అధ్యాయం 23: సౌర ఫలకాలు
బ్లాక్‌మెయిల్. కుట్ర. హత్య. అధికార దాహం.
అనేక యుగాలుగా దుష్టుల లక్షణాలు ఇవే. అతను బ్లాక్‌మెయిల్ చేశాడు. ధృవీకరించుకోడానికి నాకు సమయం లేదు.
ధృవీకరించుకోవాలంటే, అది యురేకస్‌తోనే సాధ్యమయ్యేది, దాన్ని ప్లగ్ తీసేసి, ఛార్జింగ్ లేకుండా చేసి, స్పేస్‌క్రాఫ్ట్‌లో ఓ మూలగా విసిరేశారు. ఆ చిత్రం నిజమైనదో లేదా కల్పితమైనదో యురేకస్ ఇట్టే చెప్పేసేది.
భూగోళంపై నాల్గవ సహస్రాబ్దిలో మాయలు, మంత్రాలు సాధనచేసే అనుచరుల నెట్‌వర్క్ సమూరాకి ఉందనేది స్పష్టమవుతుంది.
అక్కడే కాదు, ప్రతిచోటా ఉంది.
వారు ఐజి నెట్‌లో యూట్యూబ్ ద్వారా ఒక చిత్రాన్ని ప్రసారం చేయగలరు, దాన్ని అంతర్జాతీయంగా పోస్ట్ చేసుకోవచ్చు.
ఒకనాటి పాత తీవ్రవాద సంస్థల్లాగే.
కానీ అది ఒక బుకాయింపు కావచ్చుగా?
భూమి యొక్క దక్షిణార్ధగోళంలోని ఒక మారుమూల గ్రామం ఆమ్రపాలి నుంచి ఒకరు చంద్రుడి చీకటి వైపు అంచులో ఉన్న లా దెర్నియర్ స్టేషన్ వద్దకి ఒక చిత్రాన్ని పంపించగలరా?
సమాధానాలను కనుగొనడానికి నా మనస్సు వేగంగా పరుగెలెత్తింది.
ఇది గెలాక్సీ మెసెంజర్ ఉపగ్రహ నెట్‌వర్క్ ద్వారా సాధ్యమే.
పైగా చంద్రుడు చాలా దగ్గరగా ఉన్నాడు.
సందేశం, చిత్రం చాలా స్పష్టంగా వచ్చాయి. కుజగ్రహానికి 25 నిమిషాల సమయం తీసుకుంటే, చంద్రుడికి పైకి రావడానికి 10 నిమిషాలు మాత్రమే పట్టింది.
కాబట్టి తలలు సాగి ఉన్న ఆల్ఫా వ్యవస్థకి చెందిన మాంత్రికుల సాయం తీసుకుంటున్న తాంత్రిక చక్రవర్తిని ఎదుర్కోడం కష్టం.
చూద్దాం, అతను మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాడో?
ఒక గంటలో అంతరిక్ష నౌక చంద్రుడి చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశించింది.
“మనం చంద్రుడి చుట్టూ తిరుగుతున్నాము. హా! హా! హా!” అంటూ ప్రకటించాడు సమూరా. త్వరలో మేం సౌర ఫలకల వ్యవస్థను చేరుకుంటాం, ఇది సూర్యుడి నుండి శక్తిని గ్రహించి, చంద్ర కాలనీలకు శక్తిని పంపుతుంది.
నా మనసులో మెరుపులాంటి ఒక ఆలోచన స్ఫురించింది. నేను ప్రకృతి కేసి చూశాను.
ప్రకృతి నన్ను చూసింది.
ఆమె ముఖం ఎర్రగా ఉంది, కొంతకాలం వరకూ మెరిసిపోతూండేది. ఇప్పుడు పేలవంగా, నీరసంగా ఉంది.
“ఆ అద్దం సౌర ఫలకాలలో దాచబడి ఉంటే?” గట్టిగా అన్నాను.
“ఎలా… అయినా వాళ్ళెందుకు అక్కడే దాచవచ్చు?” అంది ప్రకృతి.
“అంతే! కక్ష్యలో సౌర ఫలకాలలో…!” అరిచింది డిమిట్రీ.
వాన్ కు జాక్, చాంద్ నిలుచున్నారు. మేమంతా కిటికీలోంచి బయటకి చూశాం.
నల్లటి ఆకాశం నేపథ్యంలో దాదాపు 50 కిలోమీటర్ల పొడవున్న ఓ మెరిసే వేదికను ఏర్పాటు చేశారు. వెండి రంగులో మెరిసిపోతూ నల్లటి ఆకాశం, మినుకుమనే నక్షత్రాలు, సుదూరంగా నీలం, బూడిద రంగులో సగం నెలవంక ఆకారంలో భూమి… ఈ నేపథ్యంలో ఆ వేదిక శూన్యంలో తేలుతోంది. మాకు దిగువన చంద్రుడు చిన్నగా కనబడుతున్నాడు, మసూచికపు మచ్చల్లా బిలాలు!
అవి చంద్రుని చుట్టూ కక్ష్యలో తిరిగే సౌర ఫలకాలు. అవి సూర్యుడి నుండి శక్తిని గ్రహించి, చంద్రుని సమీపంలోని విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేస్తాయి. ఇది చంద్రుడిపై కాలనీలకు శక్తి వనరు మాత్రమే కాదు, కానీ చాలా ఉపయోగకరమైనది. 15 రోజుల పాటు ఉండే సుదీర్ఘమైన రాత్రి గడవడానికి, చంద్ర కాలనీలకు భారీ స్థాయిలో శక్తి అవసరం అవుతుంది. యాభై శాతం శక్తి ఇక్కడ నుండి సరఫరా చేయబడుతుంది.
నాల్గవ సహస్రాబ్దిలో సౌర వ్యవస్థ యొక్క అద్భుతం.
నా మనసును చదివినట్లుగా సమూరా అరిచాడు.
“అవును, హనీ! చాలా స్వచ్ఛమైన, అమాయకమైన మాంత్రికుడివి నువ్వు! నువ్వు బయటకు వెళ్లి, చుట్టూ నడిచి… మా కోసం సౌర ఫలకాలను శోధించి, అద్దం తీసుకురావాలి. ఒక చిన్న స్పేస్ వాక్ నీ ఆరోగ్యానికి మంచిదే. కాదంటావా?”
నాకు నవ్వు రాలేదు.
“ఇతనికేమైనా పిచ్చా?” అనుకున్నాను. “ఏదైనా అంతుచిక్కని అంతరిక్ష రోగంతో బాధపడుతున్నాడా? ఏ పురాతన మాంత్రిక సంఘమైనా ఎన్నో ప్రదేశాలని వదిలి ‘ఇక్కడ’ ఎందుకు దాస్తుంది?
“మేము చంద్రుడి మీది బిలాలు, గుంతలు, పర్వతాలు అన్నీ వెతికాం. కానీ ఎక్కడా అది మాకు దొరకలేదు. నా ఆల్ఫా వ్యవస్థ స్నేహితులు – దాన్ని చూడలేకపోయినా దాని రేడియేషన్‌ని అంచనా వేయగలరు. హా! హా! ఎందుకంటే. వారు నిజంగా నీ అంత స్వచ్ఛమైన మాంత్రికులు కాదు… కానీ వాళ్ళిక్కడ ఒక అత్యంత ముఖ్యమైన ఫోర్స్ స్థాయిలను కనుగొన్నారు!” అన్నాడు సమూరా.
“ఇది ఉన్మాదం!” అన్నాను. “ఇది పైకప్పు పలకలతో కూడిన ఒక కక్ష్య స్టేషన్. వాటి మీద నేను అంతరిక్షంలో ఎలా నడుస్తాను?” అన్నాను.
“నీకు తెలుసా, నువ్వు ఇతరులను నడిపించే గొప్ప మాంత్రికుడివి. చింతించద్దు! మా ఓడతో నిన్ను కలిపే ఒక కేబుల్ ఉంటుంది. పైగా నువ్వు తిరిగి రావాలని కోరుకునే నీ ప్రేయసి ఇక్కడే ఉంటుంది… ఈ ముగ్గురు మూర్ఖులని తీసుకుని వెళ్ళి, మాకు ‘లా గ్లాస్ డి కమ్యూనికేషన్ యూనివర్సల్’ తెచ్చివ్వు!”
ఆల్ఫా వ్యవస్థకి చెందిన అఘోరా అస్థిపంజరాలు మొదట వారి భాషలో ఏదేదో మాట్లాడాయి. తర్వాత యూనివర్సల్ డిజిటల్ లాంగ్వేజ్ లోకి మారారు.
“హనీ వెళ్ళు! కేవలం చుట్టూ నడు! ఆ ఫలకం చుట్టూ నీలం కాంతి ఉంటుంది. దాన్ని తీసుకుని వెనక్కి వచ్చేయ్!”
మరో మార్గం లేదు.
“దయ చూపండి! ప్రభూ! చక్రవర్తి సమారా! దయచేసి నాతో పాటు యురేకస్‌ని తీసుకెళ్ళడానికి నన్ను అనుమతించండి” అన్నాను.
“అలాగే! మేము దానిని కేబుల్ కడతాం, అది కూడా నీతో పాటు తేలుతుంది. ఒకవేళ అది డీప్ స్పేస్‌లోకి జారిపోయినట్లయితే అంతే సంగతులు!”
కాసేపటికి నేను, కుజగ్రహవాసి వాన్ కు జాక్, చంద్రగ్రహవాసి చాంద్, జంతువులాంటి మనిషైన ఏనిమోయిడ్, నా రోబో యురేకస్ స్పేస్‌క్రాఫ్ట్ తలుపు వద్ద నిలబడ్డాం. వారు ‘వెళ్ళండి!’ అనగానే – మా గురుత్వాకర్షణ మరియు ఆక్సిజన్ సూట్లకి కేబుల్ తగిలించుకుని మేము అంతరిక్షంలోకి దూకేసాం.
***