భూమి నుంచి ప్లూటో దాకా… -8

0
5

అధ్యాయం 20: వెండి కొవ్వొత్తి

చంద్రుడి చీకటి వైపున కాలం క్షణమొక యుగంలా గడుస్తోంది.

సాధారణ పీడన వ్యవస్థలతో, ఆమ్లజనితో కూడిన గుడారంలో గ్రహాంతర నరమాంస భక్షకులు, నిర్జన గ్రహాలలో నివసించే అత్యంత శక్తివంతమైన జీవులైన అఘోరా, అఘోరిలకు బందీలుగా ఉండటం.

విశిష్టమైన శక్తులున్న ఏడు అద్భుత వస్తువులలో ఒకటైన వెండి కొవ్వొత్తి ఆ అఘోరి చేతుల్లో ఉండడం.

నాకు అతనిచ్చిన పండ్లు, ఆహారం కృతజ్ఞతతో స్వీకరించాను. ప్రకృతి కూడా కోలుకుంది, ఆతనిచ్చిన ఆహారం తీసుకుంది.

వాళ్ళిద్దరూ ఓ ఎత్తైన బల్ల మీద కూర్చుని నన్ను చూశారు.

“ఓ మానవా? నీకిప్పుడు బాగుందా?” అడిగాడు అఘోరా. ఉన్నట్టుండి అతని చేతిలో వెండి కొవ్వొత్తి ప్రత్యక్షమైంది, మెరుపులు మెరిపించింది.

“భూమి మీది భైరవాలయానికి చెందిన ఓ కొవ్వొత్తీ… మాకు మాంసం, కూరగాయలతో తయారైన ఆహారం; పాలు, తేనె అందించు!” అని ఆజ్ఞాపించాడు.

సినిమాల్లో చూపించినట్టుగా, వెండి కొవ్వొత్తి అతని ఆజ్ఞకి కట్టుబడి వేడి ఆహారము, పానీయాలు వేడిగా ఉన్న ప్లేట్లను అతని ముందు ఉంచింది.

ఆ జీవి తన సొంత విచిత్రమైన ఫ్రెంచ్ మరియు వ్యాకరణరహిత ఇంగ్లీష్‌లో గట్టిగా కేకపెట్టాడు.

“అఘోరా ఇప్పుడు కొవ్వొత్తికి ధన్యవాదాలు చెప్తున్నాడు. అఘోరా, అఘోరిలు వీటిని తింటారు. ప్రియా! రా! వచ్చి తిను”

వాళ్ళు చాలా త్వరగా తిన్నారు. వాళ్ళు తృప్తిగా కూర్చోడం చూసి, నేను ధైర్యం చేసి మాట్లాడసాగాను:

“మాస్టర్, నా ప్రార్థన మన్నించండి!” అంటూ ఒక విద్యార్థి తన ప్రొఫెసర్‌ని మన్నిస్తున్నట్టుగానే మాట్లాడాను. “మాస్టర్, దయచేసి చెప్పండి – భూమికి చెందిన ఈ వెండి కొవ్వొత్తి మీకెలా లభించింది? కుజగ్రహానికి చెందిన మాంత్రిక చక్రవర్తి సమూరా, ఇప్పుడు పరారీలో ఉన్న సమూరా దీన్ని మావద్ద నుంచి దొంగిలించాడు. నిజానికి మేము అతడిని వెతుకుతున్నాము. దయచేసి, మీ శక్తులు ఉపయోగించి, మా బృందంలోని సభ్యులను ఎక్కడున్నారో గుర్తించడంలో నాకు సహాయం చేయండి. వారు రోవర్లలో చీకటివైపు యొక్క ఉత్తర, పశ్చిమ మరియు తూర్పు ప్రాంతాలలో ఉన్నారు. వాళ్ళు కూడా ఒక వారం కంటే ఎక్కువ కాలం ఉండకూడదు. డిమిట్రి, టైటాన్‌కి చెందిన ఒక మహిళ, ఏనిమోయిడ్, చాంద్, ఇంకా వాన్ కు జాక్…”

ఆ గ్రహాంతర మాంత్రికుడు – అఘోరా – లేచి నిలబడ్డాడు, వెండి కొవ్వొత్తి అతని చేతుల్లో మెరిసిపోతోంది.

“అఘోరా మరియు అఘోరి ఏడుగురు తాంత్రికులు చీకటిలో తిరగడం చూస్తున్నారు, వాళ్ళెందుకు ఇక్కడ ఉన్నారో అని అనుకుంటున్నారు. ఇద్దరు పురుషులు, సమూరా, తల వెనక్కి ఉన్న మహిళా ప్రేతంతో తిరుగుతున్నారు. మాకు కనబడుతున్నారు. వాళ్ళు ఇక్కడ ఏదో వెతుకుతున్నారు. అందుకే మేము మా శక్తితో ఉల్కాపాతం సృష్టించాము. వాళ్ళు మేం సృష్టించిన ఉల్కాపాతంలో సుడిగుండాల్లా తిరిగుతూ, ఆకుల వలె గిరగిరా తిరుగుతూ మూర్ఛపోయారు. మేము వారి విలువైన వస్తువులను తీసుకున్నాం. భైరవాలయం యొక్క వెండి కొవ్వొత్తిని దొంగిలించాము. అవును, పాతకాలపు మాంత్రికులు సౌర వ్యవస్థలో దాచి ఉంచిన ఏడు అద్భుత వస్తువులలో ఇదీ ఒకటి అని తెలుసు. ఎంత హాస్యాస్పదం! వాళ్ళకి ఎలా దాచాలో కూడా సరిగా తెలియదు. హా! హ!” చెప్పి నవ్వాడు అఘోరా.

“మీరు వాళ్ళ దగ్గర ఒక అద్దం ఉన్నట్టు గమనించారా? వాళ్ళకేమయింది? వారు చనిపోయారా?”

“ఓహ్! వెర్రి మానవా! కానీ మంత్రతంత్రాలలో మీరింకా విద్యార్థులే. మాకే అద్దమూ కనబడలేదు. నువ్వు చెబుతున్నది మిర్రర్ ఆఫ్ యూనివర్సల్ కమ్యూనికేషన్ గురించే అయితే, చంద్రునిపై దాచి ఉంచిన మరో అద్భుత వస్తువు గురించే అయితే… ఒక్క విషయం గుర్తుంచుకో! మీలో ఎవ్వరూ దానిని తాకను కూడా తాకలేరు. అది చంద్రుని ఉపగ్రహం యొక్క కక్ష్యలో వేలాదిగా ఉన్న సౌర విద్యుత్ పలకలలో దాగి ఉంది. నా స్నేహితుడైన ఐకారియస్ ఒక శతాబ్దం క్రితం, ఏదో నేరం చేసి, ఇలాగే పరారీలో ఉన్నప్పుడు – చంద్రుడి చీకటి వైపున ఉన్న ఒక పెద్ద ఒలింపస్ బిలంలో ఆ అద్దాన్ని కనుగొన్నాడు… కానీ కొంతమంది దుష్టులు అతడిని వెంబడించి అతన్ని దహించి చంపారు. కానీ చనిపోకముందే అతను పైకి ఎగిరి, అద్దాన్ని ఆ కక్షలో దాచాడు. పైకి పైకి దాచేశాడు. అవివేకి! మీరు దానిని తాకలేరు. అఘోరా, అఘోరి కూడా దాన్ని ముట్టుకోలేరు!”

“కానీ ఆల్ఫా వ్యవస్థ నుంచి వచ్చిన ఆ ఇద్దరు మాంత్రికుల సంగతేంటి? వాళ్ళు నశించిపోయారా?”

ఆ ఇద్దరు గ్రహాంతర జీవుల వెనుక వేలాది నీలిరంగు దీపాల కాంతికి సమానమైన ఒక అద్భుతమైన కాంతి వలయం గోచరిస్తోంది.

“హనీ! వాళ్ళు ఆల్ఫా వ్యవస్థకి చెందిన దుష్టులని నీకు తెలుసు, వాళ్ళ దళంలో 10000 నక్షత్రాల స్థాయి ఉన్న సభ్యులు, అనేక దుష్ట శక్తులున్న మాంత్రికు ఉన్నట్లు నీకు తెలుసా? వాళ్లని మేం చంపలేం. సమూరా ఒక పాత అస్థిపంజరం లాంటివాడు, కాని చావడు. ఎందుకంటే అతనికి అమరత్వం ఉంది. ఒలంపస్ యొక్క అమృత ఔషధం తాగాడని అఘోరా విన్నాడు. కానీ హ! హా! ఈ కొవ్వొత్తి మాత్రం నాది.”

మంత్రగత్తె ఆఘోరి చీకాకుతో అరిచింది.

“ప్రియా… అఘోరా! ఈ మర్త్యులతో ఎక్కువగా మాట్లాడకండి. మానవులు బలహీనులే కానీ చాలా మోసగాళ్ళని నేను విన్నాను. వాళ్ళని వదిలేయ్! బిలంలోకి దూరంగా విసిరెయ్! వాళ్ళని తినడం నిషేధం అనుకుంటే తినకండి. వాళ్ళని చంపండి లేదా పంపించేయండి!”

“మేము ప్రమాదకరం కాదు, శక్తి లేని వాళ్ళం. మీలాంటి గొప్ప తాంత్రికులకు నేను ఎన్నటికీ హాని చేయలేనని మీకు బాగా తెలుసు!” అన్నాను. “నేను బ్రతకగలిగే ఒక సురక్షితమైన స్థలానికి నన్ను పంపించండి. ఇక్కడ మా మానవులకు ప్రాణవాయువు లేకుండా జీవించే అవకాశం లేదు.” చెప్పాను

అఘోరా ఆలోచిస్తున్నాడు.

అఘోరి బుసలు కొడుతోంది,

చంద్రుని చీకటివైపున ఆ చీకటి రాత్రి పూర్తిగా నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉంది. పక్షుల కూతలు లేదు. పైన ఆకాశంలో భూమిలో సగభాగం సూర్య కాంతితో ప్రకాశవంతంగా ఉంటే, మరో సగంలో మందమైన కాంతిని ప్రసరిస్తోంది. నక్షత్రాలను చెల్లాచెదురుగా విసిరేసింది.

“అఘోరా తన శక్తిని ఉపయోగించి మిమ్మల్ని మనోవేగంతో రైల్వే స్టేషన్‌కి చేర్చగలడు. నాకు వాహనాలు లేవు. కానీ ఇందుకు అఘోరా తన శక్తిని చాలా ఖర్చు చేయవలసి ఉంటుంది. అఘోరా ఆలోచిస్తున్నాడు… అఘోరా మానవ తాంత్రికులకి హాని చేయడు. మంత్రగాడు మరొక మాంత్రికుడిని తినడు… అవును, ఓ మంత్రగాడితో పోరాడుతాడు… కానీ మాంత్రికుల మాంసం తినడు…” చెప్పాడు అఘోరా.

ఈ గ్రహాంతర జీవి ఎప్పుడూ ‘ప్రథమ పురుష’ లోనే మాట్లాడుతాడు. ఏదో నిర్ణయానికి వచ్చినట్టు మాట్లాడడం ఆపాడు.

“సరే, అఘోరి! ఏకాగ్రతతో ఉండు! దూరంగా ఉన్న ఆ రైల్వే స్టేషన్‌లోకి వీళ్ళని విసిరేద్దాం. దాని పేరేంటి? ఆఁ, లా డెర్నియర్. అక్షాంశాల గమనించు! అవును. వాటిని సరిగ్గా చూసి వీళ్ళని విసిరేద్దాం.”

అత్యంత శక్తివంతమైన విద్యుత్ ప్రవాహం నా శరీరంపై పడింది, నాకు తీవ్రంగా తల తిరిగింది. నా శరీరాన్ని ఏదో తీవ్రమైన మంట దహించివేస్తున్న అనుభూతి కలిగింది. నేను గాలిలోకి ఎగిరి, సుడులు తిరిగి స్పృహ కోల్పోయాను.

అక్కడంతా నిశ్శబ్దం. నిశ్శబ్దం. నాకు మా మావయ్య ధరణి, మా హెచ్.ఓ.డి శాన్, గడ్డంతో ఉన్న మా నాన్న నారా, ముసుగు కప్పుకున్న మా అమ్మ నయన ముఖాలు కనబడ్డాయి. ఎన్నో ముఖాలు కదలాడి తప్పుకుంటున్నాయి, నేను కుజ గ్రహం మీది అరుణ భూములపై ఎగురుతున్నట్టు అనిపించింది. అప్పుడు నాకు డిమిట్రీ, చాంద్, వాన్ కు జాక్ ముఖాలు కనబడ్డాయి, కాసేపటికి ఈ ముఖాలన్నీ మసకగా మారిపోయాయి. దృష్టంతా నా మీదే ఉంది.

ఆరు జతల కళ్ళు నన్ను చూస్తున్నాయి… నా చుట్టూ కృత్రిమ గురుత్వాకర్షణ శక్తి ఉన్న ఒక గదిలో ఉన్నాను. అది రైల్వే ఫ్లాట్‌ఫారంపై ఉంది.

అది లా డెర్నియర్ స్టేషన్ యొక్క శీతలమైన ఫ్లాట్‌ఫాం. ఆదుర్దాగా ఉన్న నా మిత్రులు నా చుట్టూ చేరి ఉన్నారు.

ఆ తర్వాత ధబ్ మని చప్పుడు! ఎక్కడినుంచో వచ్చి నా పక్కన పడింది ప్రకృతి. పూర్తి చైతన్యంలో లేనప్పటికీ, కొద్దిగా అవయవాలను కదిలించసాగింది

“ఓహ్! అద్భుతం”

అది చాంద్ గొంతు.

“ఓ హనీ! తుపాను నిన్ను ఓ ఎద్దును కొట్టినట్టి కొట్టి విసిరేసింది” అంది డిమిట్రి. “మా టైటాన్ మీద ఎడ్లు లేవనుకో… అయినా నువ్వు కండలు తిరిగినవాడిని, దృఢమైన వాడివి. కాని ఇప్పుడు నువ్వు గాలి తీసిన బుడగాలా అయిపోయావు..”

ప్రకృతి మూలిగింది.

నేను మాట్లాడగలుగుతున్నాను.

“ఓహ్! ప్రకృతీ! ఎలా ఉన్నావు? స్పృహ వచ్చిందా?”

ప్రకృతి అరిచింది. “హనీ, భరించలేనంత మగతగా ఉంది.”

కుజగ్రహంలోని అరుణ భూములకు చెందిన మాంత్రికుడు వాన్ కు జాక్ ఆశ్చర్యపోయాడు, “విశ్వశక్తి యొక్క అమోఘమైన ప్రదర్శన. నమ్మశక్యంగాని మాంత్రిక శక్తి! చంద్రుడి యొక్క ఈ శూన్యంలో ఎవరు నిన్ను విసిరేశారు? అరుణ భూముల ప్రమాణాల కన్నా ఇది ఇంకా అద్భుతమైనది” అన్నాడు.

నేను నెమ్మదిగా లేచి, చుట్టూ చూసి జరిగినది వాళ్ళకి చెప్పాను.

“ఇదంతా ఓ కథ. మాకు ప్రమాదం జరిగింది. నిజంగా నరమాంస భక్షకులైన, అసాధారణ శక్తులున్న ఇద్దరు ముసలి ఆల్ఫా వ్యవస్థ మాంత్రిక దంపతులచే రక్షించబడ్డాం. మేము కూడా విశ్వశక్తిని ఉపయోగించేవాళ్ళం కాబట్టి వారు మమ్మల్ని తినలేదు. వారు మా చుట్టూ ఉన్న కాంతి వలయాన్ని చూశారు. నేను వాళ్ళని ప్రార్థించాను, వారు మమ్మల్ని తిరిగి ఇక్కడికి విసిరేశారు.”

డిమిట్రి ముసిముసిగా నవ్వింది. “ఇదంతా మేం నమ్మాలా? ఏం కథ! ఇది నీకొచ్చే కలలలో ఒకటి కాదు కదా?” అంది. డిమిట్రి ఎప్పుడూ వ్యంగ్యంగానే ఉంటుంది.

“వద్దు డిమిట్రి. హాస్యమాడద్దు. మేము చావుకి దగ్గరగా వెళ్ళొచ్చాం. వింత జీవులు, వింత భాష. ఇప్పుడు నాకు విపరీతమైన ఆకలిగా ఉంది, ఏదో ఒకటి తినాలనుకుంటున్నాను” చెప్పింది ప్రకృతి.

చంద్రుడి యొక్క చీకటివైపు నుంచి వచ్చేశాక, లా డెర్నియర్ స్టేషన్ ఒక స్వర్గంలా అనిపిస్తోంది.

ఇది ఆక్సిజన్, కృత్రిమ గురుత్వాకర్షణ, దివ్యమైన తినుబండారాలు ఉన్న ఆహార దుకాణాన్ని కలిగి ఉంది.

కాళ్ళీడ్చుకుంటూ నడిచాం. మాకు కావలసిన పదార్థాలు ఆర్డర్ చేశాం. ప్రశాంతంగా, నిశ్శబ్దంగా తిన్నాం.

అప్పుడు నేను అడిగాను “మీరు ఏం చేసారు? ఏవైనా దొరికాయా?”

“అవును,  73 డిగ్రీల రేఖాంశంలో నాకు ఇగ్లూ కనిపించింది. కాని అది ఖాళీగా ఉంది” చెప్పాడు చాంద్.

వాన్ కుక్ జాక్ ఇలా అన్నాడు, “నేను ప్రయాణం మొదలుపెట్టగానే, తుఫాను వచ్చింది. అయినా ముందుకు వెళ్ళాను.  అప్పుడు నాకు రాళ్ళు, కొండలు, ఆకాశంలో భూమి తప్ప వేరే ఏవీ కనబడలేదు. నా రోవర్‌లో ఇంధనం అయిపోవడంతో నేను తిరిగి వచ్చాను. అప్పుడు నేను, చాంద్ కలసి మీరేమైపోయారో, ఎక్కడ ఉన్నారో అని ఆలోచించాం. నిన్న ఉదయం నుండి మేము ఎదురు చూస్తున్నాము. అప్పుడు ధబ్‌మనే చప్పుడుతో నువ్వు ప్రత్యక్షమయ్యావు. అయితే, చంద్ర ప్రభుత్వపు అధికారి అయిన విన్‌స్కీని ఇంకా పిలవలేదు.”

ఎలాగైతేనేం మళ్ళీ మేము అందరం కలిసి ఉన్నాము, చివరికి సరిగ్గా తిన్నాం.

“హనీ, మిర్రర్ ఆఫ్ యూనివర్సల్ కమ్యూనికేషన్ గురించీ, ఆ ఇద్దరు నరమాంస భక్షక గ్రహాంతర తాంత్రికుల గురించి వీళ్లకి చెప్పండి” అంది ప్రకృతి.

“దుష్ట గ్రహాంతరవాసులతో సమూరా ఇక్కడే ఉన్నాడు. భైరవాలయం నుంచి నాచే దొంగతనం చేయించి సంపాదించిన వెండి కొవ్వొత్తిని అతను ఖచ్చితంగా కోల్పోయాడు. అది ప్రస్తుతం అఘోరా వద్ద ఉంది. సమూరా దాని కోసమూ, ఇంకా మిర్రర్ ఆఫ్ యూనివర్సల్ కమ్యూనికేషన్ కోసం కూడా ప్రయత్నిస్తాడని పందెం కాస్తాను. అది చంద్రుడి యొక్క కక్ష్యలోని పవర్ స్టేషన్ యొక్క సౌర ఫలకాల మధ్య దాచబడి ఉంది. అవి సౌర శక్తిని స్వీకరించి, విద్యుత్ శక్తిగా మార్చి చంద్రుడి కాలనీలకు ప్రసారం చేస్తానని నాకర్థమైంది” అని చెప్పి, “ఇప్పుడా అద్దాన్ని ఎలా పొందాలి?” అని అడిగాను.

డిమిట్రి ఎప్పటిలానే సరదాగా ఉంది, అన్నింటినీ చాలా తేలికగా తీసుకుంటుంది.

“ఓ విషయం చెప్పానా ప్రియా హనీ” అంది.

ప్రకృతి తన చూపులని అలసటగా తిప్పుకుంది. ఆమె నా భార్య. డిమిట్రి ఇలా నాతో ఎక్కువ చనువుగా ఉండడం తనకి నచ్చదు.

డిమిట్రి మళ్ళీ ముసిముసి నవ్వులు నవ్వి, చెప్పడం కొనసాగించింది.

“అయితే, సమూరా, అతని బృందం ఎంత శక్తివంతులైనప్పటికీ, ఆ అద్దాన్ని గుర్తించలేరు. ఈ కొవ్వొత్తి లాగానే.”

“ఎందుకు?” అంటూ అందరూ ఒక్కసారిగా అరిచారు. నేను అకస్మాత్తుగా ఆమె తర్కాన్ని,  హేతుబద్ధతనీ గ్రహించాను.

“అది కేవం స్వచ్ఛమైన మరియు నిస్వార్థ తాంత్రికుడికి మాత్రమే కనిపిస్తుంది. మన హనీ లాంటి వాళ్ళకి! మౌంట్ ఒలంపస్ మీద ఇలాగే జరిగింది. ఆలయ నేలమాళిగలోనూ ఇలాగే జరిగింది. అంతే కదా” అంది డిమిట్రి.

“అంటే, త్వరలోనే అతను హనీ కోసం వస్తాడు!” భయంతో గొణిగాడు చాంద్.

“సహేతుకమే! త్వరలోనే మనం అతడిని చూడబోతున్నాం!” అన్నాడు వాన్ కు జాక్.

“హనీ ఇంకా మనమందరం విశ్వశక్తి యొక్క వికిరణాన్ని విడుదల చేస్తాము. అవును. అతను మన కోసం వస్తాడు… హనీ లాంటి మరెవరూ లేకపోతే. ఇక్కడ మరొక స్వచ్ఛమైన నిస్వార్థమైన తాంత్రికుడు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అలాంటివాళ్ళు చంద్రుడిపై ఎవరూ లేరా?” అంది ప్రకృతి ఓ ఉదాత్త స్వరంలో!

“మేమందరం చెడ్డవాళ్ళం ప్రియతమా!” అంటూ హాస్యమాడింది డిమిట్రి

లా డెర్నియర్ స్టేషన్ ఖాళీ ప్రాంగణంలో ఆమె నవ్వు ప్రతిధ్వనించింది.

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here