భూమి నుంచి ప్లూటో దాకా… – 9

0
8

[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]

అధ్యాయం 22: ” బ్లాక్‌మెయిల్”

[dropcap]ని[/dropcap]శ్శబ్దం.

గొర్రెలను వధించే ముందు ఉండే నిశ్శబ్దం కాదది.

వధించడానికి ముందుగా వేటాడే జంతువుల వంటి గ్రహాంతర దుష్ట జీవులు పాటించే నిశ్శబ్దం కాదది.

చంద్రుడి ప్రకృతిదృశ్యం యొక్క నిశ్శబ్దం.

లా దెర్నియర్ స్టేషన్ వద్ద.

వాతావరణంలో శూన్యం ఉంది.

కాబట్టి ధ్వని లేదు.

తుఫాను మరియు రాళ్ళ వర్షం ఆగిపోయాయి. ఉధృతంగా వీచిన గాలి… విశ్వశక్తిని ఉపయోగించి ఆ వంచక దుష్ట గ్రహాంతర జీవులు సృష్టించిన భ్రమ అని నేను బలంగా విశ్వసిస్తున్నాను.

ఆ వంచకులు అణువులు, ప్రోటాన్లు, ఎలెక్ట్రాన్లు, బోసన్స్… ఇలా దేన్నైనా మాయచేయగలరు.

లేకుంటే, ధ్వని ఎక్కడ నుండి వస్తుంది?

కుజగ్రహ వృద్ధ తాంత్రిక చక్రవర్తికి సహాయపడుతున్న ఆల్ఫా వ్యవస్థ మాంత్రికులు కొంతసేపు మౌనంగా ఉన్నారు.

“డోనాక్స్?” సమూరా అరిచాడు.

“క్స్..క్స్ క్స్ …” ఆల్ఫా వ్యవస్థ మాంత్రికులు ఉడతల్లా అరిచారు.

అప్పుడు మానవ స్వరం వినబడింది.

“అవును! నా పెద్దమెదడుని వెతుకుతుంటే హిమోగ్లోబిన్ కంటే ఎక్కువ ఆక్సిజన్ తీసుకునే అణువు అది అనీ, గరిష్టంగా రెండు గంటలపాటు కణజాలాలకు ఆక్సిజన్ అందిస్తుందనీ తెలుస్తోంది. డోనాక్స్ అనేది కుజగ్రహం మీది మానవ కాలనీకి చెందిన అరుణ భూముల సామ్రాజ్యపు డ్రగ్ అథారిటీ వారి అనుమతి పొందిన – అనాక్సియాకు విరుగుడు మందు. అవును, వాళ్ళు చనిపోరు. కానీ మేము హనీని చంపాలని అనుకోవడం లేదు. మిగతావాళ్ళంతా మాకు నిరుపయోగం. వాళ్ళంతా సామాన్ల లాంటి వారు. వాళ్ళనీ మనతో తీసుకుపోదాం. బ్రతికినంత కాలం బ్రతుకుతారు.”

సమూరా తన చేతులను ఊపాడు.

వెనుతిరిగి ఉన్న గబ్బిలంలా వికటంగా నవ్వింది సయోనీ.

నవ్వుతో తల కదిలిపోతుంటే, కృశించిన రొమ్ములతో ఆమె ఛాతీ ఎగిసిపడుతోంది.

ఇంతలో భుంమనే ధ్వని వినిపించింది, ఓ మెరుపు కనిపించింది.

“హనీ ఆమ్రపాలి… రా…  హాస్యగాళ్ళ లాంటి నీ తోటి గ్రహాంతర తాంత్రిక మిత్రులనూ తీసుకుని రా… స్వచ్ఛమైన, నిస్వార్థమైన మాంత్రికుడికే ఆ అద్దం కనబడుతుందని మా పుస్తకం చెబుతోంది. రా! మనం అక్కడికి వెళ్ళడానికి వాహనం ఉంది. నీతో అవసరం పడింది…”

ఒక క్షణంలో నేను చాలా ధృఢమైన నైలాన్ తాళ్ళతో కట్టబడి ఉన్నాను. మరో క్షణంలో ఒక పెద్ద రైలు బోగీ పరిమాణంలో ఉన్న స్పేస్ క్రాఫ్ట్ ముందు పడ్డాను.

మిగతావాళ్ళు కూడా వచ్చి గట్టి శబ్దంతో నా పక్కనే నేల మీద పడ్డారు. ఆ విసురుకి మేమంతా లేచి నిలబడ్డాం.

“లోపలికి పదండి!” ఆల్ఫా వ్యవస్థకి చెందిన మరో గ్రహాంతరవాసి అన్నాడు, బహుశా స్పేస్ క్రాఫ్ట్ సిబ్బందిలో ఒకరై ఉంటాడు.

కేవలం నడవడానికి వీలుగా తాళ్ళతో కట్టి ఉన్న పాదాలతో అడ్డదిడ్డంగా నడుస్తూ నేను అక్కడున్న కాబిన్‌లోకి ప్రవేశించాను.

మిగతావాళ్ళని లోపలికి తోశారు. అమ్మయ్య… ఆ క్యాబిన్‌లో ఆక్సీజన్, గురుత్వాకర్షణ మరియు చల్లని వాతావరణం ఉన్నాయి. నేను ఒక బంకర్ మీద కూర్చున్నాను, ప్రకృతిని నా పక్కన కూర్చోబెట్టారు. అది రెండు వైపులా బంకర్ లాంటి సీట్లు ఉన్న సైనిక రవాణా విమానంలా ఉంది. ఒకరి తరువాత ఒకరుగా వాన్ కు జాక్, చాంద్, డిమిట్రీ – చివరగా బుసలుకొడుతున్న ఏనిమాయిడ్ లోపలికి ప్రవేశించారు.

అప్పుడు క్యాబిన్ చివరలో సమూరా కనిపించాడు. వికారమైన రూపంతో సయోనీ అతని పక్కనే ఉంది.

“హలో! ప్రభూ! నా త్రాళ్లను విప్పదీయచ్చు కదా? మీ ఆల్ఫా వ్యవస్థ మిత్రులతో మీకా పిచ్చి అద్దం దొరకలేదా? గెలాక్సీని లేదా కనీసం గ్రహాలను జయించటానికి ఆ అద్దం ఎలా సహాయం చేస్తుందో చెప్పండి? మళ్ళీ నేనే ఎందుకు? చంద్రుడి చీకటి వైపున మీరు వెండి కొవ్వొత్తిని కోల్పోయారని నాకు తెలుసు” అన్నాను.

“తాళ్ళు విప్పండి! విప్పండి!” అంటూ నా బృంద సభ్యులందరూ అరిచారు. ప్రకృతి స్వరం ఒక పిచ్చుక గొంతులా ఉంటే, ఏనిమాయిడ్ స్వరం ఎద్దు రంకెలా ఉంది.

“నోరుముయ్యి! నువ్వో గుంటనక్కవి! ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకంతా తెలుసు! భూమి మీద నాకు గూఢచారులున్నారు. న్యూ హోప్ నగరంలో ఈ పథకాన్ని రచించి మిమ్మల్ని ఇక్కడికి పంపారని నాకు తెలుసు! మీరు నన్ను చంపడానికి వచ్చారు! కానీ ఓ విషయం గుర్తుంచుకో – నాకు చావులేదు, నేను శాశ్వతంగా ఉంటాను. చంద్రుడు, టైటాన్, గనీమేడ్ మీద దాచి ఉంచిన అన్ని అద్భుత వస్తువులను పొందుతాను. ఇప్పుడు నాకు ఆల్ఫా వ్యవస్థకి చెందిన అదృశ్య మాంత్రిక సైన్యం సహాయపడుతోంది. కాస్త కష్టమయింది… కానీ చంద్రుడి చీకటి వైపున ఉన్న ఆ దౌర్భాగ్యపు నేరస్తులు.. అఘోరా అఘోరీలను చంపాం… వెండి కొవ్వొత్తి నాకు తిరిగి లభించింది. దాని సహాయంతోనే మేము మళ్ళీ ఇక్కడ మీ జాడలు గుర్తించాము. నేను మళ్ళీ నా అరుణ భూములను జయించి, ఆ పాత కుక్క మీరోస్‌ని చంపి, వాడి కళ్ళను పెకిలిస్తాను. అప్పుడు ఏమి జరుగుతుందో నువ్వు ఊహించలేవు.

ఒకసారి నేను అరుణ భూముల సింహాసనం అధిష్టించాకా, సౌర వ్యవస్థలోని వివిధ గ్రహాలకు చెందిన, అనూహ్యమైన శక్తులున్న నా రహస్య అనుచరులందరూ విరుచుకుపడతారు!

వారు తమ ప్రభుత్వాలను, సైన్యాన్ని, శాస్త్రవేత్తలను పట్టుకుంటారు. భూమి, చంద్రుడు, టైటాన్, గనీమీడ్, ఇంకా దుర్బలుడైన కాన్‌స్టాన్‌టైన్ పాలిస్తున్న కుజగ్రహపు మానవ కాలనీ… ఇవన్నీ ఓ భయానక కాళరాత్రిని అనుభవిస్తాయి….

మీరు వాళ్ళ శక్తులను ఊహించలేరు…. నా స్లీపర్ సెల్స్ యొక్క శక్తులు… వారు అగ్నిని సృష్టించగలరు, నీటిని నియంత్రించగలరు, ఆకాశాన్ని విచ్ఛిన్నం చేయగలరు, భూమి మీద రంధ్రాలు చేయగలరు, వాయువుతో ఆడగలరు! సాధారణ మానవులచే నివసించే గ్రహాలన్నీ నా అనుచరుల ఆధీనంలోకి వస్తాయి. విశ్వశక్తి యొక్క అనుచరులు …

వాళ్ళందరినీ నేను కుజగ్రహం మీది అరుణ భూముల నుండి నియంత్రిస్తాను.

వృద్ధాప్యం, చావు సమీపిస్తుండడంతో నేను మొదట అమరత్వం కోరుకున్నాను. కానీ, ఓ ధూర్త మానవా! అమృత ఔషధం త్రాగితే శక్తులు కోల్పోతానని చెప్పకుండా నువ్వు నన్ను మోసం చేశావు. ఒరే కుక్కా… నీ దుష్ట భార్య నా కుమార్తెని చంపింది. నేను ఆల్ఫా వ్యవస్థ లోని అఘోరా సమూహాన్ని ఎలా బుజ్జగించానో, ఎలా ప్రార్థించానో ఆ అంగారకుడికే తెలుసు! ఆల్ఫా వ్యవస్థ లోని  ‘కెప్లర్ బి’ లోని గుహలలో నివసించే అఘోరాలు ఆమెను పునరుజ్జీవనం చేయడంలో నాకు సహాయం చేశారు

నేను అమరుడిని. దాచబడిన ఆరు అద్భుత వస్తువులు చేజిక్కించుకోవాలని అనుకుంటున్నాను. తద్వారా – నా అనుచర గణాలను, నా సైన్యాన్ని నియంత్రిస్తాను.”

“అవును అవును. సమూరా!” అన్నాను. “కుజ గ్రహ మాంత్రిక చక్రవర్తి…. కాని నేను మిమ్మల్ని చంపుతాను. మీరు గొప్ప మాంత్రికులే అయినా మీరు దుష్టులు. మీరు నా తల్లిదండ్రుల్ని హతమార్చారు. ఇప్పుడు మీరు తీవ్రవాదంతో సౌర వ్యవస్థ యొక్క గ్రహాల నాగరికతని నాశనం చేసి వాటిని ఆక్రమించుకోవాలని అనుకుంటున్నారు. కాబట్టి అద్భుత వస్తువులు గురించి మర్చిపొండి. మా చేతుల్లో మీ మరణం కోసం వేచి ఉండండి! ఈ వెర్రి గ్రహాంతర అస్థిపంజరాలనే మీరు మాంత్రికులుగా భావిస్తే… ఇక్కడ నా భార్య ప్రకృతి, కుజ గ్రహానికి చెందిన వాన్ కు జాక్, చంద్ర గ్రహానికి చెందిన శక్తివంతమైన చాంద్ మరియు పశుశక్తి ఎక్కువ ఉన్న ఏనిమాయిడ్… ఇంకా గొప్ప మాంత్రికులు. నేను ప్రతీకారం కొరకు వచ్చాను. మిమ్మల్ని చంపేస్తాను… ఇది నా వాగ్దానం!” అన్నాను.

నేనిలా అంటూండగానే నా శరీరం మొత్తం ఎరుపు రంగులోకి మారిపోయింది. నైలాన్ తాళ్ళు నిశ్శబ్దంగా కాలిపోయాయి. భూమి యొక్క ఎవరెస్ట్ పర్వతమంత శక్తిని కలిగి ఉన్నానని భావించాను. నా చేతులు భారీగా మారాయి, ఒక్క దెబ్బతో నేను వెయ్యి టన్నుల శక్తిని వెదజల్లగలను. నా కళ్ళ నుంచి ఓ లేజర్ కిరణం వెళ్ళి సమూరా పొడవాటి పుర్రెకు నేరుగా తాకి ఎర్రటి మెరుస్తున్న రంగులో వెనక్కి వచ్చింది.

సమూరా మూలిగాడు. తన దుర్బలమైన చేతిని విసిరాడు.

అతను చావడని గుర్తొచ్చింది.

పొడగరులైన ఆల్ఫా వ్యవస్థ గ్రహాంతర మాంత్రికులు వారి విచిత్రమైన భాషలో కీచుమనే స్వరంలో అరుస్తూ మాకేసి చేతులు ఊపారు. ఒక ఎరుపు జ్వాల గుండ్రంగా సుడులు తిరుగుతూ వచ్చి నా ముఖం మీద, ప్రకృతి మొహం మీద తగిలింది.

నా జీవితంలోకెల్లా అత్యంత ఎక్కువగా పీడించిన బాధను అనుభవించాను. నా మొత్తం ముఖాన్ని నిప్పులలో వేయిస్తున్నట్టుగా ఉంది.

శక్తినంతా కూడదీసుకుని ‘అన్నిహిలాటియో టొటాలిస్…’ అనే మంత్రాన్ని ఉచ్చరించబోయాను. ఇంతలో ఒక చెయ్యి నా భుజం మీద పడింది.

ప్రకృతి అంది, “హనీ, ఈ స్పేస్‌క్రాఫ్ట్ కాలిపోతుంది. దయచేసి నియంత్రించుకో…”

నేను సగంలో ఆపేశాను, మంత్రంలోని ‘మోర్టాలిస్..’ అనే మాట నా నోట్లోంచి బయటకు రాలేదు…  నా గొంతు బలహీనపడింది, నా ముఖం కాలింది.

అప్పుడు ఆ ఎరుపు జ్వాలలు వాన్ కు జాక్, చాంద్‌ని తాకాయి. వారు గట్టిగా అరిచి పడిపోయారు. డిమిట్రి దాదాపుగా తన పూర్తి శక్తిని సంతరించుకుని, పైకి లేచి నిలబడింది. ఆమెది దట్టమైన మెరిసే చర్మం. ఆమె టైటాన్‌లో తయారుచేసిన గట్టి దుస్తులను ధరించి ఉంది. ఆమె తలమీది కొమ్ముల నుంచి నిప్పురవ్వలు బయటికి వచ్చాయి.

ఆమె ఆల్ఫా వ్యవస్థకి చెందిన ఆ ఇద్దరు దుష్ట మాంత్రికుల వైపు రెండు వేళ్లు చూపిస్తూ, టైటానియన్ భాషలో ఒక శాపం పలికింది.

ఒక మెరుపు వెళ్ళి – సాగి ఉన్న తలలలోని మెదడు కనిపించే ఆ దుష్ట మాంత్రికుల పుర్రెలను తాకింది. వారి కళ్ళు పైకి తేలాయి, మెదడు యొక్క సలకై, గైరై… రాత్రి ఆకాశంలోని మెరుపుల్లా కనబడ్డాయి.

అప్పుడు వాళ్ళు ఒక నిమిషం కదలకుండా ఉన్నారు.

సయోని మా వైపు తల ఉండేలా తిరిగింది. గట్టిగా కేక పెట్టింది, కానీ ఆమె చేతులు వెనుక వైపు ఉన్నాయి.

ఇది దుష్ట మాంత్రిక శక్తి యొక్క భయానక ప్రదర్శన! హాస్యంగా ఉన్నా భీతిగొల్పేది.

“ఆపు డిమిట్రీ! ఆపు! ఆపేయ్.. మేము ఇక్కడ పోరాడకూడదు! మేము ఆక్సిజన్ లేకుండా జీవించము. మాట్లాడుకుందాం” అంది ప్రకృతి.

అప్పుడు నిశ్శబ్దం.

చిన్నగా టిక్ టిక్ టిక్… అడుగుల శబ్దం వినబడింది.

“అమ్మయ్య! మాస్టర్. నేనొచ్చేసా… ఆలస్యమైంది. మొత్తానికి నేను మిమ్మల్ని కనుగొన్నాను. కానీ నాకు ఛార్జింగ్ తక్కువగా ఉంది” అన్న మాటలు వినిపించాయి.

ఇంకెవరు? అన్నీ తెలిసిన యురేకస్.. లోహపు మనిషి.

అది నేరుగా ఒక గోడ మీద ఉన్న ప్యానెల్ వద్దకు వెళ్లింది. వెంటనే విద్యుత్ ప్లగ్ అవుట్‌లెట్‍లో ఒక మెటల్ రాడ్‌ని ఉంచింది. దాని యాంటెన్నా నుండి చాలా తక్కువ కాంతిలో మెరుపులు వస్తున్నాయి.

మెరుపులు, మంటలను వెదజల్లుకుంటున్న ఈ గొడవనంతా సమూరా మూర్ఖంగా, బలహీనంగా చూస్తుండిపోయాడు.

అకస్మాత్తుగా సమూరా నిటారుగా నిలబడ్డాడు. అతని కళ్ళు ఒక అద్భుతమైన ఎరుపురంగులో ప్రకాశించాయి. ఫ్రంట్ కాబిన్ నుండి అప్పుడే వచ్చి అక్కడ నిలబడ్డ ఒక పైలట్‌కేసి చేయి ఊపాడు.

“ఇంటర్ గెలాక్టిక్ మానిటర్ ఆన్ చేయండి. త్వరగా.”

“కానీ ప్రభూ! ఇక్కడ అగ్ని పోరాటం వద్దు. స్పేస్‌క్రాఫ్ట్ పేలిపోతుంది.”

“అవును, అవును! నాకు తెలుసు. మేము ఆపేశాం. ఇక ఇక్కడ పోరాడటానికి విశ్వశక్తిని ఉపయోగించం. కానీ మానవా! హనీ నువ్వు మాతో సహకరించాలి. తప్పదు.”

“నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో” అని అరవబోతుండగా… కాబిన్ యొక్క రెండు మూలలలోనూ ఉన్న మానిటర్లపై బొమ్మలు ప్రత్యక్షమై వాటిలో కదలిక వచ్చింది.

చిత్రాలు మొట్టమొదట అస్పష్టంగా ఉన్నాయి. తర్వాత స్పష్టంగా కనిపించసాగాయి.

ఎంత స్పష్టంగా ఉన్నాయంటే ప్రకృతి ఆ బొమ్మలను సులువుగా గుర్తించి, ఓ భయంకరమైన కేక పెట్టేంత.

భారతీయ గ్రామస్థులు ధరించే దుస్తులను ధరించి, ఎర్ర తలపాగాతో ఉన్న ఒక వృద్ధుడిని ఇద్దరు ముసుగు వ్యక్తులు పట్టుకుని ఉన్నారు, వాళ్ళ చేతుల్లో రెండు లేజర్ తుపాకులు ఉన్నాయి.

ఆ గ్రామీణుడు భీతి చెందిన కళ్ళతో కెమెరాలోకి చూస్తున్నాడు.

“అమ్మా! నా ప్రియమైన ప్రకృతీ, హనీ! మీరు దీనిని చూస్తుంటే, నా గురించి చింతించకండి. వాటిని చంపి, ఏం చేస్తారో చేసుకోనివ్వండి. మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. ఇక్కడ మమ్మల్ని ఎందుకు బంధించారో అర్థమవుతోంది. నా తల తీసేసినా మీరు పట్టించుకోకండి!”

ఆయన మహా. ప్రకృతి వాళ్ళ నాన్న. ప్రకృతి వెక్కి వెక్కి ఏడుస్తోంది.

“ఆ… పం… డి…” అంటూ అరిచింది. ఆమె కళ్ళలోంచి ఒక ఎరుపు లేజర్ కిరణం వెళ్ళి సమూరా ఛాతిలో తగిలింది. అతను కొద్దిగా వెనక్కితగ్గి గట్టిగా నవ్వాడు.

“ఈ విషయంలో నీ భర్తకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. నాకు మరణం లేదు. లేకుంటే భూమికి చెందిన అత్యంత శక్తివంతమైన మహిళ నుండి వెలువడిన మృత్యు కిరణం దెబ్బకి నా గుండె ఆగిపోయి ఉండేది. హా! హా! హ!” అంటూ నవ్వాడు సమూరా. అప్పుడు అతను తన గొంతును సవరించుకుని అరిచాడు.

“అమ్రాపాలికి చెందిన వ్యర్థమైన, నిరుపయోగమైన స్త్రీవి నువ్వు! యువరాణి సయోనికి ఒక పనిమనిషిగా ఉండవలసినదానికి, ఆమె పాదాలను బంగారు పళ్ళెంలో కడిగవలసినదానివి! మీరు ఆమెను చంపివేసారు. ఇప్పుడు నీ భర్త… ఈ కుక్కను మాకు సహకరించమను. అద్దం పొందడానికి మాకు సహాయం చేయమని చెప్పు. లేదంటే క్షణాల్లో మీ తండ్రి తల మొండెం నుండి వేరవుతుంది. హా! హా!” అంటూ నవ్వాడు. “నా ఆదేశం అక్కడికి చేరుకోవడానికి ఒక నిమిషం మాత్రమే పడుతుంది. ఇది చంద్రగ్రహం. ఇక్కడ నుండి భూమి కేవలం 10 లక్షల కిలోమీటర్లు మాత్రమే. హా! హా! హా! నీకు మీ నాన్నంటే ఇష్టం లేదు? నువ్వు కృతజ్ఞత లేనిదానివా? నువ్వు అతని మేనకోడలు అయినప్పటికీ నిన్ను స్వంత కుమార్తెగా పెంచినందుకు ఇదేనా నువ్వు అతనికిచ్చే ప్రతిఫలం?” అన్నాడు సమూరా.

ప్రకృతి కోపంతో గర్జించింది.

“లేదు, లేదు లేదు. హనీ సహాయం చేస్తాడు! నేను కూడా సహాయం చేస్తాను! ఎట్టి పరిస్థితులోనూ మీరు ఆ అద్దం పొందుతారు. ముందు మా నాన్నని వదిలేయండి. దయచూపండి!”

నాకంతా అర్థమైంది. “సరే చక్రవర్తి. మీరే మళ్ళీ గెలిచారు. నాకా అద్దం నిజంగా కనబడితే… అది మీదే! నేను మీ పుస్తకాలలో ఎంపిక చేసినవాడను. ధన్యవాదాలు. మహాని వదిలిపెట్టి, అద్దం ఎక్కడ ఉందో నాకు దారి..” అన్నాను.

సమూరా తన చేతులను రుద్దుకుని, ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. నిర్జనమైన అడవిలో వంద హైనాలు అరిచినట్టుగా నవ్వాడు.

“యో! హో! బయల్దేరండి!”

మానిటర్ మీద చిత్రం మసకబారింది.

స్పేస్ షిప్ ఇంజన్లు కూడా గర్జించాయి. మేము ఒక ఊపుతో గాలిలోకి లేచాం.

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here