భూమి నుంచి ప్లూటో దాకా… -6

    1
    5

    అధ్యాయం 15: పారానార్మల్ డిఫెన్స్ మంత్రిత్వ శాఖ, చంద్ర ప్రభుత్వం

    చంద్ర ప్రభుత్వంలోని పారానార్మల్ డిఫెన్స్ మంత్రిత్వ శాఖతో మా సంధానకర్త చాంద్.

    మంత్రిత్వశాఖ కార్యాలయం మా హాస్టల్ నుండి కొన్ని బ్లాకులు దూరంలో ఉంది. ఇది ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో ఉంది. మేము ఎక్కిన రోవర్ నేలకి కొద్దిగా పైన ఎగురుతూ ప్రయాణిస్తోంది.

    గది లోపల బాగా చీకటిగా ఉంది. ఆ పెద్ద మీటింగ్ హాల్… ​​ఎక్కడైనా, ఏ గ్రహం మీదైనా ఉండేలాగానే ఉంది. కాకపోతే ఎరుపు రంగులో ఉన్న గోడలపైన అనేక చిత్రాలున్నాయి. అక్కడి ప్రకాశించే తెరలపై కొన్ని వింత జీవులు మరియు విచిత్రమైన గ్రహాంతర జంతువుల చిత్రాలు, వింత దీపాలతో ఉన్న ఎగిరే స్పేస్‌షిప్స్, కొన్ని రకాల ట్రోఫీలు… కనబడ్డాయి. బహుశా అవి పారానార్మల్ జీవులకు వ్యతిరేకంగా మంత్రిత్వశాఖ సాధించిన గత విజయాలను సూచిస్తాయనుకుంటా.

    మంత్రిగారి ఆకారం కాస్త విచిత్రంగా ఉంది. ఆయన తల సాగి ఉంది. చెవులు, ముక్కు పొడుగ్గా ఉన్నాయి. కళ్ళు చిన్నవిగా, లోపలికి చొచ్చుకొని వచ్చినట్లుగా ఉన్నాయి. ఆయన చాలా పొడగరి. అసలైన మనిషి కాదనిపించేలా తలపై నిజమైన లేదా కృత్రిమ యాంటెన్నా ఉంది. అవసరమైనప్పుడు మొబైల్ మానిటర్ మీద సమాచారం అందించేందుకు ఇద్దరు సహాయకులు సమీపంలోనే ఉన్నారు. ఇద్దరు ఆర్డర్లీలు పళ్ళరసం, బిస్కెట్లను అందించి – మేం చర్చించుకునే విషయాలు వినకుండా, మాకు కనిపించకుండా దూరంగా వెళ్లారు.

    “చంద్రగ్రహంలోని అమృతా కాలనీలో మేము పారానార్మల్ శక్తుల సమస్యను చాలాసార్లు ఎదుర్కొన్నాము” అంటూ చెప్పసాగారు మంత్రిగారు. “భూమి, మార్స్, టైటాన్ మరియు గనీమీడ్ నుండి వచ్చిన మిత్రులారా… మాకు సహాయం చేసేందుకు ఎర్త్ కౌన్సిల్ పంపిన ప్రత్యేక బృందంలోకి నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. వారితో ఎలా వ్యవహరించాలో, వాళ్ళని ఎలా పట్టుకోవాలో మాకు తెలియదని కాదు, కానీ ఈసారి మాకు భూమితో సంబంధం ఉంది.”

    ఆయన నాకేసి చూసినప్పుడు… నేను మర్యాదగా అంతరాయం కలిగించటానికి ప్రయత్నించాను. చిన్నగా దగ్గాను. కాసేపటి క్రితమే మేమంతా నిలబడి ఒక్కొక్కరం మా పేరు చెబుతూ పరిచయం చేసుకున్నాం.

    “ఏమిటి మిస్టర్ హనీ…?”

    “మంత్రిగారూ, మీరు అంటున్న పారానార్మల్ ఫోర్స్ అంటే మీ ఉద్దేశం ఏమిటి? వాళ్ళు – మేము భూమి పిలుచుకునే చెడ్డ పిసియుఎఫ్‌లా? దుష్ట మాంత్రికులూ మంత్రగత్తెలా? లేదా ఇతర ఆత్మలు లేదా దెయ్యాలా లేక అజ్ఞాతశక్తులా?” అడిగాను.

    “అవును. ప్రస్తుత విజ్ఞాన శాస్త్రం వివరించలేని ఏ వ్యక్తీకరణనైనా మేము పారానార్మల్ అని పిలుస్తాము. మేము సౌర వ్యవస్థలలోని దూర గ్రహాల నుండి గ్రహాంతర దుష్టశక్తులను ఎదుర్కున్నాం. అకారణంగా మా రక్షణ, శక్తి మరియు ఆహార ఉత్పత్తి వ్యవస్థల్లో విద్రోహ చర్యలు చేయడం, దుర్బలమైన పౌరులను అపహరించడం, మూన్ కాలనీల్లో పేలుళ్లు సృష్టించడం లేదా తుఫానులు వంటి ఆటంకాలు సృష్టించడం…  అయితే ఏ సందర్భంలోనూ మేము ఈ ఘటనలలో ఏ చంద్ర నివాసి లేదా పౌరుడు లేదా ఇతర గ్రహాల పౌరుల ప్రమేయాన్ని గుర్తించలేకపోయాము.”

    “కానీ ఈ సంఘటనలు పారానార్మల్ శక్తుల వల్లనే సంభవిస్తున్నాయని మీరెలా నిర్ధారిస్తారు?”

    “హనీ ఆమ్రపాలి, మీకు బాగా తెలుసు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మీరు రేడియేషన్, ఎలక్ట్రానిక్ టర్బులెన్స్, అయానిక్ మూవ్‌మెంట్ కొలుస్తారు. మీ రోబో కూడా వాటిని గుర్తించగలదు. అయినా ఎందుకు అడుగుతున్నారు? అందరు పిసియుఎఫ్‌లు తమ చుట్టూ ఒక ప్రభను కలిగి ఉంటారు. వారి తీవ్రతలను కొలవవచ్చు మరియు గణించవచ్చు. వారి శక్తిని అంచనా వేయవచ్చు్” అని చెబుతూ మంత్రి తన సహాయకులకేసి చూశారు.

    గోడపై మానిటర్ పై ఒక తెర ప్రత్యక్షమైంది.

    చంద్రగ్రహం యొక్క పెద్ద మ్యాప్… దాని గుండ్రని బొమ్మ నిలువుగా రెండు భాగాలుగా – ఒకటి చీకటి భాగం, రెండోది ప్రకాశించే భాగంగా విభజించబడి తెరపై వచ్చింది.

    చంద్రుడిపైన… షాక్లెటన్ క్రేటర్, అమృతా కాలనీ, మలపేర్ట్ మౌంటైన్, చంద్రుడి సెంట్రల్ రైల్వే లైన్ లో మూడు ప్రదేశాలు, పీరీ క్రేటర్ వద్ద ఉత్తర ధ్రువం… వంటివి చిన్న ఎర్రని చుక్కలుగా కనబడ్డాయి.

    “ఈ పాయింట్ల వద్ద ఆ తేదీలలో ఎలక్ట్రానిక్ టర్బులెన్స్ సాధారణ స్థాయికి 100 రెట్లు అధికంగా ఉంది. వాళ్ళు ఏకాంతంగా సాహసాలు చేసేందుకు చిన్న చిన్న దూరాలు నడిచే ట్రెక్కర్లపైనా; కొన్ని లేజర్ తుపాకులు దొంగిలించేందుకు మిలిటరీ చెక్ ఫోస్టు పైనా దాడి చేశారు. వాళ్ళు రైల్లో ప్రయాణించి ఉండవచ్చు. ఇక, స్పేస్ ప్లాట్‌ఫాం ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టులో జరిగిన సంఘటనలు మీకు తెలుసు.”

    “అవును సర్, తెలుసు!” అన్నాను. “అంటే సూపర్ పిసియుఎఫ్‌లు చంద్రుడి ఇతర కాలనీలు, రైళ్లలోనూ చురుకుగా ఉన్నారని భావించాలా? ఇక్కడ మాగ్‌లెవ్ రకం రైల్వే వ్యవస్థ ఉందని నాకు తెలుసు” చెప్పాను.

    “అవును. హానీ. మాగ్నెటిక్-లెవిటేషన్ లైనర్లో అతి పొడవైన రైలు దక్షిణ ధృవం నుండి ఉత్తర ధ్రువం వరకు వెళ్ళి, తరువాత ప్రకాశించే భాగం చివరి వరకూ వెళుతుంది. అక్కడ ఈ రైలు మార్గం ముగుస్తుంది. చివరి స్టేషన్ చంద్రుడి చీకటి భాగం సరిహద్దు వద్ద ముగుస్తుంది. దాన్ని ‘లా డెర్నియర్’ అని పిలుస్తారు, అది అక్కడితో ముగుస్తుంది.”

    నేను పటాలను చూసాను. చివరి స్టేషన్ ‘లా డెర్నియర్’ చుట్టూ కనీసం ఒక డజను ప్రకాశిస్తున్న ఎరుపు మచ్చలు ఉన్నాయి.

    “అర్థమైంది” అన్నాను. ఈ గ్రహింపు నెమ్మదిగా కలిగింది. “ఈ గ్రహాంతరవాసులు చంద్రుని ప్రకాశించే వైపు అంచు వద్ద ‘లా డెర్నియర్’ స్టేషన్ నుండి రైలులో ప్రయాణిస్తున్నారు. వివిధ విద్యుత్ కేంద్రాలు, రక్షణ మరియు పరిశోధనా సంస్థల వద్ద కల్లోలాలను సృష్టిస్తున్నారు.. కానీ అంతరిక్ష కక్షలో ఉన్న శాటిలైట్ స్టేషన్ వద్ద టర్బులెన్స్ సిగ్నల్ ఎందుకు ఉంది? అది సోలార్ ప్యానల్ శాటిలైట్ స్టేషన్ కాదా? “

    “అవును. చంద్రుడు ఆ శాటిలైట్ స్టేషన్ చుట్టూ తిరిగి ఆ భారీ సౌర ఫలకాలను నుండి శక్తి పొందుతాడు. అక్కడ లక్షలాది రిఫ్లెక్టర్లు, అద్దాలు ఉన్నాయి, మీరన్నట్టు అవి సూర్యశక్తిని గ్రహించి, విద్యుత్ శక్తిగా మార్చి చంద్రుని కాలనీలకు పంపుతాయి. మాకిక్కడ రాత్రి చాలాసేపు ఉంటుంది” మంత్రిగారు వివరించారు.

    ఆయనేదో చెబుతుండగానే నేను జోక్యం చేసుకున్నాను. “భారీ అద్దాల వంటి సోలార్ ప్యానెల్స్ అనేనా మీరిప్పుడు అన్నారు?”

    “అవును! ఈ దుష్ట గ్రహాంతరవాసులు కక్షలో తిరుగుతున్న ఈ భారీ ప్లాట్‌ఫాంపైకి మూడుసార్లు చేరుకున్నారు, ఈ సౌర ఫలకాలను అమర్చారు. పవర్ స్టేషన్లను భంగపరచడానికి ఏదో కుట్ర జరుగుతోందని అనుమానించి అలారం మ్రోగింది. కాని సిబ్బంది అక్కడికే వెళ్ళేసరికే ఆ దుష్టులు తప్పించుకున్నారు.”

    డిమిట్రి, ప్రకృతి ఒకేసారి మాట్లాడటం మొదలుపెట్టారు.

    “ఆ అద్దాలు…”

    ఏనిమాయిడ్ ఎలుగుబంటిలా మూలిగాడు.

    “అవును మంత్రి గారు. ఇది పాత కాలంలోని షెర్లాక్ హోమ్స్ అనుమానం వంటిది. నిగమన తర్కం. మేము అంగారక గ్రహానికి చెందిన దుష్ట మాంత్రికుడు సమూరాతో పోరాడుతున్నాం. తనకి అధికారం కట్టబెట్టే, ఇతర గ్రహాలలో దాచిన అద్భుత వస్తువుల కోసం శోధిస్తున్నాడని తెలుసు.

    ఎన్‌సైక్లోపీడియా గలాక్టికాలో చదివాం. అనుభవజ్ఞులైన మాంత్రిక సంఘం (సిండికేట్ ఆఫ్ సీనియర్ విజర్డ్స్ – ఎస్.ఎస్.డబ్ల్యూ) చంద్రునిపై ‘మిర్రర్ ఆఫ్ యూనివర్సల్ కమ్యూనికేషన్’ అని పిలిచే అద్భుత వస్తువును దాచిపెట్టింది. కాబట్టి వాళ్ళు ఆ అద్దం కోసం వెతుకుతున్నారు!” చెప్పాను నేను.

    మంత్రిగారి పొడవాటి ముఖం మరింత పొడుగ్గా మారింది. తలపై కదిలే యాంటెన్నాలతో కళ్ళు మరింత పెద్దవయ్యాయి.

    “భూమి మీద ‘చెత్తవాగుడు’గా పిలవబడే కబుర్లేమీ చెప్పడం లేదుగా మీరు? ఇదంతా నిజమేనా? స్పష్టంగా చెప్పండి లేదా మీరు శాశ్వతంగా గౌరవాన్ని కోల్పోతారు.”

    నేను అన్నాను, “అవును సర్. మాకిది తెలుసు. నేను అంగారకుడి మీదా, భూమి మీద కుజగ్రహపు మంత్రగాళ్ళతోనూ, మానవులతో పనిచేశాను. సమూరా కనీసం రెండు అద్భుత వస్తువులని పొందడంలో నేను సాధనంగా ఉన్నాను. మౌంట్ ఒలంపస్ నుంచి అమృత ఔషధం, భూమి మీద భైరవ ఆలయం నుంచి వెండి కొవ్వొత్తి అతనికి నా ద్వారానే లభించాయి. కాబట్టి సమూరా ఆ అద్దం కోసం వెతుకుతున్నాడన్నది తార్కికమే. సుదూర, అజ్ఞాత ఆల్ఫా సిస్టమ్ మాంత్రికుల యొక్క సహాయం తీసుకుంటున్నాడు సమూరా.”

    మంత్రిగారు చేతులలో తన తలని పట్టుకున్నారు. చేతిలో ఇమిడిపోయే చిన్న కంప్యూటర్ పట్టుకుని దూరంగా తచ్చాడుతున్న తన కార్యదర్శి – పొడవాటి సన్నటి సొగసైన యువతికి సైగ చేశారు.

    “పారానార్మల్ డిఫెన్స్ మంత్రినై ఉండి కూడా ఈ విషయాలేవి నాకిప్పటి దాకా తెలియవు, ఇవన్నీ నాకు వార్తల్లా ఉన్నాయి. ఎన్‌సైక్లోపీడియాను శోధించండి. ఎస్.ఎస్.డబ్ల్యూ, అద్భుత వస్తువులు మొదలైన వాటిపై ఒక పత్రం సిద్ధం చేయండి. అన్ని వివరాలను సేకరించండి.”

    ఆయన గట్టిగా అరుస్తూ చెప్పారు. తరువాత నాతో మాట్లాడారు.

    “హనీ అమాపాలి, ఈ బృందానికి మీరు నాయకత్వం వహిస్తారు. ఎర్త్ కౌన్సిల్ మిమ్మల్నే ఎందుకు ఎన్నుకుందో ఇప్పుడు నాకు తెలిసింది. మీరు ఏం చేద్దామనుకుంటున్నారు. ఎలా కొనసాగించాలనుకుంటున్నారో మీరు ఇప్పుడు చెప్పండి.”

    నేను గొంతు సవరించుకున్నాను. వాన్ కు జాక్, చాంద్ వైపు చూసాను. వాళ్ళిద్దరూ తలాడించారు. నేను భావించినట్లుగానే ఆ మారిటన్, ఆ లూనార్ మాన్ కూడా భావిస్తున్నారనే అభిప్రాయం నాకు కలిగింది!

    “అన్ని సంకేతాలు ‘లా డెర్నియర్’ రైల్వే స్టేషన్ వద్ద నిలిచిపోతున్నాయి. అంటే, గ్రహాంతరవాసులు అక్కడ దిగి, చంద్రుడి యొక్క చీకటి వైపుకి పారిపోతున్నారని నేను భావిస్తున్నాను. భూమికి కనిపించని – చంద్రుడి యొక్క ఆ చీకటి వైపు ఏమి జరుగుతోందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏవో శక్తుల వల్ల ఈ దుష్ట గ్రహాంతరవాసులు అక్కడ దాక్కుంటారు, అందువల్ల వారు పట్టుబడరు. నాకు అధికారమిస్తే నేను చంద్రుడి చీకటి భాగంలో వాళ్ళని వెతుకుతాను. ఇక్కడ చంద్రుని ప్రకాశవంతమైన భాగంలో మీరు వాళ్ళని సులభంగా పట్టుకోవచ్చు… కానీ మీరు పట్టుకోలేకపోయారు” అన్నాను.

    “అసాధ్యం” మంత్రిగారు అరిచారు. “అక్కడెవరూ నివసించరు. అక్కడ కాంతి లేదు. కాస్మిక్ రేడియేషన్, ఉల్కల దుమ్ము అధికం. మరియా అని పిలవబడే ఘనీభవించిన అగ్నిపర్వతం దుమ్ముతో ఏర్పడిన మైదానాలున్నాయి. ఎవరైనా అక్కడ ఎలా దాక్కోవచ్చు? పైగా ఇక్కడ సంకేతాలు అందుబాటులో లేవు, అయితే ‘లా గ్రాంగియన్ పాయింట్’ వద్ద ఒక ఉపగ్రహం ఉంది” చెప్పారాయన.

    నేను అన్నాను, “సర్, మేము కూడా పారానార్మల్ శక్తులమే. మాకు అవసరమైన వస్తువులను ఇవ్వండి. మేమా చీకటి భాగాన్ని శోధిస్తాం. సరిహద్దులో ‘లా డెర్నియర్’ రైల్వే స్టేషన్‌కి మమ్మల్ని పంపండి. మాకు ఈ గాడ్జెట్లు కావాలి” అంటూ నేను ఆయనకి ఓ జాబితా ఇచ్చాను.

    “ఏర్పాటు చేస్తాను!” అన్నారు మంత్రి గారు. “హనీ, మీరూ, మీ బృందం జాగ్రత్తగా ఉండండి. చీకటి వైపులో ఎటువంటి రెస్క్యూ జట్లు చురుకుగా లేవు. అయితే, లూనార్ జియో పొజిషనింగ్ పరికరాలను తీసుకొని వాళ్ళని వెతకండి. వారిని సజీవంగా పట్టుకోండి” అని చెబుతూ… అప్పుడే ఆ గదిలోకి ప్రవేశించిన తన కార్యదర్శిని, సహాయకులను చూస్తూ:

    “వీరికి అవసరమైన అన్నింటినీ ఇవ్వండి. వీళ్ళ ప్రణాళిక, ప్రయాణ వివరాలు రేపటికల్లా నాకు అందజేయండి” అన్నారు

    “ధన్యవాదాలు మంత్రిగారూ! నేను చేయగలిగినదంతా చేస్తాను” అన్నాను.

    (సశేషం)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here