భూమి నుంచి ప్లూటో దాకా… -8

0
5

అధ్యాయం 21: “డోనాక్స్”

మేము చంద్రుని చీకటి వైపున ఉన్న లా దెర్నియర్ స్టేషన్ విశ్రాంతి గదుల్లో రెండు రోజులు ఉన్నాం. రైల్వే క్యాంటిన్‌లో తిన్నాం. యూనివర్సల్ కరెన్సీ యూనిట్లలో నామమాత్రపు ధర చెల్లించి – ఆక్సీజన్, కృత్రిమ గురుత్వాకర్షణ ఉన్న స్టేషన్‌లోని విశ్రాంతి గదులో నిద్రించాం.

కమ్యూనికేషన్ పరికరం ద్వారా విన్‌స్కీని సంప్రదించాను, జరిగినదంతా వివరించాను.

“మిస్టర్ విన్‌స్కీ! గ్రహాంతర తాంత్రికుల కోసం మేము ఇక్కడ వేచి ఉండాలనుకుంటున్నాము. మేం వారి స్థావరాన్నీ కనుక్కున్నాం, ఇద్దరు గ్రహాంతర తాంత్రికులను చూశాం. మీరు కొంతమంది సిబ్బందితో వస్తే వాళ్ళను పట్టుకోవచ్చు, కానీ మనము ఎవరి కోసమైతే వెతుకుతున్నామో వారు దొరకలేదు, మా విశ్వశక్తి యొక్క రేడియో తరంగాలను అనుసరిస్తూ వారు వస్తారని మేము భావిస్తున్నాం” అని చెప్పాను.

విన్‌స్కీ చాలా మోటుగా మాట్లాడాడు.

“అది మీ సమస్య!” అన్నాడు. “ఈ మొత్తం ఆపరేషన్ రహస్యంగా ఉంటుంది. మీరు సజీవంగా ఉన్నందుకు, వాళ్ళకి ఆహారం కాకుండా ఉన్నందుకు సంతోషించండి. మీరేం చేయదలచారో అది చేయండి. మీరు వాళ్ళని చూసినప్పుడు మాత్రం నాకు చెప్పండి…”

అతను అంత కరకుగా ఉండడం ఆశ్చర్యమనిపించింది. కానీ అతను కూడా చేయగలిగినదేమీ లేదు.

ఎర్త్ కౌన్సిల్ చంద్ర రాజధానిలో ఒక రాయబార కార్యాలయం కలిగి ఉంది. కానీ దానిలో ప్రవేశించడానికి మాకెన్నడూ అనుమతి ఇవ్వలేదు. మమ్మల్ని నియమించుకున్నా, ఎర్త్ కౌన్సిల్‌కి సంబంధించిన సమాచారం లభించడం లేదు, సంబంధిత అధికారులు మాకు అందుబాటులో లేరు.

ఉత్తర అమెరికాలోని న్యూ హోప్ సిటీలో ఉన్న ఎర్త్ కౌన్సిల్ కార్యాలయాన్ని గాని లేదా రాయబార కార్యాలయ సభ్యులకు గాని ఫోన్ చేయడానికి వాళ్ళ ఫోన్  నెంబర్లు ఇవ్వమని రోబో యు 7776ను ఆదేశించాను.

నేను డయల్ చేశాను, కనెక్షన్ దొరికింది.

అయితే, ఇంటర్ ప్లానెటరీ ఎఫైర్స్ సెక్రటరీగా చెప్పుకునే ఒక అధికారి మాట్లాడాడు. మిషన్‌ని కొనసాగించమని, తగిన నిర్ణయాలు మమ్మల్నే తీసుకోమని సలహా ఇచ్చాడు.

“మిస్టర్ ఆమ్రపాలి, మీరు కమాండర్. మీరు మీ బృందాన్ని నడిపించాలి. అవసరం వచ్చినప్పుడు, తగిన సమయంలో మేం రంగంలోకి దిగుతాం” అన్నాడతను.

ప్రచండమైన గాలులు, రాత్రుళ్ళు ఉల్కాపాతం, ఒకే ఒక ప్రయాణీకుడితో లేదా ఖాళీగా రోజుకు ఒకసారి వచ్చే రైలు, స్టేషన్ మాస్టర్, నిరుత్సాహంగా ఉన్న ముసలి రైల్వే కూలీలు… బహుశా వారు చంద్రుడికి పరాయివారు కావచ్చు… ఒక స్థిరమైన నవ్వుతో రోజూ మాకు ఆహార పదార్థాలందించే క్యాంటిన్ కుర్రాడు…… వీటినీ, వీళ్ళని గమనించుకోడంతో మూడు రోజులు గడిచాయి. ఈ లోపు నేను కూడా కొంత శక్తి పుంజుకున్నాను.

భూమి యొక్క 24 గంటల పద్ధతిలో లెక్కిస్తే, చంద్రుడి రోజులలో 15 రోజులు గడిపిన తరువాత, 76 గంటలకి ఆ ఏకైక రైలు రాజధానికి బయల్దేరింది.

ఒక పెద్ద దట్టమైన మేఘం ఆకాశాన్ని కమ్మివేసింది. వాతావరణం శీతలంగా మారింది, అకస్మాత్తుగా చీకటి పడింది. ప్లాట్‌ఫాం పైకప్పు మీద పడే రాళ్లు పెద్ద ధ్వనులు చేస్తున్నాయి.

నాలో ఉత్సుకత కలిగింది, ఇంకా భయం కూడా వేసింది. ఫ్లాట్‌ఫాం చివరి వరకూ నడిచాను.

చాలా వేగంగా చీకటి పడుతోంది. చాలా ఉధృతమైన గాలి! అత్యంత చల్లదనం!! ఆకాశంలోకి చూశాను. భూమి కనిపించలేదు, ప్రకాశించే సూర్యుడు కనిపించలేదు. అంతా నిశీధి. ఓ భయంకరమైన కరిమబ్బు ఆకాశాన్ని కమ్మేసింది. ఆకాశంలో ఇంకేమీ కనబడడం లేదు.

“ఇది మరో రకం ఉల్కాపాతం కాబోలు…” అనుకున్నాను.  కాని ఇది భిన్నమైనది.

సాధారణ స్థాయికంటే అధికంగా చీకటి! అత్యంత శీతల వాతావరణం… ఏదో తెలియని భయం. మృత్యు భయం.

ఇది నాకు తెలిసిన అనుభవమే. మంత్రవిద్య ప్రయోగం జరుగుతోంది. తన నావిగేషన్ సిస్టమ్ సహాయంతో రోబో యు7776, చంద్రుడి చీకటివైపు నుండి తిరిగి రాగలిగింది. నాకు కాస్త దూరంగా నిలబడి ఉంది రోబో. నాకు… ఇయర్ ఫోన్ల ద్వారా యాంత్రిక సందేశం పంపింది.

“మాస్టర్! మాస్టర్! అప్రమత్తం! విశ్వశక్తి ప్రయోగం జరుగుతోంది. ఇది చాలా భారీ స్థాయిలో ఉంది, ఏడు వేల నక్షత్రాల శక్తి ఉత్పత్తి చేయబడుతోంది…”

చాంద్, ప్రకృతి, డిమిట్రీ పరిగెత్తుకుంటూ బయటకి వచ్చారు. వాళ్ళు అప్పటిదాక వెయిటింగ్ రూమ్‌లో ఏదో సినిమా చూస్తున్నారు.

వాన్ కు జాక్ కనిపించలేదు.

అకస్మాత్తుగా స్టేషన్ ప్లాట్‌ఫాం మీద ఒక పెద్ద పేలుడు సంభవించింది. పైకప్పు ఎగిరిపోయింది, కిటికి అద్దాలు తెరుచుకుని కాలిపోయాయి, ఇనుప, గాజు ముక్కలు గాలిలోకి చెదిరిపోయాయి.

అందరం నోరు తెరచుకుని విస్మయంగా చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాం.

స్టేషన్ మాస్టర్, టిక్కెట్ ఇచ్చే అతను, ఇద్దరు పోర్టర్లు మరియు నలుగురు సెక్యూరిటీ గార్డులు అస్తవ్యస్తంగా అటుఇటూ పరిగెడుతున్నారు.

మా బృందం సభ్యులు స్లో మోషన్‌లో కదిలినట్టుగా గాల్లో తేలుతున్నారు.

నా లాగా.

మేమంతా దృష్టి కేంద్రీకరించాం. లా దెర్నియర్ స్టేషన్ ఒక్క క్షణంలో పేలిపోయి, నాశనమవడంతో ఆక్సీజన్‌నీ, లా దెర్నియర్ లోని కృత్రిమ గురుత్వాకర్షణ శక్తినీ కోల్పోయాం. అందుకే గాలిలో ఎగురుతూ విశ్వశక్తితో ప్రాణాలు నిలుపుకుంటున్నాం.

నా చెవిలో యు7776 కేకలు వినబడుతున్నాయి: “మాస్టర్! ఆక్సిజన్ లేదు. మీరు రెండు నిమిషాల్లో చనిపోయే ప్రమాదం ఉంది. మీరు నెమ్మదిగా ఊపిరి తీసుకుంటే, గరిష్టంగా ఐదు నిమిషాలు బ్రతకగలరు. ఆక్సిజన్ ఎక్కడుందో చూడండి! ఆఁ… స్టేషన్ మాస్టర్ గదిలో ఉంది. అక్కడికి పరిగెత్తండి. అక్కడ ఎమర్జెన్సీ మాస్క్‌లు, ఆక్సీజన్ సిలిండర్లు ఉన్నాయి!”

నేను ఎగురుకుంటూ వెళ్ళాను. నా మొహం మీద రాళ్ళు పడుతున్నాయి, శీతల పవనాలు నా మొహాన్ని కోసేస్తున్నంత తీవ్రంగా వీస్తున్నాయి. ముందుకు వెళ్ళడం ఏ మాత్రం తేలిక కాదు.

మరణానికి సమీపంలో ఉన్నాను!

నా చేతులను బాగా కదిలిస్తూ ఒక పక్షిలా నేను ఎగిరిపోయాను. నా కాళ్ళని పిచ్చిపిచ్చిగా ఊపుతూ స్టేషన్ మాస్టర్ గదిలోకి ప్రవేశించగలిగాను. నన్ను నేను పొడవుగా చేసుకున్నాను. నా దృష్టిని కేంద్రీకరించి, ఎమర్జెన్సీ కప్ బోర్డులలో ఆక్సీజన్ మాస్క్‌లు, సిలిండర్లను గుర్తించడానికి శక్తిని సృష్టించడానికి ప్రయత్నించాను. అవును. ప్రథమ చికిత్స కోసం ఒక పెద్ద ఎరుపు రంగు + చిహ్నం ఉంది. ఇది ఎన్నో వేల సంవత్సరాల నుండి రెడ్ క్రాస్ ఉపయోగిస్తున్న చిహ్నం.

ఒకేసారి రెండు సిలిండర్లను దొరకబుచ్చుకున్నాను, వాటి ట్యూబులను కలిపి, మాస్క్ ముఖానికి ధరించాను.

నా రక్తంలో ఆక్సిజన్ ప్రవహించేసరికి నాకు ప్రాణం తిరిగి వచ్చింది. నా కళ్లు చూడగలిగాయి, నా అవయవాలు పని చేయసాగాయి.

ప్రకృతి, డిమిట్రి, చాంద్, వాన్ కు జాక్ ఎక్కడ? నేను ఆశ్చర్యపోయాను.

ఉధృతంగా వీస్తున్న ఆ గాలిలోనే గట్టిగా అరిచాను.

“ప్రకృతీ… ఇక్కడకి రా! ఆక్సిజన్ దొరికింది.”

నెమ్మదిగా గాలిలో తేలుతూ… గాలి ఉధృతికి జుట్టు విడిపోవడంతో, ఎగురుతున్న కేశాలతో  ఏదో నల్లటి వస్తువులా ఎగురుతూ వచ్చింది ప్రకృతి.

చంద్రుడి ఆకాశం నుండి ఎగిరివచ్చిన దేవదూతలా ఉంది.

ప్రకృతి నా వెనుకే దిగింది.

నేను త్వరగా ఆమె ముఖానికి ఆక్సీజన్ మాస్క్ తగిలించాను.

ఆమె ముఖం చల్లగా ఉంది, కానీ ఆక్సీజన్ అందడంతో ఆమె కళ్ళలో జీవం వచ్చింది, వెచ్చని రక్తం ఆమె ముఖంలోకి ప్రవేశించింది. కళ్ళు ఎరుపు రంగుతో మెరిసిపోయాయి.

ఇప్పుడు అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. తుఫాను, రాళ్ల వాన, బండరాళ్ల వర్షం ఎంత త్వరగా వచ్చాయో, అంతే వేగంగా ఆగిపోయాయి.

నిశ్శబ్దం!

ఆ తరువాత నా బృందంలోని సభ్యులందరూ ఒక్కొక్కరూగా వచ్చి వెయిటింగ్ రూమ్‌లో పడసాగారు. వాన్ కు జాక్, చాంద్, డిమిట్రీ వచ్చారు. చివరగా ఒక తోడేలుగా అరుస్తూ ఏనిమాయిడ్ వచ్చాడు.

మ్యూజికల్ చైర్స్ ఆటలోలా నేను ఒకరిని మార్చి మరొకరికి వంతులవారీగా ఆక్సీజన్ మాస్క్ పెట్టాను.

వారు కొద్దిగా కోలుకున్నారు, కాని ఆమ్లజనిహీనత వల్ల ఇంకా మగతగానే ఉన్నారు.

ఆపై ప్లాట్‌ఫారం మీద ఒక పెద్ద మెరుపు మెరిసింది, ఒక భారీ విస్ఫోటపు ధ్వని వినిపించింది. అది నా కర్ణభేరిని దాదాపుగా నా పగలగొట్టినంత పని చేసింది.

అప్పుడు మళ్ళీ నిశ్శబ్దం.

అప్పుడు వారు ప్రత్యక్షమయ్యారు.

అరుణ భూముల యొక్క ముసలి, వికారమైన, దుష్ట చక్రవర్తి సమూరా! పొడవైన, నల్లని ఎముకలగూడులాంటి ఆకారం, ముఖం స్థానంలో పుర్రె, దానిలో ఎరుపురంగుతో ప్రకాశించే కళ్ళు!

అతని పక్కనే ఉన్న భయంకర ఆకారాన్ని నేను మెడవరకూ మాత్రమే చూడగలిగాను… మెడ పైన మెలికలు తిరిగిన పాముల్లాంటి కేశాలు.

ఒక భయంకరమైన గతానుభవపు భావన వెంటాడింది. నేను నా పీడకలలో చూసినట్లుగా తల వెనక్కి తిరిగి ఉన్న ఆకారం సయోని అని గ్రహించాను.

సమారా ఇరువైపులా ఇద్దరు పొడవైన నల్లని హ్యుమనాయిడ్లు ఉన్నారు.

వారెంత పొడుగ్గా ఉన్నారంటే, చీకటి రాత్రిలో దీప స్తంభాలంత పొడవున్నారు. వాళ్ళ శరీరం పారదర్శకంగా ఉండి ఎముకలు కనబడుతున్నాయి. వాళ్ళ పుర్రెలు సాగదీసినట్టుగా ఉన్నాయి. దేవుడా… వాళ్ళ పుర్రె కూడా పారదర్శకంగా ఉండి మెదడులోని గైరై. సలకై కనపడుతున్నాయి. బహుశా వారి మెదడులో ఆలోచనలు మెదులుతున్నాయేమో, చిన్న మెరుపులతో మెదడు ప్రకాశిస్తోంది.

వారి కళ్లు నల్లగా ఉన్నాయి, అయితే సమూరా కళ్ళల్లా ఎరుపు రంగులో మెరుస్తున్నాయి. చంపడానికి లేదా వైకల్యం కలిగించడానికి ఆ కళ్ళు ప్రాణాంతక లేజర్ కిరణాలు వెలువరించగలవని నేను విశ్వసించాను. కుజ గ్రహం మీద బహిరంగంగా సంచరించే వ్యోమగాములు ధరించినట్లే వాళ్ళు కూడా రక్షణాత్మక దుస్తులు ధరించారు.

కాని వారు ముఖాలకి మాత్రం ఆక్సీజన్ మాస్క్‌లు ధరించలేదు.

వీళ్ళు ప్రాణవాయువు లేకుండా ఎలా జీవించగలిగారా అని ఆశ్చర్యపోయాను.

సమూరా పక్కన ఉన్న ఈ ఇద్దరు గ్రహాంతర జీవులు… బహుశా  ఆల్ఫా సెంటారీ జంట నక్షత్రాల సమీపంలోని ఆల్ఫా సిస్టమ్‌కి చెందినవారై ఉంటారు. వీళ్ళే సమూరాకి సాయం చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే స్పేస్ ఎలివేటర్ వద్ద మేం జరిపిన దాడిలో సమూరా మంత్రులు మరణించడం నాకు ఖచ్చితంగా తెలుసు.

నేను వాళ్ళని అచ్చెరువొంది చూస్తుండగా…  సమూరా గొంతు ఖంగుమంటూ మోగింది. “ఓ హనీ ఆమ్రపాలి, మోసపూరిత మానవ గుంటనక్కా…. మనం మళ్లీ కలుసుకున్నాం! మా గురించి ఆలోచించకు… ఆక్సీజన్ లేకుండా కొన్ని గంటల పాటు జీవించేందుకు మేమొక మందు సేవించాం….”

“చక్రవర్తికి నా వందనాలు!” అన్నాను. “మీకు నా అభివాదాలు. మిమ్మల్ని సజీవంగా ఉంచడమే కాకుండా, సయోనీకి పునర్జన్మ ప్రసాదించిన మీ శక్తి పట్ల ఆశ్చర్యపోతున్నాను. కానీ అలాంటి శిరస్సుతో ఆమె భయంకరంగా లేదూ? ఇక వీళ్ళెవరు? ప్రభూ… నక్కలు భూమి మీద మాత్రమే  ఉన్నాయి, కనీసం అవి తమ ఆకలిని తీర్చుకోడానికే మనుషులని తింటాయి. కుజగ్రహంలో మీరు తప్ప, నక్కలు లేవు. కాపట్యం, వంచన, అధికార దాహం… అన్నీ మీలోనే ఉన్నాయి… ఈ సమస్యలన్నిటికీ మూలం అవే. ఇప్పుడు నేను మిమ్మల్ని చంపడానికి నిశ్చయించుకున్నాను. ఇది నా ప్రతీకారం… నా తల్లిదండ్రులను చంపినందుకు నేను మిమ్మల్ని శిక్షించాలని కోరుకుంటున్నాను.

ఏదేమైనా నేను మిమ్మల్ని చంపి తీరుతాను!” అన్నాను.

ఈ మాటలు అంటూండగానే, నేను త్రాణ కోల్పోయాను, నన్ను నిస్సత్తువ ఆవరించింది. ఆక్సిజన్ లేమి… నా అంతరాత్మకి తెలుసు, నేను ఒక నిమిషం కన్నా ఎక్కువ కాలం జీవించలేనని!

ఆల్ఫా వ్యవస్థ వింత జీవులు నవ్వుతూ అడవి జంతువుల్లా ధ్వనులు చేశారు.

ఇంతలో నా భుజంపై ఏదో పొడిచినట్లయ్యింది. వాక్ కు జాక్ నా వెనుక నుంచి పాకుతున్నాడు. అతని చేతిలో ఒక సిరంజి ఉంది.

అప్పుడతను వేగంగా మా బృందంలోని మిగతా సభ్యులకు చకచకా ఇంజక్షన్ చేశాడు. ఆక్సీజన్ మాస్క్ ధరించి అందరికంటే మెరుగ్గా ఉన్న ప్రకృతీ, నోరు తెరుచుకుని ఉండిపోయిన చాంద్, శరీరం పాలిపోయి నీలం రంగులోకి మారిన డిమిట్రి, చనిపోతున్న గేదెలా మూల్గుతున్న ఏనిమయిడ్‌… అందరికీ సూదిమందు ఇచ్చాడు వాన్ కు జాక్.

అప్పుడు వాన్ కుక్ జాక్ సమూరా వైపుకు తిరిగాడు: “డోనాక్స్ ఇంజెక్షన్లు. అరుణ భూములకు చెందిన సమూరా… ఇవి మీకు బాగా తెలుసు. ఇవి కుజగ్రహంపై తయారు చేసిన అనామ్లజనకాలు. మేము నిశ్చయంగా బ్రతుకుతాం!” అన్నాడు ధీమాగా.

***

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here