బొమ్మల ఊరు

24
8

[dropcap]ప్ర[/dropcap]కృతి ప్రేమికుల జంట ఒకటి, తాము చేసిన ప్రయాణాల గురించి వ్రాసిన పుస్తకం చదివాను. ఆ వెంటనే, పురుడు పోసేక బొడ్డుపేగును కత్తిరించి, తల్లినీ, బిడ్డను వేరు చేసేటంత సులువుగా, స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా నా బిజీ దైనందిన జీవితాన్ని ఒక వారం పాటు రద్దు చేసుకున్నాను.

ఒకే ఒక బ్యాక్‌ప్యాక్ -రెండు జతల బట్టలు, సబ్బు, దువ్వెన, బైనాక్యులర్స్‌తో బయలుదేరాను. నా దగ్గర పనిచేసే అన్నవరం, ఇంకా తక్కువ వస్తువులతో ఉన్న మరో సంచితో నా వెనకాల నుంచున్నాడు. మేం ఇద్దరం కలిపి రైలెక్కేసాం. ఈశాన్య రాష్ట్రాల వైపు – గౌహతి వరకు రైలు. ఆ తర్వాత నా ఇష్టం.

రెండో రోజు సాయంకాలానికి ఒక పల్లెటూరు చేరాం. స్వతహాగా చురుకైన అన్నవరం, ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ ఇంటిని వాకబు చేసి, రాత్రి బస ఏర్పాటు చేశాడు.

***

ఉదయాన, డాక్టర్ ఇంట్లో ఆయన భార్య కట్టి ఇచ్చిన రొట్టెలు, ఆమ్లెట్లు పెద్ద పెద్ద బాదం ఆకులను పోలిన ఆకుల మధ్య ఒక జనపనార సంచిలో పెట్టుకుని సర్దుకున్నాం. బ్రెడ్, పాలు అల్పాహారంగా తినేసి, షూ లేస్ బిగించుకుని బయలుదేరాం.

రకరకాల ఆకుపచ్చలు… వందల రకాల మొక్కలు, చెట్లు, తీగలు, మరెన్నో పూలు. అప్పుడప్పుడు ఎదురు వచ్చే కోతుల మూక. మాకు అప్పగించిన ఆ ప్రాంతపు వ్యక్తి సుమారు 40 ఏళ్ల వాడు. మా ముందు నడుస్తూ, దారి చూపిస్తున్నాడు. వచ్చీరాని హిందీ, ఇంగ్లీషు ముక్కలతో కాసేపు, సంజ్ఞలతో కాసేపు, అన్నవరం కబుర్లాడుతూ ఉండగా మేము సాగిపోతున్నాం.

నాతో నేను కూడా, మాట్లాడుకోకుండా కళ్ళతో చూడడం, కాళ్ళతో నడవడం మాత్రమే చేస్తున్నాను.

చెట్ల మధ్య అప్పుడప్పుడు నీళ్ళ చప్పుడు – తెరవెనుక నర్తకి కాలి అందెల మోత లాగా.

ఆకాశమంతా ఆకుల, కొమ్మల తెర – చిన్నప్పుడు ఇంటి ముంగిట మంచానికి నాలుగు కర్రలు పెట్టి, అమ్మమ్మ కట్టిన దోమతెరలను జ్ఞప్తికి తెస్తూ.

అడపా తడపా రకరకాల పక్షుల కూతలు – తొమ్మిదో నెల వచ్చాక పొట్టలో నుంచి కాళ్లతో తంతూ, చెయ్యి అందిస్తూ, తన ఆగమనాన్ని నిర్ణయించమని సవాలు విసిరే శిశువుకు మల్లే!

కొత్త ధ్వని వినగానే నేను ఆగడం, అన్నవరం కూడా ఆగడం, అతడిని అడగడం – వివిధ రకాల పక్షుల పేర్లు. మనుషుల స్వరాలు, బాగా కిక్కిరిసి ఉన్న స్టేడియం లోనో,సినిమా హాలు ఆవరణలోనో విన్నా ఇంత అందంగా ఉండదు… ఎందుకో ?! అనుకున్నాను నేను.

ఓ రెండు మూడు గంటలు నడిచేసరికి అలసట కమ్మింది. వాళ్లాగారు, నన్ను చెట్టు పక్కన కొమ్మ మీద కూర్చోబెట్టారు.

“మరో రెండు గంటలు నడిస్తే, ఒక రహదారి వస్తుంది. అక్కడకు వెళితే జనావాసం తగులుతుంది” అన్నాడాయన. రెండు పళ్ళు తీసి ఇచ్చాడు. మన ప్రాంతపు గులాబ్‌జామ్ కాయల్లా ఉన్నాయి. పళ్ళు తినేసరికి, ప్రాణం తేలిక పడింది. మళ్లీ నడక.

ప్రయత్నపూర్వకంగా నా దురలవాటు కెమెరాని వదిలేసి, బైనాక్యులర్స్ తెచ్చుకున్నందుకు నన్ను నేను అభినందించుకున్నాను. ఇప్పుడు నా కళ్ళు నా 53 ఏళ్ల జీవితంలో చాలా తక్కువ సార్లు చేసిన పని చేస్తున్నాయి. నిండారా, రెప్పలు విప్పార్చి చుట్టూ చూడడం.

నా గుండె లయబద్ధంగా కొట్టుకుంటోంది, ఊపిరి కాస్త లోతుగా, చిన్నశబ్దంతో లోపలికి, బయటికి తిరుగుతోంది. నాలో నేనే నవ్వుకున్నాను! దాదాపు 20 ఏళ్ల క్రితం, కాలేజీ గ్రౌండ్లో పరుగెత్తినపుడు, నాకు వినబడిన నా గుండె చప్పుడు!

“సార్!” అన్నాడు అన్నవరం. కళ్ళతోనే ‘ఏం లేదు’ అన్నాను. నా దగ్గరగా వచ్చి, “మరీ ఇంతలా,ఏం మాట్లాడకుండా మిమ్మల్నెపుడూ చూడలేదండీ! ఆయ్!” అన్నాడు. నా బేగ్ తీసుకోబోతున్న అతని చేతులని వారించి, “బాగుందిరా! అచ్చంగా, ఆ పుస్తకంలో లాగా ఉంది. ఇంత చక్కటి అడవి! కల నిజమైనట్టు ఉంది!” అన్నాను

వాడు తల ఊపి, ఆ గ్రామస్థునితో కలిసి ముందుకు పోవడానికి రెడీ అయ్యాడు. నా చేతి కర్రను ఒకసారి లాగి తీసుకుని, నేల మీద తాడించి, దానికున్న చిన్న చిన్న పురుగులతో ఉన్న తడి మట్టిని పక్కనున్న చెట్టు ఆకులతోటి తుడిచేసి, మళ్లీ నా చేతికి ఇచ్చాడు. నేను మెచ్చుకోలుగా చూశాను.

కనుచూపు మేరలోకి ఒక రహదారి వచ్చింది, అప్పుడు, అతడు, “ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఊరు ఉంది. నిజానికి ఇది మా ఊరే! మీరు వస్తానంటే, ఇవాళ మా పూర్వీకుల ఇంట్లోనే రాత్రి బస చేద్దాం!” అన్నాడు. అన్నవరం ఉత్సాహంగా నా వైపు చూసాడు. భాష పరిమితులు లేని వాళ్ల దోస్తీని నేను ఎప్రూవ్ చేశాను.

కొంచెం పక్కకు వెళ్లి, కాలి దోవన నడిచాము. మరో 40 నిమిషాల్లో, సుమారుగా హుస్సేన్ సాగర్ అంతటి ఆవరణలో ఓ పల్లెటూరు: అడవి బాటకి ఓ పక్కన, కొండవాలు మీద మొలిచింది. ఓ నలభై – యాభై ఇళ్ళు ఉంటాయి. పైకప్పులు ఏటవాలుగా…వాన నీరు కిందకి జారేందుకు. ఒకేలాంటి ఇళ్ళు, ఎంత బాగున్నాయో!!

మఱ్ఱిచెట్టు మొదట్లో పుట్టగొడుగులు కలిసికట్టుగా ఉన్నట్టు. నాగమల్లి చెట్టు బోదె మీద, ‘శివలింగం పూలు’ అనే వాళ్ళం కదా! అవి గుంపుగా ఉన్నట్టు. ఒక క్షణం ఆగి ఆ చిత్రాన్ని మనసులో దాచుకున్నాను. మధ్యాహ్నపుటెండ ఆ ఊరికి ఎడం పక్కన కొండని ప్రేమగా తడుముతోంది. మాటిమాటికీ గుంపుగా ఎగిరే పిట్టల రెక్కల నీడలు – చిన్నప్పుడు వీధిలో వేసిన తోలుబొమ్మలాటలో తెరమీది బొమ్మల్లా వరసగా కదులుతున్నాయి.

పరుగులాంటి నడకతో కొండవాలున కాసేపు దిగాక ఊరు మా దగ్గరకు వచ్చేసింది.

***

కళ్లకు కొట్టొచ్చినట్టుగా, ముందస్తుగా మాకు కనబడిందేమిటంటే: మూడు – నాలుగు అడుగుల ఎత్తులో మనుషుల రూపాలు! మాంఛి ఎరుపు, పసుపు, ఊదా రంగుల బట్టలు వేసుకుని, కొందరు ఆడపిల్లలు, కొందరు మగపిల్లలు.

ఒక క్షణం అబ్బురపడ్డాను.

అవి కదలడం లేదు! దాంతో, మరుక్షణం భయపడి పోయాను.

అన్నవరం మమ్మల్ని నడిపించిన మనిషిని వదిలేసి, నా దగ్గరగా చేరి, నా మోచేతి మీద చెయ్యేసి, “ఏంటండీ అలా అక్కడక్కడా పిల్లల బొమ్మలను నిలబెట్టారు?” అన్నాడు. నేను భుజాలెగరేసాను.

దిష్టికా? అందానికా? ఏదైన పండుగా? వ్యవసాయ కాలంలో ప్రత్యేకంగా చేసే పూజలకా? నా మనసు పరిపరి విధాల పోయింది. నాలుగిళ్ల కొకటి… చిన్న పిల్లలవి, రకరకాల భంగిమల్లో, కొన్ని చోట్ల రెండేసి మాట్లాడుకుంటున్నట్టు ఉన్నాయి. రంగురంగుల గుడ్డ పీలికలతోటి, కొంచెం గడ్డి తోటి, చేసినట్టు ఉన్నాయి. మన ఊళ్లో చలివేంద్రం పెట్టినట్టు – అటు,ఇటు, పైన వెదురుతో తడికలు కట్టి ఉన్నాయి.

మేమిద్దరం అవాక్కయిపోయాం.

మా మార్గదర్శి దాదాపు ప్రతి సందులో రెండిళ్లకోసారి ఆగి, వాళ్ళ భాషలో ఏవో సమాధానాలు చెబుతూ, ప్రశ్నిస్తూ మమ్మల్ని చూపించి కూడా ఏదో చెప్తూ, ఊరిచివరికి,ఇంకో రెండు సందులుందనగా ఓ ఇంటి ముందు ఆగాడు.

ఎవర్నో పిలిచాడు. అటూఇటూగా 70 ఏళ్లున్న ఒక పెద్దావిడ వచ్చింది. ఆవిడ కాళ్ళకి నమస్కరించాడు. ఆవిడ నవ్వుతూ, చేతిలో ఉన్న గుడ్డ ముక్కని అతని తలమీద ఒకసారి జాడించి, మాకేసి చూసింది. అతనేదో చెప్పాడు. మమ్మల్ని లోపలికి రమ్మంటూ చెయ్యి ఊపి, వాళ్ళిద్దరూ గుడిసె లోకి దారితీశారు.

మట్టి గోడలు, రంగురంగుల ముగ్గులు, ఉట్టి మీద కుండలు, నడుమ వసారా, కొంచెం దూరంలో వేరుగా వంట పొయ్యి, పక్కనే ఎండు కొమ్మలు, కాసిన్ని బొగ్గులు. మొత్తానికి మన పల్లె వాతావరణమే!

కాసేపటికి, బయట నుంచి ఇద్దరు నడివయసు ఆడవాళ్లు, లోపలి నుంచి ఓ ముసలాయన చేరారు. అందరూ కూర్చున్నారు. నాకు అన్నవరానికి పెద్ద గదిలో ఒక మూలను చూపించారు. ఒకామె ఊడ్వడానికి వస్తుంటే, నా సూచన మేరకు అన్నవరం చీపురందుకున్నాడు. మా సంచీలు రెంటినీ గోడకి చేరవేశాన్నేను.

ఇద్దరం కలిసి వాళ్ళిచ్చిన ఒక చాపని నేలమీద పరిచాం.

ఇంతలో టీ వచ్చింది. అందరం టీ తాగేందుకు,కొంచెం దగ్గరగా రౌండ్‌గా కూర్చున్నాం. కాసేపు మౌనంగా ఉన్నాం. టీ లో వేడిమి కన్నా వగరైన తీపిదనం తోచింది. మాతో వచ్చి నాయన “పుట్ట తేనె” అన్నాడు, కన్ను గీటుతూ. యాలకుల ఘాటు!

ఆ టీ నోట్లో నుంచి గొంతులోకి కాదు, నడిచి వచ్చిన మా కాళ్ల కండరాల్లోకి దూసుకుపోతోంది. క్షణకాలం కళ్లు బైర్లు కమ్మాయి. అమ్మో! ఏదో అడవి మందులా ఉంది! ఎలాంటివో మూలికలు, మరింకేవో ద్రావకాలు ఉంటాయంట! చిన్నప్పుడు ఊళ్లోకి కోయదొరలు వస్తే, సంత రోజుల్లో, పిల్లల్ని బయటకి తిరగనీయని పాత జ్ఞాపకాలు వచ్చేయి!

ఏం జరగలేదు! వెదురు లోటాతో పూర్తిగా పావు లీటరు టీ తాగాక, ఇక అలసట మాయమై, మెదడు చురుకైంది.

వెనకాల నీళ్లతో గోలెం ఉంది. నేను, అన్నవరం వంతులవారీగా వెళ్లి, స్నానం చేసి వచ్చాం. మమ్మల్ని తీసుకువచ్చిన వ్యక్తి, చెట్టు కింద స్నానం చేశాడు. లోపలకు వచ్చాక దొన్నెల్లో అడవి పళ్ళు మాకు అందించింది ఒకావిడ. మా గైడ్ అంతవరకూ మౌనంగా కూర్చున్న వాళ్లందరినీ చూపిస్తూ, మమ్మల్ని పరిచయం చేశాడు. అతడి చిన్నాన్న, భార్య- మరో ఇద్దరు బంధువులు.

ముఖాలు మోటుగా -ఎండకు, కొండగాలికి మాగినట్టున్నాయి.

వాళ్లు మమ్మల్ని మాటా, పలుకు లేకండా దీర్ఘంగా చూశారు. ఓ రెండు పళ్ళు నోట్లో వేసుకున్నాను. అదో రకం తీపి!

‘అడవితీపి’అనాలి. ఇంతవరకు నేను తిన్న ఏ స్వీట్లు ఇలా లేవు. ఏ డ్రైఫ్రూట్లు ఇంత బాగాలేవు.

“ప్రకృతి లేదా సృష్టి-అనండి” అనే 1970 ల నాటి Vicco turmeric యాడ్ గుర్తొచ్చింది.

“ఆ బొమ్మల గొడవేంటో కనుక్కోరా!” అన్నాన్నేను, అన్నవరం కేసి చూస్తూ.

“మీరే అడగొచ్చు కదా! నాకు భయం!” అన్నాడు వాడు. భయం అనే మాటని వాడి నోటి నుంచి విని, నేనే మా గైడ్‌ని అడిగాను. అతడు పక్కనున్న తమవాళ్ళకి చెప్పాడు. వాళ్లంతా గంభీరంగా ఉన్నారు.

ఒకావిడ కాళ్ళు జాపుకుని, తడికకి ఆనుకుని కూర్చుంది. తన వెడల్పైన గాజుల వరసలని ముందుకు వెనక్కు తోసుకుంటూ, చెప్పటం మొదలెట్టింది.

(వాళ్ళ భాషలోనే మాట్లాడారు. మాకు దారి చూపిన వ్యక్తి, హిందీలో మాకు చెబుతూ వచ్చాడు.)

“ఇక్కడ అడవి,కొండలూ, చెరువూ, చెట్లూ కాసిన్ని కోళ్ళూ, పసువులు, ఆ కుక్కలూ ఇయ్యే ఉండేది. మా కొండల్లో జీవొనం, మా ఊరు తీరూ… వేరయ్యా!” తీరికగా చెప్పింది.

“ఊరెక్కడుందిలే ఇగ! నీ పిచ్చి గానీ!!” పెద్దాయన నిర్వేదంగా తల ఎత్తాడు – “గువ్వ కూడుకన్నా ఎళ్లాల, గూటిలో నన్నా ఉండాల, వలసెళ్ళిపోతే.?!….” మాట పూర్తయేలోగా ముసలావిడ, “అంతేలే! వలసెళ్లినా ఏడాదికోసారి తిరిగి వచ్చేదుంది. గూడే వదిలి పోతే, ఏం చేస్తాం, ఏం చెపుతాం?”అంది నిట్టూరుస్తూ. కాసేపు మాట్లాడతారనుకున్నాను. కానీ మౌనం పరుచుకుంది గాళుపుతో కలసిన గాలిలా, బరువుగా.

కాసేపయింది. ఏదో అడగబోయిన అన్నవరాన్ని కళ్ళతోనే వారించి, మా గైడ్, ‘బయల్దేరుదాం రమ్మ’న్నట్లు సైగ చేశాడు. మేం అనుసరించాం.

హఠాత్తుగా ఏదో దూరం అలముకుందా అనుకున్నాను.

అలా తల ఎత్తి చూస్తే ఆకుల జల్లెడలో నారింజ రంగు సూర్యుడు.

ఊరు వెనుక వైపున్న కొండకి దగ్గరగా వెళ్ళాం. కాస్తంత దూరం వెళ్ళామో, లేదో ఓ చిన్న జలపాతం. ఛళ్ళున నీటి ధార! దగ్గర్లో ఉన్న బండరాయి మీద కూర్చున్నాం! మోకాళ్ల వరకు నీళ్ళల్లో పెట్టుకుంటే, ఆ చల్లదనం అడవి వాసనతో కమ్మగా ఆవరించింది.

మళ్ళీ లేచాం. “మీరూ?” పలకరింపుగా అడిగాను. అతడు చెప్పాడు “రెండు తరాలుగా ఊరు ఖాళీ అయిపోయింది. జనం పెరిగారు, అవసరాలు మారాయి, ఇక అడివి తీర్చే ఆకలి కాదు! మా నాన్న ఊరు వదిలేసి 50 ఏళ్ళైంది. నేను మద్రాసులోనే పుట్టి పెరిగాను. రెండేళ్ల క్రితం వరదల్లో నా భార్య,పిల్లలు చిక్కుబడి…. పోయారు. ఆ సమయానికి నేను మా గ్రూప్‌తో ఫాల్స్ రూఫింగ్ పని మీద బెంగుళూరు వెళ్ళాను” గొంతు ఫ్లాట్ గా ఉంది.

“సో, సారీ !” అన్నాన్నేను.

‘మ్మ్’…అన్నాడు. కాస్త మెత్తగా తోచింది.

తర్వాత ఊరంతా తిరిగాం. కనుచూపు మేరలో ఫెన్స్ కనపడింది అది దాటాక, లాండ్‌స్కేప్. కొండవాలుకి అటు పక్కన. “అదిగో”, ముందుకు చూపిస్తూ అన్నాడతను, “అటు నుంచి ఈ వాలు వరకు, మనిషి నోట్లోకి వెళ్ళిపోయింది. ఇక మిగిలిందల్లా ఆ కొండ, అడవి. వీటికి, మా పల్లె కాపలా!”

“అవును, అన్నిచోట్లా భూమి కోతే. మాకు కూడా పచ్చని పొలాలన్నీ సిమెంటు ఇళ్ళైపోతున్నాయి. దీనికి అంతెక్కడుందో!” సాలోచనగా అన్నాను.

 “ఇప్పుడేం చేయలేం. పొంగులో ఉంది. ఇంకా నయం. ఇప్పుడిప్పుడే మనిషికి, మనిషికి మధ్యన కూడా అగ్ని రగులుతోంది. మాకు, ఈ ప్రాంతంలో పక్కదేశం నుంచి వలసలెక్కువ. ఎవరు మనవారో, ఎవరు పరాయో అర్థమే కాదు. ఊరికి కొత్త మనిషి వస్తే భయంగా ఉంటోంది. ఎవరి చేతిసంచిలోనైనా మన మరణం దాగి ఉండొచ్చు” అన్నాడతను.

ఒళ్ళు జలదరించింది. చాలా సేపు మౌనంగా ఉన్నాం. అన్నవరం ఒక రౌండు ఊరిలో తిరిగి వచ్చాడు.

పక్కనున్న చెట్లలోంచి నాలుగైదు పిట్టలు ఏకబిగిన అరవడం మొదలుపెట్టాయి. దూరంగా వింటే ఏమోగానీ, దగ్గరగా విన్నప్పుడు చెవులు చిల్లులు పడ్డంత గట్టిగా ఉంది. అడవి దరినుంటే ఒకటి. దూరాన ఉంటే మరొకటి.

“మరి, వైద్యం?”

మా గైడ్ నవ్వాడు. “బాగా ప్రాణం మీదికొస్తేనే బైటికి. మిగిలినదంతా సొంతమే!”

“ఆ ఫెన్సింగు?”

“అదా! గతేడాది టూరిస్ట్‌ల గోలకు మేం తిరగబడ్డాం. ఈ మధ్యన ఏడాదంతా, దేశమంతటా, అదేగా! టూర్ పేరుతో పల్లెను మార్చేసి హోటల్స్, రిసార్ట్స్ అంటూ ఆక్రమణలు… ఆ పగిలిన మందుబుడ్లు, తిన్న కంచాలు – ప్చ్! మేం గొడవపడ్డాం. అందుకని, సర్కారు వారు కట్టించిన వనరక్షణ హద్దులవి.”

“టూరిజం వల్ల కాస్తో కూస్తో బిజినెస్ అవుతుందేమో?”

“కరెన్సీ నోటుతో, అడవి చిగురిస్తుందా? మీకు తెలీదు. ఊరు ఊడ్చుకుని పోయి, కుటుంబాలు చెదిరిపోతే… పల్లె గుండెకు చప్పుడే ఉండదు! ఆ సిటీ మదం తట్టుకోలేం. చూసెళ్ళే బాపతు కాదది. పాడు చేసే విశృంఖలత్వం.”

మా ఊర్లో పంచాయితీ స్కూల్‌కి దగ్గర్లో బార్ చూసినప్పటి బాధ కలుక్కుమంది.

సాయంత్రం నల్లని ముసుగేసుకుంది.

మెల్లగా వెనుతిరిగాం. ఆ పెద్దగుడిసెకు చేరాం.

***

ఆ పాటికే ఆడవాళ్ళు లోపల మట్టి పొయ్యి మీద వంట మొదలెట్టేశారు. కుండల్లో ఉడికిన వెదురు బియ్యం, కౌజు మాంసం – వేడివేడిగా ఆకుల దొన్నెల్లో అందించారు. లాంతరు వెలుగులో వాళ్లు పెట్టింది తిన్నాం, తడుముకుంటూ.

చుట్టూ పసరు పరిమళం. మసక వెలుగులో నీడలు-అడవికి కావలి కాస్తున్న సైనికుల్లా… ఏదో పాత ఇంగ్లీష్ సినిమాలో లాగా అనిపిస్తోంది. నన్ను నేను మరచిపోయాను.

మా గైడ్ మంచినీళ్లు ఇస్తూ, “రండి పడుకుందురు. కాసేపైతే అడవిలో జంతువులు తిరిగే చప్పుళ్ళకి మీకు నిద్ర పట్టదు” అన్నాడు.

రోజంతా తిరిగిన అలసటకి, నెమ్మదిగా నిద్ర కమ్ముకొస్తోంది. “మా కొండల దరి జీవనమే వేరయ్యా! అందరం పొయ్యేవాళ్ళమే! ఉండిపోయే వాళ్ళమా? నిజానికి అంతా అడవి తల్లిదే” ముసలమ్మ మాటలు నా చెవిలో మోగుతున్నాయి.

“ఇంతకూ, ఆ బొమ్మల మాటేంటి?” అన్నాడు అన్నవరం.

మా గైడు, “ఓ! అవా! మా అవ్వ వాళ్ళ బాధకి ప్రతిరూపాలు. గత ఇరవై ఏళ్లుగా ఇక్కడ కాన్పులు, పిల్లల ఆట-పాటలు లేవు. అందుకని ఆ బొమ్మలు చేసి పెట్టుకున్నారు. జోక్ ఏంటంటే, మొన్నొకాయన వచ్చాడు, ఏదో దేశం నుంచి.’జీవకళ ఉట్టిపడుతున్నాయి. ఇలాంటివి, మీరు ఎక్కువగా చేయచ్చు కదా! మీకు పేటెంట్ ఇప్పిస్తా, నే మార్కెట్ చేస్తా’నంటూ!”.

నా గుండెలో ముల్లు గుచ్చుకుంది.

గుడిసె తలుపులు తెరిచే వున్నాయి. ఆకుల మీదనుంచి గాలి వీస్తోంది. సద్దు మణిగాక, కొత్త పోకడలతో అడవి. అక్కడక్కడా మిణుగురు పురుగులు ముసురుతున్నాయి. ఎగిరే దీపాలలా!

ఆపైన నాకేం గుర్తు లేదు. ఎందుకంటే, నేను పడుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here