భౌతిక దూరం..!

0
7

[dropcap]రం[/dropcap]గనాథం మనసు కుడితిలో పడ్డ ఎలుకలా గిల, గిల లాడసాగింది..

అచేతనంగా వచ్చి మంచంలో వాలిపోయాడు. తాను చేసిన నేరమేమిటో బోధపడ్డం లేదు. తన అర్థాంగి అనసూయమ్మ శాశ్వతంగా సెలవు తీసుకున్న తరువాత పరిణామాలు కళ్ళల్లో కదలాదసాగాయి..

***

ఆరోజు అనసూయమ్మ సంవత్సరీకం..

భోజనాల అనంతరం బంధువులు వెళ్తూ.. వెళ్తూ.. పదో, పరకో.. రంగనాధం చేతిలో పెడ్తున్నారు. ప్రక్కనే కూర్చున్న ఇరువురు కొడుకులు డబ్బును లెక్కిద్దామన్నట్టుగా వంగి, వంగి చూడసాగారు. రంగనాథం చూసీ చూడనట్లు గమనించ సాగాడు.

రాత్రి పడుకోబోయే ముందు కొడుకులిద్దరూ కూడబలుక్కొని తండ్రితో సమావేశమయ్యారు. ఎలా మొదలు పెట్టాలా..! అన్నట్లుగా పెద్దకొడుకు కోదండం తమ్ముని వంక చూశాడు. కానివ్వమన్నట్టుగా కామేశం తలూపేసరికి ధైర్యంగా విషయం కదిలించాడు కోదండం.

“నాన్నా.. తమ్ముడు నేను కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మీకు గూడా సమ్మతంగానే ఉంటుంది” అంటూ ప్రారంభించాడు. “నాన్నా.. అమ్మ పోయాక మీరు ఇక్కడ ఒంటరిగా ఉండడం మాకెవ్వరికీ నచ్చడం లేదు. మీరు చెయ్యి కాల్చుకోవడం మీ కోడళ్ళు బాధ పడ్తున్నారు” అంటూ ఇంకా చెప్ప బోతున్న పెద్ద కొడుకు మాటలను మధ్యలోనే అడ్డుకుంటూ..

“చూడు బాబు. మీ నిర్ణయం ఏమిటో నేను ఊహించగలను. ప్రతీ ఇంట్లో ఇది మామూలే, మీరు అడిగే వరకు రాగూదడనే నేను ఈ వీలునామా వ్రాసి ఉంచాను. మీ నిర్ణయం ప్రకారం నేను మీదగ్గరే ఉంటాను. నాకు మీరు గాక మరెవ్వరున్నారు” అని వీలునామాతో బాటు మరో కవరు చేతికిచ్చాడు రంగనాథం.

‘ఇదేంటి నాన్నా..” అంటూ కవరు తీసుకుంటూ అడిగాడు కామేశం.

“ఇందాక మన బంధువులు నాకిచ్చిన కట్నాలు.. ఇవి గూడా నాకెందుకు? వాని కంటే విలువైన వాళ్ళు నా మనుమలూ, మనుమరాండ్లు” అంటూ చిరునవ్వు నవ్వేడు.

తాము ఊహించిన దాని కంటే అధిక ప్రయోజనమే జరిగిందన్నట్లు వీలునామా చదువుతూ పెడ్తున్న కోదండం ముఖకవళికలను చదువసాగాడు కామేశం.

“మీ ఇష్టమే నాన్నా. మేము ఎప్పుడు కాదన్నామని..” అంటూ తృప్తిగా లేచి పడక గదుల్లోకి పరుగెత్తారు. ఈ విషయం వారి, వారి అర్ధాంగుల చెవుల్లో ఊదాలని.

రంగనాథం మనసు తేలిక పడి లేచి వెళ్ళి తన మంచంలో వాలి పోయాడు.

మూడు నెలలు దాటినా కొడుకుల ముచ్చట లేదు.

ఫోన్ శబ్దానికి ఆలోచనల నుండి తెప్పరిల్లాడు రంగనాథం.

***

‘నాన్నా మిమ్మల్ని తీసుకు వెళ్దామని ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇంతలో కరోనా వైరస్ మూలాన నిన్న లాక్‌డౌన్ ప్రకటించారు. భౌతిక దూరం పాటిస్తున్నాం. వస్తామన్న నమ్మకం లేదు’ అంటూ వాట్సాప్ మెసేజ్ చూసి మంచంలో అలాగే అతుక్కు పోయాడు రంగనాథం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here