బుక్ షెల్ఫ్

1
11

[శ్రీ జాని తక్కెడశిల రచించిన ‘బుక్‍ షెల్ఫ్’ అనే కవితని అందిస్తున్నాము.]

ఏ కవి
కన్నుల నుండి నిద్ర  ఉలిక్కిపడిపోతున్నప్పుడో
సుదీర్ఘంగా మథనపడి
చెరువు లాంటి మనసు స్పర్శించినప్పుడో
ఒక వాక్యం
రెక్కలు తొడుక్కుంటుంది

అటూ ఇటూ మసిలి
ఆలోచనల గాయాలను పుస్తకాలపైకెక్కించి
ఉషోదయపు అంచున
నీలిగర్భం నుండి వాక్యాలు

అడవుల నుండి
అడగుల నుండి
చిందరవందరగా పడుతున్న
మసిగుడ్డ లాంటి సమాజాన్ని
ఎక్కుపెట్టి ఉండవచ్చు
సర్పం లాంటి ఆవేదనను
కన్నీటి దీపంగా వెలిగించి ఉండవచ్చు
పోగులుగా ఉన్న దుఃఖాన్ని
నేసి ఉండవచ్చు

ఇప్పుడక్కడ ఏం ఉంది?
పుస్తకాల కీర్తి పతాకాలపై,
నిన్నటి సాయంత్రంపై
సాలీడు కట్టుకున్న తోవ

కళ్లలో తెరలు తెరలుగా బూజు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here