భూమి నుంచి ప్లూటో దాకా… -8

0
8

[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]

అధ్యాయం 19: అఘోరా ఆల్ఫా, అఘోరి ఆల్ఫా

[dropcap]”హ![/dropcap] హా! ఈ మనిషి కళ్ళు తెరిచాడు…. అతను జీవించే ఉన్నాడు… స్పృహలోనే ఉన్నాడు… హా! హా! నా మహిమలకీ ఇప్పటికీ శక్తి ఉంది”.

ఓ బుస, కిసుక్కున నవ్విన ధ్వని…

“హే… హే…! నా ప్రియా! మీరెప్పుడూ శక్తిమంతులే. మీరు 500 సంవత్సరాలుగా స్టార్లకు 10000 నక్షత్రాల స్థాయి సంపాదించి, ఒక్క నక్షత్రాన్ని కోల్పోలేదు… నా లాగా!”

“Oui! Dix Mille etoiles”

ఈసారి ఓ వింత భాష… (ఫ్రెంచ్?)… జలజలమనే ధ్వనితో మాటలు వినబడ్డాయి.

“నిజమే ప్రియా. నేను శక్తిమంతుడనే! అవును. ఓ జీవి తిరిగి ప్రాణం పోసుకోడం చూడాలని కోరుకుంటున్నాను.”

చుట్టూ చీకటిగా ఉంది. కానీ పైన నల్లటి ఆకాశంలో ఒక మిలియన్ నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉన్నాయి, ఆ కాంతి సోకి రాళ్ళు, చంద్రుడి భూభాగం ఒక వింత ప్రకాశంతో మెరిసిపోతున్నాయి.

చంద్రుడి శూన్యం యొక్క నిశ్శబ్దం. ఇక్కడ గాలి లేదు. ఏ ధ్వని లేదు. కానీ ఈ వింతజీవులు నా శరీరానికి ఆనుకుని, తమ పాలిపోయిన పసుపురంగు కళ్ళలో మెరుపులతో నన్ను చూస్తూ  ఎముకలు తప్ప కండ లేని తమ పొడవాటి చేతి వేలితో నా ఛాతి మీద రాస్తూ మాట్లాడుకుంటున్న మాటల కంపనాలు నా చెవులకు చేరుతున్నాయి…

నా శరీరం మొత్తం నొప్పిగా ఉంది. తల నొప్పిగా ఉంది, మగతగా ఉంది.

నాకు మళ్ళీ స్పృహ వచ్చేసరికి నేను నా అవయవాలను కదిలించాను, ఎముకలేవీ విరగలేదు. నాకు ఖచ్చితంగా ప్రమాదం జరిగింది. ఇక నా రోవర్ పోయింది.

యురేకస్, నా సర్వోత్తమ రోబోట్, ఇప్పుడు నాతో లేదు!

వెంటనే తీక్షణమైన, భయంకరమైన ఓ వాస్తవం అర్థమయింది. అసంభవమనిపించే వాస్తవం!

చంద్రుడి యొక్క ఆక్సిజన్-రహిత వాతావరణంలో ప్రమాదం నుంచి నేనెలా బయటపడ్డాను? ఎలా జీవించి ఉన్నాను?

ఇక ప్రకృతికి ఏం జరిగింది?

నల్లటి ఎముకల గూడు లాంటి శరీరాలతో పొడవాటి మానవరూప గ్రహాంతర జీవులు తమ లేత పసుపు మెరిసే కళ్ళతో నన్ను గుచ్చి గుచ్చి చూస్తున్నాయి, నా శరీరాన్ని తడుముతున్నాయి.

ఆపై నేను శారీరక బాధతో మూలుగుతున్న స్త్రీ స్వరము విన్నాను.

ఆ గొంతుని నేను గుర్తు పట్టగలిగాను. నా పక్కన పడుక్కుని చీకటిలో దీర్ఘ శ్వాస తీసుకుంటున్న ఆ స్త్రీ ఆకారం ప్రకృతిదే.

కొన్ని క్షణాల తర్వాత నక్షత్రాలు కనబడకుండా పైకప్పుని మూసివేశారు. నాకు పైన కేవలం ఒక నల్ల ముడతలు మెరిసే మూత కనబడింది. నేను ప్రక్కకు చూశాను. అధిక పైకప్పుతో కప్పబడిన, విడదీయగలిగిన గుడారంలో ఉన్నానని గ్రహించాను. కాసేపు నక్షత్రాలను చూపించి తర్వాత రిమోట్ కంట్రోల్ ద్వారా మూసివేశారని అర్థమైంది.

నేను ఒక గుడారంలో ఉన్నాను. బహుశా దాంట్లో మానవులకు కావలసినంత ఆక్సిజన్, అవసరమైనంత పీడనం ఉండి ఉండవచ్చు, అందుకే నేను మరణించలేదేమో.

“C’estdommage!” అంటూ కిచకిచ స్వరంలో ఒక మగ గొంతు వినబడింది.

“ఇతను ఊపిరి తీసుకుంటున్నాడు. అతని వెనుక ఒక కాంతివలయం ఉంది. ఇతను విశ్వశక్తిని ఉపయోగించగల మనిషి. ఇతని స్థాయి ‘సెంట్ ఎటోయిల్స్’ అంటే వంద నక్షత్రాలకి కొంచెం ఎక్కువగా ఉంది. నేను ఇతనిని వండి తినలేను. ఇతను నాలాంటివాడే. మానవ మాంసం రుచికరంగా ఉంటుంది, చాలాకాలంగా మనం మానవ మాంసం తినలేదు కూడా… అయినా… “

ఆ స్త్రీ బొంగురు గొంతుతో మాట్లాడుతూ, “ఓహ్! అఘోరి అతనిని తినాలని కోరుకుంటోంది. ఇతన్ని ఆకుపచ్చ కాప్సికమ్ సాస్‌లో ఉడికించి, వీళ్ళిద్దరినీ రుచికరమైన బార్బెక్యూస్‌గా తయారు చేయండి. ఇద్దరు మర్త్యులను తింటే అఘోరి వారానికి సరిపడా శక్తిని పొందుతుంది.”

మగ జీవి ఆమె వైపుకు తిరిగి బుసలుకొడుతూ, “కుదరదు ప్రియా, మనం ఈ జంటని తినలేము. ఇద్దరూ విశ్వశక్తిని ఉపయోగించేవాళ్ళు… మానవులు… అవును, కానీ వాళ్ళు విశ్వశక్తి పిల్లలు. తినకూడదు! ఏ జాతీ తన సొంత జాతి పిల్లలను తినదు.”

ఆ మహిళ గొంతు బుసలుకొట్టింది. “అఘోరికి ఆకలిగా ఉంది. మనిషే మనిషిని తింటున్నాడు. నరమాంస భక్షకులు ఉన్నారు. మరి అఘోరి ఎందుకు రుచికరమైనవి తినకూడదు…?”

“కుదరదు. అఘోరా నిషేధించారు. విశ్వశక్తిని ప్రసారం చేసే ఆత్మలను మనం తినకూడడు. అఘోరా అఘోరికి మంచిది ఇస్తాడు. దీన్ని తీసుకోండి.”

చిటపటమనే శబ్దం వినబడింది. ఆ స్త్రీ గొంతులో ఆనందం – “ఓహ్! అద్భుతం! ప్రియా! అఘోరి దీన్ని ఇష్టపడ్డారు. నన్ను తిననివ్వండి” అందామె. కఠినమైన దంతాలతో క్రాక్‌జాక్ బిస్కట్లను తింటున్నట్టుగా ఒక ధ్వని.

నేను పూర్తిగా స్పృహతో ఉన్నాను, చుట్టూ చూశాను.

అక్కడంతా చీకటిగా ఉంది. కానీ నాలో ఏర్పడిన భయం వల్ల, నాలో ఉన్న విశ్వశక్తి వల్ల ఆ ఆవాసం యొక్క లోపలికి చూడగలిగాను.

ఎముకల గూళ్ళ లాంటి ఇద్దరు గ్రహాంతర జీవులు! మానవ రూపాలలోనే ఉన్నారు, కానీ కోసుగా ఉన్న చెవులు, సంజ్ఞలు చేసే నాసికలు, పసుపు కళ్ళు, చీకటిలో మెరిసే పుర్రెపై కాంతి సంకేతాలను ప్రసారం చేస్తున్న రెండు యాంటెనాలు ఉన్నాయి.

వారు ఖచ్చితంగా గ్రహాంతరవాసులే, చంద్రగ్రహవాసులు మాత్రం కానే కాదు.

అంతటి అననుకూల పరిస్థితిలో నా వెన్నులోకి చలి పాకింది. వాళ్ళిద్దరి చుట్టూ ఉన్న నీలపు కాంతి వలయాన్ని చూస్తుంటే నా కళ్ళలో భయం కదలాడింది.

వాళ్ళు వృద్ధ గ్రహాంతర జీవులు. ఖచ్చితంగా అత్యంత శక్తివంతమైన పదివేల నక్షత్రాల స్థాయి మాంత్రికులు!

…ఇంకా వాళ్ళకి నరమాంసం ఇష్టం.

నరమాంస భక్షకులు. చాలా ముసలి మరియు వికారమైన గ్రహాంతరజీవులు. ప్రమాదకరమైనవాళ్ళు. ఆ ఆమ్లజని-రహిత పరిసరాలలో, తక్కువ పీడనం ఉండే చంద్రుడి వాతావరణంలో, చంద్రుని చీకటి వైపు ఎలా బ్రతకగలుగుతున్నారనేదానికి ఇది నిదర్శనం!

వారు ఆమ్లజనితో కూడిన డేరాను సృష్టించారని నేను భావించాను.

ఇంతకు ముందు మాట్లాడిన మగ జీవి పేరు అఘోరా అని అనుకున్నాను. అఘోరా మాట్లాడుతూ, “అఘోరి, మనం మన స్వంత జాతి వాళ్ళని తినకూడదు. అంతే. వేరేది ఏదైనా తిందాం. గిన్నెలో కొన్ని ఎండిన పళ్ళు, చేపలు ఉన్నాయి. నువ్వు తిను. ఈలోపు నేనీ మానవుడితో మాట్లాడుతాను” అన్నాడు.

అతను నా ఛాతీ మీద గట్టిగా తట్టాడు. “ఓహ్, కళ్ళు తెరిచారా? మీరు బాగానే ఉన్నారా? మీరీ చీకటివైపుకి… ఇక్కడికి… ఎలా వచ్చారు?”

నేను జవాబిచ్చాను. తప్పదు కదా!

“ఓహ్! నమస్కారం మాస్టర్! నేను భూమి నుండి వచ్చిన హనీ ఆమ్రపాలిని. నేను ఎర్త్ కౌన్సిల్, చంద్ర ప్రభుత్వం పంపిన బృందంలో భాగంగా ఉన్నాను. మేము చంద్రునిపై కొంతమంది విధ్వంసకారులను శోధించడానికి వచ్చాం. ఈమె నా భార్య ప్రకృతి. మాస్టర్! మేమిద్దరం విశ్వశక్తిని ఉపయోగించగలం. మమ్మల్ని భూమి మీద పిసియుఎఫ్ అని అంటారు, మిగతా చోట్ల తాంత్రికులు అని అంటారు. మా రోవర్ ఒక ఉల్కాపాతంలో చిక్కుకుని ఒక ప్రమాదానికి గురైంది. నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మీరు ఎలా జీవించి ఉంటున్నారో నాకు తెలుసు. మీరు ఎవరు? నా మాంత్రిక శక్తి స్థాయి యాభై నక్షత్రాలే! ఇప్పుడు నేను చాలా బలహీనంగా ఉన్నాను. మమ్మల్ని రక్షించినందుకు ధన్యవాదాలు. దయచేసి, నా రోబో ఎక్కడ ఉందో చెప్పండి!?”

అఘోరా నన్ను చూశాడు. అతని కళ్ళు మెరుపులతో నిండిన కాంతి తరంగాలను పంపాయి.

“భూగ్రహానికి చెందిన హనీ అమ్రాపాలి! నిజమే, అఘోరాకి ఈ పేరు తెలుసు. ఆల్ఫా సెంటారియన్లు మీ గురించి మాట్లాడారు. మేము ఇక్కడ ఆల్ఫా వ్యవస్థ యొక్క శక్తితో ఉంటున్నాము, మేము ఇక్కడే నివసిస్తాము. మేము ఆక్సిజన్ లేకుండా శ్వాస తీసుకుంటాం, మేము ఇక్కడే మాకోసం ఇల్లు కట్టుకున్నాం. అప్పుడప్పుడూ మానవులను తింటాము. జీవితం సాగిపోతూనే ఉంటుంది. అవును, అఘోరా… అఘోరి. మేము తాంత్రికులం, మాంత్రికులం. చంద్రునిపై జరిగే నేరాల నుండి తప్పించుకుని దాక్కుంటున్నాం. హా! హా! నువ్వు ఏం అంటావు? మేము చంద్రునిపై నేరస్థులం కదా! కానీ అఘోర మీకు హాని చేయడు. మరొక తాంత్రికుడి మాంసం తినడు.. “

మంత్రగత్తె అఘోరి తెచ్చిపెట్టుకున్నట్టుగా ఓ నవ్వు నవ్వింది. అంతే! ఒక అద్భుతమైన కాంతి ఆమె చేతిలో ప్రకాశించింది. “ఓ! వెండి కొవ్వొత్తీ! ఈ మర్త్యుల కోసం కొన్ని వేడి పాలు, పండ్లను తీసుకురా, ఎంతైనా వాళ్ళు మీ గ్రహం నుండి వచ్చినవాళ్ళే… హా! హ!”

ఇప్పుడు ప్రకృతి చిన్నగా కేక పెట్టింది. ఆమెకి పూర్తిగా మెలకువ వచ్చింది. వాళ్ళకేసి సూటిగా చూస్తోంది.

నాకూ ఆశ్చర్యమూ, భయమూ ఒకేసారి కలిగాయి. భూలోకంలో ఆమ్రపాలి గ్రామంలోని భైరవ ఆలయం నుండి నేను సాధించిన వెండి కొవ్వొత్తి ఆ మంత్రగత్తె చేతుల్లో మెరుస్తూ ఉంది!

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here