బ్రహ్మజ్ఞాని అంగీరస మహర్షి

0
11

[dropcap]అం[/dropcap]గీరసుడు హిందూ ధర్మములో వేదకాలం నాటి ఋషి. ఋగ్వేదంలో ఆయనను దైవ సంబంధమైన జ్ఞానాన్ని బోధించే గురువుగా పేర్కొన్నారు. అంటే కాకుండా మానవులకు దేవతలకు మధ్యవర్తిగా పేర్కొన్నారు. ఈయనను బ్రహ్మదేవుడి ముఖము నుండి పుట్టిన బ్రహ్మ మానస పుత్రుడిగా పేర్కొంటారు. అటువంటి వారిలో అంగీరసుడు మూడోవాడు. అందుచేతనే ఈయనను సప్త ఋషులలో ఒకడిగా పేర్కొంటారు ఈ మహర్షి వేదం మంత్రాలూ నేర్చుకొని తపస్సు చేసి గొప్ప విజ్ఞానాన్ని వివేకాన్ని పొంది గొప్ప తేజస్సుతో వెలుగొందుతున్న సమయములో కర్దమ ప్రజాపతి పదివేల సంవత్సరాలు తపస్సు చేసి తొమ్మిది మంది కూతుళ్లను పొంది వారిలో శ్రద్ధ అనే పేరుగల అమ్మాయిని అంగీరస మహర్షికి ఇచ్చి వివాహము చేస్తాడు. వీరికి ఏడుగురు కూతుళ్లు, ఏడుగురు కొడుకులు కలుగుతారు. వీరిలో దేవ గురువైన బృహస్పతి ఒకడు. వాళ్లకు మళ్లీ, పిల్లలు కలిగి అ విధముగా వంశాభివృద్ధి చెందుతుంది. అంగీరసుడు ఆ వంశానికి మూలపురుషుడు అవుతాడు.

ఒకసారి అగ్నిదేవుడికి కోపము వచ్చి ఎక్కడికో వెళ్లి తపస్సు చేసుకోవటం ప్రారంభిస్తాడు. ఆ విధముగా మునుల దేవతల యజ్ఞాలకు అంతరాయము కలుగుతుంది. అప్పుడు బ్రహ్మ అంగీరసుడిని అగ్నికి బదులుగా భావించి యజ్ఞాలు చేసుకోమని చెపుతాడు. అప్పుడు అగ్ని దేవుడు తన పదవికే ఎసరు వస్తుందని భయపడి తపస్సు వదలి దేవతల సమక్షంలోకి వస్తాడు. ఆ విధముగా అంగీరసుడు రెండవ అగ్నిదేవుడు అవుతాడు.

శూరసేన దేశాన్ని చిత్రకేతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉంటాడు. అతనికి భార్యలు అనేకమంది ఉన్నప్పటికీ, సంపదలు ఉన్నప్పటికీ సంతానము ఉండదు. అందుచేత అంగీరసుని ప్రార్థిస్తే కృతద్యుతి అనే భార్యకు ఒక కుమారుడు కలిగేటట్లు ఆశీర్వదిస్తాడు కానీ మిగిలిన భార్యలు ఈర్ష్యతో ఆ బాలుడికి విషము పెట్టి చంపేస్తారు. బాధపడుతున్న చిత్రకేతు మహారాజు దగ్గరకు అంగీరసుడు వచ్చి ఈ లోకములో చావు పుట్టుకలు మాములు విషయాలని భాధపడవలసిన పని లేదని ఓదారుస్తాడు. నారదుని సహాయముతో చనిపోయిన కొడుకును బ్రతికించి ఆ కొడుకును చూపించి నీవు తెలుసేమో అడగమని మహారాజుతో అంటాడు. మహారాజు ఆ బాలుడిని అడిగితే, ఆ బాలుడు నీవెవరో నాకు తెలియదు అంటాడు. ఆవిధముగా అంగీరసుడు చిత్రకేతుడి భార్యలు పిల్లలు సంపద అన్నీ ఋణముతో కొడుకొన్నవి అని, భగవంతుడు మాత్రమే సత్యము అని బోధిస్తాడు

ఆ తరువాత అంగీరసుడు తీర్థయాత్రలకు బయలుదేరి అన్ని పుణ్యనదులలో స్నానము చేసి ఆశ్రమానికి తిరిగి వస్తాడు. ఒకసారి గౌతమమహర్షి అంగీరసుని కలిసి అన్ని తీర్థాలలో స్నానమాచరించి వచ్చారు కదా ఏ తీర్థములో స్నానము ఆచరిస్తే వచ్చే ఫలితాలను చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు అంగీరసుడు గౌతమ మహర్షికి తీర్థాల స్నాన ప్రాశస్తాన్ని గురించి వివరిస్తాడు. చంద్రభాగ అనే తీర్ధములో వరుసగా ఏడు రోజులు స్నానము చేస్తే సకల సంపదలు లభిస్తాయి, ముక్తి కలుగుతుంది అని చెపుతాడు. అలాగే పుష్కరిణి తీర్థ, ప్రభాస, నైమిశ, దేవిక, ఇంద్రమార్గ, స్వర్ణ బిందు అనే తీర్థాలలో స్నానము చేస్తే స్వర్గలోకాన్ని చేరుతారు అని చెపుతాడు. ఇలా ఎన్నెన్నో పుణ్య తీర్థాలు, పుణ్య క్షేత్రాల గురించి గౌతమ మహర్షికి అంగీరసుడు వివరిస్తాడు. అలాగే గంగ యమునాల సంగమము, త్రివేణి సంగమముల గురించి కూడా వివరిస్తాడు. ఒకసారి అగ్నిదేవుడు ఋషి పత్నులను చూసి మోహించి ఒక్కక్క రోజు ఒక్కొక్క ఋషి రూపములో వచ్చి వారి పత్నులతో గడుపుతాడు. విషయము తెలుసుకున్న అంగీరసుడు ఋషి పత్నులను భూలోకములో పుట్టి బ్రాహ్మణులకు భార్యలుగా ఉండమని శపిస్తాడు. ఆ విధముగా భూలోకములో పుట్టిన ఋషి పత్నులు శ్రీకృష్ణుని సేవచేసుకొని తరిస్తారు.

శౌనక మహర్షి అంగీరసుడిని కలిసి బ్రహ్మవిద్య గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు అంగీరసుడు విద్య రెండు రకాలు అని, ఒకటి పర విద్య రెండవది అపరవిద్య అని చెప్తాడు. అపరవిద్య అంటే వేదాలు, శిక్ష, వ్యాకరణము, కల్పము, విరుక్తము జ్యోతిష్యము ఛందస్సు మొదలైనవి. పర విద్య అంటే భగవంతుని గురించిన జ్ఞానము. ముక్తి పొందటానికి ఉన్న రెండు మార్గాలలో ఒకటి కర్మ మార్గము, రెండవది జ్ఞాన మార్గము. భగవంతుని కోసము పూజలు వ్రతాలూ చేయటము, యజ్ఞాలు యాగాలు చేయటము, మనస్సుని మంచిగా ఉంచుకోవటం మొదలైనవి కర్మ మార్గాన్ని సూచిస్తాయి. తపస్సు చేయటము, గురువు ద్వారా జ్ఞానం పొందటం గురువు నిర్దేశించిన మార్గములో నడచుకొనిన భగవంతుని చూడటానికి ప్రయత్నించటం జ్ఞానమార్గము. ఇవన్నీ తెలుసుకోవటానికి చాలా శ్రమ పడాలి. భగవంతుడు సర్వ వ్యాప్తి చెందినవాడు. ఈ విషయాన్నే అంగీరసుడు శౌనక మహర్షి మహర్షికి చెపుతాడు. భగవంతుడి వ్యాప్తిని వివరిస్తూ అగ్ని భగవంతుడి తలగాను, సూర్యచంద్రులు రెండు కళ్లుగాను, దిక్కులు చెవులు గాను, మాట వేదముగాను, ప్రాణము వాయువుగాను, ప్రపంచము హృదయముగాను భూమి పాదాలు గాను ఉన్నాయని చెబుతాడు. అయన లేని చోటు అంటూ ఎక్కడ లేదు కాబట్టి సర్వవ్యాప్తి చెందినవాడు భగవంతుడు అని అంగీరసుడు చెపుతాడు.

మహా తపశ్శాలీ భక్తుడు, జ్ఞాని, బ్రహ్మనిష్ఠాగరిష్టుడు అయినా అంగీరసుడు అంగీరస స్మృతి అనే ధర్మ శాస్త్రాన్ని లోకానికి అందజేశాడు. దీనిలో ఉత్తములైన 120 మంది వేద విధులతో ఒక పరిషత్ ఉండాలని, ఆ పరిషత్ శాస్త్రప్రకారము కర్మలు చేయించాలని, పశు పక్ష్యాదులను చంపరాదని, మాంసాహారము తినరాదని, దోషాలు చేసినవారు బ్రాహ్మణులైన క్షమించకూడదని, చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తము చేసుకోవాలని ఈ ధర్మ శాస్త్రములో సూచించాడు. అంగీరస మహర్షి వంశములో పుట్టినవారు అందరు జ్ఞానులు, తపస్సంపనులు. అందరు కూడా రాజుల దగ్గర పురోహితులుగాను, బ్రహ్మ విద్యను భోధించే వారుగాను ఉండేవారు. అధర్వణ వేదాన్ని అంగీరస మహర్షి, అయన వారసులు ప్రచారంలోకి తెచ్చారు కాబట్టి అధర్వణ వేదాన్ని అంగీరో వేదము అనికూడా అంటారు. ఋగ్వేదంలో ఈయనను భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని బోధించే గురువుగాను, మనిషికి భగవంతునికి మధ్యవర్తిగాను వివరిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here