క ముడతలు పడిన, వడిలిపోయిన ముఖం నా మనస్సుని చదువుతోంది. హిరానీ ఒక పిసియుఎఫ్ అని అనుకుంటున్నాను, ఆమె నల్లని పొడవాటి దుస్తులు, పాలరాతి తెలుపు ముఖం, కోసుగా ఉన్న ముక్కు, పొడవైన టోపీ, ముఖంపై వెయ్యి ముడుతలు… ఇవన్నీ ఆమె ఓ మంత్రగత్తె అనే అనుమానాన్ని కలిగిస్తున్నాయి.

“నీకా శక్తి ఉంది! మీరు అత్యంత సమర్థత కలిగి ఉన్నారు. 1000 ఏళ్ల వయసున్న మాంత్రికులైన తండ్రీకూతుళ్ళు – సమురా, సయోనీల శక్తిని నిష్ప్రభావం చేసేందుకు తగినంత శక్తిని మీరు ఇద్దరూ సృష్టించారు. సమూరా ఒకప్పుడు గెలాక్సీలో అనేక కాలనీలను నియంత్రించాడు. అయితే ఎల్లప్పుడూ అధికారాన్ని నిలుపుకోలేకపోయేవాడు. అతను, సయోని పాలించారు కానీ రాజకీయ నియంత్రణ లేదు. వారు చిన్న యుద్ధాల్లో ఓడించబడ్డారు, ఇంకా టైటాన్, యూరోపా మరియు ఎన్సెలాడస్‍లో మా సొంత పిసియుఎఫ్‌లచే, కౌంటర్ టెర్రరిజం బృందాలచే అధికారం నుంచి తొలగించబడ్డారు. చివరకు వాళ్ళు మార్స్ లోని రెడ్ ప్లెయిన్స్‍లో స్థిరపడ్డారు. “

“ఎందుకు మీరు వాళ్ళతో పోరాడలేదు, మార్స్‌లోనే వాళ్ళ పని పట్టచ్చుగా?”

“అవసరమైనప్పుడు మాత్రమే యుద్ధం జరుగుతుంది. మార్స్‌లోని మానవుల కాలనీలో మనుషులు, హ్యుమనాయిడ్లు, మిశ్రమ జాతులవారు ఉన్నారు. ప్రధానంగా పర్యాటకరంగంపై ఆధారపడిన హ్యూమన్ కాలనీ ప్రభుత్వం మనకు పెద్ద ఉపయోగకరమైనది కాదు. అందుకే వాళ్ళ యుద్ధాలను వాళ్ళని చేసుకోనిచ్చాం.” అని హిరానీ చెబుతుండగా…

“నువ్వు వచ్చేంత వరకు….” అంటూ జోక్యం చేసుకున్నారు వోజోస్కీ. “మీరు బాగా చేశారు! మీరు మంచివారు. మీరు సమూరా అధికారాలను తెలివిగా తప్పించారు! ఒక మాయా పానీయంతో! ఇంకా మీ సొంత మనిషి మీరోస్‍కి అధికారం అప్పజెప్పే అదృష్టం కలిగింది. ఇప్పుడు అతను మన వ్యక్తి.”

వణుకుతున్న స్వరంలో హిరానీ అన్నారు “సమూరా మరియు సయోనీలు గెలాక్సీలో రహస్యంగా విస్తరించిన ఉన్న దుష్ట మాంత్రికుల విశాల సామ్రాజ్యం చేతిలో చిన్న పావులని మాకు తెలుసు. దుష్ట మాంత్రికుల కేంద్రం లేదా దుష్ట చక్రవర్తి ఆల్ఫా సెంటారి మరియు ప్రోక్సిమా సెంటారీ యొక్క కెప్లెర్ వ్యవస్థలో ఉంటున్నట్లు అనుమానిస్తున్నాం. వీళ్ళు మన  సౌర వ్యవస్థను ఆక్రమించకుండా ఒక్కొక్కరిగా నాశనం చేయాలనుకుంటున్నాము. మన స్వంత పిసియుఎఫ్‍లు, కౌంటర్ టెర్రరిజం యూనిట్లు మరియు నిఘాబృందాలు వీరిని ఎదుర్కుంటాయి. చంద్రుడు, మార్స్, శని, టైటాన్ మరియు మన చంద్ర ఉపగ్రహాలలోని మన కాలనీలతో మాకు చాలా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. దూరాలు అపారమైనవి అయినప్పటికీ, వాళ్ళపై జరిపే పోరాటంలో భారీ ఖర్చులు ఉన్నాయి. ఇప్పుడు మీరు మాకు మార్గం చూపించారు.”

“లేదా నేను మీ చేతిలో ఓ పావునా?” అస్పష్టంగా అన్నాను నేను. “విశ్వశక్తిని ఉపయోగించుకునే కొంచెం ప్రతిభావంతుడైన ఒక సాధారణ మానవుడిని నేను! వాళ్ళు నా మీదకి పంపే భయంకరమైన పాత మరియు అగోచరమైన జీవులతో ఎలా పోరాడగలను? నా వల్ల కాదు. నా భార్య జీవితాన్నీ, నా జీవితాన్ని మళ్ళీ ప్రమాదంలో పడేయలేను.”

“మీకు రక్షణ కల్పిస్తాం. మొత్తం భూమి యొక్క టెక్నాలజీ మరియు రక్షణ శక్తి మీ వెనుక ఉంటుంది. మీ పగని కూడా గుర్తు చేసుకో! దుష్ట సమూరా, సయోనీ మరియు వారి అనుచరులు చనిపోవాలని నీకు లేదా? వాళ్ళే… మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి ఆ వికృతాకారులను, పిడుగులని సృష్టించారు. మా వద్ద ఋజువు ఉంది.”

మళ్ళీ అదే మునిగిపోతున్న భావన. తల తిరుగుతున్నట్లుంది. వర్షం, చెట్లు, దక్షిణం వైపు పొలాలు… పొడవైన అందమైన గడ్డం ఉన్న నారా మరియు మనోహరమైన, ఆప్యాయత కలిగి ఉండే నయన … నా అందమైన తల్లిదండ్రులు భీకరాకారులను ఎదుర్కోడం…

వారి చేతిలో కాలి బూడిదవడం…

“హనీ! పరిగెత్తు! పరిగెత్తి నీ ప్రాణాలు కాపాడుకో…. ధరణీ, వాణ్ణి చూసుకో … వాడిని రక్షించు … వాడికేమీ కాకూడదు..” నా తల్లి అరవటం నా మనోదృశ్యంలో కనబడుతోంది.

ఒక ఉష్ణమండల పిడుగుల తుఫాను వల్ల ఏర్పడిన వానలో – రెండు బూడిద దిబ్బల నుండి తెలుపు పొగ పైకి లేస్తోంది.

హిరానీ చెప్పడం కొనసాగించారు – “సమూరా తన శక్తులు పోగొట్టుకున్నాడనీ, సయోనీ చనిపోయిందని మీరు భావిస్తున్నారేమో! కానీ… చంద్రగ్రహంపై ఉన్న మా వేగులు అందించిన సమాచారం ప్రకారం సమూరా అక్కడ దాక్కుని ఉన్నాడు. కెప్లర్ మాంత్రికులు గ్రహాంతర సాంకేతికత యొక్క డిఎన్‌ఎ అఫినిటీ ద్వారా అణువులను సమీకరించి సయోనీని మళ్ళీ బ్రతికించారు…”

“ఏంటీ?”… ఆశ్చర్యపోయాను.

“హనీ, మనం వాళ్ళని ఎదుర్కుందాం. అన్ని వివరాలు మీకు కౌన్సిల్ సమావేశంలో తెలియజేయబడతాయి. సమయం అవుతోంది. పదండి. వెళదాం.”

(ఇంకా ఉంది)

Exit mobile version