బ్లాక్‌మెయిల్ – మరికొన్ని వికారాలు

    0
    6

    [box type=’note’ fontsize=’16’] “ప్రతి పాత్ర మనసులోనూ గురివిందకున్నట్టే మచ్చ వుంటుంది” అంటూ డార్క్ కామెడి సినెమా “బ్లాక్‌మెయిల్‍“ని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]

    ఇదివరకు “ఢిల్లీ బెల్లి” డార్క్ కామెడి తీసిన అభినయ్ దేవ్ ఈ సారి మరో డార్క్ కామెడి “బ్లాక్‌మెయిల్” తీశాడు. సినెమాను మూడొవంతు తగ్గించివుంటే “చాలా బాగుంది” అనిపించేది. కొన్నేళ్ళ క్రితం అనురాగ్ కాశ్యప్ “అగ్లీ” అని వొక డార్క్ సినెమా తీశాడు. మనిషిలో వుండే చీకటి కోణాలని ఆవిష్కరిస్తూ తీశాడు, చూస్తే వొళ్ళు జలదరిస్తుంది, భయం పుట్టుకొస్తుంది. అల్లాంటి కొన్నిటిని మాత్రం స్పృశిస్తూ హాస్యంగా తీశాడు అభినవ్ దేవ్ కాని అంతగా ప్రభావవంతంగా లేదు. నిడివి పెరిగిపోవడం కచ్చితంగా వొక కారణం.

    ఇర్ఫాన్ ఖాన్ వో మధ్యతరగతి ఉద్యోగి. పెళ్ళై యేడేళ్ళు. కాని భార్యా భర్తల మధ్య దగ్గరితనం తక్కువ, దూరాలెక్కువ. తల మీద మోయలేని అప్పుల భారం రకరకాల అప్పుల EMIల రూపంలో. అఫీసులోనే చాలా రాత్రిదాకా వీడియో గేం ఆడుకుంటూ గడిపి, తర్వాత యెవరి బల్ల మీదనుంచో వారి భార్య ఫొటో తస్కరించి బాత్రూంకెళ్ళి యెదుటి గోడకు తగిలించి స్వయంతృప్తి పొందుతూ వుంటాడు. వొకరోజు ఇంటికి తొందరగా వెళ్ళడం జరిగి, తను రహస్యంగా పడకగది-వంటగదుల మధ్య గోడకు పెట్టుకున్న కంతలోంచి చూస్తే భార్య కీర్తి కుల్‌హారి అరుణోదయ్ సింఘ్ తో పడుకుని కనిపిస్తుంది. చంపేంత ధైర్యం లేదు. కట్టాల్సిన అప్పుల చిట్టా తలలో తిరుగుతుంటుంది. వాళ్ళకు బుధ్ధి రావాలి, తన ఆర్థిక సమస్యా తీరాలి వొకే దెబ్బకు అని చెప్పి సింఘ్‌ని బ్లాక్‌మెయిల్ చేస్తాడు, లక్ష రూపాయలిమ్మని. అతనొక సన్నాసి. ప్రేమించిన కీర్తిని చేసుకోలేకపోయినవాడు, డబ్బుకోసం వో గూండా కూతురిని చేసుకుని ఆ ఇంట్లో కుక్కలా పడివున్నవాడు. భార్య నుంచి డబ్బులు రాలవు. ఇక గత్యంతరం లేక అతను కీర్తినే బ్లాక్‌మెయిల్ చేస్తాడు. అలా అలా ఆ చక్రంలో కీర్తి, ఇర్ఫాన్ స్నేహితుడు, కలిసి పనిచేస్తున్న వో స్నేహితురాలూ, వో డిటెక్టివూ ఇలా అందరూ చిక్కుకుంటారు. ప్రతి పాత్ర మనసులోనూ గురివిందకున్నట్టే మచ్చ వుంటుంది. డబ్బులు చేతులు మారుతుంటాయి. ఈ నాటకాంతానికి వో హత్య కూడా జరిగిపోతుంది.

    పేరుకి బ్లాక్‌మెయిల్ గాని వేరే దరిద్రాలు కూడా వున్నాయి. ముఖ్యంగా మనుషుల మధ్య వుండాల్సిన నమ్మకం (trust) అన్నది యెక్కడా కనబడదు. పైగా డబ్బు అందరినీ కోతుల్లా ఆడించడమొకటి. ఇర్ఫాన్ తనను తాను తృప్తి పరచుకునే పధ్ధతి, ముందునుంచే అతను భార్యపై చాటుగా నిఘా పెట్టడానికి యేర్పరుచుకున్న తీరు, అతని స్నేహితుడి ఆడవాళ్ళ పిచ్చి, ఆ సహోద్యోగిని డబ్బు వ్యామోహం, అరుణోదయ్ సింఘ్ ఆడవాళ్ళ పిచ్చీ, కీర్తికి భర్తచాటు వ్యవహారం నడపడం ఇలా వొక్కొక్కళ్ళూ బయటపడతారు. వీళ్ళ వరకూ పెట్టిన హాస్యం బానే వుంది. సింఘ్‌ని డబ్బడిగితే నా దగ్గర ప్రోటీన్ కోసం కూడా డబ్బుల్లేవంటాడు (అతను బాడీ బిల్డరు). కీర్తితో డబ్బు సర్దుబాటు గురించి రహస్యంగా మాట్లాడుకోవడానికి ఇంకే చోటూ దొరక్క సినెమాకెళ్ళినా, అంత టెన్షన్లోనూ అతని ధ్యాస వేరే అమ్మాయిలమీదే వుంటుంది. అస్సలు నవ్వురాకపోగా చిరాకెత్తించేది అతని ఆఫీసు వ్యవహారం. వాళ్ళు వొక టాయ్లెట్ పేపర్ తయారు చేసి మార్కెట్ చేద్దామని చూస్తుంటారు. ఈ వ్యవహారం చాలా ఫుటేజి (డిగిటల్ సినెమాలో మెగాబైట్లనాలేమో) తినేస్తుంది. కథతో సంబంధం లేకపోగా విసుగెత్తిస్తుంది. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కీర్తి తల్లిదండ్రుల గురించి. తండ్రికి పక్షవాతం వచ్చింది. ఆమె మీద పని భారం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కూతురు డబ్బు సాయం కోసం వస్తే యెక్కడ చావనూ అంటుంది. ఆ సీన్లు చాలా బాగా వచ్చాయి. కీర్తికి తన భర్త, తన ప్రియుడు, తన తల్లిదండ్రులు యెవరిమీదా ఆపేక్ష వున్నట్టు తోచదు. భర్త దగ్గర డబ్బు అడగడానికి తండ్రి ఆసుపత్రి పరీక్షల ఖర్చనీ, ఆపరేషన్ ఖర్చనీ అబద్ధాలాడుతుంది.

    సినెమా ఒక్క ఇర్ఫాన్ గురించి చూడొచ్చు. అతనిది కూడా అంత బలమైన పాత్ర కాదు, కాని వేరేవాళ్ళు చేస్తే చూడలేమేమో. మిగతా పాత్రలు వోకే. వో రెండు పాటలు బాగున్నాయి. అమిత్ త్రివేది సంగీతం బాగుంది. జయ్ ఓఝా ఫొటోగ్రఫి బాగుంది. యెక్కువ ఆశలు పెట్టుకోకుండా చూస్తే బానే వుంటుంది.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here