[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]
అధ్యాయం 14: చంద్రుడు
[dropcap style=”circle”]మ[/dropcap]మ్మల్ని దిగువకు తీసుకెళుతున్న లిఫ్ట్‌లో అంతా చీకటిమయం, విపరీతమైన చల్లదనం. షాక్లెటన్ బిలం అంతర్భాగంలో నిర్మించబడిన అమృత కాలనీకి మా అవరోహణం.
డిమిట్రి కిసుక్కున నవ్వింది.
“టైటాన్లో మా ఊర్లో ఉన్నట్టే ఉంది! మా ఇల్లు చేరాలంటే భూమి అడుగున మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. మా జీవితం ఎల్లప్పుడూ నేల స్థాయికి దిగువన ఉంటుంది.”
నాకు తెలుసు. టైటాన్ భూగర్భంలో జలాలు ఉన్నాయి. పైగా అక్కడి ఉష్ణోగ్రతలు భూమిపై ఉండే ఉష్ణోగ్రతలానే ఉంటాయి. అక్కడివాళ్ళు కూడా నేల క్రింద భారీ కాలనీలు ఏర్పాటు చేసుకున్నారు.
మేం బిలం అడుగుకి చేరాం. అది విశాలమైన ప్రదేశం. బిలం గోడల పక్కగా చంద్రశిలలతో చదరపు ఆకారంలో గృహాలు, నివాసాలు కనబడ్డాయి. పొడవాటి వరుసలలో నిర్మించిన కట్టడాలు, రహదారులు ఇరువైపులా ఉన్నాయి.
కాసేపట్లో మాకు కేటాయించిన బసకి చేరుకున్నాం. ఆ హాస్టల్ భవనం కొన్ని తెలియని మిశ్రమాలు మరియు గాజుతో నిర్మించబడింది. మెరుస్తూ ఉన్న ఒక సైన్ బోర్డుపై ఆంగ్లంలోనూ, విశ్వవ్యాప్త డిజిటల్ భాషలోనూ ఇలా రాసి ఉంది:
“చంద్రగ్రహ ప్రభుత్వ అతిథిగృహాలు”
భూగర్భ నగరాలు, నివాసాలు అమృతా కాలనీ యొక్క విశిష్టతలు.
మేము నిర్మాణం లోపలికి వెళ్లాం. ఇన్-బిల్ట్ కంట్రోల్స్, తెరలతో మెరుస్తున్న భారీ డెస్క్ వెనుక కూర్చున్న రిసెప్షనిస్ట్‌ని కలిశాం.
డి.ఎన్.ఎ పరీక్ష కోసం మా రక్తం నమూనాలు తీసుకుని, మా గుర్తింపు కోసం రెటీనా స్కానింగ్ చేశాక, మాకు మా గదుల ఎలక్ట్రానిక్ తాళంచెవులను ఇవ్వబడ్డాయి.
ఆపై చంద్రునిపై మా పని ప్రారంభమైంది.
హాస్టల్లోని నా గదిలోకి వెళ్ళగానే, వెంటనే స్నానం చేసి మామూలు బట్టలు ధరించి, ప్రకృతితో కలిసి లంచ్ కోసం మొదటి అంతస్తులోని డైనింగ్ హాల్‌వైపు నడిచాను.
డిమిట్రి, ఏనిమాయిడ్, చాంద్, వాన్ కు జాక్ అప్పటికే టేబుల్ వద్ద ఉన్నారు.
“తిని, ఒక గంట విశ్రాంతి తీసుకొని, ‘మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎగైనెస్ట్ పారానార్మల్ ఫోర్సెస్’ ఆఫీసుకు వెళ్దాం.” వాళ్ళతో అన్నాను.
భోజనశాలలో నిశ్శబ్దం వ్యాపించింది. ఆ వాతావరణం చల్లగా ఉంది. డైనింగ్ రూమ్ గోడలపై చంద్రుడిని అన్వేషించే క్రమంలో మానవులు చేసిన కృషిని చాటే చిత్రాలు – భారీ పరిమాణంలోని క్రేన్లు, యంత్రాలతో భారీ నిర్మాణాలు నిర్మిస్తున్న తొలి అన్వేషకులు వంటి చిత్రాలలు అలంకరించబడ్డాయి. ఇంకా చంద్రునిపై ఇతర కాలనీలు కూడా ఉన్నాయి. భూమిపై అమెరికా ప్రభ వెలుగుతున్న కాలంలో ఆ దేశ శాస్త్రవేత్తలు చంద్రుడిపై షాక్లెటన్ బిలంలోని అమృతా కాలనీని ఏర్పరిచారు, వీళ్ళవే మరికొన్ని కాలనీలు కూడా ఉన్నాయి.
రష్యన్లు, చైనీయులు చంద్రుడి ఉపరితలంపై కాలనీలను నిర్మించుకుంటే, అమెరికన్లు భూగర్భంలో నిర్మించారు. ఇతర దేశాలు ఉపరితల కాలనీలు చంద్రుని యొక్క భారీ లావా ట్యూబులలో కాలనీలు ఏర్పాటు చేసుకున్నాయి. చంద్ర ఉపరితల రైలు మార్గం ప్రధాన కాలనీలను కలుపుతుంది. చంద్రునిపై వివిధ కాలనీల మధ్య శాంతి నెలకొని ఉంది. ఈ కాలనీలవాళ్ళు పర్యాటక రంగం, ఖనిజ అన్వేషణ మరియు అంతర్ గ్రహాల ప్రయాణంలో వృద్ధి చెందారు.
అటువంటి భారీ గ్రహం మీద సమూరానీ, అతని దుష్ట తాంత్రిక బృందాలను కనుగొనడం ఎలా?
ఏదైనా నిఘా వ్యవస్థ ఉందా? అత్యంత్త శక్తివంతమైన ఇంటర్‌గెలాక్టిక్ పోలీస్ అని పిలవబడే పోలీసులు ఏమైనా విచారణ చేశారా?
దిగుమతి చేసుకున్న కోడి, గొర్రె మాంసంతోనూ; కూరగాయలు, స్ఫగెట్టి, పాల పదార్థాలతోనూ భోం చేస్తూ చెప్పాను.
“సమూరాని పట్టుకునే విషయంలో నా ఆలోచనలను వారికి చెప్పాను. తన శక్తులను తిరిగి పొందడానికి సమూరా ప్రయత్నిస్తున్నందున, చంద్రుడిపై దాచి ఉంచిన అద్భుత వస్తువు కోసం ఖచ్చితంగా వెతుకుతాడని నేను భావిస్తున్నాను. ఆ వస్తువు విశ్వంలో ఎవరితోనైనా భావప్రసారం చేయగల అద్దం. దాన్ని ఎక్కడ దాచారో, నిజంగా అలాంటి వస్తువంటూ ఒకటుందో లేదో మనకు తెలియదు! ఉన్నట్టయితే మాత్రం, మనం ఇప్పటికే భూమిపై వెండి కొవ్వొత్తిని కనుగొన్నట్లు, దాన్నీ కనుగొనాలి”
డిమిట్రి మళ్ళీ కిసుక్కున నవ్వింది. ఆమె నన్ను ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటుంది.
“ఎన్నుకోబడినవాడి కదా, నువ్వు దాన్ని కనుగొనగలవు! స్వచ్ఛమైన, అమాయక, నిస్వార్థ విజర్డ్కి మాత్రమే అది కనబడుతుంది. అని రాసి ఉంది కదా… హహ్హహ్హా… “
ప్రకృతి నాకేసి ప్రశ్నార్థకంగా చూసింది.
ఆ చూపులో ‘మీ మధ్య ఏం ఉంది’ అనే ఆరా ఉంది.
“హనీ! డిమిట్రీ అన్నదాంట్లో వాస్తవం ఉంది. ఆ అద్భుత వస్తువుని కనుగొనడానికి గతంలో వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేశారు. కాబట్టి వాళ్ళు చంద్రుని మీద ఓ స్వచ్ఛమైన నిస్వార్థమైన అమాయక పి.సి.యు.ఎఫ్‌ని అపహరించి, దానిని గుర్తించడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ జరిగిన అన్ని కిడ్నాపులనీ పరిశీలించమని చంద్ర ప్రభుత్వంలో మంత్రిని అభ్యర్థించడం మంచిదేమో?” అంది ప్రకృతి.
“అవును. మీరు సరైన మార్గంలోనే ఉన్నారు. పారానార్మల్ డిఫెన్స్ మంత్రి వద్దకి మనం పూర్తి కార్యాచరణ ప్రణాళికతో దర్యాప్తు కోసం వెళదాము.”
“1. గత నెల రోజులలో జరిగిన అన్ని కిడ్నాప్‌లను, విశ్వశక్తి ఉపయోగించడం వల్ల సంభవించిన ఎలక్ట్రానిక్ టర్బులెన్స్‌ను సమీక్షించటం ద్వారా శోధించండి.
- ఇక్కడ డిజిటల్ నంబర్లచే పర్యవేక్షించబడే వ్యక్తుల లూనార్ పొజిషనింగ్ సిస్టమ్‌ను అధ్యయనం చేయడం వల్ల ఆధునిక శాస్త్రం వివరించలేని ఏ రహస్యమైన విషయమైనా వారికి తెలుస్తుంది.
- ఆల్ఫాసెంటారీ వ్యవస్థని అధ్యయనం చేసి, అక్కడి రహస్య తాంత్రిక సమూహం యొక్క ప్రధాన కార్యాలయం ఏదైనా ఇక్కడుందా అని నిర్ధారించుకోవాలి. అక్కడ కెప్లెర్ గ్రహ వ్యవస్థలు ఎ నుంచి ఎల్ వరకూ ఉన్నాయి. స్పేస్ ప్లాట్‌ఫాంపై అనుమానితులు తచ్చాడిన ఘటనలో వాళ్ళు ఆల్ఫా వ్యవస్థ నుంచి వచ్చినట్టు సమాచారం ఉంది.”
ఏనిమాయిడ్ ఎప్పటిలానే గుర్రుమన్నాడు. అతను గనీమీడియన్ మాండలికంలో కొన్ని పదాల మినహా తప్ప ఎక్కువగా మాట్లాడలేడు, అదీ చాలా అరుదుగా!
వాన్ కు జాక్ చుట్టూ చూశాడు. పండ్లు, పాలతో చేసిన డెజర్ట్‌ను త్రాగుతూ, తన పెదవుల మీదున్న నురగని ఆస్వాదిస్తున్నాడు.
“ఆల్ఫా సెంటారీ వ్యవస్థలో అత్యంత భారీ విజర్డ్ సామ్రాజ్యాలు ఉన్నాయి. ఈ మాంత్రికులు మన సౌర వ్యవస్థలో ప్రవేశించడానికి చాలకాలం ముందే, ఆల్ఫా వ్యవస్థ మొత్తం గ్రహాలపై విజర్డ్ సామ్రాజ్యాలను స్థాపించిన మర్మమైన వ్యక్తులున్నారు. అన్ని గ్రహాలపైనా కాకపోయినా కనీసం మూడు గ్రహాలపై మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. సమూరా ఆల్ఫా వ్యవస్థ నుండి శరణార్థిగా వచ్చి, ఎక్కడికో తప్పించుకుపోయి, పాలపుంతలోని 100 గ్రహాలను స్వాధీనం చేసుకున్నాడని, మళ్లీ వాటిని వివిధ యుద్ధాలలో ఒకటొకటిగా కోల్పోయాడని రెడ్ ప్లెయిన్స్లో విశ్వసిస్తారు. అతని చివరి రాజ్యం అరుణ భూములలో ఉంది. అతను తన మాంత్రిక సామ్రాజ్యం ఉత్తానపతనాలను చూశాడు. బహుశా ఆల్ఫా సెంటారీ వ్యవస్థలోని కెప్లర్ బి లేదా సి ప్లానెట్లలో నివాసముండే అతని మాజీ యజమానులు అతన్ని రిమోట్‌గా నియంత్రిస్తారు. ఇప్పుడు అమృత ఔషధం తాగాకా అమరత్వం పొంది తను కోల్పోయిన గ్రహాలపై నియంత్రణ తిరిగి పొందాలని కోరుకుంటున్నాడు.”
నేను చెప్పాను, “నాకిప్పుడు అర్థమైంది. నేను అతని ప్రణాళికను నాశనం చేశాను. కానీ ప్రతీ అద్భుత వస్తువుకీ ఒక షరతు ఉంటుంది. అతను అమృత ఔషధం తాగి అమరత్వం పొందాడు, కానీ శక్తులు కోల్పోయాడు. వెండి కొవ్వొత్తిని సాధించాడు, కానీ అది ఎవరినీ చంపలేదు లేదా చిత్రవధ చేయలేదు. అతను తన ఎనిమిది మంత్రులను, కుమార్తె సయోనిని భూమిపైన స్పేస్ ఎలివేటర్ వద్ద కోల్పోయాడు. అద్దం ఏమి చేయగలదో దేవుడికే తెలుసు. అతని చేతుల్లో ఉన్నా కూడా… ఇది ఖచ్చితంగా విశ్వానికి చెడు చేయదు…”
చాన్ తన చేతులను తుడుచుకుంటూ అన్నాడు “అయితే సమూరాని ఆపాలి. నాశనం చేయాలి. ఇప్పుడు అతను – పూర్తిగా అనూహ్యమైన క్రూరత్వం చూపే దుర్మార్గులు – సుదూర ఆల్ఫా వ్యవస్థ మాంత్రికుల సహాయం పొందే ప్రమాదం ఉంది. వారు జీవితం సృష్టించగలరు; ఒంటరిగా పోరాడగలరు, సైన్స్ యొక్క అన్ని శక్తులను ఉపయోగించగలరు. కానీ అవి చాలా తక్కువ. వారు జన్యు-పరివర్తనం చేయబడ్డ అసాధారణ శక్తులు గల మానవులలా ఉన్నారు. వాళ్ళతో పాటు సమూరానీ నాశనం చేయాలి, లేదంటే ఆ చీకటి మహమ్మారి మన అంగారకుడిపై దాడి చేయగలదు.”
“భూమిపై, మార్స్ మీద, టైటాన్‌పై, గనీమీడ్‌పై కూడా…” అన్నాను. “కానీ ఇప్పటికీ నన్ను ఇబ్బంది పెడుతున్న సంగతేంటంటే – కొందరు ముసలి చీకటి తాంత్రికులు గ్రహాలను ఎలా జయించగలరన్నదే!”
చాంద్ మాట్లాడుతూ “మార్స్ అరుణ భూములలో జరిగినట్టే, వారు మానవులను ఓడించిన తరువాత, తాంత్రికుల సామ్రాజ్యాలను స్థాపిస్తారు, విశ్వంలోని అన్ని తాంత్రిక సమూహాలను అక్కడ నివసించడానికి ఆహ్వానిస్తారు. తమ తాంత్రిక కార్యకలాపాలను సాధన చేస్తారు. వాళ్ళతో ఎలా పోరాడాలన్నది మనుషులు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు” అన్నాడు.
“మనలాంటి గొప్ప పిసియుఎఫ్లు తప్ప… హనీ లాంటి ఉత్తములు తప్ప…” అని డిమిట్రి హాస్యమాడింది. ఆమె నవ్వింది. “ఎంత పరిహాసంగా అనిపించినా, దాన్ని అర్థం చేసుకోడం సులభం. చీకటి తాంత్రికులు – కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ తనిఖీలను దాటుకుని అన్ని గ్రహాలలో ప్రయాణించడం, అధికారాలు పొందడం, ప్రభుత్వాలలో కీలక స్థానాలలో తమ ఏజెంట్లను కలిగి ఉండడం… 21వ శతాబ్దంలోని భారీ గెరిల్లా లేదా అండర్‌గ్రౌండ్ వార్ లాగా… “
“అవును!” అన్నాను నేను.
నాకు అర్థమైంది. మానవుల శాంతి కోసం, గ్రహాల కాలనీల రక్షణ కోసం మేము వాళ్ళని కనిపెట్టి, పోరాడి నాశనం చేయాలి. “… ఇంకా నా తల్లిదండ్రుల వంటి అమాయకులను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలి!” అని మనసులో అనుకున్నాను.
అధ్యాయం 15: పారానార్మల్ డిఫెన్స్ మంత్రిత్వ శాఖ, చంద్ర ప్రభుత్వం
చంద్ర ప్రభుత్వంలోని పారానార్మల్ డిఫెన్స్ మంత్రిత్వ శాఖతో మా సంధానకర్త చాంద్.
మంత్రిత్వశాఖ కార్యాలయం మా హాస్టల్ నుండి కొన్ని బ్లాకులు దూరంలో ఉంది. ఇది ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో ఉంది. మేము ఎక్కిన రోవర్ నేలకి కొద్దిగా పైన ఎగురుతూ ప్రయాణిస్తోంది.
గది లోపల బాగా చీకటిగా ఉంది. ఆ పెద్ద మీటింగ్ హాల్… ఎక్కడైనా, ఏ గ్రహం మీదైనా ఉండేలాగానే ఉంది. కాకపోతే ఎరుపు రంగులో ఉన్న గోడలపైన అనేక చిత్రాలున్నాయి. అక్కడి ప్రకాశించే తెరలపై కొన్ని వింత జీవులు మరియు విచిత్రమైన గ్రహాంతర జంతువుల చిత్రాలు, వింత దీపాలతో ఉన్న ఎగిరే స్పేస్‌షిప్స్, కొన్ని రకాల ట్రోఫీలు… కనబడ్డాయి. బహుశా అవి పారానార్మల్ జీవులకు వ్యతిరేకంగా మంత్రిత్వశాఖ సాధించిన గత విజయాలను సూచిస్తాయనుకుంటా.
మంత్రిగారి ఆకారం కాస్త విచిత్రంగా ఉంది. ఆయన తల సాగి ఉంది. చెవులు, ముక్కు పొడుగ్గా ఉన్నాయి. కళ్ళు చిన్నవిగా, లోపలికి చొచ్చుకొని వచ్చినట్లుగా ఉన్నాయి. ఆయన చాలా పొడగరి. అసలైన మనిషి కాదనిపించేలా తలపై నిజమైన లేదా కృత్రిమ యాంటెన్నా ఉంది. అవసరమైనప్పుడు మొబైల్ మానిటర్ మీద సమాచారం అందించేందుకు ఇద్దరు సహాయకులు సమీపంలోనే ఉన్నారు. ఇద్దరు ఆర్డర్లీలు పళ్ళరసం, బిస్కెట్లను అందించి – మేం చర్చించుకునే విషయాలు వినకుండా, మాకు కనిపించకుండా దూరంగా వెళ్లారు.
“చంద్రగ్రహంలోని అమృతా కాలనీలో మేము పారానార్మల్ శక్తుల సమస్యను చాలాసార్లు ఎదుర్కొన్నాము” అంటూ చెప్పసాగారు మంత్రిగారు. “భూమి, మార్స్, టైటాన్ మరియు గనీమీడ్ నుండి వచ్చిన మిత్రులారా… మాకు సహాయం చేసేందుకు ఎర్త్ కౌన్సిల్ పంపిన ప్రత్యేక బృందంలోకి నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. వారితో ఎలా వ్యవహరించాలో, వాళ్ళని ఎలా పట్టుకోవాలో మాకు తెలియదని కాదు, కానీ ఈసారి మాకు భూమితో సంబంధం ఉంది.”
ఆయన నాకేసి చూసినప్పుడు… నేను మర్యాదగా అంతరాయం కలిగించటానికి ప్రయత్నించాను. చిన్నగా దగ్గాను. కాసేపటి క్రితమే మేమంతా నిలబడి ఒక్కొక్కరం మా పేరు చెబుతూ పరిచయం చేసుకున్నాం.
“ఏమిటి మిస్టర్ హనీ…?”
“మంత్రిగారూ, మీరు అంటున్న పారానార్మల్ ఫోర్స్ అంటే మీ ఉద్దేశం ఏమిటి? వాళ్ళు – మేము భూమి పిలుచుకునే చెడ్డ పిసియుఎఫ్లా? దుష్ట మాంత్రికులూ మంత్రగత్తెలా? లేదా ఇతర ఆత్మలు లేదా దెయ్యాలా లేక అజ్ఞాతశక్తులా?” అడిగాను.
“అవును. ప్రస్తుత విజ్ఞాన శాస్త్రం వివరించలేని ఏ వ్యక్తీకరణనైనా మేము పారానార్మల్ అని పిలుస్తాము. మేము సౌర వ్యవస్థలలోని దూర గ్రహాల నుండి గ్రహాంతర దుష్టశక్తులను ఎదుర్కున్నాం. అకారణంగా మా రక్షణ, శక్తి మరియు ఆహార ఉత్పత్తి వ్యవస్థల్లో విద్రోహ చర్యలు చేయడం, దుర్బలమైన పౌరులను అపహరించడం, మూన్ కాలనీల్లో పేలుళ్లు సృష్టించడం లేదా తుఫానులు వంటి ఆటంకాలు సృష్టించడం… అయితే ఏ సందర్భంలోనూ మేము ఈ ఘటనలలో ఏ చంద్ర నివాసి లేదా పౌరుడు లేదా ఇతర గ్రహాల పౌరుల ప్రమేయాన్ని గుర్తించలేకపోయాము.”
“కానీ ఈ సంఘటనలు పారానార్మల్ శక్తుల వల్లనే సంభవిస్తున్నాయని మీరెలా నిర్ధారిస్తారు?”
“హనీ ఆమ్రపాలి, మీకు బాగా తెలుసు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మీరు రేడియేషన్, ఎలక్ట్రానిక్ టర్బులెన్స్, అయానిక్ మూవ్మెంట్ కొలుస్తారు. మీ రోబో కూడా వాటిని గుర్తించగలదు. అయినా ఎందుకు అడుగుతున్నారు? అందరు పిసియుఎఫ్లు తమ చుట్టూ ఒక ప్రభను కలిగి ఉంటారు. వారి తీవ్రతలను కొలవవచ్చు మరియు గణించవచ్చు. వారి శక్తిని అంచనా వేయవచ్చు్” అని చెబుతూ మంత్రి తన సహాయకులకేసి చూశారు.
గోడపై మానిటర్ పై ఒక తెర ప్రత్యక్షమైంది.
చంద్రగ్రహం యొక్క పెద్ద మ్యాప్… దాని గుండ్రని బొమ్మ నిలువుగా రెండు భాగాలుగా – ఒకటి చీకటి భాగం, రెండోది ప్రకాశించే భాగంగా విభజించబడి తెరపై వచ్చింది.
చంద్రుడిపైన… షాక్లెటన్ క్రేటర్, అమృతా కాలనీ, మలపేర్ట్ మౌంటైన్, చంద్రుడి సెంట్రల్ రైల్వే లైన్ లో మూడు ప్రదేశాలు, పీరీ క్రేటర్ వద్ద ఉత్తర ధ్రువం… వంటివి చిన్న ఎర్రని చుక్కలుగా కనబడ్డాయి.
“ఈ పాయింట్ల వద్ద ఆ తేదీలలో ఎలక్ట్రానిక్ టర్బులెన్స్ సాధారణ స్థాయికి 100 రెట్లు అధికంగా ఉంది. వాళ్ళు ఏకాంతంగా సాహసాలు చేసేందుకు చిన్న చిన్న దూరాలు నడిచే ట్రెక్కర్లపైనా; కొన్ని లేజర్ తుపాకులు దొంగిలించేందుకు మిలిటరీ చెక్ ఫోస్టు పైనా దాడి చేశారు. వాళ్ళు రైల్లో ప్రయాణించి ఉండవచ్చు. ఇక, స్పేస్ ప్లాట్‌ఫాం ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టులో జరిగిన సంఘటనలు మీకు తెలుసు.”
“అవును సర్, తెలుసు!” అన్నాను. “అంటే సూపర్ పిసియుఎఫ్లు చంద్రుడి ఇతర కాలనీలు, రైళ్లలోనూ చురుకుగా ఉన్నారని భావించాలా? ఇక్కడ మాగ్లెవ్ రకం రైల్వే వ్యవస్థ ఉందని నాకు తెలుసు” చెప్పాను.
“అవును. హానీ. మాగ్నెటిక్-లెవిటేషన్ లైనర్‌లో అతి పొడవైన రైలు దక్షిణ ధృవం నుండి ఉత్తర ధ్రువం వరకు వెళ్ళి, తరువాత ప్రకాశించే భాగం చివరి వరకూ వెళుతుంది. అక్కడ ఈ రైలు మార్గం ముగుస్తుంది. చివరి స్టేషన్ చంద్రుడి చీకటి భాగం సరిహద్దు వద్ద ముగుస్తుంది. దాన్ని ‘లా డెర్నియర్’ అని పిలుస్తారు, అది అక్కడితో ముగుస్తుంది.”
నేను పటాలను చూసాను. చివరి స్టేషన్ ‘లా డెర్నియర్’ చుట్టూ కనీసం ఒక డజను ప్రకాశిస్తున్న ఎరుపు మచ్చలు ఉన్నాయి.
“అర్థమైంది” అన్నాను. ఈ గ్రహింపు నెమ్మదిగా కలిగింది. “ఈ గ్రహాంతరవాసులు చంద్రుని ప్రకాశించే వైపు అంచు వద్ద ‘లా డెర్నియర్’ స్టేషన్ నుండి రైలులో ప్రయాణిస్తున్నారు. వివిధ విద్యుత్ కేంద్రాలు, రక్షణ మరియు పరిశోధనా సంస్థల వద్ద కల్లోలాలను సృష్టిస్తున్నారు.. కానీ అంతరిక్ష కక్షలో ఉన్న శాటిలైట్ స్టేషన్ వద్ద టర్బులెన్స్ సిగ్నల్ ఎందుకు ఉంది? అది సోలార్ ప్యానల్ శాటిలైట్ స్టేషన్ కాదా? “
“అవును. చంద్రుడు ఆ శాటిలైట్ స్టేషన్ చుట్టూ తిరిగి ఆ భారీ సౌర ఫలకాలను నుండి శక్తి పొందుతాడు. అక్కడ లక్షలాది రిఫ్లెక్టర్లు, అద్దాలు ఉన్నాయి, మీరన్నట్టు అవి సూర్యశక్తిని గ్రహించి, విద్యుత్ శక్తిగా మార్చి చంద్రుని కాలనీలకు పంపుతాయి. మాకిక్కడ రాత్రి చాలాసేపు ఉంటుంది” మంత్రిగారు వివరించారు.
ఆయనేదో చెబుతుండగానే నేను జోక్యం చేసుకున్నాను. “భారీ అద్దాల వంటి సోలార్ ప్యానెల్స్ అనేనా మీరిప్పుడు అన్నారు?”
“అవును! ఈ దుష్ట గ్రహాంతరవాసులు కక్షలో తిరుగుతున్న ఈ భారీ ప్లాట్‌ఫాంపైకి మూడుసార్లు చేరుకున్నారు, ఈ సౌర ఫలకాలను అమర్చారు. పవర్ స్టేషన్లను భంగపరచడానికి ఏదో కుట్ర జరుగుతోందని అనుమానించి అలారం మ్రోగింది. కాని సిబ్బంది అక్కడికే వెళ్ళేసరికే ఆ దుష్టులు తప్పించుకున్నారు.”
డిమిట్రి, ప్రకృతి ఒకేసారి మాట్లాడటం మొదలుపెట్టారు.
“ఆ అద్దాలు…”
ఏనిమాయిడ్ ఎలుగుబంటిలా మూలిగాడు.
“అవును మంత్రి గారు. ఇది పాత కాలంలోని షెర్లాక్ హోమ్స్ అనుమానం వంటిది. నిగమన తర్కం. మేము అంగారక గ్రహానికి చెందిన దుష్ట మాంత్రికుడు సమూరాతో పోరాడుతున్నాం. తనకి అధికారం కట్టబెట్టే, ఇతర గ్రహాలలో దాచిన అద్భుత వస్తువుల కోసం శోధిస్తున్నాడని తెలుసు.
ఎన్సైక్లోపీడియా గలాక్టికాలో చదివాం. అనుభవజ్ఞులైన మాంత్రిక సంఘం (సిండికేట్ ఆఫ్ సీనియర్ విజర్డ్స్ – ఎస్.ఎస్.డబ్ల్యూ) చంద్రునిపై ‘మిర్రర్ ఆఫ్ యూనివర్సల్ కమ్యూనికేషన్’ అని పిలిచే అద్భుత వస్తువును దాచిపెట్టింది. కాబట్టి వాళ్ళు ఆ అద్దం కోసం వెతుకుతున్నారు!” చెప్పాను నేను.
మంత్రిగారి పొడవాటి ముఖం మరింత పొడుగ్గా మారింది. తలపై కదిలే యాంటెన్నాలతో కళ్ళు మరింత పెద్దవయ్యాయి.
“భూమి మీద ‘చెత్తవాగుడు’గా పిలవబడే కబుర్లేమీ చెప్పడం లేదుగా మీరు? ఇదంతా నిజమేనా? స్పష్టంగా చెప్పండి లేదా మీరు శాశ్వతంగా గౌరవాన్ని కోల్పోతారు.”
నేను అన్నాను, “అవును సర్. మాకిది తెలుసు. నేను అంగారకుడి మీదా, భూమి మీద కుజగ్రహపు మంత్రగాళ్ళతోనూ, మానవులతో పనిచేశాను. సమూరా కనీసం రెండు అద్భుత వస్తువులని పొందడంలో నేను సాధనంగా ఉన్నాను. మౌంట్ ఒలంపస్ నుంచి అమృత ఔషధం, భూమి మీద భైరవ ఆలయం నుంచి వెండి కొవ్వొత్తి అతనికి నా ద్వారానే లభించాయి. కాబట్టి సమూరా ఆ అద్దం కోసం వెతుకుతున్నాడన్నది తార్కికమే. సుదూర, అజ్ఞాత ఆల్ఫా సిస్టమ్ మాంత్రికుల యొక్క సహాయం తీసుకుంటున్నాడు సమూరా.”
మంత్రిగారు చేతులలో తన తలని పట్టుకున్నారు. చేతిలో ఇమిడిపోయే చిన్న కంప్యూటర్ పట్టుకుని దూరంగా తచ్చాడుతున్న తన కార్యదర్శి – పొడవాటి సన్నటి సొగసైన యువతికి సైగ చేశారు.
“పారానార్మల్ డిఫెన్స్ మంత్రినై ఉండి కూడా ఈ విషయాలేవి నాకిప్పటి దాకా తెలియవు, ఇవన్నీ నాకు వార్తల్లా ఉన్నాయి. ఎన్సైక్లోపీడియాను శోధించండి. ఎస్.ఎస్.డబ్ల్యూ, అద్భుత వస్తువులు మొదలైన వాటిపై ఒక పత్రం సిద్ధం చేయండి. అన్ని వివరాలను సేకరించండి.”
ఆయన గట్టిగా అరుస్తూ చెప్పారు. తరువాత నాతో మాట్లాడారు.
“హనీ అమాపాలి, ఈ బృందానికి మీరు నాయకత్వం వహిస్తారు. ఎర్త్ కౌన్సిల్ మిమ్మల్నే ఎందుకు ఎన్నుకుందో ఇప్పుడు నాకు తెలిసింది. మీరు ఏం చేద్దామనుకుంటున్నారు. ఎలా కొనసాగించాలనుకుంటున్నారో మీరు ఇప్పుడు చెప్పండి.”
నేను గొంతు సవరించుకున్నాను. వాన్ కు జాక్, చాంద్ వైపు చూసాను. వాళ్ళిద్దరూ తలాడించారు. నేను భావించినట్లుగానే ఆ మారిటన్, ఆ లూనార్ మాన్ కూడా భావిస్తున్నారనే అభిప్రాయం నాకు కలిగింది!
“అన్ని సంకేతాలు ‘లా డెర్నియర్’ రైల్వే స్టేషన్ వద్ద నిలిచిపోతున్నాయి. అంటే, గ్రహాంతరవాసులు అక్కడ దిగి, చంద్రుడి యొక్క చీకటి వైపుకి పారిపోతున్నారని నేను భావిస్తున్నాను. భూమికి కనిపించని – చంద్రుడి యొక్క ఆ చీకటి వైపు ఏమి జరుగుతోందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏవో శక్తుల వల్ల ఈ దుష్ట గ్రహాంతరవాసులు అక్కడ దాక్కుంటారు, అందువల్ల వారు పట్టుబడరు. నాకు అధికారమిస్తే నేను చంద్రుడి చీకటి భాగంలో వాళ్ళని వెతుకుతాను. ఇక్కడ చంద్రుని ప్రకాశవంతమైన భాగంలో మీరు వాళ్ళని సులభంగా పట్టుకోవచ్చు… కానీ మీరు పట్టుకోలేకపోయారు” అన్నాను.
“అసాధ్యం” మంత్రిగారు అరిచారు. “అక్కడెవరూ నివసించరు. అక్కడ కాంతి లేదు. కాస్మిక్ రేడియేషన్, ఉల్కల దుమ్ము అధికం. మరియా అని పిలవబడే ఘనీభవించిన అగ్నిపర్వతం దుమ్ముతో ఏర్పడిన మైదానాలున్నాయి. ఎవరైనా అక్కడ ఎలా దాక్కోవచ్చు? పైగా ఇక్కడ సంకేతాలు అందుబాటులో లేవు, అయితే ‘లా గ్రాంగియన్ పాయింట్’ వద్ద ఒక ఉపగ్రహం ఉంది” చెప్పారాయన.
నేను అన్నాను, “సర్, మేము కూడా పారానార్మల్ శక్తులమే. మాకు అవసరమైన వస్తువులను ఇవ్వండి. మేమా చీకటి భాగాన్ని శోధిస్తాం. సరిహద్దులో ‘లా డెర్నియర్’ రైల్వే స్టేషన్‌కి మమ్మల్ని పంపండి. మాకు ఈ గాడ్జెట్లు కావాలి” అంటూ నేను ఆయనకి ఓ జాబితా ఇచ్చాను.
“ఏర్పాటు చేస్తాను!” అన్నారు మంత్రి గారు. “హనీ, మీరూ, మీ బృందం జాగ్రత్తగా ఉండండి. చీకటి వైపులో ఎటువంటి రెస్క్యూ జట్లు చురుకుగా లేవు. అయితే, లూనార్ జియో పొజిషనింగ్ పరికరాలను తీసుకొని వాళ్ళని వెతకండి. వారిని సజీవంగా పట్టుకోండి” అని చెబుతూ… అప్పుడే ఆ గదిలోకి ప్రవేశించిన తన కార్యదర్శిని, సహాయకులను చూస్తూ:
“వీరికి అవసరమైన అన్నింటినీ ఇవ్వండి. వీళ్ళ ప్రణాళిక, ప్రయాణ వివరాలు రేపటికల్లా నాకు అందజేయండి” అన్నారు
“ధన్యవాదాలు మంత్రిగారూ! నేను చేయగలిగినదంతా చేస్తాను” అన్నాను.
(సశేషం)