జీవితాన్ని బయోస్కొప్ నుంచి చూడడం

    2
    7

    [box type=’note’ fontsize=’16’] గొప్ప సినెమాలు తరచుగా రావు. కాని వచ్చిన మంచి చిత్రాలను మనం ఆదరించాలి కదా. ఇవి చూస్తే ఇలాంటివి మరో నాలుగు వస్తాయంటున్నారు పరేష్ ఎన్. దోషిబయోస్కోప్‌వాలా” సినిమాని సమీక్షిస్తూ. [/box]

    [dropcap]కొం[/dropcap]తమంది గొప్ప కథకులు వుంటారు. కొన్ని గొప్ప కథలు వుంటాయి. వాటికుండే వొక లక్షణం కాలం సవాలును యెదురుకొని నిలవడం. శరత్ బాబు “దేవదాసు”, రవీంద్రుని “కాబూలీవాలా” లాంటివి. అవి ఈ రోజు చదివినా అంతే కదిలిస్తాయి, వొకసారి చదివేసిన కథలే మళ్ళీ చదివినా మళ్ళీ కదిలిస్తాయి. కాలం చెల్లని కథలు. సరే ఇవి వెండితెర మీద కూడా చాలా సార్లు యెక్కాయి. దేవదాసు లేటెస్టు అవతారం దాస్‌దేవ్ కాస్త శరత్తునీ, షేక్స్‌పియరునీ కలిపి తీసింది. దీన్ని పరిగణలోకి తీసుకోకపోతే 2009లో వచ్చిన అనురాగ్ కాశ్యప్ “దేవ్ డి” దేవదాసుకి సమకాలీన రూపం. బాగా వచ్చిన రూపం కూడా. అలాగే కాబూలివాలా 1961లో వచ్చినది కూడా చాలా బాగుంటుంది. అందులో బలరాజ్ సహాని నటనను, సలిల్‌దా పాటలను మరచిపోవడం సాధ్యమా! ఇవి ఇప్పటి తరం దర్శకులను కూడా ఆకట్టుకొని, సమకాలీన పరిస్థితుల్లో ఆ కథను నిలిపే సాహసానికి ఉసిగొలుపుతాయి. ఆ పని ఈ సారి దేబ్ మెధేకర్ చేశాడు.

    కాబూలివాలా కథ గుర్తుండే వుంటుంది. కలకత్తా వీధుల్లో, మధ్యాహ్నపు నిర్మానుష్యంలో కాబూలివాలా గొంతు వినిపిస్తే రచయిత అయిదేళ్ళ కూతురు మిని కిటికీ దగ్గరికెళ్ళి అతన్ని రమ్మంటుంది. అతను రావడం, డ్రై ఫ్రూట్స్ అమ్మి, ఆమె చేతిలో మరో నాలుగు పెట్టి, నాలుగు కబుర్లు చెప్పి, నవ్వి నవ్వించి వెళ్తుంటాడు. అలా ఆ ఇద్దరి మధ్యా స్నేహం కుదురుతుంది. అఫ్ఘానిస్తాన్ నుంచి వచ్చిన ఆ పఠాను యేదో గొడవ వచ్చి ప్రమాదవశాత్తు వొకరిని చంపిన కారణంగా జైలు పాలవుతాడు. శిక్ష గడువు పూర్తయ్యాక అతను వెతుక్కుంటూ మిని ఇంటికెళ్తాడు. అక్కడంతా పెళ్ళి శోభ, సందడి. అతన్ని లోపలికి అనుమతించడు వాచ్‌మన్. ఆ గొడవకి రచయిత బయటకు వస్తాడు. కాబూలివాలా ని గుర్తుపట్టి లోపలికి తీసుకెళ్తాడు. వొకసారి మినిని చూడాలని వుందంటాడు. రచయిత మినిని పిలిపిస్తాడు. వధువు అలంకరణలో వున్న ఆమె వచ్చి సాంప్రదాయం ప్రకారం ఆ పెద్దాయన్ని నమస్కరిస్తుంది. ఆమె వెళ్ళిపోయినా కాబూలివాలా షాక్ నుంచి తేరుకోడు. యేదో ఇద్దామని తెచ్చింది ఇవ్వకుండానే, చేతులతో వెనుక పెట్టుకుని దాయడం చూసి రచయిత ఆట పట్టిస్తాడు. తెచ్చింది ఇవ్వవా అని. అతని చేతిలో వో అయిదేళ్ళ పాపకు సరిపోయే గవును వుంటుంది. వలవలా యేడుస్తాడు. తర్వాత నెమ్మదిగా చెబుతాడు. తన దేశంలో మిని వయసు కూతురిని వదిలి ప్రవాసంలో డబ్బు సంపాదించడానికి వచ్చాడనీ, మినిలో తన కూతురినే చూసుకున్నాడనీ చెబుతాడు. ఇప్పుడు తన దేశంలో తన కూతురు కూడా పెళ్ళికి యెదిగి పోయి వుంటుందని చెప్పి యేడుస్తాడు. తన సంచిలోంచి వొక గుడ్డ ముక్క తీసి చూపిస్తాడు. అందులో చిన్న పాప కుంకుమలో ముంచి అద్దిన అరచేతి ముద్రలుంటాయి. రచయితలోని తండ్రి తనదగ్గరున్న కొంత సొమ్మును ఇచ్చి, తన దేశానికి వెళ్ళి కూతురు పెళ్ళి జరిపించమంటాడు. అందుకు గాను తన కూతురి పెళ్ళి శోభలో లైటింగు వగైరా హంగులు లేకపోయినా బాధలేదు అని భావిస్తాడు. ఇది కథ. నేను చదివి చాలా సంవత్సరాలయ్యింది. ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టే వుంది. ఈ కథ యేకకాలంలో రెండు పనులు చేసింది. లోపల పునాదులు కూలిపోయేంత దుఃఖం, వొక తండ్రిని తన కూతురి దగ్గరకు చేర్చే సాంత్వన వొకేసారి కలుగుతాయి. వొకసారి హృదయాన్ని తాకిన కథ మరచిపోతరమా?

    ఇది యెందుకు వ్రాశానంటే దీన్ని ఆ కాలం నుంచి తీసి ప్రస్తుత కాలంలో దర్శకుడు యెలా పెట్టాడు అన్నది బోధపడాలని. 1990 సంవత్సరంలో కలకత్తాలో కథ. ఇక్కడ హిందూ ముస్లిం అల్లర్లు జరిగిన కాలం. అక్కడ అఫ్ఘానిస్తాన్లో మరో రకం సంక్షోభం. రెహ్మత్ ఖాన్ మరికొందరు ఆ దేశం వదిలి భారతదేశానికొస్తారు. అనుకోకుండా ప్రయాణంలో తారసపడిన ఇద్దరు స్త్రీలు తాము కలకత్తాకెళ్ళాలి, తోడు రమ్మంటే వస్తాడు. అతని స్వభావమే అంత, యెవరినీ కాదనలేడు, అందరికీ అండగా నిలుస్తాడు. ఈ కాలంలో యెండిన పళ్ళు అమ్మడం బదులుగా అతను వొక బయోస్కోప్ వాడిగా చూపించారు. పిల్లలకు బయోస్కోప్ చూపించి, నవ్వి, వాళ్ళనీ నవ్వించి సంతోషిస్తాడు. అలా మినితో స్నేహం కుదరడం, మినిలో తన కూతురిని చూసుకోవడం జరుగుతాయి. మూల కథలో లాగే, అతని చేత వొక ప్రమాదంలో వొకని మృత్యువు సంభవిస్తుంది. రెహ్మత్ ఖాన్ కి జైలు శిక్షా పడతాయి. మిని పెద్దదవుతుంది. పై చదువులకోసం పేరిస్ వెళ్తుంది. ఈలోగా ఇండియా నుంచి అఫ్ఘానిస్తాన్ వెళ్ళే విమానం కూలి మిని తండ్రి చనిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో మిని భారతదేశానికి వస్తే ఇంట్లో నౌఖరు తో పాటు వో ముసలాయన, మతిస్థిమితం తప్పిన రెహ్మత్ ఖాన్ వుంటాడు. అతని ఆరోగ్యం దృష్ట్యా గడువుకు ముందే విడుదల చేయాలని, తాను గార్డియన్‌గా వుంటానని మిని తండ్రి కోర్టు కేసుల ఫలితం ఇది. కాని ఆమె అతన్ని గుర్తు పట్టదు. మొదట చిరాకు పడుతుంది. నెమ్మదిగా అతని గురించి ఆరా తీయడం, వ్యక్తులను కలవడం, మాట్లాడడం, తీగంతా లాగడం. మూల కథలో మిని తండ్రికి కలిగిన మానవీయ భావనలే ఆమెకు కలుగుతాయి. తండ్రీ కూతుళ్ళను కలపడం తన కనీస బాధ్యతగా భావిస్తుంది. అఫ్ఘానిస్తాన్ వెళ్తుంది. కాని అక్కడ సమాధుల మధ్య వో శిలాఫలకం రెహ్మత్ కూతురి పేర వుంటుంది. ఇప్పుడీ వార్త ఆ తండ్రికి చెబితే తట్టుకోగలడా? అందుకే అక్కడ తీసిన వీడియోలు అన్నీ వొక క్రమంలో కూర్చి ఈ అమ్మాయే నీ కూతురు అంటుంది. అల్జిమెర్స్ కారణంగా అన్నీ మరచిపోయినా వొకటి అతనికి గుర్తే వుంది. మినిని బయోస్కోప్‌లో చూడమంటాడు. అందులో వో అయిదేళ్ళ పాప నృత్యం చేస్తూ వుంటుంది!

    సినెమా చాలా సంతృప్తికరంగా వుంది. కొంత అసంతృప్తి వున్నప్పటికీ. మూలకథలో ఆ పఠాను అఫ్ఘాన్ నుంచి వచ్చినవాడే. అప్పట్లో ఆ దేశమ్నుంచి యెండు ఫలాలు తెచ్చి అమ్మడం అవీ వున్నాయి. ఆ రాజకీయ, భౌగోళిక వాస్తవాలు తెరవెనుక వుంటే, ముందేమో మానవీయ విలువలు. కాబూలివాలా, మిని మధ్య, కాబూలివాలా మిని తండ్రి మధ్య. ఈ సినెమా వరకు వచ్చేసరికి కొంత కథను విస్తరించాడు. హిందూ ముస్లిం గొడవల కాలంలో కలకత్తాలోకూడా కర్ఫ్యూ విధిస్తారు. అలాంటి వో సందర్భంలో స్కూల్ నుంచి ఇల్లు చేరని, గొడవలలో చిక్కుకున్న మినిని తన ప్రాణాలు లెక్క చేయకుండా ఇల్లు చేరుస్తాడు రెహ్మత్ ఖాన్. అలాగే అఫ్ఘాన్లో తాలిబన్ల పరిచయం కూడా ఇస్తాడు దర్శకుడు. బయోస్కోప్ కు ముందు రెహ్మత్ ఖాన్ తన ఇంట్లోనే ప్రొజెక్టర్ యేర్పాటు చేసుకుని భారతీయ సినెమాలు ప్రదర్శిస్తుంటాడు. తాలిబన్లు దాన్ని పాపంగా పరిగణించి నిషేధిస్తారు. కాని విద్రోహభావాలున్న రెహ్మత్ కొనసాగిస్తాడు. తాలిబన్లు ఆ ఇంటిని కూల్చేసి, అతన్ని చితక బాది, అతని కూతురిని కూడా చంపేస్తామని బెదిరిస్తారు. కాని అణిగే వ్యక్తిత్వం కాదు అతనిది. ఆ మిగిలిన రీలు ముక్కలు తీసుకుని, బయోస్కోప్ తయారుచేసుకుని పిల్లలకు చూపిస్తుంటాడు. ఇది అతని వ్యక్తిత్వం. ఆ పాత్రకుండే షేడ్స్ అన్నీ డాని డెంజొంగప్ప చాలా బాగా చూపించాడు. ఆశ్చర్యంగా అతని గురించి చాలా సమాచారం మిని వివిధ వ్యక్తులను కలిసినపుడు వాళ్ళ నోటి వెంట వినడమే. కాని బొమ్మ పూర్తిగా బాగా కట్టింది.

    సినెమాలో బయోస్కోప్‌ని యెందుకు పెట్టాడు? దానికి ప్రత్యేకమైన అర్థం కల్పించాడా. మనం జీవితాన్నీ, మనుషులను రకరకాల అద్దాల్లోంచి చూడట్లేదా? చాలా సార్లు పొరబడట్లేదా? పొరపాటు చేసినా మనలోపల యేదో కదిలి, మనల్ను మళ్ళీ సరైన దారిలో పెడుతుందే! రెహ్మత్ కు ఫొటోగ్రఫి సామగ్రి గురించి మంచి అవగాహన వుంటుంది. మిని తండ్రి కూడా వో పేరుమోసిన ఫొటోగ్రాఫరు. అతనికి కావలసిన రకం అద్దాలు దుకాణదారుడు లేవంటే, అక్కడున్న రెహ్మత్ వో పరికరాన్ని చూపించి ఇది ఆ పని చేస్తుందంటాడు. అంటే దృష్టికి సంబంధించి, కళ్ళకీ-వస్తువుకీ మధ్య వుండే అద్దం పనితీరునీ ఇద్దరూ అర్థం చేసుకోగలవారే. కానీ ఇద్దరూ మామూలు మనుషులే. ముఖ్యంగా మిని తండ్రి. జైలు నుంచి పారిపోయి వచ్చిన రెహ్మత్ ను కూర్చోబెట్టి తను లోపలికెళ్ళి పోలీసులకు కబురు చేస్తాడు. వచ్చాక రెహ్మత్ కథంతా చెప్పేసరికి విషయం అర్థమవుతుంది, కాని అప్పటికే పోలీసులొచ్చి అతన్ని అరెస్టు చేస్తారు. ఇక ఆ అపరాధ భావన అతన్ని వెంటాడుతుంది. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికే అతని జైలు గడువు తగ్గించడానికి కేసులు వేయడం, చివర్న అతని కూతురిని వెతకడానికి అఫ్ఘానిస్తాన్ వెళ్ళబోవడం (ఆకస్మిక మృత్యువుకు ముందు). ఇవే తర్వాత మినిని కూడా తండ్రి చేయబోతున్న పనిని తలకెత్తుకునేలా చేస్తుంది.

    చాలా చిన్న చిన్న విషయాలున్నాయి చెప్పుకోవడానికి. ఈ తీగంతా లాగడం తన తండ్రి గదిలో వున్న ఫైళ్ళను చూడడంతో మొదలు. మిని లోపలికెళ్తుంది. తన తండ్రి కుర్చీలో కూర్చుంటుంది. ఆ కూర్చున్న క్షణాలు కాస్త వివరంగా చూపిస్తాడు దర్శకుడు, ఇప్పుడామె తండ్రి స్థానంలో కూర్చుని మొదలు పెట్టబోయే ప్రాయశ్చిత్తానికి నాంది. మరో సీన్ లో ఆమె ఇంటికి రాగానే కాలికేదో తగిలి పడిపోతుంది. చూస్తే స్పృహలో లేని రెహ్మత్. ఇలాంటి విశేషాలు చాలా వున్నాయి. యెక్కువ వివరించడానికి ప్రయత్నిస్తే పరిధి మించి పోతుంది. రాధికా ఆనంద్‌తో కలిసి దేబ్ స్క్రీన్‌ప్లే చాలా బాగా వ్రాశాడు. అందరి నటనా బాగుంది. నాకు యెప్పుడూ వొకేలా కనిపించే టిస్కా చోప్రా కూడా ఇందులో బాగా నచ్చింది. సందేశ్ శాండిల్యా సంగీతంలో గుల్జార్ పాటల గురించి చెప్పేదేముంది! ఇక అసంతృప్తి గురించి కూడా చెప్పాలి కదా. మూలకథలో చివర్న కాబూలివాలా గురించిన వాస్తవం కంటతడి పెట్టిస్తే; అతన్ని కూతురు దగ్గరికి చేర్చే ఉపకారం తన ఇంట పెళ్ళి ఖర్చులు తగ్గించుకుని ఆ సొమ్ము అతనికివ్వడం మనకంట ఆనందభాష్పాలు వచ్చేలా చేస్తుంది. అలాంటిది ఇందులో ఆ తండ్రి తొందరపాటు నమ్మశక్యంగా లేదు. అందులో కర్ఫ్యూ కాలంలో రిస్కు తీసుకుని పాపను ఇంట చేర్చిన మనిషి రెహ్మత్. కూతురి దృష్టికోణంలో సినెమా కథను తీర్చబోయి ఈ మలుపు ఇచ్చాడు, కాని దీన్నైనా ఇంకోలా వ్రాసివుంటే బాగుండేదనిపించింది. అఫ్ఘానిస్తాన్ వాస్తవికత నేను యెరుగను, కాని కలకత్తాని చాలా బాగా చూపించాడు. దాదాపుగా ఆ నగరం కూడా వో పాత్ర రూపం తీసుకుంటుంది. నేను 80లలో, 90లలో, నాలుగేళ్ళ క్రితం కూడా చూసిన మనిషిగా, దాన్ని గుర్తించి చెబుతున్నాను. చాలా చిన్న చిన్న విషయాలు జాగ్రత్తగా తెరకెక్కించాడు.

    గొప్ప సినెమాలు తరచుగా రావు. కాని వచ్చిన మంచి చిత్రాలను మనం ఆదరించాలి కదా. ఇవి చూస్తే ఇలాంటివి మరో నాలుగు వస్తాయి. దేబ్ మేధేకర్ పేరు గుర్తుపెట్టుకోతగ్గ పేరే!

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here