భూమి నుంచి ప్లూటో దాకా… – 9

0
3

అధ్యాయం 24: ఎంపికైన వ్యక్తి

అంధకారపు అంతరిక్షం నేపథ్యంలో అది ఒక సొగసైన వెండి సముద్రంలా ఉంది. మేము అంతరిక్షంలో తేలుతూ, కక్ష్యలో పరిభ్రమిస్తున్న సౌర ఫలకాలను చేరుకున్నప్పుడు, వాటి నుండి అద్భుతమైన తెల్లటి కాంతి విడుదలవుతోంది. మేము… ముసుగులు ధరించిన నలుగురుం.. నల్లని మచ్చల వలె ఆ ఫలకలపైకి ఎక్కాం. మేము ఒకరితో ఒకరు మాట్లాడుకోగలిగాం కానీ పవర్ జనరేటర్ల శబ్దం మాత్రం మాకు వినబడడం లేదు. సమురా యొక్క స్పేస్‌షిప్ దూరంగా తేలుతోంది. మా దుస్తులకి తగిలించిన తాళ్ళు దానికి జోడించబడ్డాయి.

“నేను కదిలే వేదికను చూస్తూ ఒకే స్థలంలో ఉంటాను, ఆ అద్దం కోసం చూస్తాను” అన్నాను. ఆ సౌర ఫలకల చుట్టూ నేను పరిగెత్తలేను ఎందుకంటే కుక్కని గూడుకి కట్టేసినట్టు, నన్ను స్పేష్‌షిప్‌కి కట్టేసారు. మేమంతా స్పేస్‌షిప్ పాటు కదులుతున్నాం.

యురేకస్ కూడా స్పేస్‌షిప్‍కి తగిలించిన కేబుల్‌తో శూన్యంలో తేలుతుంది.

“మిత్రులారా, సౌర ఫలకలలో నీలం లేదా ఆకుపచ్చ కాంతివలయం కోసం చూడండి. అది విశ్వశక్తి నాణ్యతని ప్రతిఫలిస్తుంది. మిర్రర్ ఆఫ్ యూనివర్సల్ కమ్యూనికేషన్ ఇక్కడ ఉన్నట్లయితే బాగా ప్రకాశిస్తూంటుంది” అన్నాను.

కొన్ని నిమిషాలు గడిచాయి. సౌర ఫలకాలు కదులుతూనే ఉన్నాయి. చంద్రుడి కాలంలో ఒక గంట గడించింది. నాకేదైనా కనబడుతుందని నేను ఊహించలేదు.

వాన్ కు జాక్, ఇతరులు నా వెనుకగా తేలుతున్నారు. చాంద్ తన చంద్రుని మాండలికంలో ఉచ్ఛస్వరంలో వణుకుతున్న స్వరంతో ఒక పాట పాడాడు.

“చంద్రుని ధ్వనులలో ఏకత్వం లేదని; బిలాలు లోతుగా ఉన్నాయనీ, పర్వతాలు ఎత్తుగా ఉన్నాయనీ; అది చల్లగా ఉందనీ; కానీ తన ప్రేమ శాశ్వతమైనదనీ ఆ పాటకి అర్థం…” అని యురేకస్ అనువదించింది. “మిస్టర్ చాంద్ చంద్ర మాండలికంలో పాప్ గాయకుడు!” అంది.

అప్పుడు కనబడిందది. కదిలే ప్లాట్‌ఫాం మీద అన్ని తెల్లని సౌర ఫలకాల మధ్యగా ఆకుపచ్చ రంగును చూడగలిగాను.

అది సమీపంలోకి, మరింత దగ్గరగా వచ్చింది. అది నా పాదాల క్రిందకి వచ్చినప్పుడు అది లేత ఆకుపచ్చ మరియు నీలంలో మెరుస్తూ కనబడింది.

“హుర్రే!” అరిచాను.

ఇతరులు దానిని చూడలేకపోవడంతో ఎలాంటి శబ్దాలు చేయలేదు.

నేను నా బలమంతా ఉపయోగించి ఆ ఫలకని బయటకి లాగాను.

అది చాలా దృఢంగా ఉంది, అతి కష్టం మీద వెలికి వచ్చింది.

దాంతో పాటు ఒక పురాతన చర్మపత్రపు కాగితం ఎగిరి వచ్చింది. ఇప్పుడు నాలో వివేకం ఉంది, దాన్ని అందుకుని చదివాను.

స్పేస్ స్యూట్‌కి అమర్చిన గాగుల్స్ ద్వారా నేను బూడిదరంగులో ఉన్న గతకాలపు చర్మపత్రం మీదున్న నల్ల అక్షరాలను చదివాను…

“ఈ సౌరశక్తి ఫలకల దాకా వచ్చి దీన్ని కనుగొన్న ఓ భాగ్యశాలీ!  ఇదే యూనివర్సల్ మిర్రర్. మీరు సౌర వ్యవస్థలో ఏ ప్రదేశన్నైనా; పాలపుంత గెలాక్సీలోని కొన్ని ప్రదేశాలను దీనితో చూడవచ్చు. కానీ మీరు దీన్ని మంచి కోసమే ఉపయోగించాలి. దురాశ లేదా బ్లాక్‌మెయిల్ లేదా హత్యల కోసం ఉపయోగించకూడదు. మీరు స్వార్థ ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగిస్తే మీ కంటిచూపు పోతుంది.”

“ఓహ్!” అంటూ మిగతావాళ్ళతో అన్నాను “నాకా అద్దం దొరికింది!”

ఈసారి నేను ఆ అద్దాన్నీ, దాంతో పాటు ఆ చర్మపత్రాన్ని సమూరాకి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను. అతను తన కంటి చూపును కోల్పోడం నాకిష్టం లేదు.

అతనెలాగూ దుర్మార్గుడే.

ఇంతలో యురేకస్ “అభినందనలు మాస్టర్! విశ్వశక్తి తరంగాలని నేనిప్పుడే గ్రహించాను. మీకా అద్దం లభించింది!” అంది.

స్పేస్‌షిప్ నుండి మరొక గొంతు వినబడింది. “నేను చక్రవర్తి సమూరాని. హనీ, ఓ మానవా! నీకు అభినందనలు! నేను తగినంత ధన్యవాదాలు చెప్పలేను. ఇప్పుడు దాన్ని సురక్షితంగా స్పేస్‌షిప్‌లోకి తీసుకురా. వెంటనే! జిత్తులు వద్దు!”

అయితే నా ప్రకృతి వాళ్ళ దగ్గరే ఉంది. నేను వారికా అద్దం ఇవ్వకపోతే, ఆమ్రపాలిలో నా మామగారు మాహా తన ప్రాణాలు కోల్పోతారు.

“ప్రభూ, మేము వస్తున్నాము” నేను అరిచాను. “ఎవరికీ ఎటువంటి హాని చేయకండి! నా ప్రకృతికి ఏ ప్రమాదం తలపెట్టకండి” అన్నాను.

“సరే! ఏ ఇబ్బంది లేదు! రండి! నువ్వు తెలివైనవాడివి! హా! హా! మంచి వృద్ధ మాంత్రికుల సంఘం వారి ఈ సరదా వస్తువులను కనుగొనేందుకు నిజంగానే నువ్వు ఎంపికైన వ్యక్తివి”.

మేమంతా వెనుతిరిగి, తేలుతూ వ్యోమనౌక వైపు కదిలాం. నౌక సమీపంలోకి రాగానే మా అందరినీ లోపలికి లాగారు. అప్పుడు ఎయిర్ లాక్ తెరుచుకుంది, మేమంతా స్పేస్‌షిప్‌లోకి ప్రవేశించాం.

నేను సమూరాకి నమస్కరించి, పెద్ద కార్బన్ నానో ప్లేట్ లాగా ఉన్న ఆ అద్దాన్ని అతని ముందు ఉంచాను. జోస్యంతో ఉన్న చర్మ పత్రాన్ని కూడా అందించాను.

“హా! హా! ఇప్పుడు నువ్వు ప్రతిదీ చెబుతున్నావు! దుర్మార్గాలు చేయకూడదని ఇది చెబుతోంది. ఆ వృద్ధ మాంత్రికులు మూర్ఖులు. మంచి చర్యలతో విశ్వాన్ని ఎవరు జయిస్తారు? యుద్ధంలోనూ ప్రేమలోనూ ప్రతీదీ న్యాయమైనదే!” అని చెబుతూ “హా! హా!” నవ్వాడు సమూరా.

సాగిన తలలో ఉన్న ఆల్ఫా వ్యవస్థ మాంత్రికులు నవ్వుతున్నట్టుగా శబ్దాలు చేశారు.

“ఇప్పుడు నేను దీన్ని పరీక్షిస్తాను” అంటూ, “నాకు గనీమీడ్ రాజధానిని చూపించు” అని సమూరా అద్దాన్ని ఆదేశించాడు.

ఏనిమాయిడ్ గుర్రుమన్నాడు. అతను గనీమీడ్ నుండి వచ్చాడు.

గురుగ్రహపు ఉపగ్రహమైన గనీమీడ్ రాజధాని నగరం అద్దంలో ప్రత్యక్షమైంది. భూమికి చెందిన మానవులు నివాసం ఏర్పరుచుకున్న నివాస కాలనీ ఒకటి కనబడింది. నేను కాస్త వొంగి ఆసక్తిగా చూశాను.

భారీ పర్వత లోయలు, గుమ్మటపు ఆకారంలోని నిర్మాణాలు, గనీమీడ్ రాజభవనం గోచరించాయి. కొమ్ములతో ఒకదానినొకటి ఢీ కొడుతున్న గేదెల లోహపు ముద్ర కనబడింది.

నేను ఆశ్చర్యపోయాను.

“ఎందుకు గనీమీడ్?” అంటూ అరిచాను.

“ఎందుకంటే మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ‘టూట్ డి స్యూట్’ (ఫ్రెంచ్ భాషలో ‘వెంటనే’).  గురుగ్రహపు మంత్రదండం కోసం వెళుతున్నాము! హా! హ!”

“వద్దు! ప్రభూ! ముందు మమ్మల్ని విడుదల చేయండి! మహా క్షేమంగా ఉన్నారని నాకు చూపించండి!”

తెర మీద మామిడి చెట్టుతో ఉన్న అమ్రాపాలి గ్రామం బొమ్మ వచ్చింది. మహా ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నారు. ఆయన రోడ్డు మీద నడుస్తున్నారు. కత్తులు ధరించిన ఉగ్రవాదులు ఆయన పక్కన లేరు.

“ధన్యవాదాలు! ఇప్పుడు ప్రకృతిని వదిలి మనం వెళ్దాం!”

“కుదరదు…! ఎలా వదిలేయగలను? నా ప్రయాణంలో మీరిద్దరూ ముఖ్యమైనవాళ్ళే. ఈ గొప్ప అంతరిక్ష నౌకలో మీరు ఆ అద్భుత వస్తువులని కనుగొనడానికి గనీమీడ్‌కు, టైటాన్‌కు వస్తారు, ఆ తర్వాత నేను మిమ్మల్ని వదిలేస్తాను! ఇది అర్థం చేసుకోలేనంత మూర్ఖుడివి కాదు నువ్వు” అన్నాడు సమూరా.

నా బృంద సభ్యులందరూ వారి భాషల్లో నిరసనలగా అరిచారు.

ప్రకృతి తన మాతృభాష హిందీ లోకి మారింది. “నహీ! నహీ! యహ్ ఖతర్నాక్ కో మార్ డాలో!” అంది.

నేను నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాను.

“ఓహ్! మనకి వేరే మార్గం లేదు మాస్టర్! ఈ స్పేస్‍షిప్‌లో మీరు పోరాడలేరు లేదా విశ్వశక్తి ఉపయోగించలేరు. మీరేదైనా గ్రహం యొక్క నేలమీద దిగితే ఏవైనా ప్రణాళికలు రూపొందించవచ్చు! తప్పించుకోవడానికి ప్రణాళికలు! ఇక్కడ మీరూ, మీ బృందం మనుగడ సాగించలేరు. ఇది ఆల్ఫా వ్యవస్థకి చెందిన స్పేస్‌షిప్. మీరు విశ్వశక్తిని ఉపయోగిస్తే కాలిపోతుంది. అయితే వాళ్ళు కాలిపోరు, కానీ మీరు… “

నేను లొంగిపోయాను.

“సరే! ప్రభూ! కనీసం ప్రకృతికి స్వేచ్ఛ కల్పించండి! మేము మీతో వస్తాము. మంత్రదండమో, ఇంకేదో.. దాన్ని కనుగొంటాము. ఇది నా వాగ్దానం” అన్నాను. ప్రకృతి బంధనాలు విడిపోయాయి, నా వైపుకు నడిచివచ్చి నన్ను హత్తుకుంది. స్పేస్‌షిప్ గట్టిగా గర్జించి ఆస్టరాయిడ్ బెల్ట్ దిశలో కదిలింది. ముందుగా గురుగ్రహం చేరుకుని, అక్కడ నుండి దాని ఉపగ్రహమైన గనీమీడ్ చేరుకోవడానికి ప్రయాణం సాగించింది.

సమూరా, ఆల్ఫా అస్థిపంజర మాంత్రికుల వికటాట్టహాసాలు; తలవెనక్కి తిరిగి ఉన్న మంత్రగత్తె సయోని కేకలు మా ప్రయాణంలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.

***

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here