[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]
అధ్యాయం 19: అఘోరా ఆల్ఫా, అఘోరి ఆల్ఫా
[dropcap]”హ![/dropcap] హా! ఈ మనిషి కళ్ళు తెరిచాడు…. అతను జీవించే ఉన్నాడు… స్పృహలోనే ఉన్నాడు… హా! హా! నా మహిమలకీ ఇప్పటికీ శక్తి ఉంది”.
ఓ బుస, కిసుక్కున నవ్విన ధ్వని…
“హే… హే…! నా ప్రియా! మీరెప్పుడూ శక్తిమంతులే. మీరు 500 సంవత్సరాలుగా స్టార్లకు 10000 నక్షత్రాల స్థాయి సంపాదించి, ఒక్క నక్షత్రాన్ని కోల్పోలేదు… నా లాగా!”
“Oui! Dix Mille etoiles”
ఈసారి ఓ వింత భాష… (ఫ్రెంచ్?)… జలజలమనే ధ్వనితో మాటలు వినబడ్డాయి.
“నిజమే ప్రియా. నేను శక్తిమంతుడనే! అవును. ఓ జీవి తిరిగి ప్రాణం పోసుకోడం చూడాలని కోరుకుంటున్నాను.”
చుట్టూ చీకటిగా ఉంది. కానీ పైన నల్లటి ఆకాశంలో ఒక మిలియన్ నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉన్నాయి, ఆ కాంతి సోకి రాళ్ళు, చంద్రుడి భూభాగం ఒక వింత ప్రకాశంతో మెరిసిపోతున్నాయి.
చంద్రుడి శూన్యం యొక్క నిశ్శబ్దం. ఇక్కడ గాలి లేదు. ఏ ధ్వని లేదు. కానీ ఈ వింతజీవులు నా శరీరానికి ఆనుకుని, తమ పాలిపోయిన పసుపురంగు కళ్ళలో మెరుపులతో నన్ను చూస్తూ ఎముకలు తప్ప కండ లేని తమ పొడవాటి చేతి వేలితో నా ఛాతి మీద రాస్తూ మాట్లాడుకుంటున్న మాటల కంపనాలు నా చెవులకు చేరుతున్నాయి…
నా శరీరం మొత్తం నొప్పిగా ఉంది. తల నొప్పిగా ఉంది, మగతగా ఉంది.
నాకు మళ్ళీ స్పృహ వచ్చేసరికి నేను నా అవయవాలను కదిలించాను, ఎముకలేవీ విరగలేదు. నాకు ఖచ్చితంగా ప్రమాదం జరిగింది. ఇక నా రోవర్ పోయింది.
యురేకస్, నా సర్వోత్తమ రోబోట్, ఇప్పుడు నాతో లేదు!
వెంటనే తీక్షణమైన, భయంకరమైన ఓ వాస్తవం అర్థమయింది. అసంభవమనిపించే వాస్తవం!
చంద్రుడి యొక్క ఆక్సిజన్-రహిత వాతావరణంలో ప్రమాదం నుంచి నేనెలా బయటపడ్డాను? ఎలా జీవించి ఉన్నాను?
ఇక ప్రకృతికి ఏం జరిగింది?
నల్లటి ఎముకల గూడు లాంటి శరీరాలతో పొడవాటి మానవరూప గ్రహాంతర జీవులు తమ లేత పసుపు మెరిసే కళ్ళతో నన్ను గుచ్చి గుచ్చి చూస్తున్నాయి, నా శరీరాన్ని తడుముతున్నాయి.
ఆపై నేను శారీరక బాధతో మూలుగుతున్న స్త్రీ స్వరము విన్నాను.
ఆ గొంతుని నేను గుర్తు పట్టగలిగాను. నా పక్కన పడుక్కుని చీకటిలో దీర్ఘ శ్వాస తీసుకుంటున్న ఆ స్త్రీ ఆకారం ప్రకృతిదే.
కొన్ని క్షణాల తర్వాత నక్షత్రాలు కనబడకుండా పైకప్పుని మూసివేశారు. నాకు పైన కేవలం ఒక నల్ల ముడతలు మెరిసే మూత కనబడింది. నేను ప్రక్కకు చూశాను. అధిక పైకప్పుతో కప్పబడిన, విడదీయగలిగిన గుడారంలో ఉన్నానని గ్రహించాను. కాసేపు నక్షత్రాలను చూపించి తర్వాత రిమోట్ కంట్రోల్ ద్వారా మూసివేశారని అర్థమైంది.
నేను ఒక గుడారంలో ఉన్నాను. బహుశా దాంట్లో మానవులకు కావలసినంత ఆక్సిజన్, అవసరమైనంత పీడనం ఉండి ఉండవచ్చు, అందుకే నేను మరణించలేదేమో.
“C’estdommage!” అంటూ కిచకిచ స్వరంలో ఒక మగ గొంతు వినబడింది.
“ఇతను ఊపిరి తీసుకుంటున్నాడు. అతని వెనుక ఒక కాంతివలయం ఉంది. ఇతను విశ్వశక్తిని ఉపయోగించగల మనిషి. ఇతని స్థాయి ‘సెంట్ ఎటోయిల్స్’ అంటే వంద నక్షత్రాలకి కొంచెం ఎక్కువగా ఉంది. నేను ఇతనిని వండి తినలేను. ఇతను నాలాంటివాడే. మానవ మాంసం రుచికరంగా ఉంటుంది, చాలాకాలంగా మనం మానవ మాంసం తినలేదు కూడా… అయినా… “
ఆ స్త్రీ బొంగురు గొంతుతో మాట్లాడుతూ, “ఓహ్! అఘోరి అతనిని తినాలని కోరుకుంటోంది. ఇతన్ని ఆకుపచ్చ కాప్సికమ్ సాస్‌లో ఉడికించి, వీళ్ళిద్దరినీ రుచికరమైన బార్బెక్యూస్‌గా తయారు చేయండి. ఇద్దరు మర్త్యులను తింటే అఘోరి వారానికి సరిపడా శక్తిని పొందుతుంది.”
మగ జీవి ఆమె వైపుకు తిరిగి బుసలుకొడుతూ, “కుదరదు ప్రియా, మనం ఈ జంటని తినలేము. ఇద్దరూ విశ్వశక్తిని ఉపయోగించేవాళ్ళు… మానవులు… అవును, కానీ వాళ్ళు విశ్వశక్తి పిల్లలు. తినకూడదు! ఏ జాతీ తన సొంత జాతి పిల్లలను తినదు.”
ఆ మహిళ గొంతు బుసలుకొట్టింది. “అఘోరికి ఆకలిగా ఉంది. మనిషే మనిషిని తింటున్నాడు. నరమాంస భక్షకులు ఉన్నారు. మరి అఘోరి ఎందుకు రుచికరమైనవి తినకూడదు…?”
“కుదరదు. అఘోరా నిషేధించారు. విశ్వశక్తిని ప్రసారం చేసే ఆత్మలను మనం తినకూడడు. అఘోరా అఘోరికి మంచిది ఇస్తాడు. దీన్ని తీసుకోండి.”
చిటపటమనే శబ్దం వినబడింది. ఆ స్త్రీ గొంతులో ఆనందం – “ఓహ్! అద్భుతం! ప్రియా! అఘోరి దీన్ని ఇష్టపడ్డారు. నన్ను తిననివ్వండి” అందామె. కఠినమైన దంతాలతో క్రాక్‌జాక్ బిస్కట్లను తింటున్నట్టుగా ఒక ధ్వని.
నేను పూర్తిగా స్పృహతో ఉన్నాను, చుట్టూ చూశాను.
అక్కడంతా చీకటిగా ఉంది. కానీ నాలో ఏర్పడిన భయం వల్ల, నాలో ఉన్న విశ్వశక్తి వల్ల ఆ ఆవాసం యొక్క లోపలికి చూడగలిగాను.
ఎముకల గూళ్ళ లాంటి ఇద్దరు గ్రహాంతర జీవులు! మానవ రూపాలలోనే ఉన్నారు, కానీ కోసుగా ఉన్న చెవులు, సంజ్ఞలు చేసే నాసికలు, పసుపు కళ్ళు, చీకటిలో మెరిసే పుర్రెపై కాంతి సంకేతాలను ప్రసారం చేస్తున్న రెండు యాంటెనాలు ఉన్నాయి.
వారు ఖచ్చితంగా గ్రహాంతరవాసులే, చంద్రగ్రహవాసులు మాత్రం కానే కాదు.
అంతటి అననుకూల పరిస్థితిలో నా వెన్నులోకి చలి పాకింది. వాళ్ళిద్దరి చుట్టూ ఉన్న నీలపు కాంతి వలయాన్ని చూస్తుంటే నా కళ్ళలో భయం కదలాడింది.
వాళ్ళు వృద్ధ గ్రహాంతర జీవులు. ఖచ్చితంగా అత్యంత శక్తివంతమైన పదివేల నక్షత్రాల స్థాయి మాంత్రికులు!
…ఇంకా వాళ్ళకి నరమాంసం ఇష్టం.
నరమాంస భక్షకులు. చాలా ముసలి మరియు వికారమైన గ్రహాంతరజీవులు. ప్రమాదకరమైనవాళ్ళు. ఆ ఆమ్లజని-రహిత పరిసరాలలో, తక్కువ పీడనం ఉండే చంద్రుడి వాతావరణంలో, చంద్రుని చీకటి వైపు ఎలా బ్రతకగలుగుతున్నారనేదానికి ఇది నిదర్శనం!
వారు ఆమ్లజనితో కూడిన డేరాను సృష్టించారని నేను భావించాను.
ఇంతకు ముందు మాట్లాడిన మగ జీవి పేరు అఘోరా అని అనుకున్నాను. అఘోరా మాట్లాడుతూ, “అఘోరి, మనం మన స్వంత జాతి వాళ్ళని తినకూడదు. అంతే. వేరేది ఏదైనా తిందాం. గిన్నెలో కొన్ని ఎండిన పళ్ళు, చేపలు ఉన్నాయి. నువ్వు తిను. ఈలోపు నేనీ మానవుడితో మాట్లాడుతాను” అన్నాడు.
అతను నా ఛాతీ మీద గట్టిగా తట్టాడు. “ఓహ్, కళ్ళు తెరిచారా? మీరు బాగానే ఉన్నారా? మీరీ చీకటివైపుకి… ఇక్కడికి… ఎలా వచ్చారు?”
నేను జవాబిచ్చాను. తప్పదు కదా!
“ఓహ్! నమస్కారం మాస్టర్! నేను భూమి నుండి వచ్చిన హనీ ఆమ్రపాలిని. నేను ఎర్త్ కౌన్సిల్, చంద్ర ప్రభుత్వం పంపిన బృందంలో భాగంగా ఉన్నాను. మేము చంద్రునిపై కొంతమంది విధ్వంసకారులను శోధించడానికి వచ్చాం. ఈమె నా భార్య ప్రకృతి. మాస్టర్! మేమిద్దరం విశ్వశక్తిని ఉపయోగించగలం. మమ్మల్ని భూమి మీద పిసియుఎఫ్ అని అంటారు, మిగతా చోట్ల తాంత్రికులు అని అంటారు. మా రోవర్ ఒక ఉల్కాపాతంలో చిక్కుకుని ఒక ప్రమాదానికి గురైంది. నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మీరు ఎలా జీవించి ఉంటున్నారో నాకు తెలుసు. మీరు ఎవరు? నా మాంత్రిక శక్తి స్థాయి యాభై నక్షత్రాలే! ఇప్పుడు నేను చాలా బలహీనంగా ఉన్నాను. మమ్మల్ని రక్షించినందుకు ధన్యవాదాలు. దయచేసి, నా రోబో ఎక్కడ ఉందో చెప్పండి!?”
అఘోరా నన్ను చూశాడు. అతని కళ్ళు మెరుపులతో నిండిన కాంతి తరంగాలను పంపాయి.
“భూగ్రహానికి చెందిన హనీ అమ్రాపాలి! నిజమే, అఘోరాకి ఈ పేరు తెలుసు. ఆల్ఫా సెంటారియన్లు మీ గురించి మాట్లాడారు. మేము ఇక్కడ ఆల్ఫా వ్యవస్థ యొక్క శక్తితో ఉంటున్నాము, మేము ఇక్కడే నివసిస్తాము. మేము ఆక్సిజన్ లేకుండా శ్వాస తీసుకుంటాం, మేము ఇక్కడే మాకోసం ఇల్లు కట్టుకున్నాం. అప్పుడప్పుడూ మానవులను తింటాము. జీవితం సాగిపోతూనే ఉంటుంది. అవును, అఘోరా… అఘోరి. మేము తాంత్రికులం, మాంత్రికులం. చంద్రునిపై జరిగే నేరాల నుండి తప్పించుకుని దాక్కుంటున్నాం. హా! హా! నువ్వు ఏం అంటావు? మేము చంద్రునిపై నేరస్థులం కదా! కానీ అఘోర మీకు హాని చేయడు. మరొక తాంత్రికుడి మాంసం తినడు.. “
మంత్రగత్తె అఘోరి తెచ్చిపెట్టుకున్నట్టుగా ఓ నవ్వు నవ్వింది. అంతే! ఒక అద్భుతమైన కాంతి ఆమె చేతిలో ప్రకాశించింది. “ఓ! వెండి కొవ్వొత్తీ! ఈ మర్త్యుల కోసం కొన్ని వేడి పాలు, పండ్లను తీసుకురా, ఎంతైనా వాళ్ళు మీ గ్రహం నుండి వచ్చినవాళ్ళే… హా! హ!”
ఇప్పుడు ప్రకృతి చిన్నగా కేక పెట్టింది. ఆమెకి పూర్తిగా మెలకువ వచ్చింది. వాళ్ళకేసి సూటిగా చూస్తోంది.
నాకూ ఆశ్చర్యమూ, భయమూ ఒకేసారి కలిగాయి. భూలోకంలో ఆమ్రపాలి గ్రామంలోని భైరవ ఆలయం నుండి నేను సాధించిన వెండి కొవ్వొత్తి ఆ మంత్రగత్తె చేతుల్లో మెరుస్తూ ఉంది!
***
అధ్యాయం 20: వెండి కొవ్వొత్తి
చంద్రుడి చీకటి వైపున కాలం క్షణమొక యుగంలా గడుస్తోంది.
సాధారణ పీడన వ్యవస్థలతో, ఆమ్లజనితో కూడిన గుడారంలో గ్రహాంతర నరమాంస భక్షకులు, నిర్జన గ్రహాలలో నివసించే అత్యంత శక్తివంతమైన జీవులైన అఘోరా, అఘోరిలకు బందీలుగా ఉండటం.
విశిష్టమైన శక్తులున్న ఏడు అద్భుత వస్తువులలో ఒకటైన వెండి కొవ్వొత్తి ఆ అఘోరి చేతుల్లో ఉండడం.
నాకు అతనిచ్చిన పండ్లు, ఆహారం కృతజ్ఞతతో స్వీకరించాను. ప్రకృతి కూడా కోలుకుంది, ఆతనిచ్చిన ఆహారం తీసుకుంది.
వాళ్ళిద్దరూ ఓ ఎత్తైన బల్ల మీద కూర్చుని నన్ను చూశారు.
“ఓ మానవా? నీకిప్పుడు బాగుందా?” అడిగాడు అఘోరా. ఉన్నట్టుండి అతని చేతిలో వెండి కొవ్వొత్తి ప్రత్యక్షమైంది, మెరుపులు మెరిపించింది.
“భూమి మీది భైరవాలయానికి చెందిన ఓ కొవ్వొత్తీ… మాకు మాంసం, కూరగాయలతో తయారైన ఆహారం; పాలు, తేనె అందించు!” అని ఆజ్ఞాపించాడు.
సినిమాల్లో చూపించినట్టుగా, వెండి కొవ్వొత్తి అతని ఆజ్ఞకి కట్టుబడి వేడి ఆహారము, పానీయాలు వేడిగా ఉన్న ప్లేట్లను అతని ముందు ఉంచింది.
ఆ జీవి తన సొంత విచిత్రమైన ఫ్రెంచ్ మరియు వ్యాకరణరహిత ఇంగ్లీష్‌లో గట్టిగా కేకపెట్టాడు.
“అఘోరా ఇప్పుడు కొవ్వొత్తికి ధన్యవాదాలు చెప్తున్నాడు. అఘోరా, అఘోరిలు వీటిని తింటారు. ప్రియా! రా! వచ్చి తిను”
వాళ్ళు చాలా త్వరగా తిన్నారు. వాళ్ళు తృప్తిగా కూర్చోడం చూసి, నేను ధైర్యం చేసి మాట్లాడసాగాను:
“మాస్టర్, నా ప్రార్థన మన్నించండి!” అంటూ ఒక విద్యార్థి తన ప్రొఫెసర్‌ని మన్నిస్తున్నట్టుగానే మాట్లాడాను. “మాస్టర్, దయచేసి చెప్పండి – భూమికి చెందిన ఈ వెండి కొవ్వొత్తి మీకెలా లభించింది? కుజగ్రహానికి చెందిన మాంత్రిక చక్రవర్తి సమూరా, ఇప్పుడు పరారీలో ఉన్న సమూరా దీన్ని మావద్ద నుంచి దొంగిలించాడు. నిజానికి మేము అతడిని వెతుకుతున్నాము. దయచేసి, మీ శక్తులు ఉపయోగించి, మా బృందంలోని సభ్యులను ఎక్కడున్నారో గుర్తించడంలో నాకు సహాయం చేయండి. వారు రోవర్లలో చీకటివైపు యొక్క ఉత్తర, పశ్చిమ మరియు తూర్పు ప్రాంతాలలో ఉన్నారు. వాళ్ళు కూడా ఒక వారం కంటే ఎక్కువ కాలం ఉండకూడదు. డిమిట్రి, టైటాన్‌కి చెందిన ఒక మహిళ, ఏనిమోయిడ్, చాంద్, ఇంకా వాన్ కు జాక్…”
ఆ గ్రహాంతర మాంత్రికుడు – అఘోరా – లేచి నిలబడ్డాడు, వెండి కొవ్వొత్తి అతని చేతుల్లో మెరిసిపోతోంది.
“అఘోరా మరియు అఘోరి ఏడుగురు తాంత్రికులు చీకటిలో తిరగడం చూస్తున్నారు, వాళ్ళెందుకు ఇక్కడ ఉన్నారో అని అనుకుంటున్నారు. ఇద్దరు పురుషులు, సమూరా, తల వెనక్కి ఉన్న మహిళా ప్రేతంతో తిరుగుతున్నారు. మాకు కనబడుతున్నారు. వాళ్ళు ఇక్కడ ఏదో వెతుకుతున్నారు. అందుకే మేము మా శక్తితో ఉల్కాపాతం సృష్టించాము. వాళ్ళు మేం సృష్టించిన ఉల్కాపాతంలో సుడిగుండాల్లా తిరిగుతూ, ఆకుల వలె గిరగిరా తిరుగుతూ మూర్ఛపోయారు. మేము వారి విలువైన వస్తువులను తీసుకున్నాం. భైరవాలయం యొక్క వెండి కొవ్వొత్తిని దొంగిలించాము. అవును, పాతకాలపు మాంత్రికులు సౌర వ్యవస్థలో దాచి ఉంచిన ఏడు అద్భుత వస్తువులలో ఇదీ ఒకటి అని తెలుసు. ఎంత హాస్యాస్పదం! వాళ్ళకి ఎలా దాచాలో కూడా సరిగా తెలియదు. హా! హ!” చెప్పి నవ్వాడు అఘోరా.
“మీరు వాళ్ళ దగ్గర ఒక అద్దం ఉన్నట్టు గమనించారా? వాళ్ళకేమయింది? వారు చనిపోయారా?”
“ఓహ్! వెర్రి మానవా! కానీ మంత్రతంత్రాలలో మీరింకా విద్యార్థులే. మాకే అద్దమూ కనబడలేదు. నువ్వు చెబుతున్నది మిర్రర్ ఆఫ్ యూనివర్సల్ కమ్యూనికేషన్ గురించే అయితే, చంద్రునిపై దాచి ఉంచిన మరో అద్భుత వస్తువు గురించే అయితే… ఒక్క విషయం గుర్తుంచుకో! మీలో ఎవ్వరూ దానిని తాకను కూడా తాకలేరు. అది చంద్రుని ఉపగ్రహం యొక్క కక్ష్యలో వేలాదిగా ఉన్న సౌర విద్యుత్ పలకలలో దాగి ఉంది. నా స్నేహితుడైన ఐకారియస్ ఒక శతాబ్దం క్రితం, ఏదో నేరం చేసి, ఇలాగే పరారీలో ఉన్నప్పుడు – చంద్రుడి చీకటి వైపున ఉన్న ఒక పెద్ద ఒలింపస్ బిలంలో ఆ అద్దాన్ని కనుగొన్నాడు… కానీ కొంతమంది దుష్టులు అతడిని వెంబడించి అతన్ని దహించి చంపారు. కానీ చనిపోకముందే అతను పైకి ఎగిరి, అద్దాన్ని ఆ కక్షలో దాచాడు. పైకి పైకి దాచేశాడు. అవివేకి! మీరు దానిని తాకలేరు. అఘోరా, అఘోరి కూడా దాన్ని ముట్టుకోలేరు!”
“కానీ ఆల్ఫా వ్యవస్థ నుంచి వచ్చిన ఆ ఇద్దరు మాంత్రికుల సంగతేంటి? వాళ్ళు నశించిపోయారా?”
ఆ ఇద్దరు గ్రహాంతర జీవుల వెనుక వేలాది నీలిరంగు దీపాల కాంతికి సమానమైన ఒక అద్భుతమైన కాంతి వలయం గోచరిస్తోంది.
“హనీ! వాళ్ళు ఆల్ఫా వ్యవస్థకి చెందిన దుష్టులని నీకు తెలుసు, వాళ్ళ దళంలో 10000 నక్షత్రాల స్థాయి ఉన్న సభ్యులు, అనేక దుష్ట శక్తులున్న మాంత్రికు ఉన్నట్లు నీకు తెలుసా? వాళ్లని మేం చంపలేం. సమూరా ఒక పాత అస్థిపంజరం లాంటివాడు, కాని చావడు. ఎందుకంటే అతనికి అమరత్వం ఉంది. ఒలంపస్ యొక్క అమృత ఔషధం తాగాడని అఘోరా విన్నాడు. కానీ హ! హా! ఈ కొవ్వొత్తి మాత్రం నాది.”
మంత్రగత్తె ఆఘోరి చీకాకుతో అరిచింది.
“ప్రియా… అఘోరా! ఈ మర్త్యులతో ఎక్కువగా మాట్లాడకండి. మానవులు బలహీనులే కానీ చాలా మోసగాళ్ళని నేను విన్నాను. వాళ్ళని వదిలేయ్! బిలంలోకి దూరంగా విసిరెయ్! వాళ్ళని తినడం నిషేధం అనుకుంటే తినకండి. వాళ్ళని చంపండి లేదా పంపించేయండి!”
“మేము ప్రమాదకరం కాదు, శక్తి లేని వాళ్ళం. మీలాంటి గొప్ప తాంత్రికులకు నేను ఎన్నటికీ హాని చేయలేనని మీకు బాగా తెలుసు!” అన్నాను. “నేను బ్రతకగలిగే ఒక సురక్షితమైన స్థలానికి నన్ను పంపించండి. ఇక్కడ మా మానవులకు ప్రాణవాయువు లేకుండా జీవించే అవకాశం లేదు.” చెప్పాను
అఘోరా ఆలోచిస్తున్నాడు.
అఘోరి బుసలు కొడుతోంది,
చంద్రుని చీకటివైపున ఆ చీకటి రాత్రి పూర్తిగా నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉంది. పక్షుల కూతలు లేదు. పైన ఆకాశంలో భూమిలో సగభాగం సూర్య కాంతితో ప్రకాశవంతంగా ఉంటే, మరో సగంలో మందమైన కాంతిని ప్రసరిస్తోంది. నక్షత్రాలను చెల్లాచెదురుగా విసిరేసింది.
“అఘోరా తన శక్తిని ఉపయోగించి మిమ్మల్ని మనోవేగంతో రైల్వే స్టేషన్‌కి చేర్చగలడు. నాకు వాహనాలు లేవు. కానీ ఇందుకు అఘోరా తన శక్తిని చాలా ఖర్చు చేయవలసి ఉంటుంది. అఘోరా ఆలోచిస్తున్నాడు… అఘోరా మానవ తాంత్రికులకి హాని చేయడు. మంత్రగాడు మరొక మాంత్రికుడిని తినడు… అవును, ఓ మంత్రగాడితో పోరాడుతాడు… కానీ మాంత్రికుల మాంసం తినడు…” చెప్పాడు అఘోరా.
ఈ గ్రహాంతర జీవి ఎప్పుడూ ‘ప్రథమ పురుష’ లోనే మాట్లాడుతాడు. ఏదో నిర్ణయానికి వచ్చినట్టు మాట్లాడడం ఆపాడు.
“సరే, అఘోరి! ఏకాగ్రతతో ఉండు! దూరంగా ఉన్న ఆ రైల్వే స్టేషన్‌లోకి వీళ్ళని విసిరేద్దాం. దాని పేరేంటి? ఆఁ, లా డెర్నియర్. అక్షాంశాల గమనించు! అవును. వాటిని సరిగ్గా చూసి వీళ్ళని విసిరేద్దాం.”
అత్యంత శక్తివంతమైన విద్యుత్ ప్రవాహం నా శరీరంపై పడింది, నాకు తీవ్రంగా తల తిరిగింది. నా శరీరాన్ని ఏదో తీవ్రమైన మంట దహించివేస్తున్న అనుభూతి కలిగింది. నేను గాలిలోకి ఎగిరి, సుడులు తిరిగి స్పృహ కోల్పోయాను.
అక్కడంతా నిశ్శబ్దం. నిశ్శబ్దం. నాకు మా మావయ్య ధరణి, మా హెచ్.ఓ.డి శాన్, గడ్డంతో ఉన్న మా నాన్న నారా, ముసుగు కప్పుకున్న మా అమ్మ నయన ముఖాలు కనబడ్డాయి. ఎన్నో ముఖాలు కదలాడి తప్పుకుంటున్నాయి, నేను కుజ గ్రహం మీది అరుణ భూములపై ఎగురుతున్నట్టు అనిపించింది. అప్పుడు నాకు డిమిట్రీ, చాంద్, వాన్ కు జాక్ ముఖాలు కనబడ్డాయి, కాసేపటికి ఈ ముఖాలన్నీ మసకగా మారిపోయాయి. దృష్టంతా నా మీదే ఉంది.
ఆరు జతల కళ్ళు నన్ను చూస్తున్నాయి… నా చుట్టూ కృత్రిమ గురుత్వాకర్షణ శక్తి ఉన్న ఒక గదిలో ఉన్నాను. అది రైల్వే ఫ్లాట్‌ఫారంపై ఉంది.
అది లా డెర్నియర్ స్టేషన్ యొక్క శీతలమైన ఫ్లాట్‌ఫాం. ఆదుర్దాగా ఉన్న నా మిత్రులు నా చుట్టూ చేరి ఉన్నారు.
ఆ తర్వాత ధబ్ మని చప్పుడు! ఎక్కడినుంచో వచ్చి నా పక్కన పడింది ప్రకృతి. పూర్తి చైతన్యంలో లేనప్పటికీ, కొద్దిగా అవయవాలను కదిలించసాగింది
“ఓహ్! అద్భుతం”
అది చాంద్ గొంతు.
“ఓ హనీ! తుపాను నిన్ను ఓ ఎద్దును కొట్టినట్టి కొట్టి విసిరేసింది” అంది డిమిట్రి. “మా టైటాన్ మీద ఎడ్లు లేవనుకో… అయినా నువ్వు కండలు తిరిగినవాడిని, దృఢమైన వాడివి. కాని ఇప్పుడు నువ్వు గాలి తీసిన బుడగాలా అయిపోయావు..”
ప్రకృతి మూలిగింది.
నేను మాట్లాడగలుగుతున్నాను.
“ఓహ్! ప్రకృతీ! ఎలా ఉన్నావు? స్పృహ వచ్చిందా?”
ప్రకృతి అరిచింది. “హనీ, భరించలేనంత మగతగా ఉంది.”
కుజగ్రహంలోని అరుణ భూములకు చెందిన మాంత్రికుడు వాన్ కు జాక్ ఆశ్చర్యపోయాడు, “విశ్వశక్తి యొక్క అమోఘమైన ప్రదర్శన. నమ్మశక్యంగాని మాంత్రిక శక్తి! చంద్రుడి యొక్క ఈ శూన్యంలో ఎవరు నిన్ను విసిరేశారు? అరుణ భూముల ప్రమాణాల కన్నా ఇది ఇంకా అద్భుతమైనది” అన్నాడు.
నేను నెమ్మదిగా లేచి, చుట్టూ చూసి జరిగినది వాళ్ళకి చెప్పాను.
“ఇదంతా ఓ కథ. మాకు ప్రమాదం జరిగింది. నిజంగా నరమాంస భక్షకులైన, అసాధారణ శక్తులున్న ఇద్దరు ముసలి ఆల్ఫా వ్యవస్థ మాంత్రిక దంపతులచే రక్షించబడ్డాం. మేము కూడా విశ్వశక్తిని ఉపయోగించేవాళ్ళం కాబట్టి వారు మమ్మల్ని తినలేదు. వారు మా చుట్టూ ఉన్న కాంతి వలయాన్ని చూశారు. నేను వాళ్ళని ప్రార్థించాను, వారు మమ్మల్ని తిరిగి ఇక్కడికి విసిరేశారు.”
డిమిట్రి ముసిముసిగా నవ్వింది. “ఇదంతా మేం నమ్మాలా? ఏం కథ! ఇది నీకొచ్చే కలలలో ఒకటి కాదు కదా?” అంది. డిమిట్రి ఎప్పుడూ వ్యంగ్యంగానే ఉంటుంది.
“వద్దు డిమిట్రి. హాస్యమాడద్దు. మేము చావుకి దగ్గరగా వెళ్ళొచ్చాం. వింత జీవులు, వింత భాష. ఇప్పుడు నాకు విపరీతమైన ఆకలిగా ఉంది, ఏదో ఒకటి తినాలనుకుంటున్నాను” చెప్పింది ప్రకృతి.
చంద్రుడి యొక్క చీకటివైపు నుంచి వచ్చేశాక, లా డెర్నియర్ స్టేషన్ ఒక స్వర్గంలా అనిపిస్తోంది.
ఇది ఆక్సిజన్, కృత్రిమ గురుత్వాకర్షణ, దివ్యమైన తినుబండారాలు ఉన్న ఆహార దుకాణాన్ని కలిగి ఉంది.
కాళ్ళీడ్చుకుంటూ నడిచాం. మాకు కావలసిన పదార్థాలు ఆర్డర్ చేశాం. ప్రశాంతంగా, నిశ్శబ్దంగా తిన్నాం.
అప్పుడు నేను అడిగాను “మీరు ఏం చేసారు? ఏవైనా దొరికాయా?”
“అవును, 73 డిగ్రీల రేఖాంశంలో నాకు ఇగ్లూ కనిపించింది. కాని అది ఖాళీగా ఉంది” చెప్పాడు చాంద్.
వాన్ కుక్ జాక్ ఇలా అన్నాడు, “నేను ప్రయాణం మొదలుపెట్టగానే, తుఫాను వచ్చింది. అయినా ముందుకు వెళ్ళాను. అప్పుడు నాకు రాళ్ళు, కొండలు, ఆకాశంలో భూమి తప్ప వేరే ఏవీ కనబడలేదు. నా రోవర్‌లో ఇంధనం అయిపోవడంతో నేను తిరిగి వచ్చాను. అప్పుడు నేను, చాంద్ కలసి మీరేమైపోయారో, ఎక్కడ ఉన్నారో అని ఆలోచించాం. నిన్న ఉదయం నుండి మేము ఎదురు చూస్తున్నాము. అప్పుడు ధబ్‌మనే చప్పుడుతో నువ్వు ప్రత్యక్షమయ్యావు. అయితే, చంద్ర ప్రభుత్వపు అధికారి అయిన విన్‌స్కీని ఇంకా పిలవలేదు.”
ఎలాగైతేనేం మళ్ళీ మేము అందరం కలిసి ఉన్నాము, చివరికి సరిగ్గా తిన్నాం.
“హనీ, మిర్రర్ ఆఫ్ యూనివర్సల్ కమ్యూనికేషన్ గురించీ, ఆ ఇద్దరు నరమాంస భక్షక గ్రహాంతర తాంత్రికుల గురించి వీళ్లకి చెప్పండి” అంది ప్రకృతి.
“దుష్ట గ్రహాంతరవాసులతో సమూరా ఇక్కడే ఉన్నాడు. భైరవాలయం నుంచి నాచే దొంగతనం చేయించి సంపాదించిన వెండి కొవ్వొత్తిని అతను ఖచ్చితంగా కోల్పోయాడు. అది ప్రస్తుతం అఘోరా వద్ద ఉంది. సమూరా దాని కోసమూ, ఇంకా మిర్రర్ ఆఫ్ యూనివర్సల్ కమ్యూనికేషన్ కోసం కూడా ప్రయత్నిస్తాడని పందెం కాస్తాను. అది చంద్రుడి యొక్క కక్ష్యలోని పవర్ స్టేషన్ యొక్క సౌర ఫలకాల మధ్య దాచబడి ఉంది. అవి సౌర శక్తిని స్వీకరించి, విద్యుత్ శక్తిగా మార్చి చంద్రుడి కాలనీలకు ప్రసారం చేస్తానని నాకర్థమైంది” అని చెప్పి, “ఇప్పుడా అద్దాన్ని ఎలా పొందాలి?” అని అడిగాను.
డిమిట్రి ఎప్పటిలానే సరదాగా ఉంది, అన్నింటినీ చాలా తేలికగా తీసుకుంటుంది.
“ఓ విషయం చెప్పానా ప్రియా హనీ” అంది.
ప్రకృతి తన చూపులని అలసటగా తిప్పుకుంది. ఆమె నా భార్య. డిమిట్రి ఇలా నాతో ఎక్కువ చనువుగా ఉండడం తనకి నచ్చదు.
డిమిట్రి మళ్ళీ ముసిముసి నవ్వులు నవ్వి, చెప్పడం కొనసాగించింది.
“అయితే, సమూరా, అతని బృందం ఎంత శక్తివంతులైనప్పటికీ, ఆ అద్దాన్ని గుర్తించలేరు. ఈ కొవ్వొత్తి లాగానే.”
“ఎందుకు?” అంటూ అందరూ ఒక్కసారిగా అరిచారు. నేను అకస్మాత్తుగా ఆమె తర్కాన్ని, హేతుబద్ధతనీ గ్రహించాను.
“అది కేవం స్వచ్ఛమైన మరియు నిస్వార్థ తాంత్రికుడికి మాత్రమే కనిపిస్తుంది. మన హనీ లాంటి వాళ్ళకి! మౌంట్ ఒలంపస్ మీద ఇలాగే జరిగింది. ఆలయ నేలమాళిగలోనూ ఇలాగే జరిగింది. అంతే కదా” అంది డిమిట్రి.
“అంటే, త్వరలోనే అతను హనీ కోసం వస్తాడు!” భయంతో గొణిగాడు చాంద్.
“సహేతుకమే! త్వరలోనే మనం అతడిని చూడబోతున్నాం!” అన్నాడు వాన్ కు జాక్.
“హనీ ఇంకా మనమందరం విశ్వశక్తి యొక్క వికిరణాన్ని విడుదల చేస్తాము. అవును. అతను మన కోసం వస్తాడు… హనీ లాంటి మరెవరూ లేకపోతే. ఇక్కడ మరొక స్వచ్ఛమైన నిస్వార్థమైన తాంత్రికుడు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అలాంటివాళ్ళు చంద్రుడిపై ఎవరూ లేరా?” అంది ప్రకృతి ఓ ఉదాత్త స్వరంలో!
“మేమందరం చెడ్డవాళ్ళం ప్రియతమా!” అంటూ హాస్యమాడింది డిమిట్రి
లా డెర్నియర్ స్టేషన్ ఖాళీ ప్రాంగణంలో ఆమె నవ్వు ప్రతిధ్వనించింది.
***
అధ్యాయం 21: “డోనాక్స్”
మేము చంద్రుని చీకటి వైపున ఉన్న లా దెర్నియర్ స్టేషన్ విశ్రాంతి గదుల్లో రెండు రోజులు ఉన్నాం. రైల్వే క్యాంటిన్‌లో తిన్నాం. యూనివర్సల్ కరెన్సీ యూనిట్లలో నామమాత్రపు ధర చెల్లించి – ఆక్సీజన్, కృత్రిమ గురుత్వాకర్షణ ఉన్న స్టేషన్‌లోని విశ్రాంతి గదులో నిద్రించాం.
కమ్యూనికేషన్ పరికరం ద్వారా విన్‌స్కీని సంప్రదించాను, జరిగినదంతా వివరించాను.
“మిస్టర్ విన్‌స్కీ! గ్రహాంతర తాంత్రికుల కోసం మేము ఇక్కడ వేచి ఉండాలనుకుంటున్నాము. మేం వారి స్థావరాన్నీ కనుక్కున్నాం, ఇద్దరు గ్రహాంతర తాంత్రికులను చూశాం. మీరు కొంతమంది సిబ్బందితో వస్తే వాళ్ళను పట్టుకోవచ్చు, కానీ మనము ఎవరి కోసమైతే వెతుకుతున్నామో వారు దొరకలేదు, మా విశ్వశక్తి యొక్క రేడియో తరంగాలను అనుసరిస్తూ వారు వస్తారని మేము భావిస్తున్నాం” అని చెప్పాను.
విన్‌స్కీ చాలా మోటుగా మాట్లాడాడు.
“అది మీ సమస్య!” అన్నాడు. “ఈ మొత్తం ఆపరేషన్ రహస్యంగా ఉంటుంది. మీరు సజీవంగా ఉన్నందుకు, వాళ్ళకి ఆహారం కాకుండా ఉన్నందుకు సంతోషించండి. మీరేం చేయదలచారో అది చేయండి. మీరు వాళ్ళని చూసినప్పుడు మాత్రం నాకు చెప్పండి…”
అతను అంత కరకుగా ఉండడం ఆశ్చర్యమనిపించింది. కానీ అతను కూడా చేయగలిగినదేమీ లేదు.
ఎర్త్ కౌన్సిల్ చంద్ర రాజధానిలో ఒక రాయబార కార్యాలయం కలిగి ఉంది. కానీ దానిలో ప్రవేశించడానికి మాకెన్నడూ అనుమతి ఇవ్వలేదు. మమ్మల్ని నియమించుకున్నా, ఎర్త్ కౌన్సిల్‌కి సంబంధించిన సమాచారం లభించడం లేదు, సంబంధిత అధికారులు మాకు అందుబాటులో లేరు.
ఉత్తర అమెరికాలోని న్యూ హోప్ సిటీలో ఉన్న ఎర్త్ కౌన్సిల్ కార్యాలయాన్ని గాని లేదా రాయబార కార్యాలయ సభ్యులకు గాని ఫోన్ చేయడానికి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వమని రోబో యు 7776ను ఆదేశించాను.
నేను డయల్ చేశాను, కనెక్షన్ దొరికింది.
అయితే, ఇంటర్ ప్లానెటరీ ఎఫైర్స్ సెక్రటరీగా చెప్పుకునే ఒక అధికారి మాట్లాడాడు. మిషన్‌ని కొనసాగించమని, తగిన నిర్ణయాలు మమ్మల్నే తీసుకోమని సలహా ఇచ్చాడు.
“మిస్టర్ ఆమ్రపాలి, మీరు కమాండర్. మీరు మీ బృందాన్ని నడిపించాలి. అవసరం వచ్చినప్పుడు, తగిన సమయంలో మేం రంగంలోకి దిగుతాం” అన్నాడతను.
ప్రచండమైన గాలులు, రాత్రుళ్ళు ఉల్కాపాతం, ఒకే ఒక ప్రయాణీకుడితో లేదా ఖాళీగా రోజుకు ఒకసారి వచ్చే రైలు, స్టేషన్ మాస్టర్, నిరుత్సాహంగా ఉన్న ముసలి రైల్వే కూలీలు… బహుశా వారు చంద్రుడికి పరాయివారు కావచ్చు… ఒక స్థిరమైన నవ్వుతో రోజూ మాకు ఆహార పదార్థాలందించే క్యాంటిన్ కుర్రాడు…… వీటినీ, వీళ్ళని గమనించుకోడంతో మూడు రోజులు గడిచాయి. ఈ లోపు నేను కూడా కొంత శక్తి పుంజుకున్నాను.
భూమి యొక్క 24 గంటల పద్ధతిలో లెక్కిస్తే, చంద్రుడి రోజులలో 15 రోజులు గడిపిన తరువాత, 76 గంటలకి ఆ ఏకైక రైలు రాజధానికి బయల్దేరింది.
ఒక పెద్ద దట్టమైన మేఘం ఆకాశాన్ని కమ్మివేసింది. వాతావరణం శీతలంగా మారింది, అకస్మాత్తుగా చీకటి పడింది. ప్లాట్‌ఫాం పైకప్పు మీద పడే రాళ్లు పెద్ద ధ్వనులు చేస్తున్నాయి.
నాలో ఉత్సుకత కలిగింది, ఇంకా భయం కూడా వేసింది. ఫ్లాట్‌ఫాం చివరి వరకూ నడిచాను.
చాలా వేగంగా చీకటి పడుతోంది. చాలా ఉధృతమైన గాలి! అత్యంత చల్లదనం!! ఆకాశంలోకి చూశాను. భూమి కనిపించలేదు, ప్రకాశించే సూర్యుడు కనిపించలేదు. అంతా నిశీధి. ఓ భయంకరమైన కరిమబ్బు ఆకాశాన్ని కమ్మేసింది. ఆకాశంలో ఇంకేమీ కనబడడం లేదు.
“ఇది మరో రకం ఉల్కాపాతం కాబోలు…” అనుకున్నాను. కాని ఇది భిన్నమైనది.
సాధారణ స్థాయికంటే అధికంగా చీకటి! అత్యంత శీతల వాతావరణం… ఏదో తెలియని భయం. మృత్యు భయం.
ఇది నాకు తెలిసిన అనుభవమే. మంత్రవిద్య ప్రయోగం జరుగుతోంది. తన నావిగేషన్ సిస్టమ్ సహాయంతో రోబో యు7776, చంద్రుడి చీకటివైపు నుండి తిరిగి రాగలిగింది. నాకు కాస్త దూరంగా నిలబడి ఉంది రోబో. నాకు… ఇయర్ ఫోన్ల ద్వారా యాంత్రిక సందేశం పంపింది.
“మాస్టర్! మాస్టర్! అప్రమత్తం! విశ్వశక్తి ప్రయోగం జరుగుతోంది. ఇది చాలా భారీ స్థాయిలో ఉంది, ఏడు వేల నక్షత్రాల శక్తి ఉత్పత్తి చేయబడుతోంది…”
చాంద్, ప్రకృతి, డిమిట్రీ పరిగెత్తుకుంటూ బయటకి వచ్చారు. వాళ్ళు అప్పటిదాక వెయిటింగ్ రూమ్‌లో ఏదో సినిమా చూస్తున్నారు.
వాన్ కు జాక్ కనిపించలేదు.
అకస్మాత్తుగా స్టేషన్ ప్లాట్‌ఫాం మీద ఒక పెద్ద పేలుడు సంభవించింది. పైకప్పు ఎగిరిపోయింది, కిటికి అద్దాలు తెరుచుకుని కాలిపోయాయి, ఇనుప, గాజు ముక్కలు గాలిలోకి చెదిరిపోయాయి.
అందరం నోరు తెరచుకుని విస్మయంగా చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాం.
స్టేషన్ మాస్టర్, టిక్కెట్ ఇచ్చే అతను, ఇద్దరు పోర్టర్లు మరియు నలుగురు సెక్యూరిటీ గార్డులు అస్తవ్యస్తంగా అటుఇటూ పరిగెడుతున్నారు.
మా బృందం సభ్యులు స్లో మోషన్‌లో కదిలినట్టుగా గాల్లో తేలుతున్నారు.
నా లాగా.
మేమంతా దృష్టి కేంద్రీకరించాం. లా దెర్నియర్ స్టేషన్ ఒక్క క్షణంలో పేలిపోయి, నాశనమవడంతో ఆక్సీజన్‌నీ, లా దెర్నియర్ లోని కృత్రిమ గురుత్వాకర్షణ శక్తినీ కోల్పోయాం. అందుకే గాలిలో ఎగురుతూ విశ్వశక్తితో ప్రాణాలు నిలుపుకుంటున్నాం.
నా చెవిలో యు7776 కేకలు వినబడుతున్నాయి: “మాస్టర్! ఆక్సిజన్ లేదు. మీరు రెండు నిమిషాల్లో చనిపోయే ప్రమాదం ఉంది. మీరు నెమ్మదిగా ఊపిరి తీసుకుంటే, గరిష్టంగా ఐదు నిమిషాలు బ్రతకగలరు. ఆక్సిజన్ ఎక్కడుందో చూడండి! ఆఁ… స్టేషన్ మాస్టర్ గదిలో ఉంది. అక్కడికి పరిగెత్తండి. అక్కడ ఎమర్జెన్సీ మాస్క్‌లు, ఆక్సీజన్ సిలిండర్లు ఉన్నాయి!”
నేను ఎగురుకుంటూ వెళ్ళాను. నా మొహం మీద రాళ్ళు పడుతున్నాయి, శీతల పవనాలు నా మొహాన్ని కోసేస్తున్నంత తీవ్రంగా వీస్తున్నాయి. ముందుకు వెళ్ళడం ఏ మాత్రం తేలిక కాదు.
మరణానికి సమీపంలో ఉన్నాను!
నా చేతులను బాగా కదిలిస్తూ ఒక పక్షిలా నేను ఎగిరిపోయాను. నా కాళ్ళని పిచ్చిపిచ్చిగా ఊపుతూ స్టేషన్ మాస్టర్ గదిలోకి ప్రవేశించగలిగాను. నన్ను నేను పొడవుగా చేసుకున్నాను. నా దృష్టిని కేంద్రీకరించి, ఎమర్జెన్సీ కప్ బోర్డులలో ఆక్సీజన్ మాస్క్‌లు, సిలిండర్లను గుర్తించడానికి శక్తిని సృష్టించడానికి ప్రయత్నించాను. అవును. ప్రథమ చికిత్స కోసం ఒక పెద్ద ఎరుపు రంగు + చిహ్నం ఉంది. ఇది ఎన్నో వేల సంవత్సరాల నుండి రెడ్ క్రాస్ ఉపయోగిస్తున్న చిహ్నం.
ఒకేసారి రెండు సిలిండర్లను దొరకబుచ్చుకున్నాను, వాటి ట్యూబులను కలిపి, మాస్క్ ముఖానికి ధరించాను.
నా రక్తంలో ఆక్సిజన్ ప్రవహించేసరికి నాకు ప్రాణం తిరిగి వచ్చింది. నా కళ్లు చూడగలిగాయి, నా అవయవాలు పని చేయసాగాయి.
ప్రకృతి, డిమిట్రి, చాంద్, వాన్ కు జాక్ ఎక్కడ? నేను ఆశ్చర్యపోయాను.
ఉధృతంగా వీస్తున్న ఆ గాలిలోనే గట్టిగా అరిచాను.
“ప్రకృతీ… ఇక్కడకి రా! ఆక్సిజన్ దొరికింది.”
నెమ్మదిగా గాలిలో తేలుతూ… గాలి ఉధృతికి జుట్టు విడిపోవడంతో, ఎగురుతున్న కేశాలతో ఏదో నల్లటి వస్తువులా ఎగురుతూ వచ్చింది ప్రకృతి.
చంద్రుడి ఆకాశం నుండి ఎగిరివచ్చిన దేవదూతలా ఉంది.
ప్రకృతి నా వెనుకే దిగింది.
నేను త్వరగా ఆమె ముఖానికి ఆక్సీజన్ మాస్క్ తగిలించాను.
ఆమె ముఖం చల్లగా ఉంది, కానీ ఆక్సీజన్ అందడంతో ఆమె కళ్ళలో జీవం వచ్చింది, వెచ్చని రక్తం ఆమె ముఖంలోకి ప్రవేశించింది. కళ్ళు ఎరుపు రంగుతో మెరిసిపోయాయి.
ఇప్పుడు అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. తుఫాను, రాళ్ల వాన, బండరాళ్ల వర్షం ఎంత త్వరగా వచ్చాయో, అంతే వేగంగా ఆగిపోయాయి.
నిశ్శబ్దం!
ఆ తరువాత నా బృందంలోని సభ్యులందరూ ఒక్కొక్కరూగా వచ్చి వెయిటింగ్ రూమ్‌లో పడసాగారు. వాన్ కు జాక్, చాంద్, డిమిట్రీ వచ్చారు. చివరగా ఒక తోడేలుగా అరుస్తూ ఏనిమాయిడ్ వచ్చాడు.
మ్యూజికల్ చైర్స్ ఆటలోలా నేను ఒకరిని మార్చి మరొకరికి వంతులవారీగా ఆక్సీజన్ మాస్క్ పెట్టాను.
వారు కొద్దిగా కోలుకున్నారు, కాని ఆమ్లజనిహీనత వల్ల ఇంకా మగతగానే ఉన్నారు.
ఆపై ప్లాట్‌ఫారం మీద ఒక పెద్ద మెరుపు మెరిసింది, ఒక భారీ విస్ఫోటపు ధ్వని వినిపించింది. అది నా కర్ణభేరిని దాదాపుగా నా పగలగొట్టినంత పని చేసింది.
అప్పుడు మళ్ళీ నిశ్శబ్దం.
అప్పుడు వారు ప్రత్యక్షమయ్యారు.
అరుణ భూముల యొక్క ముసలి, వికారమైన, దుష్ట చక్రవర్తి సమూరా! పొడవైన, నల్లని ఎముకలగూడులాంటి ఆకారం, ముఖం స్థానంలో పుర్రె, దానిలో ఎరుపురంగుతో ప్రకాశించే కళ్ళు!
అతని పక్కనే ఉన్న భయంకర ఆకారాన్ని నేను మెడవరకూ మాత్రమే చూడగలిగాను… మెడ పైన మెలికలు తిరిగిన పాముల్లాంటి కేశాలు.
ఒక భయంకరమైన గతానుభవపు భావన వెంటాడింది. నేను నా పీడకలలో చూసినట్లుగా తల వెనక్కి తిరిగి ఉన్న ఆకారం సయోని అని గ్రహించాను.
సమారా ఇరువైపులా ఇద్దరు పొడవైన నల్లని హ్యుమనాయిడ్లు ఉన్నారు.
వారెంత పొడుగ్గా ఉన్నారంటే, చీకటి రాత్రిలో దీప స్తంభాలంత పొడవున్నారు. వాళ్ళ శరీరం పారదర్శకంగా ఉండి ఎముకలు కనబడుతున్నాయి. వాళ్ళ పుర్రెలు సాగదీసినట్టుగా ఉన్నాయి. దేవుడా… వాళ్ళ పుర్రె కూడా పారదర్శకంగా ఉండి మెదడులోని గైరై. సలకై కనపడుతున్నాయి. బహుశా వారి మెదడులో ఆలోచనలు మెదులుతున్నాయేమో, చిన్న మెరుపులతో మెదడు ప్రకాశిస్తోంది.
వారి కళ్లు నల్లగా ఉన్నాయి, అయితే సమూరా కళ్ళల్లా ఎరుపు రంగులో మెరుస్తున్నాయి. చంపడానికి లేదా వైకల్యం కలిగించడానికి ఆ కళ్ళు ప్రాణాంతక లేజర్ కిరణాలు వెలువరించగలవని నేను విశ్వసించాను. కుజ గ్రహం మీద బహిరంగంగా సంచరించే వ్యోమగాములు ధరించినట్లే వాళ్ళు కూడా రక్షణాత్మక దుస్తులు ధరించారు.
కాని వారు ముఖాలకి మాత్రం ఆక్సీజన్ మాస్క్‌లు ధరించలేదు.
వీళ్ళు ప్రాణవాయువు లేకుండా ఎలా జీవించగలిగారా అని ఆశ్చర్యపోయాను.
సమూరా పక్కన ఉన్న ఈ ఇద్దరు గ్రహాంతర జీవులు… బహుశా ఆల్ఫా సెంటారీ జంట నక్షత్రాల సమీపంలోని ఆల్ఫా సిస్టమ్‌కి చెందినవారై ఉంటారు. వీళ్ళే సమూరాకి సాయం చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే స్పేస్ ఎలివేటర్ వద్ద మేం జరిపిన దాడిలో సమూరా మంత్రులు మరణించడం నాకు ఖచ్చితంగా తెలుసు.
నేను వాళ్ళని అచ్చెరువొంది చూస్తుండగా… సమూరా గొంతు ఖంగుమంటూ మోగింది. “ఓ హనీ ఆమ్రపాలి, మోసపూరిత మానవ గుంటనక్కా…. మనం మళ్లీ కలుసుకున్నాం! మా గురించి ఆలోచించకు… ఆక్సీజన్ లేకుండా కొన్ని గంటల పాటు జీవించేందుకు మేమొక మందు సేవించాం….”
“చక్రవర్తికి నా వందనాలు!” అన్నాను. “మీకు నా అభివాదాలు. మిమ్మల్ని సజీవంగా ఉంచడమే కాకుండా, సయోనీకి పునర్జన్మ ప్రసాదించిన మీ శక్తి పట్ల ఆశ్చర్యపోతున్నాను. కానీ అలాంటి శిరస్సుతో ఆమె భయంకరంగా లేదూ? ఇక వీళ్ళెవరు? ప్రభూ… నక్కలు భూమి మీద మాత్రమే ఉన్నాయి, కనీసం అవి తమ ఆకలిని తీర్చుకోడానికే మనుషులని తింటాయి. కుజగ్రహంలో మీరు తప్ప, నక్కలు లేవు. కాపట్యం, వంచన, అధికార దాహం… అన్నీ మీలోనే ఉన్నాయి… ఈ సమస్యలన్నిటికీ మూలం అవే. ఇప్పుడు నేను మిమ్మల్ని చంపడానికి నిశ్చయించుకున్నాను. ఇది నా ప్రతీకారం… నా తల్లిదండ్రులను చంపినందుకు నేను మిమ్మల్ని శిక్షించాలని కోరుకుంటున్నాను.
ఏదేమైనా నేను మిమ్మల్ని చంపి తీరుతాను!” అన్నాను.
ఈ మాటలు అంటూండగానే, నేను త్రాణ కోల్పోయాను, నన్ను నిస్సత్తువ ఆవరించింది. ఆక్సిజన్ లేమి… నా అంతరాత్మకి తెలుసు, నేను ఒక నిమిషం కన్నా ఎక్కువ కాలం జీవించలేనని!
ఆల్ఫా వ్యవస్థ వింత జీవులు నవ్వుతూ అడవి జంతువుల్లా ధ్వనులు చేశారు.
ఇంతలో నా భుజంపై ఏదో పొడిచినట్లయ్యింది. వాక్ కు జాక్ నా వెనుక నుంచి పాకుతున్నాడు. అతని చేతిలో ఒక సిరంజి ఉంది.
అప్పుడతను వేగంగా మా బృందంలోని మిగతా సభ్యులకు చకచకా ఇంజక్షన్ చేశాడు. ఆక్సీజన్ మాస్క్ ధరించి అందరికంటే మెరుగ్గా ఉన్న ప్రకృతీ, నోరు తెరుచుకుని ఉండిపోయిన చాంద్, శరీరం పాలిపోయి నీలం రంగులోకి మారిన డిమిట్రి, చనిపోతున్న గేదెలా మూల్గుతున్న ఏనిమయిడ్… అందరికీ సూదిమందు ఇచ్చాడు వాన్ కు జాక్.
అప్పుడు వాన్ కుక్ జాక్ సమూరా వైపుకు తిరిగాడు: “డోనాక్స్ ఇంజెక్షన్లు. అరుణ భూములకు చెందిన సమూరా… ఇవి మీకు బాగా తెలుసు. ఇవి కుజగ్రహంపై తయారు చేసిన అనామ్లజనకాలు. మేము నిశ్చయంగా బ్రతుకుతాం!” అన్నాడు ధీమాగా.
***
(సశేషం)