బృందావన సారంగ

    0
    3

    [box type=’note’ fontsize=’16’] అహంకార పూరితుడైన ఓ సంగీత విద్వాంసుడికి జ్ఞానోదయం కలిగించి ఆనంద డోలికల్లో తేలియాడించిన కృష్ణుడి కథే జొన్నలగడ్డ సౌదామిని రచించిన “బృందావన సారంగ“.  [/box]

    [dropcap]కం[/dropcap]కణాల గురప్ప ఊళ్ళొకి వొచ్చాడనే వార్త బృందావనం అంతా గుప్పుమంది. గురప్ప గోకులంలో పుట్టినా దేశదేశాలు తిరిగి సంగీత విద్య నేర్చాడనేది సర్వ జన విదితం. గురప్పని శంకరానంద స్వామి చిన్నప్పుడే శిష్యుడిగా చేర్చుకోవటమూ, ఆయనకి సేవ చేస్తూ, కాశీలో పన్నెండేళ్ళు గడపడమూ, అక్కడ గురుప్రసాదం వల్ల గంగలో వీణ దొరకటమూ, గత అయిదేళ్ళుగా ఆర్యావర్తంలోని రాజులందరి వద్దా సన్మానాలూ, జయపత్రికలూ పొందటమూ ఇవ్వన్నీ బృందావన వాసులందరికీ విదితమే. రాజుల దగ్గర కంకణాలు బహుమతులు బాగా స్వీకరించి కంకణాల గురప్ప అని ప్రఖ్యాతి గాంచాడు

    వీణా వాదనంలోనూ, పాడటంలోనూ దిట్ట అయిన గురప్ప ముగ్గురు శిష్యులతో ఇన్నేళ్ళకి తిరిగి తన ఊరికి వొచ్చాడు. వయస్సు ఇంకా పాతిక లోపే అయినా, వొచ్చిన ఘనత తలకి బాగా పట్టి అహంకారం కూడా పెంచుకున్నాడు. ముగ్గురు శిష్యుల పేర్లు సుశ్రుతుడు, సుమంతుడు, సుబుద్ధి.

    ఇంటికి వొచ్చి రెండ్రోజులయ్యింది. తల్లీ తండ్రీ ,దగ్గర బంధువులూ అంతా పలకరిస్తున్నారు గానీ, తనంతటి గాయకుడొస్తే పల్లెకి పల్లె మొత్తం విరగబడి పోతుందని అనుకున్నది తప్పనితేలేటప్పటికి గురప్పకి అహంకారం హెచ్చింది, రోషం వొచ్చింది. వెంటనే తన శిష్యుల్ని విషయమేమిటో కనుక్కోవటానికి ఊళ్ళోకి పంపించాడు.

    ఊళ్ళోకి వెళ్ళిన శిష్యులందరూ వెనక్కి వొచ్చి ఏకగ్రీవంగా చెప్పిన మాట ఏమిటంటే ఊళ్ళో కిష్టయ్య అనే పిల్లవాడు ప్రతి సాయంత్రమూ పిల్లంగోవి ఊది ఏవో పల్లె పాటలు పాడి జనాల్ని మోహింపజేస్తున్నాడనీ, మోసగిస్తున్నాడనీ.

    “అంత గొప్పగా పాడతాడా” అన్నాడు గురప్ప.

    “అని వాళ్ళనుకుంటున్నారు” అన్నాడు సుశ్రుతుడు అనే శిష్యుడు.

    “ఎక్కడ నేర్చుకున్నాట్ట”

    “ఎక్కడానేర్చుకోలేదుట”

    “ఓహో, లొల్లాయి పాటా”

    “అల్లాంటిదే”

    “సంగీతం అంటే మాటలా, మంచి గురువు దొరకాలి, ఆయన మనకి పాఠం చెప్పాలి, అది మనకి అర్థం అవ్వాలి, దాన్ని సాధన చెయ్యాలి, దేహాన్నీ, మనస్సునీ శుద్ధంగా ఉంచుకోవాలి, శ్రోతలు దొరికినప్పుడు చక్కగా పాడి రంజింపచెయ్యాలి. ఇందులో ఏ ఒక్కటి తప్పినా అంతా వ్యర్ధమే. “

    “అవునవును, తమరి సాధన జగద్విదితం, కానీ… ఈ పిల్ల మూకకి ఇదంతా అర్ధం కాదు, అందుకని…..”

    “అందుకని”

    “మీరు ఒక కచేరీ చేసి వీళ్ళ చెవి తుప్పు వొదిలిస్తే…….”

    “ఆలోచన భేషుగ్గా వుంది కానీ మరి ఎట్లా…”

    “ఊళ్ళోపిల్లలందరూ సాయంత్రం యమున దగ్గర కూడి ఏవో పాటలూ, ఆటలూ”

    “ఇక ఇకలూ పకపకలూ కాదూ”

    “అల్లాంటివే”

    “మరీ అల్లాంటి చోట అయితే మన పరువూ, ప్రతిష్ఠా”

    “ఒకటి, ఇది మన ఊరు. ఇక్కడ గౌరవం లేకపోతే ఉన్న పరువు మొత్తం పోతుంది. ఉట్టి కెగరలేనమ్మ అని సామెత గుర్తుకు తెచ్చుకోండి.

    రెండు, ఇక్కడ వాళ్ళకి ఏమీ రాదు కాబట్టి గెలవటం సులువు.

    మూడు, గెలుపుతో మీ అమ్మా నాన్నలకి ఊళ్ళో గొప్ప గౌరవం ఏర్పడుతుంది. ఏమంటారు.”

    “సరే నీ ఇష్టం , ఏంపాడదాం”

    “పిల్లలు కాబట్టి అందరికీ సులువుగా అర్ధమయ్యే కళ్యాణి రాగం పాడండి. మీకూ కొత్తగా ఏమీ సాధన అవసరం ఉండదు.”

    “సరే, అన్నీ జాగ్రత్తగా చూసుకో. కొంటె కుర్రాళ్ళుంటారు జాగ్రత్త.”

    “ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళని కదిలించి పెట్టాను. వాళ్ళని వాడదాము. సాయంత్రానికి సిద్ధంగా వుండండి” అన్నాడు సుశ్రుతుడు.

    “సరే , అలాగే” అన్నాడు గురప్ప.

    ***

    సాయంత్రం అయ్యింది.

    సింగారించుకుని సీమంతినీ మణులూ, కులాసాగా విలాసినులూ, మనమోహనంగా మనస్వినులూ, మొత్తంగా యౌవనంలో వున్న మత్తకాశినులు అందరూ వొచ్చేశారు. యమున కూడా తన తరంగ ధ్వనులు, నాట్యానికి సిద్ధమైన నవలామణుల గజ్జెలలోని మువ్వల శబ్దాలతో కలిపి సిద్ధంగా ఉంది. అప్పటికే వేచి చూస్తున్న కుర్రకారు కళ్ళు విచ్చుకున్నాయి. ఇంతలో కృష్ణుడు, ఉద్ధవుడితో కలిసి వొస్తుంటే వెనక బలరాముడు సావాసగాళ్ళతో కలిసి వొస్తున్నాడు.

    “ఇవ్వాళ్ళ మనకి కొత్త పాట వినిపిస్తుంది” అన్నాడు ఉద్ధవుడు.

    “ఎవరూ, మధూలికనా” అన్నాడు కృష్ణుడు.

    “కాదు, కంకణాల గురప్ప గారు, మనఊళ్ళో పుట్టి కాశీలో సంగీతం నేర్చుకుని భరతవర్షం లోని అనేక రాజుల దగ్గర సన్మానాలు పొందిన విద్వాంసుడు. “

    “మంచిది, కానీ సన్మానించటానికి ఇక్కడ రాజులు లేరుగా”

    “రాజాధిరాజువు నువ్వున్నావు కదా?”

    “పద విందాం” అంటూ వెనక్కి వొంగి బలరాముడి చెవిలో ఏదో చెప్పాడు.

    బలరాముడు మెల్లిగా వెళ్ళి శింశుపా వృక్ష చాయలో కూర్చున్న గురప్ప దగ్గర నిలబడి

    “మీలాంటి విద్వాంసులు మా కుర్రకారు దగ్గరికి రావటం ముదావహం. ఇవ్వాల్టి గానం మొత్తం మీరు చూడండి” అని చెప్పి చక్కా వొచ్చాడు.

    గురప్పా, అతని అనుచరులూ, చాలా సంతోషించి ఏం చెయ్యాలీ, ఎలా చెయ్యాలీ అనేవి మిగతా పిల్లలతో చర్చించి నిర్ణయించారు.

    కాసేపయిన తరవాత పాటలూ, ఆటలూ మొదలయ్యాయి. వెన్నెల ముదిరింది. జనాలు కొద్దిగా అలిశారు. సుశ్రుతుడు సైగ చేస్తే మెల్లిగా గురప్ప అరుగు ఎక్కాడు. అతని శిష్యులు కూడా వీణా, చిత్ర వీణా, మృదంగాలని పట్టుకుని అరుగు ఎక్కి గురువు పక్కన కూచుని ప్రదర్శనకి సిద్ధమయ్యారు.

    ఏం పాడాలీ అన్నది ముందే స్థిరపరుచుకున్నారు కాబట్టి కల్యాణీ రాగం మొదలెట్టాడు గురప్ప. ఆలాపన చక్కగా సాగింది. మధ్యలో రాగాన్ని విస్తరించి పాడాడు. “ఈ రాగం ఏమిటి” అని తెలీని పిల్లలు కాస్త సంగీతం తెలిసిన ఆనంద వర్ధనుడు అనే పిల్లాణ్ణి అడిగితే “కళ్యాణి” అని చెబితే అది పిల్లలందరికీ పాకింది. పిల్లలు అందరూ శ్రద్ధగా విన్నారు. ముగించబోయే ముందు కొద్దిసేపు అతి ద్రుతంలో పాట మొత్తం పాడి ముగించాడు.

    గురప్ప పాడుతున్నంత సేపూ మధ్య మధ్యలో కృష్ణుణ్ణి చూస్తూ ఉన్నాడు. కృష్ణుడు కూడా శ్రద్ధగా విని చివరికి చప్పట్లు కూడా కొట్టాడు అన్నది గురప్ప దృష్టి దాటి పోలేదు.

    గురప్ప ముగించగానే పిల్లలందరూ లేచి చప్పట్లు కొడుతూంటే గురప్పకి చాలా ఆనందం వేసింది. వెంటనే “ఎందుకు కొట్టరూ” అనే గర్వమూ, “వీళ్ళకి ఏమీ అర్ధం కాదు కదా” అనే అహంకారమూ అడ్డురాగా, సాధువాదాలకి ప్రతిగా తల కూడా తిప్పకుండా ఉండిపోయాడు.

    ఇంతలో “ఈ పాటేమీ బాగుండలేదు. మా కిష్టయ్య ఇంకా బాగా పాడతాడు” అన్నాడు ఆనంద వర్ధనుడు. కళ్ళు చికిలించి చూశాడు గురప్ప.

    గురప్ప శిష్యుడు కోపంగా “అంత గొప్పపాట గాడైతే మరి వొచ్చి పాడి మా గురువు గారితో గెలవమను” అన్నాడు.

    గురప్ప కృష్ణుడి వైపు చూశాడు. పిల్లాడిలో ఏదో తెలీని ఆకర్షణ ఉంది అనుకున్నాడు. ఏదో కొద్దిగా ఉన్నవాళ్ళలో పాటకాడు వీడు. వీడిని శిష్యుణ్ణి చేసుకుంటే ఈ కుర్రకారు అంతా తనకి జేజేలు కొట్టటం ఖాయం అనుకుని “కృష్ణా ఇటురా” అని పిలిచాడు.

    కృష్ణుడు వినయంగా వెళ్ళి అరుగు దగ్గిర నుంచున్నాడు. సౌందర్య, సౌకుమార్య, సమ్మోహన రూపాన్ని చూసి దిగ్భ్రమ చెందాడు గురప్ప. కాసేపటికి తేరుకుని

    “ఏదీ నీ పాట వినిపించు” అన్నాడు గురప్ప. “మీరు జగద్విజేతలు మీరు పాడిన తరవాత నేను పాడితే బావుంటుందా” అన్నాడు కృష్ణుడు.

    కుర్రకారుకి కావాల్సింది గోలలూ, పోట్లాటలూ. అవకాశం వొస్తే వొదలరు కదా. “కృష్ణా, పాడు” మంటూ పిల్లల గోల మొదలయ్యింది. “పరవాలేదు, పాడు” అని గురప్ప అన్నాడు. కృష్ణుడు చెయ్యెత్తి “గురప్ప గారు పాడమన్నారు కాబట్టి పాడతాను” అని పక్కనున్న మద్దిమాను మీద ఒక కాలు పైకి పెట్టి వెనక్కి ఆనుకుని విలాసంగా వేణువు వాయించాడు కొంతసేపు. మెల్లిగా ఆ ధ్వని జగాన్నంతా నింపేసింది. అహం ఇంకా పూర్తిగా నిండని పిల్లల మొహాల్లో ఒక ఆనంద ప్రవాహంలో తడిసిన అనుభూతి, నాదగంగాఝరిలో మునిగిన అనుభవమూ కలిగాయి.

    గురప్ప వింటున్నాడు. స్వరాలన్నీ ఏదో ఒక క్రమంలో ఉన్నయ్యి కానీ తన గురువు చెప్పిన రాగాల్లో ఇది ఏదీ కాదు. ఇదేమైనా కొత్త రాగమా అని వితర్కించాడు. పెద్ద పెద్ద గురువులే కొత్త రాగాలు సృష్టించి వాటిలో పాడటానికి ఇబ్బంది పడతారు. ఇంక ఈ పిల్లవాడు ఎక్కడ అని ఆలోచించి ఇది లొల్లాయి పదమే అని స్థిరపరచుకున్నాడు.

    ఇంతలో గురప్ప శిష్యుడైన సుబుద్ధి, పాటకి తన్మయుడై “భేష్” అని అన్నాడు. గురప్పకి అహం విజృంభించింది. కోపం వొచ్చింది. చెయ్యి ఎత్తాడు. వేణు గాన విలాసం ఆగింది. “ఏదీ పాట పాడు” అని దురుసుగా అన్నాడు గురప్ప. పిల్లలందరూ ఏం చెయ్యాలో తెలీక చూస్తున్నారు.

    కృష్ణుడు మెల్లిగా నవ్వి ఒక పాట అందుకున్నాడు. జగన్మోహనంగా ఉంది. కృష్ణుడి పాట కోసం తొందరగా వొచ్చిన చంద్రుడి మొహం చాటంతైంది. పున్నమి వెన్నెలలోనూ, మధుర సుధారస తరంగాల్లోనూ ముణిగి పిల్లలంతా సొక్కిపోయారు. భాండీరక వనం మొత్తం అలౌకిక తేజస్సుతో ప్రకాశిస్తోంది. యమున నిస్తరంగంగా యోగముద్రలో ఉన్న ముని లాగా వుంది. గురప్పా, ఇద్దరు శిష్యులు తప్ప వింటున్న మిగతా ప్రాణికోటి మొత్తం, చీమ నుంచి శివుడు దాకా అందరూ మత్తిల్లిపోయారు.

    కృష్ణుడు పాట ఆపాడు. పిల్లలు లోకంలో పడ్డారు. “కృష్ణుడి పాటే బావుంది” అని పిల్లలు అరవటం చూసి గురప్ప కోపంతో ఊగి పోయాడు. సుశ్రుతుడు కోపంగా “రాగం లేని ఈ లొల్లాయి పాటకీ మా గురువుగారి పాటకీ పోలికా?” అన్నాడు.

    “కృష్ణా, ఈపాటకి రాగం లేదా” అన్నాడు ఆనంద వర్ధనుడు.

    “ఉంది” అన్నాడు కృష్ణుడు.

    “ఏంటా రాగం” అన్నాడు విసురుగా గురప్ప.

    “అక్కడ యమున, ఇక్కడ కళ్యాణి, కలిపి ఇది యమునా కల్యాణి రాగం” అన్నాడు కృష్ణుడు.

    “ఈ పేరున్న రాగమే లేదు. మా గురువు గారు కూడా చెప్పలేదు ” అన్నాడు కోపంగా గురప్ప.

    “ఆయనకే తెలీదేమో, నిజ్జంగా మాకిష్టయ్య రాగమూ, పాటే బావున్నయ్యి” అన్నాడు ఆనంద వర్ధనుడు.

    వెంటనే పిల్లలందరూ లేచి గెంతుతూ “యమునా కల్యాణి” అనీ “కృష్ణుడే గెలిచాడు” అనీ అరిచి కృష్ణుణ్ణి లాక్కుని అందరూ వెళ్ళి యమునలో దిగి కేరింతలు కొట్టారు. యమున కూడా పెద్ద ఎత్తున ఎగసిన అలలతో అల్లరి చేసింది.

    గురప్పకి రోషం కెళ్ళించింది. “వాడు ఏదో రాగం పేరు చెప్పటమూ, మీరంతా అరవటం కాదు. నిజం పోటీ పెట్టి మీకు శాస్తి చేస్తాను” అని అరుస్తుంటే వినేవాడెవ్వడూ లేడు. శిష్యులు అతన్ని అప్పటికి శాంతింపజేసి ఇంటికి తీసుకెళ్ళారు.

    ఇంటి కెళ్ళినా గురప్ప కోపం పోలేదు. శిష్యుడైన సుబుద్ధిని పిలిచాడు. “వాడు లొల్లాయి పదం పాడుతుంటే భేష్ అని అంటావా, సిగ్గులేదూ” అన్నాడు.

    “క్షమించండి. పొరపాటైంది” అన్నాడు సుబుద్ధి. గురప్ప కోపం తగ్గలేదు. ఇంకా ఇంకా తిడుతుంటే సుబుద్ధి “అయ్యా, సత్యం చెబుతున్నాను. ఆ పిల్లవాడు పాడింది ఒక క్రమంలోనూ, ఒక పద్ధతిలోనూ నడిచింది. అది నాకు తెలియని ఒక నూత్న మార్గాన్ని నాకు చూబించింది. ఆ పద్ధతిలో పయనిద్దామని స్థిరమైన నిర్ణయం తీసుకున్నాను. ఇన్నాళ్ళూ నన్ను శిష్యునిగా స్వీకరించినందుకు కృతజ్ఞతలు” అని చెప్పి వెళ్ళిపోయాడు.

    గురప్పకి కోపం రెట్టింపైంది. తీవ్రంగా ఆలోచన చేసి తమ కులపెద్దని పిలిచి కృష్ణుడూ, వాడి స్నేహితులూ కలిసి తనకి చేసిన అవమానం అంతా చెప్పాడు. పిల్లల మధ్య గొడవని పక్కకి పెట్టమనీ, కావాలంటే పెద్దవాళ్ల మధ్య పోటీ ఏర్పాటు చేస్తాననీ చెప్పిన కులపెద్ద మాటకి సరేనన్నాడు గురప్ప.

    కులపెద్ద వెళ్ళి నందుడితో కృష్ణుడితో మాట్లాడి నాలుగో రోజు సాయంత్రం రామాలయంలో పోటీ స్థిరపరిచాడు.

    నాలుగో రోజు వొచ్చింది. ఊరు ఊరంతా వొచ్చింది. మధ్యవర్తిగా ఆలయ పురోహితుడు భరత శర్మ గారిని నియమించారు ఊరి పెద్దలు. భరత శర్మ గారు పెద్ద పండితుల దగ్గర చదవక పోయినా, తన ప్రతిభా వ్యుత్పత్తులతో, విషయాన్ని ఆకళింపు చేసుకోవటం, చేసుకున్నదాన్ని సమన్వయం చేసుకోవటంలో దిట్ట.

    గురప్పనీ కృష్ణుడినీ పిలిచి ఎదురెదురుగా కూర్చోబెట్టాడు. ధర్మంగా వుంటానని రాములవారి మీద ప్రమాణం చేసి వారిద్దరి చేత కూడా ప్రమాణం చేయించాడు.

    ముందర ఎవరు పాడాలి అని విచికిత్స చేసి పోటీకి పిలిచిన వాళ్ళు మొదట పాడాలని గురప్పని పాడమని చెప్పాడు. ముందర పాడటం అంటే కొంచెం తక్కువ రకంగా ఆలోచించే గురప్ప, తప్పక, పాడటం మొదలు పెట్టాడు. మెల్లగా కాంభోజి రాగం, అతి విలంబితంలో మొదలెట్టి అయిదు కాలాలూ పాడి అతిద్రుతంలో ఆగాడు అతను పాడేది కాంభోజి అని అక్కడ కూచున్న చాలా మందికి అవగాహన ఉన్నదని గురప్ప వాళ్ళ కరచరణ విన్యాసంతో గ్రహించాడు.

    భరతశర్మ కృష్ణుడిని చూశాడు. కృష్ణుడు గొంతు సవరించుకుని పాట పాడటం మొదలెట్టాడు. అక్కడున్న అనేక మంది చిన్నప్పటి నుంచీ కృష్ణుడి పాటలన్నీ విన్నవాళ్ళే , కృష్ణుడితో కలిసి పాటలు పాడిన వాళ్ళే. వాళ్ళెవ్వరూ కూడా కృష్ణుడి పాట ఏ రాగంలో ఉందనేది గానీ, ఏవిధంగా పాడుతున్నాడనేది కానీ అంచనా వేయలేక పోయారు. వాళ్ళందరికీ తమకు తెలీని మహాద్భుత విద్య కృష్ణుడి దగ్గర ఉందని అర్ధం అయ్యింది. గురప్పకి కూడా పాట ఏదో రాగ చ్చాయలో ఉందని అర్ధమైంది కానీ అదిఏదో తెలియటల్లేదు. ఆపాట యదుకుల ఆనంద దాయకమై, వల్లవ పల్లవ పాణుల కెల్ల ఉల్లము సల్లలితము జేసినదై, తాపసులకు బ్రహ్మానంద సదృశం అయ్యింది. పాట అయిపోయింది.

    గురప్ప వెంటనే లేచి “ఈ పాటకి రాగం లేదు. ఈ లొల్లాయి పాటకీ నాకూ పోటీనా” అని అరిచాడు. భరతశర్మ అతని వైపు తిరిగి “నా పని నన్ను పూర్తిచేయనివ్వండి. తరవాత కావాలంటే అప్పుడు ఇక్కడున్న యదుకులాన్ని అడగొచ్చు” అని స్థిరంగా చెప్పి కాసేపు ఆలోచించాడు.

    కాసేపటి తరవాత గురప్ప వైపు తిరిగి “మీ అభ్యంతరాలు ఏమిటిచెప్పండి.” అన్నాడు శర్మ గారు.

    “ఈపాట ఏ రాగం లోనూ లేదు. వొట్టి లొల్లాయి పాట”

    “కృష్ణా, ఈపాట ఏ రాగం” అన్నాడు శర్మ గారు.

    ఒక్క నిమిషం అందరినీ అవలోకించి, ఆలోచించి కృష్ణుడు “యదుకుల కాంభోజి” అన్నాడు.

    “ఆ పేరుతో అసలు ఏ రాగమూ లేదు” అన్నాడు గురప్ప.

    “అని మీరెట్లా చెప్పగలరు. అసలు రాగం అంటే ఏమిటి, ఒక పద్ధతిలో ఉన్న స్వర ప్రస్తారం. కృష్ణుడి పాటలో నాకు పద్ధతీ, స్వర ప్రస్తారమూ కనిపించినయ్యి. అలాంటప్పుడు దాన్ని రాగం అని ఎందుకు అనకూడదూ” అన్నాడు శర్మ గారు.

    “అలాకాదు, మా గురువు గారు ఇటువంటి స్వర ప్రస్తారంతో ఉన్న రాగాన్ని నాకు నేర్పలేదు. ఎందుకంటే అది సంగీత సంప్రదాయం కాదు కాబట్టి. ఇల్లాంటి స్వర ప్రస్తారాలు లక్షలు తయారు చెయ్యొచ్చు. అవ్వన్నీ రాగాలవుతాయా, రసికులు మెచ్చుతారా? “

    “నేను మెచ్చుతున్నాను, ఇక్కడ ఉన్న యదుకులం మొత్తం మెచ్చుతోంది. యదుకుల కాంభోజి అనే రాగాన్ని కృష్ణుడే తయారుచేశాడనుకుందాము. అంతమాత్రాన అది చెడు అయిపోదుగా. ఆ రాగం వినసొంపుగా ఉంటే కాలంలో నిలుస్తుంది. లేకపోతే నశిస్తుంది” అని పెద్దలు కూర్చున్న వైపు తిరిగాడు భరత శర్మ.

    “అయ్యా, గురప్ప కాంభోజీ రాగం బాగా పాడాడు. కానీ కృష్ణుడు అద్భుతంగా పాడాడు. పైగా మన కులం పేరిట కొత్త రాగం సృష్టించి మరీ పాడాడు. అందుకని కృష్ణుడే గెలిచినట్టు నా అభిప్రాయం” అన్నాడు.

    పెద్దలు ఊ అనేలోపే పిల్లల జయజయ ధ్వానాలు మిన్నంటినయ్యి. పిల్లలు మంటపం ఎక్కి కృష్ణుణ్ణి భుజాల మీద ఎక్కించుకుని జయజయ ధ్వానాలు చేస్తూ నందుడి ఇంటి వైపు నడిచారు.

    గురప్పకి వల్లమాలిన కోపం వొచ్చింది. ఊరు ఊరంతా తనకి వ్యతిరేకం అయ్యింది అనే కోపం ఒకవైపూ, తను సంగీతంలో ఒకళ్ళకి ఓడిపోయాననే భావన ఒకవైపూ తనని అతలాకుతలం చేశాయి. మరుసటి రోజు పొద్దున కులపెద్దని కలుసుకున్నాడు. తన జయపత్రికలు అన్నీ చూబించాడు. ఇన్నిచోట్ల గెలిచిన తను, ఒక పిల్లాడి చేతిలో ఎలా ఓడిపోతాను అనీ, భరత శర్మకి అసలు సంగీతమే రాదనీ, జరిగింది అంతా నందుడు గ్రామపెద్ద కావటం వల్ల అందరూ ఆ పిల్లాడికి జయజయధ్వానాలు పలికారు అనీ అన్నాడు. ఇంకొక్క అవకాశం ఇప్పిస్తే తప్పకుండా గెలుస్తానని నమ్మబలికాడు.

    కులపెద్ద ఆలోచించి “వృష్ణి, భోజ, అంధక, సాత్వత, ఆభీర కులాల పెద్దలు అందరూ బృందావనంలో వచ్చేవారం కలుస్తున్నారు. సంగీతాన్ని ఆపోశన పట్టిన గర్గమహర్షి శిష్యసమేతంగా వొస్తున్నారు. నిజంగా నువ్వు గెలవ గలననే ధైర్యంవుంటే వెళ్ళి గర్గమహర్షికి అంతా విన్నవించు. ఆయన చెబితే బృందావనం మొత్తం తల ఊపుతుంది. కానీ జాగ్రత్త. ఆయన మహా కోపిష్ఠి” అన్నాడు

    గురప్ప ఇంట్లో కూర్చుని సంగీత సాధన మొదలెట్టాడు. తనకి అత్యంత ప్రియమైన సారంగ రాగాన్ని ఎన్నుకున్నాడు. మూడు రోజుల పాటు నిద్రాహారాలు మాని మరీ సాధన చేశాడు. సరిగ్గా వొచ్చింది అని నమ్మకం వొచ్చే దాకా మళ్ళీ మళ్ళీ సాధన చేశాడు. నాలుగో రోజు బయలుదేరి గర్గ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనకి తన కథ అంతా చెప్పాడు. తనకి ఎన్నేసి సన్మానాలు జరిగినయ్యీ, యదుకులంలో కృష్ణుడితో పోటీ, దానిలోని అసంబద్ధతా అన్నీ వివరంగా చెప్పాడు. గర్గ మహర్షి అంతా విని నందుడికి తన పిల్లల్ని కూడా బృందావనంలో జరిగే సభకి తీసుకురమ్మని వర్తమానం పంపించాడు. గురప్ప సంతోషించాడు.

    సాయంత్రమైంది. గర్గ మహర్షి శిష్యుడు,కౌశికుడు, గురప్పని వెంటబెట్టుకుని ఆశ్రమం వెనుకతట్టు ఉన్న కుటీరాల దగ్గిరికి తీసుకెళ్ళాడు. అనేకమంది అక్కడ కూర్చుని పిచ్చిచూపులు చూస్తూ ఉన్నారు. గర్గ మహర్షి గురప్పని పిలిచి “వీరందరూ మానసిక వ్యాధులతో బాధ పడుతున్నారు. వీరికి ద్విజావంతి రాగం వినిపించి వాళ్ళ బాధలు తగ్గించండి.” అన్నాడు.

    “సంగీతానికీ పిచ్చి తగ్గటానికీ సంబంధమేమిటీ” అని ప్రశ్నించాడు గురప్ప. “మామూలు సంగీతం వినటానికి సుఖంగా వుంటుంది. ఉన్నతమైన సంగీతం మనసుకు శాంతిని ప్రసాదిస్తుంది. అత్యున్నతమైన సంగీతం నాదబ్రహ్మానంద అనుభవాన్ని కలిగిస్తుంది. వీరందరి మానసిక అశాంతిని ఉన్నతమైన సంగీతం మొదట తాత్కాలికంగానూ, వింటూన్న మీదట శాశ్వతంగానూ దూరం చేస్తుంది” అన్నాడు మహర్షి.

    ఆయన చెప్పింది నమ్మకపోయినా, తప్పక, అక్కడ కూర్చుని ద్విజావంతి రాగం పాడటం మొదలెట్టాడు. కాసేపు పాడాడు. బ్రహ్మాండంగా కాకపోయినా బానే పాడాననిపించింది గురప్పకి. ఆపాడు పాట. “ఇంతేనా అన్నాడు” కౌశికుడు. గర్గ మహర్షి తల పంకించాడు. కౌశికుడు వెంటనే గురప్ప పక్కన కూర్చుని ద్విజావంతి రాగం అందుకున్నాడు. పాట అద్భుతంగా సాగుతోంది. తాళం వేస్తూ వింటూన్న గురప్ప మనస్సు మెల్లిగా శాంతి చెందడం అతనికి అద్భుతంగా తోచింది. అలా అతని మనసు పాటలో లీనమై పోయింది. కళ్ళు మూసుకు పోయాయి. పాట ఆగింది. తాళగత బుద్ధి వున్న గురప్ప వెంటనే లోకంలోకి వొచ్చాడు. ఎదురుకుండా కూచున్న మానసిక వ్యాధిగ్రస్తులు అందరి ముఖాలూ ఆనంద బాష్పాలతో నిండి పోయి ఉన్నయ్యి. ఒక ప్రశాంతత, తాత్కాలికమో,కాదో తెలీదు కానీ, వాళ్ళ ముఖాల్లో తాండవిస్తోంది. సంగీతం వల్ల ఇంత అద్భుత ఫలితం ఇంతమందికి కలగటం గురప్పకి ఆశ్చర్యం కలగజేసింది. ఇప్పటివరకూ జనానికి వినోదాన్నీ, ఆనందాన్నీ ఇస్తుందనుకున్న సంగీతం మానసిక శాంతిని కూడా ఇస్తుందని తెలుసుకుని దిగ్భ్రాంతుడయ్యాడు.

    రాత్రైంది. గర్గ మహర్షి పోటీ వరకు తమ ఆశ్రమం లోనే ఉండిపొమ్మంటే సరేనన్నాడు గురప్ప. కౌశికుడితో కలిసి భోజనం చేసి పడుకోవటానికి యాగశాల పక్కన ఉన్న పాకకి వెళ్ళారు. ఏయే రాగాలు ఎలా పాడాలీ అని చర్చించిన కొద్దీ తనకున్న సంగీత పరిజ్ఞానం ఎంత తక్కువో గురప్పకి అర్ధమైంది. ఇందాక గర్గ మహర్షి చెప్పిన నాద బ్రహ్మానంద అనుభవం మాట గుర్తుకు వొచ్చి అదేమిటని కౌశికుడిని ప్రశ్నించాడు గురప్ప. అది తనకింకా తెలీదనీ, దాన్ని నేర్చుకోవటానికే ఇంకా ఆశ్రమంలో ఉన్నానని చెప్పాడు కౌశికుడు.

    ప్రతి క్షణం ఒక మధుర పదం లాగా, ప్రతి పదం, శ్రీకృష్ణ చంద్ర ముఖ వినిర్గత మధుర వేణు నాద స్వనం లాగానూ, ప్రతి స్వనమూ, యమునాతీర రాస మండల పరిభ్రమణ గోపికా మంజీర నిక్వాణం లాగానూ, ప్రతి నిక్వాణమూ, దివ్యదామాభరణాద్యాయుధ సహిత శ్రీభూనీళా సమేత శ్రీ రాజగోపాల స్వామి మహనీయ దర్శనం లాగానూ, ప్రతి దర్శనమూ సర్వాంతర బాహిర వ్యాప్త ఏకమేవాద్వితీయ బ్రహ్మ భావం లాగానూ అనిపించింది గురప్పకి.

    పోటీ రోజు వొచ్చింది, సకల గోప వంశాలూ బంధుమిత్ర సపరివార సమేతంగా వొచ్చాయి. కౌశికుడు సభ అంతా సర్దాడు. కుంజ వనంలో ఒకపక్క గురప్ప శిష్య సమేతంగా కూర్చున్నాడు. రెండో పక్క కృష్ణుడు మిత్రులతో కూర్చున్నాడు. మధ్యలో న్యాయ నిర్ణేతగా గర్గ మహర్ధి కూర్చున్నాడు. కౌశికుడు లేచి గురప్ప అడిగిన పోటీచెప్పి గురప్పని పాడమని చెప్పాడు.

    గురప్ప సారంగ రాగం లక్షణాలుచెప్పి పాడటం మొదలెట్టాడు. తన శాయశక్తులా ప్రయత్నించి రసరమ్యంగా పాడాడు. అద్భుతమైన ఆ పాటకి సమస్త జనాలూ ముగ్ధులయ్యారు.

    తరవాత కృష్ణుణ్ణి పాడమన్నాడు కౌశికుడు. కృష్ణుడు పాట్టం మొదలెట్టాడు. సర్వులకీ మహదానందం కలిగింది. ఇంకాసేపు పాడాడు. అందరికీ మెల్లిగా చిత్త వృత్తులు తగ్గాయి. ఇంకాసేపు పాడాడు. గురప్పతో బాటు సకల జనాలకి, మహనీయమైన ఆ పాట, మనస్సు కదలికలని సంపూర్ణంగా ఆపేసింది. దాంతో ఆత్మానందం అందరినీ ఉత్తుంగ తరంగం లాగా అందరినీ తడిపేసింది.

    కాసేపటి తరవాత పాట ఆపాడు కృష్ణుడు. కౌశికుడు లేచి మాట్లాడబోతూ వుంటే గురప్ప లేచి వారించి “ఈ పోటీ పెట్టకపోతే నా జీవితమంధకార బంధురంగానూ, అహంకార పూరితంగా మిగిలేది. ఈ ఆశ్రమానికి వొచ్చి సంగీతం అంటే ఏమిటి అన్నది అర్ధం చేసుకున్నాను. కృష్ణుడి పాటవిని నాద బ్రహ్మానందానుభవం అనేది ఒకటుందని స్థిరపరుచుకున్నాను. ఇక నాజీవితాన్ని గర్గ మహర్షి సేవలో వినియోగించదలిచాను” అన్నాడు

    అందరూ హర్షధ్వానాలు చేశారు.

    “అసలు సంగతి మరిచాను. కృష్ణుడు పాడిన ఈ రాగం” అని ఆగి అటూ ఇటూ చూసి “బృందావన సారంగ కదా” అన్నాడు గురప్ప. కృష్ణుడు నవ్వాడు. తల ఊపి “బృందావన సారంగ” అని మళ్ళీ కృష్ణుడు నవ్వాడు. జగజ్జీవేశ్వరాభిన్న ప్రతిపాదక వైయాసిక న్యాయమాలా సూత్రార్ధానుభూతి సంప్రాప్త మహాద్భుత ఆనందసదృశ ఆనంద ప్రవాహంలో అందరూ ముణిగిపోయారు.

    కొంతసేపాగి లోకంలో పడ్డారు.

    గురప్ప మళ్ళీ మాట్లాడటం మొదలెట్టాడు. “ఈ బృందావన సారంగ రాగాన్ని ఇంత సుందరంగా మనకందించిన ఈ శ్యామ సుందరుడే ఇప్పటికీ ఎప్పటికీ సంగీత సామ్రాజ్య సార్వభౌముడు.” అని కూర్చున్నాడు.

    గర్గ మహర్షి, నమస్కారం చేస్తున్న కృష్ణుణ్ణి చూసి నవ్వుతూ “మొత్తానికి నీ పాట విన్నాను” అన్నాడు. “మీరు ఎప్పుడు కోరితే అప్పుడు మేమంతా సిద్ధం” అని దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోయాడు.

    అలా యమునా కల్యాణి, యదుకుల కాంభోజి, బృందావన సారంగ రాగాలు సృష్టించి మనల్ని అందరినీ ఆనంద డోలికల్లో తేలియాడించే యమునా తీరవిహారీ, యదుకుల సుందరుడూ, బృందావనపు అందగాడు అయిన కృష్ణుడికి ఏమివ్వగలం, ఈ పిచ్చి రాతలు తప్ప.

    శింజిన్నూపుర ధ్వనితో సంజలలో పాడుచుండు బాలకుడేడీ?

    కుంజములలొ విహరించుచు రంజిల నాట్యంబు సేయు రమణుడు ఏడీ?

    రండి మన మనసుల్లో వెదుకుదాం

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here